హిడెగ్గర్ కి సమకాలికుడు

Reading Time: 2 minutes

నిన్న బస్సులో వస్తూ, A Little Tour Through European Poetry (2015) అనే పుస్తకం తెరిచాను. ఆ పుస్తక రచయిత, జాన్ టేలర్ తన ముందుమాటలో, యూరపియన్ కవులకీ, తక్కిన కవులకీ (ముఖ్యంగా అమెరికన్ కవులకీ) తేడా ఏమిటి అని ప్రశ్నిస్తూ, పావ్లె గొరనోవిచ్ అనే కవి మాటల్ని తలుచుకున్నాడు. ఆ కవి ఒక కవితలో అన్నాడట కదా: ‘యూరపియన్లు హిడెగ్గర్ కి సమకాలికులు, అమెరికన్ల గురించి ఆ మాట చెప్పలేం’ అని.

నెల రోజుల కిందట, అమృతానుభవం పుస్తకం ప్రతి అందుకోడానికి సూరపరాజు రాధాకృష్ణమూర్తిగారిని కలిసినప్పుడు, మాటల మధ్య, మీరిప్పుడేం చదువుతున్నారని అడిగితే ‘హిడెగ్గర్ ని’ అని జవాబిచ్చారాయన!

ఇప్పుడు అర్థమయింది, ఇక్కడ ఈ ఎనిమిదికోట్ల మంది తెలుగు ప్రజల్లో కూడా హిడెగ్గర్ కి సమకాలికులు ఒకరున్నారని. (మార్టిన్ హిడెగ్గర్ (1889-1976) జర్మన్ తత్త్వవేత్త. ఆయనకి రాధాకృష్ణ మూర్తిగారు, ఆలోచనలోనే కాదు, chronological గా కూడా సమకాలికులే)

మా మాష్టార్ని చూడ్డానికి వెళ్ళినప్పుడు, ఒక్కొక్కప్పుడు, ఆయనకి రాజమండ్రి పట్ల ఏ కారణం చేతనో మరీ కోపంగా ఉన్నప్పుడు, ‘నేనిప్పుడు ఎవరినీ కలవడం లేదయ్యా, ఒక్క masters ని తప్ప’ అనేవారు. మాస్టర్స్ అంటే వాల్మీకి, కాళిదాసు, బసవేశ్వరుడు వంటివారన్నమాట. కాని సూరపరాజు రాధాకృష్ణమూర్తిగారు తానిప్పుడు హిడెగ్గర్ ని చదువుతున్నానని చెప్పినప్పుడు, ఆయన మాస్టర్స్ తో తప్ప మరెవరి సాంగత్యంలోనూ గడపడం లేదని అర్థమయింది.

‘ఏదన్నా రాయకూడదా హిడెగ్గర్ మీద’ అని నోటిదాకా వచ్చిన అభ్యర్థన ని నోట్లోనే కుక్కుకుని, ‘మీరు కాఫ్కా మీద రెండువందల పేజీలదాకా రాసి చింపేసారని విన్నాను. ఆ విషయాలు మీ ధారణలో ఉండే ఉంటాయి, వాటిని కాగితం మీద (ఐ పాడ్ మీద) పెట్టకూడదా ‘ అన్నాను. ‘షేక్ స్పియర్, ఇలియట్, టాల్ స్టాయి, కిర్క్ గార్డ్, నీషేల మీద రాసారు కాబట్టి, కాఫ్కా, కామూల మీద కూడా రాస్తే western cannon పూర్తిగా పరిచయం చేసినట్టవుతుంది కదా’ అన్నాను. ‘బోదిలేర్ మీద కూడా’ అన్నాడు ఆదిత్య పక్కనుంచి. అవును, రాధాకృష్ణమూర్తిగారు బోదిలేర్ ని ఫ్రెంచిలో చదవడమే కాదు, ఇరవయి కవితలదాకా తెలుగు చేసారని కూడా విన్నాను.

కాని ఇంత తొందరగా, ఈ వ్యాసపరంపర మొదలవుతుందని నేనూహించలేదు. చూడండి, ఇది ఒక విశ్వ విద్యాలయ ఆచార్యుడో, పాశ్చాత్య సాహిత్య సిద్ధాంతకారుడో రాస్తున్న వ్యాసాలు కావు. మన సమకాలికుడైన ఒక తెలుగు భావుకుడు, తెలుగులో, అవును, తెలుగు భాషలో, తెలుగు లిపిలో రాస్తున్న వ్యాసాలు.

~

నేను బిఏ లో చేరిన రోజుల్లో, కాలేజీకి వెళ్ళకుండా, కవులచుట్టూ తిరుగుతున్నకాలంలో, జార్జి కాట్లిన్ అనే ఆయన రాసిన ‘గాంధీజీ అడుగు జాడల్లో’ అనే పుస్తకం నా చేతుల్లోకి వచ్చింది. అందులో ఆయన ప్రాచ్య, పాశ్చాత్య దర్శనాలను పోలుస్తూ, ప్రసంగవశాత్తూ మాట్లాడిన మాటలు నాలో గొప్ప తృష్ణని రగిలించాయి. ముఖ్యంగా ఒక వాక్యం ‘కిర్క్ గార్డ్ అవునంటే సార్త్ర కాదంటాడు..’ అనే వాక్యం. కొందరి జీవితాల్ని పుస్తకాలు మలుపు తిప్పుతాయి. నా జీవితాన్ని ఈ వాక్యం మలుపు తిప్పింది. కిర్క్ గార్డ్ (ఏమి విచిత్రమైన పేరు!) ఎవరు? ఆయన అవునని ఎందుకన్నాడు? సార్త్ర ఎవరు? ఆయన కాదని ఎందుకంటాడు? ఈ ప్రశ్నలకు జవాబులు వెతుక్కోవడం కోసం నేను ఫిలాసఫీలో ఎమ్మే చేసాను. ఆ కథంతా నా ‘సత్యాన్వేషణ’ కి ముందుమాటలో రాసాను కూడా. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు నాకీ వ్యాసం దొరికి ఉంటే నా అన్వేషణ ఎంత సులభతరమై ఉండేది!

~

ఈ వ్యాసాలు ఒక్కసారిగా, ఒక్క గుక్కలో అర్థమయిపోయేవి కావు. అలాగని, సాఫ్ట్ కాపీ దాచుకుని, మళ్ళీ ఎప్పుడేనా చదువుదాం లే అని పక్కన పెట్టేవీ కావు. ఒకటికి రెండు సార్లు చదివితే, ఎక్కడో, ఏదో ఒక వాక్యంలోంచి, ఆ అస్తిత్వ విచికిత్సలోకి మనకి దారి తెరుచుకుంటుంది. మరో వ్యాసం కోసం ఎదురుచూడాలన్న తపన మొదలవుతుంది.

29-4-2019

One Reply to “హిడెగ్గర్ కి సమకాలికుడు”

Leave a Reply

%d bloggers like this: