కలవరపరిచిన వ్యాసం

నా ‘పునర్యానం ‘(2004) కావ్యంలో, ఒకచోట, జర్మన్, బ్రిటిష్, రష్యన్ యువతీ యువకుల మధ్య సంవాదంలో భాగంగా, రష్యన్ యువకుడు తన వేదన వెల్లడించుకున్నట్టుగా (పే.216-18)ఈ వాక్యాలు రాసాను:

~

మిత్రులారా, మీరు మేధావులు, మీకు జీవిత సిద్ధాంతాలు తెలుసు,
మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోగలరు అపరిమితంగా.
నేనొక పేద రష్యన్ ని, రెక్కాడితేగాని డొక్కాడదు నాకు
నాకు తెలిసిందల్లా కొద్దిపాటి రష్యన్ సాహిత్యం,
కోంత డాస్టవస్కీ, కొంత టాల్ స్టాయీను.
గ్రహించానొకటి నేను,
సత్యం తెలియడం వేరు, బుద్ధి పూర్వకంగా
సత్యాన్ని జీవించడం వేరు, అనుభవపూర్వకంగా.
సత్యం కళ్ళు మిరుమిట్లు గొల్పదు, వినబడదెల్లప్పుడూ
అది నీకొక కానానుని దానం చేసే ఉరుముఘోషగా.

సత్యం నీ చాపకింద నుంచి నీకు తెలీకుండానే నీ మీద పాకి
నీ కాలరుమడతలోంచి కుట్టే చిన్న చీమ హెచ్చరిక లాంటిది,
ఏమంత ప్రమాదకరం కాదు, నువ్వు మరణించవు, కాని
తెలియపరుస్తుందది, తానున్నానని, నువ్వొక్కడివే లేవని
ఇది కూడా తెలియపరుస్తుందది, జీవితసన్నివేశాలు
గతితార్కిక భౌతికవాదాలంత విస్పష్టం కావని,

ఎందుకు కుట్టింది నిన్నా చీమ ఆ క్షణంలో?
ఏ ఉత్పత్తి శక్తులకు నువ్వు బానిసవయినందుకు
నీ మీంచి పాకిందది?
కొట్టిపారేయకండి దాన్ని అముఖ్యమని.
తెలుసా మీకు నిజంగా ఏది ముఖ్యమో
మీకు విసుగుపుట్టదంటే వినిపిస్తాను
కొన్ని వాక్యాలు డాస్టవస్కీ నుంచి:

(అప్పుడతడు ఒక రష్యన్ నవలని చదవడం ప్రారంభించాడు)

‘పెద్దలారా, మీరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నేను మీకు చెప్పాలనుకుంటున్నదిదే-
నేనొక కీటకాన్ని, ఒక పురుగునెందుకు కాలేకపోయానన్నది:
ప్రమాణం చేసి చెప్తున్నాను,
నేనొక కీటకాన్ని కావాలని తపించాను,
నిజానికి నేను దాని పాటి కూడా కాదు.
నిజం చెప్తున్నాను, మిత్రులారా,
మరీ చైతన్యంతో ఉండటమనేది నిజంగా ఒక జబ్బు
తీవ్రాతితీవ్రమైన రుగ్మత,
మనిషికి తన దైనందిన అవసరాలకు చాలు కొద్దిపాటి చైతన్యం
మన పందొమ్మిదవ మహాశతాబ్దపు
నాగరిక విద్యాధికమానవుడి చైతన్యంలో
అయితే సగమో లేదా పావుభాగమో చాలు మనకి,
ముఖ్యంగా పీటర్స్ బర్గ్ నగరవాసి కావడమనే దురదృష్టానికి నోచుకున్న నాబోటి వాడికి..
నిజమే మనుషులు తమ రుగ్మతలకి గర్విస్తారు
ముఖ్యంగా అందరికన్నా ఎక్కువగా నేను..’

(అతడు చదవడం ఆపాడు, అక్కడొక ఈగ ఎగురుతుంటే దాన్ని తదేకంగా చూసాడు)

మిత్రులారా, చైతన్యమంటే ఏమిటి?
మన ఇంగ్లీషు మిత్రుడువైజ్ఞానిక భౌతిక వాది
అతని దృష్టిలో చైతన్యమంటే గుండె కొట్టుకోవడం,
మెదడుకి రక్తమెక్కడం
తనున్న సాంఘిక పరిస్థితుల వల్ల మనిషి ప్రభావితుడు కావడం
ప్రభావితుడైన మనిషి మళ్ళా తన పరిస్థితుల్ని ప్రభావితం చెయ్యడం.

అంగీకరిస్తున్నానిదొక ఆదర్శ చైతన్యముఖచిత్రమని,
ఒప్పుకోలేను నీ జీవితం, నా జీవితం ఇంత స్పష్టంగా
ఉంటాయని, వినండి
రాస్కల్నికావ్ గురించి టాల్ స్టాయి అన్నమాటలు:

(అప్పుడు పుస్తకంలోంచి ఒక కాగితం బయటకు తీసి చదవడం మొదలుపెట్టాడు)

“రాస్కల్నికావ్ నిజంగా జీవించిన క్షణాలంటూ ఉంటే
అతడు తన గదిలో సోఫా మీద
అడ్డదిడ్డంగా దొర్లిన క్షణాలే.
అప్పుడతడు ఆలోచిస్తున్నదా ముసలిదాని గురించి కాదు.
ఈ భూమ్మీద మరొక సహచరమానవుడి అశ్రువులు తుడవడం అంగీకారయోగ్యమేనా
లేదా ప్రమాదకరమా, అనవసరమా అని కూడా కాదు,
అసలు, తను పీటర్స్ బర్గ్ లో ఉండాలా వద్దా
తన తల్లినుంచి సొమ్ము తెచ్చుకోవాలా వద్దా లాంటివి
అసలా ముసలిదానికేవిధంగానూ
సంబంధించనివి, అటువంటివే ఏవో,
అదిగో, ఆ పశుప్రాయకార్యకలాపానికి
ఆవలుండే అటువంటి క్షణాల్లోనే అతడు నిశ్చయించుకున్నది
ఆ ముసలిదాన్ని చంపాలా వద్దా అన్నది,
అతని నిశ్చయాత్మక క్షణాలతడేదో
ఒక పని చేస్తున్న క్షణాలు కాదు,
అసలేమీ చెయ్యకుండా ఉన్న క్షణాలు
శుద్ధ పర్యాలోక క్షణాలు
అతని చైతన్యం క్రియాశీలకంగా ఉన్నదప్పుడే,
ఏ చిన్నపనిగానీ,
అప్పుడుఒక గ్లాసు బీరు లేదా ఒక సిగరెట్,
అతన్నా నిశ్చయం నుంచి తప్పించి ఉండేవి
పనిని వాయిదా వేసి ఉండేవి
అతన్ని చైతన్యాన్ని అతని పశుప్రవృత్తి వైపు నెట్టివేసి ఉండేవి..’

(అతడింక చదవలేక, మాట్లాడలేక, నిశ్శబ్దంగా ఉండిపోయాడు)

~

ఎందుకంటే, ఇదిగో, సూరపరాజు రాధాకృష్ణమూర్తిగారి ఈ వ్యాసం నన్ను మళ్ళా కలవరపరిచింది కనుక. ఒక్కొక్క వాక్యమే కూడబలుక్కుంటూ Crime and Punishment, Notes from the Underground చదువుకున్న రోజుల్లోకి మళ్ళా నన్ను తీసుకుపోయింది కనుక. జీవితం లేవనెత్తే ప్రశ్నలకు సమాధానాలు నిశ్చయంగా చెప్పగలమనే తాత్త్విక బేహారులనుంచి నేను అనుమానంతో, భయంతో, వేదనతో దూరంగా జరిగిపోయిన ఆ రోజుల్ని మళ్ళా గుర్తు చేసింది కనుక.

రాధాకృష్ణమూర్తిగారు పరిచయమైనప్పణ్ణుంచీ నన్ను వేధించేదొకటే భావం: ఈ భావుకుడు నాకు ముప్పై ఏళ్ళ కింద ఎందుకు పరిచయం కాలేదా అని. ఒకప్పుడు నేను అనుభవించిన కల్లోలం నుంచి నన్ను గురజాడ, శ్రీ శ్రీ, బైరాగి బయటపడేసారు. ముఖ్యంగా బైరాగి. బైరాగిది కవిత్వం, రాధాకృష్ణమూర్తిగారిది వచనం, అంతే తేడా. ‘నడమ తడబడి సడలి మునుగక పడవ తీరం క్రమించడా’నికి ఇద్దరూ దారి చూపే దీపస్తంభాలే.

చదవండి ఈ వ్యాసం. షేక్ స్పియర్, కిర్క్ గార్డ్, డాస్టవస్కీ, టాల్ స్టాయి, కామూ, కాఫ్కా ల సమకాలికుడొకడు వాళ్ళతో సాగిస్తున్న ఒక సంభాషణని చెవి ఒగ్గి ఆలించండి. మనల్ని పట్టుకున్న జీవితజ్వరం నుంచి ఎంతో కొంత ఉపశమనం దొరక్కపోదు.

43 పేజీల ఈ వ్యాసం ఒక పట్టాన అర్థం కావడం కష్టం. అందులోనూ ప్రస్తుతం తెలుగు సాహిత్యంలో ఉన్న చర్చల ఎత్తుని, లోతునీ బట్టి చూస్తే, ఈ వాక్యాలు పూర్తిగా అర్థం కావడానికి కొన్ని దశాబ్దాలు పట్టవచ్చు. అయినా ప్రయత్నించి చదవండి.

21-5-2019

Leave a Reply

%d bloggers like this: