
మొన్న సాయంకాలం తాడికొండ వెళ్ళాను. 1978 లో ఆ పాఠశాల వదిలిపెట్టిన తరువాత, ఇది నాలుగవ సారి వెళ్ళడం. ఈసారి కన్నెగంటి రామారావుతో.
నేనక్కడ 1972 నుంచి 78 దాకా చదువుకున్నాను. రామారావు 77 నుంచి 80 దాకా చదువుకున్నాడు. గుంటూరు నుంచి అమరావతి వెళ్ళే రోడ్డుమీద అడ్డరోడ్డు దగ్గర తాడికొండ వెళ్ళే మలుపు తిరగ్గానే నాకేదో చెప్పలేని ఉద్విగ్నత కలిగింది. ‘రామారావు, మన జీవితాల్ని మలుపు తిప్పిన రోడ్డు కదా’ అన్నాను.
ఇద్దరు పూర్వవిద్యార్థులు తమకి ప్రాణం పోసిన ఒక పాఠశాలను వెతుక్కుంటూ చేసిన ఆ ప్రయాణం హృద్యమూ, అపూర్వమూ కూడా. మేమా పాఠశాలలో అడుగుపెట్టగానే ఆ పాత డార్మిటరీలు, ఆ ప్రేయర్ గ్రౌండు, ఒకప్పుడు మా క్లాసు రూములుండే చోటు ప్రతి ఒక్కటీ కలయదిరిగాం. నేను చేరిన మొదట్లో ఎ డార్మిటరీగానూ తర్వాత రోజుల్లో నాగార్జున డార్మిటరీగానూ పిలిచిన భవనం, కట్టి, దాదాపు అరవై ఏళ్ళ పైనే అయి ఉంటుంది, ఇంకా చెక్కుచెదరలేదు. ఆ డార్మిటరీ గోడల మీద ఒకప్పుడు బుద్ధుడి బొమ్మా, దానికింద ఒక శ్లోకం రాసి ఉండేవి. ఇప్పుడు ఆ గోడకి వెల్లవేసారు, కాని అస్పష్టంగా ఆ బుద్ధుడి బొమ్మ కనిపిస్తూనే ఉంది. ‘రామారావు, ఆ శ్లోకం గుర్తుందా నీకు’ అనడిగితే వెంటనే అప్పచెప్పేసాడు: ‘న త్వహం కామయే రాజ్యం, న స్వర్గం, న పునర్భవం,కామయే దుఃఖతప్తానామ్ ప్రాణినామ్ ఆర్తినాశనమ్’ ( నేను స్వర్గం కోరను, రాజ్యం కోరను. మరు జన్మ కోరను. నేను కోరుకునేదంతా దుఃఖంతో తపిస్తున్న ప్రాణుల ఆర్తి తీర్చడమొక్కటే) అంటూ.
ఆ పాఠశాలకి అప్పట్లో ప్రతి ఏడాదీ పదవ తరగతి పరీక్షల్లో రాష్ట్రస్థాయి మొదటిరాంకులు వచ్చేవి. అట్లా ఉత్తమఫలితాలు సాధించిన విద్యార్థుల పేర్లు ఆ పాఠశాలలో ప్రిన్సిపాలుగారి గదిలో ‘రోల్ ఆఫ్ ఆనర్’ పేరిట బోర్డు మీద రాసి ప్రదర్శించే ఆచారం ఉండేది. 1975 లో మా పాఠశాలనుండి మొదటిసారి పదవతరగతి పరీక్షలకు వెళ్ళిన విద్యార్థులు మొదటి పదిరాంకులూ సాధించారు. అట్లా నా పేరు కూడా ఆ బోర్డుమీదకి ఎక్కాలని నాకెంతో తపనగా ఉండేది. కాని, నేను లెక్కల్లో చాలా వెనకబాటు విద్యార్థిని. నా సహాధ్యాయులు నూటికి నూరుశాతం తెచ్చుకుంటూ ఉంటే, నాకు అరవయ్యో, డెభ్భయ్యో వచ్చేవి. అక్కడ లోటుపడ్డ ఆ ముప్పై మార్కులూ తక్కిన అయిదు సబ్జెక్టుల్లోనూ పూరించడం దాదాపు అసాధ్యం. కాబట్టి, ఆ రోల్ ఆఫ్ ఆనర్ లో నా పేరు కనబడదనే భయం నన్ను పీడిస్తూ ఉండేది. కాని, చివరికి, 1978 పదవతరగతి పరీక్షల్లో నేను తాడికొండ స్కూలు ఫస్టు వచ్చాను. రాష్ట్రంలో పదవ రాంకు. లెక్కల్లో 95 మార్కులే వచ్చాయి. కాని, పాదరసం గుళికల్లాంటి నా సహాధ్యాయుల్ని వెనక్కి నెట్టి నేను ముందుకు రావడానికి జరిగిన ఇంద్రజాలమంతా హిందీ పేపర్లో జరిగింది. హిందీలో నాకు 93 మార్కులు వచ్చాయి. ఇప్పటికీ నాకేమనిపిస్తుందంటే, హీరాలాల్ మాష్టారికి నా మీద ఉన్న అపరిమితమైన వాత్స్యల్యం వల్లనే, ఆయన మనసులో ఎట్లాగేనా నేను చదువులో కూడా ఫస్టు రావాలన్న కోరిక బలంగా ఉన్నందువల్లనే నా పేరు ఆ రోల్ ఆఫ్ ఆనర్ మీదకి ఎక్కగలిగిందని! (ఎందుకంటే ఆయన నాతో సాహిత్యం (అప్పటి తాడికొండ పరిభాషలో ‘జనరల్ బుక్స్’) చదివిస్తున్నారనీ, నేను రాంకు తెచ్చుకోకుండా అడ్డుపడుతున్నారనీ, మా ప్రిన్సిపాలుగారికి ఆయన పట్ల చాలా అసహనం ఉండేది).
కన్నెగంటి రామారావు నాకన్నా తెలివైన, చురుకైన విద్యార్థి. అతడికి 1980 పదవతరగతి పరీక్షల్లో రాష్ట్రంలో రెండవ రాంకు వచ్చింది. అతడి పేరు కూడా సహజంగానే ఆ రోల్ ఆఫ్ ఆనర్ కి ఎక్కింది. ఇద్దరం పాఠశాల ప్రిన్సిపాలుగారి గదిలో గోడమీద ఆ రోల్ ఆఫ్ ఆనర్ లో మా పేర్లు చూసుకున్నాం.
కాని, ఈ రోజు ఆ రోల్ ఆఫ్ ఆనర్ చూసి నాకేమీ పులకింత కలగలేదు, సరికదా, అదేమంత శ్రేష్ఠ సంప్రదాయం కాదనిపించింది. పాఠశాలలో పిల్లలకి పరీక్షలు పెట్టి, పేపర్లు దిద్ది, మార్కులు వేసి, ఎప్పటికప్పుడు రాంకులిస్టులు గోడకి తగిలించడం పాఠశాల కనీస కర్తవ్యాల్లో ఒకటనే నేను చాలా కాలం భావించేను. కాని, రెండేళ్ళ కిందట, ఋషీవాలీ పబ్లిక్ స్కూలుకి వెళ్ళినప్పుడు, అక్కడ రాంకులిస్టులంటూ ఉండవని, అసలు పిల్లలకి మార్కులు వెయ్యడమూ, ఆ మార్కులు నలుగురికీ తెలిసేలా చెప్పడమూ అనే ఆచారాలే ఉండవని విన్నప్పుడు నేనొక కల్చర్ షాక్ కి లోనయ్యాను. నేను చదువుకున్న పాఠశాల అత్యుత్తమమైన పాఠశాలల్లో ఒకటన్న మాట నిజమేగాని, తనకు తెలియకుండానే మా పాఠశాల, ఒక అమానుష ఆచారాన్ని ఏళ్ళ తరబడి చాలా నిష్టగా పాటించిందని అర్థమయింది. పిల్లలకి పరీక్షలు పెట్టి, పేపర్లు దిద్ది, నలుగురి ఎదటా మార్కులు చెప్పి, రాంకు లిస్టు తయారు చేసి గోడమీద పెట్టడం వల్ల పదిపదిహేనుమంది విద్యార్థుల్ని మరింత స్పర్థాళువులుగా తయారుచేసి మరింత పురోగాములుగా తీర్చిదిద్దినప్పటికీ, అత్యధిక సంఖ్యాకులైన విద్యార్థులకి తమ శక్తిసామర్థ్యాలపట్ల, భవిష్యత్తుపట్ల నమ్మకం లేకుండా చేయడమే అవుతుంది. తర్వాతి రోజుల్లో, కార్పొరేట్ పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థుల్ని మార్కుల ప్రకారం విడగొట్టి, వాళ్ళల్లో చురుకైన విద్యార్థుల్ని చైనా బాచిగా తీర్చిదిద్దే దుష్ట సంప్రదాయం నేడు చేస్తున్నదిదే.
కాని తాడికొండకి నేను గాని, రామారావుగాని ఋణపడేది మా రాంకులకి కాదు. ఆ పాఠశాల మా జిజ్ఞాసని ఎప్పటికప్పుడు జ్వలింపచేస్తూండింది. కొత్త విషయాలు తెలుసుకోవాలనీ, కొత్త ప్రయోగాలు చేపట్టాలనీ, మానసిక పరిథి ఎప్పటికప్పుడు విస్తరింపచేసుకోవాలనీ మాలో ఒక నవ్యోత్సాహాన్ని ఎప్పటికప్పుడు రగిలిస్తూ ఉండేది. విద్య పరమార్థం ఏదో ఒకటి నేర్పడం కాదు, నేర్చుకోవడమెట్లానో నేర్పడం అనే మాట నిజమైతే, ఆ లక్ష్యానికి తాడికొండ ఒక సజీవ తార్కాణ.
ఆ మధ్యలో చాలాకాలం ఆ పాఠశాల గుంటూరు జిల్లాకే పరిమితమైన పాఠశాలగా కొనసాగింది. ఆ తర్వాత పూర్వ విద్యార్థుల చొరవవల్ల ఇప్పుడు దాన్ని రీజనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ గా మార్చారు. కాని, మౌలిక సదుపాయాలు మాత్రం అందుకు తగ్గట్టుగా సమకూరనే లేదు. చేపట్టిన నాలుగు పనులూ సగంలో నిలిచిపోయాయి. ఉన్న ఒక్క డార్మిటరీ పెచ్చులూడి ఎప్పుడు పడిపోతుందో తెలియని పరిస్థితిలో ఉంది.
కాని, ఆ పనులు పర్యవేక్షించవలసిన బాధ్యతలో, సర్వ శిక్ష అభియాన్ రాష్ట్ర పథకసంచాలకుడిగా, ఇప్పుడు నేనా పాఠశాలలో అడుగుపెట్టడం నా భాగ్యం. దాదాపు ఇరవయ్యేళ్ళ కిందట, ఆ పాఠశాలకు వెళ్ళినప్పుడు, ఆ రాత్రంతా నాకు నిద్రపట్టలేదు. కనీసం అప్రోచ్ రోడ్డు కూడా లేని ఆ పాఠశాలకు ఏమీ చెయ్యగలిగే స్థితిలో లేకపోయినందుకు నన్ను నేను క్షమించుకోలేకపోయాను. నేను రాజకీయాల్లో ఎందుకు చేరలేకపోయానని ఒకటే చింతించాను. కనీసం ఒక ఐ ఏ ఎస్ అధికారినైనా ఎందుకు కాలేకపోయానని ఒకటే మథనపడ్డాను. ఆ చింత నన్ను వదల్లేదు. ఆ తర్వాత రెండుమూడేళ్ళకు నేను రాసిన ‘కొన్ని కలలు, కొన్ని మెలకువలు’ పుస్తకాన్ని ఆ పాఠశాలకు అంకితమిచ్చి నన్ను నేను కొంత ఊరడించుకున్నాను.
ఇప్పుడు ఆ పాఠశాలకు ఏదైనా చెయ్యగలిగే అవకాశంతో మళ్ళా అడుగుపెట్టాను. ప్రిన్సిపాలు రమణారావుగారు పిల్లలతో ఆరుబయట ఒక సమావేశం ఏర్పాటు చేసారు. ఆ సాయంకాలం, పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు, అన్నిటికన్నా ముందు, వాళ్ళకీ, అసలు గురుకుల విద్యాలయాల్లో ఉండే పిల్లలందరికీ మూడు జతల చొప్పున యూని ఫాం ఇవ్వబోతున్నట్టు చెప్పాను. ఆ సాయంకాలం మాతో పాటు అక్కడ మాతో పాటు గురుకులం సెక్రటరీ నాగభూషణ శర్మగారూ, సూపరింటెండింగ్ ఇంజనీరు వెంకట రమణగారూ కూడా ఉన్నారు. మరికొన్ని సదుపాయాలు కూడా ఆ పాఠశాలకి సమకూర్చడం గురించే మేము చాలా సేపు మాట్లాడుకున్నాం.
కాని రామారావు మరింత భావవైశాల్యంతో మాట్లాడేడు. ఒక పాఠశాల అంటే ఏమిటి? భవనాలు, సదుపాయాలు మాత్రమేనా? ప్రయోగాలు, ప్రయోగాలు, మరిన్ని ప్రయోగాలు కావా అన్నాడు. కొత్త ఆలోచనల్తో పాఠశాల ముందుకొస్తే కలిసిపనిచేయడానికి ప్రపంచంలో ఎందరో సిద్ధంగా ఉన్నారన్నాడు.ఒక ఆలోచన మాకు స్ఫురించిందేమంటే, ఋషీవేలీ పబ్లిక్ స్కూలు ఎలాగైతే చుట్టూ ఉన్న గ్రామీణ పాఠశాలల్ని దత్తత తీసుకుని అక్కడ అభ్యసన ప్రయోగాలు చేపడుతూ ఉందో, అలాగే తాడికొండ, కొడిగినహళ్ళి పాఠశాలలు కూడా రిసోర్సు సెంటర్లు గా మారవచ్చనేది.
మేము పిల్లలతో మాట్లాడుతూ ఉండగా, మా ఎదట తాటిచెట్ల మధ్యనుంచి శ్రావణ పూర్ణచంద్రుడు దూరదిగంతం మీంచి ఉదయిస్తున్నాడు. ఆ సమావేశం పూర్తవగానే మేము పిల్లలతో కలిసి భోంచేసాం. అన్నం తినడానికి ముందు ఆ పాఠశాల విద్యార్థులు ఎప్పట్లానే ‘సహనావవతు, సహనౌ భునక్తు’ అనే ఉపనిషన్మంత్రం పఠించారు. నాకూ, రామారావుకీ కాలం నలభయ్యేళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. ఆ సాయంకాలం మేము మాట్లాడిన విద్యార్థుల్లో ఎవరో ఇద్దరు విద్యార్థులు, మరొక నలభయ్యేళ్ళ తరువాత, మాలానే పూర్వ విద్యార్థులుగా ఈ పాఠశాలలో అడుగుపెట్టే దృశ్యమొకటి మా కళ్ళ ముందు కదిలింది.
17-7-2019