మాటలు కట్టిపెట్టండి

ఇక్కడ నా మిత్రుల్లో క్రైస్తవులున్నారు, హిందువులున్నారు, మహ్మదీయులున్నారు, బౌద్ధులున్నారు, జైనులున్నారు, ఆస్తికులున్నారు, నిరీశ్వరవాదులున్నారు, కమ్యూనిస్టులున్నారు, ఫెమినిస్టులున్నారు, అంబేద్కరైట్లున్నారు, గాంధేయవాదులున్నారు, మార్కిస్టు-లెనినిస్టులు, మావోయిస్టులు- ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి ఎన్ని మార్గాలున్నాయో అన్ని మార్గాల్లోనూ సాధన చేస్తున్నవాళ్ళున్నారు. ప్రపంచాన్ని మార్చడానికి ఎన్ని ప్రయత్నాలు చెయ్యాలో అన్ని రకాలుగానూ పోరాటం చేస్తున్నవాళ్ళున్నారు.

వారందరూ నాకు తెలిసి ఉండటం నా భాగ్యం. వారందరివల్లా ఈ ప్రపంచం నాకు మరింత అవగతమవుతున్నది, నా జీవితం నాకు మరింత అనుభవానికొస్తున్నది. వారందరితోనూ నేను ఏదో ఒక విషయంలో విభేదిస్తాను, కాని వారందరితోనూ మరెన్నో విషయాల్లో అనుక్షణం ఏకీభవిస్తూనే ఉన్నాను. వారితో నా స్నేహమిట్లా కలకాలం కొనసాగాలనే కోరుకుంటున్నాను.

అట్లాంటి మిత్రుల్లో ఫాదర్ అలెగ్జాండర్ ఒకరు. నల్గొండకి చెందిన ఆ క్రైస్తవ బోధకులు నేను కబీరు మీద రాసింది చదివి నన్ను తన హృదయానికి హత్తుకున్నారు. ప్రతి ఉదయం ఆయన నాకు సుప్రభాత ఆశీసులు అందచేస్తారు. అది నా భాగ్యం.

మొన్న ఆయన నేను రూమీ వాక్యమొకటి పేర్కొన్నప్పుడు, తనకి రూమీని తెలుగులో చదవాలని ఉందన్నారు. ఆయన కోసం ఏ కవితలు అనువదించాలా అని ఆలోచించాను.

రూమీని పారశీకం నుంచి ఇంగ్లీషు చేసిన తొలితరం అనువాదకుల్లో ఎ.జె.ఆర్బెర్రీ అగ్రగణ్యుడు. రూమీ గజల్ మహాసముద్రం నుండి ఆయన 400 ముత్యాల్ని ఏరి తెచ్చి Mystical Poems of Rumi (2009) పేరిట వెలువరించాడు. వాటిలోంచి ఆయన కోసం ఈ సుప్రభాత వేళ ఈ అయిదు కవితలు.

1

రండి, రండి, గులాబీ తీగ మొగ్గ తొడిగింది, రండి, రండి, ప్రియతముడు అడుగుపెట్టాడు.

సూర్యుడు ఒరలోంచి కత్తి బయటకి దూసాడు. మీ మనోప్రపంచాల్ని కట్టగట్టి ఆయనముందు పడెయ్యండి.

ఇంకా ఎవడేనా ప్రగల్భాలు పలుకుతుంటే వాణ్ణి చూసి నవ్వుకోండి, ఎవడు తన మిత్రుడికి దూరమయ్యాడో వాడికోసం బెంగపెట్టుకోండి.

ఆ పిచ్చివాడు సంకెళ్ళనుంచి తప్పించుకున్నాడని ఊరంతా ఒకటే గగ్గోలు, వినలేదా?

ఎట్లాంటి రోజు ఇది, ఏమి రోజు ఇది, ఏమిటీ నవ్యోత్సాహం-బహుశా మనుషులు చేసుకున్న కర్మలచిట్టాలన్నీ గాల్లో ఎగురుతున్నట్టున్నాయి.

దుందుభులు మోగించండి. మాటలు కట్టిపెట్టండి. ఇంకా మనసూ హృదయం గురించి మాట్లాడతారేమిటి? ఆత్మ ఎప్పుడో అదృశ్యమైపోతేను! (39)

2

వెనకటిరోజుల్లో నేను మాట్లాడినమాటలు కొనుక్కునేవాళ్ళ కోసం వెతుక్కునేవాణ్ణి. ఇప్పుడు నా మాటలనుంచి నన్ను కొనుక్కొమ్మని అభ్యర్థిస్తున్నాను.

ఒకప్పుడు నేను ప్రతిఒక్కరిని విభ్రాంత పరిచే విగ్రహాలు తయారు చేసాను. ఇప్పుడు సృష్టికర్తని చూసి విభ్రాంతిచెందుతున్నాను, విశ్వకర్మ ని చూసి పరవశిస్తున్నాను.

రంగూ, సుగంధమూ లేని విగ్రహమొకటి ఇక్కడికి చేరుకుంది. ఆయన నా చేతులు కట్టేసాడు. ఇప్పుడు నీకు విగ్రహాలు కావాలంటే మరో దుకాణం వెతుక్కో.

నా అంగడినుంచి నన్ను బయటకు లాగేసుకున్నాను. పనిముట్లు పారేసాను. ఉన్మాదిగా ఉండటంలో విలువ తెలిసాక ఆలోచనలన్నీ వదిలిపెట్టేసాను.

ఇప్పుడు నా హృదయంలోకి ఏదన్నా మూర్తి ప్రవేశించిందా తక్షణమే ‘బయటికిపో, నన్ను దారితప్పించకు’ అని ఆగ్రహిస్తాను. అది మొండికేసిందా, దాని వీపు చిట్లగొడతాను.

లైలాకి తగినవరుడెవరు? ఆమెకోసం మజ్ఞూగా మారగలిగినవాడేకదా. అవతలిఒడ్డుకి ఎవడు చేరుకున్నవాడో వాడి చరణాలకు వీడు దాసానుదాసుడు. (313)

3

నువ్వొక సౌభ్రాతృత్వాన్ని కోరుకుంటున్నావా, ముందు పోయి నీ ముఖం కడుక్కురా.

మత్తు నీ తలకెక్కిఉంటే, నీ తోటిమనుషుల తలలు తుంచాలని చూడకు.

ముందు నీ వంటి దుర్వాసన దూరం చేసుకో, లేదా ప్రియతముడి పరిష్వంగం నుంచి పక్కకు జరుగు.

వెన్నెల విందు జరుగుతున్నవేళ నువ్విట్లా విలపించడం నీకు మర్యాదేనా?

ఉచ్చు లేని గని కావాలంటావు. నువ్వు కూడా నాలానే అసాధ్యాన్ని అభిలషిస్తున్నావు.

తాగినమైకంలో నీ చెవులు వేడెక్కాయా, నువ్వు సంతోషసంగీత సామ్రాజ్యసూఫీవే.

నీ చెవులేమివింటున్నాయో నీ మనసుకి ఎక్కడం లేదా, అయితే నువ్వింక ఒక్కడివి కావు, వందమందివన్నట్టు. (350)

4

మరొక్కసారి నా భాగ్యవేణువు రాగం పలికింది. మనసా, చప్పట్లు కొట్టు, హృదయమా, నర్తించు.

ఒక గని వెలిగిపోతున్నది, ఒక ప్రపంచం పరవశిస్తున్నది, బల్ల సిద్ధం చేసారు, ఆహ్వానం అందబోతున్నది.

పచ్చికబయళ్ళమీద వసంతం రానున్న సంతోషంతో మేం మత్తెక్కి మైమరచాం. ఒక సుందరాకారుణ్ణి ఆరాధించడంలో మునిగిపోయాం.

ఆయన సూర్యుడు, మేం మేఘం. ఆయన సంపద, మేం శిథిలాలం. ఆ కాంతి సముద్రంలో మేం ధూళిరేణువులం.

నేను దారితప్పాను, కాని అనుగ్రహానికి నోచుకున్నాను. ఇప్పుడు గర్వంగా చెప్పగలను-నా ప్రియతముడి వెలుగు ముందు యుగాంతం కూడా నాకు లెక్కలేదు (384)

5

ప్రేమికుల్ని చక్కెరలాగా వధించేవాడా. నువ్వు వధించేట్లయితే, ఈ క్షణమే నన్ను వధించు మధురంగా.

మృదువుగా, మధురంగా వధించడం నీ చాకచక్యం, ఎందుకంటే, నీ కడగంటిచూపు కోసం అల్లల్లాడేవాళ్ళని కడగంటి చూపుతోటే వధిస్తావు.

ప్రతి ప్రత్యూషానా నేను వేచి ఉంటూనే ఉన్నాను, వేచిచూస్తూనే ఉన్నాను, ఎందుకంటే నువ్వు సాధారణంగా నన్ను వధించేది సుప్రభాతాన్నే.

నీ క్రూరత్వం మాకొక మధురభక్ష్యం. మమ్మల్నిట్లా కడతేర్చడం మానకు. చివరికెట్లానూ నువ్వు నన్ను నా ఇంటిగుమ్మం ముందే కదా వధించిపారేసేది.

ఉదరం లేని శ్వాస నీది. నీ దుఃఖం దుఃఖాన్ని దూరం చేస్తుంది. అగ్గితునకలాంటి ఒక్క శ్వాసలో నువ్వు మమ్మల్ని అంతం చెయ్యగలవు.

ప్రతిక్షణం నువ్వొక కవచం అనుగ్రహిస్తూనే ఉన్నావు. కత్తి పక్కనపారేసి చివరికి కవచంతోనే వధిస్తున్నావు. (389)

24-3-2019

Leave a Reply

%d bloggers like this: