
దాదాపు ఇరవయ్యేళ్ళ కిందటి మాట. ఇండియా టుడే తెలుగు పత్రికకోసం నేను శ్రీశైలం మీద ఒక యాత్రాకథనం రాసాను. అందులో పాల్కురికి సోమన ‘పండితారాధ్య చరిత్ర’ లోని ‘శ్రీ పర్వతప్రకరణం’ నుండి కొన్ని పంక్తులు అక్కడక్కడ స్మరించాను.
ఆ తర్వాత కొన్నాళ్ళకు నేను బదిలీ మీద హైదరాబాదులో రాష్ట్ర కార్యాలయంలో చేరాను. అట్లాంటి ఒక రోజుల్లో ఒకాయన నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన పేరు ధూపం బసవనాగయ్య. వీరశైవుడు. తనకి ఆ యాత్రాకథనం ఎంతో నచ్చిందనీ, ముఖ్యంగా, శ్రీపర్వతప్రకరణాన్ని స్మరించడం మరీ నచ్చిందనీ, ద్విపదలో ఉన్న ఆ ప్రకరణాన్ని తెలుగువచనంలోకి మారిస్తే తానెంతో సంతోషిస్తాననీ చెప్పాడాయన.
కానీ అది నాకు సాధ్యం కాని పని అని నాకు తెలుసు. సోమన ద్విపదను తెలుగు చేయడంలో ఉండే కష్టం అలా ఉంచి, అందులో కన్నడ, తమిళ, మరాఠీ భక్తుల స్తుతులు, సంభాషణలు కూడా ఉన్నాయి. ఎన్నో లతల, వృక్షాల, రాగాల, నాట్యాల, గీతాల, ఆహారవిహారాల, వేషభాషల వివరాలున్నాయి. ఆ ప్రకరణమంతా ఒక విజ్ఞానసర్వస్వం మాత్రమే కాక, ఒక విధంగా, నష్ట విజ్ఞాన సర్వస్వం కూడా. అందులో ఆయన పేర్కొన్న ఎన్నో వివరాల గురించి ఇప్పుడు మనకేమీ తెలీదు. పాఠాంతరాలు కూడా అధికం. ఎలా చూసినా, అది నాకు దుస్సాధ్యమే. ఆ మాటే ఆయనతో చెప్పేసానుగాని, ఆయన పట్టు విడవకుండా నన్ను చూడటానికి వస్తూ, పదే పదే ఆ కోరిక వెళ్ళబుచ్చుతూనే ఉండేవాడు. ఎక్కడో నగరశివార్లనుంచి ఎండవేళ ఆ శివభక్తుడట్లా వచ్చి నన్ను అడుగుతుంటే నాకేమి చెయ్యాలో తెలిసేది కాదు. కొన్నాళ్ళ తరువాత, ఆయన శివైక్యం చెందాడని ఎవరిద్వారానో విన్నాను.
ఆ తర్వాత మరికొన్నేళ్ళకు మిత్రుడు కవితాప్రసాద్ సాంస్కృతిక శాఖ సంచాలకుడి గానూ, ముక్తేశ్వరరావుగారు సాంస్కృతిక శాఖ కార్యదర్శిగానూ ఉండగా, మళ్ళా అదే ప్రతిపాదన ముందుకొచ్చింది. కాని, అప్పటికి అక్కిరాజు రమాపతిరావుగారు మొత్తం పండితారాధ్య కావ్యానికే చేసిన వచనానుసరణం వెలువడింది. కానీ, శ్రీ పర్వతప్రకరణం మాత్రం మరోసారి నేను వచనంలో వెలువరించక తప్పదనే ఆ సహృదయులిద్దరూ పట్టుబట్టారు.
అలా ఆ ప్రతిపాదన మరొకసారి నా ముందుకు రావడం శివానుగ్రహమే కానీ, నేను ఆ కార్యభారాన్ని తలదాల్చకపోవడం శివాపరాధమని కూడా నాకు తెలియకపోలేదు. అందుకనే, ప్రతి నెలా కృష్ణమ్మ ఒడిలో సాహిత్య నౌకాయాత్ర చేపడుతున్న సాయి పాపినేని గారు నన్ను కూడా ఒక ప్రసంగం చేయమన్నప్పుడు, ఈ మాఘమాసం, శ్రీపర్వతప్రకరణం గురించి ప్రసంగిస్తానని చెప్పాను. కాని, ఒకప్పుడొక శివభక్తుడు నా మీద పెట్టిన బాధ్యత నుంచి ఒక్క ప్రసంగంతో తప్పించుకోలేనని నాకు తెలుసు. అది లక్షపత్రి పూజ చేయవలసి ఉంటే, ఒక్క బిల్వదళంతో పూజముగించడం లాంటిదని కూడా తెలుసు. కాని, కొండలాంటి ఈ బరువును ఒక్క క్షణమేనా దించుకుందామనిపించింది.
నిన్న మాఘసాంధ్యవేళ కృష్ణవేణీ మృదుతరంగాల మీద రసజ్ఞలోకం ముందు నిలబడి ఒక ప్రసంగమైతే చేసానుగానీ, అది నాకేమీ తృప్తి కలిగించలేదు. కానీ ఆ సాయంకాలం అక్కడలేని మిత్రులు, (ముఖ్యంగా సిడ్నీ నుంచి సారథి మోటమర్రిగారు) నా ప్రసంగంలోంచి కొన్ని వాక్యాలేనా వినాలనుకుంటారు కాబట్టి, ఈ నాలుగు వాక్యాలూ రాయకుండా ఉండలేకపోతున్నాను.
పాల్కురికి సోమన కాలం, పుట్టిన స్థలం నిర్వివాదంగా ఇంకా స్థిరపడలేదు. కానీ, తెలుగులో స్వతంత్ర ఇతివృత్తంతో కావ్యనిర్మాణం చేపట్టిన మొదటి మహాకవి ఆయనే అన్నది నిర్వివాదాంశం. పూర్తి దేశి ఛందస్సులు, అచ్చమైన జానుతెనుగులతో పాటు,తన సమకాలీన సామాజిక-రాజకీయ ముఖచిత్రాన్ని అంత సమగ్రంగా ఆవిష్కరించిన మరొక మహాకవి ఎవరూ మనకి తెలుగులోనే కాదు, భారతీయ భాషా సాహిత్యాల్లోనే కనిపించడు. బసవపురాణం కన్నడ వీరశైవ కవి బసవేశ్వరుడు నాయకుడిగా అల్లిన ద్విపదకావ్యమైతే, పండితారాధ్య చరిత్ర తెలుగు శివకవి మల్లికార్జున పండితారాధ్యుడి జీవితం, కృషి, దృష్టి, దర్శనాలు ఇతివృత్తంగా అల్లిన కావ్యం. ఒక కవిని కథానాయకుడిగా చేసి ఒక సమగ్ర సామాజిక చిత్రణ చేపట్టిన ఇటువంటి రెండు కావ్యాలూ మొత్తం ప్రపంచ సాహిత్యంలోనే మనకెక్కడా కనిపించవు.
ఒక కవిని తనకు మార్గదర్శకుడిగా తీసుకుని సమకాలిక సమాజాన్నీ, అందులోని స్వర్గనరకాల్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన అన్వేషణగానూ, సమకాలిక రాజకీయ విమర్శగానూ డాంటే ‘డివైన్ కామెడీ’ ప్రసిద్ధి చెందింది. మధ్యయుగాల పాశ్చాత్య ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలంటే డివైన్ కామెడీని చదవడమొక్కటే సరైన దారి అని అస్వాల్డ్ స్పెంగ్లర్ అన్నాడు. ఆ మాటనే భారతదేశానికి అనువర్తిస్తే, మధ్యయుగాల భారతదేశమెట్లా ఉండేదో తెలుసుకోడానికి పండితారాధ్య చరిత్ర చదవటమొక్కటే సరైన దారి అని మనం చెప్పవచ్చు. ఈ సంగతి నలుగురికీ తెలిసేలాగా మాట్లాడుకుంటే, మనం డాంటేని చదివినట్టే, పాశ్చాత్యదేశాల జిజ్ఞాసువులు పాల్కురికి సోమనను చదవడానికి ఉత్సాహపడతారు కదా అనిపిస్తుంది నాకు.
పాల్కురికి సోమన తన యవ్వనకాలంలో రాసిన బసవపురాణం ఒక శివనది. ఆయన పండు వయసులో రాసిన పండితారాధ్య చరిత్ర ఒక శివమహోదధి. అదే ద్విపద, అదే ఆవేశం, అదే అన్వేషణ. కాని, ఆ రెండింటిమధ్యా ఒక జీవితకాల ప్రయాణం ఉంది.
బసవపురాణంలో ద్విపద సరళం, సులభం. ఆ నడక ఒక నదీగతి.
‘శివరాత్రి నిత్యంబు చెల్లించు బాస
శివభక్తులెల్లను శివుడను బాస
భక్తుల యెగ్గులు పట్టని బాస
భక్తుల కులమెత్తిపలకని బాస’
పండితారాధ్యలో కూడా అదే ద్విపద. కానీ, మహాసముద్రం.
‘అట్టి శ్రీమన్మల్లికార్జున భక్తి
పట్టభద్రులును, శ్రీ పర్వతక్షేత్ర
వాసులు, యామ్య కైలాస చూడా వి
భాసిత కీర్తి విభ్రాజితమణులు
వరభుక్తి చిరముక్తి కరభక్తి రతులు
నరచర్మధరకర్మహర ధర్మవరులు
కృతకృత్యహితభృత్య ధృతసత్యరతులు
వ్రతధామభృతసీమహితకామముఖులు
సిరకోపపరతాపఖరపాపహరులు
హరతంత్ర గురుమంత్ర పరమంత్ర చరులు..’
భక్తులు పర్వతయాత్ర చేస్తున్నప్పుడు-
‘పర్వతయ్యా మమ్ము బాలింపుమనుచు
మ్రొక్కుచు, నీడల చిక్కుచు, బండ్లు
మెక్కుచు, లీలలనుక్కుచు, దిన్నె
లెక్కుచు, రాలకు స్రుక్కుచు, సెలల
జిక్కుచు, తెరువుల మక్కుచు, చలువ
ద్రొక్కుచు, తాపంబు దక్కుచు, నాత్మ
జొక్కుచు, జనిచని నిక్కుచు, గిరులు
సూచుచు, సుకృతముల్ నోచుచు..’
పండితారాధ్య చరిత్రలో ఉన్నది భాష కాదు, వెన్న. తెలుగు, సంస్కృతం,తమిళం, కన్నడం ప్రతి ఒక్క భాషానుడి ద్విపదగా ఇమిడిపోయింది. ఋక్కులు, యజుస్సులు, ఉపనిషన్మంత్రాలు ద్విపదలోనే వెలువడ్డాయా అనిపించేటంతగా ఆయన ఒక మహావాగ్విన్యాసం చేసాడు:
‘… ‘భూత్యైన ప్రమదితవ్య’ మనగ
నా యజుశ్రుతి దదీయార్థంబ కాదె?
మ్రోయంగ ‘నగ్నే స్సముత్థయా ‘యనియు
దరి ‘ద్రిపుండ్రస్యచ ధారణం’ బనియు
మరియును నైన ‘ప్రమదితవ్య’ మనియు
మనువాక్య మఖిల సమ్మతమధర్వణము
నను ‘నిమృజ్యాంగాని సంస్పృశ్యే’త్తనగ
దదనంతరంబ కాత్యాయన గృహ్య
మరియు ‘దేవానాం త్రయాయుష’ మ్మనగ
నొందగాలాగ్ని రుద్రోపనిషత్తు
నందతా ‘నచపునరావర్తత’ యనగ..’
బసవపురాణ కవికి తనకొక కుటుంబంఉందనీ, తల్లిదండ్రులున్నారనీ, గురువులున్నారనీ ఒక స్మరణ ఉంది. కానీ, పండితారాధ్య చరిత్రనాటికి అతడన్ని బంధాలనుంచీ బయటపడిపోయాడు. ఉన్నదొకటే బంధం, బసవన్నతో అనుబంధం:
‘బసవ గోత్రుండను, బసవని కరుణ
బసవేశు శ్రీ పాదపద్మ సేవకుడ
బసవన్న పొగడ పాల్పడు కవీంద్రుడను
బసవన్న బొగడ పాల్పడు పాఠకుండ
బసవన్న దూత, నే బసవన్న బంట
బసవన్న లెంక, నే బసవన్న లెంగి
బసవన్న ఇలుపుట్టు బానిస కొడుక
బసవన్న పన్నల పన్న..’
పండితారాధ్య చరిత్రలో శీపర్వతప్రకరణం అయిదవ అధ్యాయం, చివరి అధ్యాయం. దానిముందు నాలుగవ అధ్యయాన్ని తన కావ్యానికి సారంగా సోమన చెప్పుకున్నాడు. అందుకు కారణం, మహిమ ప్రకరణం అనే ఆ నాలుగవ అధ్యాయంలో ఆయన పండితారాధ్యుడితో సహస్రగణాల, రుద్రుల, శివభక్తుల సంకీర్తనం చేయించాడు. బసవపురాణంలో వట్టి కీర్తనగా ఉన్న శివభక్తకోటి స్మరణ, ఇక్కడ స్తుతిగా, సంకీర్తనగా మారిపోయింది. శివభక్తుల పేర్లు సహస్రనామావళిగా మారిపోయాయి. కాని నాలుగవ ప్రకరణంలో కావ్యరీత్యా ఎన్నదగింది బసవేశ్వరుడు ప్రాణత్యాగం చేసాడని విన్నప్పుడు పండితారాధ్యుడు చేసిన ప్రలాపం. ఆ విలాపకథనం తెలుగు కావ్యహిమగిరిశ్రేణిలో ఒక మహాశిఖరం.
‘బసవన్న బసవయ్య బసవకుమార
బసవ బసవరాజ బసవలింగంబ
నా యన్న నా తండ్రి, నా మనోహరుడ
నా యయ్య, నా జియ్య, నా ప్రాణనాథ
నా మోహనారాశి నా యశోరాశి
నా మాత నా భ్రాత నన్ను బెట్టి నీవు
గా అజ సంహరు గర్భంబు జొచ్చి
తా’ యంచు, ‘హా’ యంచు హర సంగమేశ…’
నాలుగవ ప్రకరణం దృష్టి సముపార్జన కథనం, కళ్ళు పీకిస్తే మళ్ళా కళ్ళు పుట్టుకొచ్చే మహిమకథనం. కాని, బసవన్న లేకపోయిన తర్వాత ఇక ఈ లోకానికి, తాము కలగన్న ఆదర్శానికి, మనుషుల్నొక్కచోట చేర్చడానికి ఆధారమేది? ఆ ప్రశ్నకి సమాధానంగా, బసవన్న అనే జంగమలింగం స్థానంలో శ్రీపర్వతమనే స్థావరలింగాన్ని కనుగొనడం శ్రీపర్వతప్రకరణం. మహిమ ప్రకరణంలో ఉన్నది దృష్టి సంపాదనం. శ్రీపర్వతప్రకరణం దర్శన సంపాదనం.
‘….మహినస్మదాది
కవుల పాఠకుల వాక్పావనకరము
భవతృణీకరము, దుర్భరకర్మహరము
ప్రమథ మందిరము, సద్భక్తి భాస్వరము
కమలాకరము చూడ కడు ననశ్వరము
భంగురేతరము, శ్రీపర్వతపురము
లింగమేదురమెన్న లేదితఃపరము
శుభసముత్కరము, విశ్రుత సౌఖ్యకరము
అభినవకైలాసమా పురవరము..’
అది తెలుగులో మొదటి యాత్రాకథనం. రామాయణ, మహాభారతాల్ని వదిలిపెడితే, భారతీయ భాషాసాహిత్యాల్లో అటువంటి తీర్థయాత్ర కథనం మరొకటి కనిపించదు. అది తెలుగు కథనం మాత్రమే కాదు, అందులో గీర్వాణ, కర్ణాట, తమిళ, మహారాష్ట్ర దేశాల భక్తుల కీర్తనలు కూడా ఉన్నందువల్ల భారతీయ సాహిత్యంలోనే మొదటి బహుభాషా యాత్రాకథనం కూడా.
అలాగని అది వట్టి తీర్థయాత్ర కాదు, సమాజానికి ఆధారభూతంగా నిలవగలిగే ఒక పరమార్థాన్వేషణా యాత్ర కూడా.
24-2-2019