
ఒక్కొక్కప్పుడు ఒక కవిని తెరవగానే గొప్ప ప్రపంచమొకటి మన కళ్ళముందు ప్రత్యక్షమవుతుంది. తనతో పాటు ఏ కవి ఒక లోకాన్ని కూడా పట్టుకొస్తాడో అతణ్ణే ప్రపంచం గుర్తు పెట్టుకుంటుంది, మళ్ళీ మళ్ళీ చదవడానికి ఇష్టపడుతుంది. అటువంటి కవి కవిత్వం వల్ల మనం రోజూ చూసే లోకమే మళ్ళా కొత్తగా కనిపించడం మొదలుపెడుతుంది. కవిని బ్రహ్మ అన్నారు, అంటే, ఈ అర్థంలో. ‘అపారే కావ్యసంసారే కవిరేవ ప్రజాపతిః’ అనే మాట కూడా సగమే నిజం. కవి కావ్యప్రపంచానికి మాత్రమే ప్రజాపతి కాదు. ఒక సారి ఆ కావ్యప్రపంచం మనకి పరిచయమయ్యాక, మన ప్రపంచం కూడా తత్పూర్వావస్థలోనే కొనసాగడం అసాధ్యమైపోతుంది.
చాలామంది కవుల కవిత్వం చదువుతాం కాని, అటువంటి కవి దొరికిన రోజులు మాత్రం ప్రత్యేకమైనవి. అప్పుడు ఆకాశం మరింత విశాలంగానూ, చెట్లు మరింత పచ్చగానూ, నీళ్ళు మరింత నిర్మలంగానూ గోచరిస్తాయి. ఆధునిక కాలంలో రవీంద్రుడు అట్లాంటి కవి, రేనర్ మేరియా రిల్క అట్లాంటి కవి, ఇంగీషు రొమాంటిసిస్టు కవులు అట్లాంటి వాళ్ళు, పాల్ వెర్లేన్, ఆంటోనియో మచాడో, అలెగ్జాండర్ కవఫీ అట్లాంటి కవులు. విట్మన్, నెరుదా, ఫైజ్ అహ్మద్ ఫైజ్ లు సరే సరి. తెలుగులో గురజాడ, శ్రీ శ్రీ, బైరాగి ల్ని నేను చదువుకోకపోయి ఉంటే , నా ప్రపంచం ఇరుగ్గా ఉండిపోడమే కాక, అసలు నేను జీవించడానికొక అర్థం లేకపోయుండేది.
అందుకని నేనెప్పుడూ కొత్త కవుల కోసం గాలిస్తూనే ఉంటాను. పర్వతాలెక్కేవాళ్ళు కొత్త శిఖరాల్ని వెతుక్కున్నట్టుగా, సాహసనావికులు కొత్త ద్వీపాల కోసం బెంగపెట్టుకున్నట్టుగా నేను కొత్త కవిత్వాల కోసం అర్రులు చాస్తుంటాను.
అట్లాంటి ఒక కవి గత రెండువారాలుగా నా మనోగగనంలో ఒక ఇంద్రచాపంలాగా విప్పారిన కవి లెస్ మర్రీ (Les Murray).
ఆస్ట్రేలియన్ కవి లెస్ మర్రీ (జ.1938-) మన సమకాలిక ఇంగ్లీషు కవుల్లో అగ్రశ్రేణికి చెందినవాడే కాక, ఇప్పుడు ప్రపంచంలో కవిత్వవిద్యను సాధనచేస్తూన్న అత్యంత ప్రతిభాశీలురైన కవుల్లో ఒకడు కూడా. ఆస్ట్రేలియన్ కవిత్వంలో భాగంగా అతడి కవిత్వం కామన్ వెల్త్ కవిత్వం అని చెప్పొచ్చుగాని, అతడు చూసిన, చూపించిన సౌందర్యం చాలా uncommon wealth. నిజానికి, అతడు జీవితమంతా ఇంగ్లీషు కవిత్వ సంప్రదాయాలనుంచి విడివిడి ఇంగ్లీషు మానసానికి పరిచయం లేని ఒక మహాప్రపంచాన్ని చూపించడానికే ఆరాటపడుతూ ఉన్నాడు. ఆ విధంగా అతడు షేక్ స్పియర్, వర్డ్స్ వర్త్, ఫిలిఫ్ లార్కిన్ లకన్నా ఆస్ట్రేలియన్ ఆదివాసులకే ఎక్కువ సన్నిహితంగా ఉన్నాడని కూడా చెప్పొచ్చు.
New Selected Poems (2012) నా దగ్గర దాదాపు నాలుగైదేళ్ళుగా ఉన్నా ఆ తలుపులు తెరిచిందీ మధ్యనే. ఆ కవిత్వం ఎలా ఉంటుందో మచ్చుకి మీతో ఒక కవిత తెలుగులో పంచుకోకుండా ఉండలేకపోతున్నాను.
~
చాలా మామూలు ఇంద్రధనుస్సు
మర్యాదస్తులకి అప్పుడే వార్త చేరిపోయింది
పెద్దమనుషుల ఇంటికి కూడా వర్తమానం వెళ్ళిపోయింది.
దుకాణాల్లో లెక్కలు రాసేవాళ్ళు చిట్టా ఆవర్జాల్లోంచి తలెత్తిచూసారు,
స్టాక్ ఎక్చేంజిల్లో సుద్దముక్క సగంలోనే ఆగిపోయింది,
క్లబ్బుల్లో తింటున్నవాళ్ళు తింటున్నది తింటున్నట్టే వదిలేసి బయటికొచ్చేసారు
నాలుగురోడ్ల కూడలి దగ్గర ఒక మనిషి రోదిస్తున్నాడు.
వాళ్ళతణ్ణి ఆపలేకపోతున్నారు.
మెయిన్ రోడ్డుమీద ట్రాఫిక్ అరమైలు దూరం ఆగిపోయింది, కదలట్లేదు,
జనాలు ఆందోళనతో ఒకటే రొదపెడుతున్నారు.
మరింతమంది మనుషులుముందుకు తోసుకొస్తున్నారు, కొంతసేపటికింద మామూలుగా ఉన్న వెనకవీథుల్లో కూడా
ఇప్పుడొకటే జనసందోహం:
వాళ్ళంతా తమలో తాము చెప్పుకుంటున్నదొకటే:
అక్కడ నగరమధ్యంలో ఒక మనిషి విలపిస్తున్నాడు, అతన్నెవరూ ఆపలేకపోతున్నారు.
నాలుగువైపులనుంచీ మనం చుట్టుముట్టిన ఆ మనిషి,
మనలో ఎవ్వరం అతడి చెంతకుపోలేకపోతున్న ఆ మనిషి అలా ఏడుస్తూనే ఉన్నాడు, ముఖం దాచుకోకుండానే ఏడుస్తున్నాడు, పసిపిల్లవాడిలా ఏడుస్తున్నాడు.
ఏదో గాలివాటుగా కాదు, ఒక మనిషిలాగా ఏడుస్తున్నాడు,
అట్లా ఏడుస్తున్నసంగతి అతడేమీ కప్పిపుచ్చుకోడం లేదు
గుండెలు బాదుకోడం లేదు, బిగ్గరగానూ ఏడవడం లేదు-
ఆ ఏడవడంలోని మాన్యత-
మనల్ని అతణ్ణుంచి ఒకడుగు వెనక్కి వేయిస్తోంది.
అతడి దుఃఖంతాలూకు పంచాగ్నిమండలం నడుమ, మిట్టమధ్యాహ్నం వెలుగులో, అతడి చుట్టూ ఒక కాంతిపరివేషం,
అతణ్ణి పట్టుకుని ఏడుపు ఆపెయ్యాలనుకున్న వాళ్ళంతా
గుడ్లప్పగించి, సంభ్రమంతో అతణ్ణే చూస్తున్నారు.
పసిపిల్లలు ఇంద్రధనుస్సు వెంట పరుగెత్తినట్టు
వాళ్ళు ఆ అశ్రువులకోసం మనసా తపించిపోతున్నారు.
ఆ క్షణాల్లో అతడి చుట్టూ ఒక కాంతిమండలమో,
దివ్యశక్తినో అల్లుకుందని
బహుశా రాబోయే కాలాల్లో కొందరు చెప్పుకోవచ్చుకూడా.
కాని అట్లాంటిదేమీ లేదు.
కొందరేమో తామక్కడ లేకపోయారుగానీ లేకపోతే ఎట్లాగైనా అతణ్ణి ఏడుపు మానిపించి ఉండేవారమంటారు.
మనలో అత్యంత బలశాలురు, అత్యంత గంభీరులు,
అత్యంత హాస్యచతురులు కూడా అక్కడ వణికిపోతూ మౌనం వహిస్తారు, అనిర్వచనీయమైన ప్రశాంతిలో
తమలో తామే ఏవో తీర్మానాలు చేసుకుంటారు.
అంతదాకా సంతోషంగాఉన్నామనుకునేవాళ్ళు కూడా ఆ క్షణాన ఎలుగెత్తి విలపిస్తారు.
చిన్నపిల్లలు,అప్పుడే స్వర్గం నుంచి బయటకి అడుగుపెట్టినట్టుండే పసిపిల్లలు, మటుకే అతడి దగ్గరకు పోగలుగుతారు, అతడి పాదాల చెంత కూర్చుంటారు, వాళ్ళతో పాటే కుక్కపిల్లలూ, గువ్వపిట్టలూ.
ఎంత హాస్యాస్పదం అంటున్నాడొకడు నా పక్కనొకడు,
అంటోనే తన చేతులునోటికడ్డుపెట్టుకుంటున్నాడు,
తన నోట్లోంచి వస్తున్నవి మాటలు కాదు, వాంతి అన్నట్టు.
ఆ ఎండలో ధగధగలాడుతూ ఒక మహిళ
అతడి ముందు చేయి చాపింది
అతణ్ణుంచి బహుశా శోకాన్ని ఒక బహుమతిగా పొందుతున్నందుకు అతణ్ణి అభినందిస్తున్నట్టుగా.
తమకి కూడా ఆ కానుక దక్కాలని ఆమె వెనకనే మరింతమంది పోగవుతున్నారు.
అక్కడ జరుగుతున్నదాన్ని జరుగుతున్నట్టుగా అంగీకరిస్తున్నందుకే మరికొందరికి కన్నీళ్ళు ఆగటం లేదు. ఇంకొంతమందేమో తామెక్కడ అంగీకరించవలసి వస్తుందోనని
ఏడవడానికి ఇష్టపడం లేదు.
తన చుట్టూ తిరుగుతున్న భూమికిమల్లే
ఆ శోకాకుల మానవుడు ఎవరినుంచీ ఏమీ కోరుకోవడం లేదు.
అట్లా ఏడుస్తున్న ఆ మానవుడు మన ఉనికిని పూర్తిగా విస్మరిస్తున్నాడు. కొంకర్లు తిరిగిపోయిన
తన వదనంతో, తన సామాన్యదేహంతో అతడు సంపూర్తిగా రోదిస్తున్నాడు
ఆ రోదనలో వినిపిస్తున్నది మాటలు కాదు,
గూడు కట్టుకున్న దుఃఖం,
సందేశాలు కావు, సంతాపం, భూమిలాగా బలవత్తరం, సముద్రంలాగా మహత్తరం
అతడట్లా విలపించడం ఆపేసినప్పుడు,
అంతదాకా విలపించినవాడి వదనంలోనూ, విలపించడం ఆపేసినవాడి వదనంలోనూ సుస్పష్టమయ్యే మర్యాదతో,
చేతుల్తో తన ముఖం రుద్దుకుంటూ
మనమధ్యనుంచే నడిచిపోతాడు.
నమ్మకాల్ని మటుకే నమ్ముకుని బతికే వాళ్ళని తప్పించుకుంటూ
నగరమధ్యం నుంచి వడివడిగా సాగిపోతాడు.
10-1-2019