కన్నీటి కథల ధార

నాలుగు రోజుల కిందట మా కార్యాలయం నిర్వహించిన ఒక వర్క్ షాపులో కలిసినప్పుడు ఇనాయతుల్లా ‘నీళ్ళింకని నేల’ (2019) కథాసంకలనం నా చేతుల్లో పెట్టాడు.

కర్నూలు జిల్లాకి చెందిన పదముగ్గురు రచయితలు చెప్పిన కథలు. వాటిని ఎస్.ఎం.డి. ఇనాయతుల్లా, కెంగార మోహన్ లు సంకలనం చేసారు. ప్రసిద్ధ సాహిత్య సృజనకారుడు కాశీభట్ల వేణుగోపాల్ ముందుమాట రాసారు.

ఆ పుస్తకం నా చేతుల్లోకి వచ్చిన గంటలోనే ఆ కథలన్నీ చదివేసాను. ఇంకా చెప్పాలంటే చదివించేలా చేసాయి ఆ కథలు. అందుకు ఆ కథల్లోని వస్తు, శైలీ, కథన వైవిధ్యంతో పాటు అవన్నీ కర్నూలు జిల్లా జీవితాన్ని ఉన్నదున్నట్టుగా చిత్రించడమే కారణం. దాదాపు ముప్పై ఏళ్ళ కిందట ఉద్యోగరీత్యా నేను కర్నూలుజిల్లాలో పనిచేసినప్పుడు కళ్ళారా చూసినవీ, చెవులారా విన్నవీ ఎన్నో మళ్ళా ఆ కథలద్వారా మరో మారు నా మనసుని ముప్పిరిగొన్నాయి. అప్పటికన్నా ఆ వ్యథార్థజీవిత యథార్థదృశ్యం ఇప్పుడు మరింత గగుర్పాటు కలిగించేది గానూ, మరింత భరించలేనిదిగానూ కనిపించింది.

నేనక్కడ పనిచేసిన రోజుల్లో చక్కిలం విజయలక్ష్మి, ఎస్.డి.వి.అజీజ్ వంటి వారు ఎవరో ఒకరిద్దరు తప్ప కథారచయితలెవరూ పెద్దగా ఉండేవారు కాదు. అక్కడ ఆధునిక సాహిత్య వాతావరణం కూడా చాలా బలహీనంగా ఉండేది. మా హీరాలాల్ మాష్టారి సారథ్యంలో కర్నూలు జిల్లా రచయితల సంఘం ఉండేది గాని, వాళ్ళల్లో ఆధునిక కవులూ, కథకులూ ఏమంత చెప్పుకోదగ్గ సంఖ్యలో కనబడేవారు కాదు. మేము కొంత మంది మిత్రులం ‘సాహితీ స్రవంతి’ అనే ఒక చిన్న వేదికని రూపొందించుకుని, ఒక కవితాసంకలనమయితే తీసుకురాగలిగాం గాని, కథారచనలో చెప్పుకోదగ్గ కృషి ఏమీ చేపట్టలేకపోయాం. అటువంటిది, ఇప్పుడు కర్నూలు నించి పదముగ్గురు కథకులు ఇంత విశిష్ట కథాసంకలాన్ని తీసుకురావడం నాకెంతో ఆశ్చర్యాన్నీ, ఆనందాన్నీ కూడా కలగచేసింది.

ఇంకా సంతోషించదగ్గ విషయమేమిటంటే, అద్వితీయమైన కర్నూలు సీమ మాండలికంలో రాసిన కథలు కూడా ఈ సంకలనం ద్వారా మనకు పరిచయం కావడం. గంటేడ గౌరునాయుడు, అట్టాడ అప్పల్నాయుడుల కళింగాంధ్ర మాండలికంలాగా, వేముల ఎల్లయ్య నల్గొండ మాండలికంలాగా, నామిని, గోపిని వంటి కథకుల చిత్తూరు మాండలికంలాగా, ఇందులో కెంగార మోహన్, ఇనాయతుల్లా, డా.వి.పోతన వంటి కథకులు సజీవమైన కర్నూలు మట్టి మాండలికాన్ని పట్టుకున్నారు. వారి మాటల్లో జీవభాష జీవధారలాగా ఎట్లా పొంగిపొర్లుతోందో, కెంగారె మోహన్ రాసిన కథలో కొన్ని వాక్యాలు చూడండి:

”..నీకు రవంతన్నా అర్థమయ్యేల్లేదు. ఈ ఊర్లన ఏముండాదని ఉండల్ల..వాన్లు సెరిగ్గన్న పడ్తుండవా..యాడజూసినా ఏసిన సేన్లు ఏసినట్లే వాడిఫోతుండావి. ఊర్లు ఊర్లు పట్నాల్కి పొయీ దుడ్లు జమచేసుకుని వస్తుండారు. మీరేమో సేన్లు, బోర్లు అనకుంట ఈడే ఉండారు. మమ్మల్నిగాని బయటికి ఫొయీ బత్కనీకుండా సేస్తుండారు. లావు లావు రైతులే సేన్లమ్మి, యాడాడో అంగిళ్ళు, యాపారాలు సేస్కాంట ఉండారు. మన్లక్క ప్యాదావోళ్ళు బతుకనీకి సుగ్గికి ఫోతుండారు.. పెదిమంది ఎట్టబోతే అట్లుబోవల్లగాని..ఊరందురిది ఒక తెరువు..మీదొక్కిటే ఇంగొక తెరువు..’ రవంత గట్టిగే అన్య లచ్చుమణ్ణ.”

ఇనాయతుల్లా వాక్యాలు చూడండి:

”…సెప్పినారా..సూడత్తా.. వాడు గింతలేడుగానీ ఆడపిల్లలకు సైగలు జేస్తడు సింపిరినెత్తోడు..వాడొచ్చే జట్కాబండిని ఆపి..వాడిని సెవుపట్టుకోని కిందికి దింపి..ఏంరా నీకత అని -సెయ్యి కీలు తిప్పే పాటికి ..కొడుకు సేతులెత్తి మొక్కుతున్నడు.దున్నలెక్క పెరిగినరు కదరా..దిగి సారీ సెప్పు..సెంపలేస్కో..అంటిని..ఈ ఆడపిల్లోల్లకు గూడా సెప్తి అతికం శ్యాష్టాలు సేసేటోడ్ని ఎవుడేగాని యిడ్సిపెట్టొద్దు. ముందు మీరు అతి శ్యాష్టాలు సెయ్యాకర్రి ..అని సెప్పిని సూడత్తా..చెప్పింది దుర్గి.”

పోతన గారి శైలి చూడండి:

‘…నాకు శాతగాల్యా! నా కడుపులో పేగులు తప్పెట కొట్టినట్లు అరిసినాయి. ఫెళ్ ఫెల్ అని ఉరిమినాయి. ‘బజన యప్పుడెప్పుడైపోతాదా..గంగమ్మకు యప్పుడు టెంకాయ కొడతారా, మంగలం పాడతారా..బెల్లం, కొబ్బరి కలిపి బొరులు యప్పుడు తిందామా?’ అనుకున్యా..ఆకిలి నొప్పికి తట్టుకోలేక ‘అమ్మా! కడుపు నొస్తాందే ‘ అన్యా. ‘ఉండు, నొయ్యకుండా సేత్తా’ అనింది అమ్మ. నా కడుపును తన అరసెయ్యితో ..గట్టిగా వొత్తి పట్టుకుంది. నా కడుపు గుంత అయింది. నొప్పి మాత్రం తగ్గలా. కడుపు ఏంటికి నొత్తాందో నాకు తెలీదు. అమ్మకు తెలుసు. ‘బజన పాట్లు ఇనూ, తగ్గిపోతాది’ అనింది. అమ్మసెప్పినట్లు సేసినా! ఆకిలి అరుపులు తప్ప పాటలు, తాళాల మోతలు వినిపించల్యా. బజనగుంపు నాకు కనిపించలా, వాళ్ళ కాడ ఉన్న బెల్లం, బొరుగులు మాత్రమే కనిపించాయి. అమ్మ ఒడిలోనుంచి మెల్లగా లేసినా, ఎలక పిల్ల మాదిరి బజనసేసేవాళ్ళకాటికి సేరినా. భగితి ఎక్కవై వాళ్ళు కండ్లు మూయడమూ, తెరవడమూ గమనించినా. ఇదే సందు అనుకున్నా, ఎదురు గంపలో బొరుగుల బెత్తిమీద బుడిపెల మాదిరి ఉన్న బెల్ల ఊంటలు తీసుకుని మా అమ్మకాటికి పరిగెత్తిపోయినా. బెల్లం ఉంట అమ్మకు సూపించి గబుక్కున నోట్లో ఏసుకున్యా. అది సూసి అమ్మ గుండికాయకి సెమట పట్టింది. ‘అయ్యో! బ్యావర్శి నా బట్టా! యంతపనిసేసినావురా? వాళ్ళుగాని సూసింటే నీ యమకులు ఇరగ్గొంటిదురే! నీ పయ్యి బెల్లంగొట్టే గుండ్రాయితో నలగ్గొంటుందురే’ అని సెప్పుతూ నేని తినేది యవరూ సూడకుండా దుప్పటికప్పినట్లు కొంగు కప్పింది.’

ఆధునిక తెలుగు సాహిత్యాన్ని మరింత స్థానికం, మరింత విస్తృతం చేస్తూ ఒక ప్రాంతం నుంచి ఇందరు కథకులు, ఇన్ని కథలు రావడం సంతోషం, ఇంత సజీవభాషాప్రవాహం పొంగిపొర్లడం సంతోషం, కాని, ఇందులో కథలు సంతోషాన్నిచ్చే కథలు కావు. ఆ కథలు చదువుతున్నంతసేపూ ఎవరో మనగుండెని చెయ్యిపెట్టి కెలికినట్టే ఉంది. కడుపులో దేవినట్టే ఉంది.

తమ సంకలానికి రాసుకున్న ముందుమాటలో ఇలా అంటున్నారు:

”కథల్లో కన్నా యిక్కడి బతుకుల వాస్తవాలు కఠోరంగా ఉంటాయి. కవిత్వంలొ కన్నా సీమ జీవనవిషాదంలో గాఢత మెండుగా ఉంటుంది. యిరుకైన వలస బతుకు కర్నూలు నుండి బయలుదేరే రైలుపెట్టెల్లో నిండుగా ఉంటుంది. గుంటూరు మిరపఘాటే తప్ప ఆ బతుకుల్లో సుగంధమే కనిపించదు. హైదరాబాద్ గచ్చీబౌలీ, భవనాలు, ఫ్లై ఓవర్ లు, బషీర్ బాగులలో వెలసిన భవనాలు, ఫ్లై ఓవర్ ల నిర్మాణాల వెనక సీమ కూలీల చేతులే ఉన్నాయి., చేదు బతుకులే ఉన్నాయి. వెనకబాటులో తెలంగాణ కన్నా రాయలసీమ ముందున్నదనే అంశాన్ని మేధావులందరూ గుర్తించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సీమ రచయితలు, కవులు, కళాకారులు, మేధావులు బాసటగా నిల్చి తమ గోంతు కలిపారు. సీమ వెనకబాటు గురించి మాట్లాడే, పోరాడే సీమేతర గొంతులు కరువు కావడం సీమ కరువుకు తోడయ్యింది.”

కేవలం జీవితవాస్తవాన్ని చిత్రించడమో, లేదా సాహిత్యసృజన చెయ్యడమో కాకుండా, తమ ప్రాంతం వెనకబాటు తనం గురించిన ఒక సామాజిక చైతన్యం నేపథ్యంగా వచ్చిన కథలివి. ఆ చైతన్యం వల్ల, ఆ స్పృహ వల్ల, ప్రతి కథకుడూ తాను చెప్తున్న కథని ఎంత సూటిగా చెప్పగలడో అంత తదేకంగానూ చెప్పాడు.

అసలు పుస్తకం తెరుస్తూనే మొదటి కథ ‘నీళ్ళింకని నేల’, పౌరోహితం మారుతి కథ, చదవగానే మనం నేరుగా రెండో కథ చదవడానికి పేజీలు తిప్పలేం. ఆ కథ కత్తిలాగా మన హృదయంలో దిగబడుతుంది. మన వెన్నులో చలిపుట్టిస్తుంది. మన పట్ల మనకొక చెప్పలేని భావం, అది సిగ్గునో, అపరాధమో, దుఃఖమో చెప్పలేనిదేదో పట్టి మన మనసుకి తిమ్మిరెక్కుతుంది.

నూట యాభై పేజీలు కూడా లేని ఈ సంకలనం కర్నూలు సీమ జీవితానికి చెందిన ఎన్నో పార్శ్వాల్ని, నిరాశతోనూ, ఆ నిరాశలోనే జ్వలించే ఒకింత ఆశతోనూ చిత్రించింది. భవిష్యత్తు పట్ల నిబద్ధతతో జీవితాన్ని సమీపించిన సాహసం ఉంది. తమ ప్రాంతం, తమ సమాజం పూర్తిగా ఓడిపోలేదనీ, తాము దాన్ని కాపాడుకోగలమనే నమ్మకం ఉంది. జి.వెంకట కృష్ణ, ఎన్. నాగమణిల కథల్లో ఆ ఆశ ఒక సైద్ధాంతిక, తాత్త్విక భూమికను సమకూర్చుకోవడం కూడా కనిపిస్తుంది.

ఇందులో ప్రతి ఒక్క కథా ఒక రక్తపు చార. చివరికి ఇటిక్యాలపాడు గ్రామం ఘనచరితను తలుచుకునే సాహసగాథలో కూడా చింతగారి సంజీవరెడ్డి తెగిన కుత్తుక కూడా మనతో మాటాడుతుంది. ఇప్పుడు కొత్తగా ఏ కథ రాయగలనని కథకోసం వెతుక్కుంటూ కర్నూలు వీథుల్లో తిరిగిన ఎస్.డి.వి. అజీజ్ కథలో కూడా ‘గుర్రపు డెక్కల చప్పుడు, రెండు కాళ్ళు పైకెత్తి వీరోచితంగా సకిలిస్తున్న రసూల్ ఖాన్ గుర్రం, ఆయన ఎత్తి పట్టిన పదునైన తల్వార్ కొసనుండి కారుతున్న నెత్తుటి చుక్కల అస్పష్ట రూపాలు’ కూడా కనిపిస్తాయి.

కథాసంకలనం చదవడం పూర్తయ్యాక, మళ్ళా ఏదో చెప్పలేని ఆశ, ధైర్యం మనని ఆవహిస్తాయి. సంపాదకులు రాసుకున్న ఈ మాటలు మనకొక హామీనిస్తాయి. వారిలా రాస్తున్నారు:

‘ఈ నేల నుండి కన్నీటి కథల ధార మాత్రం ఇక ఇంకిపోదు. ఊట ఆగిన చెరువుల కథలు, ఊపిరాగిన రైతుల కథలు, ఊళ్ళు వదులుతున్న కూలోళ్ళ కథలు ప్రకృతి సృష్టించే కరువుతో పాటు పాలకుల వికృతి సృష్టించే కల్లోల కథలు ఇకపై సీమనుండి సంకలనాలు సంకలనాలుగా పర్చుకుంటాయని, ఈ నీళ్ళింకని నేల స్పష్టమైన హామీనిస్తుంది.’

5-8-2019

Leave a Reply

%d bloggers like this: