రేడియం తవ్వితీయడం

Reading Time: 4 minutes

పీటర్ వాషింగ్ టన్ సంకలనం చేసిన Russian Poets (2009) ఒక పఠనం పూర్తయింది. దాదాపు 250 ఏళ్ళ ఆధునిక రష్యన్ కవిత్వం నుంచి ఏరి కూర్చిన మేలిమి అనువాదాల సంపుటి. దిమిత్రీ ఒబొలెన్స్కీ సంకలనం చేసిన The Heritage of Russian Verse (1962), యెవెగ్నీ యెవ్తుషెంకో సంకలనం చేసిన 20th Century Russian Poetry: Silver and Steel (1993) లాగా విస్తృతం, సమగ్రం కాకపోయినప్పటికీ, ఈ సంకలనం చదువుతుంటే రష్యన్ కవితాత్మతో ముఖాముఖి కొద్దిసేపు మాట్లాడుకున్నట్టే ఉంది.

తన సంకలనంలో సుప్రసిద్ధులైన మహాకవులే కాక, అంతగా సుప్రసిద్ధులు కాని కవుల్ని కూడా కొందరిని చేర్చాననీ, తన ఎంపికకి అనువాదాల నాణ్యత ప్రధానమైన కొలబద్దగా పెట్టుకున్నాననీ సంకలనకర్త చెప్పుకున్నాడు: సంకలనంలోని దాదాపు 176 కవితల్ని అతడు ఆరుభాగాలుగా పొందుపరిచాడు. ‘కవిత్వదేవత’, ‘స్వదేశం’, ‘నల్లనేల’, ‘కలలుగనడం’, ‘ప్రేమ’, ‘కాలం’.

రష్యా అంటే మనకు తెలిసిన డిసెంబరిస్టుల తిరుగుబాటు, బోల్షివిక్ విప్లవం, స్టాలిన్ గ్రాడ్ పోరాటం, పెరిస్త్రోయికా, గ్లాస్ నాస్త్ ల్ని కీర్తిస్తూనో, వ్యతిరేకిస్తూనో రాసిన కవిత్వం కాదిది. కాని, ఆ మహా చారిత్రిక-రాజకీయ పరిణామాలు సంభవించి ఉండకపోతే, ఈ కవిత్వం ఇలా ఉండి ఉండేది కాదు.

ఈ కవితల్లో కవి కొన్ని సార్లు ఏకాకి, కొన్ని సార్లు మహాసాంఘికుడు, కొన్ని సార్లు కైదీ, కొన్ని సార్లు స్వేచ్ఛాగాయకుడు. రష్యాలో కవిత్వం ఒక జీవన్మరణ సమస్య అన్నాడు యెవ్తుషెంకో. ఈ సంకలనంలోని మహాకవులంతా మృత్యువుతో ముఖాముఖి నిలబడి కవిత్వం చెప్పినవారే.

ఆధునిక రష్యాకి తన సుఖదుఃఖాల్ని నోరారా చెప్పుకోడానికొక భాషని అనుగ్రహించిన పుష్కిన్ తన 38 వ ఏట ఒక ద్వంద్వ యుద్ధంలో మరణించాడు. అప్పణ్ణుంచీ ప్రతి రష్యన్ మహాకవినీ అకాలమరణం, అల్పాయుష్కతా వెన్నాడుతూనే ఉన్నాయి. పుష్కిన్ తర్వాత చెప్పదగ్గ మరొక మహాకవి లెర్మంటోవ్ తల్లికడుపునించి కాక, పుష్కిన్ గుండెలో దిగిన బుల్లెటుకి పుట్టాడు అని రాసాడు యెవ్తుషెంకో. పుష్కిన్ మరణం మీద రాసిన కవితతో లెర్మంటోవ్ రష్యన్ కవిత్వంలో అకస్మాత్తుగా ఉదయించి, తాను కూడా 27 ఏళ్ళు నిండకుండానే ఒక ద్వంద్వ యుద్ధంలో మరణించాడు. సింబలిస్టుల్లో అగ్రేసరుడిగా చెప్పదగ్గ అలెక్సాండర్ బ్లాక్ తన 41 వ ఏట సరైన వైద్యం అందక, వైద్య సదుపాయానికి ప్రభుత్వం అనుమతించక మరణించాడు. సింబలిస్టుల మీద ప్రతిఘటనగా ఏక్మెయిస్టు ధోరణిని వ్యాప్తిలోకి తెచ్చిన మరొక కవి గుమిలెవ్ ను బోల్షివిక్కులు కాల్చి చంపేసారు. స్టాలిన్ యుగపు మహాకవుల్లో ఒకరైన ఓసిప్ మెండల్ స్టాం స్టాలిన్ కి వ్యతిరేకంగా కవిత రాసాడన్న కారణం వల్ల సైబీరియాలో నిర్బంధ ప్రవాసంలో దయనీయ పరిస్థితుల్లో అనామకంగా మరణించాడు. మరొక మహనీయ కవయిత్రి మరినా త్వ్సెతయేవా తిండిలేక, పిల్లల్ని పోషించుకోలేక, కొన్నాళ్ళుగా ప్రవాసిగా బతకడానికి ప్రయత్నించి అది కూడా సాధ్యం కాక ఆత్మహత్య చేసుకుంది. ఇరవయ్యవ శతాబ్దపు రష్యన్ మహాకవుల్లో అగ్రగణ్యుడైన వ్లదిమీర్ మయకోవస్కీ 37 ఏళ్ళు నిండకుండానే తనను కాల్చుకున్నాడు. నిజమైన రష్యన్ కవి, గ్రామీణ రష్యాకి ప్రతిబింబం అని చెప్పదగ్గ సెర్గీ యెసెనిన్ తన 30 వ ఏట, ఒక హోటల్లో, తన మణికట్టు కోసుకుని, ఆ రక్తంతో, తన చివరికవిత రాసి మరణించాడు. పాస్టర్ నాక్ నీ, అనా అఖ్మతోవానీ మృత్యువు నేరుగా తలుపు తట్టకపోయినా, పాస్టర్ నాక్ భార్యాబిడ్డల్నీ, అక్మతోవా కొడుకునీ ప్రభుత్వం నిర్బంధించినందువల్ల, వారు మరణాన్ని మించిన నరకయాతన అనుభవించవలసి వచ్చింది.

దేశాన్ని ప్రేమించినందుకూ, రాజ్యాన్ని వ్యతిరేకించినందుకూ మృత్యువుని కావలించుకోవలసి రావడమే రష్యన్ కవిత్వ చరిత్ర. అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని పారిస్ నుంచి తెచ్చిన శకలాలతో నిర్మించారు, రష్యన్ స్వేచ్ఛా దేవత శిల్పం రష్యన్ కవిత్వంతో రూపొందింది అని రాసాడు యెవ్తుషెంకో. పుష్కిన్ మొదలుకుని ప్రతి ఒక్క రష్యన్ కవీ, అంతిమంగా, దేన్ని పట్టించుకున్నాడు, దేన్ని గానం చేసాడు, దేని కోసం ప్రాణత్యాగం చేసాడు అని చూస్తే, అతణ్ణి చలింపచేసినవి, రష్యన్ కవిత్వం, రష్యన్ నేల, రష్యన్ మానవసంబంధాలు మాత్రమే.

తుపానుల్లాగా మహాపరిణామాలు తరలిపోయిన తర్వాత గుర్తుంచుకోదగ్గ కవిత్వమేదని ఒక సంకలనకర్త చరిత్రపుటల్ని ఒక్కొక్కటీ తిరగేసి ఏరి కూర్చిన సంకలనమిది అని తెలిసిరావడంలో గొప్ప స్ఫూర్తి ఉంది. కవిత్వమంటే రేడియం తవ్వితీయడమని (poetry is like mining radium) అన్నాడు మయకోవస్కీ. For every gram you work for a year అని కూడా అన్నాడు. ఆ కవిత్వ రేడియో ధార్మికత వాళ్ళ జీవితాల్ని ఎంతగా తినేస్తుంటే వాళ్ళ హృదయాలంత ధగధగాయమానంగా వెలిగేయని ఈ సంకలనం పొడుగునా నాకు తెలుస్తున్నది.

రష్యన్ కవిత్వం ప్రధానంగా syllabic-accentual verse. అంటే మాత్రాబద్ధ ఛందస్సుల్లో పాటల్లాగా పాడుకోదగ్గ కవితలు. మొత్తం ఛందస్సులన్నీ కలిపి ప్రధానంగా అయిదు రకాలు. తెలుగు కవిత్వంలో ఉన్న ఛందస్సుల్తో పోలిస్తే ఇవి శతాంశం. కాని ఆ కొద్దిపాటి ఛందోవైవిధ్యంతోనే వాళ్ళు అగ్ని రగిలించారు, అమృతం కురిపించారు. తెలుగు దేశి ఛందస్సుల్లాగా రష్యన్ హృదయ స్పందనాన్నీ, ఉఛ్వాస నిశ్వాసాల్నీ నేరుగా పట్టివ్వగల గుణమేదో ఆ ఛందస్సుల్లో ఉంది. మహాప్రస్థానగీతాల్లాగా ఆ కవిత్వంలో భావాలు ఎంతముఖ్యమో, ఆ సంగీతం,ఆ లయా కూడా అంతే ముఖ్యం.

రష్యన్ నవల చదివితే మనకొక పట్టణంలో అడుగు పెట్టినట్టుంటుంది. పందొమ్మిదో శతాబ్ది రష్యన్ మహారచయితలంతా సెంటే పీటర్స్ బర్గ్ వీథుల్లోనే తచ్చాడుతున్నట్టుంటుంది. కాని, ఈ కవిత్వం చదివితే నాకొక రష్యన్ గ్రామానికి వెళ్ళినట్టూ, ఒక రష్యన్ గ్రామీణ కుటుంబానికి అతిథిగా ఒక రాత్రి వాళ్ళ మధ్యనే గడిపినట్టూ అనిపించింది.

చారిత్రిక రాజకీయ మహోద్యమాల మధ్యలో నిల్చొని ప్రజలకి పిలుపునిచ్చినప్పటికన్నా తన ఊళ్ళో, తన ఇంట్లో వెచ్చని నెగడి ముందో, లేదా ప్రవాసిగా జీవించవలసివచ్చినప్పుడు తన స్వగ్రామాన్నో, స్వజనాన్నో తలుచుకున్నప్పుడో రష్యన్ కవి మరింత స్వాభావికంగానూ, ప్రేమాస్పదుడిగానూ ఉన్నాడు. తన తల్లిని తలుచుకుంటూ, ఆంద్రే వోజెన్సెన్స్కీ there may be other Russias, this one is the best I know అని అంటున్న్నపుడు, ఆ మాట ప్రతి రష్యన్ కవికీ వర్తించే మాటగానే వినిపిస్తుంది.

ఫ్రెంచి మాట్లాడటమే ఆధికారిక చిహ్నంగా గడిచిన పద్ధెనిమిదో శతాబ్దంలో పుష్కిన్ రష్యన్ భాషని కవిత్వభాషగా మార్చేసాడు. రాత్రికి రాత్రి అతడు రష్యన్ జాతిగా మారిపోయేడు అని రాసాడు డోస్టెవిస్కీ. పుష్కిన్ ‘మాటలనియెడు మంత్రమహిమ’ ఎలా ఉంటుందో ఈ కవితలో చూడొచ్చు.

~

శాశ్వత స్మారకం

నేను నాకోసమొక స్మారకచిహ్నాన్ని నిర్మించుకున్నాను
కానీ చేతుల్తో కాదు, ఆ దారి నలుగురూ నడిచిందేగాని
మరీ నలిగిపోయింది కాదు, ఆ స్మారకస్తూపం
అలెగ్జాండర్ విజయస్తంభంకన్నా మరింత ఎత్తైనది.

నేను సంపూర్తిగా మరణించబోను. నా కవిత్వవీణ ద్వారా
నా ఆత్మ మృత్యుధూళిని, వినాశనాన్ని దాటి బతుకుతుంది,
ఎంతకాలం చంద్రాలంకృత గగనం కింద ఒక కవి నిలుస్తాడో
అంతకాలం నా యశోచంద్రికలు లోకమంతా ప్రసరిస్తాయి.

మహోన్నత రష్యన్ సీమ సమస్తం నా గీతాలు ప్రతిధ్వనిస్తాయి,
అసంఖ్యాకులైన నా జాతిజనులు నా పాటలు పాడుకుంటారు.
స్లావిక్ జాతి గర్వించే సంతతిని, ఫిన్నిష్ ప్రజల బంధువుని
స్టెప్పీ బయళ్ళ టుంగూ, కాల్మైక్ సంచార జాతుల మిత్రుణ్ణి.

రానున్న శతాబ్దాల తరబడి నా ప్రజలు నన్ను ప్రేమిస్తారు,
నా తంత్రులమీంచి కోమలగంభీరభావాలు మేల్కొల్పినందుకు,
నిష్ఠుర క్రూరకాలంలో స్వేచ్ఛని ఘనంగా పైకెత్తినందుకు
పతితమానవకోటికోసమించుక దయాభిక్ష యాచించినందుకు.

కవిత్వదేవతా, ఈశ్వర దివ్యాదేశం మదిన మరవకు
అవమానానికి భీతిల్లకు, కిరీటానికి వెంపర్లాడకు
దూషణభూషణాల పట్ల ఉత్సాహం చూపించకు
అన్నిటికన్నా ముఖ్యం, మూర్ఖులతో వాదించకు.

~

ఇది ఒక కవి మహోన్నత ప్రమాణాలతో కాలం ఎదట నిలబడి యుగకర్తలాగా పలికిన కవిత. ప్రతి సాహిత్య చరిత్రలోనూ తొలిదశ కవులకి ఈ అదృష్టం లభిస్తుంది. కవి ఒక ప్రబోధకుడిగా, ఒక వైతాళికుడిగా మాట్లాడే అవకాశం. ఆ సాహిత్యం ఒక దశకు చేరుకున్నాక కూడా కవులు అలాగే మాట్లాడితే ఆ మాటలు బోలుగా మారిపోతాయి. ఏ కవికైనా ఒకసారి ఈ మెలకువ కలిగాక అతడు ఇంకెంతమాత్రం ఇటువంటి గంభీర భాష మాట్లాడడు. అప్పుడతడు జీవితపు చిన్ని చిన్ని సంతోషాలనీ, తన ప్రేమల్నీ, వియోగాల్నీ స్మరణయోగ్యమైన కవిత్వంగా మారుస్తాడు. మృత్యువు తలుపు తట్టినప్పుడు చెప్పవలసిన చివరిమాటల్ని కూడా వీలైనంత understated గానే చెప్పుకుంటాడు. సెర్గీ ఎసెనిన్ తన రక్తంతో రాసుకున్న ఈ చివరికవితలోలానే:

~

చివరి పంక్తులు

మిత్రమా, ఇక సెలవు, సెలవు, ప్రియతమా
నా హృదయంలో నిన్ను భద్రంగా నిలుపుకుంటాను.
ముందే నిశ్చయమైన ఈ వీడ్కోలు
మనం మరోసారి కలుసుకుంటామని వాగ్దానం చేస్తున్నది.

చేతులు కలపకుండానే
నోరారా సెలవు తీసుకోకుండానే
వీడ్కోలు, మిత్రమా, ప్రస్తుతానికి.
ఇంక నిన్ను విసిగించను, వేసటపెట్టను.
మరణించడమేమంత కొత్తవిషయం కాదు
ఆ మాటకొస్తే, బతకడంలోనూ ఏమంత కొత్తదనం లేదు.

~

ప్రతి ఏటా కవులు వేలాదిగా కవితలు రాస్తుంటారు. కాని కాలం తాకిడికి తట్టుకుని నిలబడేవి ఏవని చూస్తే, ఇదిగో, తన తల్లి గురించి ఆంద్రే వోస్నె సెన్స్కీ రాసుకున్న ఈ కవితలాంటివే అనిపిస్తుంది.

~

అమ్మ

నీ రెక్కల కింద భద్రంగా కాపాడు కాలమా, తన చిన్న గృహంలో,
మా అమ్మని, ‘ఆంటొనినా సెర్గీవ్నా వోజ్ఞె సెన్స్కయా నె పస్థూషికానా’ని.

తెల్లవారుతూనే ఆ కిటికీ మీద చిన్ని పిచుక వాలి ఆమెని పలకరించాలి
‘అంటొనినా సెర్గీవ్నా వోజ్ఞె సెన్స్కయా నె పస్తూషికానా’కి శుభాకాంక్షలు చెప్పాలి.

కాలంతాకిడి తట్టుకు నిలబడటానికి వాళ్ళ నాన్న ఆమెకో పేరుపెట్టాడు,
అన్నిసార్లూ కాకపోయినా దురదృష్టాలు ఆమెని చాలాసార్లే కనికరించాయి.

గడ్డు జీవితం, పూలు, పండ్లూ లేని చెట్లు, రెండు మహాయుద్ధాలు
వాటిమధ్యనే ఆమెకొక కూతురు, నటాలియా ఆంద్రీవ్నా, ఒక కొడుకూను.

నదీతీరం మీద ఆకసంలో ఎగిరే అడవిబాతుల గుంపులు చూపిస్తో
తనపిల్లలిద్దరికీ కానుక చేసిందామె కలకాలం ముత్యాలసరాల్ని.

కవులంటే, కావ్యాలంటే ఇష్టపడ్డ ఆమె రొట్టెల కోసం పిండికలిపే దృశ్యం-
మరెన్నో రష్యాలు ఉండి ఉండవచ్చుగాక, నాకు బాగా తెలిసిన రష్యా ఇదే.

టివి చూస్తూనే భయపడేది, ‘అమెరికా వెళ్ళొద్దు నాన్నా, వాళ్ళు
నిన్ను బతకనివ్వరు, నా బంగారు తండ్రీ, వెళ్ళవు కదా’ అనేది.

జీవితమ్మీద చెక్కుచెదరని నమ్మకంపెట్టుకున్నస్త్రీలందరికీ లభించాలి,
ఆశీసులు, ‘అంటొనినా సెర్గీవ్నా వోజ్ఞె సెన్స్కయా నె పస్తూషికానా’ వి.

15-5-2019

Leave a Reply

%d bloggers like this: