దక్షిణమారుతం తాకినట్లుగా

Reading Time: 2 minutes

మొన్న ఆఫీసు పనిమీదే దిల్లీ వెళ్ళినా అది మళ్ళా బహిరిసన్స్ చూడటానికి వెళ్ళినట్టే అయింది. అక్కడ కవిత్వసంపుటాలతో పాటు అమృత ప్రీతమ్ పుస్తకమొకటి నన్ను ఆకర్షించింది. Fifty Fragments of Inner self (2019) చేతుల్లోకి తీసుకోగానే అదొక ప్రత్యేకమైన పుస్తకమని అర్థమైపోయింది.

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి యాభై ఏళ్ళు పూర్తయినసందర్భంగా, 1997లో రాసిన పుస్తకం అది. అందులో భారతీయ సంస్కృతికీ, ఆధ్యాత్మిక సంస్కారానికీ సంబంధించిన యాభై భావనలున్నాయి. జెన్ సాధువులు, సూఫీ దర్వేషులు చెప్పే కథల్లాంటి కథలున్నాయి. ఆమె అట్లాంటి పుస్తకమొకటి రాయాలనుకోవడం వెనక ఆమె మీద ఓషో ప్రభావం ఉందని కూడా అనిపించింది. ఓషో తక్కిన ప్రపంచానికి వివాదాస్పదుడైనప్పుడు కూడా, అమృత ప్రీతమ్ ఆయన పట్ల తన నమ్మకాన్నీ, గౌరవాన్నీ అట్లానే నిలుపుకోగలిగింది. ఎంత గౌరవమంటే, ‘మీరా నాట్యమూ, బుద్ధుడి మౌనమూ ఒక్కటయ్యే చోటు ఓషో’ అనగలిగేటంత.

ఆ పుస్తకం ఆ సాయంకాలమే, ఎయిర్ పోర్టులోనే, విమానమెక్కేలోపలే పూర్తిచేసేసాను. ఎండవేడికి అలసిపోయిన దేహాన్ని దక్షిణమారుతం తాకినట్లుగా ఉందా పుస్తకం నా మనసుకీ, అంతరాత్మకీ.

అందులోంచి ఒక చిన్న కథ మీకోసం.

~
అంతస్సత్త్వం

ఒకప్పుడు మహావీరుడూ, గోశాలకుడూ ఎక్కడికో వెళ్తున్నారట. వాళ్ళొక గ్రామం మీంచి వెళ్తున్నప్పుడు దారిలో ఒక మొక్క కనబడింది. ఆ మొక్కని చూస్తూ గోశాలకుడు ‘ఏమంటావు మిత్రమా? ఈ మొక్క గురించి నీ అభిప్రాయమేమిటి? ఇది ఎప్పటికేనా వికసిస్తుందా? పూలు పూసేదాకా బతికి బట్ట కడుతుందా?’
అనడిగాడు.

మహావీరుడు ఆ మొక్కని పరీక్షగా చూసాడు. కొద్దిసేపు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. అప్పుడు ‘తథ్యం. ఈ మొక్క పూలు పూసేదాకా బతికి తీరుతుంది’ అన్నాడు.

అతడు ఆ మాటలు అంటూనే, గోశాలకుడు ఆ మొక్క దగ్గరికి వెళ్ళి మహావీరుడి కళ్ళముందే ఆ మొక్కని వేళ్ళతో ఊడబెరికి, నవ్వుతూ ‘ ఇప్పుడు చెప్పు, ఇదింక పూలెట్లా పూస్తుంది?’ అనడిగాడు. మహావీరుడు ఏమీ మాట్లాడలేదు. చిరుమందహాసం చేసి ఊరుకున్నాడు. వాళ్ళిద్దరూ ఆ ఊరు దాటి తాము వెళ్ళవలసిన చోటకి నడక కొనసాగించారు. ఈలోపు వాన పడటం మొదలయ్యింది. కుంభవృష్టిగా మారిపోయింది. దాంతో వాళ్ళు వెళ్ళినచోట ఒక్కరోజు ఉండాలనుకున్నవాళ్ళు వారం రోజుల పాటు ఉండిపోవలసి వచ్చింది. వాన తగ్గాక, వారం రోజుల తర్వాత వాళ్ళు వచ్చిన దారినే తిరుగు ప్రయాణమయ్యారు. ఆ దారమ్మట, వాళ్ళంతకు ముందు ఆ మొక్కదగ్గర ఆగిన చోటకే మళ్ళా చేరుకున్నారు. అక్కడ ఊడబెరికి పక్కన పారేసిన మొక్క నిటారుగా నిలబడి ఉంది. దాని ఆకులమధ్య ఎర్రని పువ్వొకటి నిండారా వికసించి తళుకులీనుతూ ఉంది.

ఆ మొక్కని, ఆ పువ్వుని చూస్తూ గోశాలకుడు నివ్వెరపోయాడు. ‘నమ్మలేకుండా ఉన్నాను. నేనే కదా, ఈ మొక్కని వేళ్ళకంటా పెకలించేసింది. ఇది మళ్ళా ఎట్లా వేళ్ళూనగలిగింది? ఇది పూలు పూసేదాకా బతుకుతుందని నువ్వు చెప్పిన జోస్యం ఎట్లా ఫలించింది?’ అనడిగాడు మహావీరుణ్ణి.

మహావీరుడు అతడితో ఇట్లా చెప్పాడు:

‘అందుకనే నేనా రోజు ఆ మొక్క దగ్గర ఆగి పరీక్షగా చూసింది. నేనా రోజు దాని అంతస్సత్త్వం ఏ మేరకు బలంగా ఉందో పరీక్షించడానికే దాని జీవంలోపలకంటా చూసాను. అది బతకాలని కోరుకుంటోందా లేక చనిపోవాలనుకుంటోందా అని చూసాను. అది చనిపోవాలనుకుని ఉంటే, నువ్వు దాన్ని ఊడబెరికినప్పుడే చచ్చిపోయి ఉండేది. అదట్లా చచ్చిపోడానికి నువ్వు సాయం కూడా చేసావు కదా! నువ్వు నన్నా ప్రశ్న అడిగినప్పుడు, నువ్వు దాన్ని మృత్యుమార్గంలోకి నెడతావనే నేనూహించాను. కాని ఆ మొక్కకి బతకాలన్న కోరిక చాలా ప్రగాఢంగా ఉంది, కాబట్టే అది మరణం అంచులనుంచి వెనక్కు వచ్చింది. వాననీటికి కొట్టుకొచ్చిన మట్టి దాని వేళ్ళ చుట్టూ పోగవడంతో అది మళ్ళా బలం పుంజుకుని పైకి లేచింది, వేళ్ళూనుకుని పువ్వు పూసింది.’

అది ఆ మొక్క అంతస్సత్త్వం. దాని లోపలి బలం.

17-5-2019

Leave a Reply

%d bloggers like this: