దశార్ణదేశపు హంసలు

‘ఈ సృష్టిలో కాళిదాసు కవిత కన్నా మించిన ప్రియురాలు ఉండటం అసాధ్యం’ అని రాసుకున్నారు మా మాష్టారు.

1993 లో అనుకుంటాను. అప్పుడాయన తిరుపతిలో ఉండేరోజులు. ఒకసారి తిరుపతివెళ్ళినప్పుడు ఆయన్ని చూడటానికి వెళ్ళాను. హేమంత కాలపు ఎండ చురుక్కుమంటూండగా, మధ్యాహ్నం పన్నెండుగంటల వేళ, ఆయన, ‘నాకు బెంగుళూరు నుంచి సుబ్బారావు గారు పోన్ చేస్తారు, ఇక్కడ పోస్ట్ ఆఫీసుకి వెళ్ళాలి వస్తావా’ అన్నారు. ఇంట్లో ఒక టెలిఫోన్ కి నోచుకోని మహాపండితుడు. ఆ పోస్ట్ ఆఫీసేమీ పక్కనే లేదు, నడక దూరం తక్కువేమీ కాదు, కానీ, ఆ ఎండవేళ ఆయనట్లా ఒక ఫోన్ కాల్ కోసం పోస్ట్ ఆఫీసుకి వెళ్ళి అక్కడ బెంచీ మీద కూచుని వెయిట్ చేస్తున్న దృశ్యం నా కళ్ళముందు ఇప్పటికీ కదలాడుతోంది. ఒక ప్రేమికుడి ఫోన్ కాల్ కోసం ఒక ప్రేయసి కూడా అంత ఉద్విగ్నంగా వేచి చూస్తుందనుకోను.

ఆయన అంత తదేకచిత్తంతో ఆ కాల్ కోసం వెయిట్ చేసింది ఎందుకంటే, సుబ్బారావు గారు ఆయనకో అసైన్ మెంటు ఇచ్చారు, పూర్వమహాకవుల గురించి, ఒక్కొక్కరి గురించీ ఒకటీ లేదా రెండు వాక్యాల్లో చెప్పాలని. జీవితమంతా ఏ కవుల కావ్యానుశీలనంలో ఆయన గడుపుతూ వచ్చారో, ఏ మహాకవుల కావ్యాల్లోంచి ఒక శ్లోకం లేదా ఒక పద్యపాదం మీదనే ఆయన గంటల తరబడి ప్రసంగించగలరో, అటువంటి మహాకవుల గురించి, వారి కావ్యాత్మ గురించి, వారికీ, తనకీ ఉన్న అనుబంధం గురించి, ఒక్క వాక్యం లేదా రెండు వాక్యాలు! ఎంత కఠినమైన పరీక్ష పెట్టారు సుబ్బారావు గారు ఆయనకి అనుకున్నాను.

ఆయన బహుశా అప్పటికి వారం రోజులుగానో, రెండు వారాలుగానో అదే ధ్యాసలో ఉండి ఉంటారు.ఏమైతేనేం, ఒక్కొక్క కవి గురించీ ఒకటి రెండు వాక్యాలు మనసులో కూర్చుకుని, వాటిని కాగితం మీద రాసి పెట్టుకున్నారు. అప్పుడు సుబ్బారావు గారు ఫోన్ చెయ్యగానే ఆయన ఆ వాక్యాలు ఒక్కొక్కటీ ఆయనకు వినిపిస్తారన్నమాట. నేరుగా తన ప్రేమ ప్రకటించడానికి ధైర్యం చాలని యువకుడు కాగితం మీద ప్రేమలేఖ రాసిపెట్టుకున్నట్టుగా, ఆయన చేతుల్లో ఆ కాగితం.

కాని నా అదృష్టం, ఆ వాక్యాలకి మొదటి శ్రోతని నేనే. ‘చూడు, నా భావాలు సరిగానే వచ్చాయంటావా’ అనడిగారాయన ఒక్కొక్క కవి గురించీ తన మనసులో మాట బయట పెడుతూ.

నేను రాజమండ్రిలో ఉన్న రోజుల్లో ఆయన ప్రసంగాలు ఎక్కడున్నా పోయి వినేవాణ్ణి. అట్లా దాదాపుగా సంస్కృతమహాకవులు, నాటకకర్తలు, పూర్వాంధ్ర మహాకవులు, సమకాలిక మహాకవులు, దాదాపుగా ప్రతి ఒక్కరి మీదా ఆయన ప్రసంగాలు వినే అదృష్టానికి నోచుకున్నాను. మొదట్లో ఆ ప్రసంగాలు విన్నప్పుడు నాకు కొంత అయోమయంగా కూడా ఉండేది. ఆయన ఎవరైనా కవి మీద ప్రసంగిస్తుంటే, ఆ కవి ఆయన్ని ఆవహించేవాడు. సృష్టిలో ఆ ఒక్క కవినే మహాకవి, తక్కినవారెవరూ ఆయనముందు నిలబడ జాలరన్నట్టుగా మాట్లాడేవారు. ఒకవేళ ఎవరేనా అటువంటి ఒక్క ప్రసంగం మాత్రమే వినిఉంటే, ఆ కవినే ఆయనకు ప్రాణాధికమైన కవి అని భ్రమపడే ప్రమాదం కూడా ఉండేది.

‘మీ మాష్టారు శ్రీనాథుడి మీద మాట్లాడిన ప్రసంగం విన్నానయ్యా, ఏమి ప్రసంగం! శ్రీనాథుడి కవిత్వాన్ని మంత్రమయ వాణి అన్నాడాయన! మంత్రమయవాణి! ఎటువంటి మాట! ఎటువంటి మాట! శ్రీ శ్రీ కవిత్వం అంతా అదే కదా, మంత్రమయవాణి!’ అన్నాడు అజంతా, ఒక రాత్రి లోయర్ టాంక్ బండ్ వీథిలో నడుస్తూ. అజంతాకి ఏమని చెప్పేది? ఆ మాట మాష్టారు తన మాష్టారు గా పిలుచుకునే కాటూరి వెంకటేశ్వర రావు గారు విశ్వనాథ సత్యనారాయణ కవిత్వం గురించి చెప్పిన మాట అని!

చైతన్యమహాప్రభువు ఒక మాటన్నారని చైతన్యచరిత్రామృతంలో కృష్ణదాస కవిరాజు రాసాడు: ‘నువ్వెవరినేనా ప్రేమిస్తే, ఆ ప్రేమ నిజమైన ప్రేమ అని ఎప్పుడు నమ్మగలనంటే, నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో ఆ మనిషికి కూడా తెలీనంత గోప్యంగా నీ హృదయంలో ఉన్నప్పుడే’ అని.

శతాధిక పూర్వ, సమకాలిక మహాకవుల్లో మాష్టారి హృదయాన్ని నిజంగా దోచుకున్న కవి ఎవరు? వ్యాసవాల్మీకులా, భాసభవభూతులా, మాఘదిజ్ఞాగులా, కవిత్రయమా, ప్రబంధకవులా, కృష్ణశాస్త్రి, విశ్వనాథలా? ఆయన హృదయాన్ని కైవసం చేసుకున్న ఆ కావ్యదేవేరి ఎవరో నాకు ఊహించడానికి కూడా అసాధ్యంగా ఉండేది.

కాని, ఎన్నో ఏళ్ళ తరువాత, ఆ మధ్యాహ్నం, ఆ పోస్టాఫీసులో బల్లమీద, ఆయన ప్రేమరహస్యం నాకు తెలిసిపోయింది. తన మనోమందిరంలో ఆయన పూర్వమహాకవులకి ఏ స్థానాన్ని ఇచ్చుకుంటూ వచ్చారో తేటతెల్లంగా రాసిపెట్టేసారు.

వాల్మీకితో మొదలుపెట్టారు. ఆయన తల్లిలాంటి కవి అట. వ్యాసుడు అచ్చం వాళ్ళ నాన్నగారిలాంటి వాడట. తండ్రి ప్రేమలాగా, వ్యాసుడి హితోపదేశం ఫలితసమయంలో కాని అందుబాటులోకి రాదట. ఆ మహా మహా మహాకవులందరి మధ్యనా, ఆయన ప్రణయిని తన సుకోమల బాహువుల్తో ఆయన్ని కావిలించుకుని ఓరగా చూస్తూ నాకు కనిపించింది.

‘ఈ సృష్టిలో కాళిదాసు కవిత కన్నా మించిన ప్రియురాలు మరొకరు ఉండటం అసాధ్యం.’

కాని ఆ ప్రణయరహస్యాన్ని ఆయన మళ్ళా ఎప్పటికప్పుడు మరుగుపరుస్తూనే ఉన్నారు. 2001 లో మాట. నా ‘సహృదయునికి ప్రేమలేఖ’ పుస్తకం ఆయనకి అంకితమిచ్చాను. ఆ పుస్తకం ఆయన చేతుల్లో పెట్టడానికి రాజమండ్రి వెళ్ళాను. ఒక నిండు సంపెంగ మాల ఆయన మెడలో వేసాను. ఆ పుస్తకం ఆయన చేతుల్లో పెట్టాను. ‘సంతోషప్రదమైన ఈ క్షణాల్లో ఒక కాళిదాసు శ్లోకం వినిపించగలరా’ అనడిగాను.

ఆయన ముఖంలో చికాకు తొంగిచూసింది. ‘కాళిదాసు ఎవరు?’ అన్నాడాయన.

‘ఇప్పుడు నా మనసంతా బసవేశ్వరుడు ఆవహించి ఉన్నాడు. ఇప్పుడే, ఇప్పుడే, ఈ క్షణాన్నే శివస్మరణ చెయ్యి, శివస్మరణ చెయ్యి అంటున్నాడు బసవేశ్వరుడు, చాలా జీవితం వృథాగా గడిపేసాను. ఇంక సమయం లేదు. అధ్యైవ శివస్య స్మరణం, అధ్యైవ శివస్య భజనం’ అన్నారాయన.

ఉహు. లాభం లేదు. ఆయన మళ్ళా తన ప్రణయినితో ఏదో ప్రణయకలహంలో ఉన్నారు. పొరపాటు చేసాను. ఆ ప్రస్తావన ఎత్తి ఉండవలసింది కాదు అనుకున్నాను.

కాని కొంతసేపటికి ఆయనే మళ్ళా ‘నువ్వడిగావు కదా, ఇదుగో, ఈ శ్లోకం ఇందాకటినుంచీ నన్నొకటే వేధిస్తోంది, నీకు వినిపించమని, ఇదుగో విను’ అంటో ఈ శ్లోకం చదివారు.

‘పాండుచ్ఛాయో పవనవృతయః కేతకై సూచిభిన్నైః
నీడారంభై గృహబలిభుజామాకుల గ్రామచైత్యాః
త్వయ్యాసన్నే పరిణతఫలశ్యామ జంబూ వనాంతాః
సంపత్స్యంతే కతిపయదినస్థాయి హంసా దశార్ణాః’

‘ఆ హంసలక్కడ ఉండేది కొన్నాళ్ళే’. ఈ వాక్యం చిన్నప్పణ్ణుంచి చదువుతున్నాను. కాళిదాసు ఈ మాట దశార్ణదేశపు హంసల గురించి రాసాడనే అనుకున్నాను ఇన్నాళ్ళూ. ఇప్పుడు తెలుస్తోంది, ఆ హంసలు నా ప్రాణాలేనని’ అన్నారాయన తన డెబ్బై ఏళ్ళ అస్వస్థ శరీరాన్ని చూసుకుంటో.

జీవితమంతా ఏ ప్రియురాలి సాహచర్యంలో గడిపాడో ఆ ప్రియురాలు ఆయన వృద్ధాప్యంలో కూడా ఆయనకి తోడుగా నిలబడి ఆయనకి మాత్రమే అర్థమయ్యే ఏవో స్వీట్ నథింగ్స్ చెప్తూనే ఉందన్నమాట!

~

మీ మాష్టారి కథ బాగానే ఉంది. కాని చినవీరభద్రుడూ, నీకెవరేనా అట్లాంటి ప్రేయసి లభించిందా? నువ్వట్లా ఎవరి గురించి చెప్పగలవు ఈ సృష్టిలో ఇంతకన్నా మించిన ప్రియురాలు మరొకరు ఉండటం అసాధ్యం అని? కనీసం ఈ ప్రేమికుల రోజుకేనా గుర్తుపట్టగలిగావా!

Leave a Reply

%d bloggers like this: