ఫాల్గుణపూర్ణిమ

Reading Time: 4 minutes

నిన్న ఫాల్గుణపూర్ణిమ. సంవత్సరం మొత్తంలో ఇంత మోహవిస్మయకారకమైన వెన్నెలరాత్రి మరొకటుండదు. వసంత ఋతువంటే చైత్రంతో మొదలవుతుందనుకుంటారు. కాదు, వసంతాగమన సంతోషంతో ఫాల్గుణం ప్రతి దినం, ప్రతి రాత్రీ పరవశిస్తూ ఉంటుంది. ఆ రహస్యం తెలిసినవాడు కాబట్టే రవీంద్రుడు చైత్రమాసంలో కన్నా ఫాల్గుణంలోనే ఎక్కువ పాటలు కట్టాడు.

ఫాల్గుణ చంద్రుడు నా చిన్ననాట మా ఊళ్ళో కొండ మీద అతిథి. కొండమీది అడవిలోంచి ఊరంతా గుప్పున సాంబ్రాణి ధూపం జల్లేవాడు. నిన్నంతా నా మనసు ఒకటే కొట్టుకుపోతూ ఉంది, ఆ అతిథిని ఎక్కడ చూడటమా, ఎక్కడ కలుసుకోటమా అని. చివరికి, ఈ పట్టణానికి దూరంగా నది వడ్డున సంకేతస్థలం నిర్ణయించు కున్నాను. మా గురవయ్యని అడిగితే అతడెవరితోటో మాట్లాడి తాళాయపాలెం లంక దగ్గర నేను చంద్రుణ్ణి కలుసుకోడానికి ఏర్పాట్లు చేసాడు.

ఆఫీసైపోగానే నా రూముకి కూడా పోబుద్ధి కాలేదు. చంద్ర సందర్శనమంటే, చంద్రోదయవేళనుంచే కదా మొదలయ్యేది. వడివడిగా ఆ పల్లెటూరి మట్టిబాట పట్టాం. మేమక్కడ అడుగుపెట్టేటప్పటికే దూరంగా ఉండవల్లి గుహల మీంచి కొండమీద అతిథి ఆకాశంలో అడుగుపెట్టాడు. పగటిపూట హడావిడిగా కనిపించే కొత్త రాజధాని ప్రాంతమంతా, ఆ వెన్నెల్లో, ఒక అస్పష్టమైన ఊహగా మారిపోయింది. కరకట్ట మీంచి మందడం దాటి తాళాయపాలెం ఊరు దాటి శివాలయం దగ్గరకు చేరుకునేటప్పటికి చంద్రుడి రాకతో నింగీ నేలా కూడా పొంగిపోతూ ఉన్నాయి.

అక్కడొక రేవు. పుష్కరాల కోసం కట్టిన పొడవైన స్నానఘట్టం. కాని నిర్జనం. నిశ్శబ్దదేవతలు మాత్రమే విహరించే ఆ తావులో మా కోసమొక నావ ఎదురుచూస్తూ ఉంది. నీ కోసమొక పడవ ఎదురుచూస్తున్నదని తెలియడంలో మాటల్లో పెట్టలేని స్ఫూర్తి ఏదో ఉన్నది. మరుక్షణంలో నువ్వు ఈ తీరాన్ని వదిలిపెట్టగలవని తెలియడంలో గొప్ప విమోచన ఉన్నది. నెమ్మదిగా గట్టు దిగి మా కోసం ఆ పడవని నీళ్ళలోకి వదులుతున్న ఆ పడవమనిషి నాకొక తీర్థంకరుడిలాగా కనిపించాడు.

పడవ ఎక్కాను. ‘మీరు సాయంకాలం వచ్చి ఉండవలసింది. ఇప్పుడంతా వలలు వేసేసారు. మరీ లోపలకి పోవడం కష్టమవుతుంది’ అన్నాడు ఆ మనిషి. కాని నేను చూడాలనుకున్నది నదిని కాదు, నది ఒడ్డున నా ప్రియమిత్రుణ్ణి. ‘సంకేత సమయమిదే, ఒక గంట కూడా ముందుకు జరపలేనే’ అనుకున్నాను. ‘పర్వాలేదు. ఎంత దూరం పోగలిగితే అంత దూరమే తీసుకువెళ్ళండి’ అన్నాను.

అతడు ఇంజను తిప్పాడు. పడవ సర్రున ముందుకు సాగింది. దూరంగా కొండపల్లి థర్మల్ విద్యుత్ కేంద్రం వెలుగులు. ఇస్మాయిల్ గారు నాతో వచ్చి ఉంటే దాన్నో వింత కీటకమని ఉండేవారు. నీళ్ళల్లో కొంత ముందుకు వెళ్ళాక, ఆ ఇంజను ఆపేస్తే ఏమైనా ఇబ్బంది ఉంటుందా అనడిగాను. ఏమీ ఉండదన్నాడు. నా మిత్రుడితో చేసే రహస్య సంభాషణకి ఆ చప్పుడు అడ్డంగా ఉంది. ఆపేసాడు. ఇప్పుడు ఆ కొండపల్లి కర్మాగారం కూడా కనిపించకుండా ఒక లంక అడ్డుగా నిలబడింది. చూసినంతమేరా సుగంధంలాంటి వెన్నెల తప్ప మరేమీ ప్రవహించడం లేదు. సన్నని చిరుతరగలమీద ఆ నావ ఊయెలలాగా ఊగడం మొదలుపెట్టింది. చిన్ని చిన్ని నీటి అలలు ఆ నావ చర్మం మీద ఘటవాద్యకారుడి అంగుళుల్లాగా సంగీతం వినిపించడం మొదలుపెట్టాయి. నిజమైన నౌకాయానం మొదలయ్యింది.

అప్పుడు చంద్రుడు నా చుబుకం పట్టుకుని నా ముఖాన్ని తనవైపు తిప్పుకున్నాడు. కొందరికి కళ్ళల్లో తేనె కురుస్తుంది. కొందరికి పెదాల్లో. కొందరికి మాటల్లో. కాని, ఫాల్గుణ చంద్రుడు నిలువెల్లా తేనె.

ఆ క్షణాన ఒక్కసారిగా నాకు చెప్పలేనంత నిస్సత్తువ ఆవహించింది. వళ్ళంతా అలసటగా తోచింది. ఇదేమిటిది అనుకున్నాను. మరుక్షణంలో అర్థమయింది. అలసట పెట్టే ఒక రోజు గడిచాక, సాయంకాలం గోరువెచ్చని స్నానం చేసినప్పుడు కలుగుతుందే అట్లాంటి అలసట అన్నమాట! అలసట మొత్తం ఒక్కసారిగా వంట్లోంచి కరిగిపోయినప్పుడు కలిగే అపారమైన అలసట అన్నమాట. నాకు ఎప్పుడో మా మాష్టారు చెప్పిన మాట గుర్తొచ్చింది.

సుందరకాండలో లంకా నగరం మీద చంద్రోదయాన్ని వర్ణిస్తూ కవి ‘లోకస్య పాపాని వినాశయన్తమ్’ అన్నాడట. ‘లోకంలోని పాపాన్నంతటినీ కడిగేస్తున్నట్టుగా చంద్రుడుదయిస్తున్నాడని చెబుతూ ‘పాపమంటే ఏమిటయ్యా! అలసట కాదూ!’ అన్నాడాయన. అందుకనే ‘జ్యోత్స్నా వితానమ్ మహదుద్వమన్తమ్’- వెన్నెల వింజామరతో ఆకసంలో అడుగుపెట్టాడు చంద్రుడంటాడు కవి.

వాల్మీకి తర్వాత ఎందరు కవులు ప్రభవించారు, ఎన్ని కావ్యాలు ప్రభవించాయి. కాని మరే కవీ అటువంటి చంద్రదర్శన భాగ్యానికి నోచుకోలేదు. ఆయన వర్ణించింది శరత్కాల చంద్రుడే కావచ్చుగాక, కాని, ప్రతి చంద్రోదయంలోనూ ఆ చంద్రుడే తలపుకొస్తాడు నాకు. కొండగుహలో సేదదీరుతున్న సింహంలాగా, బలించిన ఏనుగు మీద ఎక్కి మదిస్తున్న వీరుడిలాగా, పొదరింటిలో పరవశిస్తున్న హంసలాగా ఉన్నాడు చంద్రుడంటాడు. ఒక రాజ్యం దొరికిన రాజులాగా, రణం దొరికిన గజేంద్రుడిలాగా, కొట్టంలో మదించి తిరుగుతున్న ఆంబోతులాగా ఉన్నాడు చంద్రుడంటాడు.

కవి వర్ణించిన వెన్నెల నగరం మీది వెన్నెల. నిద్రపోతున్న నగరం మీది వెన్నెల. ఇంకా చెప్పాలంటే నిద్రపోతున్న రాక్షసనగరం మీది వెన్నెల. గొప్ప కవిత్వాలు, సంగీతాలు కూడా రాక్షసనగరాల మీద రాలుతున్న వెన్నెలలే కదా. ‘నడిరాతిరి మేలుకున్నవారికి ‘ తప్ప మరెవరికీ పట్టని వెన్నెలలు, మరెవరికీ గోచరించని వెన్నెలలు కూడా.

అట్లా ఎంత సేపు ఆ చంద్రుణ్ణే చూస్తూ కూచున్నానో. ‘మీరు వెనక్కి ఎప్పుడు వెళ్ళిపోదామంటే అప్పుడు వెళ్ళిపోదాం ‘ అన్నాను ఆ పడవమనిషితో. ‘పర్వాలేదు. మీకు నచ్చినంతసేపు కూచోండి’ అన్నాడతడు. అతడొక రైతు. ఆ లంకలో అతడికి పొలముంది. కూరగాయలు పండిస్తాడట. తన పొలానికి పోయిరావడం కోసం ఆ పడవ కొనుక్కున్నాడట.

చంద్రుడికోసం, వెన్నెలకోసం బెంగపెట్టుకునే కవులూ, రచయితలూ, గాయకులూ మనకి ఆట్టే కనిపించరు. కానీ ప్రాచీన చీనా కవులు, జపాన్ కవులు చంద్రుడికోసం ఒకటే తపించిపోయారు. వెన్నెలరాత్రి మీద కనీసం ఒక్క కవితేనా చెప్పని చీనా కవి ఒకరు కూడా కనిపించరు. ప్రాచీన చీనాలో స్వగృహానికీ, స్వజనానికీ దూరంగా జీవించవలసి వచ్చిన ప్రతి ఒక్కరూ చంద్రుణ్ణి చూస్తూ, ఆ వేళప్పుడు, తమ ఊళ్ళో తమ వాళ్ళు కూడా ఆ చంద్రుణ్ణే చూస్తూంటారని తలుచుకుని, ఆ చంద్రుడిలోనే తమ స్వజనాన్ని కూడా చూసుకునేవారట. ఇప్పుడు వాట్సప్, స్కైప్ ల కాలం. నువ్వెవరిని చూడాలనుకున్నా ఒక్క బటన్ పుష్ చేస్తే చాలు. కాని, ఆ చిన్ని తెరమీద నువ్వు మనిషి ముఖమైతే చూడగలవుగాని, ఆ భావోద్వేగం ఎక్కడ అనుభవించగలవు?

ఆ పడవ మీద అట్లానే మరికొంతసేపు కూచున్నాక, అప్పుడు చూసాను, ఆ నీళ్ళమీద వరసగా పరిచిన జిలుగు తెప్పలు. ఆ తెప్పలు ఆకాశదేశందాకా వంతెన కట్టిన తాటిదూలాల్లాగా ఉన్నాయి. పడవ దిగి ఆ జిలుగుతెప్పలమీద అడుగుపెట్టాలన్న కోరికనెట్లానో నిగ్రహించుకోగలిగాను. కాని, ఒకప్పుడు, ప్రాచీన చీనా కవీంద్రుడు లి-బాయి ఆ కోరికని ఆపుకోలేకపోయాడు. ఇట్లానే ఒక వెన్నెలరాత్రి పడవమీద చంద్రుడితో సంభాషిస్తో, నీళ్ళల్లో కనబడుతున్న చంద్రుణ్ణి కావిలించుకోవాలని ఆ నీళ్ళల్లోకి జారిపోయాడు.

చంద్రుడితో అతడు చేసిన ప్రతి ఒక్క సంభాషణా మహామధుర సంభాషణ. మరీ ముఖ్యంగా, ఈ కవిత:

విరబూసిన పూల నడుమ

విరబూసిన పూల నడుమ, ఒక మధుకలశం.
మరెవరూ తోడులేక, నేనొక్కణ్ణే పానపాత్ర నింపుకున్నాను
అప్పుడు ఆ పాత్ర చూపి చంద్రుణ్ణి ఆహ్వానించాను.
నా వెనక నా నీడ. ముగ్గురమయ్యాం.

చంద్రుడికి నేనింతలా తాగుతానని తెలీదు
నా నీడంటారా, నేనెటు నడిస్తే అదీ అటే.
ఆట్టే సమయంలేదు, వాసంతసంతోషం పొదివిపట్టుకోడానికి
నేను చప్పున నా నీడతో, చంద్రుడితో చెలిమి మొదలెట్టాను.

ఇంత సుకుమారగీతి ఎలుగెత్తగానే తలూపుతూ చంద్రుడు
నేను నాట్యం మొదలెట్టానో లేదో తూగాడుతూ నా నీడ.
మధువు సాక్షిగా మేము మహానందం పంచుకున్నాం
మత్తెక్కగానే ఎవరిదారిన వారు విడిపోయాం.

మా స్నేహం ఈ ప్రపంచానిది కాదని తెలిసిపోయింది
కాబట్టి మేమీసారి పాలపుంతలో కలుసుకుంటాం.

~

చంద్రుడితో స్నేహం చేసినవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ మాట. పాలపుంతలో కలిసే రోజు మరో జన్మలోనే కానక్కర్లేదు. కనీసం కొన్ని గంటలేనా నువ్వీ లోకానికి దూరంగా జరగ్గలిగితే చాలు, పాలపుంతలో ఒక తెప్ప వేసుకుని నీ మిత్రుడు నీ కోసం ఎదురుచూస్తూ ఉంటాడు.

మరికొంతసేపు గడిచింది. దూరంగా పల్లెలో క్రైస్తవ గీతాలు పూర్వకాలపు రామాయణం పాటల్లాగా వినబడుతున్నాయి. ఆ కూనిరాగాలతో నిశ్శబ్దం మరీ చిక్కబడుతున్నది. అప్పుడు చూసాన్నేను. ఆ పడవ మీద ఒక నిచ్చెన వేసారనీ. నేనప్పటికే నిచ్చెన సగం దాకా ఎక్కేసాననీ. అక్కణ్ణుంచి మరి నాలుగు మెట్లు కిందకి దిగడమా లేక మరి నాలుగు మెట్లు పైకెక్కడమా?

కింద నీళ్ళల్లో పన్నిన వలల్లో ఒకటొకటీ చేపలు వచ్చి పడుతుండొచ్చు. కాని పైన నదిమీద పన్నిన వలలో నేను పూర్తిగా ఇరుక్కున్నాను.

ప్రతి కలా ముగిసినట్టే మా కలయికా ముగిసింది. రాత్రి ఇంటికొచ్చాక, నిద్రలో ఒక కల. నా ముందు మట్టిలో ఆల్చిప్పలాగా చంద్రుడు. ఆ మట్టి ఒకటే తవ్వుతున్నానట, ఆ ఆల్చిప్పను పైకి లాగాలని.

ఆల్చిప్ప చేతికి చిక్కలేదుగాని, ఒక కవిత చిక్కింది.

~

అలౌకికం

నీటిమీంచి వీచే వెచ్చని తెమ్మెర
నింగిన చిందిన కస్తురికాంతి
నిశ్శబ్దాన్ని చిక్కబరిచే నీటిగలగల

అలౌకికం అంటే ఏమిటి?
మరింతగా లోకాన్ని హత్తుకోడమే.

22-3-2019

Leave a Reply

%d bloggers like this: