
కొన్ని ముహూర్తాలు దేవుడు నిర్ణయిస్తాడు. నా కొత్త ఉద్యోగం ఉత్తర్వులు మొన్న రాత్రి పాడేరులో మోదకొండమ్మ తల్లి పాదాల దగ్గర తీసుకోవడం కూడా అట్లాంటి సందర్భమే.
మోదమ్మ పాడేరు గిరిజన ప్రాంతాల్లో ఒక ఐతిహ్యం నుంచి ప్రభవించిన దేవత. ఆ పండగ వెనక ఉన్న కథని ఎంతో పరిశోధన చేసి వెలికి తెచ్చిన మిత్రుడు డా. శివరామకృష్ణ ఒక పుస్తకమే వెలువరించాడు. ‘మోదకొండమ్మ తుమ్మెదపదం’ పేరిట (http://www.sakti.in/PDF_Files/modakondamma_thumedapadam.pdf) సేకరించి ప్రచురించిన ఆ పుస్తకంలో ఆయనిలా రాస్తున్నాడు:
”వర్ణ ధర్మాల ఉక్కు చట్రం సడలి, పాలకుల ఐశ్వర్యం-ఆశ్రితుల నైపుణ్యం,బగతల నాయకత్వం, కొండదొరల కష్ట జీవితం, వాల్మీకుల లోకజ్ఞత, కమ్మరుల పనితనం, కోదు, పొరజా, గదబలాదిగా కల ఆదిమ తెగల అమాయకత్వం ఐక్యమంది ఈ అంతరాలు చెరిగిపోయి, ఎల్లలోకము ఒక్క ఇల్లు కావలెనని, నిలిచిన నింగి దేవతను-తొక్కిన భూదేవతను, ఆ నీడలు తోడులివ్వమంటూ పొలాలు ఊడ్చే పడతులు మాలగంగు, సంజీవరాజుల పెండ్లి పదాలలో కోరుకుంటున్నారు.”
గిరిజన- గిరిజనేతర, ఆహారసేకరణ- ఆహార ఉత్పాదక, గిరి-మైదాన సంస్కృతుల సామరస్యానికి, సమన్వయానికి మోదమ్మ ప్రతీక. ఒక గిరిజనేతరుడిగా, గిరిజన జీవితంతో పెనవేసుకున్న నా అనుబంధానికి కూడా ఆమె చరణాలే స్ఫూర్తి. ఆ చరణాల మ్రోలనే మొన్న నేను గిరిజన సంక్షేమ శాఖ బాధ్యతలనుండి తప్పుకుని నా కొత్త ఉద్యోగబాధ్యతలు స్వీకరించాను.
32 ఏళ్ళ అనుబంధం. 1987 జూన్ నెలలో పార్వతీపురం సమగ్రగిరిజనాభివృద్ధి సంస్థలో జిల్లా గిరిజన సంక్షేమాధికారిగా శిక్షణకి వెళ్ళిన రోజునుంచి మొన్నటిదాకా అవిచ్ఛిన్నంగా కొనసాగిన అనుబంధం. నా తల్లిదండ్రుల దగ్గరకన్నా, నా భార్యాబిడ్డల దగ్గర కన్నా, నా బంధుమిత్రుల దగ్గరకన్నా ఎక్కువకాలం నేను గిరిజన సంక్షేమ శాఖలో గడిపాను. ఆ శాఖలో కుటుంబ సభ్యుడిగా జీవితం మొదలుపెట్టి, కుటుంబ వృద్ధుడిగా మారిపోయాను.
మూడు దశాబ్దాలు పైగా గడిచిన ఉద్యోగ జీవితంలో మూడు తరాల పాలనావిధానాల్ని చూసాను. మా నాన్నగారు తూర్పుగోదావరి జిల్లాలో ఒకప్పటి ఎల్లవరం తాలూకాలో శరభవరం అనే ఒక గిరిజన గ్రామానికి కరణంగా పనిచేసారు. ఆ ఊరితో కలిపి తొమ్మిది గిరిజన గ్రామాలకి ఆయన పాలనాధికారి, సంరక్షకుడు, ఒక విధంగా చెప్పాలంటే, పూర్వకాలపు పితృప్రభువు. అల్లూరి సీతారామరాజు నడయాడిన నేల అది. ఆయన వెంట ఆ గ్రామాల్లో, ఆ పొలాల్లో, ఆ సంతల్లో గిరిజన జీవితాన్ని చూస్తూ పెరిగాను. ఆ గ్రామాల భూమిలెక్కలన్నీ నాతోనే రాయించేవారాయన. ప్రతి ఏడాదీ, ఆ తాలూకా ప్రధాన కార్యాలయం అడ్డతీగెలలో జరిగే జమాబందీకి నన్ను కూడా తీసుకువెళ్ళేవారు. ఆ లెక్కలు పరిశీలించడానికి పెద్దాపురం డివిజను రెవెన్యూ డివిజనల్ అధికారి వచ్చేవాడు. ఆ ‘దొరగారు ‘తన లెక్కల్లో, తన రికార్డులో వేలెత్తి చూపకుండా ఉండాలని, ఆ మొత్తం తాలూకాలోనే సమర్థుడైన ప్రభుత్వ సేవకుడిగా తనకున్న పేరు మసకబడకూడదనీ మా నాన్నగారికి ఎంతో పట్టుదలగా ఉండేది.
మా గ్రామం రాజ్యాంగం అయిదవ షెడ్యూలు పరిథిలోకి వచ్చే గ్రామం. కాబట్టి అక్కడ భూమి మొత్తం గిరిజనులదే. వాళ్ళ భూముల్ని అన్యాక్రాంతం చేసిన గిరిజనేతరులతో నా తండ్రి జీవితకాలం పోరాటం చేసాడు. తాను కూడా గిరిజనేతరుడే కాబట్టి తక్కిన వారు ప్రశ్నించడానికి వీల్లేకుండా తాను ఒక సెంటు భూమి కూడా సంపాదించుకోలేదు. ఒక పెంకుటిల్లు కట్టుకుంటే కూడా తాను ఎక్కడ రాజీ పడవలసి వస్తుందో అని జీవించినంతకాలం ఒక తాటాకు ఇంట్లోనే గడిపాడు. మాకు ఆ ఊళ్ళల్లో భవిష్యత్తులేదనీ, మేము చదువుకుని, బయటికి వెళ్ళిపోవాలనీ, ఒకటే ఆందోళన పడేవాడు, మమ్మల్ని ఒక్క క్షణం కూడా నిశ్చింతగా ఉండనిచ్చేవాడు కాడు.
ఆయనకి గిరిజన బాలబాలికలు చదువుకోవాలని ఎంతో కోరిగ్గా ఉండేది. డెభ్భైల మొదట్లో మా ప్రాంతంలో, తాళ్ళపాలెం, బోయపాడు గ్రామాల్లో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు తెరిచినప్పుడు ఆయన సంతోషానికి అవధి లేదు. నా పసితనంలో ఆయన ఆ గ్రామాలకి వెళ్ళినప్పుడల్లా ఆ పాఠశాలల్ని తీర్థస్థలాలుగా మాకు చూపించేవాడు.
నేను పెద్దయిన తర్వాత తిరిగి ఆ శాఖలోనే చేరతానననీ, ఆ పాఠశాలల బాగోగుల కోసమే ఆలోచిస్తాననీ ఆయన గాని నేను గానీ ఎన్నడూ ఊహించలేదు. ఆ గిరిజన గ్రామాలూ, ఆ అడవులూ, ఆ కొండలూ నా పసిమనస్సును ఎంతగా లోబరుచు కున్నాయంటే, ఆయన, మేమా గ్రామంలో ఉండకూడదనీ, పెద్ద చదువులు చదువుకుని పట్నాలకి వెళ్ళిపోవాలనీ అన్నప్పుడల్లా నాకెంతో బెంగగా ఉండేది. కానీ, గిరిజన సంక్షేమాధికారిగా, నేను ఒక రోజు కాదు, ఒక ఏడాది కాదు, ముప్పై ఏళ్ళకు పైగా ఆ కొండలచుట్టూతానే ప్రదక్షిణం చేస్తూ వచ్చాను, ఆ అడవులచుట్టూతానే ప్రణాళికలు అల్లాను, ఆ గిరిజనులకోసమే నా విద్య, అధ్యయనం, కౌశల్యం అంకితం చేసాను.
అప్పటి సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ ఎస్.ఆర్. శంకరన్ గారి చేతులమీదుగా నాకు 1987 లో జిల్లా గిరిజనసంక్షేమాధికారిగా నియామకం లభించింది. పార్వతీపురం ఐ.టి.డి.ఏలో నా శిక్షణ పూర్తిచేసుకుని 1988-90 మధ్యకాలంలో అక్కడే రెండేళ్ళ పాటు పనిచేసాను. ఆ తర్వాత రెండేళ్ళ పాటు, 1990-92 మధ్యకాలంలో కర్నూల్లో జిల్లా గిరిజనసంక్షేమాధికారిగా పనిచేసాను. ఆ రోజుల్లో గిరిజన సంక్షేమం అంటే, రెండు రకాల దృక్పథాలు ఉండేవి. ఒక దృక్పథానికి ఎం.పి.వి.సి శాస్త్రిగారు ప్రతినిధి. ఉట్నూరు సమగ్రగిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారిగా ఆయన గిరిజన సంక్షేమానికొక కొత్తదారి చూపించారు. మరొక దృక్పథానికి టి.ఎస్. అప్పారావుగారు ప్రతినిధి. ‘ట్రైబల్స్ అంటే మా అప్పారావే గుర్తొస్తాడు’ అన్నారు సుప్రసిద్ధ కథకుడు రావిశాస్త్రి నేనాయన్ను మొదటిసారి కలిసినప్పుడు. అప్పట్లో కర్నూలు జిల్లా కలెక్టరుగా ఉన్న అప్పారావుగారు నన్ను గాఢంగా ప్రభావితం చేసారు. అక్కణ్ణుంచి అదిలాబాదు జిల్లా ఉట్నూరుకి వెళ్లాను. ఆ రోజుల్లో ఉట్నూరు, గిరిజన సంక్షేమాధికారుల కాశీ, మక్కా, యెరుషలేం. కుంరం భీం, హైమండార్ఫ్ దంపతులు, సి.వి.క్రిష్ణారావు, ఎం.పి.వి.సి శాస్త్రి, సి. వి.ఎస్.కె.శర్మ, పి.సుబ్రహ్మణ్యం, ఫణికుమార్ వంటి పేర్లు మమ్మల్ని ఉర్రూతలూగించేవి. అటువంటి చరిత్రభూమిలో పనిచేసే అవకాశం రావడం నా భాగ్యం. ఉట్నూరు నుంచి పాడేరు బదిలీ అయి, 1994-95 మధ్యకాలంలో పాడేరులో జిల్లా గిరిజన సంక్షేమాధికారిగా పనిచేసాను. ఇంతలో, గిరిజన సంక్షేమ రాష్ట్రకార్యాలయంలో విద్యాకార్యక్రమాలు చూడటం కోసం, అప్పటి సంచాలకులు డా.పి.వి.రమేశ్ నన్ను హైదరాబాదు రప్పించారు. ఆయన తర్వాత కె.రాజు గారు కొన్నాళ్ళు సంచాలకులుగా పనిచేసారు. ఆ రోజుల్లో, గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక విద్య సార్వత్రీకరణ కోసం ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించాను. అటువంటి ఒక ప్రణాళిక రూపొందించడం, అమలు చేయడం, గిరిజన ప్రాంతాల్లోనే కాదు, భారతదేశంలోనే మొదటిసారి. 1987 నుంచి 1997 దాకా నా మొదటి పదేళ్ళ ఉద్యోగానుభవాలన్నీ నా ‘కొన్ని కలలు, కొన్ని మెలకువలు’ లో వివరంగా రాసాను.
నల్లమల అడవుల్లో ఉండే చెంచువారికోసం ప్రభుత్వం శ్రీశైలం కేంద్రంగా ఒక ఐ.టి.డి.ఏ ఏర్పాటు చేసింది. 1997-2000 మధ్యకాలంలో మూడేళ్ళ పాటు అక్కడ ప్రాజెక్టు అధికారిగా పనిచేసాను. నా ఉద్యోగజీవితంలో నేను అక్కడ ఎదుర్కొన్నన్ని సవాళ్ళు, సమస్యలు మరెక్కడా ఎదుర్కోలేదు. కాని ఆ ఉద్యోగానుభవం నాకు మరవలేని తృప్తిని కూడా ప్రసాదించింది.
2000 లో గిరిజన సంక్షేమ రాష్ట్రకార్యాలయానికి వచ్చిన తరువాత ఎనిమిదేళ్ళపాటు జాయింట్ డైరక్టర్ గా ప్రణాళికల రూపకల్పన, అమలును సమీక్షించడం వంటి వ్యవహారాలు చూసేను. ఆ తర్వాత మరొక ఎనిమిదేళ్ళు అడిషనల్ డైరక్టరుగా గిరిజన సంక్షేమ శాఖకుకి చెందిన అన్ని వ్యవహారాల్లోనూ నా సేవలు అందించాను. మొత్తం పదహారు సంవత్సరాల పాటు గిరిజన సంక్షేమ వార్షిక బడ్జెటు రూపకల్పన నేనే స్వయంగా చేపట్టాను. 2013 లో ప్రభుత్వం గిరిజన ఉపప్రణాళికా చట్టాన్ని రూపొందించడంలోనూ, ఆ చట్టానికి నియమనిబంధనలు రూపొందించడంలోనూ, ప్రణాళిక అమలుచెయ్యడంలోనూ నా సేవలు పూర్తిస్థాయిలో అందించాను.
గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయంలో పదహారేళ్ళ పాటు దీర్ఘకాలం పనిచేసినందువల్ల కొన్నాళ్ళు బయట పనిచెయ్యాలనీ, పాలననీ,పరివర్తననీ మరింత విస్తృతకోణంలో చూడాలనీ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజి ఆఫ్ ఇండియా వారి సెంటర్ ఫర్ ఇన్నొవేషన్స్ లో, 2016-18 లో రెండేళ్ళ పాటు సలహాదారుగా పనిచేసాను. ఆ రెండేళ్ళ కాలంలో కూడా గిరిజనులకి సంబంధించిన ప్రాజెక్టులే అమలు చేసాను. వాటిలో చెప్పుకోదగ్గవి, గిరిజన వ్యవహారాల మీద ఒక జాతీయసదస్సు నిర్వహించడం. పాలనాధికారుల్నీ, విద్యావేత్తల్నీ ఒక్కచోటకు తీసుకువచ్చి అటువంటి సదస్సు నిర్వహించడం దేశంలోనే అది మొదటిసారి. అలానే గిరిజన ప్రాంతాల్లో పనిచేసే అధికారులకీ, స్వచ్ఛందసంస్థలకీ, పాత్రికేయులకీ, రచయితలకీ, ఉద్యమకారులకీ గిరిజన సామాజిక పరివర్తనకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో ఒక సోర్స్ బుక్ రూపొందించాం. హైదరాబాదు విశ్వవిద్యాలయంవారితో కలిసి రూపొందించిన ఆ సోర్స్ బుక్ తొమ్మిది సంపుటాలూ ఇక్కడ చూడవచ్చు.(http://www.cips.org.in/publications/#9sourcebooks) ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లోని గిరిజనుల సామాజిక పరివర్తనకు సంబంధించి ఇంత సమగ్ర సమాచారం ఇట్లా అందుబాటులోకి తీసుకురావడం కూడా ఇదే మొదటిసారి.
ముప్పై ఏళ్ళు గిరిజన సంక్షేమ శాఖలోనూ, రెండేళ్ళు సిప్స్ లోనూ పనిచేసిన తర్వాత, మొన్న గిరిజన సంక్షేమశాఖ బాధ్యతలనుండి రిలీవ్ అయ్యాను.
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులో ప్రమోషను మీద కూడా నింపే పోస్టులు కొన్ని ఉంటాయి. వాటిలో కొన్ని పోస్టులు రెవెన్యూ శాఖ ఉద్యోగుల ద్వారా భర్తీ అవుతాయి. కొన్ని ఖాళీలు నాన్-స్టేట్ సివిల్ సర్వీసు కాటగిరీ కింద రెవెన్యూ కాక తక్కిన శాఖలకు చెందిన ఉద్యోగులనుంచి ఎంపికచేసి భర్తీ చేస్తారు. ఆ పద్ధతిలో 2017 సంవత్సరానికిగాను జరిగిన నియామకాల్లో భాగంగా నన్ను కూడా ఎంపిక చేయడంతో నిన్న నా కొత్త ఉద్యోగంలో జాయినయ్యాను.
1987 లో పార్వతీపురం ఐ.టి.డి.ఏ లో జిల్లా గిరిజన సంక్షేమాధికారిగా చేరినప్పుడు అప్పుడు ప్రాజెక్టు అధికారిగా ఉన్న ఏ సుబ్రహ్మణ్యంగారి దగ్గర నా జాయినింగ్ రిపోర్టు ఇచ్చానో ఇప్పుడు ఛీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్న ఆ సుబ్రహ్మణ్యంగారిదగ్గరే నా ఐ.ఏ.ఎస్ జాయినింగ్ రిపోర్టు సమర్పించాను. నా ఉద్యోగజీవితంలో ఒక వలయం పూర్తయ్యింది.
భగవంతుడి అనుగ్రహం వల్ల, తల్లిదండ్రుల, గురువుల ఆశీసుల వల్ల, బంధుమిత్రుల శుభాకాంక్షల వల్ల, ముఖ్యంగా గిరిజనుల ఆదరం వల్ల ఇన్నాళ్ళ నా ఉద్యోగజీవితం ఫలప్రదమయింది. ఈ ప్రయాణంలో నా చేయిపట్టుకు నడిపించినవారికీ, నాతో కలిసి నడిచినవారికీ పేరుపేరునా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.
15-5-2019