
అమృతానుభవం చదవడం పూర్తయ్యింది. దిలీప్ చిత్రే అనువాదం చాలా ఏళ్ళే కూడా వెంటబెట్టుకు తిరిగాను. ఆఫీసుకి కూడా పట్టుకుపోయేవాణ్ణి. కాని ఏదో అందినట్టే అంది అందకుండా జారిపొయ్యేది. ఇన్నాళ్ళకు తెలుగులో చదవడం వల్ల ఇప్పుడు మటుకే పుస్తకం నిజంగా చదివిన అనుభూతి కలిగింది. మాతృభాష విలువ తెలిసేది ఇటువంటప్పుడే.
అమృతానుభవం అమూల్యమైన రచన. భారతీయ సాహిత్యానికి చెందిన అత్యున్నతస్థాయి రచన మాత్రమే కాదు, భారతీయ దర్శనాలకు చెందిన అత్యంత మౌలికమైన రచన అని కూడా అర్థమవుతున్నది. ఒక్కసారి చదవడంతోటే ఆ రచన ప్రాశస్త్యాన్ని అంచనా వెయ్యడం కష్టమే అయినప్పటికీ, నాకు తోచిన రెండు మూడు కారణాలు మనవి చేస్తాను.
మొదటిది, అమృతానుభవం (1290) దేశభాషల్లో వెలువడ్డ ఒక దార్శనిక కృతి. భారతదేశంలో దర్శనగ్రంథాలు ప్రధానంగా సంస్కృతం, పాళీ భాషల్లోనే వెలువడ్డాయి. మధ్యయుగాల్లో పారశీకంలోనూ, ఆధునిక కాలంలో ఇంగ్లీషులోనూ, తక్కిన దేశభాషల్లోనూ వెలువడినప్పటికీ, వాటి గురించిన చర్చ భారతీయ తత్త్వశాస్త్ర అధ్యయనంలో విస్తృతంగా కనిపించదు. అటువంటిది మధ్యయుగాల్లో వెలువడ్డ స్వతంత్ర రచనల గురించి చెప్పేదేముంది?
తెలుగులో పండితారాధ్యచరిత్ర, తమిళంలో తిరుమూలార్ రచించిన ‘తిరుమంతిరం’ వంటి గ్రంథాల్లో కనిపించే దార్శనికత గురించి మనకి దేశవ్యాప్త చర్చ కనిపించదు. అనుభవామృతానిది కూడా అదే పరిస్థితి. జ్ఞానేశ్వర్ గురించి తక్కిన దేశానికి తెలిసింది కూడా ప్రధానంగా ఆయన భగవద్గీత పైన రాసిన వ్యాఖ్యానం ‘జ్ఞానేశ్వరి’ ద్వారానే. ఇందుకు ప్రధాన కారణం ఆయా రచనలు ఇతరభాషల్లోకి అనువాదం కాకపోవడమే. అందుకనే డా. రాధాకృష్ణన్, దాస్ గుప్తా వంటి భారతీయ తత్త్వశాస్త్ర చరిత్రకారులు జ్ఞానేశ్వర్ గురించి రెండు మూడు వాక్యాల కన్నా ఎక్కువ రాయలేకపోయారు. కాని,ఇప్పటికి ఏడు శతాబ్దాల కిందటే, అప్పుడప్పుడే కళ్ళు విప్పుతున్న మహారాష్ట్రీ ప్రాకృతం వంటి ఒక దేశభాషలో అనుభవామృతం వంటి ఒక మౌలిక దర్శనరచన రావడం మామూలు విషయం కాదు. అప్పటికి యూరోప్ లో తత్త్వశాస్త్రాన్ని బతికిస్తున్న సెయింట్ థామస్ ఆక్వినాస్ (1225-1274) వంటి వాడు కూడా ప్రధానంగా వ్యాఖ్యాన పూర్వకమైన రచనలే చేస్తున్నాడు తప్ప ఇటువంటి మౌలిక దర్శనాన్ని వెలువరించలేదని మనం గమనించాలి. మధ్యయుగాలకు ప్రతినిధి కావ్యంగా చెప్పదగ్గ ‘డివైన్ కామెడీ’ (1320) అప్పటికి ప్రభవించనే లేదని కూడా గుర్తుపెట్టుకోవాలి.
ఒక దర్శనంగా అమృతానుభవం కనపరిచిన విప్లవాత్మకతను అర్థం చేసుకోవడానికి రెండు విషయాలు వివరించాలి.
మామూలుగా, ప్రతి దర్శనమూ అసలైన సత్యం ఏది, స్వభావరీత్యా ఆ సత్యం (being as such) ఎటువంటిది అని అన్వేషిస్తుంది. తెలుసుకోవలసిన ఆ సత్యాన్ని (ప్రమేయం) తెలుసుకోడానికి, లేదా వివరించడానికి అవసరమైన సాధనాల్ని ప్రమాణాలు అంటారు. ఐరోపీయ తత్త్వశాస్త్రం హేతువునీ, ఇంద్రియజ్ఞానాన్నీ అటువంటి ప్రమాణాలుగా గుర్తించింది. భారతీయ దర్శనాలు అటువంటి ప్రమాణాలు దాదాపు పదిదాకా ఉన్నాయని భావించాయిగాని, స్థూలంగా ఆరు ప్రమాణాల్ని లెక్కేస్తారు. అవి ప్రత్యక్షం లేదా ఇంద్రియ జ్ఞానం, అనుమానం, ఉపమానం, అర్థాపత్తి, అనుపలభ్ధి, శాస్త్రవాక్యం లేదా శబ్దం. ఒక్కొక్క దర్శనం ఈ ప్రమాణాల్లో ఒకటిగాని లేదా ఒకటి కన్నా ఎక్కువగాని ప్రమాణాల్ని అంగీకరించింది. ఉదాహరణకి లోకాయతులు లేదా చార్వాకులు ప్రత్యక్ష ప్రమాణాన్ని తప్ప మరిదేన్నీ అంగీకరించలేదు. జైనులు ప్రత్యక్షంతో పాటు అనుమానాన్నీ, శబ్దాన్నీ కూడా ప్రమాణంగా తీసుకున్నారు. నైయాయికులు ఆ మూడింటితో పాటు ఉపమానాన్ని అంగీకరిస్తే ప్రభాకరశాఖకి చెందిన మీమాంసకులు ఆ నాలుగింటితో పాటు అర్థాపత్తి అనే అయిదో ప్రమాణాన్ని కూడా అంగీకరించారు. ఇక కుమారిలభట్టుని అనుసరించే పూర్వమీమాంసకులూ, వేదాంతులుగా పిలవబడే ఉత్తరమీమాంసకులూ అనుపలబ్ధి అనే ఆరో ప్రమాణాన్ని కూడా అంగీకరించారు.
వారందరిలో శంకరాచార్యుడు ప్రమాణాలన్నిటిలోనూ శబ్దం లేదా శాస్త్రవాక్యానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చాడు. నిజానికి అది మాత్రమే నిజమైన ప్రమాణమనీ, తక్కినవన్నీ వ్యావహారిక ప్రమాణాలు మాత్రమేననీ అన్నాడు.
కాని ఈ ఆరుప్రమాణాల్నీ కూడా పక్కకు నెట్టెయ్యడమే అనుభవామృతం లోని విశిష్టతా, విప్లవాత్మకతానూ. అన్నిటికన్నా ముందు ఆయన, వేదాంతులు ఏ శబ్ద ప్రమాణాన్ని అన్నిటికన్నా అత్యంత విశ్వసనీయంగా భావించారో, ఆ శబ్ద ప్రమాణాన్ని పక్కన పెట్టేసాడు.
‘శివుడు, శ్రీవల్లభుడు చెప్పారని కాదు
ఎవరు చెప్పకున్నా
సత్యమని స్వీకరిస్తాం.’ (3-18)
ఆ మాటకొస్తే ప్రతి ఒక్క ప్రమాణమూ పరిమితమైందేనన్నాడు. అంతిమ సత్యం స్వయంద్యోతకమనీ, స్వసంవేద్యమనీ, దాన్ని తెలియపరచడానికి మరో ప్రమాణంతో పనిలేదనీ పదే పదే చెప్పుకొస్తాడు.
‘అంతటా ఉన్నది ఆత్మజ్ఞానం
జ్ఞానం బలపరచాలా దాన్ని?
సూర్యుడున్నాడని
సిద్ధాంతం చేయాలా?'(3-19)
‘ఆత్మజ్ఞానాన్ని మరో జ్ఞానం గానం చెయ్యాలా?
దీపానికి మరో దీపం చూపాలా?’ (3-20)
పరమ సత్యంగా మనం భావించేది అనుక్షణం మన అనుభవంలో మనకి అందుతూనే ఉందనీ, అది స్వయంప్రకాశకమనీ, దాన్ని శాస్త్రవాక్యంద్వారా నిరూపించాలనుకోవడం దీపం వెలిగించి సూర్యుణ్ణి చూపడం లాంటిదేననీ అంటాడాయన.
‘సూర్యుడుదయించాడేమో
వత్తి వెలిగించి చూడన్నట్టు’ (6-30).
‘విషయం కాదది చర్చకు
ప్రమేయం కాదు తర్కానికి
ప్రకాశమే ప్రమాణం’ (5-16)
ఇక రెండవ అంశం, అవిద్యకి సంబంధించి. పరమసత్యం ఒకటి అని కొందరన్నారు, రెండని కొందరన్నారు, అనేకమని మరికొందరన్నారు. పరమ సత్యం ఒకటే అనేవారు పరిష్కరించవలసిన సమస్య, సత్యం ఒకటే అయితే, కంటిముందు అనేకంగా ఎందుకు కనిపిస్తున్నదని? అలా ఒకటి రెండుగానో లేదా అనేకంగానో కనిపించడాన్ని ఎలా సమన్వయించడం?
భారతీయ దర్శనాల్లో అత్యంత ప్రాచీనమైన మూల సాంఖ్యం పురుష, ప్రకృతి విభజన చేసినప్పుడు, ఈ అనేకత్వం నిజమో కాదో తేల్చుకోలేకపోయింది. ఇది ప్రకృతివల్ల కలుగుతున్న అపోహ అందామా అనుకుంటే, సాంఖ్యుల దృష్టిలో ప్రకృతి జడం. పురుషుడివల్ల కలుగుతున్నదా అంటే, పురుషుడు శుద్ధ చైతన్యం. ఈ చిక్కుముడిని విప్పే ప్రయత్నంలో మాధ్యమిక బౌద్ధులు ‘సంవృతి’ అనే ఒక భావనని ముందుకి తీసుకొచ్చారు. దాని ప్రకారం, అంతిమ సత్యం శూన్యమే గాని, దాన్ని ఒక పొర కప్పి ఉంచుతుంది. శంకరుడు దీన్ని విస్తరించి మాయ అనే మాటను పట్టుకొచ్చాడు. పరమసత్యం ఒక్కటే నిజం, ప్రపంచం అసత్యం. ప్రపంచానికి అస్తిత్వం ఉందిగానీ, అది వ్యావహారిక స్థాయిలోనే. తాడులో పాముని ఆరోపించుకున్నట్టు, సత్యంలో ప్రపంచాన్ని మనం ఆరోపించుకుంటున్నాం. శంకరుడి అనంతర వేదాంతులు ఈ మాయావాదాన్ని ఖండించారుగానీ, సత్యమూ, ప్రపంచమూ అనే ద్వంద్వాన్ని పరిష్కరించడంలో సఫలీకృతులు కాలేకపోయారు.
ఆ మాటకొస్తే, ఐరోపీయ తత్త్వశాస్త్రం కూడా ఈ సమస్యను పరిష్కరించలేకపోయింది. కాంట్, సత్యాన్ని వివరిస్తున్నప్పుడు, thing-in-itself అని చెప్తున్నది, అంతిమంగా మతాలు మాటాడుతున్న, లేక, మాట్లాడలేకపోయిన సత్యాన్ని తిరిగి తాత్త్వికభాషలో మాట్లాడుతున్నాడనే తదనంతర తాత్త్వికులు విమర్శిస్తూ వచ్చారు. అందుకనే ఆధునిక ఐరోపీయ తత్త్వశాస్త్రం, అంతర్విషయాన్ని (noumenon) వదిలిపెట్టి, దృగ్విషయాన్ని (phenomenon) చర్చించుకుంటూ ముందుకుపోయింది.
ఈ సమస్యను పరిష్కరించడానికి పూనుకోవడంలోనే, ప్రధానంగా, అమృతానుభవంలోని సాహసం, ప్రాసంగికతా ఉన్నాయి. సత్యం వేరు, ప్రపంచం వేరు, ప్రపంచానికి వ్యావహారిక స్థాయిలో మాత్రమే ఉనికి ఉందీ అనకుండా, అనుభవామృతం, ప్రపంచం కూడా సత్యమే అంటుంది. అలాగని, అది సాంఖ్యులతాలూకు జడప్రకృతి కాదు. సాంఖ్యుల్లాగా, సత్యమూ, ప్రపంచమూ విడివిడిగా ఉన్నాయని కూడా అనదు. కాశ్మీర శివాద్వైతుల్లాగా, సత్యము శివుడనీ, ప్రపంచం శక్తి అనీ అనడంతో కూడా ఆగిపోదు. ఆ శక్తి కేవలం సత్యం తాలూకు వ్యక్తరూపం (manifestation) మాత్రమే కాదు. అదే సత్యం.
అదే సత్యమంటున్నప్పుడు, ప్రపంచమే సత్యమని కాదు. మణితాలూకు కాంతిలాగా, పువ్వుతాలూకు పరిమళంలాగా, సత్యం ప్రపంచం రూపంలో మనకి అనుభవానికొస్తుంది.
‘అక్కడ అనుభవించేదీ, అనుభవంలోకి వస్తున్నదీ వేరు వేరు కాదు.
సమీరం తనకు తానే వింజామరగా వీచుకుంటుంది
శిరమే చంపకమై కంపిస్తుంది’ (9-2)
‘కన్నూ కన్నదీ ఒకటి
ముద్ద బంగారం, ఆభరణాలు, ఇదే అది, వేరు లేదు’. (9-5)
‘విచ్చిన చేమంతికి వేల దళాలు
దళాలెన్నైనా అది ఒక చేమంతి’ (9-7)
ఇలా సత్యం ప్రపంచంగా మన అనుభవానికి రావడానికి కారణం ప్రేమ. ఆ పరమసత్యం మన రూపంలో తన అస్తిత్వ సుగంధాన్ని తానే ఆఘ్రాణిస్తున్నది.
‘పూవు మధువు క్రోలగోరి
అయింది భ్రమరం’ (5-42)
ఒకే సత్యం రెండుగా కనబడటం కూడా కాదిది. అవి ఒకే దేహం, కాని రెండు పాదాల్లో ఒకటి స్త్రీపాదం, మరొకటి పురుష పాదం.
‘ఏటిలోకి ఏతమెత్తినట్టు
బంగారం బంగరు దుప్పటి కప్పుకున్నట్టు
దృశ్యం పాదాలు పెనవేసుకున్నట్టు’ (7-247)
ఆ రెండు రూపాల్నీ ఆయన సాంఖ్యుల్లాగా ప్రకృతీ, పురుషుడు అనకుండా బ్రహ్మన్, మాయ అనకుండా, శివాద్వైతుల్లాగా కేవలం శివుడూ, శక్తీ అని మాత్రమే ఊరుకోకుండా, ఆ రెండింటినీ తల్లిదండ్రుల్లాగా భావించి నమస్కరిస్తాడు.
‘స్త్రీ పురుషులని పేరుకే
శివం కేవలం
సృష్టి సమస్తం
సగం సగం’ (1-17)
‘కస్తూరి పరిమళం, నిప్పు వేడి
ఎట్లో అట్లే
శివుడు, శక్తి’ (1-42)
అతడు లేక ఆమె సగం,
ఆమె లేక అతడపూర్ణం
సంయోగంలో ఇద్దరు సంపూర్ణం’ (1-10)
ఈ రెండూ విడివిడిగా కనిపిస్తున్నాయని అనుకోవడమే అజ్ఞానం అంటాడు జ్ఞానదేవ్. అటువంటి లేని అజ్ఞానాన్ని స్థాపించి తిరిగి ఆ అజ్ఞానాన్ని తొలగించడానికి వృథా ప్రయాస పడటమెందుకంటాడు.
‘అవిద్యా స్థాపనకై
సర్వవిధాల సతమతమవుతున్నాం
ఏదేదో వాగుతున్నాం” (7-84)
అందుకనే, 807 ఓవీల గ్రంథంలో, 295 ఓవీలమేరకు ఒక అధ్యాయం అధ్యాయమంతా ఈ అజ్ఞానాన్ని ఖండించడం కోసమే కేటాయించాడు. అనుభవామృతం ప్రకారం జ్ఞానమూ లేదు, అజ్ఞానమూ లేదు. ఉన్నదొకటే, అనుభవం. ప్రేమానుభవం.
చివరికి ఒక్క మాట చెప్తాడు
‘పరమశివుని నుండి పృథివి వరకు అతని రశ్మి
అదే వివిధ జగత్తు’ (7-272).
ఒకటిగా ఉన్న ఆ శివుడు అనేకం ఎందుకు కావాలి? ప్రేమవల్ల అని ఉపనిషత్తు అంది. కాని జ్ఞానేశ్వర్ ప్రేమవల్ల అనడు.
రాధాకృష్ణమూర్తిగారు ఇలా రాస్తున్నారు:
‘పరతత్త్వం జ్ఞానం, జ్ఞాని కాదు. పరమాత్మ వెలుగునిచ్చేవాడు కాదు, వెలుగు. భగవంతుడు ప్రేమించడు. భగవంతుడు ప్రేమ. ప్రేమించడానికి మరోవస్తువు లేని స్థితిని భగవంతుడు అంటారు’ (పే.85)
‘గుప్తం కాదు ప్రకటం కాదు, అదో అద్భుతం
అస్తిత్వపు అంచులు!’ (8-7)
‘ఇంతెందుకు? శ్రీనివృత్తినాథుడు చేర్చినదెచ్చట?
అది మాటలు చేరని చోటు.’ (-8)
మరి మాటల్లో పెట్టాలన్న ప్రయత్నం ఎందుకు? ఎందుకంటే-
‘గురురాయడు మమ్మింత పెద్దజేసె.
ఆ పొంగు మాలోనే ఎలా కుంగు?'(8-3)
ఇక చివరగా, పుస్తకం అనువాదం గురించి కూడా ఒక మాట చెప్పవలసి ఉంది. ప్రసిద్ధ చైనా తాత్త్వికుడు కన్ ఫ్యూషియస్ సుభాషితాలకు ఎజ్రా పౌండ్ చేసిన అనువాదాల గురించి రాస్తూ ఒక విమర్శకుడు Confucius after twenty four centuries stirs Pound into speech; Pound after twenty four centuries lends Confucius his voice అన్నాడు. ఈ మాటనే ఈ అనువాదానికి కూడా చెప్పవచ్చు. ఏడు శతాబ్దాల తర్వాత, సంత్ జ్ఞానేశ్వర్ రాధాకృష్ణమూర్తిగారికి ఒక వాక్కునిచ్చాడు. రాధాకృష్ణమూర్తి సంత్ జ్ఞానేశ్వర్ కి తన భాషనిచ్చారు.
17-4-2019