కథాశిల్పం-5

కథా ప్రణాళిక: కథ మొదలుపెట్టే పద్ధతి

కథాప్రణాళికలో అయిదు విభాగాలున్నాయనీ, మొదలు, మలుపు, ముగింపులు ఒక కథ తాలూకు ఆదిమధ్యాంతాలయితే, మొదలునుంచి మలుపుదాకానూ, మలుపు నుంచి ముగింపుదాకానూ మరొక రెండు విభాగాలు కలిపి మొత్తం అయిదు విభాగాలున్నాయనీ చెప్పుకున్నాం.   ఈ అయిదు దశల్లోనూ కథకుడు పాఠకుడి ఉత్కంఠని కాపాడుకుంటూ, అతడికొక రసానుభూతిని కలిగించడం మీద దృష్టి పెడుతూ సంఘటనల్ని అమర్చి చెప్తాడని కూడా చెప్పుకున్నాం.

కథ మొదలుపెట్టడం

ఇప్పుడు ఈ అయిదు విభాగాల్లోనూ మొదటగా కథ మొదలుపెట్టడం గురించి వివరంగా చూద్దాం. అరిస్టాటిల్ దృష్టిలో ప్రతి కథకీ ఒక ‘ఆది’ ఉంటుంది. ‘ఆది’ అంటే, అరిస్టాటిల్ దృష్టిలో, కార్యకారణ సంబంధం ప్రకారం దానికన్నా ఏదీ ముందుండదనిదీ, ఏదున్నా దాని తర్వాతే కొనసాగేదీనూ.  ఈ నిర్వచనంలో కొత్తగా చెప్పిందేముంది అనిపించవచ్చుగాని, తరచి చూస్తే ఈ మాటల్లోని అంతరార్థం బోధపడుతుంది. ఈ నిర్వచనం ప్రకారం  కథని నడిపించే సంఘటనలన్నీ ఏ బిందువునుంచి వరసగా మొదలవుతాయో ఆ ప్రారంభబిందువన్నమాట. నిజ జీవితంలో మనం దేన్నైనా వర్ణించేటప్పుడో, వివరించేటప్పుడో ఎక్కడైనా మొదలుపెట్టవచ్చుగానీ, కథలో, ఆ మొదలు కచ్చితంగా తదనంతరం మనం చెప్పబోయే సంఘటనలకి మొదటి బిందువు కావాలి. అంతకు ముందు చాలా జరిగి ఉండవచ్చు కానీ, వాటికీ, తర్వాత చెప్పబోయే సంఘటనలకీ కార్యకారణసంబంధం లేకపోతే అవేవీ కథకి ప్రారంభ బిందువులు కాలేవు. కాబట్టి కథకుడు తాను కథ చెప్పాలనుకున్నప్పుడు ఏ ప్రారంభ బిందువు వద్ద మొదలుపెడుతున్నాడన్నది ముఖ్యం.

ఇక్కడే ఆధునిక కథ ప్రాచీన కథారూపాలన్నిటికన్నా ప్రత్యేకంగా కనిపించేది. ప్రాచీన కథారూపాలు ముఖ్యంగా జానపద కథలు ‘అనగనగా..’ అంటో మొదలవుతాయని మనకు తెలుసు. ఆ కథల్లో ప్రారంభ బిందువు అనాది. అతీతకాలానికి చెందింది. అది అలా జరిగిందీ అని ఎందరో చెప్పగా చెప్పగా, వినగా వినగా మనదాకా ఆ కథ చేరింది. కాని ఆధునిక కథ అలా కాదు. దాన్ని ఏ కథకుడికి ఆ కథకుడు ఒక నిర్దిష్ట బిందువు దగ్గర  మొదలుపెడతాడు. ఆ బిందువుకి ముందు ఏమి జరిగిందో మనకి తెలీదు. తెలియవలసిన అవసరం కూడా లేదు. ఆ మాటకొస్తే, ఆ వివరాలు ఆ కథకుడికి కూడా తెలుసో తెలియదో కూడా అనుమానమే. కథకుడికీ, మనకీ సంబంధించినంతవరకూ, ఆ బిందువు తర్వాత జరిగిన సంఘటనలే మనం వినవలసినవి, వాటి మధ్య ఏర్పడ్డ కార్యకారణ సంబంధమే మనం అర్థం చేసుకోవలసిందీను.

కథా ప్రారంభం కేవలం కథను మొదలుపెట్టే స్థానం మాత్రమే కాదు. ఆ కథా ప్రణాళికకి ఆరంభం కూడా. అందుకని, కథకుడికి తాను చెప్పే కథ ఎటువంటి మలుపులు తిరుగుతుందో, ఏ విధంగా ముగింపుకొస్తుందో కూడా స్పష్టంగా తెలిసిఉంటే ఆ కథని ఎక్కడ మొదలుపెట్టాలో కూడా స్పష్టంగా తెలుస్తుంది.

కథా ప్రారంభంలో రెండు భాగాలుంటాయి. ఒకటి ఎత్తుగడ, రెండోది మొదటి సంఘటనాను.

కథ ఎత్తుకోవడం

ఎత్తుగడ కథలోకి ప్రవేశ ద్వారం లాంటిది. సంఘటనల్ని ఉత్కంఠభరితంగా అమర్చడమే కథ అనుకుంటే, ఆ ఉత్కంఠని ఎత్తుగడలోంచే రేకెత్తించే పద్ధతి కూడా ఒకటుంది. అంటే మొదటివాక్యంతోటే పాఠకుణ్ణి లేదా శ్రోతను ఆకట్టుకోవడం. దాన్ని narrative hook అంటారు. మొదటివాక్యం గాలంలాగా పాఠకుడి మనసుకి తగుల్కొన్నాక అతడు ఆ కథలోకి ప్రవేశించకుండా ఉండలేడు. అటువంటి ఎత్తుగడకి కొన్ని ఉదాహరణలు చూద్దాం:

మొదట, కథానిర్మాణంలో సుప్రసిద్ధుడు, సిద్ధ హస్తుడు చాసో రాసిన ‘కొండగెడ్డ’ కథ ఎత్తుగడ చూడండి.

కనబడ్డాడా ఇంజనీరు నాలుగు రోడ్ల మధ్య. నలుగురితో పంట నాశనమై మతితగలబడి వున్నాను. పశువులకి గడ్డైనా కాలేదు. వ్యవసాయం మదుపంతా బుగ్గిపాలైంది. గొడ్డూ గోదల్తో మళ్ళా పంటదాకా కాలం గడపాలి. ఋణాలకి దరఖాస్తులు పెట్టుకుని కాళ్లరిగేటట్లు తిరుగుతున్నాం. తక్కావీ ఋణాలు యిస్తామంటారు. దూతలు మా మొహాలు చూసి లంచాలు అడగలేరు. మేము ఇవ్వము. వాళ్ళు శాంక్షను చెయ్యరు’

ఈ మొదటి పేరాలో ‘కనబడ్డాడా ఇంజనీరు’ అనే వాక్యం తీసేసి మళ్ళా ఆ మొదటి పేరా చదవండి. అది చాలా మామూలు పేరాగా ఉంటుంది. ఆ పేరా చదవగానే పాఠకుడికి ఆ కథలోకి ప్రవేశించడానికి ఎటువంటి ఉత్సుకతా కలగదు. అది ఏదో వార్తాపత్రికలో రైతుల్ని ఇంటర్వ్యూ చేస్తే చెప్పుకున్న మాటల్లాగానే వినిపిస్తుంది. కానీ, ఆ మొదటి వాక్యం ఆ తక్కిన పేరాను సామాన్యమైన సంభాషణ నుంచి పైకి లేపింది. ఆ ఇంజనీరు ఎవరో, అతడు కనబడ్డంలో విశేషమేమిటో తెలుసుకోవాలన్న ఉత్సుకతతో పాఠకుడు ఆగకుండా ముందుకు చదువుకుంటూ పోతాడు.

మామూలుగా మనకు తెలిసిన విషయాలను లేదా మనకు అలవాటయిన విషయాలను కొత్తగానో మనకు ఇంతదాకా పరిచయం కాని రీతిలోనో మొదలుపెడుతూ మొదటి వాక్యం ఉందనుకోండి. అది కూడా పాఠకుల్ని ఆకట్టుకుంటుంది. ఇది ఒక విధమైన de-familiarization. విశ్వనాథ చిన్నకథల్లో మొదటివాక్యాలు సాధారణంగా ఇలా ఉంటాయి:

‘ఆషాఢస్య ప్రథమదివసమునందు మేఘము భాగ్యవంతుడయిన యక్షునకి గాక యందరకు గనబడునా? ఆషాఢము బహుళపక్షము వచ్చినను ఎండలు మండిపోవుచున్నవి..’ (జమీందారుని కొడుకు)

‘లక్ష్మణస్వామియు నూర్మిళయు మేనత్త మేనమామ బిడ్డలు. అసలా అమ్మాయి పేరు రామమ్మ. ఊర్మిళ యనే పేరు లక్ష్మణస్వామియే పెట్టినాడు..’ (భావనాసిద్ధి)

కొన్నిసార్లు మామూలు వాక్యాలే, కాని, అటువంటి వాక్యంతో కథ మొదలుపెడతారని మనం ఊహించనందువల్ల, ఆ ఎత్తుగడ చిత్రంగా తోచి కూడా మనం ఆ కథ వినడానికి ఉత్సాహ పడుతుంటాం. ఉదాహరణకి, తెలుగు కథాశిల్పుల్లో మేటి అని చెప్పదగ్గ రావిశాస్త్రి ‘మామిడి చెట్టు’ కథ ఎత్తుగడ చూడండి:

‘అయిదువందల చదరపు గజాల జాగాని వాపీకూప తటాక నిధి నిక్షేప ఆరామ సహితంగా కొనుక్కొని అందులో ఇల్లు కట్టించుకున్నారు నీలమణి గారు.’

ఇందులో ఆ ‘వాపీకూప తటాక నిధి నిక్షేప ఆరామ సహితంగా’ అనే మాట లేకపోతే ఆ మొదటివాక్యం చాలా మామూలు వాక్యం. కానీ,రచయిత ఆ మాటల్ని కేవలం తన వాక్యానికి వింతసోయగం కల్పించడానికి మాత్రమే వాడలేదు. అసలు ఆ కథంతా ఆ మాటలచుట్టూతానే తిరుగుతుంది. ఏదైనా క్రయవిక్రయాలు జరిగినప్పుడు కొనుక్కున్న ఆస్తికి చట్టసమ్మతి కలిగించడంకోసం దస్తావేజులు రాసేటప్పుడు ఆ మాటలు వాడతారు. నీలమణిగారు కొనుక్కున్న ఆ అయిదువందల గజాల్లో ఆయనకి సంక్రమించిన ఒకే ఒక్క ఆరామం ఒక మామిడిచెట్టు. దాని మీద తన ఆస్తిహక్కుని కాపాడుకోడం కోసం ఆ నీలమణి గారు ఎలా ప్రవర్తించేరో ఆ మామిడిచెట్టు నీడకోసం ఒక దిక్కులేని ముసలామె ఎలా పోరాటం చేసిందో అదంతా ఆ కథలో చూస్తాం. కానీ అదేమీ తెలియకుండానే మనం ఊహించని ఆ కథాప్రారంభానికి మనం ముగ్ధులమై ఆ కథలోకి అడుగుపెట్టకుండా ఉండలేం.

కొన్ని సార్లు సంభాషణతో కథ మొదటివాక్యం మొదలవుతుంది. అది కూడా ఒక ప్రశ్నతో. ఆ ప్రశ్నకి జవాబు ఏమిటా అని మనం అప్రయత్నంగా రెండవవాక్యం వైపు చూస్తాం. కథకచక్రవర్తి చింతాదీక్షితులు గారి ‘శిలాప్రతిమ’ కథ ఎత్తుగడ చూడండి: .

‘త్యాగం అంటే ఏమిటండీ?’అన్నాను భైరవశాస్త్రులు గారితో. భైరవ శాస్తుల్లుగారు అప్పుడే భోజనము చేసి అంగాస్త్రముతో చేతులు తుడుచుకుంటూ వచ్చి అరుగుమీద కూర్చున్నారు. రాత్రి ఎనిమిది గంటలయింది. ఆ సమయానికి ఆ చుట్టుపట్ల కాపురమున్న నేనూ యితర గృహస్థులూ భైరవశాస్తుల్లుగారి అరుగుమీద చేరి పిచ్చా పాటీ చెప్పుకోవడం అలవాటు. భైరవ శాస్తుల్లుగారికి కథలంటే మహా సరదా. ఏ ప్రశ్న అడిగినా ఆ ప్రశ్నకు సమాధానంగా ఒక కథ చెప్పుతూ ఉంటారు. ‘త్యాగం అంటేనా’ అని శాస్తుల్లుగారు ఒక మారు తేన్చికడుపు సవరించుకుని అంగాస్త్రం నడుం చుట్టూ తిప్పి మోకాళ్ళకింద కటిపర్యంక బంధం వేసుకుని ‘త్యాగం అంటేనా’ అన్నారు.

చూడండి. ఒక మామూలు ప్రశ్న. కానీ ఎంత ఉత్కంఠ రేకెత్తిస్తున్నాడో కథకుడు.

సంభాషణలతో కథలు ఎత్తుకోవడం కథనానికొక మౌఖికధోరణిని సంతరిస్తుంది. అది చెప్పబోయే కథకి విశ్వసనీయతను సమకూరుస్తుంది. కథకసార్వభౌముడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథల ప్రారంభాలు దాదాపుగా సంభాషణలతోనే మొదలవుతాయి.

‘పంతులూ, ఇక నువ్వు వెయ్యి చెప్పు, లక్ష చెప్పు, నౌకరీ కోసం సిఫార్సన్నమాట నా దగ్గర యెత్తకు. సబు జడ్జీగారు మా వియ్యంకులు కనుక నా మాట కొట్టెయ్యక పోవడం నిజమే. కాని నేను వ్రంతం పట్టాను. ఇదివరకి నన్నిందుకోసం చాలమంది ఆశ్రయించారు. అందరికీ యీ మాటే చెప్పాను. వారినందర్నీ నా వల్ల కాదని చెప్పి పొమ్మన్నాను. కాని నిన్ను పొమ్మనను. వెడితే నువ్వీ పనికోసం మరివకళ్ళ నాశ్రయిస్తావు. ఈ పట్టు పట్టు చివరికి స్కూలు మేస్టరీ అయినా సంపాదిస్తే గాని నువ్వు తృప్తిపడవు. నువ్వు నౌకరీ చెయ్యడం నాకు సుతరామూ యిష్టం లేదు.’ (మార్గదర్శి)

‘పక్కనే అంత గట్టుండగా ఏం పని సాయీబూ అదీ? నిక్షేపంలాంటి చెర్లోనే పుక్కిలించి వుమ్మేసుకోవాలా? మీకు మాత్రం యెంగిలి తప్పు కాదూ? కాండ్రించి కూడా-చెప్పిన కొద్దీ మరీనీ. పోనీ, నీ యిష్టం వచ్చినట్టు చేసుకో. ఎవళ్ళెంత చేసుకుంటే అంతా వాళ్ళే అనుభవిస్తారు. నాకేం?’ (ఇలాంటి తవ్వాయి వచ్చినట్టయితే)

కొన్నిసార్లు ఏదో ఒక లోకస్వభావాన్ని వివరిస్తున్నట్టుగా మొదటి వాక్యంతో మొదలుపెట్టి మనం ఊహించని విధంగా కథలోకి ప్రవేశపెట్టడం కొడవటి గంటి కుటుంబరావు పద్ధతి.’నువ్వులూ-తెలకపిండి’ కథ ఎట్లా మొదలుపెడతాడో చూడండి:

‘తెలకపిండి యెట్లా వస్తుందో అందరికీ తెలుసు. నువ్వులు అట్టే నాగరికత లేని సరుకు. అది పొలాల్లో కష్టజీవుల చేతుల్లో పెరిగి మధ్యతరగతి వాళ్ళకు అమ్ముడుపోయి బస్తీ చేరుతుంది. అక్కడ దాన్ని గానుగ ఆడి నూనె తీస్తారు. ఆ నూనె అందమైన సీసాలకూ, డబ్బాలకూ యెక్కి అనేక వంటిళ్ళను అలంకరిస్తుంది. తెలకపిండి చెక్కను నువ్వులొకవేళ చూసినా పోల్చుకోలేవు. అది గొడ్లకూ, పేదవాళ్ళకూ ఆహారమవుతుంది. నువ్వులు గానుగాడటం యేమంత గొప్ప విషయం కాదు. నేను మనుషుల్ని గానుగాడగా చూసాను. ఎందుకనో నాకా పద్ధతి రుచించలేదు.’

ఇక్కడ లోకసామాన్యమైన ఒక విషయాన్నిచెప్తూనే ఉన్నట్టుండి పాఠకుడి మీద గాలం విసిరాడు కథకుడు.

‘ఫోర్త్ డైమన్షన్’ కుటుంబరావు కథల్లో లోతైన కథ. ఆ కథ ఇలా మొదలుపెడతాడు:

రాజా కాస్సేపు సిగరెట్టు ధూపం సహాయంతో దీర్ఘంగా ఆలోచించి ‘మన సాహిత్యం అంతా బాగానే ఉందిగాని, దానిమీద ఐన్ స్టయిన్ ప్రభావం ఇంకా పడ్డట్టు కనిపించదు’ అన్నాడు.

తెలుగు సాహిత్యం మీద ఐన్ స్టయిన్ ప్రభావం పడటమేమిటో మన ఊహకి అందదు. ఇంక అదేమిటో తెలుసుకోడానికి మనం ఆ కథ ఆసాంతం చదవకుండా ఉండలేం.

ఎత్తుగడ అంటే మొదటి వాక్యం మటుకే కాదు. రెండవ వాక్యం కూడా. విశ్వనాథ సత్యనారాయణ రాసిన ‘చామరగ్రాహిణి ‘కథలో మొదటివాక్యం తరువాత రెండవ వాక్యం చూడండి:

‘శాలివాహన శకము నూటరెండవ సంవత్సరము. రోమునగరములో నానాడు పెద్ద గుంపులు గూడి యొక యింటి ముందు జనము సందడిగా నుండెను..’

మనం ఆ మొదటివాక్యం చదవగానే శాలివాహన శకంతో మొదలైన కథా ప్రదేశం భారతదేశానికి సంబంధించినందుగా ఉండి ఉంటుందనే సహజంగా అనుకుంటాం.కాని కథకుడు రెండవ వాక్యంలో రోము నగరానికి తీసుకుపోవడం మనకి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకట్లా చెప్పాడో తెలుసుకోడానికేనా మనం మొత్తం కథ చదవడానికి సిద్ధపడతాం.

ఎత్తుగడ మొదటి రెండు వాక్యాలకో లేదా మొదటి రెండు పేరాలకో సంబంధించింది కాదు. అది ఒక రకంగా కథకుడు తర్వాత చెప్పబోయే కథకి వేదిక, భూమిక, ప్రాతిపదిక కూడా. నిపుణుడైన కథకుడు, కథని ఎత్తుకుంటూనే దేశం, కాలం, పాత్రలు, వాళ్ళ స్వభావాలు, కథ మొదలయ్యే సమయం, మనఃస్థితి మొదలయినవన్నీ ఏదో ఒకరకంగా మనకి పరిచయం చెయ్యడం మొదలుపెడతాడు. తెలుగు కథాశిల్పుల్లో అగ్రేసరుడిగా చెప్పదగ్గ పాలగుమ్మి పద్మరాజు రాసిన ‘స్వధర్మం’ కథా ప్రారంభం చూడండి:

ఎర్రని కంకర దుమ్ము ఎండై మండుతూ లేచింది. ‘దాహం’ అంది సుబ్బులు. ఎర్రని కళ్ళతో నిద్రలో నోరు తెరుచుకుని ఆబగా గాలిని తాగుతోంది చిట్టి. ఇద్దరూ విశాలంగా పడుకున్నారు. ప్రయాణికులు దిగి కింద ప్లాట్ ఫారం మీద తచ్చాడుతున్నారు గనక కూర్చున్న బల్ల కాళీ అయింది. చొక్కా విప్పాడు. లోపలేదో పాకుతుంటే చేత్తో తడుముకున్నాడు. చెమటపురుగు. జేబులో డబ్బా కాగితాలూ కిందపడ్డాయి. రైలుపెట్టెలో తీసాడు. డబ్బు జేబులో పెట్టాడు. ఎర్రని రైల్వే పాస్ తడిసింది చెమటకి, కిటికీ దగ్గర ఆరబెట్టాడు. సిరా కొంచెం అక్షరాల నుంచి వెడల్పుగా పాకింది. అది చెరిగిపోతే మద్రాసు సెంట్రల్ లో ఏం గొడవపెడతారో! టి సి చదివాడు. స్పష్టంగానే ఉన్నాయి అక్షరాలు. ఫరవాలేదు. ‘సుబ్బారాయుడు-బుకింగ్ క్లార్క్-వైఫ్ సుబ్బలక్ష్మి 42-డాటర్ చిట్టి-5’ స్పష్టంగానే ఉన్నాయి అక్షరాలు.

మొదతి పది పదిహేను వాక్యాల్లోనే పాత్రల్నీ, కథా సందర్భాన్నీ, వాతావరణాన్నీ ఇంత వివరంగా చెప్పడం నిజంగా ఒక నేర్పు.

ఇటువంటి ప్రారంభానికి మరొక మేలిమి ఉదాహరణ, వేలూరి శివరామశాస్త్రిగారి ‘సులతానీ’కథ. ఆ కథా ప్రారంభం చూడండి: .

‘సులతానీ!’ ఈ పిలుపు ముగియక మునుపే సులతానీ పెదవుల మీద చిరునవ్వు పంచదార వలెను, లలాటమున బొమముడి అలచందపూవు వలెను కానిపించెను. తనను ఇటులు పిలిచిన శాంతయ్య కడకు వచ్చి అది ‘నీ భాంచను, నీ కాల్ మొక్త ‘ అసలు పేరున పిలవండి బాబయ్యా !’ అన్నది. అది యిటులు వేడుకొనగా శాంతయ్య కొంత శాంతస్వరముతో ‘నీ అసలు పేరు లోకులందరూ మరచిపోయారు సరే కాని, ఇవ్వేళ అదో మోస్తరుగా ఉన్నావు, చంకలో ఆ రైక ఏమిటి? బుజం మీద ఆ చీరేమిటి? ఏదో జరిగినటులుంది’అని ఆమెని తేరిపార జూచెను. దాని చేతిమీద కపోలముల మీద ఎర్రని కదుములు, లలాటము మీద మంకెన పూవు అతికించినటుల నెత్తురు, చూచిన శాంతయ్య కనులనిండ నీరు.’

అయితే ఇలా కథకు సంబంధించిన వివరాల్ని మనకు పరిచయం చేసేటప్పుడు సాధారణ వివరాల్ని ముందు పరిచయం చేసి కీలక వివరాల్ని నెమ్మదిగా పరిచయం చేసి రహస్య వివరాల్ని చివరకు పరిచయం చేయడం ఒక మెలకువ.

కథలో మొదటి సంఘటన

కథా ప్రారంభంలో ఎత్తుగడ ఒక భాగమైతే, మొదటి సంఘటన రెండవ భాగం. మొదటి సంఘటనతో కీలక కథ మొదలవుతుంది. అక్కణ్ణుంచి కథని మలుపు తిప్పే సంఘటన దాకా మరొక భాగం. కథాశిల్పం అంటే సంఘటనల్ని అమర్చే నైపుణ్యం అనుకుంటే మొదటి సంఘటనని ఎత్తుకోవడం ఎంతో శ్రద్ధతోనూ, జాగ్రత్తగానూ చెయ్యవలసి ఉంటుంది. ఆ సంఘటన కథకి కీలకమని మనకు స్ఫురించేలాగా చెయ్యడంలోనే కథకుడి ప్రజ్ఞ ఇమిడి ఉంటుంది.

మొదటి సంఘటన ఎక్కడ మొదలుపెట్టాలి? కథని ఎత్తుకుని, పాత్రలు, దేశం,కాలం మొదలైనవాటి గురించి కొంత స్థూలంగా పరిచయం చేసాక మొదలుపెట్టాలా? గొప్ప నైపుణ్యం కలిగిన కథకుడు ఎత్తుగడనీ,మొదటి సంఘటననీ కలిపే కథచెప్తాడనడానికి చాలా ఉదాహరణలున్నాయి.

తెలుగులో పరిపూర్ణ కథశిల్పంతో చెప్పిన మొదటికథగా ప్రసిద్ధి కెక్కిన ‘దిద్దుబాటు’ కథ చూడండి. గురజాడ మొదటి రెండు వాక్యాల్లోనే ఎత్తుగడనీ, మొదటి సంఘటననీ కలిపేసాడు.

‘తలుపు? తలుపు! తలుపు తెరవలేదు. గదిలోని గడియారం టింగుమని వొంటి గంట కొట్టింది. ‘ఎంత ఆలస్యం చేస్తిని! బుద్ధి గడ్డి తిన్నది. రేపట్నుంచి జాగ్రత్తగా వుంటాను. యాంటినాచల్లా పోయి సానిదాని పాట సరదాలో మనసు లగ్నవై పోయినది. ఒక్క పాట సరదాతోటి కుదరలేదు. పాడే మనిషి మీదక్కూడా మనసు పరిగెత్తుతూంది. లేకుంటే పోకిరి మనిషి వలె పాట ముగిసిన దాకా కూర్చోవడవేమిటి? ఏదో వక అవకాశము కలుగ చేసుకుని దానితో నాలుగు మాటలు ఆడడపు ఆసక్తి ఏమిటి? ఇదిగో లెంపలు వాయించుకుంటున్నాను. రేపట్నుంచి మరి పాటకు వెళ్లితే వొట్టు-(వొట్టు వేసుకోరాదు, అదో నియమం వొచ్చింది కదూ) మరి వెళ్ళను. నిశ్చయం. నిశ్చయం. గట్టిగా గాని పిలిస్తినట్టాయనా, కమలిని లేవగలదు. మెల్లిగ తలుపు తట్టి రాముణ్ణి లేపగలితినా చడిచప్పుడు లేకుండా పక్కజేరి పెద్దమనిషి వేషము వెయ్యవచ్చును.’

ఈ ప్రారంభం అనితరసాధ్యమైన కథా ప్రారంభం. ఇందులో కథాసందర్భం మాత్రమే కాదు, ఒక యుగసందర్భం కూడా రాసిపెట్టాడు కథకుడు. ఈ సందర్భంలో కన్యాశుల్కం నాటకం మొదటివాక్యం కూడా తలపుకి రాకుండా ఉండదు. ‘సాయంకాలవైంది’ అని మొదలవుతుంది ఆ నాటకం. ఆ సాయంకాలం, విజయనగరంలో బొంకులదిబ్బ దగ్గర సాయంకాలం మాత్రమే కాదు. పందొమ్మిదో మహాశతాబ్ది ముగింపుకి వచ్చిన సాయంకాలం కూడా.

ఎత్తుగడతోనే మొదటిసంఘటనని ముడిపెట్టిన మరొక ఉదాహరణ మల్లాది రామకృష్ణశాస్త్రిగారి ‘డు-ము-వు-లు’ లో చూడవచ్చు. ఆ కథ ఇలా మొదలవుతుంది:

‘ముందు ముందు ఎప్పుడో భారతం పదిహేను పర్వాలూ తెలుగులోకి రాయబోయే -తిక్కనసోమయాజుల్ని కనబోయే గుంటూరి కొమ్మన్నగారు-నిండు యౌవనం వచ్చీ రావడంతోనే -తండ్రితో పోట్లాట పెట్టుకున్నాడు!’

కొన్ని సార్లు కథకుడు  తన ఎత్తుగడతో మనకి గాలం వేసాక అప్పుడు మొదటిసంఘటన చెప్పడానికి ఉపక్రమిస్తాడు. శ్రీపాద ‘గులాబీ అత్తరు’ కథ లో లాగా. ఆ కథాప్రారంభం చూడండి:

‘ఒక్క అడుగు వేస్తే దివాన్జీ కనబడతాడు. అతగాడొక్కమాటు తమకేసి చూస్తే చాలునని ఆత్రపడుతూనూ, అతని కటాక్షం ఆశించీ, అతని అనుగ్రహం ఎదురుచూస్తూనూ, అతని ఆలంబనం నమ్ముకునీ, అతని చేత సరే అనిపించుకోడానికి తగ్గ యెత్తులాలోచించుకుంటూనూ, అయినా, అతని లోభగుణం మాత్రం లోపల్లోపల గర్హించుకుంటూనూ, ఆ గదిలో పరివేష్టించి వుండిన ఆశ్రితులూ, పౌరప్రముఖులూ, రాజబంధువులూ, రాజపురుషులూ, కొందరక్కడికే కనబడుతున్నారు. వారిలో కొందరు తనకేసిన్నీ చూశారు. అలాంటి చోట నుంచుని, మొదట వొక్ఖమాటు గదిలోకి తొంగిచూసి, తరవాత నిటారుగా నుంచుని, నుంచున్న వెంటనే తాపీగా రెండు చేతులూ చాపి, గభీమని బిరడా తీసి సీసా గాలివాటున పెట్టాడు షుకురల్లీఖాను, తల వెనక్కి విరుచుకుంటూ. బిరడా తీశాడు, అంతే, వెంటనే బిగించేశాడు. కాని ఆ క్షణ మాత్రానికే అతని చుట్టూ వుండిన జవానులు తుళ్ళిపడి మత్తెక్కుతున్నట్టయిపోయారు.’

ఇటువంటి ప్రారంభాల్ని తెలుగు కథల్లోనే కాదు, ప్రపంచ కథాసాహిత్యంలో కూడా వేళ్ళ మీద మటుకే లెక్కపెట్టగలం. ఇందులో పొదుపు ఉంది, విరుపు వుంది, మెరుపు ఉంది. జివ్వున ఒంట్లోంచి రక్తం ఒక్కసారి పైకి లేచే ఉత్కంఠ ఉంది.

కథా ప్రారంభం సమగ్రంగా ఉందని ఎప్పుడు చెప్పగలుగుతాం?

అయితే ఒక కథా ప్రారంభాన్ని పరిపూర్ణం, సమగ్రం అని ఎప్పుడు చెప్పగలమంటే, ఆ ప్రారంభంలోనే కథాసారాంశం తాలూకు సూచన కూడా ఇమిడి ఉండాలి. ఆ కథ మనం వినడం మొదలుపెట్టినప్పుడు, అక్కడ ఏదో సూచన ఉందని తెలియాలిగాని, అదేమిటో కథ పూర్తిగా చదివితే తప్ప అర్థం కాకూడదు. అప్పుడు కథ పూర్తయాక మనం మళ్ళా కథ మొదటికి వెళ్ళి మళ్ళా మరొకసారి చదవాలనుకుంటాం. కథా ప్రారంభంలో అటువంటి సూచన ఉండాలనేది ప్రాచీన అలంకారశాస్త్రాలు మరీ ముఖ్యంగా నొక్కి చెప్పేయి. ఎందుకని? ఎందుకంటే, అటువంటి సూచన కథ మొదట్లో ఉన్నందువల్ల, మనం ఆ కథకుడికి తాను చెప్పబోయే కథ పూర్తిగా తెలుసని నమ్ముతాం. ఆ కథ చెప్పడం ద్వారా అతడు తోటిమనుషులకు ఉపకరించే జీవితసత్యమేదో చెప్పబోతున్నాడని మనకి నమ్మకం కలుగుతుంది. ఆ కథకుడి పట్ల గౌరవం పెరుగుతుంది.

అటువంటి కథాప్రారంభానికి, ఒక ఉదాహరణ, విశ్వనాథ సత్యనారాయణ రాసిన ‘ఆద్యంతములు’కథ. ఈ కథని ఆయన ఇలా మొదలుపెట్టాడు:

‘ఆంగిరశ్శీలి మహర్షి. అనగా పెద్ద ద్రష్ట. మహర్షి యనుటతోడనే తపస్వి యనిగాని, మౌని యనిగాని యనుకొనరాదు. శమదమాదిగుణములకు దైవబుద్ధికి సంబంధము లేకుండ కొందరు ఋషులుందురు. వట్టి ద్రష్ట యను నర్థములోననే యర్థము చేసుకొనవలయును.’

ఈ మొదటి పేరాలోనే కథకుడు ఒక సూచన వదిలిపెట్టాడు. ఈ కథ ద్వారా అతడేమి చెప్పబోతున్నాడో మనం తెలుసుకోడానికి ఈ సూచన చాలదు. కాని  శమదమాది గుణాలు, దైవబుద్ధి లేని ఒక మహర్షి గురించి ఈ కథ ఏదో చెప్పబోతున్నదని మనకి ఒక ఊహ కలుగుతుంది. ఇక కథ అత్యంత ప్రగాఢమైన ఒక తాత్త్విక రహస్యానికి చెందిన కథ. సత్యం గురించీ, దైవం గురించీ, ఆస్తిక్యనాస్తిక్యాల గురించిన వివేచనకు సంబంధించిన గొప్ప కథ. కథ పూర్తయిన వెంటనే కథకుడు ఏమి చెప్తున్నాడో మనం వెంటనే అవగాహనకు తెచ్చుకోలేం. అప్పుడు మనకి కథా ప్రారంభంలోనే కథకుడు ఒక సూచన చేసాడని గుర్తొస్తుంది. మనం మళ్ళా మొదటికి వచ్చి, ఈ మొదటి వాక్యాలు చదువుతాం. ఈ వాక్యాల ఆధారంగా కథాసారంశాన్ని అర్థం చేసుకోగలుగుతాం. ఈ విధంగా కూడా ఈ కథకి ‘ఆద్యంతాలు’ అనే శీర్షిక పెట్టడంలో కూడా గొప్ప ఔచిత్యం కనిపిస్తుంది.

హెమింగ్వే కథ: బాగా గాలీ వెలుతురూ వచ్చే చోటు

అయితే కథాప్రారంభాలు అన్నిసార్లూ నాటకీయంగానూ, నివ్వెరపరిచేవిగానూ ఉండాలనిలేదు. కథా ప్రారంభం కథాసారాంశానికి అనుగుణంగా ఉండాలి. ఒకవేళ కథాసారాంశం నాటకీయతలేని జీవితానికి సంబంధించినట్లయితే, ఆ కథాప్రారంభం కూడా సాదాసీదాగానే మొదలుకావలసి ఉంటుంది. ఇందుకు ఉదాహరణగా హెమింగ్వే రాసిన ‘బాగా గాలీ వెలుతురూ వచ్చే చోటు’ అనే కథ చూద్దాం.

ఎర్నస్ట్ హెమింగ్వే రాసిన  A Clean, Well-Lighted Place (1926) అనే ఈ కథ మొదటి ప్రపంచ యుద్ధానంతర శూన్యాన్నీ, అర్థరాహిత్యాన్నీ శక్తిమంతంగా చిత్రించిన కథగా ప్రశస్తికెక్కింది.

ఈ కథని మనం సాంప్రదాయిక కథనప్రణాళికలో అంత తేలిగ్గా కుదించలేం. ఇందులో కథ మొదలయినప్పణ్ణుంచీ ప్రత్యేకంగా ఏదో ఒకటి జరగదు. ఆ మాటకొస్తే మనల్ని ఆకట్టుకునేలాగా, విభ్రాంతపరిచేలాగా, మనల్ని తీవ్ర ఉత్కంఠకి లోనుచేసేలాగా ఏదీ సంభవించదు. ఒక స్పానిష్ కేఫ్ లో ఒక చెవిటి వృద్ధుడు రాత్రి బాగా పొద్దుపోయేదాకా గడపాడనికి రావడం, అక్కడ అతణ్ణి కనిపెట్టుకోవలసిన ఇద్దరు వెయిటర్లు అతణ్ణి బరువుగా భావించడం ఈ కథ లో ముఖ్యాంశాలు. ఆ ఇద్దరు వెయిటర్లలో యువకుడికి భార్య ఉంది. అతడు తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటాడు. కాని మరో వెయిటరు వయసులో పెద్దవాడు, అతడు ఆ కేఫ్ మరికొంత సేపు తెరిచి ఉంచాలనుకుంటాడు. అట్లా గాలీ వెలుతురూ వచ్చే చోటు మరొకచోట దొరకడం అరుదని అతడికి తెలుసు. తక్కిన ప్రపంచం శూన్యంగా ఉండటం మాత్రమే కాదు, శుభ్రంగా ఉండదని కూడా అతడికి తెలుసు. బయటి ప్రపంచం కన్నా ఈ కేఫ్ లోనే గాలీ, వెలుతురూ ధారాళంగా వస్తాయని అతడికి స్పష్టంగా తెలుసు. అందుకనే ఆ వృద్ధుడు ఆ కేఫ్ లో అంతపొద్దుపోయేదాకా గడపడం అతడికి అర్థం చేసుకోదగ్గదిగానూ, అంగీకరించదగ్గదిగానూ కనిపిస్తుంది. అంతేకాదు, ఒక వ్యాఖ్యాత రాసినట్టుగా, ఆ కేఫ్ గాలీ వెలుతురూ ధారాళంగా వచ్చే చోటు మాత్రమే కాదు, మనుషులు మరింత మర్యాదగానూ, మరింత శుభ్రంగానూ గడపాలనుకునే చోటు కూడా.

ఏ విధంగా చూసినా, ఆ కేఫ్ లో ఉన్నదేదో ఇళ్ళల్లోనూ, వీథుల్లోనూ, కుటుంబాల్లోనూ, చివరికి పక్క దుకాణాల్లోనూ కూడా దొరికేది కాదు. కేఫ్ ఈ కథకి కేంద్ర బిందువు. అక్కడ గాలీ వెలుతురూ ధారాళంగా రావడం  ఆ కథకి ప్రాణం. యుద్ధానంతర ప్రపంచంలో మనుషులు వెతుక్కునే గాలీ, వెలుతురూ అటువంటి ఒక దుకాణంలో మటుకే దొరకడంలో ఒక విషాదం కూడా ఉంది. ఎందుకంటే, అది అంగడి. అక్కడ మనిషి ఇరవైనాలుగ్గంటలూ జీవించడానికి సాధ్యం కాదు. అక్కడ గాలీ వెలుతురూ దొరికినా అతడు ఇప్పుడో మరుక్షణమో అక్కణ్ణుంచి వెళ్ళిపోక తప్పదు. తాను నిజంగా కోరుకుంటున్నది ఇంత శుభ్రమైన గాలీ, ఇంత వెలుతురూ మాత్రమేనని, అతడికి ఇంట్లో కాక, అంగడిలో తెలియరావడమే ఈ కథాసారాంశం.

ఈ కథలో పరుచుకున్న శూన్యం, అర్థరాహిత్యం, ఒంటరితనం మనకి సూచనప్రాయంగా చెప్తూనే కథ మొదలవుతుంది. ప్రారంభ వాక్యాలు చూడండి:

‘బాగా పొద్దు పోయింది. కేఫ్ నుంచి అందరూ వెళ్లిపోయారు. ఒక్క వృద్ధుడు తప్ప. ఎలక్ట్రిక్ దీపపు వెలుతురులో చెట్ల ఆకులు పరుస్తున్న నీడల్లో అతడొక్కడూ కూర్చుని ఉన్నాడు. పగటిపూట ఆ వీథులో దుమ్ము రేగుతూ ఉంటుంది. కానీ రాత్రి అయ్యేటప్పటికి మంచుకి దుమ్ము అణిగిపోతుంది. బాగా పొద్దుపోయేదాకా కూర్చోవడమంటే ఆ వృద్ధుడికి ఇష్టం. ఎందుకంటే అతడికి చెవుడు. రాత్రి పూట ప్రశాంతంగా ఉండడంతో అతడికి ఆ తేడా తెలుస్తుంటుంది. ‘

ఇది చాలా సాధారణమైన ఎత్తుగడ. ఇందులో narrative hook ఏమీ లేదు. చాలా సాదా సీదా మొదలు. కానీ, కథ పూర్తయ్యాక మనం మళ్ళా మరొకసారి మొదటివాక్యాల దగ్గరికి రాకుండా ఉండలేం. ఎందుకంటే, కథ చివరికి ఎక్కడకి చేరుకుందో, అక్కడే కథ మొదలవుతున్నది కాబట్టి.

బాగా గాలీ వెలుతురు వచ్చే చోటు

బాగా పొద్దు పోయింది. కేఫ్‌ నుంచి అందరూ వెళ్లిపోయారు. ఒక్క వృద్ధుడు తప్ప. ఎలక్ట్రిక్‌ దీపపు వెలుతురులో చెట్ల ఆకులు పరుస్తున్న నీడల్లో అతడొక్కడూ కూర్చుని ఉన్నాడు. పగటిపూట ఆ వీథులో దుమ్ము రేగుతూ ఉంటుంది. కానీ రాత్రి అయ్యేటప్పటికి మంచుకి దుమ్ము అనిగిపోతుంది.

 బాగా పొద్దుపోయేదాకా కూర్చోవడమంటే ఆ వృద్ధుడికి ఇష్టం. ఎందుకంటే అతడికి చెవుడు. రాత్రి పూట ప్రశాంతంగా ఉండడంతో అతడికి ఆ తేడా తెలుస్తుంటుంది. కేఫ్‌లో ఉన్న ఇద్దరి వెయిటర్లకీ ఆ ముసలాయన కొద్దిగా తాగాడని తెలుసు.

అతడు మామూలుగా మర్యాదస్తుడే అయినప్పటికీ, మోతాదుమించి తాగితే డబ్బులు కట్టకుండానే వెళ్లిపోతాడని వాళ్లకు తెలుసు. అందుకని అతడిమీద ఓ కన్నేసి ఉంచారు.

‘పోయినవారం అతడు ఆత్మహత్య చేసుకోబోయాడు’ అన్నాడొక వెయిటరు.

‘ఎందుకని?’

‘అతడేదో బాగా దెబ్బ తిని ఉన్నందుకు’

‘దేనిగురించి?’

‘దేనిగురించీ కాదు’

‘అది దేనిగురించీ కాదని నీకెలా తెలుసు?’

‘అతడికి చాలా డబ్బుంది కాబట్టి’

రెస్టారెంటు తలుపుదగ్గర గోడకి ఆనుకుని వున్న బల్లదగ్గర కూర్చునిఉన్నారు వాళ్లు. అక్కడనుంచి టెర్రస్‌ కనబడుతూ ఉంది. అక్కడ బల్లలన్నీ ఖాళీగా ఉన్నాయి.

ఆ ముసలాయన కూర్చుని ఉన్న బల్ల ఒక్కటీ తప్ప. గాలికి మృదువుగా కదలాడుతున్న ఆకుల నీడల్లో కూర్చున్నాడతను. వీథిలో ఒక సైనికుడు, ఒక యువతి కలిసిపోతున్నారు. ఆ సైనికుడి చొక్కాకు తగిలించి ఉన్న ఇత్తడిబిళ్ల మీద వీథిదీపపు వెలుతురు పడుతూఉంది. ఆ యువతి తలమీద ఏమీ కప్పుకోలేదు. ఆమె అతడి పక్కనే వడివడిగా అడుగులు వేస్తోంది.

‘అక్కడ కాపలా కాసేవాడు అతణ్ణి పట్టుకుంటాడు’ అన్నాడొక వెయిటరు.

‘అతడికి ఏం కావాలో అది దొరికాక ఇంకేం సమస్యంట?’

‘అతడు వీథిలోంచి ఎంత తొందరగా వెళ్లిపోతే అంత మంచిది. ఆ కాపలా కాసేవాడు అతణ్ణి పట్టుకుంటాడు. వాళ్లు వెళ్లి ఐదునిమిషాలే అయింది.’

ఆ నీడలో కూర్చున్న ముసలతను సాసరు మీద గ్లాసుతో రాపాడించాడు. వెయిటరులలో కుర్రవెయిటరు అతని దగ్గరకు వెళ్లాడు.

‘ఏం కావాలి?’

ఆ ముసలాయన అతడికేసి చూస్తూ, ‘మరో బ్రాంది’ అన్నాడు.

‘మోతాదు మించిపోతోంది’ అన్నాడా వెయటరు. ఆ ముసలతను అతడికేసి చూశాడు. ఆ వెయిటరు అక్కడినుంచి కదలిపోయాడు.

‘చూడబోతే రాత్రంతా కూర్చునేటట్టే ఉన్నాడు’ అన్నాడు వెయిటరు తన సహచరుడితో. ‘నాకు నిద్ర వస్తోంది. రోజూ పడుకునేటప్పటికి మూడవుతోంది. ఈ ముసలాడు పోయినవారం ఆత్మహత్య చేసుకునుంటే బాగుండేది’.

వెయిటరు రెస్టారెంటు కౌంటరులోంచి మరో బ్రాందీసీసా, మరో సాసరూ తీసుకుని ముసలాడు కూర్చున్న బల్లదగ్గరకు వెళ్లాడు. అతడు గ్లాసు బల్లమీద ఉంచి, దానినిండా బ్రాందీ పోశాడు.

‘నువ్వు పోయినవారమే చచ్చిపోయి ఉండవలసింది’ అన్నాడా వెయిటరు ఆ చెవిటి మనిషితో. ఆ ముసలాడు తన చూపుడువేలు చూపిస్తూ, ‘ఇంకొద్దిగా పొయ్యి’ అన్నాడు.

వెయిటరు ఆ గ్లాసులో మరింత బ్రాందీ పోశాడు. అది గ్లాసు మీంచి కిందకు పొంగి పొర్లడం మొదలుపెట్టింది. ‘సంతోషం’ అన్నాడు ఆ ముసలాడు. వెయిటరు ఆ సీసా వెనక్కు తీసుకువెళ్లిపోయాడు. మళ్లా తన సహచరుడి దగ్గరకు పోయి బల్ల దగ్గర కూర్చున్నాడు.

‘ఇప్పటికతడు తప్పతాగేశాడు’ అన్నాడు.

‘అతడు ప్రతి రాత్రీ తప్పతాగుతూనే ఉన్నాడు.’

‘అతడు తననుతాను ఎందుకు చంపుకోవాలనుకున్నాడు?’

‘నాకెలా తెలుస్తుంది?’

‘ఎలా చంపుకోవాలనుకున్నాడు?’

‘ఉరేసుకోబోయాడు’

‘ఎవరు తప్పించారు?’

‘అతడి మేనకోడలు’

‘ఎందుకని?’

‘అతడు చావడం చూడలేక’

‘అతడికేమాత్రం డబ్బుందో?’

‘లెక్క లేనంత’

‘ఓ ఎనభై ఏళ్ల వయస్సుంటుందేమో కదా!’

‘ఆఁ ఎనభై ఉండొచ్చు’

‘అతడు ఇంటికి పోయుంటే బాగుండేది. మూడు గంటల్లోపు నేను నిద్రపోయింది లేదు. అది మనుషులు పడుకునే వేళేనా?’

‘అతడికి మెలకువగా ఉండటమంటే ఇష్టం కాబట్టి, పడుకోవడం లేదు.’

‘అతడంటే ఒంటరిగా ఉంటున్నాడు. నేను ఒంటరిగా లేనే! నాకోసం నా పక్కలో నా పెళ్లాం ఎదురుచూస్తూ ఉంటుంది.’

‘అతడికి కూడా ఒకప్పుడు పెళ్లాం ఉండేది.’

‘ఇప్పుడతడికి పెళ్లాం ఉండీ ఉపయోగం లేదు.’

‘ఆ మాట నువ్వెలా చెప్పగలవు?’

‘పెళ్లామే ఉంటే, అతడి జీవితం బాగుండేదేమో!’

‘అతడి మేనకోడలు అతడి బాగోగులు చూసుకుంటుంది. నువ్వే కదా చెప్పావు, ఆమెనే అతణ్ణి ఉరి వేసుకోకుండా కాపాడిందని.’

‘అవును’

‘నన్నడిగితే మనుషులు మరీ అంత ముసలాళ్లు కాకూడదనుకుంటాను. ముసలాళ్లని భరించడం కష్టం.’

‘మరీ అలా అనకు, ఈ ముసలాడు చూడు, ఎంత పరిశుభ్రంగా ఉంటాడో. ఒక్క చుక్క కిందపడకుండా తాగుతాడు. చిత్తుగా తాగేశాక కూడా. చూడతణ్ణి.’

‘నాకతణ్ణి చూడాలని లేదు. అతడు ఇంటికిపోతే బాగుణ్ణు. కష్టపడి పనిచేస్తేకానీ పొట్ట గడవడం వాళ్లను గురించి అతడు ఆలోచించడం లేదు.’

ఆ ముసలాడు తన చేతిలో ఉన్న గ్లాసు మీంచి దూరంగా వీథిలోకి చూశాడు. అప్పుడు మళ్లా వెయిటర్లకేసి చూశాడు.

తన గ్లాసుకేసి చూపిస్తూ, ‘మరో బ్రాందీ’ అన్నాడతడు. ఇంటికి పోవటానికి తొందర పడుతున్న వెయిటరు అతడి దగ్గరకి వెళ్లాడు.

‘అయిపోయిందా?’ అన్నాడతడు. చిత్తుగా తాగేసిన వాళ్లతోటో లేదా విదేశీయులతోటో మాట్లాడేటప్పుడు మనుషులు ఆచితూచి మాట్లాడినట్టే అతడు ‘ఈ రాత్రికి ఇక్కడితో ఆఖరు. ఇంక ఆపేసేయి’ అన్నాడు.

‘మరోటి’ అన్నాడు ఆ ముసలాడు.

‘లేదు. అయిపోయింది’ అని ఆ వెయిటరు ఒక గుడ్డతో బల్లఅంచు తుడుస్తూ, తల అడ్డంగా ఆడించాడు.

ముసలాడు లేచి నుంచున్నాడు. నెమ్మదిగా తను తాగిన గ్లాసులు లెక్కపెట్టుకున్నాడు. జేబులోంచి పర్సుతీసి బిల్లు చెల్లించాడు. కొంత టిప్పుకూడా అక్కడపెట్టాడు.

తడబడుతున్న అడుగులతోనే, కానీ, హుందాగానే వీథిలో నడిచి వెళుతున్న ఆ వృద్ధుణ్ణి వెయిటరు చూస్తూఉన్నాడు.

‘అతణ్ణింకా ఎందుకు తాగనివ్వలేదు నువ్వు?’ అని అడిగాడు మరో వెయిటరు. వాళ్లు తలుపులు మూసేస్తున్నారు. ‘ఇంకా రెండున్నర కూడా కాలేదు కదా!’

‘నాకు ఇంటికిపోయి పడుకోవాలని ఉంది’

‘ఓ గంటలో ఏమయిపోతుంది?’

‘ఆ గంట నాకు చాలా ముఖ్యం. అతడికి కాకపోవచ్చు.’

‘ఎవరికయినా ఒకటే గంట.’

‘నువ్వు కూడా ఓ ముసలాడిలాగా మాట్లాడుతున్నావు. ఏముంది అందులో? అతడు ఓ సీసా కొనుక్కొని ఇంటికి పోయి తాగొచ్చుకదా!’

‘అదీ ఇదీ ఒకటి కాదు.’

‘అవును’ అన్నాడు ఆ వెయిటరు.

‘అతడికి ఇంటి దగ్గర భార్య ఉంది. అతడు మరీ అన్యాయంగా ఆలోచించా లనుకోలేదు. అతడి సమస్యల్లా ఎంత తొందరగా ఇంటికి పోదామన్నదే.’

‘నీ సంగతేమిటి? మామూలు టైంకన్నా ముందే ఇంటికి పోవటానికి నీకు భయమేయటం లేదా?’

‘నువ్వు నన్ను అవమానించటం లేదు కదా!’

‘లేదు, ఊరికే సరదాకి అన్నానంతే.’

ఇంటికి తొందరగా పోవాలనుకుంటున్న వెయిటరు మెటల్‌ షెటర్‌లు కిందకి లాగేసి, పైకి లేస్తూ అన్నాడు, ‘నాకు నమ్మకం ఉంది. చాలా నమ్మకం.’

ఆ పెద్దవెయిటరు ఆ కుర్రవాడితో, ‘నీకు వయసుంది, నమ్మకముంది, ఉద్యోగముంది, నీకన్నీ ఉన్నాయి’ అన్నాడు.

‘మరి నీకేమిటి లేదు?’

‘అన్నీ ఉన్నాయి, పని తప్ప.’

‘నాకున్నవన్నీ నీకూఉన్నాయి కదా!’

‘లేదు. నాకు నీలాగా ఆత్మవిశ్వాసం లేదు. నేను నీలాగా యవ్వనంలో లేను.’

‘చాలు, చాలు. దా, తాళం వేసేద్దాం.’

‘నేను రెస్టారెంట్‌లో పొద్దుపోయేదాకా కూర్చోవాలనుకునే రకం. తొందరగా పడుకోవడానికి ఇష్టపడని రకాన్ని. రాత్రంతా దీపం వెలుగుతూ ఉండాలని కోరుకునే రకం నాది.’

‘నాకు తొందరగా ఇంటికిపోయి పడుకోవాలని ఉంది.’

‘మనిద్దరం వేరువేరు మనుషులం’ అన్నాడు ఆ పెద్ద వెయిటరు. అతడు ఇంటికి వెళ్లడం కోసం దుస్తులు మార్చుకున్నాడు. ‘ఇది కేవలం ఆత్మవిశ్వాసానికీ, యవ్వనానికీ సంబంధించిన విషయం మాత్రమేకాదు, కావటానికి అవి చాలా ముఖ్యమైనవే. కానీ ప్రతిరాత్రీ ఈ రెస్టారెంటుకి రావలసినవాళ్లు ఎవరైనా ఉంటారేమోనని తలుపులు మూసేయకుండా ఎదురుచూస్తూ ఉండాలని ఉంటుంది.’

‘దానికేముంది? రాత్రంతా తెరిచి ఉండే దుకాణాలుంటాయి కదా!’

నీకు తెలియటం లేదు. ఇది చాలా శుభ్రంగా, ఆహ్లాదంగా ఉండే రెస్టారెంటు. ఇక్కడ గాలీవెలుతురూ ధారాళంగా ఉంటాయి. ఈ కాంతిచూడు, ఎంత చక్కగా ఉందో! ఆకులు నీడలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి.’

‘మంచిది, వస్తాను’ అన్నాడు ఆ కుర్రవెయిటరు.

‘మంచిది’ అన్నాడు ఆ పెద్దవెయిటరు. లైటు తీసేసి తనతోతను మాట్లాడుకోవడం కొనసాగించాడు. వెలుతురు ఎలానూ ఉంటుంది, కానీ ఆ చోటుకూడా శుభ్రంగా, ఆహ్లాదంగా ఉండాలి. మనకేమీ సంగీతం అక్కరలేదు. నిజంగానే మనకి సంగీతంతో పనిలేదు. నువ్వొక బారుముందు మర్యాదస్తుడుగా నిలబడటం కష్టం, కానీ బారులో ఉన్నంతసేపూ దొరికేదదే.

అతడు దేనికి భయపడుతున్నాడు. అది భయమో, మరోటో కాదు. అదొక శూన్యం. దాని గురించి అతడికి బాగా తెలుసు. అదంతా ఒక శూన్యం. ఆ మనిషి కూడా శూన్యమే. కావలసిందల్లా ఆ శూన్యం, వెలుతురు, కొంత పరిశుభ్రత, కొంత పద్ధతి. కొంతమంది దాంట్లోనే ఉంటున్నప్పటికీ అదేమిటో వాళ్లకు అర్థంకాదు.

కానీ అది అదేమీ లేదనీ, నిజంగా ఏమీలేదనీ, మరేమీ కాదనీ, అదేంలేదనీ అతనికి తెలుసు. మనం ఏమీతనం. నీ పేరులో ఏమీలేదు. నీరాజ్యం ఏమీలేదు. నీకు నువ్వేమీ కావు. నువ్వేమీ కావు, ఎందుకంటే అదేమీలేదు. ఎందుకంటే, అదేమీకాదు కనుక. మాకు ఈ ఏమీలేనితనాన్ని ఇవ్వు. మా రోజువారీ ఏమీలేనితనం మరేమీలేనిది.

మనం ఏమీలేని, మనదంటూ ఏమీలేని, మనం ఏమీకాని మనం ఏమీకానితనంలోకి తీసుకువెళ్లద్దు. మమ్మల్ని ఈ ఏమీలేనితనం నుంచి, మరేమీలేనిదానినుంచి బయటపడేయి. ఏమీలేనిదాంతో పూర్తిగా నిండిన ఏమీలేనిదాన్ని ఏమీలేనిది వర్ధిల్లాలి. నీకంటూ ఏమీలేదు.

అతడు చిరునవ్వు నవ్వుకున్నాడు. ఒక బారుముందుకు పోయి నిలబడ్డాడు. అక్కడ కాఫీమిషన్‌ పొగలు కక్కుతూ ఉంది.

‘ఏమిటి సంగతి?’ అని అడిగాడు బార్‌మనిషి.

‘ఏమీలేదు’

‘మరో పిచ్చోడు’ అనుకుంటూ ఆ బార్‌మనిషి పక్కకు తిరిగిపోయాడు.

‘ఒక కప్పు’ అన్నాడు వెయిటరు.

బార్‌మనిషి అతడికి కప్పు అందించాడు.

‘ఇక్కడ వెలుతురు బాగా ఉంది. సుఖంగా కూడా ఉంది. కానీ శుభ్రంగా లేదు’ అన్నాడు వెయిటరు.

ఆ బార్‌మనిషి అతడికేసిచూశాడు, కానీ జవాబివ్వలేదు. అది మాటలు పొడిగించే సమయం కాదు.

‘ఇంకో కప్పు కావాలా?’ అని అడిగాడతడు.

‘వద్దులే’ అంటూ వెళ్లిపోయాడు వెయిటరు.

అతడికి బార్‌లూ, రెస్టారెంట్లూ అంటే ఇష్టంలేదు. పరిశుభ్రంగానూ, గాలీవెలుతులూ ధారాళంగా వచ్చే కేఫ్‌ అంటావా, అది వేరేసంగతి. ఇంకతడు మరింకేమీ ఆలోచించకుండా ఇంటికి పోతాడు. తన ఇంట్లో తన గదిలోకి పోయి పక్కమీద వాలిపోతాడు. తూర్పు తెల్లవారుతూనే అతడు నిద్రలోకి జారిపోతాడు. బహుశా తనది కూడా ఒకరకంగా నిద్రపట్టని జబ్బు అనుకుంటాడతడు. కాని ఆ జబ్బు చాలామందికి అవసరం.

అభ్యాసం

  • మీరు చదివిన కథల్లో మీరు మరవలేని కథాప్రారంభం ఏది?
  • కథని నాటకీయంగా మొదలుపెట్టడం లేదా నెమ్మదిగా కథలోకి ప్రవేశపెట్టడం- ఈ రెండింటిలో మీరు దేన్నిష్టపడతారు?
  • హెమింగ్వే కథని ఇలా కాక మరోలా మొదలుపెట్టవచ్చా?


2 Replies to “కథాశిల్పం-5”

  1. చాలా బాగా వివరించారు సార్.👌హెమింగ్వే కథ వేరే లాగా ప్రారంభించవచ్చు.లేట్ గా తాగుతున్న అతనితో కాకుంటే, బేరర్ ఊహలో ఉన్న భార్యతో ప్రారంభించవచ్చు.ఏమి చేస్తూ ఉంటుంది తను, ఈ రోజైనా కొంత మార్పు ఉంటుందా తన జీవితం లో రోజు లాగా 3 గంటలకేనా?…..ఇలాగా!ఇప్పుడు నెరేటివ్ హుక్ వస్తుంది.కానీ రచయిత చూపించింది వెలుగు కోరే జీవితాలు కాబట్టి ఆ మొదలు అతను ఎన్నుకున్నారు. అంటే ఊరికే రీడర్స్ మీదే ఆధారపడకుండా ఒక్కోసారి నిర్దాక్షిన్యంగా ఆట ల నుండే లాగుకొని పోయే తల్లి లాగా ముందు మనకు జరగబోయే జీవిత నడకను పరిచయం చేస్తున్నాడు…….ఎప్పటి కథ ఇది!!!!నాకు రంగనాథ్ గారు ,సినీ నటులు గుర్తుకు వచ్చారు.బహుశా చాలా మంది దారి ముందు ముందు అదేనేమో!కారణం లేకుండా చనిపోవడం.ఓకే కారణం భూమి మీద బ్రతుకడానికి కారణం దొరకక పోవడం!……..దిద్దుబాటు చూడండి.మొదటి వాక్యాలు ఇప్పటి గృహస్తులకు కూడా వర్తిస్తాయి.సమకాలీనమే గురజాడ రచనలను బ్రతికిస్తూ ఉంది తాజాగా!125 ఏమి కర్మ 250 ఏళ్ళు ఆయన గుర్తు ఉంటారు.ఇంకా మీ నుండి విశేషాలు తెలుసుకోవాలి అని ఉంది.మీరు వర్క్ షాప్ పెట్టేటప్పుడు తెలియ చేయండి .నమస్సులు 👌👌👌

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading