ఆ సముద్రపు ఒడ్డున

తెల్లవారు జామున ఓ కల. సముద్రం. ఆ ఒడ్డున గుహ లాగా ఒక ఇల్లు. ఎవరో నన్నా ఇంటికి తీసుకువెళ్ళారు. అక్కడెన్నో పుస్తకాలు. ఆ పుస్తకాల్లో చాలా అరుదైన పాత తెలుగు పుస్తకాలు. ఒక్కొక్కటే చూస్తున్నాను. ఒకటి, ఆండాళ్ తిరుప్పావైకి సంస్కృతానువాదమట. దానిమీద మూడవ సంపుటం అని రాసి ఉంది. ఒక్కొక్క కీర్తనకి రాగలక్షణమూ, నృత్యలక్షణమూ రాసి ఉన్నాయి. చాలా పెద్ద పుస్తకం. ఒక పుట తెరిచి చూసాను. ఇంతకీ ఆండాళ్ ని ఎవరేనా సంస్కృతంలోకి అనువదించారా? నాకు తెలియదు. మరొక పుస్తకం , సాహిత్యంలో శివుడు దూతగా నిర్వహించిన ఘట్టాల సంకలనం. నాకు తెలిసినంతవరకూ శివుడు దూతగా వ్యవహరించింది ఒకే ఒకరి సందర్భంలో. తమిళ నాయన్మారుల్లో, శివుణ్ణి తన మిత్రుడిగా చెప్పుకున్న దుడుకు భక్తుడు, సుందరమూర్తి నాయనారు జీవితంలో శివుడు ఆ కవికీ, అతడి ప్రియురాలికీ మధ్య దూతగా నడిచాడు. వళ్ళు గగుర్పాటు కలిగే ఆ కథ చాలా ఏళ్ళ కిందట ‘పెరియపురాణం’లో చదివాను. కాని ఇప్పుడు ఈ పుస్తకం ‘శివదూతం ‘ఏమిటి? ఈ మధ్య తుమ్మపూడి కోటీశ్వరరావుగారు తాను రాసుకున్న ఆధ్యాత్మికానుభవాల పుస్తకం ‘మా అమ్మ- మా దాంపత్యం’ (శివదూతి కథ) (2019) నాకు పంపారు. ఆశ్చరకారకం, రోమాంచితం అయిన ఆ గ్రంథం మళ్ళా ఇట్లా కలలో కనిపించిందా? అయితే, ఆ పుస్తకమే కనబడాలి కదా, శివదూతమేమిటి? ఆషాడం కాబట్టి మేఘదూతం మనసులో ఉంది కాబట్టి, మేఘదూతానికి బదులు శివదూతం కలలోకి వచ్చిందా? అది మరే దూత కథ అయినా కావచ్చు కదా, శివుడేమిటి?

అప్పుడు కనిపించింది, చలం గారి ‘సుధ’. ఆ పుస్తకం మొదటి ప్రచురణ ఎలా ఉంటుందో నేనెప్పుడూ చూడలేదు. కాని నా చేతుల్లోకి వచ్చిన పుస్తకం మొదటి ప్రచురణ ప్రతి అని అనిపించింది. కొద్దిగా పాతబడ్డ పుస్తకంలానే ఉంది గాని, ఆ అట్ట మెరుస్తూ ఉంది. నీలం రంగు అట్ట. దాని మీద బంగారు రంగు అక్షరాలు. ఆ పుస్తకం నా చేతుల్లోకి తీసుకోగానే ఆ కలలోనే నాకెందుకో గొప్ప దుఃఖం లోపల్నుంచీ ఉబికి వచ్చింది. నేనొక గాఢ ఉద్వేగానికి లోనయ్యానని నేను కలగంటున్న కలలోని మనిషికి కూడా తెలుస్తూనే ఉంది. ఆ పుస్తకం తీసి పక్కన పెట్టుకున్నానట. ఆ ఇంటి యజమాని అనుమతిస్తే ఆ పుస్తకం తెచ్చేసుకుందామనుకున్నాను. ఎవరింటికేనా వెళ్ళి, అక్కడ విలువైన పాతపుస్తకాలు కనబడితే వాటినొక సారి చదివి మళ్ళా ఇచ్చేస్తానని అడక్కుండా ఉండలేని చాపల్యం నుంచి ఎప్పుడో బయటపడ్డాను. కాని, ఎందుకో ఆ పుస్తకం ఆయనిస్తే తెచ్చేసుకుందామని మటుకు మరీ మరీ బలంగా అనుకున్నాను. ఆ పుస్తకం మళ్ళా చేతుల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఆ పుస్తకం మీద ‘సుధ’ అనే అక్షరాలకు బదులు ‘గిబ్రాన్’ అనే అక్షరాలు కనిపిస్తూ ఉన్నాయి. (గిబ్రాన్ అనే ఉంది. నేను జిబ్రాన్ అని పలకడానికే ఇష్టపడతానుగానీ, గిబ్రాన్ అనడం నాకిష్టముండదు.) ఆ పుటలు తిరగేసాను. లోపల ఒక వచన రచన. అది దేనిగురించో చదవబోయాను. మెలకువ వచ్చేసింది.

మెలకువ వచ్చిన రెండు మూడు క్షణాలకు గుర్తొచ్చింది, ఇవాళ గురుపూర్ణిమ అని. కలలో కనిపించిన దృశ్యాలన్నీ మళ్ళా ఒక్కసారి గుర్తుతెచ్చుకోడానికి ప్రయత్నించాను. సముద్రం, గుహ, ఆండాళ్ కీర్తనల సంస్కృతానువాదం, శివదూతం, సుధ, గిబ్రాన్. అన్నట్టు మరో విషయం కూడా. ఆ సముద్రపు ఒడ్డున ఆ పాతపుస్తకాల మధ్య నా మొబైలు కోసం వెతుక్కుంటున్నానట గానీ, ఆ ఫోనెక్కడో మర్చిపోయానట.

ఇప్పుడు నా కలని విశ్లేషించే పని చెయ్యనుగానీ, కల కరిగిన చివరి క్షణాల్లో ఒక మెలకువ స్ఫురించింది. అదొక్కటీ ఇక్కడ పంచుకోవాలని ఉంది.

అదేమంటే, నీలో రెండుంటాయి, నువ్వూ, గురువూ, నువ్వు పక్కకి తప్పుకుని గురువు మాత్రమే మిగలడం ‘సుధ’ అని.

16-7-2019

Leave a Reply

%d bloggers like this: