రెండు మూడు మాటలు

ప్రతి ఒక్కరినీ, ప్రతి ఒక్క పలకరింపులోనూ ‘విత్ లవ్-జె ‘ అని రాసే ఆ మనిషి ప్రేమశూన్య లోకంలో జీవించిగలిగినంతకాలం జీవించి, ఇక జీవించలేక వెళ్ళిపోయింది. తనని తాను బలవంతంగా నెట్టుకుని మరీ ఈ వేదిక మీంచి పక్కకు తప్పుకుంది.

ఆమె గురించి ఇప్పుడేమీ రాసే అధికారంగాని,మాట్లాడే అర్హత గాని మనెవ్వరికీ లేదు. ఇప్పుడామెని ప్రశంసించినా, విమర్శించినా అంతకన్నా అర్థరహితం మరొకటి లేదు. ఆమె జీవించి ఉండగా, మన స్నేహ హస్తం ఎలానూ అందించలేకపోయాం, కనీసం, ఆమె జీవితానికి తీర్పరులమయ్యే అపరాధం నుంచేనా మనల్ని మనం కాపాడుకుందాం.

కానీ, ఈ క్షణాన, నాకొక రెండు మూడు మాటలు చెప్పాలని ఉంది. వెళ్ళిపోయిన ఆమె గురించి కాదు. బతికి ఉన్న వాళ్ళ గురించి.

అన్నిటికన్నా, మొదటిది, కాలం మనముందు పెట్టిన కమ్యూనికేషన్ సౌకర్యాల వల్ల మనం ఇంతకు ముందెన్నడూ లేనంతగా connect అయ్యామనుకుంటున్నాం గాని, నిజానికి, మనం మునుపెన్నడూ లేనంతగా disconnect అయ్యాం. మన మధ్య రంగులురంగులుగా, పలకరింపులుగా, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్లుగా, విజువల్ స్ట్రిప్ లుగా అల్లుకుంటున్న connectivity అంతా నిజానికి మన ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రమే. ఏ కారణం చేతనేనా మన ఫోన్ పని చేయకపోయినా, మన ఇంటర్నెట్ పనిచేయకపోయినా మనం ఈ ప్రపంచంలో ఎంత ఒంటరివాళ్ళమో మనకి ఒక్కసారిగా అనుభవంలోకి వస్తుంది. సాంకేతికత మీద ఆధారపడ్డ మానవసంబంధాల కన్నా బోలు సంబంధాలు మరేవీ ఉండవు. సినిమాహాల్లో తెరమీద దేవదాసు దుఃఖాన్ని చూసి, మనం కూడా విలపించి, ఇంటికి రాగానే మర్చిపోయినట్టే, మన సోషల్ మీడియా అరచేతి తెరమీద మనుషుల సుఖదుఃఖాలకి కూడా ఆ క్షణం స్పందిస్తున్నాం, మరు క్షణం మర్చిపోతున్నాం.

పూర్వకాలం, అంటే మరీ పూర్వం కాదు, ముప్పై, నలభై ఏళ్ళకింద మనుషుల ప్రపంచం చాలా చిన్నది. అందులో వాళ్ళ దగ్గర బంధువులూ, బీరకాయ పీచు దూరపు చుట్టరికాలతో పాటు, ఇరుగు, పొరుగు, సహోద్యోగులు- రోజూ తమ కళ్ళ ఎదట ఉండేవాళ్ళూ, తాము కలవకుండా తప్పించుకోలేనివాళ్ళూ ఉండేవారు. కష్టమో, నష్టమో మనం వాళ్ళతోటే కలిసి జీవించడానికి అలవాటు పడి ఉండేవాళ్ళం. కాని, ఇప్పుడు ప్రపంచం విస్తరించింది. మనకి ప్రపంచమంతా స్నేహహస్తం చాచే అవకాశం వచ్చింది. కాని, ఈ స్నేహాలు, ఈ పలకరింపులు మన జీవితంలోని ఉల్లాసకర క్షణాలకు మాత్రమే పరిమితం. మన జీవితాల్లోని ఘనతను చాటుకోవడానికి మాత్రమే పరిమితం. ఈ అసంఖ్యాక పరిచయాల్లో, ఒక్కరేనా, మన ఇంటర్నెట్ కనెక్షన్ తో సంబంధం లేకుండా, మన ఇంటికొచ్చి మనల్ని పలకరించడానికి సిద్ధంగా ఉన్నారా?

రెండవది, అన్నిటికన్నా ముఖ్యమైంది, జీవితాన్ని వెలిగించేది కవులూ, రచయితలూ, ప్రేమికులూ, భావుకులూ మాత్రమే కాదు. నిజానికి వాళ్ళంతా నిండుగా పూసిన ఒక పూలచెట్టు మీద ఇంతలో వాలి, ఇంతలోనే ఎగిరిపోయే పక్షుల్లాంటివాళ్ళు. ఆ చెట్టుకి వాళ్ళు నీళ్ళు పొయ్యరు, కంచె కట్టరు, కాపలా కాయరు. మన దైనందిన జీవితంలో మన రోజువారీ అవసరాలు తీర్చే మనుష్య సమాజం, మనం పట్టించుకోని సమాజం, ఒకటి మన చుట్టూతానే ఉంటుంది. తెల్లవారగానే మన ఇంటితలుపు తట్టే పనిపిల్ల, సూర్యుడింకా ఉదయించకుండానే ఇంటిముంగట పాలపేకట్ పెట్టివెళ్ళే కుర్రవాడు, అకారణంగానో, అనవసరంగానో మన ఇంటితలుపు తట్టి ఊరికే బాతాఖానీ సాగించే పొరుగింటి మనుషులు, మనం ఒకరోజు ఆఫీసుకి వెళ్ళకపోతే ఇంటికి ఫోన్ చేసి మరీ కుశలప్రశ్నలతో విసిగించే మన సహోద్యోగి- ఇటువంటి సామాన్యమైన మనుషులు, మన ప్రేమకీ, భావుకతకీ ఎంత మాత్రం నోచుకోని వాళ్ళు, వీళ్ళే మన జీవితవృక్షాన్ని బతికించే జీవజలాలు. వీళ్ళ జీవితాలు నిస్సారాలనీ, వీళ్ళ ఆరాటాలు మరీ ప్రాపంచికంగా ఉన్నాయనీ మనం వీళ్ళని పలకరించడానికి ఒక్కక్షణం కూడా ఆగం. కాని, అటువంటి మనుషులు ఎంత విలువైనవారో మనకి తెలిసి వచ్చేది ఇటువంటి క్షణాల్లోనే.

ఈ సందర్భంగా నాకో సంగతి జ్ఞాపకం వస్తోంది. నేను చూసిన గొప్ప వేదాంతుల్లో ఒకరైన ఆర్ ఎస్ సుదర్శనం గారిని నేనొక సారి మదనపల్లిలో కలిసాను. ఆయన అప్పుడే ఆరునెలల పాటు అమెరికాలో ఉండి వచ్చారు. ఆమెరికా జీవితం గురించి చాలాసేపు చెప్పుకొచ్చి, ఒక మాటన్నారు, ‘అక్కడికి వెళ్ళకముందు ఇక్కడ నన్నెవరేనా ఊరికే పలకరిస్తే డిస్టర్బన్స్ అనిపించేది. కాని, అక్కడికి వెళ్ళివచ్చాక, మొన్న ఒక రోజు సాయంకాలం వీథి చివర పాన్ డబ్బా అంగడిమనిషి ‘మాష్టారూ, బావున్నారా ‘ అనడిగితే నాకు ప్రాణం లేచి వచ్చినట్టనిపించింది. అలా ఊరికే మనల్ని పలకరించే మనుషులు ఎంత విలువైన మనుషులో ఇప్పుడు నాకు అర్థమవుతోంది ‘ అన్నారాయన. మన జీవితం ఇట్లాంటి సాధారణమైన మనుషులతోటే నిండి ఉంది. వీళ్ళు మన చుట్టూ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. వీళ్ళతో మనం ఎంత ఎక్కువ connect అయితే అంత మంచిది.

అన్నా కరెనినా సినిమా ని సమీక్షిస్తూ ఒక విమర్శకుడిట్లా ప్రశ్నించాడు: ‘మనం అన్నాను ఆమె ప్రగాఢమోహోద్రేకానికి ప్రశంసించాలా లేకపోతే ఆమె మూర్ఖత్వానికి నిందించాలా? ఆమెను ఆరాధించాలా లేక విస్మరించాలా?.. టాల్ స్టాయి నవలలో పాత్రలు సంఘర్షిస్తాయి, సందేహిస్తాయి. ఆలోచిస్తాయి, అవలోకిస్తాయి. ఆలోచిస్తాయి, వాదిస్తాయి. దుఃఖపడతాయి, క్షమిస్తాయి. కాని ఆ నవల అన్నిట్నీ మించి, ఆరాధనకీ, అభిశంసనకీ సంబంధించిన ప్రశ్నలన్నిటినీ దాటి, ‘ఇలా చేసి ఉంటే ఎలా ఉండేదో’, ‘అలా ఉండి ఉంటే ఎలా ఉండేదో’ అనే ఊహాగానాలన్నిటినీ పక్కకు నెట్టి, ఒకటే మాట చెప్తుంది: జీవితం ఉన్నదున్నట్టుగా ఉంటుంది. ఏ మాత్రం ఎక్కువ కాదు, ఏ మాత్రం తక్కువ కాదు. నీకే సంతోషం లభించిందో అదే నీది, నీ సంతోషమే నీ ధన్యత’ అని.

నేను చెప్పాలనుకున్న మూడవ మాట ఇదే. జీవితంలో what is, is. చుట్టూ ఉన్న పరిస్థితుల్ని మనం మార్చగలిగితే మంచిదే. కాని మార్చలేకపోతే,అది మన వైఫల్యం కాదు. నీ ప్రేమికుడు నిన్ను ప్రేమించవలసినంతగా ప్రేమించకపోతే, నీ ఉద్యమ సహచరి నువ్వు తలపెట్టినంతగా త్యాగానికి సిద్ధపడకపోతే, నీ కింది ఉద్యోగి నువ్వు ఆశించినంతగా పనిచెయ్యకపోతే, నీ పై ఉద్యోగి నువ్వెంత పని చేసినా గుర్తించకపోతుంటే- అది నీ తప్పు కాదు. అప్పుడు నువ్వు చెయ్యవలసిందల్లా, నీ గది తలుపు తెరుచుకుని బయటకి వచ్చి ఇంటి ముందు వీథిలో ఆటలాడుకుంటున్న పిల్లల్ని చూడటం, చూస్తూ నిన్ను బాధిస్తున్న ప్రపంచాన్ని కొంతసేపు నీ మనోవీథిలోంచి పక్కకు నెట్టేయడం.

25-8-2019

One Reply to “”

  1. నిన్ను బాధిస్తున్నా, ప్రపంచాన్ని, కొద్దీ సేపు,నీమనో వీధుల్లో నుంచి,పక్క కు,నెట్టేవేయడం..👌.సత్య వంత మైన, వాక్యాలు రాశారు.. సర్!ధన్యవాదాలు

Leave a Reply to padmasravaniCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading