
కరోనా ఉన్న ప్రపంచంలో కవితలు ఉండవా?’ అనడిగాడు దేశరాజు. బెర్టోల్డ్ బ్రెహ్ట్ ని గుర్తు చేస్తూ తనే జవాబిచ్చాడు కూడా ‘ఎందుకుండవు? కరోనా గురించిన పాటలు ఉంటాయి’ అన్నాడు.
ఈ రోజు ప్రపంచ కవితా దినోత్సవం. ఎప్పటిలానే ఒక ఉషోదయం. ‘ఉషోదయాన్ని ఎవ్వడాపురా? నిశావిలాసమెంతసేపురా? నెత్తురుంది, సత్తువుంది, ఇంతకన్న సైన్యముండునా!’ అన్నాడు సీతారామశాస్త్రి.
ముంగిట నిలచిన ప్రపంచ కవితాదినోత్సవాన్ని వట్టిచేతుల్తో స్వాగతించలేను. అలాగని ఎలుగెత్తి పాటలూ పాడలేను. చిత్రమేమిటంటే ఇప్పుడు ఎవరికివారు కనీసం కొన్నిరోజులేనా ఏకాంతంలో గడపడమే ఒక చికిత్స. కవిత్వం ఎంత సామూహిక సంబరమో, అంత ఏకాంత తపస్సు కూడా. తన జీవితమంతా ఏకాంతంలో గడిపి కవిత్వాన్ని ఒక ధ్యానంగా సాధన చేసిన ఎమిలీ డికిన్ సన్ గుర్తొస్తున్నది ఇప్పుడు. ఆమె పూలతోటలోంచి తెంపి తెచ్చిన ఒక కవితను కవిత్వదేవత చరణాల ముందు ఒక పూజాప్రసూనంగా సమర్పిస్తున్నాను:
~
ఒక ఇంద్రనీల జ్ఞాపకం
ఒక రత్నాన్ని నా వేళ్ళతో తడుముతో-
నేనట్లానే నిద్రపోయాను-
వెచ్చని రోజు, చల్లనిగాలి-
ఆ రత్నమట్లానే ఉంటుందనుకున్నాను-
కళ్ళు తెరిచాను- ఆ రత్నం మాయమైంది-
అమాయికమైన నా వేళ్ళని నోరారా తిట్టుకున్నాను,
ఇంద్రనీలమణిలాంటి ఒక స్మృతి
ఇప్పుడు నాకున్నదంతా అదే.
21-3-2020