ఈస్తటిక్‌ స్పేస్‌ స్టేషన్‌

Reading Time: 3 minutes

దగ్గుమాటి పద్మాకర్‌ 1993 నుంచి 2018 దాకా దాదాపు పాతికేళ్ళ కాలంలో రాసిన 17 కథలు ఇవి. ఇప్పటి కథకులు ఏడాదికో, రెండేళ్ళకో ఒక కథాసంపుటం వెలువరిస్తున్న కాలంలో ఒక కథకుడు ఇన్నేళ్ళ పాటు కథాసంపుటం వెలువరించకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. అంతకన్నా ఆశ్చర్యం రాశిపరంగా కూడా కథకుడు పుంఖానుపుంఖంగా రాయకపోవడం. పదిహేడు కథలంటే కనీసం ఏడాదికి ఒక కథ కూడా కాదు. జీవితాన్ని పైపైన కాకుండా, లోతుగా అనుభవంలోకి తెచ్చుకుని, ఆ అనుభవాల్ని ధ్యానించి వాటిమీంచి తనదే అయిన ఒక ప్రాపంచిక దృక్పథాన్ని ఏర్పరచుకునే కథకుడు మాత్రమే ఇంత నిదానంగానూ, ఇంత మితంగానూ రాయ గలుగుతాడు. ఇటువంటి కథకుడు చెప్పే ప్రతి ఒక్క కథా ఎంతో భావగర్భితంగానూ, మరెంతో విలువైంది గానూ ఉండటంలో ఆశ్చర్యం లేదు.

2

ఈ కథలు ఒకసారి కాదు, రెండు సార్లు చదివాను. ఈ కథలు రాయడం ద్వారా కథకుడు ఏం చెప్పాలను కుంటున్నాడు? అసలన్నిటికన్నా ముందు అతడీ కథలెందుకు రాసాడు? ఈ ఆలోచనల్లో నాకు వీటి గురించి ఆలోచిస్తూ ఉంటే, ఆధునిక కథకుల తొలిగురువు మపాసా తన పుస్తకానికి రాసుకున్న ఒక ముందుమాట (1888) గుర్తొచ్చింది. ఆ ముందుమాట ప్రధానంగా రియలిజం స్వరూప స్వభావాల గురించి చర్చించడానికి రాసిందే అయినప్పటికీ, అసలు రచయిత కర్తవ్యం ఏమిటనే దానిమీద, అంతకన్నా తలుచుకోదగ్గ మాటలు మరేవీ నేనిప్పటిదాకా చదవలేదు.

మపాసా ఇలా అంటున్నాడు :

“నిజమైన రచయిత తాలూకు లక్ష్యం మనకేదో ఒక కథ చెప్పడమో లేదా మనల్ని రంజింపచెయ్యడమో లేదా మనల్ని చలింపచెయ్యడమో కానే కాదు. అతడు కథ చెప్పడం ద్వారా మనల్ని ఆలోచింపచేస్తాడు.”

“సంఘటనలు జరుగుతున్నప్పుడు వాటిలో మనం వెంటనే గుర్తుపట్టలేని లోతైన అంతరార్థాన్ని మనం అర్థం చేసుకునేట్టు చేస్తాడు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, వస్తువుల్ని, యథార్థాల్నీ, మనుషుల్నీ చూసి వాటి గురించి తనదే అయిన ఒక పద్దతిలో గాఢంగా చింతిస్తాడు. తను చూసినవాటినీ, వాటి గురించి తన మదిలో మెదిలే ఆలోచనల్నీ తనకై తాను సమన్వయించుకుంటాడు. తాను చూసిన సంఘటనల్ని కథలుగా మనముందు పెడుతున్నప్పుడు నిజానికి అతడు మనతో చెప్పాలనుకుంటున్నది తన సొంత ప్రాపంచిక దృక్పథాన్నే. మనల్ని చలింప చెయ్యడానికన్నా ముందు తాను చూసిన జీవన సన్నివేశాలవల్ల ముందు అతడు చలించి ఉంటాడు. అప్పుడు మాత్రమే అతడు వాటిని నిర్దిష్టంగా మన కళ్ళకు కట్టేలా చెప్పగలుగుతాడు. కాని అతడీ పని ఎంత నేర్పుగా చేస్తాడంటే, తాను చెప్తున్నవాటిని ఎంత సరళంగానూ, ఎంత నర్మగర్భంగానూ చెప్తాడంటే, అతడి ఉద్దేశాలేమిటో, అతడి మనోభావాలేమిటో మనమొక పట్టాన తేల్చుకోలేకపోతాం.”

“కాని, ఆ ప్రాపంచిక దృక్పథం, అంటే, ప్రపంచాన్ని కథకుడు ఎట్లా సమీపిస్తున్నాడో, ప్రపంచంలో తాను చూసిన జీవితానుభవాల్ని బట్టి ఎటువంటి అభిప్రాయం ఏర్పరచు కుంటున్నాడో దాన్ని అతడు మనతో పంచుకోకుండా ఉండలేడు. అది కేవలం అతడి ఉత్సాహానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, అది అతడి కర్తవ్యం కూడా”

అంటాడు మపాసా.

ఆయనింకా ఇలా అంటున్నాడు:

‘కాబట్టి మనలో ప్రతి ఒక్కరం, ఎవరికి వారు, ఈ ప్రపంచం గురించి మన మన వ్యక్తిగత ఊహాచిత్రాన్నొకటి నిర్మించుకుంటూ ఉంటాం. అది కవితాత్మకం కావచ్చు, ఉద్వేగభరితం కావచ్చు, విషాదభరితమో, నిరాశా జనకమో, అనైతికమో, మన స్వభావానికి అనుగుణంగా ఏదో ఒకటి కావొచ్చు. కాని ప్రపంచం గురించి తానేర్పరచుకున్న తన ఊహాచిత్రాన్ని, తన సమస్త సాహిత్య శక్తుల్నీ ఉపయోగించి మనముందు ఆవిష్కరించడమే రచయిత కర్తవ్యం’

ఈ వాక్యాల నేపథ్యంలో ఈ కథల్ని పునరాలోచించినప్పుడు పద్మాకర్‌ ఒక కర్తవ్యదీక్షతోనే కథకుడిగా మారాడనీ, జీవితాన్ని అతడు సీరియస్ గా తీసుకున్నాడనీ, తన చుట్టూ జరుగుతున్న వివిధ సంఘటనల గురించి లోతుగా ఆలోచిస్తున్నాడనీ, అలాంటి సంఘటనలే మనకి కూడా తటస్తించినప్పుడు, మనం వాటినెట్లా అర్థం చేసుకోవాలో, వాటిపట్ల మనమెలా ప్రతిస్పందించాలో మనకొక దారి చూపిస్తున్నాడనీ అర్థమవుతున్నది.

ఈ కథల్లో కూడా మనం రోజూ చూస్తున్న, వింటున్న బాధలే, కష్టాలే ఉన్నాయిగాని, ఈ కథల్లో అంతర్లీనంగా ఉన్న ఒక నిర్మల దృక్పథం, ఒక ఆశావహ భావోద్వేగం, ఒక ఆదర్శం మటుకు మనకి బయట కనిపించేవి కావు. ‘యూ టర్న్‌’ అనే కథలో ఈ వాక్యం చూడండి:

”జీవితంలో నమ్మినదాన్ని ఆచరించేవాళ్ళే చాలా గొప్పవాళ్ళు. సాధారణంగా ప్రజలందరూ నమ్మినదాన్నే ఆచరిస్తారని మీరనవచ్చు. దేనైనా కోల్పోవలసి వచ్చినప్పుడే తన నమ్మకం పట్ల తనకుగల నిజాయితీ మనిషిని నిలదీస్తుంది. అలా కోల్పోయేందుకు సిద్ధపడనివారి నమ్మకం అనుమానాస్పదం అవుతుంది.”

కథకుడు దేన్ని నమ్ముతున్నాడు? దేన్ని కోల్పోడానికి సిద్ధపడుతున్నాడు? ఈ ప్రశ్నలకి జవాబులు వెతుక్కోడానికి మనమీ కథలు చదవాలి. నా వరకూ నాకు అర్థమయిందేమంటే, తాను చూస్తున్న ప్రపంచం ఎంత నిష్టురంగా ఉన్నప్పటికీ మనుషులపట్ల తన నమ్మకాన్నీ, ఆశనీ కోల్పోడానికి సిద్దంగా లేడని. ఎంత ఊపిరాడనివ్వకుండా చేస్తున్నప్పటికీ ముందు కనబడుతున్న చీకటి పార్శ్వమే యథార్థమనీ, అదే శాశ్వతమనీ కథకుడు అనుకోలేక పోతున్నాడు. అలా అనుకుని ఉంటే, ‘యూటర్న్‌’ కథని అలా ముగించి ఉండేవాడు కాడు.

ఈ కథల్లో ప్రతి కథలోనూ రెండు పొరలున్నాయి. మొదటిది, మనమందరం చూస్తున్న, వింటున్న అనుభవిస్తున్న యథార్థం. తెల్లవారి లేస్తే మన వార్తా పత్రికలన్నింటా కనిపించే కథల్లో మనం చూసేది ఈ పార్శ్వాన్నే.

కాని, ఆ పొరకి అడుగున, కథకుడు మాత్రమే చూస్తున్న, నమ్ముతున్న, మనముందు ప్రతిపాదిస్తున్న ఒక ఆరోగ్యవంతమైన, ఒక అలంబనా పూర్వకమైన దృక్పథం కనిపిస్తుంది. అదేమిటో మనకై మనం వివరించుకోనక్కర్లేకుండానే ఒక ఇంట్రావీనస్ ఇంజెక్షనులాగా నేరుగా ఆ దృక్పథం తన సందేశాన్ని మన రక్తంలోకి ప్రవహింపచేస్తుంది. ఇక ఆ పైన ఆ కథ చూపించగల ప్రభావం, విడిచిపెట్టే ముద్ర మన అంచనాల్ని దాటిపోతాయి. అందుకనే ఒక ‘S/o అమ్మ’ కథ చదివి తమిళనాడు ముఖ్యమంత్రి ఏకంగా చట్టం తీసుకొచ్చిందనే విషయం విన్నప్పుడు మనకి ఆశ్చర్యం కలగదు.

ఈ కథల్ని నిర్మించడంలో కథకుడు చూపించిన శిల్ప ప్రజ్ఞ కూడా చెప్పదగ్గది. అతడు తాను చూసిన ప్రతి ఒక్క సన్నివేశాన్ని కథగా మలచడానికి ఆతృత పడడు. అందుకు బదులు, ఏ సన్నివేశాలు తనని తీవ్రంగా చలింపచేసాయో, ఏవి తన మీద చెరగని ముద్ర వేసాయో వాటినే కథలుగా చెప్పడానికి పూనుకుంటాడు. జీవిత సన్నివేశాల ఎదట నిలబడి అతడు మాట్లాడే వాక్యాలు తనకై తాను చెప్పుకుంటున్నవే అయినప్పటికీ, మనం కూడా మనకి చెప్పుకోదగ్గవి. కొన్ని వాక్యాలు చూడండి:

”… అలాంటి క్షణాలలో స్త్రీలలోని ఇతరపాత్రలు అంతరించి కేవలం తల్లులు మాత్రమే మిగిలిపోతారేమో.”

”నిజానికి ప్రతి బాధ్యతా కూడా సోమరితనానికి ఒక డిస్ట్రబెన్స్‌..”

”సాటి మనుషుల పట్ల దయ చూపించడానికి కూడా ఒక కేలికులేషన్‌ ఉండాలా?”

”కెన్యాపై ఇండియా గెలిచిందని యువత సంబరాలు. సచిన్‌ టెండూల్కర్‌, వరల్డ్‌ గ్రేటెస్ట్‌ బ్యాట్స్మెన్‌, ఇరాక్‌లో కనీసం ఒక బాలుడ్ని రక్షించగలడా?”

‘ప్రతి బాధనీ తీర్చేసుకోవలసిందేనా? మొయ్యలేవా?’

”ఇతరులతో కలయిక నిరోధించడానికి సంస్కారానికి మించిన కండోం ఉందా?”

”శాస్త్రవేత్తలు పది సంవత్సరాల పాటు కొనసాగించిన ప్రయోగాలను కూడా ఫలితాలు వ్యర్థమని తేలితే నిర్దాక్షిణ్యంగా మూలన పడేస్తారు.”

3

ఈస్తటిక్‌ స్పేస్‌ కథలో కథకుడు ఒక మాటన్నాడు. ”మనుషులు స్పేస్‌ లో స్టేషన్లు నిర్మించి నివాసం ఉంటున్నారు గాని, తమలో దాగి వున్న ఈస్తటిక్‌ స్పేస్‌ విలువని గుర్తించడం లేదు” అని. అందుకని మనకోసం కథకుడు నిర్మించిన ఒక ఈస్తటిక్‌ స్పేస్‌ స్టేషన్‌ ఈ కథాసంపుటం.

22-1-2019

Leave a Reply

%d bloggers like this: