పాడిపంటలు పొంగిపొర్లే దారిలో

పాడిపంటలు పొంగిపొర్లే దారిలో నువ్వు పాటు పడవోయ్ అన్నాడు మహాకవి. మనం కవిత్వాన్ని ఎందుకు ప్రేమిస్తామంటే మనం మనకోసం సంభావించగల అత్యంతశుభాకాంక్ష, మంగళాశాసనం అదే కాబట్టి.

తిరుప్పావై మొదటి సారి చదివినప్పుడు మూడవ పాశురం నన్ను కట్టిపడేసింది.

‘..తీంగిన్ఱి నాడేల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు
ఓంగు పెఱుం జెన్నెలూడు కయల్ ఉగళ
పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప
తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి
వాంగ క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్
నీంగాద శెల్వం నిఱైందేలోర్ ఎమ్బావాయ్

అందులో ఉన్నదంతా పాడిపంటలు పొంగిపొర్లే ఒక కాలం కోసం, దేశం కోసం కలగనడమే. ఎట్లాంటి దేశమది! అక్కడ నెలకి మూడు సార్లు వానకురుస్తాయట. పంటలు బాగా పండుతాయట. నీళ్ళు నిండుగా నిలిచిఉండే వరిచేలల్లో కలువలు, తామరలు ఏపుగా పెరుగుతాయి. ఆ నీళ్ళల్లో బలమైన చేపలు తిరుగాడుతుంటాయి. అందమైన పూలు పూస్తాయి. ఆ పూలల్లో తేనెలు తాగి తుమ్మెదలు మత్తెక్కి నిద్రపోతాయి. కొట్టాల్లో పశువులు తమంతతామే చేపే క్షీరధారలు కలశాలనిండుగా పొంగిపొర్లిపోతాయి. సకలసంపదలూ సిద్ధిస్తాయి.

లాటిన్ మహాకవి వర్జిల్ తన నాలుగవ eclogueలో ఇట్లాంటి స్వర్ణయుగాన్నే సంభావిస్తాడు.

.For thee, O boy,
First shall the earth, untilled, pour freely forth
Her childish gifts, the gadding ivy-spray
With foxglove and Egyptian bean-flower mixed,
And laughing-eyed acanthus. Of themselves,
Untended, will the she-goats then bring home
Their udders swollen with milk, .

అప్పుడు నేల దున్నకుండానే పంటపండుతుందట! సస్యాలతో, ఫలాలతో భూమి వరాలు వర్షిస్తుందట! పచ్చికబయళ్ళలో వెంటపోయి మేపకుండానే మేకల పొదుగుల్లోంచి క్షీరాలు పొంగిపొర్లిపోతాయట!

తమంతతామే పండే పొలాలూ, పాలు పొంగిపొర్లే పొదుగులూ, తేనెవాకలూ ఉండే ఒక స్వర్గం ఈ భూమ్మీద సాధ్యమనే అజ్టెక్కులు, సెల్టిక్కులు, ప్రాచీన గ్రీకులు, రోమన్లూ, ఎట్రుస్కన్లూ, వైదికఋషులూ మరెందరో కవిత్వాలు చెప్తూనే ఉన్నారు. ప్రాచీన చీనా కవి శ్రేష్టుడు తావోచిన్ తన peach blossom spring లో చిత్రించింది కూడా అటువంటి భూలోక స్వర్గాన్నే.

‘.There was fertile land, beautiful pools, mulberry trees and bamboo, and roads and paths for travel; chickens and dogs could be heard.

క్రీస్తు కూడా స్వర్గాన్ని వివరించినప్పుడు ఇటువంటి ప్రతీకలే వాడాడు:

The kingdom of heaven is like a mustard seed that someone took and sowed in his field; it is the smallest of all the seeds, but when it has grown it is the greatest of shrubs and becomes a tree, so that the birds of the heaven come and make nests in its branches.

మతప్రవక్తలు సంభావించిన ఆ స్వర్గాన్ని మహాకవి మానవీయ లోకంగా మనముందిట్లా ప్రతిష్టించాడు:

దేశమనియెడు దొడ్డవృక్షము
ప్రేమలను పూలెత్తవలెనోయ్
నరుల చమటను తడిసి మూలం
ధనం పంటలు పండవలెనోయ్

అటువంటి స్వర్గం భూమ్మీదకు దిగే పండగ సంక్రాంతి .

15-1-2019

One Reply to “పాడిపంటలు పొంగిపొర్లే దారిలో”

Leave a Reply

%d