రాజారావుకి

చెస్లా మీవోష్ (1911-2014) పోలిష్ కవి. ఇరవయ్యవ శతాబ్దపు ప్రపంచ మహాకవుల్లో ఒకడు. రెండు ప్రపంచ యుద్ధాల్నీ, ప్రచ్ఛన్న యుద్ధాన్నీ కళ్ళారా చూసినవాడు. జీవితం ఎంత మృత్యుతుల్యమో, మనిషి ఎంత అమానుషమో, నాగరికత ఎంత అనాగరికమో ప్రత్యక్షంగా అనుభవించినవాడు.

రాజారావు (1908-2006) నవలాకారుడు. భారతీయ విలువల్నీ, గాంధేయ స్ఫూర్తినీ ఒక స్థానిక భారతీయ కోణం నుంచి నవలలుగా మలిచి ప్రపంచసాహిత్య పటానికెక్కినవాడు.

మీవోష్ 1969 లో రాజారావుని ఉద్దేశిస్తూ ఒక కవిత రాసాడు. అది ఒక రచయిత మరొక రచయిత కోసం రాసింది కాదు. సంక్షోభంలో చిక్కుకున్న ప్రపంచంలో పాశ్చాత్య ప్రపంచం ప్రాచ్య ప్రపంచాన్ని ఉద్దేశిస్తూ రాసిన కవిత. కాని, అప్పటికి, అంటే, యాభై ఏళ్ళ కిందట, పాశ్చాత్య ప్రపంచానికి భారతదేశంలో చూడటానికి ఇంకా కొన్ని విలువలు మిగిలి ఉండేవి. అప్పటికింకా భారతదేశం తన జాతీయోద్యమస్ఫూర్తినుంచి పూర్తిగా బయటపడిపోలేదు. ఇంకా ఎంతో కొంతమంది గాంధేయ విశ్వాసాలకు అనుగుణంగా జీవితం కొనసాగిస్తున్న వాళ్ళుండేవారు.

కాని, ఇప్పుడు, 2019 లో ఈ కవిత చదువుతుంటే, ఇంకెంతమాత్రం, మనం రాజారావు దేశానికి చెందినవాళ్ళమనుకోలేం. ఇప్పుడు మన గణతంత్రం నెమ్మదిగా అవినీతి గణాల తంత్రంగా మారిపోయే ప్రమాదం ఏర్పడింది.

మీవోష్ నియంతృత్వాన్ని చూసాడు. నాజీమూకలూ, స్టాలిన్ మూకలూ కూడా పోలండ్ ని ఎట్లా చెరిచాయో కళ్ళారా చూసాడు. ఆ తర్వాత ఫ్రాన్సులోనూ, అమెరికాలోనూ గణతంత్రమెట్లా ఉంటుందో చూసాడు. ఈ కవిత రాసిన మరుసటి ఏడాదే అమెరికన్ పౌరసత్వం తీసుకున్నాడు. అమెరికాని అతడు moderately corrupt అన్నాడు. కాని, నా కూతురు ఇప్పుడు తాను అమెరికాని కళ్ళారా చూసి ఆ దేశంలో మనుషులు extremely insecure అని చెప్తున్నది.

గత వారం రోజులుగా ఈ కవిత పదే పదే గుర్తొస్తున్నది నాకు. ఈ అత్యంత అవినీతిమయమైన గణతంత్రం నుంచి మనకు ముక్తి ఉన్నదా? కవులు, రచయితలు రాజకీయ విమోచన కోసం కవిత్వం రాస్తున్నారు. మరికొందరు సామాజిక విమోచన కోసం గొంతెత్తుతున్నారు. మిత్రులారా, వాటిలో నాకు నమ్మకం చిక్కట్లేదు. ఇప్పుడు నేను చెయ్యగలిగిందల్లా, మీవోష్ చెప్పుకున్నట్టు దేవుడి రాజ్యంకోసం ప్రార్థించడమే.

~

రాజారావుకి

రాజా, ఈ జాడ్యానికి
కారణమేదో తెలిసి ఉంటే ఎంత బాగుణ్ణు

నేనున్నచోటుతో
నాకు ఏళ్ళ తరబడి సమాధానం కుదిరింది కాదు.
ఇక్కడ కాదు, మరెక్కడో ఉండి ఉండవలసిందనిపిస్తుంది.

ఈ నగరం, చెట్లు, మనుష్యకంఠాలు
వీటిలో ఉనికి తాలూకు లక్షణం కొరవడింది
ఇక్కణ్ణుంచి మరోచోటకి ఎలానూ వెళ్ళిపోతాను కదా
అన్న ఊహతోనే కాలం వెళ్ళదీస్తుంటాను.

మరెక్కడో ఒక నిజమైన నగరం,
నిజమైన వృక్షాలతో
కంఠాలతో, స్నేహంతో, ప్రేమతో కూడుకున్న నగరం
మరేదో ఉంది.

దాదాపుగా ఉన్మత్త మనోభావనలాంటి
నా ఈ ఆలోచన కూడా
ఒక లోకరక్షకుడికోసం ఎదురుచూసే
నా నాగరికతా విశ్వాసంతో
ముడిపెడతావా, సరే, కానివ్వు.

నియంతృత్వంలోనూ సుఖంలేదు,
గణతంత్రంలోనూ సుఖంలేదు
ఒకదానిలో స్వేచ్ఛకోసం పరితపించాను, మరొకచోట అవినీతి అంతం కావాలని పాకులాడేను.

ఎట్లాంటి ఆశయభారమూ లేని
ఒక నగర రాజ్యాన్ని నా మనసులో శాశ్వతంగా నిర్మించుకుంటూన్నాను

చివరికి నోరుతెరిచి చెప్పగలుగుతున్నాను:
ఇదీ నా స్వగృహం.
సాగరదిగంతంమీద అస్తమయసాంధ్యవేళల ప్రజ్వలనాల ముందు
మీ ఆసియా తీరాలకు ఎదురుగా
ఒక మహాగణతంత్ర తీరం మీద నిలబడి ఉన్నాను
ఇక్కడ అవినీతి ఇంకా మోతాదు మించలేదు.

రాజా, అంతమాత్రాన
నేను నా సిగ్గునుంచీ, అపరాధభావననుంచీ
బయటపడ్డానని కాదు.
నేను నేనుగా ఉండలేకపోతున్నాననే
సిగ్గు, అపరాధభావం నన్ను వదలడంలేదు.

అక్కడ గోడమీద మహాప్రమాణాల్తో
విస్తరిస్తున్న నా ప్రతిబింబం,
దానికెదురుగా దీనంగా నా నీడ.

మానవజాతిని వెన్నాడుతున్న తొలిపాపంలో
నాకిప్పటికి నమ్మకం కుదిరింది.
అదిపాపమంటే అహంకారపు తొలివిజయం
తప్ప మరేమీ కాదు.

నా అహంకారం చేతచిక్కి దాని మాయకిలోనై
నేనొక తర్కం సిద్ధం చేసుకున్నాను.

నువ్వేమో ముక్తి సాధ్యమేనంటావు
ఆ సోక్రటీయ జ్ఞానవాణి
అచ్చం నీ గురువుబోధించే వివేకచూడామణి లాంటిదే.

కానీ రాజా, నేను మాత్రం నేనెక్కడున్నానో అక్కణ్ణుంచే మొదలుపెట్టాలి
నా కలల్లో కనిపిస్తూ నా అజ్ఞాత సారాంశాన్ని
కళ్ళకు కట్టి చూపుతున్న ఆ రాక్షసాకృతులూనేనే.

నేను జబ్బుపడ్డాననుకో, మనిషి ఆరోగ్యవంతుడేనని
నన్ను ఒప్పించడానికి ఏ నిరూపణలూ చాలవు.

గ్రీసు విఫలం కాక తప్పలేదు. ఆమె సముపార్జించిన
పరిపూర్ణ విజ్ఞానమంతా
మన వ్యథార్తహృదయాన్ని మరింత కుంగదీయడానికే పనికొచ్చింది.

మన వైభవోపేత క్షణాల్లో కాదు, మన బలహీనతల్లో
అక్కున చేర్చుకోవడానికి మటుకే మనకు దేవుడు అవసరమయ్యాడు.

లేదు రాజా, లాభం లేదు
ఈ ప్రపంచంలో నాకు దక్కిన వాటా
దుఃఖపడటం, నలిగిపోడం, ఏకాకికావడం,
నన్ను నేను ప్రేమించుకోవడం,
నన్ను నేను ద్వేషించుకోవడం,
దేవుడి రాజ్యం కోసం ప్రార్థించడం,
పాస్కల్ ని చదువుకోవడం, అంతే.

27-2-2019

Leave a Reply

%d bloggers like this: