
చాలా ఏళ్ళ కిందటి సంగతి. ఇంటర్ చదువుతున్న రోజులు కావచ్చు. ప్రతి వేసవిలోనూ సెలవులకి ఇంటికి వెళ్ళినప్పుడు, అప్పుడే మా నాన్నగారికి జమాబందీ కూడా ఉండేది. నేనాయనకి కరణీకం లెక్కలు రాసిపెడుతూ ఉండేవాణ్ణి. గ్రామరెవెన్యూ రికార్డులు, పన్ను లెక్కలు రాసి పెట్టేవాణ్ణి. అందుకని ఆయనతో పాటు జమాబందీకి నన్ను కూడా తీసుకువెళ్తుండేవారు. అప్పట్లో మాది యెల్లవరం తాలూకా. తహసీల్దారు కార్యాలయం అడ్డతీగలలో ఉండేది. అప్పటికి అడ్డతీగల చాలా చిన్న గ్రామం. మేమక్కడే తాసిల్దారు కార్యాలయం అరుగుల మీదనే లెక్కలు రాసుకుంటూ, అక్కడే పడుకుంటూ ఉండేవాళ్ళం. మధ్యాహ్నం పూట ఏ కొంత విరామం దొరికినా ఆ ఊళ్ళో ఉండే బ్రాంచి లైబ్రరీకి వెళ్ళి అక్కడ పుస్తకాలు తిరగేస్తుండేవాణ్ణి.
అలాంటి రోజుల్లో ఒకరోజు ‘కథాభారతి: హిందీ కథలు’ పుస్తకం దొరికింది. నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళ ప్రచురణ. అందులో ఒకటి రెండు కథలు చదివాక, ‘మూడో ఒట్టు’ అనే కథ చదవడం మొదలుపెట్టాను. అది ఫణీశ్వర నాథ్ రేణు అనే రచయిత రాసిన కథ. రేణు ‘మైలా అంచల్’ అనే తన నవలతో హిందీ సాహిత్యంలో రెండవ ప్రేమ చంద్ గా సుస్థిరుడైన రచయిత. తూర్పు బీహార్ గ్రామీణ జీవితంలో మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ ఎంత వికృత రూపం ధరించిందో అదంతా అద్వితీయమైన కథన సామర్థ్యంతో చెప్పుకొస్తాడు. ఆ నవలని కూడా నేషనల్ బుక్ ట్రస్ట్ ‘మలినాంచలము’ పేరు మీద తెలుగు అనువాదాన్ని ప్రచురించింది. కాని ఆ పుస్తకం నేనప్పటికి చదవలేదు. ఫణీశ్వర నాథ్ రేణు గురించి కూడా ఆ రోజుకి నాకేమీ తెలీదు. నా ముందున్న కథల పుస్తకంలో యాథాలాపంగా చదువుకుంటూ పోతో ‘మూడో ఒట్టు’ కథ చదవడం మొదలుపెట్టానంతే.
అదొక బండివాడి కథ. ఉత్తర బీహార్ లో నేపాల్ సరిహద్దుల్లో ఉన్న ఫార్బిస్ గంజ్ ప్రాంతానికి చెందిన హీరామన్ అనే ఒక బండివాడి కథ. అతడి బతుకు తెరువు అతడి ఎడ్ల బండినే. కాని ఆ దారిలో ఎదురయిన రకరకాల అనుభవాల వల్ల అతడు రెండు ఒట్లు పెట్టుకున్నాడు. మొదటిది, దొంగ సరుకు తోలకూడదని. నేపాల్లోని మోరంగ్ నుంచి ఫార్బిస్ గంజ్ కి ఒక సారి దొంగసరుకు తోలుతూ అతడు పట్టుబడే ప్రమాదం ఎదురయ్యింది. అతడికి జైలుకి వెళ్ళడానికి భయం లేదు. కాని తాను జైలుకి పోతే తన ఎడ్ల సంగతి? వాటినెవరు పట్టించుకుంటారు? మేతా నీళ్ళూ ఎవరు సమకూరుస్తారు? అందుకని సరిహద్దుల్లో అతణ్ణి పోలీసులు పట్టుకున్నప్పుడు వాళ్ళ కన్నుగప్పి ఎడ్లని బండినుంచి విప్పేసి పొదల్లోకి తోలేసాడు. తను కూడా వాటి వెనకే పరుగు లంకించుకున్నాడు. విలువైన బండి పోతే పోయింది. కాని అంతకన్నా ఎన్నో రెట్లు విలువైన ఎడ్లు దక్కాయి. మళ్ళా ఎప్పుడూ దొంగసరుకు బండిలో తోలకూడదని మొదటి ఒట్టు పెట్టుకున్నాడు. మరో సారి, వెదుళ్ళు వేసుకున్నాడు. అవి ముందు నాలుగు బారలు, వెనక నాలుగు బారలు ఉండటంతో బండి అదుపు తప్పింది. అప్పణ్ణుంచీ వెదుళ్ళ కిరాయి ఒప్పుకోకూడదని రెండో ఒట్టు పెట్టుకున్నాడు.
ఈసారి అతడి బండిలో ఒక ఆడమనిషి ఎక్కింది. ఆమె మధురా మోహన్ నౌటంకీ కంపెనీలో లైలా వేషం వేసే హీరాబాయి. నల్లదుప్పటి ముసుగు వేసుకుని ఆమె తన బండి ఎక్కబోతుంటే ముందామె దొంగసామానేమీ మోసుకు రావడంలేదుకదా అని అని అనుమానం వచ్చింది. ఆమె బండి ఎక్కింది. ఆ బండి తూర్పు తిరగ్గానే వెన్నెల బండిలో పడి ఆమె ముక్కుపుడక తళుక్కుమంది. బండివాడు హీరామన్ కి ఆమె శాకినీనో, డాకినీనో అని అనుమానం కలిగింది. బండి ప్రయాణం మొదలయ్యింది. వెన్నెల ఆమె మొహం మీద పూర్తిగా పడింది. ఆమె మనిషి కాదు, అప్సరస అనుకున్నాడు ఆ బండివాడు హీరామన్.
బండి నడవడం మొదలుపెట్టింది. తేగ్ చియా, నామ్ లగర్ దేవిడీ దాటింది. దేశవాళీ గుర్రాల మీద జనపనార సంచులు వేసుకుని వస్తున్న కోమట్లు ఎదురయ్యారు. తన బండిలో నౌటంకీ కంపెనీ నర్తకి ఉందని తెలిసాక హీరామన్ కి బిదేశియా, బల్ వాహీ, ఛోక్రా నాట్యాలు గుర్తొచ్చాయి. హీరామన్ కి ఇంకా పెళ్ళి కాలేదు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ నౌటంకీ చూడటానికి వెళ్ళ కూడదని తన వదిన గారి ఆజ్ఞ.
బండి తేగ్ చియా దగ్గర కజరీనది ఒడ్డున ఆగింది. నీళ్ళల్లో కూర్చున్న గేదెలు, వాటిమీద వాలిన కొంగలు. హీరామన్ బండి దిగి ఆ ఏటిలో మొహం కడుక్కుని వచ్చాడు. హీరాబాయి ని కూడా మొహం, కాళ్ళూ, చేతులూ కడుక్కుని రమ్మన్నాడు. ఆమె బండి దిగింది. అతడు ఆమె పాదాల వంక చూసాడు. అవి వెనుతిరిగిలేవని రూఢి చేసుకున్నాడు. అప్పుడు బండిలో కూర్చున్నాడు. బండిగూడులోకి తొంగి చూసాడు. ఒక సారి అటూ ఇటూ చూసి హీరాబాయి తలగడపై ముందుకు వంగాడు. సువాసన అతని శరీరాన్ని అలముకుంది. తలగడ మీదున్న పూలను తీసుకుని వాసన చూసాడు. ఒక్కసారిగా ఐదు చిలుంల గంజాయి పీల్చినట్టయింది.
బండి మళ్ళా ప్రయాణం మొదలుపెట్టింది. ఈసారి మరొకదారిన వెన్నెలదారిన, పూసిన పూలదారిన, విరగకాసిన సస్యాల దారిన బండి సాగడం మొదలయ్యింది. ఆ రాత్రి అతడిలో ఏదో తెలియని కొత్త ఉత్సాహం పరవళ్ళు దొక్కింది. ఒక పురాతన జానపద గీతం, మహివా ఘట వారిన్ అనే ఒక యువతి ప్రేమప్రయాణానికి సంబంధించిన పాట పాడటం మొదలుపెట్టాడు. ఆ పాట పాడుతూండగా అతడు తన చెమ్మగిల్లిన కండ్లను హీరాబాయ్ నుంచి దాచాలని ప్రయత్నించాడు. కాని హీరా అతని మనసులోనే కూర్చుని ఎప్పటినుంచో తనని చూస్తోంది. హీరామన్ కంపిస్తున్న తన స్వరాన్ని అదుపులోకి తెచ్చుకుని ఎడ్లను అదలించాడు. ఆ పాటలో ఏముందో గాని, వింటూన్న ఇద్దరూ చేష్టా రహితులయ్యారు..
ఇంతలో లైబ్రేరియన్ నా దగ్గరకొచ్చాడు. లైబ్రరీ కట్టేస్తున్నామని చెప్పి నేను చదువుతున్న పుస్తకం తీసేకున్నాడు. ‘ఒక్క అరగంట, కథ పూర్తయిపోతుంది’ అన్నాన్నేను. ‘రేపొచ్చి చదువుకో’ అన్నాడు ఆ ముష్కరుడు.
ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు లైబ్రరీ తీస్తారా అన్నదే ఆలోచన. తెల్లవారింది. పది కాగానే పరుగు పరుగున లైబ్రరీకి వెళ్ళాను. ఆ గది తలుపులు ఇంకా తెరవలేదు. చాలసేపు వేచి చూసాను. లైబ్రేరియన్ రాలేదు. సాయంకాలం మళ్ళా వెళ్ళాను. ఆ గదికి తాళం కప్ప అట్లానే వేలాడుతూంది. ఆ మర్నాడు, ఆ పై రోజు, అక్కడ నేనున్న నాలుగు రోజులూ క్రమం తప్పకుండా వెళ్ళాను. ఆ హీరామన్, ఆ హీరాబాయి, తేగ్ చియా దగ్గర కజరీ నది దాటి ఆ బండి ననన్ పూర్ చేరుకునే లోపలే, ఆ పుస్తకం నా చేతుల్లోంచి జారిపోయింది. ఆ పుస్తకం మళ్ళా ఎక్కడ దొరుకుతుందో తెలీదు. అసలెప్పటికన్నా దొరుకుతుందో లేదో తెలీదు.
ఏళ్ళు గడిచాయి. ఆరేడేళ్ళ తరువాత, రాజమండ్రిలో ఒక పుస్తక ప్రదర్శనలో కనిపించింది మళ్ళా ఆ పుస్తకం ‘కథా భారతి: హిందీ కథానికలు’. ఎన్నాళ్ళుగానో వెతుక్కుంటున్న నా ఆత్మీయులెవరో నాకు హటాత్తుగా తారసపడ్డట్టనిపించింది. అక్కడే ఆ మెట్ల మీదనే కూచుని ఆ కథ తెరిచి, ఆ రోజు ఎక్కడ ఆగిపోయానో, అక్కణ్ణుంచే గబగబా చదివేసాను. మళ్ళా ఆ పుస్తకం నా చేతుల్లోంచి మరొకసారి ఎక్కడ జారిపోతుందో అన్న భయంతో చదివేసాను.
ఆ కథ చివరికి వచ్చేటప్పటికి, బండివాడు హీరామన్ మూడో ఒట్టు పెట్టుకోక తప్పలేదు. బోనులో ఉన్న పులిని కూడా ఒక సర్కస్ కంపెనీ కోసం కిరాయి తోలిన హీరామన్ ఈసారి మళ్ళా ఎప్పుడూ ఆడవాళ్ళను బండిలో ఎక్కించుకోకూడదని ఒట్టు పెట్టుకున్నాడు!
ఏం జరిగింది ఆ మధ్యలో? ఎందుకతనట్లా మూడో ఒట్టుపెట్టుకున్నాడు?
ఉహు.నేను చెప్పను.
ఆ కథ పూర్తిగా చదవడానికి ఏళ్ళ పాటు వేచి చూసినవాణ్ణి. ఆ కథని ‘తీసరీ కసమ్’ అని సినిమా తీసారని తెలిసినా కూడా, ఆ కథ నాలో చిత్రించిన ఆ సుమనోహర చిత్రం ఎక్కడ చెదిరిపోతుందోనన్న భయంతో ఆ సినిమా చూడటానికి ఇచ్చగించనివాణ్ణి. మీకు ఆ కథ పూర్తిగా ఎలా చెప్పేస్తాను?
అయినా మీరు కూడా ఆ కథ చదవాలనుకుంటున్నారా? విజయవాడ ప్రజాశక్తి బుక్ హౌస్ లో ‘ఫణీశ్వర నాథ్ రేణు ఉత్తమ కథలు’ పుస్తకం కొని చదవండి. మరో దారి లేదు.
6-8-2019