ఆదర్శ ఉపాధ్యాయుడు

డా. కలాం భారత రాష్ట్రపతి కాక మునుపు రాసిన పుస్తకాల్లో ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’, ‘ఇగ్నైటెడ్ మైండ్స్’ చాలా ప్రసిద్ధికెక్కాయి. ఆ రెండు పుస్తకాలూ కూడా నేను అనువాదం చేసాను. ఆయన రాష్ట్రపతి అయిన తరువాత, ‘యు ఆర్ బార్న్ టు బ్లోజమ్’ అనే పుస్తకంతో పాటు మరికొన్ని పుస్తకాలు రాసారు. ఆ పుస్తకాన్ని నేను ‘ఈ మొగ్గలు వికసిస్తాయి’ పేరిట అనువదించాను. రాష్ట్రపతిగా కలాం ఎక్కడెక్కడ పిల్లల్ని కలిసి ఏమేమి మాట్లాడారో ఆ ప్రసంగాలనుంచి గుది గుచ్చిన భావాలతో ‘ఇండామిటబుల్ స్పిరిట్’ అనే పుస్తకం వెలువడింది. దాన్ని కూడా నేను ‘ఎవరికీ తలవంచకు’ పేరిట అనువదించాను. ఆ తర్వాత ఆయన ఆచార్య మహాప్రజ్ఞ తో కలిసి ‘ఫామిలీ అండ్ నేషన్’ అనే పుస్తకం రాసారు. దాన్ని ‘ఉత్తమ కుటుంబం, ఉదాత్త దేశం’ అనే పేరిట తెలుగు చేసాను.

కానీ, ఇవి కాక కలాం తాను స్వయంగా వెలువరించినవీ, ఆయన మీద వెలువడుతున్నవీ ఎన్నో పుస్తకాలున్నాయి. అవి ప్రతి ఒక్కటీ మన కాలంలో మన కళ్ళముందు జీవించిన ఒక మహామానవుడి గురించి మరింత తెలుసుకోవాలన్న తృష్ణని రగిలిస్తూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా, ఆయన చివరి పదేళ్ళ కాలంలో ఆయన్ని చాలా దగ్గరగా చూసినవాళ్ళు కలాం ఎన్నటికీ స్వయంగా చెప్పుకోడానికి ఇష్టపడని ఎన్నో అపురూపమైన సంగతుల్ని మనముందుకు తెస్తున్నారు. ఆ విశేషాలు మనం ప్రతి ఒక్కరం తెలుసుకోదగ్గవి, ముఖ్యం, మన పిల్లలతో పదే పదే చదివించదగ్గవి.

అటువంటి పుస్తకాల్లో మొదట చెప్పవలసింది The Kalam Effect (2008) రాష్ట్రపతిగా కలాం ఎటువంటి ఆదర్శప్రాయమైన జీవితం జీవించారో, ఇప్పటి కల్మషభరిత రాజకీయ వ్యవస్థలో అది ఎంత అరుదైన విషయమో వివరిస్తూ, రాష్ట్రపతి కార్యదర్శిగా పనిచేసిన పరమేశ్వరన్ మాధవన్ నాయర్ వెలువరించిన పుస్తకం అది. ఆ పుస్తకాన్ని గతంలో ఇక్కడ పరిచయం చేసాను కూడా.

ఆ కోవకే చెందిన మరొక పుస్తకం ఈ మధ్యనే చదివాను. సృజన్ పాల్ సింగ్ అనే ఆయన రాసిన What Can I Give? ‘(2016) అనే పుస్తకం. కలాం రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసినప్పటినుండీ ఆయన చివరిరోజు దాకా ఎటువంటి తపనతో, ఎటువంటి ఆదర్శాలతో జీవించారో వివరిస్తూ రాసిన పుస్తకం అది. ఆ పుస్తకానికి డా.సింగ్ Life Lessons from my Teacher, A.P.J.Abdul Kalam అనే ఉపశీర్షిక కూడా పెట్టారు.

ఆ పుస్తకం నుంచి ఎత్తి రాయదగ్గవీ, సంతోషంతోనూ, ఉత్సాహంతోనూ పరిచయం చెయ్యదగ్గవీ ఎన్నో ఉన్నాయి. మనకి తెలియని అపురూపమైన సంగతులెన్నో ఉన్నాయి. వాటిల్లోంచి, అన్నిటికన్నా ముందు, ఒక సంగతి మీతో పంచుకోవాలనిపించింది. అదేమిటో డా.సింగ్ మాటల్లోనే చదవండి:

~
1982 లో తమిళనాడులోని విరుధనగర్ కి చెందిన పందొమ్మిదేళ్ళ కుర్రవాడొకడు సైన్యంలో సిపాయిగా చేరాడు. అతని పేరు వి. కదిరేశన్. అతణ్ణి హైదరాబాదులో డి.ఆర్.డి.ఓ లో పనిచేస్తున్న ఒక సీనియర్ సైంటిస్టుకి డ్రైవరుగా పనిచేయడానికి డెప్యుటేషన్ మీద పంపించారు. ఆ సైంటిస్టు డా.ఎ.పి.జె.అబ్దుల్ కలాం.

అతడు పనిలో చేరిన కొన్నాళ్ళకు ఒక రోజు కలాం ని బండిమీద తీసుకువెళ్తూండగా, కలాం అతణ్ణి ‘కదిరేశన్, నువ్వెన్నో క్లాసుదాకా చదువుకున్నావు? ‘ అనడిగాడు.

‘నేను పదో తరగతి ఫెయిలయ్యాను. ఇంగ్లీషులో తప్పాను సార్ ‘ అన్నాడే గాని ఒక విదేశీ భాషలో తప్పినందుకు ఆ యువకుడి కంఠస్వరంలో ఎటువంటి చింతగాని, విచారం గాని ధ్వనించలేదు.

‘ఓహ్! కాని నువ్వు పదవతరగతి పాసయి తీరాలి. ఇంగ్లీషులో మంచి మార్కులు తెచ్చుకోవాలి ‘ అన్నాడు అతడి బాస్. ఆ యాభై ఏళ్ళ యువకుడు, ఆ పందొమ్మిదేళ్ళ యువకుడి ముందొక సవాలు విసిరినట్టునట్టుగా అన్నాడా మాటలు. కాని ఆ యువకుడి సంకోచాన్ని కనిపెట్టినట్టుగా మరో మాట కూడా అన్నాడు: ‘నేను కూడా నీకు సాయం పడతాను.’

తొందరలోనే కలాం, కదిరేశన్ గురుశిష్యులుగా మారిపోయేరు. వాళ్ళు పెట్టుకున్న లక్ష్యం చాలా చిన్నది-పదవ తరగతి పాసవడం, ఇంగ్లీషులో మంచి మార్కులు తెచ్చుకోడం. అంతే. అన్న మాట ప్రకారం డా.కలాం ప్రతి రోజూ డి ఆర్ డి ఓ లో తన ఆఫీసు పని పూర్తయ్యాక, కదిరేశన్ కి ఇంగ్లీషు పాఠాలు, ముఖ్యంగా గ్రామర్ బోధించేవారు. ఏడాది తిరక్కుండానే కదిరేశన్ పదో తరగతి పరీక్ష పాసయ్యాడు.

కాని డా.కలాం అక్కడితో ఆగలేదు. కాని అతడి గురించి తాను పెట్టుకున్న లక్ష్యాల్ని ఒక్కసారిగా కాకుండా నెమ్మదిగా ఒక్కొక్కటే అతడిముందు పెట్టడం మొదలుపెట్టారు. ఎందుకంటే, ‘ఆశయాలు చిన్నవిగా ఉండటం అపరాధం’ అని కలాం అనేవారని మనకు తెలుసు.

‘ఇప్పుడు నువ్వు ఇంటర్మీడియేటు పూర్తిచెయ్యాలి’ అన్నారు డా. కలాం ఒకరోజుకదిరేశన్ తో, ఈసారి మరొక కొత్త లక్ష్యం అతడిముందు పెడుతూ. అతడికి ధైర్యం గా ఉండటం కోసం, అతడి పరీక్ష ఫీజు తానే కట్టారు, పుస్తకాలు కూడా తానే కొనిపెట్టారు. అతణ్ణింకా ఉత్సాహపరచడానికి రోజూ అతడితో పోటీ పడేవారు, రోజూ ఎవరి ఉద్యోగం వారు చేసుకున్నాక, రాత్రి పూట, ఇద్దరూ ఎవరి పుస్తకాలు వాళ్ళు చదువుకోడం మొదలుపెట్టేవారు. గురువు లైబ్రరీ పుస్తకాలు చదువుకుంటూ ఉంటే, శిష్యుడు క్లాసు పుస్తకాలు చదువుకుంటూ ఉండేవాడు. ఎవరు ఎంత ఎక్కువ సేపు చదివితే వాళ్ళా రోజు పోటీలో నెగ్గినట్టు. ఏమైతేనేం, కదిరేశన్ 51.4 శాతంతో ఇంటర్మీడియేట్ పాసయ్యాడు. అదంతా తన గురువు తనకందించిన స్ఫూర్తివల్లనేనని అతడికి తెలుసు. అతడు సంతోషంతో పొంగిపోయాడు. కాని, డా.కలాం కి అక్కడితో తృప్తి లేదు.

‘నువ్వు కంప్యూటర్ సైన్సు చదవాలి, బి.ఎస్.సి చెయ్యి’ అన్నారు కలాం. రానున్న రోజుల్లో కంప్యూటర్లు ఎటువంటి పాత్ర వహిస్తాయో చూడగలిగిన దార్శనికుడు ఆయన. ఆ పిల్లవాడు కంప్యూటర్ సైన్సు చదువుకుంటే, భవిష్యత్తులో గొప్ప స్థానానికి చేరుకోగలడని భావించారాయన. కాని, ఈసారి మాత్రం ఆయన రాజీ పడక తప్పలేదు. కదిరేశన్ సాంఘిక శాస్త్రాల పట్ల మొగ్గు చూపించాడు.

దాంతో అతడు బి ఏ చదవడానికే ఇద్దరూ ఒప్పుకున్నారు. అప్పుడు ఆ గురువు తన శిష్యుడికి ప్రపంచ చరిత్ర, ముఖ్యంగా, రెండు ప్రపంచ యుద్ధాల చరిత్ర, స్వయంగా బోధించడం మొదలుపెట్టాడు. ఈ సారి కూడా కదిరేశన్ పరీక్షల్లో 51 శాతం సాధించాడు. అతడి కుటుంబసభ్యుల ఆనందానికి హద్దుల్లేవు. తాను జీవితంలో ఎంత సాధించవచ్చునో అంతా సాధించాననుకున్నాడు కదిరేశన్.

కాని ఆ గురువు అక్కడితో సంతృప్తి చెందలేదు. అతడు తన శిష్యుణ్ణి మరింత ముందుకి నడిపించాలనుకున్నాడు. ‘నువ్విప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెయ్యాలి. నన్నడిగితే పొలిటికల్ సైన్సు చదవడం మంచిది ‘ అన్నారాయన. తన గురువుకి తన పట్ల ఉన్న నమ్మకాన్ని చూసి కదిరేశన్ కి సంతోషంగానే ఉండిందిగాని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెయ్యడంలో కొత్త సమస్య ఒకటి కనిపించిందతడికి. ఎందుకంటే, తన గురువు టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ మాత్రమే చేసాడు. ఇప్పుడు తాను పిజి చేస్తే ఈ డ్రైవరు తన బాస్ కన్నా విద్యాధికుడైపోతాడు! కాని గొప్ప గురువులెప్పుడూ తమ శిష్యులు తమ జీవితకాలంలోనే తమను దాటి పైకెదగాలని కోరుకుంటారు కదా. డా.కలాం నిస్సందేహంగా ఒక ఆదర్శ ఉపాధ్యాయుడు. కాని కదిరేశన్ ప్రయాణించవలసిన మార్గంలో ఇప్పుడెన్నో అడ్డంకులు కనిపించడం మొదలుపెట్టాయి. ఒకసారైతే అతడు పరీక్ష రాయడం కొద్దిలో మిస్సయి ఉండేవాడు. అతడు పరీక్షా కేంద్రానికి సకాలంలో చేరుకోడానికి డా.కలాం విమానం టికెట్టు కొనిచ్చి మరీ చెన్నై పంపించారు.

డా.కలాం కార్యాలయంలో డ్రైవరుగా చేరి పదేళ్ళు తిరిగే లోపల, కదిరేశన్, పదవ తరగతి, ఇంటర్మీడియేటు, బి ఏ, ఎం ఏ, బి ఇడి, ఎం ఇడి పరీక్షలు రాసి ఉత్తీర్ణుడైపోయాడు.

1992 లో కదిరేశన్ తిరిగి మళ్ళా సైన్యంలో చేరిపోవలసి వచ్చింది. దాంతో అతడు తన గురువుని వదిలిపెట్టిపోక తప్పలేదు. కాని చదువు పట్ల గురువు తనలో రగిలించిన తృష్ణ అతణ్ణి వెంటాడటం మొదలుపెట్టింది. 1998 లో అతడు ఉద్యోగం వదిలిపెట్టేసాడు. మనోన్మనియం సుందరేశన్ విశ్వవిద్యాలయంలో పి ఎచ్ డి కి రిజిస్టరు చేసుకున్నాడు. 2001 కల్లా పి ఎచ్ డి పూర్తిచేసేసాడు. ఆ తర్వాత తమిళనాడు ప్రభుత్వ విద్యాశాఖలో చేరి చాలా ఏళ్ళ పాటు ఉద్యోగం చేసాడు. 2010 నాటికి అతడు తిరునల్వేలి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో అసిస్టెంటు ప్రొఫెసరు గా పనిచేయడం మొదలుపెట్టాడు…

కలాం ఈ కథ చెప్తున్నప్పుడు అక్కడున్నవాళ్ళల్లో ఒకరు కదిరేశన్ జీవితం నుంచి ఇప్పటి యువత గ్రహించదగ్గ సందేశం ఏమిటనుకుంటున్నారని డా.కలాం ని అడిగారు. ఆయనిలా అన్నారు: ‘ అతడు తన తీరికసమయంలో ఏ నైపుణ్యాలు పెంచుకోవాలో వాటిని పెంచుకున్నాడు. గొప్ప నిబద్ధతతో, గొప్ప అంకితభావంతో. అది అతడి భవిష్యత్తుని సుగమం చేసింది, అతడి జీవనోపాధిని మెరుగుపరిచింది. మీక్కూడా అటువంటి భవిష్య దృష్టి అంటూ ఒకటుండి, దాన్నెట్లాగేనా సాధించాలన్న పట్టుదల ఉంటే, మీరు కూడా తప్పకుండా విజయం సాధిస్తారు.’..

డా.కలాం ఈ లోకాన్ని వదిలిపెట్టినప్పుడు, ఆయన కడసారి దర్శనం కోసం రామేశ్వరం బయలుదేరుతూ, కదిరేశన్ అన్న మాట ఒక్కటే: ‘కాని ఆయన దగ్గర కంప్యూటరు నేర్చుకోలేకపోయానన్న చింత అయితే ఒకటి మిగిలిపోయింది.’

7-9-2019

Leave a Reply

%d bloggers like this: