ఒక ప్రత్యేక ప్రపంచం

విద్య గురించి, ముఖ్యంగా పేదవారి విద్య గురించి ఆలోచించినప్పుడల్లా నాకు అనా కరెనినా లో మొదటి వాక్యాలే గుర్తొస్తాయి. ‘సంతోషంగా జీవిస్తున్న కుటుంబాలన్నీ ఒక్కలానే ఉంటాయి. కడగండ్లు పడే కుటుంబాల్లో ఎవరి దుఃఖం వారిదే ‘ అని.

కొద్దిగా ఆర్థికంగా వెసులుబాటు ఉండి, తల్లిదండ్రులు కూడా చదువుకున్నవాళ్ళు అయి ఉంటే, ఆ పిల్లల చదువులన్నీ దాదాపుగా ఒక్కలానే, ఒక స్థాయిలోనే ఉంటాయి. వాళ్ళని మనం normal గా భావిస్తాం. మన పాఠశాలలూ, మన ఉపాధ్యాయులూ, మన ఉపాధ్యాయ శిక్షణలూ, మన పాఠ్యగ్రంథాలూ, మన పరీక్షలూ అన్నీ కూడా అటువంటి సాధారణ బాలబాలికల్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించేవే. ఉపాధ్యాయుడు తరగతి గదిలో బోధించేది కూడా అటువంటి సగటు విద్యార్థిని దృష్టిలో పెట్టుకునే. కాని, అటువంటి విద్యాబోధన, విద్యాప్రణాళిక నెమ్మదిగా బీద పిల్లల్ని పక్కకునెట్టేస్తుంది. ఎందుకంటే వాళ్ళ విద్యావసరాలు తీర్చడానికి ప్రత్యేక శ్రద్ధ కావాలి. ప్రత్యేకబోధన కావాలి. ప్రత్యేక కరికులం కావాలి.

మన సమాజానికి సంబంధించినంతవరకూ, అటువంటి విద్యార్థుల్ని ఆరు రకాల సమూహాలుకి చెందిన వాళ్ళుగా గుర్తుపట్టవచ్చు. వాళ్ళు, గిరిజనులు, దళితులు, రైతుకూలీల, కూలీల , జీవనోపాధి కోసం వలసపోయే కుటుంబాల బిడ్డలు, అల్పసంఖ్యాక వర్గాల పిల్లలు, బాలికలూ, దివ్యాంగులూను. టాల్ స్టాయి చెప్పినట్టుగా వాళ్ళల్లో ఎవరి కష్టం వారిదే, ఎవరి ప్రయాణం వారిదే, ఎవరి అవసరాలు వారివే. వాళ్ళు విద్యాస్రవంతినుంచి జారిపోకుండా ఉండటానికీ, జారిపోయిన వాళ్ళని మళ్ళా పట్టి తీసుకువచ్చి, వాళ్ళని మళ్ళా ప్రధానస్రవంతిలో కలపడం కోసమే సర్వ శిక్షా అభియాన్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చింది.

వాళ్ళ వాళ్ళ ప్రత్యేక అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని, వాటిని తీరుస్తూ, ఆ పిల్లల్ని మళ్ళా పాఠశాలలో ప్రతిష్టించడం కోసం ప్రణాళికావేత్తలు ఎన్ని పథకాలకి రూపకల్పన చేసారో చూస్తుంటే చాలా ఆశ్చర్యంగానూ, వాటిని సమర్థవంతంగా అమలు చేయడం ఒక సవాలుగానూ కనిపిస్తోంది. ఈ ఆరు సమూహాలకు చెందిన పిల్లల విద్యావసరాల్ని గుర్తించడం, ప్రతి ఒక్క ముఖ్య అవసరానికీ తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించడం, అమలు చేయడం ఈ ప్రాజెక్టులో నా బాధ్యత అని అర్థం చేసుకున్నాను. కాని, వారిలో, గిరిజన బాలబాలికల విద్యావసరాలను అర్థం చేసుకోవడంలోనూ, వారికి అనుగుణ్యమైన విద్యావిధానాన్ని అమలు చేయడంలోనే నా జీవితంలో అధికభాగం గడిపాను. బాలికలు కొక తక్కిన నాలుగు సమూహాలకు చెందిన విద్యావసరాలు నాకు దాదాపుగా కొత్త. సర్వ శిక్షా అభియాన్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలంటే, ఆ సమూహాల విద్యావసరాల్ని నేను అర్థం చేసుకోగలగాలి, వాటి గురించి కొత్తగా తెలుసుకోవాలి, ఆ దిశగా నా నైపుణ్యాలకు పదును పెట్టుకోవాలి.

మరీ ముఖ్యంగా, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల విద్యావసరాల గురించీ, వారికి అందిస్తున్న విద్య గురించీ నా పరిజ్ఞానం చాలా ప్రాథమికం అని ఒప్పుకోవాలి. మన రాష్ట్రంలో అటువంటి పిల్లలు సుమారు లక్షమందిదాకా ఉన్నారు. వారి కోసం ప్రతి మండల కేంద్రంలోనూ, సర్వ శిక్షా అభియాన్ ఒక inclusive education resource center నడుపుతున్నది. అందులో ఇద్దరు ఉపాధ్యాయులూ, ఒక ఆయా తో పాటు బోధన, అభ్యసన సామగ్రి, పిల్లల శారీరిక వ్యాయామానికీ, చికిత్సకీ, వికాసానికీ అవసరమైన సామగ్రి కూడా ఉంటుంది. వారిలో శారీరిక చికిత్స కోసం వారానికి మూడురోజులు సేవలు అందించడానికి ఫిజియో థెరపిస్టుల్ని, పిల్లలకీ, వారి తల్లిదండ్రులకీ కౌన్సెలింగ్ చేయడానికి సైకాలజిస్టుల్ని కూడా సంస్థ నియమించింది. ఇటువంటి సేవలతో పాటు, ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి, పిల్లలకి అవసరమైన ఉపకరణాలు సమకూర్చడం, శస్త్ర చికిత్సలు చేయించడం కూడా ప్రాజెక్టు బాధ్యతలో భాగమే. ఈ సేవలన్నీ ఒక్కచోటే అందడం కోసం పూర్వపు పంచాయతీ సమితి కేంద్రాల్లో పూర్తి సదుపాయాలున్న ఒక భవనాన్ని సమకూర్చారు. వాటిని భవిత కేంద్రాలు అని పిలుస్తుంటారు. తక్కిన మండలాల్లో మండల కేంద్రంలోనే ఒక పాఠశాలలో ఈ విద్యాకేంద్రం నడుస్తూ ఉంటుంది.

Inclusive education గా పిలవబడే ఈ విద్యాప్రక్రియ గురించీ, ఈ అవసరాల గురించీ, ఈ కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా అమలు పరచడానికి చేపట్టవలసిన చర్యల గురించీ తెలుసుకోవడానికి నేను బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఒక వర్క్ షాపు నిర్వహించాను. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఇంక్లూసివ్ ఎడుకేషన్ ఉపాధ్యాయులూ, కో ఆర్డినేటర్లూ చెప్పిన చాలా విషయాలు ఈ రంగంలో మరింత కృషి చేయవలసి ఉంటుందనే భావాన్ని కలిగించాయి. అందుకని, ఆ కేంద్రాలు ఎలా పనిచేస్తున్నాయో చూద్దామని నిన్న పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించాను.

ముందుగా ఏలూరు గ్రామీణ మండలంలో ఉన్న ఒక మండల ప్రాథమిక పాఠశాలలో నడుతున్న మండల కేంద్రాన్ని చూసాను. అది భవిత కేంద్రం కాదు కాబట్టి అక్కడ పిల్లల ప్రత్యేక అవసరాలు తీర్చే మౌలిక సదుపాయాలు ఇంకా పూర్తిగా సమకూర్చవలసి ఉంది. కాని, ఆ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుంటున్నందువల్ల, పాఠశాల ఆవరణలోనే ఒక చిన్న గదిని కేంద్రానికి కేటాయించాడు. అటువంటి కేంద్రాన్ని నేను నా జీవితంలో మొదటిసారి చూడటం. అక్కడ ప్రత్యేక అవసరాలున్న పిల్లల సంపూర్ణ ముఖచిత్రం చూసాను. ఇంద్రియ సామర్థ్యాలు ఇంకా పూర్తిగా వికసించని పిల్లలు, గ్రహణ సామర్థ్యాలు వయసుకి తగ్గట్టుగా వికసించని పిల్లలు, శారీరికంగానూ, మానసికంగానూ ఇంకా తమ కాళ్ళ మీద తాము నిలబడలేని పిల్లలు దాదాపు ఇరవై మందికి పైగా ఉన్నారు. వారి అవసరాలూ, వారికి ఉపాధ్యాయులు అందిస్తున్న ప్రత్యేక బోధన, చికిత్స, వ్యాయామం, వారి తల్లిదండ్రులకి అందిస్తున్న కౌన్సెలింగూ అన్నీ పేరుపేరునా అడిగి తెలుసుకున్నాను. అదంతా ఒక ప్రత్యేక ప్రపంచం.

‘పిల్లల స్థాయికి నువ్వు దిగి వచ్చి చెప్పడం కాదు, వారి లోకంలోకి ఎక్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి ‘ అన్నాడొక విద్యావేత్త. ఏ గిరిజన పాఠశాలకి వెళ్ళినా నాకు ఈ మాటే గుర్తొచ్చేది. కాని, ఈ విద్యార్థుల్ని చూసాక, పిల్లల ప్రపంచంలోకి ఎక్కివెళ్ళడం కాదు, వారిని చేయి పట్టుకుని ఒక విశాల మనోమైదానం లోకి ప్రయాణించవలసి ఉంటుందని అర్థమయింది. మనం మామూలుగా తరగతి గది అని అంటున్నప్పుడు, ఆ గదిలో కూచున్న పిల్లల విద్యావసరాలన్నీ దాదాపుగా ఒక్కలాంటివే అని భావించి విద్యాబోధన చేపడతాం. కాని ఆ తరగతి గదిలో పిల్లల గ్రహణ సామర్థ్యాలన్నీ ఒక్కలానే ఉండవనీ, కాబట్టి వారిలో కొద్దిగా మందంగా ఉన్న విద్యార్థుల్ని ప్రత్యేక బృందాలుగా విడదీసి రెమెడియల్ బోధన చేపట్టమని విద్యాశాఖ చెప్తూంటుంది. కాని, ఇక్కడ పిల్లల్ని అట్లాంటి బృందంగా కూడా ఊహించలేం. ఇక్కడ ఏ శిశువు అవసరం ఆ శిశువుకే ప్రత్యేకం. ఏ పిల్లవాడి శారీరిక, మానసిక అవసరాలు ఎలా ఉంటాయో గుర్తుపట్టి ఆ పిల్లవాడికే అవసరమైన ప్రత్యేక శిక్షణ చేపట్టవలసి ఉంటుంది. సెరిబ్రల్ పాల్సీ తో బాధపడుతున్న రాంబాబు అవసరాలకీ, మల్టిపుల్ డిసార్డర్ తో ఉన్న భానుప్రకాశ్ అవసరాలకీ, ఇంటెలిజెన్సు డెఫిసిట్ తో సతమవుతున్న సాయి సందీప్ అవసరాలకీ మధ్య పోలికనే లేదు. అక్కడ ప్రతి శిశువుదీ ఒక ప్రత్యేక లోకం. ఆ బిడ్డకీ, తక్కిన ప్రపంచానికీ మధ్య ప్రతి రోజూ నెమ్మదిగా ఒక వంతెన కట్టుకుంటే వస్తే తప్ప, వాళ్ళు మన మధ్య, మనలో ఒకరు కాలేరు.

ఆ ఒక్క కేంద్రంలోనే చాలా సేపు గడిపాను. ఆ ఒక్క కేంద్రంలోని ఆ ఇరవై మంది పిల్లల్ని చూసేటప్పటికే, వారి గురించి తెలుసుకునేటప్పటికే నా శక్తి మొత్తం ఊడ్చుకుపోయినట్టుగా అనిపించింది. అటువంటిది ఆ పిల్లలతో అనునిత్యం గడుపుతూ వాళ్ళ ఇంద్రియద్వారాల్ని మేలుకొల్పడానికి పాటుపడుతున్న ఆ ఉపాధ్యాయినుల్ని ఏ విధంగా ప్రశంసించాలో నాకు తెలియలేదు. ‘మీరు నా కళ్ళకి దేవతల్లాగా కనిపిస్తున్నారు ‘ అని ఒక మాటయితే అనగలిగాను, చేతులెత్తి నమస్కారమైతే పెట్టగలిగాను, కాని, అటువంటి కేంద్రాల్నీ, కార్యక్రమాల్నీ రూపకల్పన చేసిన విద్యాప్రణాళికావేత్తల్నీ, ప్రభుత్వాన్నీ ఏమని ప్రస్తుతించాలో నాకు తెలియరాలేదు.

ఏలూరు మండల కేంద్రంలో ఫిజియో థెరపీ సేవలు ఎలా అందుతున్నాయో చూద్దామని మునిసిపల్ ప్రాథమిక పాఠశాలలో నడుస్తున్న ఫిజియో థెరపీ కేంద్రం కూడా సందర్శించాను. ఆ తర్వాత భవిత కేంద్రాలు కూడా ఎలా నడుతున్నాయో చూద్దామని నమూనాగా భీమడోలు మండల కేంద్రంలో ఉన్న భవిత సెంటర్ చూసాను. అక్కడ కూడా దాదాపు ఇరవై మంది పిల్లలున్నారు. కొందరు తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లులు కూడా ఉన్నారు. భవిత కేంద్రంలో కొద్దిగా విశాలమైన గది, రాంపు, రెయిలింగ్, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ ల కోసం ప్రత్యేకమైన గదులు, స్పీచ్ థెరపీ కోసం ఒక కంప్యూటరూ, బోధనోపకరణాలూ, ఇతర సామగ్రీ ఉన్నాయి. పిల్లలకోసం ప్రత్యేకంగా రూపోందించబడ్డ మరుగుదొడ్డి కూడా ఉంది. అక్కడ కూడా సుశిక్షితులైన, అంకితభావం కలిగిన ఇద్దరు ఉపాధ్యాయినులు ఉన్నారు. నేను వెళ్ళినప్పుడు అక్కడ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ అందిస్తూ ఒక మానసిక నిపుణుడు కూడా ఉన్నాడు. జ్ఞాపకశక్తికి సంబంధించి ఆయన గిన్నెస్ బుక్ లో ఎక్కాడట. తనతో సమానమైన ప్రావీణ్యం కలిగిన మనిషి ఈ ప్రపంచంలో మరొక్కరు మాత్రమే ఉన్నారని గర్వంగా చెప్పుకున్నాడాయన.

ఆ రెండు కేంద్రాలూ చూడటానికి మధ్యలో నేను మరి రెండు పాఠశాలలు చూసాను. ఒకటి ఏలూరులోనే నడుస్తున్న ఒక జువైనల్ హోమ్. అందులో రెండు రకాల పిల్లలున్నారు. ఒక తరహా పిల్లలు గతంలో వీథిబాలురు, ఇంట్లోంచి చెప్పాపెట్టకుండా పారిపోయినవాళ్ళు, చిన్ని చిన్ని కేసుల్లో ఇరుక్కున్నవాళ్ళు, దాదాపుగా అనాథలు లేదా కడుబీద కుటుంబాలనుంచి వచ్చినవాళ్ళు. వాళ్ళకి చాలా చక్కని భవనసముదాయం, ఆవరణ, హాస్టలు, పాఠశాల ఉన్నాయి. ఆ పాఠశాలకు సర్వ శిక్ష అభియాన్ తొమ్మిది మంది ఉపాధ్యాయుల్ని సమకూర్చింది. ఆ పిల్లలతో చాలాసేపే గడిపాను. నాతో పాటు జిల్లా విద్యాశాఖాధికారీ, జిల్లా ప్రాజెక్టు అధికారీ, వారి సెక్టొరల్ సిబ్బందీ, మా రాష్ట్ర కార్యాలయ సహోద్యోగి బ్రహ్మానంద రెడ్డీ కూడా ఉన్నారు. ఆ పిల్లలు మమ్మల్ని బాండుమేళంతో తమ మధ్యకి ఆహ్వానించేరు. మేము చూడాలనీ, మెచ్చుకోవాలనీ తమ అభినయం, గానం, యోగాసనాలు అన్నీ చూపించారు. ఒక పిల్లవాడు తాను వేసిన చిత్రలేఖనం తీసుకొచ్చి చూపించాడు. అక్కడొక వొకేషనల్ కేంద్రం కూడ నడుస్తున్నది. ఆ పిల్లలక్కడ సుద్దముక్కలు, ఫినాయిల్ వంటి వాటిని తామే తయారు చేసుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఒక కంప్యూటర్ విద్యాకేంద్రం కూడా నాతో ప్రారంభింపచేసారు.

ఆ పాఠశాలలోనే మరొక తరహా పిల్లలు కూడా ఉన్నారు. పెద్ద పెద్ద నేరాల్లో ఇరుక్కున్న పిల్లలు. ఏడుగురు. వాళ్ళని ప్రత్యేకంగా ఒక గదిలో ఉంచారు. వాళ్ళని కూడా వెళ్ళి కలిసాను. ప్రతి ఒక్కరినీ పలకరించాను. వాళ్ళతో నాలుగు మాటలు మాటాడేను. ‘మీకు చాలా చక్కని భవిష్యత్తు ఉంది, మీరు గుర్తుపట్టాలంతే ‘అని చెప్పాను. వాళ్ళ అమాయికమైన వదనాలు చూడగానే నాకు బసవేశ్వరుడి వచనం గుర్తొచ్చింది. ఆ మాటే చెప్పాను వాళ్ళకి, బసవన్న ఇలా అన్నాడని: ‘నేను వీథిలో నడుస్తుంటే చూసిన వాళ్ళు ‘ఎవడు వీడు? ‘ఎవడు వీడు?’ ‘ఎవడు వీడు?’ అనకూడదు, ‘వీడు నావాడు!’, ‘వీడు నావాడు!’, ‘వీడు నావాడు!’ అనాలి అని అన్నాడనీ, ఆ ఏడుగురు పిల్లలూ కూడా నావాళ్ళే, మనవాళ్ళే అని అనుకుంటున్నామనే చెప్పాను.

28-8-2019

Leave a Reply

%d bloggers like this: