కొత్త రక్తం

Reading Time: < 1 minute

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సర్వ శిక్ష అభియాన్ పథకానికి స్టేట్ ప్రాజెక్టు డైరక్టరుగా మొన్న సోమవారం బాధ్యతలు స్వీకరించినప్పటినుంచి మీతో ఆ విషయం పంచుకోవాలనే అనుకుంటూ ఉన్నాను. ఇప్పటికి తీరిక చిక్కింది.

నిజంగానే పెద్ద బాధ్యత. భగవంతుడి అనుగ్రహం, పెద్దల ఆశీస్సులు, మిత్రుల శుభాకాంక్షలు నాకు తోడుగా ఉన్నాయన్న నమ్మకం ఉంది.

నిన్న రెండు పాఠశాలలు సందర్శించాను. ఒకటి విజయవాడలో చెన్నుపాటి విద్యగారు 2012 లో నెలకొల్పిన వాసవ్య మహిళా మండలి పాఠశాల. సమాజంలో నిరాదరణకు గురైన బాలికలకోసం నడుపుతున్న హాస్టలు. ఆ పిల్లల్లో ప్రతి ఒక్కరిదీ ఒక కథ, టాల్ స్టాయి చెప్పినట్టు. కాని ప్రతి ఒక్క వదనంలోనూ ఒక భవిష్యత్తు కనిపిస్తోంది. కొద్దిగా బాసటగా నిలబడితే, ఆ చిన్నారులు, తమ జీవితాల్నీ, ప్రపంచాన్నీ కూడా తమ చేతుల్లోకి తీసుకోగలిగే ఆత్మవిశ్వాసంతో కనిపించారు.

మరో పాఠశాల, కృష్ణా జిల్లాలో అక్షరాస్యతలో బాగా వెనకబడ్డ ప్రాంతంలోని రెడ్డిగూడెం లో నడుస్తున్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం. అక్కడ ఇంటర్మీడియెట్ కూడా ఉంది. నాతో పాటు కృష్ణా జిల్లా సర్వ శిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారీ, ఆయన సిబ్బందీ కూడా ఆ పాఠశాల సందర్శించారు.

ఆరవతరగతి పిల్లల్తో మాట్లాడుతూ ఈ పాఠశాల గురించి వారికెవరు చెప్పారు, ఎవరి ద్వారా విన్నారు, ఏ ఆశల్తో వచ్చారు ఒక్కొక్కరినీ అడిగి తెలుసుకుంటూ ఉండగా, మాటల మధ్య వారు కొన్ని పాటలు పాడేరు. అందులో ఒకటి అశోక్ తేజ రాసిన పాట. ఆ కవితో మీరు మాట్లాడతారా అనడిగాను. వాళ్ళు నమ్మలేనట్టు చూసారు. అశోకన్నకి పోను కలిపాను. ఆయన తన కావ్యలోకంలోంచి వాళ్ళను పలకరించాడు. ఆశీర్వదించాడు. ఈ సారి ఆ పాఠశాలకు స్వయంగా వచ్చి ఆ పిల్లలకు తన పాటలు వినిపిస్తానన్నాడు.

పదవతరగతి పిల్లల్లో మాటాడుతూ తమ కెరీర్ గురించి వాళ్ళకెట్లాంటి ఊహలున్నాయో ఒక్కొక్కరినీ అడిగాను. అందరిలోకీ, ఆశ్చర్యం, ఒకమ్మాయి ఆర్మీలో చేరాలన్నది తన కల అని చెప్పింది. నేనున్న కొద్దిసేపట్లోనే ఆ పిల్లలు వాళ్ళ ప్రతిభ, సాధన, సంతోషం మొత్తం నా ముందు కుమ్మరించడానికి పోటీ పడ్డారు. ఆ పిల్లల ఉత్సాహం మధ్య నాకు సమయం తెలియలేదు. చాలా కాలం తర్వాత మళ్ళా నాలో కొత్త రక్తం ప్రవహించినట్టుగా ఉంది.

30-6-2019

Leave a Reply

%d bloggers like this: