
‘నువ్వు రుద్ర పశుపతి కథ విన్నావా’ అనడిగారు మా మాష్టారు. అప్పుడు నా వయస్సు ఇరవయ్యో, ఇరవయై ఒకటో.
నేనాయన సన్నిధిన విశ్వనాథ వారి నాటకాలు చదవడానికి కూచున్నాను. నా చేతిలో ‘త్రిశూలం’ ఉంది. బసవణ్ణ కథానాయకుడుగా విశ్వనాథ రాసిన నాటకం అది. మొదటి పేజీ కూడా ఇంకా తెరవలేదు. ఆ పుస్తకం చూస్తూనే మాష్టారు ‘ఉమ మీరు చూచుచు ఊరుకున్నారా’ అనే గీతం ఎత్తుకున్నారు. శివుడు విషం తాగాడని విన్నప్పుడు రుద్రపశుపతి అనే పిల్లవాడు పార్వతీదేవినీ, సమస్త దేవతల్నీ ప్రశ్నిస్తూ పాడే పాట అది. ఆ పాట ఎత్తుకుంటూనే ఆయన నన్నడిగిన మొదటి ప్రశ్న; ‘నువ్వు బసవపురాణంలో రుద్రపశుపతి కథ చదివావా?’ అని. గురువు సన్నిధిన మహాకావ్యాలు చదువుకునే అదృష్టానికి నోచనివాణ్ణి. బసవపురాణం పుస్తకమయితే చూసాను, కాని, అప్పటికి చదవలేదు.
తల అడ్డంగా ఊపాను.
అప్పుడాయన ఆ కథ చెప్పుకొచ్చారు. తన మాటల్లో. ఆ కథ చెప్పడం పూర్తయ్యేటప్పటికి ఆయన్ని వివశత్వం ఆవహించింది. కళ్ళు ఎర్రబారిపోయాయి. ఆ నాటకం తెరవని మొదటిపేజీ దగ్గరే ఆగిపోయింది.
పాల్కురికి సోమన ‘బసవపురాణం’ లో మూడో ఆశ్వాసంలోని ఆ కథ నా మాటల్లో:
~
అయ్యళ అనే ఊరిలో రుద్రపశుపతి అనే భక్తుడుండేవాడని నీకు తెలుసు కదా. ఒక రోజు అతడు ఆదిపురాణంలోని సముద్రమథన కథని ఒక కథకుడు చదవగా వింటున్నాడు. ఆ మథనంలో హాలాహలం పుట్టి లోకాలన్నిటినీ దహిస్తుంటే,బ్రహ్మా, విష్ణువూ, దేవతలూ, దైత్యులూ కూడా కాలికి బుద్ధి చెప్పి పరుగులు తీస్తుంటే, కరకంఠుడు ఆ గరళాన్ని ఆరగించాడని చెప్పడం వింటూనే రుద్రపశుపతి ‘ఏమన్నారు, నిజమా, భర్గుడు విషాన్ని ఆరగించాడా’ అనడిగాడు.
‘సందేహమేముంది? హరుడు విషం తాగడమైతే నిజం, ఆ తర్వాత ఆయనకేమైందో నాకు తెలియదని’ ఆ కథకుడు చెప్పగానే మిన్ను విరిగి మీద పడ్డట్టై ‘అయ్యో, నాశనమైపోయాను’ అంటో ఆ రుద్రపశుపతి నేల మీద పడి దొర్లుతూ ‘అయ్యో, విశ్వేశా, నిన్ను వెర్రివాణ్ణి చేసారయ్యా, ఎంత వెర్రివాళ్ళయినా గాని విషం తాగుతారటయ్యా, విషం తాగి బతగ్గలరా? ఇదెలాగ వినడం? విన్నాక ఏమి చెయ్యాలి? నువ్వు తప్ప నాకు మరెవ్వరూ తెలియరే, నువ్వు లేకపోతే నాకు మరో దిక్కు లేదే. పినాకీ, నా కోసమైనా ఈ విషం మింగకు. నీకు మొక్కుతాను, దయచేసి ఉమ్మెయ్యి. ఆయన మేనులో సగం నువ్వే ఉన్నావే, ఓ గౌరీ, నువ్వెక్కడికి పోయావు? నీక్కూడా తెలియదా? ప్రమథగణాల్లారా, పరమాప్తులారా, ఆయన మరణిస్తే మీరింక బతగ్గలరా? శతరుద్రులారా, అసంఖ్యాతులారా, పార్వతీపతిని కాపాడండయ్యా! వీరభద్రయ్యా, మన ప్రాణేశుడు ఆ విషం తిన్నాడే, ఇంకేం కాబోతుందో? ఓ పురాతనులారా, మన రేడు బతుకుతాడంటారా? ఆయన పూనుకుని మరీ విషం తిన్నాడు. మన సద్గురునాథుణ్ణి చావునుంచి తప్పించరా! ఆయన్ని దీవించరా! శివుణ్ణి కాపాడరా! తల్లిలేని పిల్లవాణ్ణెవరైనా పట్టించుకుంటారా? తల్లి ఉండి ఉంటే విషం తాగనిచ్చి ఉండేదా? పరమేశ్వరుడుగాని ఇప్పుడు బతికాడా, ఇంక ఆయనకి మరణమే ఉండదు కదా’ అని ప్రలాపిస్తూ, పిచ్చిమాటలు మాటాడుతూ ‘ఇంక నేను మరో మాట వినలేను, ఇప్పుడే ప్రాణాలు విడిచిపెట్టేస్తాను’ అంటో ఒక్క క్షణం కూడా ఆగకుండా అక్కడున్న పెద్దకొలనులో దూకబోగా, హరుడు ప్రత్యక్షమై అతణ్ణి పడిపోకుండా పట్టుకున్నాడు.
ఆయనతో పాటు పార్వతీదేవి, ప్రమథులు, రుద్రులు, దేవతలు, దైత్యులు వెన్నంటి నిలబడగా ‘నీకేమి కావాలి చెప్పు , నువ్వేమి కోరితే అదిస్తాను ‘ అనడిగితే, గొప్ప సంభ్రమంతో ఆ పిల్లవాడు తామరపూవుల్లాంటి ఆ మృడుపాదాలమీద పడి ‘నాకేమీ వద్దు, నువ్వు విషం తాగావే అది నీకేం చేస్తుందో అన్నదే నా భయం, నేనింకేమీ వినలేను, ఆ కాలకూటాన్నిప్పుడే ఉమ్మెయ్యి, అప్పుడు గాని నువ్వు నిజంగా నన్ను దయతలిచినట్టు కాదు’ అన్నాడు.
అప్పుడు తన పెదాల కాంతి పదిదిక్కులా వ్యాపిస్తుంటే, వింతనవ్వు నవ్వుతూ, పశుపతి ఆ రుద్రపశుపతితో అన్నాడు కదా ‘ఇదేమంత పెద్ద విషయం కాదు. ఉమ్మడానికిగాని, మింగడానికి గాని, అదేమంత పెద్ద విషం కాదు. ఏదో అణువంత నా కంఠంలో చిక్కింది. దాన్ని పట్టించుకోవలసిన పనిలేదు. దీనిగురించి నువ్వెందుకింత బాధపడుతున్నావు ‘ అని అన్నాడు.
‘పినాకీ, నీ మాటలు నమ్మలేను , ఈ విషం రవ్వంతయినా నీ కడుపులో దిగితే ఆ తర్వాత వార్త నేను వినలేను. అందుకని ముందు నేనే చచ్చిపోతాను. నన్ను చావొద్దంటావా, అయితే, ఆ విషమిప్పుడే ఉమ్మెయ్యి, మరో మాట చెప్పకు, తక్కిన మాటలు నేను వినలేను’ అంటో తెగువతో అతడట్లా మాటాడుతుండగా, ‘అయ్యో, ఆ విషం ఉమ్మెయ్యకపోతే ఆ పిల్లవాడెక్కడ చచ్చిపోతాడో’ అని ఉమాదేవి మనసులో ఉలికిపడుతుండగా, ‘ఆ విషంగాని ఆయన ఉమ్మేస్తే అది తమనెక్కడ కాలుస్తుందో’ అని విష్ణువుతో సహా దేవతలంతా గడగడ వణుకుతుంటే, ప్రమథులు ఆ పిల్లవాడి భక్తిని అమిత మహోత్సాహంతో చూస్తూ ఉండగా, ఆ ఉడురాజధరుడు అతణ్ణి వెంటనే పైకి లేవనెత్తి, కౌగిలించుకుని, ‘ప్రమథుల మీద ఒట్టు, నీ పాదాల మీద ఒట్టు, ఈ విషాన్ని మింగనే మింగను, నిజం చెప్తున్నాను, నమ్మనంటవా, ఇదిగో, నా ఎడమతొడమీద కూచుని నన్నే చూస్తూండు’ అంటో ఆ అతణ్ణి తన ఊరుపీఠం మీద కూచోబెట్టుకున్నాడు.
అమాయకత్వానికి అంతేమున్నది?
అందుకని తన కరవాలం దూసి తన కుత్తుకకి మొనపెట్టుకుని, ‘ఆ హాలాహలం గాని, నీ కుత్తుక దిగిందా, నా కుత్తుక పొడుచుకుని చచ్చిపోతా’నంటో, రెప్పవేయకుండా ఆ పశుపతితొడమీదనే ఇప్పటికీ ఆ రుద్రపశుపతి కన్నార్పకుండా కాపుకాస్తున్నాడు.
~
ఇందులో మతాన్ని పక్కన పెట్టండి, పశుపతీ, రుద్రపశుపతీ ఇద్దరూ నిజంగా ఉన్నారా లేరా అన్నది పక్కన పెట్టండి. కానీ, నిజంగా అట్లా నమ్మగలుగుతున్నామా మనం దేన్నయినా, మన స్నేహాల్నైనా, మన సిద్ధాంతాల్నైనా, చివరికి మన హృదయస్పందనల్నైనా?
3-3-2019
Painting: Shiva drinking poison, Nandalal Bose