ఉదయాకాశంలో పేరు పిలిచారు

‘నాలోంచి జీవనమాధుర్యం తొలిగిపోయినప్పుడు పాటవెల్లువలతో వొచ్చి నన్ను ముంచెయ్యి ‘ అని కోరుకున్నాడు టాగోర్. ఆ మాటలు టాగోర్ ని కూడా నేనడగ్గలను. జీవితం మరీ యాంత్రికంగానో, భావశూన్యంగానో మారిపోతున్నప్పుడు, టాగోర్ ని ఒక్కసారి తెరిస్తే చాలు, ఒక సుగంధమారుతమేదో నాలోపలకీ చొచ్చుకుపోతుంది.

ఒకప్పుడు ఆయన్ని చలం భాషలో చదువుతున్నప్పుడు హృదయానికేదో సాంత్వన కలుగుతున్నట్టుండేది. ఇప్పుడు జీవితం సింహభాగం గడిచిపోయేక, ఆ అనుభవాలన్నీ నాలో మిగిల్చి వెళ్ళిన జ్ఞాపకాలో, గాయాలో, లోపలకి కుక్కుకున్నవాటిని, ఆ గీతాలు నెమ్మదిగా రాపాడి మనసిట్టే విచలితమైపోతున్నది. ఆ కవితలు ఎక్కడ తెరిచి చదివినా కళ్ళు సజలాలై పోతున్నవి. ఆ ద్రవీకరణసామర్థ్యం టాగోర్ దా, చలంగారిదా, లేక ఇప్పటికే కరిగిపోయిన నా హృదయానిదా చెప్పలేను. కాని, ఇదిగో, ఈ ఫాల్గుణ ప్రభాతాన్న ఏ పుట తెరిచినా నా హృదయాన్ని ఊడబెరికి బయటకు లాక్కున్నట్టే ఉంది.

చూడండి. ‘ఫలసేకరణ’ నుంచి చలంగారి మాటల్లో:

~

‘బాటలున్నచోట నేను తోవ తప్పుతాను. విశాల జలధిలో వినీలాకాశంలో దారి చారలుండవు.

పక్షుల రెక్కలూ, నక్షత్రాల వెలుగులూ, పువ్వుల రంగులూ దారిని కప్పేస్తాయి. కనబడని బాట గుర్తించగల జ్ఞానం నీకుందా అని నా హృదయాన్ని అడుగుతున్నాను.’

~

‘బాటలున్నచోట నేను తోవ తప్పుతాను..’ ఈ వాక్యం అచ్చం నాదే. నేనెప్పుడూ అనుకుంటూ ఉంటాను. ‘వియోగాలు కాదు, నన్ను తల్లకిందులు చేసేవి కలయికలు ‘ అని. ఆశాభంగాలు నాకు కొత్తకాదు. అవే నన్ను ముందుకు నడిపించేవి. కాని ఆశలు సఫలమయ్యే క్షణాల పట్ల నాకు చెప్పలేనంత అనుమానం, భయం, సంకోచం. అక్కడ నేను నాకు కాకుండా పోతాను.

ఈ కవిత చూడండి:

~

ఇంటో నిలవలేను, నాకు ఇల్లు ఇల్లు కాకుండా పోయింది, చిరనూతనుడెవరో తోవనపడిపోతూ నన్ను రమ్మని పిలుస్తున్నాడు.

అతని అడుగుల చప్పుడు నా గుండెని తడుతోంది. బాధగా ఉంది. గాలి రేగింది. కడలి మూల్గుతోంది.

బాధ్యతల్నీ,సందేహాల్నీ మాని, ఇల్లువాకిలి లేని దేశదిమ్మరులవెంట పడిపోతాను. తోవనపోయే ఆ చిరనూతనుడు నన్ను రమ్మని పిలుస్తున్నాడు.

~

అవును. నాక్కూడా అంతే. నాలుగు రోజులు గడవగానే ఇల్లు కైదుగా మారిపోతుంది. ఒక సంచీ బుజాన తెగిలించుకుని ఒక ఆర్ టి సి బస్సు ఎక్కి కిటికీ పక్కన ఒక సీటు చూసుకుని ఏదో ఒక చోటికి పోవాలనిపిస్తుంది. తోటి ప్రయాణీకులు బిగ్గరగా మాట్లాడుకునే మాటలు వింటో, ఎక్కడో ఏదో ఒక చోట ఒక వేపచెట్టు నీడన బస్సు ఆపినప్పుడు అక్కడొక టీస్టాలు ముందు నిలబడి టీ చప్పరించాలని ఉంటుంది. ఎవరో ఒక గాయికనో, కవినో, చక్కటి భావుకుడో, భావుకురాలో నాకోసం వేచి ఉన్నారనీ, దినాంతానికి, వాళ్ళ ఊరికి చేరేటప్పటికి ఆ నది ఒడ్డున బల్లకట్టు దగ్గర వాళ్ళు నా కోసం చాచిన బాహువులతో స్వాగతమిస్తారని ఒక ఊహ నాకు.

ఇదిగో, ఈ కవిత చూడండి:

~

హృదయమా, తెరచాప నెత్తడానికి సిద్ధంగా ఉండు. తాత్సారం చేసేవారిని ఆగిపోనీ, ఉదయాకాశంలో నీ పేరు పిలిచారు.

ఏ ఒక్కరి కోసమూ వెనక్కి తిరిగి చూడకు.

మొగ్గ ఎంతసేపటికీ రాత్రినీ, మంచునీకోరుతుంది. వెలుగులో విచ్చిన పువ్వు స్వేచ్ఛ కావాలని కొట్టుకుంటుంది.

హృదయమా, నిన్నావరించిన పొరని చీల్చుకుని బయట పడు.

~

‘ఉదయాకాశంలో నీ పేరు పిలిచారు..’

ఇవన్నీ నా వాక్యాలే. నేను మనసులో రాసుకున్నవే. వట్టి రాసుకోవడం కాదు, ఇన్నేళ్ళుగానూ ఇట్లానే జీవించాను. ప్రతి సుప్రభాతానా ఆకాశంలో ఎవరో ఎలుగెత్తి నా పేరు పిలుస్తూనే ఉన్నారు. కాని నేనుండవలసింది ఎక్కడ? ఆ పిలుపుకి హాజరు కావలసింది ఎక్కడ? ఏ నది ఒడ్డునో, ఏ సముద్ర తీరంలోనో, చిగురించిన ఏ తోటల్లోనో కాదా!

ఒక్క రేకు కూడా తెరవకుండా, కన్ను విప్పకుండా ఇంట్లోనే గడపాలనుకునే కుట్మలాల సౌకర్యంలోంచి, ధారాళంగా వికసించి, పూలరేకలు వాడి చెదిరిపోతేనేకదా, ఆ పరాగం పరివ్యాప్తమయితేనేకదా, ఆ తావులో ఒక ఫలం ప్రభవించేది. అందుకని, ఈ మాటలు కూడా నావే. చూడండి:

~
వసంతపవనుడు యాచించ వచ్చినప్పుడు, తన సమృద్ధిలోంచి ఒకటి రెండు రేకుల్ని రాల్చి కూడా ఏ మాత్రం తరిగిపోని పువ్వు మల్లే ఉండేది నా చిన్నతనపు జీవితం.

ఒక్క రవ్వ ఎటూ పోనీక తన మధురభారాన్నంతా సంపూర్ణంగా అర్పించుకోవాలనే ఫలం వలె ఉంది నా యవ్వనాంత జీవితం.

~

కాని నా యవ్వనాంత జీవితం ఇంకా మధురఫలభరితం కావలసే ఉంది. నేను నిజంగా పూర్తిగా పండినప్పుడు మాత్రమే, ఇదిగో, టాగోర్ రాసిన ఈ పాటల్లాంటి మాటలు పలకలగలుతాను.

~

సిక్కుల గురువు గోవిందుడు ఓ కొండరాతి మీద కూచుని చదువుకుంటున్నాడు. కిందిగా యమున వడిగా ప్రవహిస్తోంది. ఎత్తుగా నదిమీదికి వొంగిన వొడ్డు, బొమలు ముడిచింది. చుట్టూ మూగిన కొండలు, అడివి పెరిగి నల్లగా భయపెడుతున్నాయి.

ఐశ్వర్యమత్తుడు, ఆయన శిష్యుడు రఘునాథ్ వొచ్చి గురువుకి నమస్కరించి ‘తమ అంగీకారానికి అర్హతలేని ఈ కాన్కని తీసుకొచ్చాను’ అని, వజ్రాలు చెక్కిన రెండు కంకణాల్ని గురువు కళ్ళముందు గొప్పగా మెరిపించాడు. గురువు వాటిల్లో ఓ దాన్ని తీసుకుని తన వేలు చుట్టూ పరధ్యానంగా తిప్పుతూ చదువుకుంటున్నాడు. రవ్వలు కాంతికిరణాల్ని అంతటా విరచిమ్మాయి.

కంకణం చప్పున వేలినించి జారి, వొడ్డునించి దొర్లి నీళ్ళల్లో పడ్డది.

ఒక్క అరుపు అరిచి రఘునాథుడు నీళ్ళలో దూకాడు. పుస్తకం మీదనుంచి తల యెత్తనేలేదు గురువు. తనకి దొరికిన భాగ్యాన్ని గట్టిగా దాచేసుకుని ఏమెరగనట్టు తన తోవన తాను ప్రవహిస్తోంది యమున.

అలిసి, నీళ్ళోడుకుంటో, రఘునాథుడు తిరిగి వొచ్చేటప్పటికి పగటికాంతి సన్నగిల్లుతోంది. గట్టెక్కి వగరుస్తో అన్నాడు. ‘అదెక్కడ పడ్డదో తమరు చూపితే దాన్ని ఇప్పుడైనా వెతికి తీసుకొస్తాను.’

ఆ రెండో కంకణాన్ని గురువు తీసుకుని ‘అక్కడ’ అని నీళ్ళలోకి గిరాటేశాడు.

~

కాని నాకు తెలుసు, ఎన్నో ఎండలకు ఎండి ఎన్నో వానలకు తడిసి, ఎన్నో హేమంతాల నిర్దయకు లోనైతేగాని, ఈ సాఫల్యానుభవం సాధ్యం కాదని. అందుకని కవి మాటల్ని నేనిట్లా పునశ్చరణచేసుకుంటాను:

~

తీగెలకి శృతి పెడుతూ వుంటే ప్రభూ బాధ దుర్భరంగా ఉంది.

పాట ప్రారంభించి నీ బాధని మరిపించు. నువ్వు నన్ను సవరించే ఆ క్రూర దివసాల్లోని నీ మనసులోని భావాన్ని నన్ను సౌందర్యంగా అనుభవించనీ, అంతమవుతున్న రాత్రి ఇంకా నా తలుపుల్ని అంటిపెట్టుకు తాత్సారం చేస్తోంది. పాటల్లో ఆమెని శలవు తీసుకోమను.

నీ నక్షత్రాలనించి వర్షించే రాగాలలో, నా ప్రభూ, నీ హృదయాన్ని నా జీవితతంతువుల్లోకి ప్రవహింపచెయ్యి.

~

బయట ప్రభాతవాన. ఫాల్గుణమాసపు చిరుజల్లు. నా జీవితకాలమంతా నన్ను వెంటాడే నా కోరిక నాకు స్పష్టంగా గోచరించేది ఇట్లాంటి క్షణాల్లోనే. ఆ కోరికని కూడా నా ప్రియకవీంద్రుడు నాకన్నా ముందే ఇట్లా మాటల్లో పెట్టేసాడు:

~

ఏనాటి మసక సంధ్యలోనో సూర్యుడు కడసారి నానించి శలవ తీసుకుంటాడని తెలుసు.

మర్రి చెట్టు నీడ కింద గొల్లవాళ్ళు పిల్లంగోవిని మోయిస్తూనే వుంటారు. నదీతీరపు వాలులో పశువులు మేస్తోనే వుంటాయి. నా కాలం మాత్రం చీకట్లోకి జారిపోతుంది.

ఇదే నా ప్రార్థన: నన్ను ఈ లోకం తన చేతుల్లోకి ఎందుకు పిలుచుకుందో, నేను ఇక్కడినుంచి వెళ్ళిపోయేముందు నాకు తెలియనీ.

రాత్రి నిశ్శబ్దం నక్షత్రాల్ని నాకెందుకు తెలిపిందో! పగటికాంతి తన ముద్దులతో నా తలపుల్ని ఎందుకు పుష్పింపచేసిందో! అర్థం కానీ.

నేను వెళ్ళిపోయేముందు నా చివర పల్లవిని ఆలపిస్తూ పాటగా పూర్తి చెయ్యనీ.

నీ ముఖం కనబడేట్టు దీపం వెలగాలనీ, నీ శిరసున ఉంచేందుకు పుష్పహారం సిద్ధం చెయ్యాలనీ నా కోర్కె.

7-3-2020

Leave a Reply

%d bloggers like this: