బహిరిసన్స్ బుక్ సెల్లర్స్

మూడు వారాల కిందట ఢిల్లీ వచ్చినప్పుడు ఇక్కడ చెప్పుకోదగ్గ పుస్తకాల షాపులేమున్నాయా అని వాకబు చేస్తే మొదటి పది షాపుల్లో బహిరిసన్స్ బుక్ సెల్లర్స్ పేరు ప్రముఖంగా కనబడింది. అరవై ఏళ్ళకు పైగా నడుస్తుండటమే కాక, ఇంటర్నెట్ ప్రభంజనాన్ని, ఆన్ లైన్ మార్కెటింగ్ నీ కూడా తట్టుకుని నిలబడ్డ పుస్తకాల దుకాణం అని తెలిసాక, నిన్న ఢిల్లీ వచ్చినప్పుడు, పోయి చూడకుండా ఉండలేకపోయాను.

ఖాన్ మార్కెట్ లో ఉన్న విక్రయకేంద్రం ఏమంత పెద్ద దుకాణం కాదు. ‘మా సమస్య తగినంత చోటు లేకపోవడమే’ అన్నాడా ప్రొప్రయిటర్ నాతో. కాని ఆ కొద్దిపాటి చోటులోనే వాళ్ళు అక్కడ పెట్టిన పుస్తకాల్లో గొప్ప వైవిధ్యం కనిపించింది. ఒకటి వైవిధ్యం, రెండోది, మార్కెట్ లోకి ఇటీవలనే వచ్చిన పుస్తకాలకు కూడా చోటుందా లేదా అనేది మరో కొలబద్ద. రెండు ప్రమాణాల ప్రకారం కూడా బహిరి సన్స్ కి నేను అయిదునక్షత్రాల్ని బహూకరించేసాను.

షాపులో అడుగుపెట్టగానే నేనడిగే మొదటి ప్రశ్న మీకు తెలుసు, పొయెట్రీ సెక్షన్ ఎక్కడుంది అనే కదా. ఏ పుస్తకాల దుకాణంలోనైనా పొయెట్రీ షెల్ఫు చూసి చెప్పొచ్చు, అది అక్షరాస్యులు నడుపుతున్నదా, నిరక్షరాస్యులు నడుపుతున్నదా అని.

బహిరిసన్స్ నన్ను నిరాశ పర్చలేదు. హైదరాబాదు, విజయవాడ పుస్తక ప్రదర్శనలు రెండింటిలోనూ కలిపి కూడా నాకు కనిపించనంత కవిత్వం, కొత్తదీ, పాతదీ కూడా ఇక్కడ నాకు కనిపించింది.

అందులోంచి పది పుస్తకాలు ఎంపిక చేసుకున్నాను, మరో పది పుస్తకాలేనా కష్టం మీద వదిలిపెట్టేసాను. ఎంపికచేసిన పుస్తకాలివీ:

మూర్తి క్లాసికల్ లైబ్రరీ వారు ఇటీవలనే వెలువరించిన మీర్ తకీ మీర్ Selected Ghazals and Other Poems (2019). షమ్షూర్ రహ్మాన్ ఫరూఖీ అనే ఆయన ఇంగ్లీషు అనువాదం. ఉర్దూ కవిసార్వభౌముడు మీర్ ఆరుసంపుటాల గజళ్ళనుండి ఎంపికచేసి వెలువరించిన అనువాదం, ఉర్దూమూలంతో కలిసిన సంపుటం. ఈ పుస్తకం కొత్తగా వెలువడిందని పోయిన ఆదివారమే ఆదిత్య చూపించాడు.ఆ పుస్తకం ఆన్ లైన్లో తెప్పించుకుందాం అనుకుంటూండగానే ఇక్కడ నాకు ప్రత్యక్షమయింది.

మరొకటి మీర్ ఆత్మకథ ‘జిక్ర్-ఏ-మీర్’ కి Remembrances (2019) పేరిట సి.ఎం.నయాం అనే ఆయన అనువాదం మూర్తి క్లాసికల్ లైబ్రరీ వారి ప్రచురణ. మీర్ పట్ల నా తృష్ణని ఈ రెండు పుస్తకాలూ చల్లారుస్తాయో మరింత ఎగసనదోస్తాయో చూడాలి.

హాచెట్ ఇండియా వారు ఇంతకు ముందు వెలువరించిన సుబ్రహ్మణ్య భారతి Selected Poems నా దగ్గరుంది. ఇప్పుడు ఆయన పాంచాలి శపథం కావ్యానికి ఇంగ్లీషు అనువాదం Panchali’s Pledge (2012) దొరికింది. ఉషా రాజగోపాలన్ ఇంగ్లీషు అనువాదం, తమిళమూలం రెండూ ఉన్నాయి. మొన్న డిసెంబరు నుండీ భారతి మళ్ళా నా హృదయాకాశం మీద ప్రకాశమానతారగా వెలుగులు చిమ్ముతున్నాడు కాబట్టే అనుకుంటాను బుక్ షాప్ యాంజెల్ ఈ పుస్తకాన్ని నాకు కానుక చేసింది.

పుష్కిన్ కవిత్వం రాదుగ వారి ప్రచురణల కాలం నుండీ నన్ను వెన్నాడుతూనే ఉంది. యూజిన్ ఒనిజెన్ కావ్యం చదివిన తరువాత పుష్కిన్ కి జీవితకాల అభిమానిగా మారాను. ఇప్పుడు పుష్కిన్ గీతాల సమగ్ర సంకలనం ఇంగ్లీషు అనువాదం Lyrics, volume 1(2018) దొరకడం ఒక గుప్తనిధి చేతికందడమనే చెప్పుకోవచ్చు.

సుప్రసిద్ధ పోలిష్ కవయిత్రి, నోబెల్ బహుమాన స్వీకర్త విస్లావా సింబోర్స్కా కవిత్వం రెండు సంపుటాలు నా దగ్గర ఇప్పటికే చేరాయి. ఇప్పుడు View with a Grain of Sand, Selected Poems'(1993) దొరికింది. సింబోర్స్కాది చాలా సున్నితమైన ప్రపంచం. సుఖదుఃఖాలకు స్పందిస్తూనే వాటిని దాటిన మనఃస్థితిని కూడా ఆమె కవిత్వం మనకు పరిచయం చేస్తుంది. ఈ కవితల్లో ఏ సుకోమల స్పందనలు పలుకుతున్నాయో చూడాలి.

ఉద్యోగ విరమణ చేసాక నేను అధ్యయనం చేయవలసిన గ్రంథాల్లో ఋగ్వేదం, దుఫూ సమగ్ర కవిత్వం వంటివాటితో పాటు హాఫిజ్ కూడా ఉన్నాడు. రూమీకి లభించినట్టుగా హాఫిజ్ కి సరైన ఇంగ్లీషు అనువాదకులు దొరకలేదు. సమకాలిక ఇంగ్లీషు పాఠకులకి రూమీలాగా హాఫిజ్ ని పరిచయం చెయ్యాలని ప్రయత్నిస్తున్నవాళ్ళల్లో డేనియల్ లాడిన్స్కీ ఒకడు. ఆయన అనువాదం The Gift ఇప్పటికే నా దగ్గరుంది. ఇప్పుడు A Year with Hafiz: Daily Contemplations (2011) దొరికింది. ‘మరల హాఫిజ్ మధుపాత్ర, మధుపాత్ర, మరి మరి ప్రియాననాన్వేషణోత్సవ యాత్ర’ అనుకుంటూనే ఆ పుస్తకం కూడా చేతుల్లోకి తీసుకున్నాను.

ఎవిరిమాన్స్ లైబ్రరీ పాకెట్ బుక్స్ వారి కవిత్వ సంకలనాలు చాలా విశిష్టమైన సిరీస్. వాటిలో శ్రేష్ఠ సంపుటాలు ఇప్పటికే నా దగ్గర చాలా చేరాయి. ఇప్పుడు కొత్తగా French Poetry (2017), Russian Poets (2009), Poems of the Sea (2001) దొరికాయి. ఈ మూడు కూడా ముత్యాలపేటికలే నని నాకు తెలుసు.

పాబ్లో నెరుడా కవిత్వం ఇంగ్లీషులోకి వచ్చిందంతా కూడా దాదాపుగా నా దగ్గరుంది. అయినా కూడా All the Odes (2013) అనే ఈ సంకలనం చూడగానే ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకోకుండా ఉండలేకపోయాను. సానెట్లలోనూ, Canto General మహాకావ్యంలోనూ కనిపించే నెరుడా వేరు, Odes(గీతికలు) లో కనిపించే నెరూడా వేరు. మొత్తం 225 గీతికల స్పానిష్ మూలం, ఇంగ్లీషు అనువాదంతో కూడిన ఈ గ్రంథం ఈసారి అనూహ్యంగా నా వలలో పడ్డ మహామత్స్యం అని గుర్తుపట్టాను.

ఇది మెనూ కార్డు మటుకే. రానున్నరోజుల్లో పూర్తివిందుకి మిమ్మల్నెట్లానూ అహ్వానిస్తాను.

1-3-2019

Leave a Reply

%d bloggers like this: