అన్నార్తుడి వాయులీనం

పాబ్లో నెరుదా All The Odes (2013) తెరిచాను. నెరుదా ని ఎక్కడ తెరిచినా గుప్పున కమ్మేస్తాడు. పారశీకపు అత్తరూ, ప్రజా ఉద్యమాల నెత్తురూ కలగలిసిన కవిత్వం అది. అది సుగంధమూ, గంధకమూ కూడా. నీ హృదయంలో చిన్ని నిప్పుతునక ఉన్నా అతడి గీతం నిన్ను నిలువెల్లా దహించివేస్తుంది. అసలు ఆ కవిత్వానికే మంటలు పుట్టించే గుణమేదో ఉంది.

పుస్తకం తెరిచి ఒకటి రెండు గీతాలు చదివేనో లేదో, ఆ ఇంగ్లీషు మాటలు నా అంతరంగంలో తెలుగుపదాలుగా మారిపోతూ తుమ్మెదల్లా నా చుట్టూ ఝుమ్మని ముసరడం మొదలుపెట్టాయి

ఉండబట్టలేక, ఇదిగో, ఒక గీతం మీ కోసం.

~

కాలిఫోర్నియాలో వాయులీనం: ఒక గీతం

ఒకానొక రోజు కాలిఫోర్నియాతీరాన
నేను నా దారిన, భాగ్యహీనుడిగా
బండరాతిమాదిరి పడి ఉన్నప్పుడు
పసుపుకొరడా ఝుళిపిస్తూ
ప్రభాతం అరుదెంచింది
సాయంకాలమొక సుడిగాలిలాగా తరలిపోయాక
తాజాదనంతోనూ, పొంగిపొర్లుతున్న
నక్షత్రాలతోనూ
రాత్రి ఒక నిర్మలపాత్రలాగా అడుగుపెట్టింది.

నిండు గర్భిణిలాంటి ఓ గగనమా
మెక్సికో సరిహద్దులమీద
సంచలిస్తున్న నీలశిల్పవక్షమా
బాటసారుల దిగులుతో
కృశించిన తనుయష్టితో
పిండేసిన, బొబ్బలెక్కిన పాదాలతో
అమంగళసూచకమైన కాలిఫోర్నియా ఉప్పుగట్టుమీద
కెరటాల తాకిడికి
నలిగిపోతూ నేనొక్కణ్ణీ.

ఇంతలో హటాత్తుగా ఒక వయొలిన్ వినిపించింది
సన్నని స్వరం
క్షుధాభరితం,
సాయంకాలపు గాల్లో
తేలుకుంటూ వస్తోంది
వీథికుక్కలాగా
మొరుగుతోంది
అది నాకోసం విలపిస్తోంది
నన్ను వెతుక్కుంటోంది
అది నా
సహచరి,
సమస్త మానవాళి రోదన.
ఆ ఇసక తిన్నెల మీద మరొక నిష్టుర ప్రాణి నిష్ఫలవేదన.

ఆ రాత్రి నేనా వయొలిన్ వెతకడం మొదలుపెట్టాను
గడ్డుచీకటికమ్మిన ప్రతి వీథిలోనూ వెతుక్కున్నాను
ఇల్లిల్లూ వెతుకులాడేను.
నక్షత్రాలన్నీ శోధించాను.
ఆ స్వరం నెమ్మదిగా పలచబడింది
మళ్ళా ఇంతలోనే
ఒక నిప్పునాలుకలాగా
ఆ ఉప్పదనపు రాత్రిలో
ఉధృతంగా పైకెగసింది
దాన్లో మంటలు పుట్టించే గుణమేదో ఉంది
సంగీత ఆవర్తాల చుట్టకుదురులాగా ఉందది
నేనా రాత్రి ఆ కాళవాయులీన జీవరేఖను
అన్వేషిస్తో
వీథులన్నీ కలయదిరిగాను
ఆ సంగీత ప్రభవకేంద్రం
నిశ్శబ్దంలో కప్పడిపోయింది.
ఏమైతేనేం, చివరికి కనుగొన్నాను
ఒక మద్యశాల ద్వారం దగ్గర
ఆ మనిషినీ, అతడి క్షుధార్తసంగీతాన్నీ.

చిట్టచివరి తాగుబోతు కూడా
తన శయ్యని వెతుక్కుంటూ ఇంటిబాటపట్టాడు
అప్పటిదాకా చెరచబడ్డ బల్లలు
ఖాళీగ్లాసుల్ని విదిలించుకున్నాయి.
ఇంక అక్కడెవ్వరూ వడ్డించడానికి
ఎదురుచూడటం లేదు.
రావలసిన అతిథులు కూడా ఎవరూ లేరు.
మధువు ఇంటికి వెళ్ళిపోయింది
మద్యం గాఢనిద్రలో ములిగిపోయింది.
అక్కడ ఆ గుమ్మం దగ్గర
ఆ వాయులీనం తన శీర్ణవస్త్ర సహచరుడితో
తేలియాడుతున్నది
ఆ ఒంటరి రాత్రి
ఒక ఏకాంత స్వరప్రస్తారం పైన
కొంత వెండి, కొంత బాధ కలగలిపి
నక్తనభోంతరాళం నుంచి
ఒక నవేతిహాసాన్ని పిండుకుంటున్నది.

నేను కూడా సగం మూతలుపడుతున్న కళ్ళతోనే
అగ్నిహోత్రాల్నీ, అశనిపాతాల్నీ, భిక్షుగీతాల్నీ చుట్టబెడుతూ
నా వాయులీనాన్ని కూడా శ్రుతిచేసాను.
ఆ ఉప్పునీటికయ్యదగ్గర
ఆ తంత్రులు
వ్యథార్తగీతాలకు జన్మనిస్తుంటే
ఆ అంగుళులు స్వరాల్ని నియంత్రిస్తుంటే
ఆ వాద్యం మరింత మృదువుగా వినిపించడం మొదలుపెట్టింది
ఆ మృదుత్వం పట్ల నాకు గౌరవం కలిగింది
చక్కటి వాద్యం, చక్కటి కూర్పు.
ఆ అన్నార్తుడి వాయులీనం
నాకు నా కుటుంబసమానమనిపించింది
అది నా బంధువర్గం.
కాని, కేవలం దాని స్వరం వల్ల కాదు
కోపోద్రిక్త తారకాగణాలపైన
అది శోకాకులంగా మొరుగుతున్నందుకు కాదు

అది నాకు నా సొంతమనిషిగా
ఎందుకనిపించిందంటే
నిర్భాగ్యుల్నెట్లా
చేరదీసుకోవాలో నేర్చుకుంది కాబట్టి
దారితప్పిన బాటసారుల్నెట్లా
పాటల్తో పలకరించాలో తెలుసుకుంది కాబట్టి.

20-9-2019

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading