
నిన్న సాయంకాలం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మహమ్మద్ ఖదీర్ బాబు సంకలనం చేసిన ‘స్త్రీ కథలు:50’ పుస్తకావిష్కరణ జరిగింది. డా.ముదిగంటి సుజాతారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఓల్గాగారు, కొమ్ము రజిత గారితో పాటు పుస్తకం గురించి మాట్లాడే అవకాశం నాక్కూడా లభించింది.
ఇంతకు ముందు ‘నూరేళ్ళ తెలుగు కథ’ పేరిట చేసిన ప్రయోగం వంటిదే ఈ ప్రయత్నం కూడా. వందేళ్ళకు పైగా తెలుగు కథకులు రచయితలూ, రచయిత్రులూ కూడా స్త్రీల సమస్యల్ని తీసుకుని చెప్పిన శక్తిమంతమైన కథల్ని ఆయన సాక్షి దినపత్రికద్వారా మరోసారి విస్తృత పాఠకలోకానికి పరిచయం చేసాడు. ఇలా చెయ్యటాన్ని ఆయన పునఃకథనం అన్నాడు. సుజాతారెడ్డి గారు చెప్పినట్టుగా వీటిని సంక్షిప్తీకరణలు అని కూడా అనవచ్చు.
ఇలా ఒక సాహిత్యాభిమాని తనకు నచ్చిన కొన్ని కథల్ని సంకలనం చెయ్యడంలోనూ, వాటిని తిరిగి తన మాటల్లో చెప్పటంలోనూ అనివార్యంగా ప్రాధాన్యాల, ప్రాథమ్యాల సమస్య వస్తుంది. ఒక దాన్ని వదిలి మరొకదాన్ని ఎంచుకోవడం, ముందుకుతేవటం, పైకెత్తడం స్వభావరీత్యా political కాబట్టి, ఇటువంటిప్రయత్నాలు కూడా అంతిమంగా ఒక రాజనైతిక స్వభావాన్ని సంతరించుకుంటాయి. కాని, ఇందులో ఖదీర్ కథల్ని ఎంచుకోవడంలో ఏదో ఒక కులాన్నో, మతాన్నో, ప్రాంతాన్నో పెద్దది చెయ్యలేదు. స్త్రీకి సంబంధించిన కథలే అయినప్పటికీ, అవి స్త్రీలు రాసిన కథలే కానక్కరలేదని కూడా భావించాడు. తన పుస్తకానికి రాసుకున్న ముందు మాటలో ఇలా అన్నాడు:
‘స్త్రీ కథ అంటే ఏమిటి?
పురుషుణ్ణి ప్రత్యర్థిగా నిలబెట్టేదే స్త్రీ కథ.
అతణ్ణి తన సహవాసిగా, సమమిత్రుడిగా సెన్సిటైజ్ చేసేదే స్త్రీ కథ.
స్త్రీని తన సమస్త చేతనామార్గాలతో మేల్కొల్పేదే స్త్రీ కథ.
ఆమె అంతర్ ఆవరణాన్ని, బహిర్ ఆవరణాన్ని జీవయోగ్యం చేయడానికి పదే పదే ప్రతిపాదనలు చేస్తూ పేచీ పడేది స్త్రీ కథ.’
దాదాపుగా ఈ సంపుటంలోని కథలన్నీ ఈ అభిప్రాయాన్ని బలపరుస్తున్నట్టే ఉన్నాయి.
అలాగని ఆయన ఎంపిక చేసిన ఈ యాభై కథలు మాత్రమే స్త్రీ కథలనీ, తక్కిన కథలు ఈ ప్రమాణాల్ని అందుకోలేదనీ అనుకోనక్కర్లేదు. ఇందులో లేని స్త్రీ కథల్ని నేను మరో యాభై కథలేనా ప్రస్తావించగలను. ముఖ్యంగా గురజాడ ‘మెటిల్డా’ నుంచి గోపి భాగ్యలక్ష్మి ‘జంగుబాయి’ దాకా ఎన్నో ఉన్నాయి.ఏ సంకలానికైనా ఈ పరిమితి ఉంటుంది. ఇటువంటి సంకలనాలు మన చేతుల్లోకి వచ్చినప్పుడు ఏ కథలు ఎంపిక కాలేదు అని చూడటం కన్నా, ఏవి ఎంపికైనాయి, ఆ కథలు సంకలనకర్త ఆశయాన్ని ఏ మేరకు సాధ్యం చేసాయని చూడటం సమంజసంగా ఉంటుంది.
అలా చూసినప్పుడు, ఈ సంకలనం, ఈ పునఃకథనం ఎంతో విలువైనవని చెప్పవచ్చు. ఈ కథల్ని ఇలాపునఃపఠించినప్పుడు, అవి మన literary discourse ని politically energize చేస్తున్నాయి. ఆ కథలు రాసినప్పటి ఆ రచయితల, రచయిత్రుల మనఃస్థితి ఏమిటో మనకు తెలియదు, ఆ కథలు వెలువడ్డప్పుడు అవి కొందరికి పఠనసంతోషాన్నివ్వడంతోనే ఆగిపోయి ఉండవచ్చు. కాని, ఇప్పుడు మళ్ళా మనముందుకు వస్తున్నప్పుడు అవి చాలా ప్రాసంగికంగానూ, ఆలోచనాత్మకంగానూ, కొన్ని సార్లు షాకింగ్ గానూ కూడా ఉన్నాయి.
ఉదాహరణకి కల్యాణ సుందరీ జగన్నాథ్ రాసిన ‘అలరాస పుట్టిళ్ళు’ (1962) కథని మనమింతకాలం రాచకుటుంబాల వేదనకూ, గూడుకట్టుకున్న విషాద వాతావరణచిత్రణకు మాత్రమే గుర్తుపెట్టుకున్నాం. కాని ఇప్పుడు పరువు హత్యలు దేశమంతా ఒక జాడ్యంలాగా తలెత్తిన నేపథ్యంలో ఈ కథని చదవమని సంకలనకర్త మనముందుకు తీసుకురావడంతో ఈ కథాస్వరూపమే మారిపోయింది. ఇక మీదట ఈ కథని ఒక రాజకీయ కథగా తప్ప మరోలా చూడలేం.
అట్లానే భండారు అచ్చమాంబ రాసిన ‘ధనత్రయోదశి’ (1902) కథని సంకలనకర్త ప్రేమ్‌చంద్ రాసిన ‘సాల్ట్ ఇన్స్పెక్టర్’ కథతో పోల్చినప్పుడు, ఆ తొలితెలుగు కథ ఈ నవశతాబ్దంలో కూడా మరింత ప్రాసంగికంగానూ, మరింత నవీనంగానూ కనిపించడం మొదలుపెడుతున్నది. ‘స్త్రీ శ్రమను ప్రోత్సహిస్తుందిగాని పాపాన్ని కాదు’ అని సంకలనకర్త వ్యాఖ్యానిస్తున్నప్పుడు ఈ అవినీతి భారతదేశానికొక కొత్త ఆశ కనిపిస్తున్నది.
ఇల్లిందల సరస్వతీ దేవి రాసిన ‘కాని కాలం వస్తే’ ప్రేమ్‌చంద్ ‘షత్రంజ్ కే ఖిలాడి’ తో సమానమైన కథ. ఒక యుగాంత సంక్షోభాన్ని ఒక తెలుగు రచయిత్రి అంత ప్రతిభావంతంగా పట్టుకున్నదని తెలుసుకోవడంలో నాకు కలిగిన సంతోషం అమేయం.
ప్రతి కథనీ మళ్ళా తన మాటల్లో చెప్పడమే కాక, ఖదీర్ బాబు ప్రతి కథకీ చివర ఒక పేరాగ్రాఫు వ్యాఖ్యలాంటిది కూడా పొందుపరిచాడు. అవి నేరుగా ఆయన హృదయంలోంచి దూసుకొచ్చిన వాక్యాలు కావడంతో వాటిని చదువుతుంటే వళ్ళు గగుర్పాటు చెందుతూ ఉంది. కొన్ని వాక్యాలు చూడండి:
‘చదువు ఉద్యోగాల్లోనే కాదు నిద్రలో కూడా సమానమైన అవకాశం ఉండాలనంటే అది నేటికి విడ్డూరమైన డిమాండ్ కావచ్చుగాక. రేపటికి కచ్చితంగా కాదు. నిద్ర చాలక ఆవలించే స్త్రీలున్న ఇళ్ళు నశించు గాక.’
‘తల్లికి భయపడే కొడుకు, భార్యకు తలాడించే భర్త ఎంత పెగిరిగే అంత మంచిది.’
‘స్త్రీ దేహం మీద హక్కు స్త్రీదే అని అంగీకరించి మానసికంగా, శారీరికంగా ఆమె సిద్ధమైనప్పుడు పెట్టేదే శుభముహూర్తం, అది వినా తక్కినవన్నీ దుర్ముహూర్తాలే.’
‘కన్ను, కాలు , చెవి లేకపోతే దివ్యాంగులు అంటున్నారు, గర్భం రాలేని స్త్రీలను దివ్యమహిళలు అని ఎందుకు అనకూడదు?’
‘ఎన్నో కర్మాగారాలు స్థాపించుకున్నాంకానీ, మగవాళ్ళ మనసు శుద్ధి చేసే కర్మాగారాలు అడుగుకొకటి ఈ దేశానికి అవసరంగా ఉంది.’
‘పురుషుడు ‘నా ఇల్లు’ నుంచి ‘మన ఇల్లు’ వరకు ఎదగాల్సి ఉంది.’
‘హింస అంటే కొట్టడం, తిట్టడమే కాదు, కల్చరల్ డిస్ ప్లేస్ మెంట్ కూడా ‘
‘నిర్దేశిత కటి ధర్మాన్ని పాటిస్తూ నిర్దేశిత కటిధర్మాన్ని నిర్వర్తించేంతవరకూ స్త్రీ ప్రయాణం సాగాల్సిందేనా?’
‘రైతు ఆత్మహత్య అని మాత్రమే పేపర్ లో వస్తుంది. ‘భార్య జీవచ్ఛవం’ అని ఎవరూ రాయరు.’
కొన్ని చోట్ల ఈ వ్యాఖ్యలు వచనం స్థాయి దాటి కవిత్వంగా మారిపోయినవి కూడా ఉన్నాయి. చూడండి:
‘విరమించుకోవడం అనేది ఉంటుంది స్త్రీలలో. చిన్నప్పుడు ఒడిలో కూచోబెట్టుకున్న మేనమామ ఏదో చేస్తాడు. ఆ పాపకి అర్థమయ్యి భయంవేసి భీతిల్లి ఆ తదుపరి విరమించుకుంటుంది-సంతోషం నుంచి, వికాసం నుంచి, ఆశనుంచి, స్త్రీత్వం నుంచి..’
తన సంకలనాన్ని ‘స్త్రీలకు ప్రథమ వాచకం అనీ, పురుషులకు పెద్ద బాలశిక్ష’ అనీ సంకలనకర్త రాసుకున్నాడు. అయితే ఈ వాచకాన్నీ, ఈ పెద్దబాలశిక్షనీ నలుగురూ చదివేలా చేయవలసిన బాధ్యత మాత్రం మనదే.
16-3-2019
స్త్రీ కథలు,50.ప్రధమ వాచకం, చదవాలి మాకు దొరకనే లేదు.. త్వరలో, ఎలాగైనా సంపాదిస్తా!