పాతాళభైరవి

మొన్న విజయవాడ నుంచి బస్సులో వస్తూండగా బస్సువాడు అనూహ్యంగా పాతాళభైరవి సినిమా వేసాడు. గత రెండు నెలలుగా బస్సుల్లో కొత్త తెలుగు సినిమాలు చూసీ చూసీ నా కళ్ళు కూడగట్టుకున్న అలసట మొత్తం ఒక్కసారిగా ఎగిరిపోయింది.

పాతాళభైరవి నా శైశవానికి సంబంధించిన సినిమా అనుకున్నానిన్నాళ్ళూ. కాని మొన్న మళ్ళా చూసేక, ఆ శైశవం చెక్కుచెదరకుండా అట్లానే ఉందనీ, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మళ్ళా ఆ లోకానికి ఎగిరిపోవచ్చనీ అర్థమయింది.

చాలా చాలా ఏళ్ళ కిందటి మాట. 1972 వేసవి. తొలకరి వాన జల్లు పడుతున్నవేళ మా అన్నయ్య నన్ను కాకినాడలో కల్పన థియేటర్లో ఆ సినిమాకి తీసుకువెళ్ళాడు. ఇంకా చందమామల ప్రపంచం నుంచి బయటకి రాని ఆ లేలేత వయసులో ఆ తొలివానజల్లులో వేడివేడి మొక్కజొన్నపొత్తులు తింటో ఆ సినిమా చూడటం నిజంగా ఒక అనుభవం. కాని అసలైన అనుభవం ఆ తర్వాత ఉంది. సినిమా చూసేక మేమిద్దరం మా మేనత్త ఇంటికి బయల్దేరాం. మధ్యలో పి.ఆర్. గ్రౌండ్స్ దాటాలి. నిర్జనమైన ఆ కాలేజి వీథిలో చుట్టూ చీకటి ముద్దల్లాగా చెట్లు, పొదలు. ప్రతి పొదనుంచీ ఏదో అరుపు వినవస్తున్నట్టే ఉంది. మా అన్నయ్యకు పధ్నాలుగు పదిహేనేళ్ళు. నాకు తొమ్మిదేళ్ళు. ఏవో అరుపులు వినబడుతున్నాయంటే మా అన్నయ్య ముందు చేతులు పైకెత్తి ‘జాయ్ పాతాళభైరవీ’ అన్నాడు. కానీ ఆ మంత్రం ఎక్కువసేపు పనిచెయ్యలేదు. చివరికి వాడు నన్ను వీపు మీద ఉప్పుబుట్ట ఎక్కించుకుని పరుగులాంటి నడక తియ్యక తప్పలేదు.

పాతాళ భైరవి ఎప్పుడెప్పుడు ఎవరితో చూసానన్నది దానికదే ఒక క్రానికల్. గత డెబ్భయ్యేళ్ళుగా అది తెలుగువాళ్ళ జీవితంలో భాగమైపోయింది. నాలాంటి వాడికి జీవితపు ప్రతి మలుపులోనూ ఒక కొండగుర్తుగా నిలబడిపోయింది. మా శరభవరం బాల్యమిత్రుడు అడ్డాల ఇమ్మానియేలుకి మొదటిసారి పాతాళభైరవి చూపించినప్పుడు, రాకుమారికి తోటలో పాము కనిపించిన దృశ్యం తర్వాత వెంటనే రాజమందిరంలో జ్యోతిష్కులు ఆమె జన్మకుండలిని పరిశీలించే దృశ్యం రాగానే, వాడు సీట్లో ముందుకు వంగి ‘ఇప్పుడు మనం కథలో అడుగుపెట్టాం’ అన్నాడు. ఆ పరిశీలనాత్మక క్షణం నాకెంతో విలువైనదీ, నేనెప్పటికీ మర్చిపోలేనిదీను.

జీవితంలో మరే కొత్త సంగతులు చూసినా, మరే అద్భుతాలు చూసినా, మరే విలువైన సందర్భాలు తారసపడినా, సాధారణంగా పల్లెటూరి మనుషులు, తమ చిన్నప్పుడు తమ ఊళ్ళో తాము చూసినవాటికి అవేవీ సాటిరావని చెప్పుకుంటూ ఉంటారు. పాతాళభైరవికి సంబంధించినంతవరకూ, నాది కూడా అలాంటి పల్లెటూరి మనస్తత్వమే. అట్లాంటి కూపస్థమండూక గుణంతో ఆ సినిమాగురించి ఎవరు ముచ్చటించినా నాకు చెప్పలేని సంతోషం కలుగుతుంది. చాలా ఏళ్ళ కిందట, రాజమండ్రిలో, ఒక రాత్రి మిత్రుడు మహేశ్ తో కలిసి ‘రెయిడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్’ అనే సినిమాకి వెళ్ళాం. ఆ సినిమా చూసాక సైకిళ్ళు తొక్కుకుంటూ పోతున్నప్పుడు, ఆ రాత్రి పేపర్ మిల్లు రోడ్డు మీద, మహేశ్ అన్నాడు కదా ‘ఏమైనా చెప్పు, పాతాళభైరవిలో తోటరాముడు మంత్రాలమర్రి ఎక్కగానే హటాత్తుగా ఒక మరుగుజ్జు రాక్షసుడు ప్రత్యక్షమై అతడి కాళ్ళు పట్టుకు లాగేబోతాడు చూడు, ఆ దృశ్యం చూసినప్పుడు కలిగిన భయం, వణుకు నాకు మరే హారర్ సినిమా చూసినా కలగడం లేదు’ అని. చెప్పొద్దూ, అదేమిటో, ఆ మాటలు చెప్తున్నప్పుడు నా మిత్రుడు నన్నే పొగుడుతున్నాడనిపించింది.

తెలుగు సినిమా చరిత్రలోనూ, తెలుగు వాళ్ళ ఆధునిక సామాజిక జీవితంలోనూ శైశవం అదృశ్యమవుతున్న కాలంలో పాతాళభైరవి వచ్చింది. అప్పుడప్పుడే పట్టణీకరణ మొదలవుతున్న ఆ రోజుల్లో, శైశవం ఒక స్మరణీయ జ్ఞాపకంగా మారవలసిన తరుణంలో కె.వి.రెడ్డి, పింగళినాగేంద్ర రావు కలిసి సృష్టించిన మాయాజాలమది. రామాయణం, కథాసరిత్సాగరం, కాజీమజిలీ కథలు, వెయ్యిన్నొక్క అరేబియా రాత్రులు, బాలనాగమ్మ, భట్టివిక్రమార్క కథలు, షేక్స్పియర్, స్టీవెన్ సన్ మొదలైనవారంతా ఆ కథలో విడదీయలేనంతగా కలిసిపోయాయి. అది ఒక myth-making. ఒక టోల్కిన్ లాగా, ఒక రౌలింగ్ లాగా, పింగళి నాగేంద్రరావు తెలుగువాళ్ళకోసం సృష్టించిన ఒక మాజికల్ ప్రపంచమది. ఆ సంగతి నాగిరెడ్డికీ, చక్రపాణికీ కూడా తెలుసుకనుకనే సినిమా టైటిల్సులో అందరికన్నా ముందు రచయిత పేరు వేసారు.

ప్రతి సినిమాలోనూ పింగళి నాగేంద్రరావుకి ఒక నినాదం ఉంటుంది. ‘ఐశ్వర్యాలు పోవచ్చుగానీ, ప్రతాపాలెక్కడికి పోతాయి’ అనేది మాయాబజార్ లో కీలకమైన వాక్యం. ఆ సినిమా మొత్తం ఆ వాక్యం చుట్టూతానే పరిభ్రమిస్తూంటుంది. ‘పల్లకీలు, భవనాలూ, పరివారం’ పాతాళభైరవిలో కీలక పదాలు. రాజు తన కూతురినిచ్చి పెళ్ళి చెయ్యాలంటే తోటరాముడికి పల్లకీలు, భవనాలూ, పరివారమూ ఉండాలన్నాడు. ఆ యువకుడు రిసెషన్ కి ముందు అమెరికావెళ్ళి వాటన్నిటితో ఒక ఎన్నారైలాగా తిరిగివచ్చాడు. కానీ, రిసెషన్ వాటన్నిటినీ కళ్ళముందే అదృశ్యం చేసేగలదని ఆ రాజుకి తెలిసొచ్చేటప్పటికి, తన కూతురిని రక్షించగలిగేది తోటరాముడి ప్రేమ తప్ప మరేమీ కాదని అర్థమయింది.

జానపదకథలన్నింటిలోనూ ఉండే అమాయికమైన నైతికతనే పాతాళభైరవిలో కూడా ఉన్నది. నువ్వు అదృష్టమ్మీదనో, మరొకరి శక్తి మీదనో ఆధారపడి ఎంతైనా సంపాదించవచ్చుగాక, అది నిలబడదు. కలకాలం నిలబడేదల్లా నువ్వు సొంతంగా ఏది సాధించగలవో అది మటుకే. ఈ నిష్కాపట్యం వల్లనే ఈ నీతికథ విన్నప్పుడల్లా మనలోని శిశువు సంతోషంతో ఊకొడుతున్నాడు. ఇట్లాంటి కథ ఇప్పటి మన కాలంలో మనం ఊహించలేం. ఇప్పుడు రచయితలూ, ప్రేక్షకులూ కూడా తెలివిమీరిపోయారు. ఒక బాహుబలి ఎప్పటికీ మరొక పాతాళభైరవి కాలేదు.

దర్శకుడిగా కె.వి.రెడ్డి ప్రతిభ గురించీ, ఆయనకీ బి.ఎన్.రెడ్డికీ మధ్య కళాశిల్పంలో ఉన్న సున్నితమైన భేదాల గురించీ భమిడిపాటి జగన్నాథ రావు గారు చెప్తూ ఉండగా రాత్రి పొద్దుపోయేదాకా మంత్రముగ్ధులుగా వింటూ ఉండటం ఒక అనుభవం. నా రాజమండ్రిరోజుల్లో సుప్రసిద్ధ నాటక ప్రయోక్త టి.జె.రామనాథం గురించి మాట్లాడుకుంటున్నప్పుడల్లా ఆయనికీ, కె.వి.రెడ్డికీ మధ్య పోలికలు వెతుక్కోవడం నాకూ మహేశ్ కీ ఒక తీరిక సమయపు వ్యాపకంగా ఉండేది.

కె.వి.రెడ్డి స్క్రీన్ ప్లే గురించీ, ఒక దృశ్యాన్ని మన కళ్ళకు కట్టేలా చిత్రించడంలో చిన్న చిన్న డిటెయిల్స్ లో కూడా ఆయన తీసుకునే శ్రద్ధ గురించీ ఎన్నిసార్లేనా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాత్రి దృశ్యాలు చిత్రించడంలో ఆయన సిద్ధహస్తుడు. మాయాబజార్ లో ఘటోత్కచుడు ద్వారకలో ప్రవేశించే దృశ్యం చూడండి. సాక్షాత్తూ శ్రీకృష్ణుడే నివసించే ద్వారకలో రాత్రి కాపలా కేవలం ఒక లాంఛనపూర్వక బాధ్యత మాత్రమే. ఆ కాజువల్ యాటిట్యూడ్ ఆ రాత్రి కాపలాదారులందరిలోనూ కనిపిస్తుంది. కృష్ణుడి కన్నుగప్పి ఆ ద్వారకలోకి ఎవరూ అడుగుపెట్టలేరనే దిలాసా అది.

పాతాళభైరవిలో కూడా రాత్రి దృశ్యాలు చాలా కీలకమైనవీ, విలువైనవీను. తోటరాముడు రాకుమారిని చూడటానికి ఉజ్జయిని రాజమహల్లో అంతఃపురంలో ప్రవేశించినప్పుడు, అయిన గలాటాలో, మధ్యలో, ఒక దళపతి, అంతకు ముందు తన్నులు తిన్నవాడే, శయనమందిరంలోంచి బయటకు అడుగుపెట్టి మళ్ళా లోపలకి పారిపోతాడు. తర్వాత సైనికులంతా కలిసి తోటరాముణ్ణి బందీ చేసాకగానీ ఆ దండనాయకుడు మళ్లా కనిపించడు. ఆ ఒక్క దృశ్యం చాలు, ఆ రాజ్యం గురించి మనకి చెప్పడానికి. తోటరాముణ్ణి మొదటిసారి చూసినప్పుడు ‘సాహసవంతులైన పౌరులే ఉజ్జయినికి శ్రీరామరక్ష ‘ అని రాజు ఎందుకు పరవశించిపోయాడో అర్థమవుతుంది.

అన్నిటికన్నా ఈ సారి నా మనసు దోచుకున్న దృశ్యం, నన్ను నిస్తబ్ధుణ్ణి చేసిన సన్నివేశం- తోటరాముడు అర్థరాత్రి తన మందిరంలో ప్రవేశించినప్పుడు, అతణ్ణి వెతుక్కుంటూ రాజుగారి బావమరిది ఆమె గదిలో చేరి మొత్తం గాలించి వట్టి చేతుల్తో బయటకు వెళ్ళినప్పుడు, అతణ్ణి బయటకు పంపి, ఆ తలుపు లోపలి గడియ వేసేసిన తర్వాత రాకుమారి, అక్కడే ఆ తలుపుకి ఆనుకుని నిస్త్రాణగా నిలబడిపోయిన దృశ్యం. అది ఒక మహాకథకుడు మాత్రమే ఊహించగలిగిన దృశ్యం. ఆమె ఆ తలుపు గడియపెట్టేసి వెనువెంటనే తోటరాముడిదగ్గరకు పరుగెత్తివెళ్ళినట్టు చూపించవచ్చు. కాని ఆమె అట్లా ఒక క్షణం పాటు నిస్త్రాణతో నిలుచుని పోవడంలోనూ, ఆ తర్వాత భారంగా కాళ్ళీడ్చుకుంటూ తన శయ్యదగ్గరకు వెళ్ళి శూన్యచిత్తంతో కూచుండిపోవడంలోనూ, ఆ ప్రతి అడుగులోనూ, ఆమె ప్రేమైక హృదయమే కనిపిస్తూ ఉంది. ఈసారి మాత్రం నటనావైదుష్యంలో రామారావు, రంగారావు, సి.ఎస్.ఆర్, రేలంగిలకన్నా మాలతి మరెన్నో మెట్లు ఎత్తులో కనిపించింది.

తెలుగునాడుని నాటకాలు ఏలుతున్న కాలంలో బాలనాగమ్మా, సినిమాలు మొదలయ్యాక పాతాళభైరవీ జాతి శైశవప్రపంచాన్ని మూటగట్టి ఒక మాంత్రికలోకాన్ని నిర్మించాయి. అద్భుత శక్తులూ, మంత్రాలూ, మాయా, గారడీలతో నడిచే ఆ కథలో ఉన్నదంతా మానుష ప్రపంచమే. అత్యంత అమాయికమైన మనుష్యలోకం. తనని నేపాళ మాంత్రికుడు స్త్రీగా మార్చి, మళ్ళా మగవాడిగా మార్చగానే, రాజుగారి బావమరిది అన్నిటికన్నా ముందు తన మీసముందో లేదో అని తడిమిచూసుకునేటంత అమాయికమైన లోకం. ఆ శైశవాన్ని ఒక జాతిగా మనం కోల్పోయాం. నిజమే, కాని, ఆ సినిమా చూసినప్పుడల్లా ఆ శైశవం మనకోసం సిద్ధంగా ఉంటుందనే మొన్న రాత్రి నాకు కొత్తగా తెలిసొచ్చింది.

ఇద్దరు రాక్షసులు తమలో చెప్పులెవరు తీసుకోవాలో, శాలువా ఎవరికి చెందాలో తీర్పు చెప్పమని బాలకృష్ణని అడుగుతుండగా వనస్థలిపురం వచ్చింది. బస్సువాడు సినిమా కట్టేసాడు. అదీ మంచిదే అనుకున్నాను. ఆ పసితనపు లోకమింకా కొంత మిగిలిపోతేనే కదా మళ్ళా మళ్ళా మరోసారి ఆ లోకానికి పోయి రావాలనిపించేది.

10-3-2019

Leave a Reply

%d