గ్రేటా థున్ బెర్గ్ ఎఫెక్టు

గ్రేటా థున్ బెర్గ్ ఒక స్వీడిష్ బాలిక. 2003 లో పుట్టింది. ఇప్పుడామెకు పదహారేళ్ళు. మన రాష్ట్రంలో ఉండి ఉంటే ఐ ఐటి కోసం ఏ కార్పొరేట్ కాలేజీలోనో ఇంటర్మీడియెటు చదువుతూ ఉండేది.

కాని ఆమె బడిమానేసింది.

బడి మానేసి ఆమె ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్నది, తన మాటల్తో, తన ఆవేదనతో, మానవాళి మనుగడ కోసం పరితపిస్తున్న హృదయంతో ఆమె ప్రపంచాన్ని కుదిపేస్తున్నది.

గ్రేటా తండ్రి రంగస్థల కళాకారుడు. తల్లి అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఒపేరా గాయని. మన పర్యావరణానికి సంభవిస్తున్న ముప్పు గురించి ఆమె తన ఎనిమిదేళ్ళప్పుడు మొదటిసారిగా వింది. అప్పుడామెకేమీ అర్థం కాలేదు. మరొక మూడేళ్ళు గడిచాయి. పర్యావరణమంటే ఏమిటో, జీవావరణమంటే ఏమిటో ఆమెకి నెమ్మదిగా తెలిసివచ్చింది. పదకొండేళ్ళ వయసువచ్చేటప్పటికి ఆమెని గొప్ప దిగులు కమ్మేసింది. ముభావంగా మారిపోయింది. నలుగురితో మాట్లాడటం మానేసింది. ఆమె లోపల్లోపల చెప్పలేనంత సంక్షోభానికి లోనయ్యింది.

‘బహుశా నేను ఎక్కువగా ఆలోచిస్తానేమో. కొంతమంది విన్నవి విన్నట్టు మర్చిపోతారు. జరిగేవి జరగనీ అనుకుంటారు. నేనలా అనుకోలేను. అందులోనూ నన్నేదన్నా బాధపెట్టేదీ, నాకు దిగులుపుట్టించేదీ ఎదురైతే దాన్నస్సలు మర్చిపోలేను. నా చిన్నప్పుడు స్కూల్లో మా టీచర్లు సినిమాలు చూపించేరు. సముద్రాల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్ గురించీ, ఆకలితో కృశించిపోతున్న ధ్రువప్రాంతపు ఎలుగుబంట్ల గురించీ చూపించేరు. అవి చూస్తున్నంతసేపూ నేను ఏడుస్తూనే ఉన్నాను. నా తోటి విద్యార్థులు కూడా వాటిని చూస్తున్నంతసేపూ బాధపడుతూనే ఉన్నారుగాని, ఆ సినిమాలు చూడటం అయిపోగానే వాటిని మర్చిపోయేరు. నేనట్లా మర్చిపోలేకపోయాను. ఆ దృశ్యాలు నా బుర్రలో ఇరుక్కుపోయాయి ‘అందామె గార్డియన్ పత్రిక కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో.

ఆమెకి పన్నెండేళ్ళ వయసురాగానే మానసికంగా అస్వస్థతకి లోనైందని గుర్తించారు. ఆమె లోపల్లోపల చెప్పలేనంత ఆందోళన సుళ్ళు తిరగడం మొదలుపెట్టింది. ‘ ఈ పరిస్థితిమీద ఏదోలా నా నిరసనని వ్యక్తం చెయ్యకపోతే నేను బతకలేననిపించింది’ అందామె. ఆ ఆందోళనలోనే పోయిన ఏడాది ఆగస్టులో ఆమె బడికి వెళ్ళడం మానేసింది.

ఆగస్టు 20, 2018.

ఆ రోజు ఆమెకి బడికి వెళ్ళలేదు. అందుకు బదులు ఒక అట్టముక్క తీసుకుని ఒక నినాదం రాసుకుంది. నేరుగా తన సైకిల్ మీద స్వీడిష్ పార్లమెంటు ప్రాంగణానికి చేరుకుంది. ఆ పార్లమెంటు భవనం ముందు ఆ ప్లకార్డు పక్కన పెట్టుకుని పొద్దున్న ఎనిమిదిన్నర నుంచి మధ్యాహ్నం మూడింటిదాకా కూర్చుంది. ఒక్కర్తే. ఒక్క మాటలేదు, ఒక్క స్లోగన్ లేదు. ఒక్కర్తే. మౌనంగా, లోపల రగులుతున్న అగ్నిపర్వతం లాంటి ఆవేదనతో, సమస్త మానవాళి భవిష్యత్తుకోసం చల్లారని తపనతో.

రెండో రోజు కొంతమంది మిత్రులు ఆమె పక్కన చేరారు.

మూడవ రోజుకి మరికొంతమంది.

ఆ పదిహేనేళ్ళ బాలిక మొదలుపెట్టిన ఆ మౌన పోరాటం కార్చిచ్చుగా మారింది.

15 మార్చి 2019.

112 దేశాల్లో 14 లక్షలమంది పిల్లలు బడికి వెళ్ళడం మానేసారు. స్కూలు స్ట్రైక్ మూమెంట్ ప్రపంచవ్యాప్త ఆందోళనగా మారింది.

24 మే 2019.

ఇప్పుడు ఆ దావానలం 125 దేశాలకు పాకింది.

టైం పత్రిక ఆ నెల తన ముఖచిత్రంగా గ్రేటా ను ఎంపిక చేసుకుంది. ఆమెకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని నార్వేజియన్ పార్లమెంటు తీర్మానం చేసింది.

కాని గ్రేటా దృష్టి వీటిమీద లేదు. ఆమె మరింత మరింతగా ప్రపంచాన్ని మేల్కొల్పుతూనే ఉంది. వాణిజ్యశక్తుల్ని ఉద్దేశించి నిర్మొహమాటంగా మాట్లాడుతూనే ఉంది. అన్నిటికన్నా ముందు ఆమె తన జీవితవిధానాన్ని మార్చుకుంది. తన ప్రయోగాల్ని తన తల్లిదండ్రుల మీదనే చేయడం మొదలుపెట్టింది. ఆమె మాట విని ఇంట్లో తల్లిదండ్రులు మాంసాహారం మానేసారు. పర్యావరణాన్ని కాపాడాలంటే ముందు విమానప్రయాణాలు మానెయ్యాలని చెప్పింది తన తల్లితో. ఆమె అంతర్జాతీయ స్థాయి గాయని. విమానాల్లో ప్రయాణించకపోతే ఆమెకి గడవదు. కాని ఆమె తన కుమార్తె మాటల ప్రభావానికి తన కెరీర్ వదిలేసుకుంది. ఈ ఒక్క ఏడాది లోనే స్వీడిష్ రైల్వే ప్రయాణీకులు ఎనిమిది శాతం పెరిగారని అంచనా. పర్యావరణం కోసం ఏర్పాటైన ఒక సమావేశానికి ప్రతినిధులంతా విమానాల్లో వచ్చారు. గ్రేటా మాత్రం 32 గంటల పాటు రైల్లో ప్రయాణించి మరీ వచ్చింది. ‘మీరు ఆచరణలో చూపకుండా పర్యావరణాన్ని కాపాడలేరు ‘అని చెప్పిందామె ఆ ప్రతినిధులతో.

ఇప్పుడు ప్రపంచమంతా ఎక్కడ చూసినా గ్రేటా థున్ బెర్గ్ ఎఫెక్టు. ఒక బ్రిటిష్ రాజకీయ నేత అన్నట్టుగా ఆమెని వింటున్నంతసేపూ ప్రపంచం చెప్పలేనంత ఆరాధనకీ అదే సమయంలో అపరాధభావనకీ, సిగ్గుకీ కూడా లోనవుతున్నది. కాని కొత్త బాధ్యతను కూడా తలకెత్తుకోడానికి ఉత్సాహపడుతున్నది.

గ్రేటా థున్ బెర్గ్ ప్రసంగాలు వింటుంటే మహాత్మాగాంధీని వింటున్నట్టు అనిపిస్తే ఆశ్చర్యం లేదు. మాటల్లో అదే సూటిదనం, అదే సత్యసంధత. అదే నిర్భరత్వం, అదే నిర్భయత్వం.

ఆమె ప్రసంగాలు రెండు, తెలుగులో, మీ కోసం.

~

మనమంతా కలిస్తే ఎంత మార్పు తేగలమో ఊహించండి

నా పేరు గ్రేటా థున్ బెర్గ్. నాకు పదిహేనేళ్ళు. నేను స్వీడన్ నుంచి వచ్చాను. మన పర్యావరణానికి మనం చేస్తున్న అన్యాయం గురించి, చెయ్యవలసిన న్యాయం గురించీ మాట్లాడాలనుకుంటున్నాను.

చాలామంది దృష్టిలో స్వీడన్ ఒక చిన్నదేశం. ఇక్కడ మేమేం చేసినా ప్రపంచానికేమీ కాదు అని వాళ్ళ నమ్మకం. కాని, నేనొకటి గ్రహించాను. ప్రపంచాన్ని మార్చడానికి ముందుకొచ్చే వాళ్ళెవ్వరినీ చిన్నవాళ్ళుగా భావించలేం. ఎక్కడో కొద్దిమంది పిల్లలు బడికి వెళ్ళడం మానేస్తే ప్రపంచమంతా వార్తాపత్రికలు పతాక శీర్షికల్లో రాస్తున్నాయంటే, గ్రహించండి, మనమంతా కలిస్తే ఎంత మార్పు తేగలమో ఊహించండి.

కానీ అలా చెయ్యాలంటే ముందు మనం స్పష్టంగా మాట్లాడుకోవాలి. అలా మాట్లాడుకోవడం ఎవరికి ఎంత ఇబ్బందిగా అనిపించినా సరే. మీరెప్పుడూ సతతహరిత ఆర్థికాభివృద్ధి గురించే ఎందుకుమాట్లాడతారంటే, అది కాక మరొకటి మాట్లాడితే, ఎక్కడ అపకీర్తి మూటగట్టుకోవలసి వస్తుందో అని మీ భయం. మీరెంతసేపూ ఆ పాతకాలపు ఆలోచనల్తోనే ముందుకు పోవాలనుకుంటారు. ఆ ఆలోచనలే మననీ రొంపిలో పడేసాయి. ఇప్పుడు, ఎమెర్జెన్సీ బ్రేకు నొక్కడం తప్ప మనం మరొకటేమీ చెయ్యలేని వేళ కూడా, అవే పాత మాటలు.

ఉన్నదున్నట్టుగా చెప్పే పరిణతి లేదు మీకు. చివరికి ఆ భారం కూడా మీరు పిల్లల మీదకి నెట్టేస్తున్నారు. నాకేమీ కీర్తిమూటగట్టుకోవాలన్న తాపత్రయం లేదు. నా ధ్యాస మొత్తం మన వాతావరణం మీదా, మనం జీవిస్తున్న ఈ గ్రహం మీదా మాత్రమే. కొద్ది మంది మనుషులు అపారంగా సంపద మూటగట్టుకోవడం కోసం మన మొత్తం నాగరికతనే బలి ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. నా దేశం లాంటి దేశాల్లో మనుషులు విలాసవంతంగా జీవించడం కోసం మన జీవావరణం మొత్తాన్ని బలిచ్చేస్తున్నారు. కొద్ది మంది విలాసాల కోసం అత్యధికసంఖ్యాకులు కడగండ్ల పాలవుతున్నారు.

2078 నాటికి నా డెబ్బై అయిదవ పుట్టినరోజు వస్తుంది. బహుశా నాకు పిల్లలుంటే ఆ రోజు నేను వాళ్ళతో గడుపుతానేమో. నన్ను వాళ్ళా రోజు మీ గురించి అడుగుతారు. ఏదో ఒకటి చెయ్యడానికి ఇంకా సమయమున్నా కూడా ఈ రోజు మీరా పనులెందుకు చెయ్యలేదని వాళ్ళు ఆ రోజు నన్ను నిలదీస్తారు. మీరేమో మీకు మీ పిల్లలంటే ఇష్టమంటారుగాని, వాళ్ళ కళ్ళముందే వాళ్ళ భవిష్యత్తుని దొంగిలించేస్తున్నామని ఒప్పుకోరు. రాజకీయంగా ఏది సాధ్యమా అని కాదు, అసలు అన్నిటికన్నా ముందు మనం చెయ్యవలసిందేమిటని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోనంతకాలం, మనకి దిక్కు లేదు.

ఒక సంక్షోభాన్ని సంక్షోభంగా గుర్తించకుండా దాన్ని పరిష్కరించలేం. చమురునీ, సహజవాయువుల్నీ భూగర్భంలోనే ఉండనిద్దాం. మనం భూమ్మీద ప్రతి ఒక్కరం నిర్వహించ వలసిన బాధ్యత నిర్వహించటమెట్లానో ఆలోచిద్దాం. ఒకవేళ ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో పరిష్కారాలు వెతకడం సాధ్యం కాకపోతే, అసలు ముందు ఈ వ్యవస్థనే మార్చేద్దాం. మనమిక్కడికొచ్చింది ప్రపంచనేతల్ని ప్రాధేయపడటం కోసం కాదు. మీరు మమ్మల్ని గతంలోనూ పట్టించుకోలేదు, ఇప్పుడూ పట్టించుకోరు. మాకు సంజాయిషీలు వినే ఓపికా లేదు, తీరికా లేదు. మేమిక్కడికొచ్చింది, మీకు ఒక స్పష్టంగా ఒక మాట చెప్పడానికే, అదేమంటే, ప్రపంచం చాలా తొందరగా మారిపోతున్నది, ఏదో ఒక నిర్ణయం తీసుకునే అంతిమాధికారం ప్రజలదే! ఆ మాట చెప్పడానికే నేనిక్కడికొచ్చాను.

ధన్యవాదాలు!

(డిసెంబరు 12, 2018 న జరిగిన COP 24 ప్లీనరీ సమావేశంలో చేసిన ప్రసంగం)

2

మన ఇంటికి నిప్పంటుకుంది

మన ఇంటికి నిప్పంటుకుంది. మన ఇల్లు తగలబడిపోతోందని చెప్పడానికే నేనిక్కడున్నాను. ఐపిసిసి చెప్పేదాన్ని బట్టి చూస్తే, మనం మన తప్పుల్ని దిద్దుకోలేని స్థితికి చేరడానికి పుష్కరకాలం కూడా పట్టేట్టులేదు.

ఆ లోగా మనం ఇప్పటిదాకా చెయ్యని పనులెన్నో చెయ్యాల్సి ఉంటుంది. మనం విడుదల చేస్తున్న కార్బన్ డై ఆక్సైడు కనీసం సగానికన్నా తగ్గించవలసి ఉంటుంది. ఇది కాక పారిస్ ఒడంబడికని ప్రపంచవ్యాప్తంగా అమలు చెయ్యాలంటే, మనం ప్రతి ఒక్కరం సమానంగా పంచుకోవలసిన బాధ్యత కూడా ఉంది. వీటితో పాటు ఆర్కిటిక్ హిమరాశులు కరగడం మొదలుపెట్టాక విడుదల అవుతున్న మీథేన్ వాయువు ని నియంత్రించవలసిన బాధ్యత కూడా మనమీదే ఉంది.

ఇక్కడ దావోస్ లాంటి చోట, మనుషులు తమ జయగాథలు చెప్పడానికి ఇష్టపడతారు. కాని వాళ్ళ ఆర్థిక విజయాలకు మనం చెల్లించవలసి వచ్చిన ధర చాలా చాలా ఎక్కువ. వాతావరణ పరిరక్షణ విషయంలో మనం విఫలమయ్యామని ఒప్పుకోక తప్పదు. రాజకీయ ఉద్యమాలన్నీ కూడా ఇప్పుడున్న రూపంలో ఈ అంశంలో విఫలమయ్యాయి. ప్రజలకి ఈ అంశం పట్ల కలిగించవలసిన జాగృతి కలిగించలేకపోవడంలో సమాచారప్రసార సాధనాలు కూడా ఘోరంగా విఫలమయ్యాయి. కాని, ఒక జాతిగా, హోమో సెపియన్స్ పూర్తిగా విఫలం కాలేదు. అంటే మనం విఫలమవుతున్నాం కానీ, మన చుట్టూ ఉన్న దాన్ని పరికించి చూసుకోడానికీ,సరిదిద్దుకోడానికీ, ఇంకా కొంత అవకాశం లేకపోలేదు. ఇంకా సమస్య మన చేతుల్లోంచి పూర్తిగా జారిపోలేదు. కానీ ప్రస్తుతం ఉన్న వ్యవస్థలు పూర్తిగా విఫలమయ్యాయని మనం గుర్తించకపోతే మాత్రం మనకి దిక్కులేదు.

అత్యధిక సంఖ్యాకులకి అపారమైన దుఃఖాన్నీ, వేదననీ తీసుకువస్తున్న ఈ మహోత్పాతం గురించి ఎవరూ మాట్లాడటం లేదు. మనం కూడా ఇంకా మెత్తగా మాట్లాడుతూ కూచొలేం. ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడగలమో, మాట్లాడలేమో తేల్చుకోవలసి ఉంది. మాట్లాడవలసిందేదో స్పష్టంగా మాట్లాడవలసి ఉంది. బహుశా హోమో సెపియన్స్ తమ చరిత్రలో ఇంత పెద్ద, ఇంత సంక్లిష్టమైన సంక్షోభాన్ని ఇంతదాకా ఎదుర్కొని ఉండలేదు.

చావో బతుకో తేల్చుకునే సమయాల్లో అస్పష్టతకి తావులేదు. ఏదో ఒకటి ఎంచుకునే అవకాశం మనకింకా లేకపోలేదు. ఇప్పుడున్నట్టే ఇలానే యథాతథపరిస్థితి కొనసాగిస్తూ విఫలమయిపోవడమా లేకపోతే ఒక సమూల పరివర్తన దిశగా అడుగులు వేస్తూ మానవాళి భవిష్యత్తును కాపాడుకోవడమా? నువ్వూ, నేనూ కూడా తేల్చుకోవలసిందిదే.

దీనికిట్లా ఉద్యమాలు చెయ్యడమెందుకంటారు కొందరు. మీరు ఓటేసి ఎన్నుకుంటున్న రాజకీయ నాయకులకే ఈ విషయాన్ని వదిలిపెట్టవచ్చు కదా అంటారు. కాని ఆ రాజకీయ నాయకులకు ఈ విషయంలో దృఢ సంకల్పం లేకపోతే మనమేం చెయ్యాలి? అటువంటి రాజకీయ కార్యకలాపాలు కనుచూపు మేరలో కూడా లేకపోతే మనమేం చెయ్యాలి?

తక్కినచోట్లలోలాగే, ఇక్కడ దావోస్ లో కూడా, ప్రతి ఒక్కళ్ళూ డబ్బు గురించే మాట్లాడుతున్నారు. డబ్బు సంపాదించడం, ఆర్థికంగా పైకి ఎదగడం- ఈ రెండే సమస్తమన్నట్టుగా కనిపిస్తోంది. వాతావరణ సంక్షోభాన్ని ఇప్పటిదాకా ఒక సంక్షోభంగా చూడనందువల్ల, మన నిత్యజీవితం మీద ఆ సంక్షోభం చూపించగల ప్రభావమేమిటో ప్రజల ఊహకి కూడా అందడం లేదు.

అత్యధిక సంఖ్యాకులైన ప్రజలకు కార్బన్ బడ్జెటు అంటూ ఒకటుంటుందని తెలీదు. ఆ బడ్జెటులో మనకి మిగిలింది స్వల్పాతిస్వల్పమేనని కూడా వాళ్ళకి తెలీదు. ఈ పరిస్థితి ఇప్పుడు మారాలి. త్వరితంగా అంతరించిపోతున్న కార్బన్ బడ్జెటును కాపాడుకోవడమే ఇవాళా, రేపూ కూడా మన అర్థశాస్త్రపాఠం కావాలి.

వినడానికి ఎంత కటువుగా ఉన్నా, ఈ మాటలు చెప్తూండటం ఆర్థికంగా లాభసాటికాకపోయినా కూడా, ప్రతి ఒక్కళ్ళూ స్పష్టంగా పర్యావరణ ప్రమాదం గురించి స్పష్టంగా మాట్లాడవలసిన సమయం నేడు చరిత్రలో ఆసన్నమైంది. మన ప్రస్తుత సామాజిక జీవనవిధానాన్ని మనం సమూలంగా మార్చుకోవాలి. నువ్వు కార్బన్ నిల్వల్ని ఎంత ఎక్కువ కర్చు చేస్తుంటే, నీ నైతిక బాధ్యత అంత ఎక్కువన్నట్టు. నీ ఆర్థిక వ్యవస్థ ఎంత పెద్దదైతే నీ బాధ్యత కూడా అంతే పెద్దది.

పిల్లలకి రేపటి పట్ల ఆశ కలిగించడం తమ బాధ్యత అని పెద్దవాళ్ళు అంటూంటారు. కాని నాకు మీ ఆశ వద్దు. మీరు కూడా ఆశావహులుగా ఉండకండి. మీకు చెప్పలేనంత బెంగ పుట్టాలని కోరుకుంటున్నాను. రోజూ నాకెంత భయం కలుగుతోందో మీకూ అంత భయం కలగాలని కోరుకుంటున్నాను. మీరు ఏదో ఒకటి చెయ్యాలని కోరుకుంటున్నాను. మీరో ప్రమాదంలో చిక్కుకుంటే ఏదో ఒకటి చెయ్యకుండా ఉండలేరే అట్లా ఏదో ఒకటి చెయ్యాలని కోరుకుంటున్నాను. మీ ఇంటికి నిప్పంటుకుంటే ఏం చేస్తారో అలా అన్నమాట. చూడండి, నిజంగానే మీ ఇంటికి నిప్పంటుకుంది.

(2019 లో దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో చేసిన ప్రసంగం)

22-7-2019

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading