సాహిత్యసమాలోచన

నిన్న సాయంకాలం విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ భవనంలో కొత్తగా నిర్మించిన సమావేశ మందిరంలో నా సాహిత్యం మీద కొంత సమాలోచన జరిగింది. నలభయ్యేళ్ళుగా రాస్తూ ఉన్నప్పటికీ, నా రచనల మీద ఇట్లాంటి ఒక సమాలోచన జరగడం ఇదే మొదటిసారి. ఆ సమావేశానికి నన్ను కూడా రమ్మని పిలిచినప్పుడు మొదట్లో కొంత ఇబ్బందిగా అనిపించింది. నా సాహిత్యం మీద మిత్రులు మాటాడుతుంటే ఎదురుగా కూచుని వినగలనా అనుకున్నాను. కాని, కొంత నిర్మమత్వంతో కూచోగలిగితే వారు చెప్పే విషయాలు నాకు ఉపకరిస్తాయి కదా, నా తప్పొప్పులు తెలుస్తాయి కదా అనుకున్నాను.

సోదరి బాలాంత్రపు ప్రసూన నిర్వహించిన ఆ సభలో నా తత్త్వశాస్త్ర అనువాదాల పైన కాకుమాని శ్రీనివాసరావు, కవిత్వం పైన సీతారాం, సాహిత్య విమర్శ పైన చినుకు రాజగోపాల్ మాట్లాడేరు. చివరలో నా ప్రతిస్పందన.

శ్రీనివాసరావు గొప్ప చదువరి, భావుకుడు, విజ్ఞుడు. ఆయన నా ‘సత్యాన్వేషణ’, ‘ఇమాన్యువల్ కాంట్ రచనలు’, కబీరు ‘నాది దుఃఖం లేని దేశం’ గురించి మాట్లాడేరు. ఒకప్పుడు టాల్ స్టాయి అనాకెరినినా నవల గురించి అన్నాడట: నా తర్వాతి తరం యువతీ యువకులు ఈ పుస్తకాన్ని ఇంత ఆదరంగా చదువుతారని ఊహించి ఉంటే, ఈ పుస్తకాన్ని మరింత శ్రద్ధగా రాసి ఉండేవాణ్ణి అని. శ్రీనివాసరావుని విన్నాక నాకు ఆ మాటే అనిపించింది. నా దృష్టిలో ‘సత్యాన్వేషణ’ ఒక వైఫల్యం. ఆ పుస్తకం నాకెంత మాత్రం సంతృప్తి కలిగించలేదు. ఆ పుస్తకాన్ని ఎమెస్కో కాటలాగు లోంచి తీసెయ్యమంటే, విజయకుమార్ ఒప్పుకోలేదు. ‘మీ పుస్తకాల్లో పునర్ముద్రణ పొందిన పుస్తకం ఇదే’ అన్నాడు. అది నన్ను మరీ బాధించే అంశం. ఆ పుస్తకాన్ని నేను మరింత తిరగరాయవలసి ఉంది. కొన్ని వ్యాసాలు మార్చవలసి ఉంది. వాక్యనిర్మాణాన్ని మరింత మెరుగుపర్చవలసి ఉంది. 2003 నాటికన్నా, వాక్య నిర్మాణంలో మెలకువలు, నాకు మరింతగా, ఇప్పుడు బోధపడ్డాయి. ఏ విధంగా చూసినా ఆ పుస్తకాన్ని ఆమూలాగ్రం మార్చవలసి ఉంది.

కాంట్ మరణించి 200 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా, ఆయన రచనల నుంచి కొన్ని అనువాదాలతో ఒక సంకలనం ఇమ్మని పీకాక్ క్లాసిక్స్ గాంధీ గారు అడగడంతో ‘ఇమ్మాన్యువల్ కాంట్ రచనలు’ అందించాను. పట్టుమని 120 పేజీలు కూడా లేని ఆ పుస్తకం నా మూడేళ్ళ విలువైన కాలాన్ని హరించి వేసింది. ఆ రచనని దాదాపుగా stillborn from the press అని చెప్పవచ్చు. డేవిడ్ హ్యూం తన పుస్తకం గురించి ఆ మాట చెప్పుకున్నాడని రేవతీదేవి ఒకచోట రాసుకుంది. కాంట్ రచనల నా సంకలనం, అనువాదం వెలువడ్డ పుష్కరకాలం తర్వాత, మొదటిసారి, ఒక సభలో ఒక పాఠకుడు ఆ పుస్తకం గురించి మాట్లాడటం నాకు ఆశ్చర్యాన్నీ, ఆనందాన్నీ కూడా కలగచేసింది. శ్రీనివాసరావు ఆ పుస్తకం గురించి మాట్లాడటంతో ఆగలేదు, తన యవ్వనకాలంలో ఆ పుస్తకం లభించి ఉంటే, తాను చలంగారి సౌందర్య దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి పెనగులాడుతున్నప్పుడు ఆ పుస్తకం దొరికిఉంటే, తన అన్వేషణ, అధ్యయనం మరింత సుసంపన్నమై ఉండేవన్నాడు.

కాంట్ రచనలనుంచి ఎంపికచేసి అనువదించాక, ఆ సంకలానికొక ముందుమాట రాస్తే బాగుణ్ణనుకున్నాను. కాని Cambridge Companion to Kant సంపుటానికి పాల్ గుయెర్ అనే కాంట్ పండితుడు రాసిన ముందుమాట చదివాక దాన్ని యథాతథంగా అనువదించి నా సంకలానికి కూడా ముందుమాటగా పెట్టుకున్నాను. అయినా ఇంకా ఏదో మరొక వ్యాసమో, వాక్యమో కావాలనిపించింది. అప్పుడు దొరికింది, సాంఖ్యసూత్రాల్లోని ఒక వాక్యం: ‘తతః ప్రకృతే’ (దానివల్ల మాత్రమే ప్రకృతి బోధపడుతున్నది) అనే సూత్రం. ఆ మాటలు నా సంకలనానికి ప్రవేశవాక్యంగా పెట్టుకున్నాను. శ్రీనివాస రావు ఆ వాక్యాన్ని పట్టుకోవడం, ఆ తత్ అనే దాని గురించి వివరిస్తూ, కాంట్ చెప్పిన thing in itself గా దాన్ని గుర్తిస్తూ, చలంగారి సౌందర్యం దృక్పథం కూడా ఆ ‘తత్ ‘ చుట్టూతానే పరిభ్రమిస్తుందని చెప్పడం నన్ను నివ్వెరపరిచింది. ఇటువంటి జిజ్ఞాసువులున్నారని తెలిస్తే ఇటువంటి కృషి మరికొంత చేసి ఉండేవాణ్ణి కదా అనిపించింది.

ఇక కబీరు కవిత్వానికి నా అనువాదాన్ని ఆయన కవిత్వంలో భాగంగా కాకుండా, తత్త్వశాస్త్ర అనువాదాల్లో భాగంగా చూడటం మరొక పులకింత.

సీతారాం నా కవిత్వ సంపుటాల్లో ఇటీవలి మూడు సంపుటాలూ, ‘కోకిల ప్రవేశించే కాలం’, ‘నీటిరంగుల చిత్రం’, ‘కొండమీద అతిథి’ లోని కవిత్వాన్ని ఆధారం చేసుకుని ప్రసంగించాడు. ఆయన మాట్లాడుతున్నంతసేపూ నా గుండె కరిగి నీరయిపోతూనే ఉంది. కవిత్వం ఒక కరెంటు తీగ. కవి ఆ తీగకు ఒక కొసన స్విచ్చినొక్కుతాడు. మరొక కొసన పాఠకుడి సహృదయం బల్బులాగా వెలగకపోతే ఆ కరెంటు ప్రవాహం ఆగిపోయినట్టు, ఆ వైరింగు పాడయిపోయినట్టు. అలాకాక, ఒక కవిత చదవగానే పాఠకుడి హృదయం వంద కాండిల్సు ప్రకాశంతో వెలిగినట్టయితే, ఆ విద్యుత్ ప్రవాహం తెంపులేకుండా సంపూర్తిగా ప్రవహించినట్టు. ఆ శోభాయమాన, ఆ జాజ్జ్వల్యమాన కాంతిధారని చూడటంకన్నా మించిన ఆనందం ఏ కవికైనా మరొకటేముంటుంది కనుక?

రాజగోపాల్ నా సాహిత్య విమర్శ సంపుటాలు, ‘సహృదయునికి ప్రేమలేఖ ‘, ‘సాహిత్యమంటే ఏమిటి ‘, ‘సాహిత్య సంస్కారం’, ‘దశార్ణదేశపు హంసలు’ నాలుగింటిపైనా ఎంతో విపులంగానూ, ఎంతో ఉద్వేగంతోనూ మాట్లాడటానికి సంసిద్ధులై వచ్చారుగాని, నా ప్రసంగానికి టైము మిగల్చడం కోసం, చాలా వరకూ క్లుప్తంగానే, తనని తాను నియంత్రించుకుంటూ మాట్లాడేరు. తన ప్రసంగంలో ఆయన హెరాల్డ్ బ్లూమ్ ను పదే పదే గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఇంగ్లీషు సాహిత్య విమర్శకుల్లో అగ్రగణ్యుడైన బ్లూమ్ తో నన్ను పోల్చే సాహసం కూడా చేసారు. కాని నేను నా ప్రతిస్పందనలో ఆ భావాన్ని సవరించేను, బ్లూమ్ ని చదువుతున్నప్పుడల్లా, మా మాష్టారు శరభయ్యగారే గుర్తొస్తారనీ, బ్లూమ్ నాకు ఎన్నటికీ, ఆరాధించదగ్గ ఒక కొండగుర్తు మాత్రమేననీ, ఆ దిగంతరేఖను నేను నా జీవితకాలంలో అందుకోలేననీ కూడా విన్నవించుకున్నాను.

నా ప్రతిస్పందనలో నేను చాలా విషయాలే మాట్లాడేను. చాలా సేపే మాట్లాడేను. ముఖ్యంగా నేనింతదాకా రాసిన వాటి గురించి కాక, రాయాలనుకున్నవాటి గురించి మాట్లాడేను. మొదటిది, ‘ఆత్మాన్వేషణ ‘. అది భారతీయ తత్త్వశాస్త్రానికి మాత్రమే పరిమితం చెయ్యొద్దనీ, చీనా, జపాన్, మధ్యప్రాచ్య, ఆఫ్రికన్ చింతనాధోరణులకి కూడా విస్తరింపచెయ్యమని శ్రీనివాసరావుగారూ, వెంకటనారాయణ గారూ కూడా అడిగారు.

రెండవది, నవలలు, నాటకాలూ రాయడం గురించి.

నేను నాటకం గురించి ఎక్కడా మాట్లాడకపోయినా, విస్తారంగా రాయకపోయినా, నాటకప్రక్రియ గురించిన ఆలోచనల్తో నా హృదయం సదా రగిలిపోతూనే ఉంటుందని చెప్పాను. నేను ఇంగ్లాండు వెళ్ళినప్పుడు, ఆస్కార్ అవార్డు వచ్చిన సినిమాకి పట్టుమని పదిమంది ప్రేక్షకులు కూడా లేకపోవడం, అదే మార్క్ రావెన్ హిల్ అనే ఒక ప్రయోక్త ప్రదర్శించిన ఒక పోస్ట్ మాడర్న్ రూపకాన్ని చూడటానికి హాలంతా కిక్కిరిసిపోవడం గుర్తుచేసుకున్నాను. తెలుగునేల మీద నాటకప్రదర్శనలు చూడటానికి ప్రేక్షకులు కిక్కిరిసిపోతూ, సినిమాహాళ్ళల్లో మొదటి రోజు కూడా హాలు ఖాళీగా ఉండే రోజు రావడానికి నేనేం చెయ్యాలో అదంతా చెయ్యాలనే ఒక తపన నన్ను కాల్చేస్తూ ఉంటుందని కూడా చెప్పుకొచ్చాను. సినిమా తో నాకు పేచీ లేదు. సినిమా ఒక mass ritual అని ఋత్విక్ ఘటక్ అన్నాడని నాకు గుర్తే. కాని అది mass ritual మాత్రమే. నాటకం ఒక civic ritual. నాటక రచన, ప్రదర్శన, వీక్షణం మూడూ అత్యున్నతస్థాయి రసజ్ఞతా చిహ్నాలు. ప్రాచీన గ్రీకు నగరాల్లో నాటకాలు ప్రదర్శించినంతకాలం అక్కడ ప్రజాస్వామ్యం వర్ధిల్లిందనీ, ఆ స్థానంలో నాటకాలకి బదులు ఒకరినొకరు నరుక్కునే గ్లాడియేటర్లను చూడటానికి రోమన్ ప్రజలు గుమికూడగానే ప్రజాస్వామ్యం అంతరించి నియంతృత్వం నెలకొనిందనీ ఎడిత్ హామిల్టన్ రాసిందని కలాం తన ఆత్మకథలో రాసుకున్నాడు. నాటకం ఒక సభ్యత, ఒక సంస్కృతి, ఒక పౌర సంస్కారం, ఒక సామూహిక క్రతువు, ఒక సౌందర్యసృజన.

సమావేశం ముగిసి ఇంటికి వచ్చాక నా మనసులో సంతృప్తికి బదులు చెప్పలేనంత ఆరాటమే రాత్రంతా.

చెయ్యవలసింది చాలా ఉంది. చేసింది చాలా స్వల్పం.

7-7-2019

Leave a Reply

%d bloggers like this: