
కొన్ని తలపులు, కొన్ని సంకల్పాలు ఎక్కడిదాకా ప్రయాణిస్తాయో తెలీదు.దాదాపు పది పన్నెండేళ్ళ కిందట నేనుత్రయంబకం మొదటిసారి వెళ్ళినప్పుడు, అక్కడ కొండల మీద గోదావరి పుట్టిన చోటు చూద్దామని వెళ్ళినప్పుడు పక్కనే నివృత్తినాథుడి గుహ కూడా కనబడింది. నేనప్పటికే సంత్ జ్ఞానేశ్వర్ రాసిన ‘అమృతానుభవం’ పట్ల ఆసక్తి పెంచుకుని ఉన్నాను. ప్రసిద్ధ మరాఠీ కవి, అనువాదకుడు దిలీప్ చిత్రే అనుభవామృతానికి చేసిన ఇంగ్లీషు అనువాదం కూడా అప్పటికే తెప్పించుకుని ఉన్నాను. కాని నేను గోదావరీమూలాన్ని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు అనుభవామృత కావ్య ఉద్గమస్థానాన్ని సందర్శిస్తానని ఊహించలేదు.
తిరిగి వచ్చిన తర్వాత కొన్నాళ్ళకు నా యాత్రానుభవాల్ని పుస్తకంగా వెలువరిస్తూ అందులో త్రయంబకం యాత్ర గురించి కూడా పొందుపరిచాను. ఆ యాత్రాకథనంలో నివృత్తినాథుడి గుహగురించీ, సంత్ జ్ఞానేశ్వర్ గురించీ, అనుభవామృతం గురించీ రాస్తూ, నా దగ్గరున్న ఇంగ్లీషు అనువాదంలోంచి మూడు నాలుగు పద్యాల్ని తెలుగు చేసి పొందుపరిచాను.
ఆ పుస్తకం చాలామందే చదివారు. అందులో మిత్రుడు గంగారెడ్డి కూడా ఒకడు. కాని ఆయన హృదయం ఆ అనుభవామృత పద్యాల దగ్గరే ఆగిపోయింది. అప్పణ్ణుంచీ గత పదేళ్ళుగా ఆయన నన్ను అనుభవామృతాన్ని పూర్తిగా తెలుగులోకి అనువదించని కనీసం వందసార్లేనా అడిగి ఉంటాడు. అక్కడితో ఆగకుండా, స్వామి అభయానంద అనే ఆయన చేసిన ఇంగ్లీషు అనువాదాన్ని నెట్ లో సంపాదించి నాకు పంపించాడు. ఆ అనువాదం సరళంగా ఉంది. కానీ, మరాఠీ మూలం ఒక్కసారేనా వినకుండా తెలుగు చెయ్యడం సరైంది కాదన్నాను అతడితో. అప్పుడు మేమిద్దరం ఒక మరాఠీ పండితుణ్ణి వెతుక్కుంటో అదిలాబాదు వెళ్ళాం. అదంతా వేరే కథ. ఆ అనుభవమంతా ఇంతకు ముందు మిత్రులతో పంచుకున్నాను కూడా.
కానీ అదిలాబాదు వెళ్ళివచ్చిన తరువాత, అనుభవామృతం మరాఠీ మూలం చేతుల్లోకి వచ్చిన తర్వాత, ఆ పుస్తకం అనువదించడం నాకు చాత కాని పని అని అర్థమయింది. సమస్య భాషతో కాదు. ఆ అనుభవంతోనే. సంత్ జ్ఞానేశ్వర్ ఏ భూమికలోంచి ఆ గీతం రాసాడో, ఆ లోకం అంచులు కూడా తెలియనివాణ్ణి. నాకా అర్హత లేదనిపించింది.
కాని ఆ భగీరథుడు తన ప్రయత్నాలు వదిలిపెట్టలేదు. ఈ లోపు మా అందరి జీవితాల్లోకీ సూరపరాజు రాధాకృష్ణమూర్తిగారు ప్రవేశించారు. నాకు పంపిన ఇంగ్లీషు అనువాదాన్నే ఒక రాత్రి గంగారెడ్డి ఆయనకీ లింక్ పంపించాడు. తన కోసం ఆ పుస్తకాన్ని తెలుగుచెయ్యమని అడిగాడు. మీరు కాక మరెవ్వరు చేయగలరని నేను కూడా ఆయనతో అన్నాను గాని, ఆయన వయోభారం దృష్టిలో పెట్టుకుని ఆ మాట గట్టిగా అనలేకపోయాను.
కానీ, ఆ తర్వాత జరిగింది మామూలు విషయం కాదు. ఎనభై నాలుగేళ్ళ వయసులో రాధాకృష్ణమూర్తిగారు రెండు మూడు ఇంగ్లీషు అనువాదాలు దగ్గర పెట్టుకుని, మరాఠీ మూలాన్ని అనుసరిస్తూ, తనకి కలుగుతున్న సందేహాలను ఒకప్పటి తన శిష్యుడూ, ఇప్పటి మిత్రుడూ అయిన విజేందర్ రావుతో సంప్రదిస్తూ ఆ పుస్తకాన్ని పూర్తిగా తెలుగు చేసారు.
అనుభవామృతాన్ని తెలుగు చేయడానికి రాధాకృష్ణమూర్తిగారికన్నా తగినవారు ఎవరుంటారు? ఉపనిషత్తులూ, భగవద్గీతలతో పాటు ఆధునిక పాశ్చాత్య చింతనని కూడా సాకల్యంగా అర్థం చేసుకుని సమన్వయించుకోగలిగిన ఆ వేదాంతి చేతులమీదుగా వెలువడటం కోసమే ఆ పుస్తకం ఇన్నాళ్ళుగా నిరీక్షిస్తూ ఉన్నదని అర్థమయింది.
పుస్తకాన్ని తెలుగు చేయడం ఒక ఎత్తు, దాన్ని ఆయన మనతో పంచుకున్న తీరు మరొక ఎత్తు. అయిదారేళ్ళ కిందటిదాకా ఆయనకి కంప్యూటర్ ఎలా తెరవాలో తెలీదు. తన మనమడిదగ్గర కూచుని నేర్చుకున్నారు. ఒక బ్లాగు తెరిచారు. ఫేస్ బుక్ పేజీ తెరిచారు. తెలుగులో తానే స్వయంగా టైపు చేసుకుంటూ వారం వారం తన అనువాదాన్ని ధారావాహికంగా మిత్రులతో పంచుకున్నారు. ఆ పుస్తకాన్ని ప్రచురించాలని, తన పిల్లలకు చెప్తే అది వాళ్ళ మీద ఆర్థికభారాన్ని మోపుతుందని, తానే ప్రచురణకర్తల్ని సంప్రదించి ఆ పుస్తకం ముద్రిత ప్రతి వెలువరించారు.
ఆ పుస్తకం ప్రింటై వచ్చిందనీ, నలుగురైదుగురు మిత్రుల్తో కలిసి ఒక కప్పు కాఫీ తో పాటు అందరికీ తలా ఒక కాపీ ఇవ్వాలని ఉందనీ చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. మా అనుభవామృత యాత్ర గోదావరిలాగా సుదీర్ఘ ప్రయాణం చేసిందని అర్థమయింది. త్రయంబకంలో బిందురూపకంగా ఉన్న గోదావరి అంతర్వేదిలో సింధురూపాన్ని పొందినట్టు, గంగారెడ్డి ఆకాంక్ష ఇట్లా మా కళ్ళముందే గంగని భూమికి దింపిందని అర్థమయింది.
ఒకింత సిగ్గుగా కూడా అనిపించింది. కొత్త సాంకేతిక పరిజ్ఞానం మనముందు పెట్టిన అవకాశాల్ని వినియోగించుకోవడంలో సంత్ జ్ఞానేశ్వర్, సూరపరాజు రాధాకృష్ణమూర్తి ఎన్నో యోజనాలు ముందున్నారనిపించింది.
నిన్న రామంతపూర్ లో రాధాకృష్ణమూర్తిగారి ఇంట్లో ఆత్మీయమిత్రులంతా కలిసి ఆ పుస్తకాన్ని స్వాగతించాం. రావెల అరుణ గారు ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. (అది రెండవ ఆవిష్కరణ. పుస్తకం ఇంటికి కొరియర్ లో వచ్చినప్పుడు రాధాకృష్ణమూర్తిగారి రెండవ అమ్మాయి రమానీలకంఠం ఆ పుస్తకం కొరియర్ పాకెట్టు విప్పి మొదటిసారి ఆవిష్కరించేరు.) ఆచార్య నీలకంఠంగారు, తుమ్మూరి రామ్మోహన రావు, కుప్పిలి పద్మ, విజేందరరావు, ఆదిత్య లతో పాటు నేను కూడా మా సంతోషాన్ని మాటల్లో పెట్టడానికి ప్రయత్నించాం. ఆ పుస్తకావిష్కరణ క్షణాల్లో అక్కడుండటంకోసమే మిత్రుడు వాసు బెంగుళూరు నుంచి ముందురాత్రే వచ్చేసాడు. ఆయన వచ్చిన తరువాత పరేశ్ రాకుండా ఎలా ఉంటాడు? పుస్తక ఆవిష్కర్తగా అరుణ గారు అద్భుతమైన ప్రసంగం చేసారు. ఇక ఆదిత్య సరే సరి.
రాధాకృష్ణమూర్తిగారి మనమడు, వర్థమాన సినిమటోగ్రాఫర్ సిద్ధార్ఠ ఆ సమావేశాన్ని రికార్డు చేసాడు.
అక్కడ ఉండవలసీ లేకపోయిన వాళ్ళు ముఖ్యంగా ముగ్గురు. గంగారెడ్డి, పద్మజాసూరపరాజు, కన్నెగంటి రామారావు. వాళ్ళు ముగ్గురూ ఉన్నప్పుడు అందరం మరోసారి కలవాలని అనుకున్నాం.
ఆవిష్కరణ తర్వాత చక్కటి విందు.
ఇంటికి వచ్చాక పుస్తకం తెరిచాను. ఒకప్పుడు, మా మాష్టారు శరభయ్యగారు రాసిన పద్యాల్ని పుస్తకరూపంలో తెచ్చినప్పుడు, గుంటూరు శేషేంద్ర శర్మ ముందుమాట రాస్తూ ‘ఇంత భయంకరమైన కాలంలో ఇంత హృదయగ్రాహి పద్యాలను మనకి అందించిన ఈ కవిని ఏమని అభినందించాలో తెలియకుండా ఉంది’ అని రాసాడు.
నా ముందున్న అమృతానుభవం పుస్తకం చూస్తూ అదే అనుకున్నాను. ఎటువంటి కాలంలో ఉన్నాం! ఎటువంటి ద్వేషం మధ్య జీవిస్తున్నాం! ఈ తరుహీన, జలహీన మరుభూమిమీదకి ఈ గౌతమిని ప్రవహింపచేసిన సూరపరాజు రాధాకృష్ణమూర్తిగారిని ఏ విధంగా ప్రస్తుతించాలో తెలియకుండా ఉంది.