కథ కాదు, ఒక సంస్కారం

టాల్ స్టాయిని కవి అన్నాడట తుర్జెనీవ్. తక్కిన రచనలు అలా ఉంచి, ఆయన రాసిన Family Happiness (1859) నవలిక మాత్రం పూర్తిగా ఒక కావ్యం. ముప్పై ఏళ్ళ కింద, ఆ రచన తెలుగు అనువాదం ‘సంసారసుఖం’, ‘విషాదసంగీతం’ కథా సంపుటంలో చదివినప్పుడు, నా కళ్ళముందు, నా మనసులో ఆవిష్కారమైన మనోజ్ఞలోకాన్ని నేనెప్పటికీ మరవలేను.

ఇరవయ్యేళ్ళ కిందట, ఆ రచన మరో సారి చదవాలనుకుని, ఇంగ్లీషు అనువాదం కొనుక్కున్నానేగాని, ఆ పుస్తకం ఎప్పుడు తెరిచినా ఒకటి రెండు పేజీల కన్నా ఎక్కువ ముందుకు నడవలేదు. ఆ విషయంలో కూడా ఆ కథ పూర్తి కావ్యత్వాన్ని సంతరించుకుందనే అనిపించింది. ఒకటి రెండు పేరాలు చదవగానే మనసులో ఎప్పటివో జ్ఞాపకాలు, వేధించే తలపులు, ఊరించే ఊహలు కమ్ముకుని, పుస్తకం అట్లా మడిచిపెట్టేయడమే మిగిలేది.

మొన్న సాయంకాలం దిల్లీ ప్రయాణమంటే, ఈ సారేనా ఈ కథ మరోసారి పూర్తిగా చదువుదామని వెంటబెట్టుకున్నాను. పుస్తకం చదువుతూండగానే విమానం గాల్లోకి లేచింది. కొన్ని పేజీలు చదవగానే ఎప్పటిలానే మనసు మళ్ళా దూదిపింజలాగా విడిపోవడం మొదలయ్యింది. పుస్తకం అట్లానే మడిచిపెట్టి బయటకు చూసాను. నడి ఆకాశమంతా పత్తిచేలు విరగబూసినట్టు దూదిపింజల్లాంటి మేఘాలు. సుఖదుఃఖాల తోనూ, సకల సంక్లిష్టతలతోనూ అతలాకుతల మవుతున్న లోకం పూర్తిగా కప్పడిపోయింది. తన మాలిన్యాలన్నిటినీ మనసులో అణగదొక్కుకోగలిగిన మహాయోగి అంతరంగంలాగా శుభ్రధావళ్యం తప్ప మరేమీ కనిపించడం లేదక్కడ. నెమ్మదిగా సంధ్యకాంతి ఆ మేఘమండలం మీద సిందూరం కుమ్మరిస్తోంది.

పుస్తకంలోకి చూపులు తిప్పాను. ఆ ఇంగ్లీషు వాక్యాల్ని చదువుతూనే మనసులో తెలుగు చేసుకుంటూ చదవడం మొదలుపెట్టాను:

‘..ఆయన నన్ను ప్రశంసించాడు. అట్లా పొగడటం ఏదో తన హక్కన్నట్టుగా. అతడి మాటలూ, చూపులూ ఒక పసిపిల్లపట్ల ప్రసరిస్తున్నట్టుగా ఎంతో దయార్ద్రభరితంగా ఉన్నాయి. ఆ క్షణాన నాకు సంబంధించింది ప్రతి ఒక్కటీ ఆయనకు ఏ ఒక్క వివరం పొల్లుపోకుండా ఉన్నదున్నట్టుగా చెప్పేసుకోవాలని పించింది. నేను చేసిన మంచిపనులు. అలాగే ఆయన నాలో అంగీకరించలేని అంశాలు కూడా ఆయన ముందు, చర్చిలో చేసినట్టే, మనఃపూర్వకంగా వెల్లడించు కోవాలనిపించింది. ఆ సాయంకాలమంతా ఎంతో మనోజ్ఞంగా ఉంది. తేనీరు తాగిన తర్వాత కూడా చాలాసేపు మేమిద్దరం ఆ వరండాలోనే కూచుండిపోయాం. ఆ సంభాషణ నన్నెంత లోబరచు కుందంటే,కొంతసేపటికి నాకు ఇంట్లో పనివాళ్ళ మాటలు కూడా వినిపించడం మానేసాయి. నాలుగువైపుల నుండీ పూలసుగంధం మరింత దట్టంగానూ, మరింత గాఢంగానూ ఆవరిస్త్గూ ఉంది. తోటలో పచ్చికమీద మంచుకురవడం మొదలయ్యింది. లిలాక్ పొదల్లో ఒక నైటింగేలు ఇరుక్కుని మా మాటలు వింటూ ఆగిపోయింది. నక్షత్రాలు పరుచుకున్న వినీలాకాశం కిందకు వంగి మాకు చేరువగా జరిగింది.’

మరికొన్ని పేరాల తర్వాత-

‘ఆమె అక్కణ్ణుంచి లేచివెళ్ళిపోగానే మేమిద్దరం మౌనంగా కూచుండిపోయాం. మా చుట్టూ ప్రతి ఒక్కటీ నిశ్శబ్దంగా ఉన్నాయి, ఒక్కటి తప్ప. రాత్రంతా అప్పుడప్పుడు మాత్రమే కూస్తూ ఉన్న నైటింగేలు ఇప్పుడు తోటనంటా తెంపులేని పాటతో ముంచెత్తుతూ ఉంది. కొంతసేపటికి కిందన ఎక్కణ్ణుంచో మరొక పక్షి దానికి బదులివ్వడం మొదలుపెట్టింది. ఆ రెండవపిట్ట ఆ సాయంకాలం దాకా గొంతెత్తనే లేదు. మా దగ్గరలో ఉన్న పక్షి తనకు బదిలిస్తున్న గొంతును శ్రద్ధగా వింటున్నట్టుగా ఒక క్షణం పాటు ఆగి మళ్ళా మరింత బిగ్గరాగా పాటనందుకుంది. ఆ పాటలో దాని కూజితాలు మరింత లయాత్మకంగా, దీర్ఘనిశ్వాసాలతో హృదయంలోకి సొరవేసుకుపోతున్నట్టుగా ఉన్నాయి. ఆ పక్షుల కంఠాల్లో రాచరికపుఠీవిలాంటి ప్రశాంతత ఏదో ఉంది. ఆ గాల్లో ఆ స్వరాలు ప్రయాణిస్తోంటే, ఆ రాత్రి ఆ విహంగాలదే తప్ప మనిషిది కాదనిపించింది. తోటమాలి నెమ్మదిగా తన కుటీరంవైపు సాగిపోతున్నాడు. అతడట్లా నడిచిపోతుంటే, అతడి బూట్ల చప్పుడు నెమ్మదిగా పలచబడుతూ ఉంది. ఎవరో కొండదిగువ లోయలో రెండు సార్లు ఈల వేసిన చప్పుడు. మళ్ళా అంతా మునపటి వలె నిశ్శబ్దం. కొమ్మల రెపరెపలు కూడా వినిపించేటంత నిశ్శబ్దం. వరండాలో ఒక కిటికీ రెక్క గాలికి కదిలింది.ఎక్కణ్ణుంచో గాల్లో తెలుకుంటో వస్తోన్న ఒక అత్తరుపరిమళం పేలగా వరండాలో పరుచుకుంది. అంతదాకా నేనేమి చెప్పానో అదంతా గుర్తొచ్చి సిగ్గుగానూ, ఇబ్బందిగానూ అనిపించింది. మరేం మాట్లాడాలో తెలియలేదు. ఆయన వేపు చూసాను. ఆ సగం చీకటిలో ఆ నేత్రాలు మిలమిలమెరుస్తూ నా వేపు తిరిగాయి.’

మరొక రెండు పేజీలు, రెండవ అధ్యాయం ముగింపుకి రాబోతుండగా మళ్ళా ఈ వాక్యాలు-

‘..నేనీ మనుషుల మధ్యనే పదిహేడేళ్ళు పెరిగాను. కాని నాకున్నట్టే, వాళ్ళకి కూడా అభిమానాలూ, ఆకాంక్షలూ, విచారాలూ ఉంటాయని నాకు అప్పటిదాకా ఎప్పుడూ ఒక్కసారి కూడా తోచనేలేదు. ఎంతో కాలంగా పరిచితమైన మా తోటా, ఆ పొదలూ, ఆ పొలాలూ హటాత్తుగా ఒక్కసారిగా నాకెంతో కొత్తగానూ, అందంగానూ కనిపించడం మొదలుపెట్టాయి. ఆయన చెప్పింది నిజం: జీవితంలో నిశ్చయంగా లభించగల సంతోషమంటూ ఉంటే అది తోటి మనుషుల కోసం జీవించడంలోనే ఉంది. ఆయన మొదటిసారి ఆ మాటలన్నప్పుడు నాకు కొంత విచిత్రంగా తోచింది. అప్పుడు నేను ఆ మాటల్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను. కాని, నెమ్మదిగా ఆ మాటలు, నేనేమీ వాటి గురించి పెద్దగా ఆలోచించకుండానే, నా జీవితవిశ్వాసంగా మారిపోయేయి. నా జీవితాన్ని ఏ మాత్రం మార్చకుండానే, తన మనోభావాలు ప్రకటిస్తూండటం తప్ప మరేదీ నా జీవితంలోకి కొత్తగా ప్రవేశపెట్టకుండానే, ఆయన నా కళ్ళముందే, నేనున్నచోటనే సంతోషాలతో నిండిన ఒక సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించేడు. నా చిన్నప్పణ్ణుంచీ నన్నంటిపెట్టుకున్న ప్రపంచమే, ఒక్క మాటకూడా లేకుండా, ఒక్కసారిగా ప్రాణంపోసుకుని సజీవంగా నా ముందు నిలిచింది. ఆయన్ని చూస్తేనే చాలు, ప్రతి ఒక్కటీ నాతో ఏదో మాట్లాడానికి ప్రయత్నిస్తూ, నా హృదయమంతటితోటీ అంగీకారాన్నీ ఆపేక్షిస్తూ నన్ను సంతోషంతో ముంచెత్తింది.’

ఇంత లిరికల్ సౌందర్యాన్ని నింపుకున్న ఇట్లాంటి వాక్యాలు చదివిన తర్వాత యాంత్రికంగా పేజీలు తిప్పుకుంటూ, చదువుకుంటూ పోవడం కష్టం. పుస్తకం మూసేసాను. బయట ఆకాశదేశంలో వైశాఖమాసపు నెలబాలుడు ప్రత్యక్షమయ్యాడు. మేఘాల ధవళిమ, నింగి నీలిమ, సంధ్యారక్తిమల మధ్య ఒక వజ్రపుతునక లాగా నెలకూన. ఆ సన్నని కాంతిరేఖ తక్కిన కాంతులన్నిటినీ కనుమరుగు చేసేటంత ఏకాగ్రంగా, నిశితంగా, ఉజ్జ్వలంగా ఉంది.

నా మనసంతా చెప్పలేని ఒక అనిర్వచనీయమైన మధుర కలవరానికీ, కలవరపు మాధుర్యానికీ లోనయ్యింది. టాల్ స్టాయి చెప్తున్న కథకి సమానమైన కథ ఏదో నా అంతరంగం నాకు వినిపించడానికి ఉత్సాహపడుతూ ఉంది. కథ అంటే కథ కాదు. కథలన్నిటి పరమార్థం. నిన్ను నీ తోటిమనుషులకి మరింత చేరువగా తీసుకుపోయే ఒక సంస్కారం.

మనుషుల్తో కలిసి ఉండటంలోని ఆనందం. కలిసి గడపటంలోని ఆనందం. పూర్వకాలపు సమష్టికుటుంబాల్లోలాగా, అన్నం వండుకోవడం, కలిసి తినడం, ఇంటిల్లిపాదీ కలిసి పనులు చేసుకోవడంలోని ఆనందం. నా చిన్నప్పుడు, సంక్రాంతి రోజుల్లో, ఆ చలికాలపు ప్రభాతాన, మేమంతా నీళ్ళపొయ్యి దగ్గర కూచుని ఊరికినే మాటాడుకుంటూ ఉండేవాళ్ళమే, అట్లాంటి నిష్కారణ సామూహిక సంతోషం. రామనవమికో, గంగాలమ్మ పండగకకో ఊరంతా ఏకమై పందిళ్ళు వేసి, తోరణాలు కట్టి, ఉయ్యాల లూగేవారే అట్లాంటి సామాజిక సంతోషం.

లేదా ఏదో ఒక్క చిన్న కుగ్రామం, లేదా ఒక ఆదివాసి గ్రామం. అక్కడ నువ్వొక బడితెరుస్తావు. ఆ పిల్లలతో మాట్లాడుతూ వాళ్ళ ప్రపంచంలో అడుగుపెట్టడానికి యోగ్యత సంపాదించుకుంటూ ఉంటావు. ఒకరోజు మీకేమీ పాఠాలు చదువుకోవాలనిపించదు. అప్పుడు మీరంతా కలిసి ఊరవతల ఏటివడ్డుకి చేరుకుంటారు. గుమ్ములో మునుగుతారు లేదా చేపలు పట్టడానికి గాలం వేస్తారు. ఒక చేప గాలానికి చిక్కుతుంది. దాన్ని కొక్కెం నుంచి తప్పించి మళ్ళా నీళ్ళల్లోకి జారవిడుస్తారు. లేదా ఒకప్పుడు నువ్వు చూసావే, బడి ఎగ్గొట్టి చెంచుపిల్లలు ఆ తెలుగు గంగ కాలవపక్కన చేరి ఊరికే నీళ్ళల్లోకి మట్టిబెడ్డలు విసుర్తూ ఎంతదూరం విసరగలమా అని పందెం పెట్టుకుంటూ ఉన్నారో, అట్లా మీరంతా పందెం కాచుకుంటారు.

కాదా, మరో దృశ్యం. అనావృష్టికి గురయిన ఊళ్ళు. కొన్నేళ్ళుగా చెట్లు నరికేస్తూ వచ్చిన చోట. వాళ్ళకి నువ్వో ప్రణాళిక చెప్తావు. ప్రతి ఒక్క నీటిచుక్కా కాపాడుకోడానికి, భూసారం రక్షించుకోడానికి, ఆ నేలనంతా చూస్తూండగానే సస్యశ్యామలం చేయడానికీ మీరంతా నడుం బిగిస్తారు. ‘ఇదిగో, అక్కడ ఆ మట్టికట్ట ఎంతదాకా వచ్చింది ‘, ‘అరే,అప్పుడే సాయంకాలమైపోయిందా, చూసుకోనే లేదే ‘, ‘రాత్రి అన్నాలు తిన్నాక మళ్ళా మరోసారి కూచుని, ఆ తోట ఎట్లా పెంచాలో మరోసారి చర్చించుకుందాం ‘ లాంటి మాటలు వినబడుతూ ఉంటాయప్పుడు.

లేదా ఇంకో దృశ్యం. అక్కడొక ఉద్యమం తలెత్తుతూ ఉంది. పదిమందీ చదువుకోడానికో, లేదా ఏ స్థానికంగా నడుస్తున్న ఏ దురాచారాన్ని నిర్మూలించడానికో లేదా ప్రజలు మరింత నిర్భీతులుగానూ, మరింత సాధికారికంగానూ మారడానికో. నువ్వు కూడా అందులో ఒకడివవుతావు. నీ నాలుగు చేతుల్తోనూ చెయ్యగలిగిందంతా చేయడానికి ఉత్సాహపడతావు. రాత్రి బాగా పొద్దుపోయాక, అంతా అలిసిపోయి, ఎక్కడివాళ్ళక్కడే నిద్రలోకి జారుకున్నాక కూడా నీకింకా ఏదో చెయ్యాలనే అనిపిస్తూంటుంది. లేచి అక్కడ అడ్డదిడ్డంగా పడిఉన్నవాటిని సర్దిపెడతావు. మైమరిచి నిద్రపోతున్నవాళ్ళ వంటి మీద దుప్పటి సరిచేస్తావు. ఇంకా ఏదో నీలో ఉన్న సమస్త సృజనోత్సాహం నిన్ను నిలవనివ్వక పోతుంటే, ఆ గదిలోంచి లేదా ఆ హాల్లోంచి లేదా ఆ వసారాలోంచి బయటికొచ్చి నక్షత్ర ఖచిత ఆకాశం కేసి ప్రేమగా చూస్తావు. ఎక్కడో ఏ దివ్యలోకాల్లోంచో ఎవరో కవులు, గాయకులు గంధర్వులు నీతో సంభాషించడంకోసం అక్కడ వేచి ఉన్నారని నీకెంతో నమ్మకం.

ఆలోచనలు పక్కకు నెట్టి మళ్ళా పుస్తకం తెరిచాను. మూడవ అధ్యాయం. సెర్గీ మిఖలైవిచ్, మాషా, కాత్యా,సోన్యా అంతా ఒక సాయంసంధ్యవేళ ఆ తోటలో ఇంటిముందు నిల్చొని ఉండగా-

‘చూడు, ఎట్లాంటి వెన్నెల రాత్రి ఇది అన్నాడాయన ఆరుబయట నించొని ఒకింత విభ్రాంతితో. అక్కడ తోటలోకి తెరుచుకున్న ఒక గవాక్షం ముందు నిల్చొని ఉన్నాడాయన. మేము కూడా అక్కడికి చేరుకున్నాం. నిజంగానే అట్లాంటి రాత్రిని నేనంతదాకా నా జీవితంలో చూసి ఉండలేదు. పూర్ణిమాచంద్రుడు మా ఇంటిమీదా, మా వెనగ్గా ప్రకాశిస్తూ ఉన్నాడు. మాకు అతడు కనిపించడం లేదుగాని, ఇంటిముందు మట్టిబాట మీద ఏటావలుగా ఆ ఇంటికప్పు, స్తంభాలు, వరండా జాలు పరుస్తున్న నీడ కనిపిస్తూ ఉంది. ఆ బాటపక్క పచ్చికమీదా ఆ వెన్నెల నీడ మెరుస్తూ ఉంది. చంద్రకాంతి, మంచుసోనల వెండికాంతిలో ప్రతి ఒక్కటి తళుకులీనుతూ ఉంది. తోటలో ఒక పక్క డాలియాలూ, వాటిని అల్లుకున్న లతలతో విశాలమైన బాట మరింత చల్లగా మరింత ప్రకాశభరితంగా కనిపిస్తూ ఉంది. ఎగుడుదిగుడుగా ఉన్న ఆ మట్టిబాట ఆ వెన్నెట్లో సుదూరంగా సాగుతూ దూరంలో అస్పష్టంగా వట్టి ఊహగా మారిపోతూ ఉంది. ఆ చెట్ల మధ్య ఆ ఉద్యానగృహం మరింత శోభాయమానంగా కనిపిస్తూఉంది. దూరంగా లోయలో మంచు కురవడం మొదలయ్యింది. అప్పటికే ఆకులు రాల్చడం మొదలుపెట్టిన లిలాక్ పొదలు ఆ మధ్యలొ మరింత కాంతిమంతంగా ఉన్నాయి. మంచులో తడుస్తున్న ఆ పొదల్లో ప్రతి ఒక్క పువ్వూ స్పష్టంగా గోచరిస్తూ ఉంది. తోట మధ్యలో బాటలకి అటూ ఇటూ ఉన్న చెట్ల నీడలూ, వెలుగూ ఎట్లా కలగలిసిపోయాయంటే, అవి చెట్లలానూ, బాటల్లానూ కాకుండా, పారదర్శకమైన గృహాల్లాగా అటూ ఇటూ ఊగుతూ తలలూపుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. మా కుడిపక్క మా ఇంటినీడ. ఆ నీడలో ప్రతి ఒక్కటీ గుర్తుపట్టలేనంత దట్టంగా, చీకటిగా, మాయాజాలంగా కనిపిస్తున్నది. చుట్టూ ఆవరించిన ఆ చీకటి మధ్య సమున్నతమైన పోప్లార్ వృక్షశిఖరం మాత్రం కాంతికిర్మీరంలాగా గోచరిస్తున్నది. ఏదో ఒక ఛాయలాగా దూరదిగంతంలోకి తుడిచిపెట్టుకుపోకుండా, ఆకాశగాఢనీలిమలో కరిగిపోకుండా, ఆ చెట్టు తన శాఖోపశాఖలన్నిటితో ఆ కాంతిలోకంలోకి చొచ్చుకుపోయి కనిపిస్తున్నది.’

ఆ వెన్నెల సాయంకాలం వాళ్ళట్లా ఆ తోటదారిన నడకమొదలుపెట్టగానే నాకు శాకుంతలం గుర్తొచ్చింది. నేను ఆ కథ మొదటిసారి చదివినప్పుడు కూడా ఆ సన్నివేశంలో శాకుంతలాన్నే తలుచుకున్నానని కూడా గుర్తొచ్చింది. మోనియర్ విలియమ్స్ ఇంగ్లీషు అనువాదం. నాటకం మొదటి అంకంలోనే , కణ్వాశ్రమంలో దుష్యంతుడు, శకుంతల, అనసూయ, ప్రియంవదలతో కలిసి చెట్ల మధ్య నడుస్తూ, ఒక చెట్టు నీడన కొద్దిసేపు కూచుని మాట్లాడుకున్న దృశ్యం. ఏముంది అందులో? ప్రపంచ సాహిత్యంలో, ఆ మాటకొస్తే, శాకుంతలం లో కూడా అంతకన్నా గొప్ప దృశ్యాలు, సంగీతమయ సన్నివేశాలు మరెన్నో ఉండవచ్చు. కానీ, ఆ దృశ్యం నా మనసులో వేసిన ముద్ర నన్నెప్పటికీ వదలదు. ఏముంది అందులో?

బహుశా మనుషులు ఒకరికొకరు పరిచయమై స్నేహితులుగా మారే తొలినాళ్ళ, తొలి క్షణాల అపురూపమైన, అమాయికమైన, నిష్కల్మషత్వమంతా ఉందనుకుంటానక్కడ. స్నేహాలు, ప్రేమాలు, సాహచర్యాలు, సహప్రయాణాలు ఎటువంటివైనా కొన్నాళ్ళకు మసకబారిపోతాయి. దైనందిన జీవితం వాటిని మొరటుబార్చేస్తుంది. ఎంత మహోన్నత ఆశయాల సాధనకోసం తలెత్తిన ఎటువంటి ఉద్యమాల్లోని ఎటువంటి స్ఫూర్తిదాయకమైన కామ్రేడరీ కూడా కొన్నాళ్ళకు ఆత్మస్తుతి, పరనిందగా మారిపోతుంది. ఎందరు స్నేహితుల విషయంలో, ఎన్ని సార్లు పదే పదే అనుకోలేదు నేను! మేమొకరికొకరు పరిచయమైన ఆ తొలిదినాల్లో ఇతడు లేదా ఈమె ఎంత విభ్రాంతకరంగా, ఎంత సమ్మోహకరంగా ఉండేవారు అని!

శాకుంతలం మళ్ళా రెండో సారి చదవడం కష్టం. ఆ పుస్తకం గొప్ప దిగులుని రేకెత్తిస్తుంది. ఎన్ని సార్లు చదువుదామని తెరిచినా ,ఆ ప్రస్తావనలోని, రెండవ శ్లోకంలోని, ఆ ‘పాటల సంసర్గ సురభివనవాతాలూ’, ఆ ‘ప్రచ్ఛాయ సులభనిద్ర’, ఆ ‘గాఢసలిలావగాహాలూ’ కనిపించగానే చెప్పలేని బెంగ ఒక వేసవిగాడ్పులాగా ముఖాన కొడుతుంది. ‘పరిణామ రమణీయాలైన’ ఆ దినాలేవీ? ఆ రాత్రులెక్కడ? ఏమై పోయాయి ఆ రోజులు? ఎక్కడికిపోయాయి ఆ స్నేహాలు? జీవితం ప్రతి ఒక్క రోజూ ఇట్లానే గడుస్తుందని నమ్మిన రోజులు, ఇట్లానే గడవాలని అమాయికంగా కోరుకున్న రోజులు?

పుస్తకం పక్కన పెట్టేసాను. దిల్లీ విమానాశ్రయంలో దిగగానే ఆ సంధ్యవేళ వేపపూలగాలి వెచ్చగా నన్ను ముంచెత్తింది. ఉక్కుసముద్రంలాంటి ఆ విమానాశ్రయంలో ఒక్క వేపచెట్టుకూడా లేదే, ఎక్కడిదీ గాలి అనుకున్నాను. ఆ మర్నాడు దిల్లీ వీథులంతటా విరబూసిన వేపచెట్లు కనిపించినప్పుడు, దేశమంతా ఎన్నికల్లో మునిగిపోయి ఉంటే, దేశరాజధాని మాత్రం వేపపూల తావిలో బందీ అయిపోయిందని అర్థమయింది. ఒక సుదూర జ్ఞాపకంగా మారిపోయిన ఆ పురాతన వేసవిదినాల తలపోతలనుంచి బయటపడతాననుకున్న నాకు అనూహ్యంగా దిల్లీలో కూడా మళ్ళా మా ఊరు, ఆ వేసవి, ఆ వేపపూల తీపిగాలులే ప్రత్యక్షమయ్యాయి. ఇక నిలువెల్లా చిగురించి, అక్బర్ రోడ్డులో, అటూ ఇటూ తళతళలాడుతున్న తెల్లమద్ది చెట్లని చూడగానే నేను పూర్తిగా స్పృహ తప్పాను.

మనుషులు కోరుకోవలసింది ఒక ‘సామాజిక సామూహిక సద్వర్తన’ అన్నాడు శ్రీశ్రీ. ఇప్పుడు నా చుట్టూ ఉన్న ప్రపంచంలో లేనిదదే. లేనివవే. సమాజం సమూహాలుగా చీలిపోతే పోనివ్వు, కాని ప్రతి ఒక్క సమూహానికీ ఒక సామూహిక సద్వర్తన అయితే తప్పనిసరి కదా. సద్వర్తన అనే మాటని పూర్వకాలపు నైతికార్థంలో ప్రయోగించలేదు మహాకవి. అది మనుషులు కలిసి మెలిసి జీవించడంలోని సంతోషం. కలిసి బతకడం, ఒకరికోసం ఒకరు బతకడం. కలిసి పనిచెయ్యడం. వేదకాలపు మానవుడిలాగా నూరు శరత్తులు చూడాలనుకోవడం, హీబ్రూ ప్రవక్తలాగా, మనిషి ఒక సామాజిక ఆత్మతో ఒక ఒడంబడిక కుదుర్చుకున్నాడని నమ్మడం. రెండవప్రపంచ యుద్ధకాలంలో సోవియెట్ రచయితల్లాగా మనుషులు కలిసి పోరాటం చెయ్యడం ద్వారానే మానవాళిని బతికించుకోగలరని నమ్మడం.

నాకెందుకో బతకాలని చాలా బలంగా అనిపించింది. ఒక్కణ్ణీ కాదు, ఒక్కడిగా కాదు, నలుగురితో కలిసి, ఒక నమ్మకం కోసం, ఒక విలువని సృష్టించడం కోసం, సృష్టించుకున్న విలువల్ని నిలబెట్టుకోడం కోసం, ఏదో ఒక పని చెయ్యాలనిపించింది. నా పసితనంలో మా అన్నయ్య తో కలిసి ఒక వెన్నెల రాత్రి మా ఊళ్ళో చాపరాయి మీద, ఎవరో ఆరబెట్టుకున్న తుమికాకు కట్టలు విప్పి వాళ్ళ కోసం ఆ ఆకులు ఆరబెట్టినట్టు, ఏదో ఒక పని, కలిసి చెయ్యడంలోని ఆనందం తప్ప మరే ప్రతిఫలం, ఇహలోకంలోనూ, పరలోకంలోనూ కూడా అక్కర్లేని పని ఏదో ఒకటి చెయ్యాలని బలంగా అనిపించింది. అనాకెరెనినా నవల్లో లెవిన్ ఒకచోట ఉండబట్టలేక పంటకోతల్లో తాను కూడా కొడవలి పట్టుకుని కోతపనిలో మునిగిపోతాడే అట్లా అనిపించింది. మరీ బలంగా అనిపించింది.

9-5-2019

Leave a Reply

%d bloggers like this: