కారుమబ్బులబారు

మొదటిసారి ఈ పద్యాలు శ్రీ శ్రీ ‘అనంతం’లో కనబడ్డాయి. కృష్ణశాస్త్రి కవిత్వాన్ని ఆరాధించినవాడు కాబట్టి, తాను స్వయంగా మహాభావుకుడు కాబట్టి, ఈ పద్యాలు ఆయన్ని వెంటాడటంలో ఆశ్చర్యం లేదు. కాని, నన్ను కూడా వెంటాడుతూనే ఉన్నాయి, ముఖ్యంగా, ప్రతి శ్రావణమాస మధ్యంలోనూ ఒక్కసారేనా గుర్తొస్తుంది ఈ పద్యపాదం ‘అసలు శ్రావణమాస మధ్యమ్మునందు కురిసితీరాలి వర్షాలు కొంచెకొంచెమేని మేని రాలాలి తుంపరలేని..’

అషాడ మేఘం మీద కవిత్వం రాయడంలో ఆశ్చర్యం లేదు, కాళిదాసవారసుడు కాబట్టి. శ్రావణమేఘం మీద కూడా రాసాడు, కృష్ణభక్తి కవిత్వంలో తడిసినవాడు కాబట్టి, స్వయంగా కృష్ణశాస్త్రి కాబట్టి. అందుకనే హాస్యానికి అన్నా, శ్రీ శ్రీ సరిగానే అన్నాడు ‘శాస్త్రి కృష్ణ వ్హిష్పరించు చారువేదనారోగమ్’ అని.

ఎటువంటి భావాలు, ఎటువంటి పదబంధాలు, ఎటువంటి తెలుగు! కలకండని తేనెలో ముంచి కవితగా కూర్చాడిందులో!

కృష్ణశాస్త్రి ‘పల్లకి’ సంపుటిలోని, ‘భావకవి’ అనే ఈ ఖండకావ్యపు శ్రావణమాసపు జల్లులో తడవని తెలుగు కవి లేడు, శ్రీ శ్రీ నుంచి ఇస్మాయిల్ దాకా.

~

భావకవి

అసలు శ్రావణమాసమధ్యమ్మునందు
కురిసితీరాలి వర్షాలు; కొంచెకొంచె
మేని రాలాలి తుంపరలేని; కాని
ఉక్కమాత్ర మేమాత్రమూ ఉండరాదు!

ఇపుడు నా వొళ్ళు కొంత లావెక్కి, సుంత
కదిలితే చెమట జడులు క్రక్కుతుంది;
నేనె వర్షపు మేఘమై తేను పైన
ఒట్టిపోయింది కొండపై ఉత్తమబ్బు!

ఓసి నీ యిల్లు బంగారమో మరేమొ
కనబడవదేమి పడమటిగాలి? మాకు
అవసరములేని చలివేళలందె యెగసి
యెగసి పడతావు మా మీద ఏడిపించి!

ఆంధ్రసాహిత్యపరిషదధ్యక్షునడుగు
తేను నీ మాట, వెంటనే యిట్లు చెప్పె-
‘అలసి సొలసి వాలెను వరుణావరోధ
భామినీ గండకర్పూరపాళులందు!’

నాకు మాత్రమా భావము నచ్చలేదు-
భావకవిని కాబట్టి, ‘ప్రియావియోగ
నిబిడ నిశ్వాసములు రేగి నేడు ముసర,
వందరూ గుండెలేని వారగుటచేత!’

వారికీ మాకు ఉన్నదావంత తేడ!
లేని మేనకతో వారు ప్రేమలేని
ఉపరతుల మునిగిపోతారు; ఉన్న చెలియ
సోయగము మాకు ఊర్వశీ తీయదనము!’

అపుడు మబ్బంటె చాలు, అనావర్తంపు
నర్తనము చేసె పురివిచ్చి నా యెడంద;
ఇంక శ్రావణ మేఘమంటేన, గుండె
నీలగగనమ్ము, గాలియుయ్యాల రెక్క!

నేను కళ్ళెత్తి కాస్త చూశానో, అపుడు
నాకు కనబడుతుండేవి ఆకసమున
ప్రేయసీ మేఘమేఖలయో, ఎదురుగా
ఊర్వశీ కైశికీచ్ఛాయయో కదలుచు!

అప్పుడప్పుడు ఆ రాత్రులందె కొన్ని
కొన్ని రాత్రుళ్ళు, పాకుతూ, కుములుతూ, వ
గర్చుతూ, మూల్గుతూ మింట కనబడేవి
చెలియ నిట్టూర్పు నల్లపొగల గుబుర్లు!

ఎప్పుడో ఎప్పుడో పైకి ఎగిరి, ఎగిరి
నేను ఋషినై, పొడుపుకొండ సానువెక్కి,
తూర్పు వాకిటికేసి చూస్తూంటే కాస్త
తేలుతూండేవి పీతాబరాల కొసలు!

ఇపుడు మారింది బ్రతుకు; మునుపటి గొప్ప
రోజులన్నీ గతించాయి; బూజుపట్టి
బూజుపట్టి రాయై చచ్చిపోయినాను-
నన్ను చెరసాలలో పెట్టినారు లెండి!

ఇంత పెద్ద ఖైదుకు గూడ ఇంత గుడ్డి
కన్నులాంటిది కిటికి; రెక్కలను ముడిచి
కూడ చొరలేదు చిరుగాలి; మోడు నార
సాలలొ గిలగిలలాడి సాగువెలుగు!

ఒక మొయిలు మేకపిల్ల! వేరొకటి ముసలి,
మరియొకటి ముసుగిడ్డ బ్రాహ్మణ వితంతు,
వొకటి తెరచాప గుండెవిప్పుకొను పడవ,
ఒకటి వెన్న, యొకటి దూది, యొకటి నురుగు!

కారుమబ్బుల బారు సవారి చేయు
సాదులో, సామజసమాజమో, దిగంత
ములకు విడబారి సాంబ్రాణి పొగలపాయ
పాయసందుల నుమియు నప్సరల కురులొ!

ప్రతి పదార్థములోని రూపమ్ము వరకు
అసలు తత్త్వమ్ము కొరకు ప్రయాణమౌ మ
నస్సునకు అడ్డుకంచెలన్నవియె లేవు!
ఇపుడు మేఘము మేఘమే, అపుడు కాదు!

(అసలు శ్రావణమాసం మధ్యలో వర్షాలు కురిసి తీరాలి, కొంచెం కొంచెం గా తుంపర రాలాలి, కాని, ఉక్క మాత్రం ఏ మాత్రమూ ఉండకూడదు!

ఇప్పుడైతే నా వొళ్ళు కొంత లావెక్కడం వల్ల ఏ మాత్రం నడిచినా చెమట కక్కుతుంది. ఇప్పుడు నేనే వర్షపు మేఘంలాగా తడిసిపోతుంటే, కొండమీద మబ్బు ఉత్తమబ్బుగా వట్టిపోయింది.

ఓ పడమటిగాలీ, ఓసి నీ యిల్లు బంగారం కానూ, మాకు అవసరంలేని చలివేళల్లో మామీద పడతావు, మమ్మల్ని ఏడిపిస్తావు, ఇప్పుడెందుకు కనబడకుండాపోతావు?

ఈ మాటే అడిగాను ఆంధ్ర సాహిత్యపరిషత్తు అధ్యక్షుణ్ణి. ఆయనేమో వెంటనే ఇట్లా అన్నాడు: ఆ గాలి వరుణావరోధ భామినీ గండకర్పూరపాళులందు అలసి, సొలసి వాలిపోయింది అని.

నాకు ఆ భావం నచ్చలేదు. నేను భావకవిని కాబట్టి. నాకేమనిపిస్తుందంటే, ఇప్పుడంతా గుండెలేని వాళ్ళం కాబట్టి, ప్రియావియోగం వల్ల కలుగుతున్న గాఢమైన నిట్టూర్పులు మనచుట్టూ ముసరటం లేదు అంటాను.

ఆ సంప్రదాయ కవులకీ, మా భావకవులకీ మధ్య ఆవగింజంత తేడా ఉంది. వాళ్ళేమో లేని మేనకతోటి ప్రేమలేని ఉపరతిలో మునిగిపోతారు. మాకేమో, ఉన్న మా ఒక్క స్నేహితురాలి సోయగంలోనే ఊర్వశి తీయదనమంతా అనుభవానికొస్తుంది.

ఆ రోజుల్లో మబ్బు అనే మాట వినబడితే చాలు, నా హృదయం పురివిప్పి నాట్యం చేసేది. ఇంక శ్రావణమేఘమంటే చెప్పేదేముంది? గుండే నీలాకాశంగా మారిపోయేది, వంటిని ఇంత చిరుగాలి తాకినా ఉయ్యాల రెక్కలాగా ఉండేది.

ఆరోజుల్లో నేను కాస్త కళ్ళెత్తి చూసానో లేదో, ఆకాశంలో మేఘాలు ప్రేయసి నడుముకు చుట్టుకున్న వడ్డాణం లాగా కనబడేవి, లేదా ఎదురుగా నిండారా విరబోసుకున్న ఊర్వశి జడపాయ నీడల్లాగా.

ఆ రోజుల్లో, అప్పుడప్పుడు కొన్ని కొన్ని రాత్రుళ్ళు ఆకాశంలో పాకుతూ, కుములుతూ, వగరుస్తూ, మూలుగుతూ కనబడేవి నల్లటిపొగ గుబుర్లు నా స్నేహితురాలి నిట్టూర్పుల్లాగా .

ఆ మధ్యలో ఎప్పుడో, ఎప్పుడో నేను పైకి ఎగిరి, ఎగిరి, ఒక ఋషిలాగా పొద్దుపొడుపు కొండ చరియ మీద నిలబడి తూర్పు వాకిట కేసి చూస్తూ ఉంటే, పచ్చటి వస్త్రం కొసలు గాల్లో కదిలినట్టు వెలుగురేకలు కనిపించేవి.

ఇప్పుడంటారా, ఆ బతుకు మారిపోయింది. మునుపటి గొప్ప రోజులన్నీ గతించిపోయాయి. నాకు బూజుపట్టి, బూజుపట్టి రాయిగా మారి నేను చచ్చిపోయాను. నన్నిప్పుడు జైల్లో కూడా పెట్టారు లెండి! (జైలంటే జైలు కాదు, కాలేజీ ఉద్యోగమన్నమాట)

ఇంత పెద్ద ఖైదుకి కూడా గుడ్డికన్నులాగా ఒక కిటికీ. కానీ ఏమి లాభం! రెక్కలు ముడుచుకున్నా కూడా చిరుగాలి కూడా లోపలకి చొరబడలేదు. ఏదో గిలగిలకొట్టుకుంటూ ఏదో ఇంత వెలుగు చెరసాల నారసాలమధ్య ఎట్లానో లోపలకి పాకుతుంది!

ఒక మేఘం మేకపిల్ల. ఒకటి ముసలి, మరొకటి తెల్లటి ముసుగుకప్పుకున్న బ్రాహ్మణ వితంతువులాగా కనిపిస్తుంది. తెరచాప గుండె విప్పుకున్న పడవలాగా ఒకటి, మరొకటి వెన్న, ఇంకొకటి దూది, మరొకటి పాలనురుగు.

కారుమబ్బులబారు సవారీలాగా, ఏనుగుల గుంపులాగా, దిగంతాలదాకా పరుచుకుంటున్న సాంబ్రాణి పొగల మధ్య విరబోసుకున్న అప్సరసల కురుల్లాగా కనిపిస్తాయవి.

కనిపించే ప్రతి పదార్థంలోని రూపందాకానూ, ఆ రూపాన్ని దాటి, ఆ వస్తువుల అసలు తత్త్వం దాకానూ మనస్సు చేసే ప్రయాణానికి అడ్డుకంచెలనేవే లేవు. కాని, ఏం చెయ్యను, ఇప్పుడు నాకు మేఘం మేఘం లానే కనిపిస్తున్నది. కాని అప్పుడు కాదు!)

23=8=2019

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s