21వ శతాబ్దపు కవి

ఆ మధ్య మిత్రులు దామరాజు నాగలక్ష్మిగారు తాను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు అక్కడి యూకలిప్టస్ చెట్ల ఫొటోలు పెట్టినప్పుడు ఆ రంగుల్ని చూడగానే లెస్ మర్రీ యూకలిప్టస్ చెట్లమీద రాసిన కవితలు గుర్తొచ్చాయి. ఆ కవితలు ఒకటి రెండేనా తెలుగు చేసి మీతో పంచుకుందామని అనుకుంటూ ఉండగానే, నిన్న మెహర్ నుంచి వార్త, ఆ కవి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడని.

లెస్ మర్రీ (Les Murray) (1938-2019) ఆస్ట్రేలియా ఖండానికి చెందిన మహాకవి అనే స్థానాన్ని దాటి విస్తృతప్రపంచ హృదయంలోకి ఎప్పుడో చొరబడ్డాడు. అతడికి అంజలి ఘటిస్తూ, ఒక విమర్శకుడు అన్నట్లుగా, ‘ఆయన ఇరవయ్యవ శతాబ్దం ప్రపంచానికి కానుక చేసిన మహాకవుల్లో చివరివాడు’.

అతడికి ఈ ఏడాదో మరుసటి ఏడాదో నోబెల్ పురస్కారం వరిస్తుందని అనుకుంటూ ఉండగానే అతడీ లోకాన్ని వదిలిపెట్టడం నోబెల్ పురస్కారం దురదృష్టం. మరొక విధంగా చూస్తే, ఆయన తన కవిత్వ సాధనలో ఒక పతాకస్థాయికి చేరుకుని అక్కడే ఆగిపోయి ఉంటే, బహుశా పురస్కారాలకి కొదవ ఉండి ఉండేది కాదు. కాని, ఆయన తన కవిత్వాన్ని ఎప్పటికప్పుడు పదును పెట్టుకుంటూనే ఉన్నాడు. తన గొంతు ఎప్పటికప్పుడు శ్రుతి చేసుకుంటూనే ఉన్నాడు. తన డిక్షన్, శైలి, పదజాలం, భావజాలం ప్రతి ఒక్కటీ ఎప్పటికప్పుడు సరికొత్తగా తన శ్రోతల్ని సంభ్రమానికి గురిచేసేటంత కొత్తగా సరిదిద్దుకుంటూనే ఉన్నాడు.

లెస్ మర్రీ గురించి ముందుగా చెప్పగల మాట, చెప్పవలసిన మాట-అతణ్ణి ఏదో ఒక గాటన కట్టలేమనే. అతడు సామ్రాజ్యవాదదేశాల సంస్కృతికి చెందిన కవి కాడు, కామన్ వెల్త్ కవి కాడు. జీవితకాలం పాటు ఇంగ్లీషులోనే కవిత్వం రాసినా, ఆ ఇంగ్లీషు, ఇంగ్లాండు ఇష్టపడే ఇంగ్లీషు కాదు. తన ఆరేడేళ్ళ పసివయసులో ఒకసారి అతడికి అతని తల్లి చెప్పిందట, ప్రపంచంలో ఇంగ్లీషు ఒక్కటే భాష కాదు అని. ఆ తొలిసమాచారం ఇచ్చిన షాక్ నుంచి తేరుకోడానికి అతడు జీవితమంతా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆ రోజు మొదలుకుని ఎన్ని భాషలు నేర్చుకోగలడో అన్ని భాషలు నేర్చుకుంటూనే ఉన్నాడు. ఉన్నత విద్యకోసం సిడ్నీ యూనివెర్సిటీలో చేరినప్పుడు విదేశీ భాషల నిఘంటువులు చదవడానికే అతడికి సమయం చాలేది కాదట.

ఆస్ట్రేలియా లో కూడా అతడు ఆస్ట్రేలియా పక్షాన లేడు. గ్రామీణ ఆస్ట్రేలియా, ఆదివాసుల ఆస్ట్రేలియా ని వెతుక్కుంటూ గడిపాడు. అడవుల్లో, కొండల్లో, మైదానాల్లో భగవద్విభూతి ని చూస్తూ మైమరిపోయినందుకు అతణ్ణి సెక్యులర్ ఆస్ట్రేలియా చేరదీసుకోలేకపోయింది. రోమన్ కాథలిక్ విశ్వాసాల్ని అనుష్టించినందువల్ల ఆధునికులూ, అత్యాధునికులూ అతణ్ణి ఎప్పటికీ తమ స్వంత మనిషిగా భావించలేకపోయారు. ఫెమినిస్టులూ, మల్టీకల్చరిస్టులూ, కుడి,ఎడమ ధోరణులకి చెందిన రెండు పక్షాల వాళ్ళూ కూడా అతణ్ణి దూరం పెట్టడంలో సమానంగానే ఉన్నారు. కానీ, అతడు ఆస్ట్రేలియన్ కవిత్వాన్ని ప్రపంచపటం మీదకు తీసుకొచ్చాడనీ, ఆ భాష, ఆ శైలి అనితరసాధ్యమనీ ఒప్పుకోడంలో మాత్రం వాళ్ళల్లో ఒక్కరూ వెనుకాడలేదు.

లెస్ మర్రే ని ప్రకృతి కవి అనిగాని, ఆస్తిక కవి అని గాని, అభ్యుదయ కవి అని గాని, భావ కవి అని గాని, అహంభావ కవి అని గాని తేల్చలేం. అటువంటి ఏ ముద్రలో అతణ్ణి ఇరికించాలని చూసినా అతడు తన తదుపరి కవితతోనో, కవితాసంపుటితోనో ఆ మూసబద్దలుకొట్టుకుని బయటకి వచ్చేసేవాడు. ‘నువ్వెవరి కవివి?’ అనడిగితే అతడు ‘ఎవరు అప్రధానంగా ఉన్నారో వాళ్ళ కవిని’ అని జవాబిస్తాడు. ఆ అప్రధానత సమాజంలోనే కాదు, సాహిత్యంలోనూ, సాహిత్య చర్చల్లోనూ కూడా. ‘వెనక్కి నెట్టబడటాన్ని నేను భరించలేను. మనుషులు వెనకబడిపోడం నా దృష్టిలో అత్యంత దుర్భరం. బొత్తిగా వెనకబడ్డ జీవితం నుంచి నలుగురూ అంగీకరించే స్థానానికి చేరుకోడమే నా జీవితంలో నేను చెప్పుకోదగ్గ విషయం’ అని చెప్పాడాయన. ఒక కావ్యంలో పదే పదే వాడేసిన అలంకారాన్ని మనం పడికట్టు పదం అంటాం. దాన్ని మళ్ళా వాడటానికి ఇష్టపడం. లెస్ మర్రే దృష్టిలో పదే పదే ప్రస్తావించే భావాలు, నినాదాలు, సిద్ధాంతాలు, ఛందస్సులు, ప్రతీకలు ప్రతి ఒక్కటీ పడికట్టుపదం లాంటిదే. ఎవరికీ అంతగా తెలియనిదాన్ని నలుగురికీ తెలియపరచడంలో అతడికి ఎంత కుతూహలం ఉందో, నలుగురికీ తెలిసినదాన్ని నిర్లక్ష్యం చెయ్యడంలో కూడా అంతే పట్టుదల ఉంది.

మర్రీ కవిత్వ శైలి మనకి పరిచయమైన ఆధునిక కవుల శైలి కాదు. ఇలియట్, పౌండ్ ల పట్ల తన అసహనాన్ని అతడెప్పుడూ దాచుకోలేదు. ఇరవయ్యవ శతాబ్ది ఉత్తరార్థంలో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన యూరపియన్ కవుల్లాగా అతడి దృష్టి మెటఫర్లమీద కూడా లేదు. అది ఆలోచనాప్రధానం కాదు, అలంకారప్రధానమూ కాదు. వర్ణనాత్మకమే కాని, ప్రతి వాక్యంలోనూ, ప్రతి పదప్రయోగంలోనూ రసధ్వని పలుకుతూ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, అతడు తన సర్వేంద్రియాలతోనూ కవితని చూస్తాడు, పలుకుతాడు. దాన్నతడు Wholespeak అన్నాడు. అది మనిషి తన పూర్తి అస్తిత్వ స్పృహతో, తన కలలు, మెలకువలు మొత్తాన్ని కలుపుకుంటూ మాట్లాడే మాట. తద్విరుద్ధమైనదాన్ని, అంటే, మన వ్యవహారానికి మాత్రమే పనికొచ్చేదాన్ని Narrowspeak అన్నాడు. ఈ మెలకువలో అతడు ఆస్ట్రేలియన్ ఆదివాసుల ప్రాపంచిక దృక్పథానికి సంపూర్ణ వారసుడు. అందుకనే ‘ఆస్ట్రేలియాలో కవిత్వం కొన్ని వేల ఏళ్ళుగా వినిపిస్తూ ఉంది. వచనం మొదలయ్యింది మాత్రం 1788 నుంచే’ అన్నాడొకచోట.

అతడు తన సమస్త అస్తిత్వంతోటీ కవిత చెప్తాడు కాబట్టి అది ఎంత స్థానికమో అంత సార్వత్రికం కూడా. అది ప్రధానంగా ఆనుభవిక కవిత్వం. అందుకనే అతడికి నివాళి ఘటిస్తూ గార్డియన్ పత్రిక A Murrayesque poet must be prepared to be a medium for voices of experience అంటూ, A cockspur Bush(1992)అనే కవితనుంచి ఈ వాక్యాలు ఉదాహరించింది:

నేను బతికాను, నేను మరణించాను
చాలా సార్లు నాకు మిగిలింది రెండాకులే,
తొక్కుకుంటూ మేసిపోగా
మళ్ళా కాండం తొడిగాను, బహుథా విస్తరించాను
వాడిముళ్ళతో చిగురించాను,అల్లిబిల్లిగా అల్లుకున్నాను,
ఎదిగాను, వికసించాను
సూర్యమధువుతో భూక్షారాన్ని పీల్చుకున్నాను
చర్మాస్థిగతనేత్ర జీవుల భయం లేకుండా
నాలోపల గువ్వపిట్టలు పాటలు పాడేయి
పిట్టలు మధ్య, చీమల నడుమ పూలు పూసాను,
తీపివాసనతో చుట్టూ పరుచుకున్న పేడలో
నలుగుదిక్కులా వ్యాపించడానికి సిద్ధంగా
నాకు మిగిలిన నాలుగైదు పళ్ళలోనూ
మరికొన్నేళ్ళ జీవితం దక్కింది నాకు..

ఆస్ట్రేలియాలో పెరిగే ఒక గడ్డిమీద రాసిన ఈ కవితలో ఒక ఆఫ్రికన్ కవికి తన జాతి అంతస్సత్త్వం స్ఫురించడంలో ఆశ్చర్యమేముంది?

మన తెలుగు కవుల్ని చూడండి. వాళ్ళింకా విట్మన్ లాగా, నెరూదా లాగా, శ్రీశ్రీ లాగా కవిత్వం రాయాలని ప్రయత్నిస్తుంటారు. మారిన ప్రపంచంలో అలా కవిత్వం రాయడం వాగాడంబరం మటుకేనని వాళ్ళెప్పటికి గ్రహిస్తారు? శబ్దాలంకారాలకీ, పద్యగంధి వచనానికీ, వక్తృత్వానికీ దూరం జరక్కుండా మనం కవిత్వానికి చేరువ కాలేమని ఎప్పుడు తెలుసుకుంటారు?

ఒక విధంగా చెప్పాలంటే, మర్రీ, 21వ శతాబ్దపు కవి.

అతడు వెళ్ళిపోయాడు గానీ, ఆస్ట్రేలియన్ ఆకాశంలాగా నిలిచే ఉంటాడు. అతడు వదిలి పెట్టి వెళ్ళిన 1687 కవితలూ చదవాలనుకుంటే https://www.poetrylibrary.edu.au/poets/murray-les చూడండి.

మర్రీ కవితలు మూడు, మీ కోసం, తెలుగులో.

~

1
ప్రవాసంలో యూకలిప్టస్ లు


అవి చెయ్యడానికి చాలా పనులే ఉన్నాయి:
ఆఫ్రికాలో ఆహారం కావడం, ముద్రణకు తనువర్పించడం
మలేరియాని పీల్చెయ్యడం, పారిస్ లో తిరుగుబాటుకి ఆయుధం
స్పెయిన్ లో కొంగలకోసం గూడుగా నిలబడ్డం.

విదేశాల్లో అవి మరింత శుభ్రం, సురక్షితం
చుట్టూ చక్కటి తొడుగు, చిల్లులు పడని జీవితం
తమమీద బతికే పరాన్నభుక్కుల్ని అవిక్కడే వదిలేసాయి.

బుల్లెట్లు దూసుకొచ్చినట్టు పూలు పూస్తాయి
నీటిగొట్టంలాంటి తల్లివేరు లేకుండానే
నీళ్ళు పైకి తోడుకుంటాయి, ఉధృతంగా గాలులు వీచినప్పుడు
నేలకొరుగుతాయి కాని రహస్యాలు బయటపెడతాయి.

తెగిపడ్డ అంగాల మధ్య
పెళ్ళలు ఊడుతున్న బెరడు
వాటి దేశవాళీ లక్షణమే గానీ
అంతరాంతరాల్లో అగ్ని పదిలంగానే ఉంటుంది.
ఒక్కొక్కప్పుడు అవి అమెరికన్ తీరపట్టణాల్లో
భవంతుల్ని దగ్ధం చేస్తూండటం కద్దు
ఎందుకంటే, యూకలిప్టస్ గా ఉండటమంటే
కొన్ని సార్లు నరకంలో కూడా వికసించాలి మరి.

వాటి మానవసహచరులు వాటిని విదేశాల్లో కలుసుకున్నప్పుడు
దగ్గరగా లాక్కుని చేతులు నొక్కి మరీ పసిగడతారు.

ఒక్కొక్కటిగా ఉన్నప్పుడు అవి ప్రేమాస్పదమేగానీ
కట్టకట్టుకు వస్తేమటుకు కనికరం చూపవు.

2

అస్తిత్వపరమార్థం

భాషకి తప్ప ప్రతి ఒక్కదానికీ
అస్తిత్వ పరమార్థం తెలుసు.
చెట్లకీ, గ్రహాలకీ, కాలానికీ,నదీనదాలకీ
మరొకటి తెలీదు. వాటికి తెలిసింది అదొక్కటే
దాన్నే అనుక్షణం ఒక విశ్వంగా ప్రకటిస్తుంటాయి.

ఇదిగో ఈ దేహధారి మూర్ఖుడున్నాడే
వీడు కూడా వాటిలో ఒక భాగమే. వీడు మరింత
హుందాగా విశ్వాత్మలో ఒకటై ఉండేవాడు,
ఇదిగో ఈ పిచ్చిమాటలు మాట్లాడ్డమనే
తెలివితక్కువ స్వేచ్ఛ లేకపోయుంటే.

3

కవిత్వమూ, మతమూ

మతాలూ కవితలే. అవి మన పట్టపగటి వెలుతురునీ
కలలుగనే మనసునీ పెనవేస్తాయి. మన
భావావేశాల్ని, సహజాతాల్ని, శ్వాసని, స్వాభావిక చేష్టల్ని
ఒకే ఒక్క ఆలోచనగా అల్లుతాయి: అప్పుడు దాన్ని కవిత్వమంటాం.
శబ్దాల్లోకి స్వప్నించనంతకాలం ఏదీ నిజంగా పలికినట్టే కాదు
అలాగని కేవలం పదాలుగానే మిగిలిపోయిందేదీ సత్యం కానే కాదు.

మతంతో పోలిస్తే కవిత్వం,
ఒక సైనికుడు గడపడానికి మిగిలిన ఒకే ఒక్క రాత్రి లాంటిది: మరణించడానికైనా, ఆ ఆసరాతో జీవించడానికైనా.
కాని అది చిన్నపాటి మతం.

పూర్తి స్థాయిలో మతమంటే,
ప్రేమతో చర్వితచర్వణం చేసుకునే కవిత్వం.
కవితలాగా అది ఎప్పటికీ ఇంకిపోదు, సంపూర్ణం,
దాని ప్రతి మలుపులోనూ
మనమొకసారి ఆగి ఆశ్చర్యపోతూనే ఉంటాం,
ఇంతకీ ఆ కవి ఎందుకట్లా చేసాడంటో.

నువ్వు అబద్ధాలతో ప్రార్థన చేయలేవన్నాడు హకల్ బరీ ఫిన్
సంకెళ్ళతో అసలే కాదు.
చలితం, సమీక్షణం, అది ఒక అద్దం
అప్పుడే దాన్ని మనం కవిత్వమంటాం.

దాన్నే స్థిరంగా కేంద్రంలో నిలబెట్టావా,
అప్పుడు దాన్ని మతమంటాం.
కవిత్వమంటే మతంలో పట్టుబడ్డ దైవం.
పట్టుబడ్డవాడు మాత్రమే, కైదు కాబడ్డవాడు కాడు.
ఒక అద్దంలో పట్టుబడతాడే అట్లా అన్నమాట,
ఆ తలుపు ఎప్పటికీ మూసెయ్యలేం
ఎంతకాలం కవిత్వముంటుందో, ఉండదో
అంతకాలం మతమూ ఉంటుంది, ఉండదు.

అవి ఉంటాయట్లానే, ఆగీ ఆగీ కొనసాగుతుంటాయి,
చూడు, ఒకలాంటి పక్షులుంటాయే,
రెక్కలు ముడుచుకుని ఎగురుతాయి,
అప్పుడు రెక్కలు చాచి
అల్లాడిస్తాయి, మళ్ళా ముడుచుకుంటాయి, అట్లా.

23-5-2019

Leave a Reply

%d bloggers like this: