కథాశిల్పం-4

Prisoners of War(1989) by Igor Barkhatkov

కథా ప్రణాళిక

కథాశిల్పానికి నాలుగు స్తంభాలు అనుకుంటే,అవి: ఇతివృత్తం (theme), కథన క్రమం (plot), దృక్పథం (point of view), కథానిర్వహణ (కథనస్వరం, వాతావరణం, సన్నివేశ కల్పన, కాలం, పాత్రచిత్రణ, సంభాషణలు, వివరాలు, ఉత్కంఠ, శీర్షిక మొదలైనవి) అని చెప్పుకున్నాం.

అందులో మొదటగా, ఇతివృత్తం గురించి చర్చించాం. ఇతివృత్తం ఒక కొన సారాంశమయితే, మరొక కొన అది పాఠకుడిలో కలిగించే రసానుభూతి అని కూడా చెప్పుకున్నాం. ప్రతి ఇతివృత్తమూ నేరుగా కథ కాలేదనీ, ఏ ఇతివృత్తం పాఠకుడిలో రసానుభూతిని మేల్కొల్పగలదో దాన్ని మాత్రమే కథగా పరిగణించగలమని చెప్పుకున్నాం. కథకుడు తనకు కలిగిన స్పందనను పాఠకుడితో పంచుకున్నప్పుడు, పాఠకుడిలో ఒక రసానుభూతి కలిగినప్పుడు మాత్రమే అది కథగా నిలబడుతుందనీ,  రసానుభూతిని కలిగించని సందేశం కేవలం సమాచారంగా మాత్రమే మిగిలిపోతుందనీ కూడా చెప్పుకున్నాం. అంతిమంగా కథకుడు తనలో రేకెత్తిన ఒక స్పందనని పాఠకుడిలో రసానుభూతిగా మార్చగలగడమే కథాశిల్పమని కూడా చెప్పుకున్నాం.

కథా, కథనమూ

స్పందన రసానుభూతిగా ఎలా మారుతుంది? ప్రతి కథకుణ్ణీ కలవరపరిచే ప్రశ్న ఇది. జరిగిన విషయాన్నో, ఊహించిన విషయాన్నో చెప్పుకుంటూ పోతే అది కథగా మారదు. ఒక సంఘటన జరిగిందనుకుందాం. దాన్ని పత్రికల్లో విలేకరి పాఠకుల దృష్టికి తెచ్చినప్పుడు, అతడు ఆ సంఘటనలోని ముఖ్యాంశాల్ని ఒక వరసక్రమంలో చెప్తాడు. అలా చెప్పడంలో అతడి దృష్టి ఎంతసేపూ ఆ సంఘటనలోని వాస్తవాల్ని ఉన్నదున్నట్టు చెప్పడం మీదనే ఉంటుంది.

ఉదాహరణకి, ఈరోజు (18-5-2019) హిందూ పత్రికలో వచ్చిన ఈ వార్త చూద్దాం.

రాజీవ్ కుమార్ అరెస్టు మీద స్టే ఉత్తర్వుల్ని తొలగించిన సుప్రీం కోర్టు: బెంగాల్ ఐ పి ఎస్ ఆఫీసరుకు అప్పీలు చేసుకోడానికి వారం రోజులు మటుకే మిగిలి ఉంది. శారదా చిట్ ఫండ్ కేసులో నిందుతుడైన కోల్ కత్తా పోలీసు కమిషనర్ రాజీ కుమార్ ను అరెస్టు చేయకుండా అడ్డుపడుతూ ఇచ్చిన తన స్టే ఉత్తర్వులను శుక్రవారం నాడు సుప్రీం కోర్టు రద్దు చేసింది. తాము ఫిబ్రవరి 5 న శ్రీ కుమార్ కు ఊరటకల్పిస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు మరి వారం రోజులపాటు మాత్రమే అమల్లో ఉంటాయనీ, ఈలోపు ఆయన న్యాయపరమైన వెసులుబాటు పొందదలుచుకుంటే పోందవచ్చుననీ సుప్రీం కోర్టు పేర్కొంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయి అధ్యక్షతన సమావేశమైన ధర్మాసనం తదుపరి చర్య చట్టప్రకారం తీసుకొమ్మని సి బి ఐ కి  సూచించింది.

ఈ వార్తాకథనంలో వివరాలున్నాయి. ఆ వివరాలు కూడా వరస క్రమంలో ఉన్నాయి. ఈ వివరాల్లో ఒకింత నాటకీయత ఉన్నప్పటికీ, ఈ వార్త వినగానే, మనమొక సమాచారం తెలుసుకున్నామని గ్రహిస్తాం తప్ప, ఆ సమాచారం మనలో ఏ అనుభూతినీ మేల్కొల్పదు.

అలాకాక, ఒక వార్తను వార్తగా కాక, కొంత నాటకీయంగానూ, ఆశ్చర్యజనకంగానూ చెప్పే వార్తాకథనాలు కూడా లేకపోలేదు. ఉదాహరణకి, ఈ రోజు హిందూ పత్రికలోనే వచ్చిన మరొక వార్త చూడండి:

షాహుల్ హమీద్ తన్నొక ప్రసిద్ధ వ్యాపారవేత్తగా చెప్పుకుంటూ ఉంటాడు. అతడికి నెదర్లాండ్సు నుంచి ఒక మాస్టర్స్ డిగ్రీ ఉంది. స్పానిష్, ఫ్రెంచితో సహా ఆరుభాషలు మాట్లాడతాడు. అతడు  మలేషియాలో నడుస్తున్న ఒక హోటల్ నిర్వహణలో భాగస్వామి. వీటన్నిటితో పాటు అతడు రైల్లో దొంగతనాలు చేస్తుంటాడు కూడా. గత నాలుగేళ్ళుగా, అతడు తమిళనాడు, కేరళలో ప్రయాణించే ఎయిర్ కండిషన్డ్ రైళ్ళల్లో మహిళాప్రయాణీకుల్ని లక్ష్యంగా పెట్టుకుని అర్థరాత్రుళ్ళు వాళ్ళ నగానట్రా కాజేసేవాడు. కనీసం ముప్పై సార్లు అతడట్లా చోరీకి పాల్పడ్డాడు. 2016 నుంచి 2019 మధ్యకాలంలో ఈ రెండు రాష్ట్రాల్లోనూ మహిళా ప్రయాణీకులు తమ ఆభరణాల చోరీ గురించి ఇస్తూ వస్తున్న ఫిర్యాదులకి దిగ్భ్రాంతి చెందిన ప్రభుత్వ రైల్వే పోలీసు శాఖ ఒక ప్రత్యేక బృందాన్ని పరిశోధనకోసం నియమించింది. ఆ బృందం ఆయా రైళ్ళల్లో ప్రయాణించిన ప్రయాణీకుల రిజర్వేషన్ చార్టులు పరిశీలించి, దొంగతనాలు జరిగినట్టు నమోదైన అన్ని రైళ్ళల్లోనూ హమీదు ప్రయాణించినట్టుగా గుర్తించారు. ‘ఎ.సి కోచుల్లో మా నిఘా ని తీవ్రతరం చేసాం. మెట్టుపాళ్యం నుంచి బయల్దేరిన బ్లూ మౌంటెన్ ఎక్స్ ప్రెస్ లో మఫ్టీలో ఉన్న మా సిబ్బంది నిందితుణ్ణి పట్టుకోగలిగారు’ అన్నారు రైల్వే డి.ఐ.జి వి.బాలకృష్ణన్ హిందూ పత్రికతో. ఆయన చెప్పినదాని ప్రకారం, త్రిశూర్ కి చెందిన 39 ఏళ్ళ హమీద్ తనని పోలీసులు పట్టుకున్నప్పుడు, తాను గౌరవనీయుడైన వ్యాపారవేత్తనని చెప్పుకున్నాడు. కానీ, గట్టిగా ప్రశ్నించిన మీదట, తన నేరమయగతాన్ని ఒప్పుకోక తప్పలేదు. డి ఐ జి ఇంకా ఇలా చెప్పారు. ‘అతడు రైళ్ళు ఎక్కేముందు, తాంతో పాటు ప్రయాణించేవాళ్ళని ముఖ్యంగా మహిళల్ని క్షుణ్ణంగా పరిశీలించేవాడు. రాత్రుళ్ళు రెండుగంటలనుంచి నాలుగుగంటల మధ్యలో వాళ్ళ బాగులు తెరిచి వజ్రాలు, బంగారు నగలు, నగదు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఏవి దొరికితే అవి కాజేసి మళ్ళా ఆ బాగుల్ని యథాస్థానంలో పెట్టేసేవాడు. ‘ రైల్వే పోలీసు అధికారులు చెప్పినదాని ప్రకారం హమీదు తాను కాజేసిన దొంగసొత్తు త్రిశూరులోనూ, ముంబైలోనూ అమ్మేసి తిరిగి మళ్ళా కౌలాలంపూర్ కి వెళ్ళిపోయేవాడు. అక్కడ అతడు తన రెండవభార్యతో ఒక హోటల్ నిర్వహిస్తున్నాడు. తమతో భాగస్వామిగా ఉన్న మరొక వ్యక్తిని, అంటే మూడవమనిషిని, తమ వ్యాపారం నుంచి తప్పించడానికి అతడికి డబ్బు అవసరం కావడంతో మళ్ళా ఇక్కడికొచ్చి, దొంగతనం చేస్తూ పట్టుబడిపోయాడు.

ఈ కథనంలో వార్తావిశేషాలను ఉన్నదున్నట్టుగా వరసక్రమంలో చెప్పకుండా విలేకరి ఒక గడుసైన ప్రణాళికని అనుసరించాడు. అతడు మొదటగా హమీద్ అనే అనే వ్యక్తి గురించిన గౌరవనీయ వివరాల్ని పరిచయం చేస్తూ, అప్పుడు, రెండవ పేరాలో, ‘అతడు రైల్లో దొంగతనాలు చేస్తుంటాడు కూడా’ అని చెప్పి మనల్ని ఆశ్చర్యపరిచాడు. ఆ వాక్యంతో ఈ వార్తాకథనం ఒక మలుపు తిరిగింది. మనం హమీద్ అనే ఆ వ్యక్తి గురించి మరింత తెలుసుకోవాలనే ఉత్కంఠకి లోనవుతాం. ఆ తర్వాతి కథనం తప్పకుండా చదవకుండా ఉండలేం.

కానీ, ఈ కథనం మొదటి వార్తాకథనం కన్నా ఎక్కువ నాటకీయంగానూ, ఎక్కువ ఉత్కంఠభరితంగానూ ఉన్నా కూడా ఇది మనలో ఆశ్చర్యాన్ని రేకెత్తించిందే గాని, ఆ ఆశ్చర్యాన్ని ఒక రసానుభూతిగా మార్చలేకపోయింది. హమీద్ అనే ఆ వ్యక్తి పట్ల మనకి కుతూహలం అయితే కలిగింది గాని, అది అతడి పట్ల జాలిగానో, ఏహ్యతగానో మారలేదు. మనకి అందిన సమాచారం అతడి స్థితితో మనకి ఎటువంటి తాదాత్మ్యతనీ కలిగించలేదు.

ఇంటర్వ్యూ: గోపాల్ బరాథం కథ

ఇప్పుడిక్కడ పొందుపరిచిన ‘ఇంటర్వ్యూ ‘కథ చూడండి. గోపాల్ బరాథం (1935-2002) అనే సింగపూర్ రచయిత రాసిన కథ ఇది.

ఇది కూడా ఒక నేరస్థుడి గురించి ఒక పాత్రికేయుడు చెప్పిన కథనే. అది కూడా పత్రికారచన తరహాలో ఇంటర్వ్యూ చేసి చెప్పిన కథ. ఇందులో బ్రిగేడియర్ మేసన్ యుద్ధ నేరస్తుడేగాని, నిజానికి నేరం చేసినవాడు కాడు. పొరపాటు సమాచారంవల్ల నేరస్తుడిగా అనుమానించబడి పట్టుబడ్డవాడు. తాను చెయ్యని నేరాన్ని ఒప్పుకోడానికి జైల్లో చిత్రహింసలకి గురైనవాడు. అతణ్ణి విచారించడానికి వచ్చే జపాన్ సైనికాధికారి మసహిరో నే నిజానికి నేరస్తుడు. ఎందుకంటే, అతడు ఒక నిర్దోషిని చెయ్యని నేరానికి హింసించాడు. కాని దాన్ని సభ్య సమాజం నేరం అనదు. ఉద్యోగ బాధ్యత అంటుంది. కాని సరిగ్గా తన బాధ్యతలు తాను సరిగ్గా నిర్వహించినందుకే, యుద్ధం పూర్తయి, జపాన్ ఓడిపోయాక, మసహిరొని యుద్ధనేరాలకు గాను విచారించి మరణ శిక్ష విధించి ఉరి తీసేసారు. మసహిరొ తన బాధ్యతల్లో భాగంగా బ్రిగేడియర్ మేసన్ ని విచారించేటప్పుడు, అతణ్ణి మానసికంగా చిత్రహింసకి గురిచేసే ప్రక్రియలో భాగంగా అతడికి ‘మరణశిక్ష ‘ విధించి దాన్ని అమలు చేసినట్టు నటించాడు. కానీ, మరణశిక్ష నిజంగా అమలయ్యింది మసహిరోకి.

నేరం, విచారణ, శిక్ష అనేవి ఒక దేశ శిక్షాస్మృతి, న్యాయస్మృతి ప్రకారం చూసినా కూడా ఎంతో వివాదాస్పదమైన విషయాలు. ఉదాహరణకి, ఒకడు తన ఆకలిబాధ తీరడానికి అన్నం దొంగతనం చేసాడనుకోండి. అతడికి చట్టం ప్రకారం శిక్ష తప్పదు. కాని, అతణ్ణి దొంగతనానికి పురికొల్పిన పరిస్థితుల్ని సృష్టించిన సమాజమే నిజమైన నేరస్తురాలని వాదిస్తూ మనమెన్నో కథలు చదివాం. అటువంటిది, రెండు దేశాల మధ్య యుద్ధంలో భాగంగా, ఒక దేశానికి చెందిన సైన్యం మరో దేశానికి చెందిన పౌరుణ్ణి నేరస్థుడిగా భావించి విచారించడం, చిత్రహింసలు పెట్టడం, తీరా తమ దేశం ఓడిపోగానే తామే నేరస్తులుగా శిక్షకి గురి కావడం. ఇక్కడ శాశ్వత, సార్వకాలిక శిక్షా స్మృతి అంటూ ఏదీ లేదు. యుద్ధంలో జయాపజయాలు తారుమారుకాగానే నేరస్తులు కూడా తారుమారైపోయారు.

ఇంత సంక్లిష్టమైన విషయంలో మరింత సుందరమైన, మానవతామధురమైన సందేశం మరొకటుంది.అదేమంటే, బ్రిగేడియర్ మేసన్ కీ, అతణ్ణి హింసించిన మసహిరొ కి మధ్య వాళ్ళిద్దరికీ తెలియకుండా ఏర్పడ్డ ఒక మానసికానుబంధం. ఇది పీడకుడికీ, పీడితుడికీ మధ్య ఏర్పడే మానసికానుబంధంగానే మొదలయినప్పటికీ, చివరికి వచ్చేటప్పటికి, ఆ పరిమితులు దాటి మరింత ఘనిష్టమైన మానవానుబంధంగా మారడం మనల్ని చకితుల్ని చేస్తుంది. బ్రిగేడియర్ మేసన్ ని హిసించడంలో భాగంగా అతడికి మరణశిక్ష విధించినట్టుగా నాటకం ఆడినప్పుడు, అతడి కళ్ళల్లో చూసిన ధైర్యం, మృత్యువు ఎదట అతడు కనబరిచిన నిర్లిప్తత, మసహిరో దృష్టిలో అతణ్ణొక వీరుడిస్థాయికి తీసుకుపోయాయి. అందుకని, తనకి మరణశిక్ష విధించినప్పుడు, తాను ఉరికంబం ఎక్కినప్పుడు, తన ధైర్యం కోల్పోకుండా ఉండటానికీ, మృత్యువును నిర్లిప్తంగా ఎదుర్కోడానికీ, ఆ క్షణంలో తన ఎదట బ్రిగేడియర్ మేసన్ ఉండాలని మసహిరొ కోరుకున్నాడు.

కాని తనది ధైర్యం కాదనీ, తనని మృత్యువు కబళించనందుకు తాను చాలా నిరుత్సాహానికి లోనయ్యాననీ, అది మసహిరొకి చెప్పిన అర్థం కాదనీ, అందుకని తాను అతడు మరణశిక్ష పొందే సమయంలో అతడి దగ్గర ఉండటానికే సిద్ధపడ్డాననీ అంటాడు బ్రిగేడియర్ మేసన్.

నేరానికీ, విచారణకీ, చిత్రహింసకీ, శిక్షకీ సంబంధించి ప్రపంచ సాహిత్యంలో వచ్చిన అత్యుత్తమ కథల్లో ఈ కథ అగ్రశ్రేణిలో ఉండే కథ అని మనం గుర్తుపడతాం. ఈ కథ చదువుతున్నంతసేపూ మనమొక అనిర్వచనీయ ఉద్వేగానికి లోనవుతాం. మృత్యువు ఎదట, (తనదీ, తన పీడకుడిదీ కూడా) బ్రిగేడియర్ మేసన్ కనపరిచిన ధీరోదాత్తత మనకొక గంభీరమైన రసానుభూతిని కలిగిస్తుంది. మొదట్లో వీరత్వంగా వికసించి, చివరికి కరుణగా మారి, అంతిమంగా ఒక శాంత రసానుభూతి మనలో మేల్కొనడం మనం గమనిస్తాం.

కథ ఒక్కటే, కథనాలు వేరు వేరు

మొదటి వార్తాకథనం వట్టి సమాచారం మటుకే. రెండవ వార్తాకథనంలో సమాచారంతో పాటు కొంత నాటకీయత కూడా ఉంది. ఇన్యంలో పనిచేసిన ఒక సైనికాధికారిని యుద్ధ నేరాలకు గాను ఉరితీసినప్పుడు, ఆ అధికారి తాను ఒకప్పుడు విచారించి, హింసించిన ఒక సింగపూర్ పౌరుడు తన శిక్ష అమలయ్యే సమయంలో తన పక్కన ఉండాలని కోరుకున్నాడనేది మూడవకథలో వార్త. కానీ, ఈ మూడవ కథ కేవల వార్తాకథనం స్థాయిని దాటి, ఒక కళాకృతిగా వికసించి,పాఠకుడికొక అపురూపమైన రసానుభూతిని కలిగించేదిగా మారిపోయింది.

ఎందువల్ల? ఎక్కడుందీ రహస్యం?

ఇందుకు జవాబు ఒక్క మాటలో చెప్పాలంటే, కథనక్రమం వల్ల అని చెప్పాలి. కథన క్రమం అంటే, జరిగిన సంఘటనని జరిగిన క్రమంలోనే జరిగింది జరిగినట్టే చెప్పుకుపోడం కాకుండా, ఆ జరిగిందాన్ని తిరిగి ఎలా చెప్తే పాఠకుడు స్పందిస్తాడో అలా చెప్పడం వల్ల. అంటే కథ చెప్తున్నప్పుడు, ఆ కథతో పాటు, ఒక అమరిక కూడా వచ్చి చేరిందన్నమాట. జరిగిన సంఘటనలని తిరిగిచెప్పడంలో కనిపించకుండా ఒక ప్రణాళిక దాగి ఉందన్నమాట.

ఆ ప్రణాళికనే మనం plot అంటాం. Plot అనే ఇంగ్లీషు పదానికి ‘ప్రణాళిక ‘ అనే అర్థంతో పాటు ‘పన్నాగం ‘ అనే అర్థం కూడా ఉంది. కథన ప్రణాళిక నిజానికి ఒక పన్నాగం కూడా. ఏమి చేస్తే, ఎలా చెప్తే, తాను అనుభవించిన మనఃస్థితిని పాఠకుడికి కూడా అనుభవంలోకి తేగలమనే ఒక పన్నాగం. ఒక వ్యూహం.

తెలుగులో కథాశిల్పం మీద ఇంతకు ముందు రాసిన రచయితలు, ‘దృక్పథా ‘నికి ఇచ్చిన ప్రాముఖ్యాన్ని ‘ కథన ప్రణాళిక ‘కి ఇవ్వలేదు. అసలు వారికి కథన ప్రణాళికకీ, కథకీ మధ్య ఉన్న తేడా స్పష్టంగా తెలిసినట్టు లేదు. సాహిత్య అకాదెమీ పురస్కారం పొందిన తన రచనలో వల్లంపాటి వెంకటసుబ్బయ్య plot ని ‘కథాసౌష్టవం ‘అని అనువదించాడంటేనే ఈ అంశం మీద మన విమర్శకుల పరిజ్ఞానం ఏపాటిదో మనం అర్థం చేసుకోవచ్చు.

కథా, కథా ప్రణాళికా

కాని, కథ వేరు, కథనం వేరు అనే మెలకువలోంచే గత నలభయ్యేళ్ళుగా narratology వికసిస్తూ ఉంది. అసలు కథనం నుంచి కథను వేరుచెయ్యలేమనీ, ప్రతి కథనమూ అంతిమంగా ఒక వ్యూహమేననీ, మనం మామూలుగా వినే టెలివిజన్ వార్తల్లోనూ, పత్రికల హెడ్ లైన్లలోనూ కూడా నిష్పాక్షిక వాస్తవమంటూ ఏదీ ఉండదనీ, ప్రతి ఒక్క వార్తా కూడా ఏదో ఒక సంస్థ, రాజకీయ-ఆర్థిక శక్తి తన ప్రయోజనాలకోసం మనల్ని నమ్మించడానికి వినిపిస్తున్న కథనమేననీ ఇప్పుడు ప్రపంచానికి మెలకువ కలిగింది. కేవలం వార్తలు మాత్రమే కాదు, శాస్త్రీయ పద్ధతిలో ప్రపంచాన్నీ, ప్రపంచగతినీ వివరిస్తున్నాయని చెప్తున్న సామాజిక సిద్ధాంతాలు కూడా తటస్థ సత్యాలు కావనీ, మహాకథనాలు మాత్రమేననీ తెలిసిరావడంతో, మన సామాజిక శాస్త్రాల్లో కూడా ఒక narrative turn సంభవించింది.

ఒక కథలో జరిగిన సంఘటనల క్రమం, అవి ఏ కాలక్రమంలో జరిగాయో అదే కాలక్రమంలో చెప్పుకోవడం కథ. కానీ, ఆ సంఘటనల్ని మనకొక కథకుడు చెప్తున్నప్పుడు అతడు వాటిలో కొన్నిటిని మరుగుపరుస్తాడు. కొన్నింటిని ముందుకు తీసుకొస్తాడు. కొన్నిటిమీద ఎక్కువ ఊనిక పూనుతాడు. కొన్నిటిని మనం  అప్రధానం అనుకునేలాగా చేస్తాడు. ఒక్కొక్కసారి చాలా చిన్నపాటి వివరం చెప్పేటప్పుడు కూడా బిగ్గరగానూ, చాలా ముఖ్యంగానూ మాట్లాడతాడు. కొన్నిసార్లు చాలా పెద్ద పెద్ద విశేషాలు కూడా ఏమంత ముఖ్యంకాదన్నట్టు ఒక్కమాటలో కొట్టిపారేస్తాడు. ఒక కథని ఇట్లా కథకుడు తన ప్రయోజనాలకు అనుగుణంగా మనకు తిరిగి చెప్పటాన్ని discourse అంటున్నారు.

Story, Discourse

ఒక కథలో సంఘటనల వాస్తవ క్రమం కథ. ఆ క్రమాన్ని కథకుడు తన ఉద్దేశ్యాలకు అనుగుణంగా తిరిగిచెప్పడంలో రెండు భాగాలున్నాయి. అవి ఒకటి, కథన ప్రణాళిక లేదా కథన క్రమం (plot), రెండోది, కథనం (narrative). ఈ రెండూ, అంటే, కథనం, కథనప్రణాళిక కలిపి discourse అవుతుంది.

ఇందులో plot అనే పదం అతి పురాతనకాలం నుంచీ, అంటే అరిస్టాటిల్ కాలం నుంచీ వాడుకలో ఉన్న పదం. ఈ పదం దాదాపుగా పడికట్టు పదంగా మారిపోయిందని భావిస్తూ, ఇప్పటి narratologist దాదాపుగా ఈ పదాన్ని పరిహరించడానికే ఇష్టపడుతున్నాడు. కాని, ఈ పదం లేకుండా కథనశాస్త్రాన్ని మనం అర్థం చేసుకోలేమని భావిస్తూ, దాన్ని దాని పడికట్టువాసనలనుంచి బయటపడేయడానికి మరికొంతమంది ప్రయత్నిసూ ఉన్నారు. ఆ క్రమంలో, plot కి మూడు రకాల అర్థాలు సూచిస్తున్నారు.

మొదటి అర్థంలో, plot కథతాలూకు అస్థిపంజరం. దాని చుట్టూ కథనం రక్తమాంసాలు చేర్చినప్పుడు అది సర్వాంగ సుందరమైన కథగా మారుతుంది. కథ తాలూకు అంతర్గత నిర్మాణంగా ఉన్న plot మానవశాస్త్రజ్ఞుల దృష్టిలో సార్వత్రికమైన ఒక అమరిక. దేశాల, జాతుల హద్దులు దాటి ప్రతి చోటా కనిపించే ఒక ప్రాకృతికమైన అమరిక. వినిర్మాణ వాదుల దృష్టిలో, plot సార్వత్రికం కాదు, సాంస్కృతికం.

రెండవ అర్థంలో, plot అంటే కేవలం ఒక అంతర్గత నిర్మాణం మాత్రమే కాదు, దాన్ని ఒక వరసలో పెట్టి చెప్పే ఒక ఉద్దేశ్యం కూడా. అరిస్టాటిల్ plot ని ఒక ఉద్దేశ్యపూరిత కథనంగానే పరిచయం చేస్తున్నాడు. ప్రతి కథకీ ఒక  ఆది, ఒక మధ్యం, ఒక అంతం ఉంటాయన్నప్పుడు, ఆ ఆదినుంచి అంతానికి ప్రయాణించే క్రమంలో, కథకుడు ఒక భవిష్యదర్థాన్ని దృష్టిలో పెట్టుకునే కథ చెప్తాడని అరిస్టాటిల్ భావించేడు. ఒక్క మాటలో చెప్పాలంటే, సంఘటనల్ని కథగా మార్చడమే కథన ప్రణాళిక అని అతడు ప్రతిపాదిస్తున్నాడు.

మూడవ అర్థంలో, plot ఇంతకన్నా మరింత సూక్ష్మమైంది. అరిస్టాటిల్ చెప్పినదాని ప్రకారం, plot కథని నిర్మిస్తుంది. కాని,మూడవ అర్థంలో, plot కథని బయలుపరుస్తుంది. అంటే కథన ప్రణాళిక కథకి ఒక వ్యాఖ్యానంగా మారుతుంది. అది సంఘటనల్ని పాత్రల రూపంలో, వారి మధ్య సంభవించే పరివర్తనలరూపంలో వారి ఉద్దేశ్యాల్నీ, గుణగణాల్నీ మనకు తేటతెల్లం చేసుకుంటూ పోతుంది. కానీ, నిజానికి, ఇది కూడా కొత్త భావన ఏమీ కాదు. ఒక నాటకంలొ పాత్ర స్వభావం ఆ పాత్ర చేసే పనుల ద్వారానే బహిర్గతం అవుతుందని అరిస్టాటిల్ చెప్తున్నదిదే.

కాబట్టి పై మూడు నిర్వచనాల్నీ కూడా మనం ఒక నిర్వచనంగా మార్చుకోవచ్చు. అదేమంటే,  సార్వత్రిక నిర్మాణాలకో, సాంస్కృతిక నిర్మాణాలకో అనుగుణంగా వివిధ సంఘటనల్ని గుదిగుచ్చి చెప్పడం ద్వారా  వాటిలోని అంతర్గత విశేషాలను తేటతెల్లం చేస్తూ, వాటిని ఒక కథగా మార్చడమే కథన ప్రణాళిక.

కథా ప్రణాళిక

ప్రాచీన ఆలంకారికులు కథలు ఏ ప్రణాళిక ప్రకారం చెప్పాలో రాయలేదు. వారు ప్రధానంగా నాటకశిల్పం గురించి మటుకే చర్చించారు. అరిస్టాటిల్ రాసిన Poetics, భరతముని రాసిన ‘నాట్యశాస్త్రం ‘రెండూ కూడా నాటక కళ గురించిన సూత్రాల్ని ప్రతిపాదించాయి. కాని నాటకానికి కూడా మౌలికంగా ఒక కథ తప్పని సరికాబట్టి వాళ్ళు నాటకం గురించి చేసిన చర్చ కథాశిల్పానికి కూడా వర్తించేదే. కానీ సరిగ్గా ఇక్కడే ఆలంకారికులు మాట్లాడుతున్న దానికీ, ఇప్పటి narratologists మాట్లాడుతున్నదానికీ మధ్య ఒక కీలకమైన భేదం ఉంది.

Narratologists ఏ కథనంలోనైనా బహిరంగంగానో, నిగూఢంగానో ఒక ఉద్దేశ్యం ఉంటుందని భావిస్తారు. ఆ ఉద్దేశ్యం వారి సామాజిక-రాజకీయ ప్రయోజనాల్ని నెరవేర్చేదిగా ఉంటుందని కూడా చెప్తున్నారు. కాని ఆలంకారికులు చెప్పేదేమంటే, ఒక సంఘటన క్రమాన్ని కథగా మారుస్తున్నప్పుడు కథకుడి ప్రధాన ప్రయోజనం పాఠకుడిలో లేదా శ్రోతలో లేదా ప్రేక్షకుడిలో రసానుభూతి కలిగించడం అని. రసానుభూతి కలిగించడం ప్రధాన ప్రయోజనంగా ఉన్నప్పుడే ఆ కథ లేదా ఆ నాటకం కళగా మారుతుంది.

అరిస్టాటిల్ చెప్పిన దాని ప్రకారం కథకి ఆదిమధ్యాంతాలు ఉండాలి. వాటి సమగ్రత మీద నాటక కళ ఆధారపడి ఉంటుంది. అతడు చెప్పిన దాని ప్రకారం కథ ఒక రేఖీయగమనంలో ముందుకు సాగుతుంది. కథ మొదలై చివరికి వచ్చేటప్పటికి ఒక పరివర్తన సంభవిస్తుంది. అయితే, సంఘటనలు ఆదిమధ్యాంతాలతో ఒక సమగ్రకథనంగా కుదురుకున్నంతమాత్రాన ఆ కథనం శ్రోతలో రసానుభూతి కలిగిస్తుందని చెప్పలేం. ఆ సంఘటనలు రసానుభూతిని మేల్కొల్పడానికి ముందు పాఠకుడిలో ఒక ఉత్కంఠ రేకెత్తించవలసి ఉంటుంది. అలా ఉత్కంఠ రేకెత్తే విధంగా సంఘటనల్ని అమర్చే ఒక క్రమాన్ని భారతీయ నాటకవేత్తలు వివరించారు. క్రీ.శ.10 వ శతాబ్దానికి చెందిన ధనంజయుడు తన ‘దశరూపకం ‘లో ఈ క్రమాన్నిట్లా వివరించాడు.

ఒక కథ చెప్పడం మొదలుపెట్టిన తర్వాత, పాఠకుడి ఉత్కంఠ తీవ్ర స్థాయికి చేరే సన్నివేశమే పతాక. పతాక సమయంలో నాటకీయత ప్రగాఢంగా ఉంటుంది. అక్కణ్ణుంచి పాఠకుడి ఉత్కంఠని నెమ్మదిగా సమాధానపరుస్తూ కథని ముగించవలసి ఉంటుంది.

అరిస్టాటిల్ చెప్పిన కథా ప్రణాళికను, ధన్మజయుడి పద్ధతిలో, ఫ్రేటాగ్ అనే ఒక జర్మన్ సాహిత్యవేత్త ఒక పిరమిడ్ రూపంలో ప్రతిపాదించాడు. ఆ పిరమిడ్ ని ఇలా చూపించవచ్చు.

అరిస్టాటిల్, ధనంజయుడు, ఫ్రేటాగ్ ముగ్గురూ వివరించినదాన్ని బట్టి కథా ప్రణాళికని మనం స్థూలంగా ఇలా చిత్రించవచ్చు.

ఇందులో అయిదు దశలున్నాయి. మొదటిది, కథ ఎత్తుగడ. రెండవది, మలుపు. మూడవది, ముగింపు. నాలుగవది, ఎత్తుగడనుంచి మలుపు దాకా చెప్పే కథనం, అయిదవది, మలుపు నుంచి ముగింపు దాకా కొనసాగే కథనం. ఈ అయిదు దశల్లోనూ కథకుడు సంఘటనల్ని అమర్చే క్రమంలో ముఖ్య ఉద్దేశ్యం ఒకటే: అది పాఠకుడి ఉత్కంఠని కాపాడుకుంటూ, అతడికొక రసానుభూతిని కలిగించడం. ఈ అయిదు అంశాల గురించీ ముందుముందు మరింత వివరంగా చూద్దాం.

ఇప్పుడు కథ చదవండి. వివిధ సంఘటనల్ని గుదిగుచ్చి శక్తిమంతమైన ఒక కథగా ఎలా రూపొందించవచ్చో చూడండి.

ఇంటర్వ్యూ: గోపాల్‌ బరాథం

బ్రిగేడియర్‌ మేసన్‌ని ఇంటర్వ్యూ చేయమని మా నాన్నే సూచించాడు. అది నాకేమంత ఆశ్చర్యం కలిగించలేదు. ఆయన తరానికి చెందిన తక్కిన యురేషియన్‌లలానే ఆయనకు కూడా ఇంగ్లీషు వాళ్లంటే చాలా గాఢమైన ఆరాధన. అందులోనూ సైనికాధికారులాగ పనిచేసిన ఇంగ్లీషువాళ్లంటే మరీ చెప్పలేనంత ఆరాధన. కొద్దిగా చిత్రంగా అనిపించవచ్చుగానీ ఆయన వాళ్లని ఆరాధించడం మొదలుపెట్టింది వాళ్లు తాము పరాజయంగా చెప్పుకునే సందర్భం నుంచే అది సింగపూరు ఓడిపోయినప్పటినుంచి.

సైనిక వ్యవహారాల్లో నా తండ్రి కొద్దిగా అమాయకుడనే అనాలి.

సింగపూర్‌ ఓడిపోవటం, తిరిగి మళ్లా దాన్ని చేజిక్కించుకోవటం, విన్‌స్టన్‌ చర్చిల్‌ వ్యవహారశైలికి నిదర్శనమని అనుకునేవాడాయన. జపాన్‌వాళ్లు సాధించిన విజయాలు కేవలం తాత్కాలికమేననీ, ఇంగ్లీషువాళ్లు మళ్లా తమ పరాక్రమం చూపించడానికి లభించిన అవకాశాలనీ అనుకుంటూ ఉండేవాడాయన. ఓటమినీ, గెలుపునీ కూడా సమదృష్టితో చూడాలని కిప్లింగ్‌ చెప్పిన మాటల్లో సత్యానికి ఆ మొత్తం సంఘటనంతా ఒక సజీవతార్కాణంగా భావించాడాయన. మామూలుగా ఎవరికైనా ఇది ఒక వృద్ధుడు గతకాలపు జ్ఞాపకం నెమరేసుకోవడంలానే కనిపిస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు, కానీ ప్రస్తుతప్రపంచానికి దానితో పనేమీ ఉండదు. కానీ ఆయన దాన్నట్లా భావించలేదు. పైగా మా తరానికి చెందిన సింగపూర్‌ పౌరులందరి సమస్యలకూ కారణం, మేమాయన అభిప్రాయాల్ని లక్ష్యపెట్టకపోవడమేనని గట్టినమ్మకమాయనకి.

ఆయన తరచూ అంటుండేవాడు, ‘మీతో వచ్చిన సమస్యేమిటంటే, మీకు యుద్ధమంటే ఏమిటో తెలియదు. దృఢమైన విశ్వాసాలకి అంటిపెట్టుకోవలసినంతగా మీరు కష్టాన్నీ, కన్నీళ్లనీ చూడలేదు.’

యుద్ధానంతర సంవత్సరాల్లో జన్మించిన నావాళ్లు లాంటి వారినందర్నీ మరీ లౌకికమైన మనుషులుగా చూసేవాడు. నేను పుట్టడానికి ఆయనే కారణం అయినాకూడా నాకేమీ మినహాయింపు దొరకలేదు. ‘విలువలు, విశ్వాసాలు ఈ పెద్దపెద్ద భవంతులకింద కప్పడిపోయాయి చూడండి’ అనేవాడాయన. తన కాలపు మనుషులతో తాగుతూ కూర్చున్నప్పుడు ఆయన సంభాషణలో యతిప్రాసలు, అలంకారసామగ్రి, హావభావాలు పుష్కలంగా పొంగిపొర్లేవి. వాళ్లుకూడా తనలానే ‘యుద్ధాన్ని చూశారనీ, అందులో నలిగిపోయారనీ’ అంటూండేవాడాయన.

మా నాన్న వార్తాపత్రికలు చదివేది చాలా తక్కువ. అవి సమకాలీన ప్రపంచం పట్ల ఆయన ఏర్పరుచుకున్న అభిప్రాయాలకి అవి మరింత వత్తాసు పలుకుతున్నట్టుండేవి. ప్రసారమాధ్యమాలంటే, ఆయనకెంత అయిష్టమంటే వాటికి సంబంధించిన ఎవరినయినా ఆయన అబద్ధాలు ప్రచారం చేసే దళారులుగానూ, తార్పుడుగాడుగానూ చూసేవాడు. నేనెంతో కష్టపడి సింగపూర్‌ టెలివిజన్‌లో సంపాదించుకున్న ఉద్యోగాన్ని ఆయన ఎంత ద్వేషించాడంటే, నేను దాన్ని వదులుకోవలసి వస్తుందేమోనని భయపడ్డాను. ఆయన స్నేహితులు ఎవరయినా నేనే ఉద్యోగం చేస్తున్నానని అడిగితే ఆయన తనలోతాను ‘ప్రభుత్వోద్యోగంలో ఉన్నాడు’ అని నెమ్మదిగా గొణుక్కునేవాడు.

అట్లాంటిది ఒకరోజు ఆయన మిత్రుడొకాయన బ్రిగేడియర్‌ మేసన్‌ సింగపూర్‌ వస్తున్నట్టు ఆయనకి చెప్పినట్లున్నాడు. దాంతో ఆయన నన్ను బ్రిగేడియర్‌ మేసన్‌ని ఇంటర్వ్యూ చెయ్యొచ్చుకదా! అన్నాడు. అప్పుడు కూడా ఆయన టెలివిజన్‌ అనే మాట మాత్రం ఎత్తలేదు.

బ్రిగేడియర్‌ మేసన్‌ సింగపూర్‌లో ఒకట్రొండురోజులు ఉన్నబోతున్నాడట. నువ్వు నీ ‘దాని’ కోసం ఆయన్ని ఇంటర్వ్యూ చేయవచ్చు కదా అన్నాడాయన. ఆ తరువాత ఇంక ఆయన ఆ మానవుడు జపాన్‌వాళ్ల చెప్పరాని ‘అకృత్యా’ల్ని ‘ఎంత ధైర్యంతో, గర్వంతో, గౌరవంతో, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో’ ఎదుర్కొన్నాడో స్తుతించడం మొదలుపెట్టాడు.

‘నాకు కొద్దిగా అసహనమని అనుకుంటావు నువ్వు’ అంటూ ఆయన ఇంకా ఇలా అన్నాడు. ‘నువ్వొకసారి అతడితో మాట్లాడి చూడు. నీకే అర్థమవుతుంది. మీరు సహనం సహనమని చెప్పుకునేదంతా మీ తరంతాలూకు సుఖలాలసత్వం తప్ప మరేమీ కాదని.

అయితే నేను బ్రిగేడియర్‌ని ఇంటర్వ్యూ చేయాలనుకోవడానికి రకరకాల కారణాలున్నాయి. ఈ మధ్యకాలంలో నేను పెద్దగా ఇంటర్వ్యూలు చేసిందేమీ లేదు. ఇప్పుడు బ్రిగేడియర్‌ మేసన్‌ని ఇంటర్వ్యూ చేయడమంటే పాతతరం ప్రేక్షకులకి ఎంతోకొంత గతకాలపు జ్ఞాపకాల్ని అందించినవాడినవుతాను. ఇప్పుడు దాదాపుగా వారందరి స్మృతివీథుల స్థానంలో ఆరుదారుల పెద్దపెద్ద రోడ్లు ఆక్రమించేస్తూ ఉన్నాయి.

అదే సమయంలో యువతరం ప్రేక్షకులకు కూడా అది ఎంతో కొంత ఆసక్తికరంగా ఉంటుందనిపించింది. అట్లాంటి ఒక సైనికాధికారిని యథార్థజీవితంలో వారెన్నడూ చూసి ఉండరు. అసలు అటువంటి సాహసయోధుల జాతినే చాల శీఘ్రంగా అంతరిస్తూ ఉన్న కాలంలో అట్లాంటి ఒక ఉదాహరణ చూడటం వాళ్లకి చెప్పుకోదగ్గ అనుభవంగా మిగిలిపోతుంది.

బ్రిగేడియర్‌ మేసన్‌ని పట్టుకోవటం కొద్దిగా కష్టమైంది నాకు. ఆయన తన పాతకాలపు మిత్రుల్ని కలుస్తూ ఉండడంలో సమయం చాలా తక్కువ ఉండింది. దాంతో తాను ఎయిర్‌పోర్ట్‌కు పోయే తోవలో ఇంటర్వ్యూ చేసుకోవడానికి అనుమతిచ్చాడు. ఆ అవకాశం నాకు కూడా సరిపోయింది. ఎందుకంటే మన కాలానికి చెందని ఈ చారిత్రక విశేషం మీద ఎక్కువసమయం వృథా చేయటం నాకూ ఇష్టంలేపోయింది. ఆ మొత్తం వ్యవహారంలో నాకు ఎంతోకొంత ఆసక్తిగా అనిపించింది అతడి వ్యంగ్యం మాత్రమే.

కాని నేను ఊహించిన దానికన్నా మేసన్‌ చాలా విలక్షణంగా కనబడ్డాడు. అతడు సన్నగా, పొడుగ్గా ఉన్నాడు. జుట్టు బాగా మెరసిపోయింది. కొద్దిగా ముందుకు వంగి నడుస్తున్నాడు. అతడి నీలి నేత్రాలలో కళ బాగా తప్పింది. అయితే ఉష్ణమండలి దేశాల్లో పనిచేసిన చాలామంది ఇంగ్లీషువాళ్లలాగా అతడి చర్మం మాత్రం ఎరుపెక్కిపోలేదు. ఆ చర్మంమీద వయసు ముద్ర కనబడుతున్నప్పటికీ అతడి కళ్ల కొసల్లోనూ, నోటి కొసల్లోనూ రూపుదిద్దుకున్న ముడతలు ఆందోళనకన్నా ఆనందాన్నే ఎక్కువ ప్రతిఫలిస్తున్నాయి. చాలామంది ఇంగ్లీషువాళ్లు తమ ఆధిక్యాన్ని చూపుకోవడానికా అన్నట్టు, కొద్దిగా ముక్కుతో మాట్లాడుతున్నట్లుంటారు. ఆయనలో అటువంటి లక్షణమేమీ కనిపించకపోగా అసలాయన స్వరంలో సైనికాధికారుల స్వభవమే కనిపించలేదు. పైగా నెమ్మదిగా కూడా మాట్లాడాడు.

నేనాయన్ని ఇంటర్వ్యూ చేయడంమొదలు పెడుతూనే, జపాన్‌ వాళ్ల చేతుల్లో ఒక యుద్ధఖైదీగా జీవించవలసి రావటం ఎటువంటి అనుభవమని ప్రశ్నించాను.

‘చాలా విసుగ్గా ఉండేది. మేం గంటలు తరబడి కాలాన్నెట్లా ఖర్చుచేయాలా అని రకరకాల మార్గాలు వెతుక్కుంటుండేవాళ్లం’ అన్నాడాయన.

తన మాటలు కొంత తేలికపాటివిగా ఉన్నాయనుకున్నాడేమో ఆయన ముఖంలో క్షమార్పణ సూచకంగా చిరునవ్వు కదిలింది.

మీకు కనీస అవసరాలు కూడా తీరకుండా పోలేదా?

‘కనీసవసరాలు లేకుండా పోయాయా అంటే అది దాదాపుగా మనసుకు సంబంధించిన విషయమనాలి. కొన్ని సౌకర్యాలను మనం సౌకర్యాలుగా భావించకుండానే ఆశించడం మొదలుపెడతాం. మనకి ఫలానా రకం తిండి కావాలనీ, మద్యం కావాలనీ, లేదా ఫలానా రకం దుస్తులు, ఫలానా రకంగా జీవించడం, దాన్ని మీరిప్పటికాలంలో ఏమంటారంటే’-

జీవనసరళి అనేనా?

‘అవును. జీవనసరళి. వీటిని మనం జీవించడానికి తప్పనిసరిగా అవసరమని అనుకుంటాం. కానీ యథార్థానికి అవేమంత అవసరం కాదు. జైల్లో ఉన్నప్పుడు తెలుస్తుంది. జైల్లోఉన్నప్పుడు మాత్రమే మనకి తెలుస్తుంది. నిజంగా జీవించడానికి, ఆ మాటకొస్తే ఆనందంగా ఉండడానికి మనకవసరమైంది చాలాచాలా స్వల్పమని. నీకు నిజంగా ఆకలిగా ఉండడమంటే ఏమిటో తెలుసోలేదో నాకు తెలియదు. కాని నీకు నిజంగా ఆకలిగా ఉండడమంటే ఏమిటో తెలిస్తే ఆకలి నిన్ను బాధపెట్టే విషయంగా కాక, ఒక సహచరిగా మారిపోతుంది. జైల్లో ఉన్నప్పుడు ఆకలి నాకెంతో తోడుగా దగ్గరగా ఉండేది. ఈ యుద్ధానంతర కాలంలో నేను ఆ అనుభవాన్ని దాదాపుగా పోగొట్టుకున్నాననే చెప్పాలి.’

ఇది ఆత్మహింస కాదా?

‘ఈ రోజుల్లో బహుశా మీరు దానికి అట్లాంటిదే ఏదో పేరు వాడతారు. ఆ మాటకొస్తే మీరు నన్ను ఓ మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లడానికి సిద్ధపడతారు కూడా’ అంటూ ఆయన చిరునవ్వాడు. ఆయన మాటల్లో ఎట్లాంటి అపర్థానికి తావుండకూడదన్నట్టు ఉంది ఆ చిరునవ్వు. ‘కాని నిజానికి అది ఆత్మహింస కాదు. నీకు బాగా పరిచితమైపోయిన సంవేదన నెమ్మదిగా నీకు చాలా విలువైన సంవేదనగా మారిపోతుంది. ఓ సంగతి చెప్పనా?’ అన్నాడాయన.

‘చెప్పండి, చెప్పండి. ఇంటర్వ్యూ చేసేవాళ్లకి ఇట్లాంటి విషయాలే చాలా ఆసక్తి కలిగిస్తాయి’ అన్నాను.

‘ఇప్పుడు కూడా ఎప్పుడైనా నేను మరీ వంటరిగా ఉన్నప్పుడు కావాలనే ఆకలిగా ఉండటానికి ఇష్టపడతాను. అట్లా ఆకలిగా ఉన్నప్పుడు నాకు చాలా కాలంగా తెలిసిన మిత్రుడెవరితోటో గడుపుతున్నట్టుంటుంది.’

‘బహుశా అందుకే కాబోలు మీరు సన్నగా ఉన్నారు’ అన్నాను.

‘బహుశా అయ్యుండొచ్చు. అలాగని నాకు నా ఆరోగ్యం గురించిగానీ, అందం గురించీగానీ ఏమంత ప్రత్యేకంగా పట్టింపులేదు.

‘జపాన్‌ యుద్ధశిబిరాల్లో ఖాదీలమీద జరిపిన అత్యాచారాలు గురించి మీరేమన్నా చెప్తారా?’

‘అత్యాచారం అనే మాట నేనింతగా ఇష్టపడని మాట. ఆ మాటలో చాలా నిందాకరమైన వేరే అర్థాన్ని సూచించే ఛాయలున్నాయి. ఆ మాటకొస్తే జపాన్‌వాళ్లు తమకు తాము పెట్టుకున్న నియమనిబంధనలు ప్రకారం మాతో న్యాయసమ్మతంగానే ప్రవర్తించారని చెప్పాలి. ఇంకా సరళంగా చెప్పాలంటే, వాళ్ల పద్ధతులు మన పద్ధతుల కన్నా వేరని చెప్పాలి.’

‘మీరు స్వయంగా గురై కూడా ఈ మాటలు చెప్తున్నారా?’

‘అవును. కాని దానర్థం నేను హింసని ఇష్టపడుతున్నాననో, లేదా సమర్థిస్తున్నాననో అనుకోకండి.’

‘మీరు యుద్ధహింసాశిబిరంలో ఎదుర్కొన్న అనుభవాలు గురించి మాకేమైనా చెప్తారా? లేక అవి పూర్తిగా వ్యక్తిగతమా?’

‘అవి వ్యక్తిగతమే కాని, వాటి గురించి మాట్లాడటానికి నాకేమీ అభ్యంతరం లేదు’ అన్నాడాయన. అప్పుడు కొంతసేపు తన వేళ్లకేసి చూసుకున్నాడు. యుద్ధశిబిరాల్లో ఖైదీల గోళ్లుపీకడం, ఎలక్ట్రిక్‌ షాక్‌ ఇవ్వడం, వేన్నీళ్లు ముఖాన పోయటం, జననాంగాల్ని నలిపేయటం లాంటి వందలాది భయంకరదృశ్యాలు ఆ క్షణాన నా కళ్లముందు కదలాడాయి. అవన్నీ దాదాపుగా మా నాన్న చెప్పిన మాటల్ని బట్టి నేనూహించుకున్న దృశ్యాలు. అయితే మేసన్‌ మాట్లాడడం మొదలుపెట్టగానే నేనాయనకి అడ్డుపడకుండా ఉండిపోయాను. మేసన్‌ చెప్పడం మొదలుపెట్టాడు.

‘నిజానికి నన్ను చాలానే హింసించారు. కాని అదంతా ఓ చిన్న పొరపాటు వల్ల జరిగింది. కొన్ని యుద్ధ స్థావరాల మీద బి-29 అమెరికన్‌ యుద్ధవిమానాలు బాంబులు కురిపించాయి. సింగపూర్‌ నుంచి ఎవరో అమెరికావాళ్లకి ఆ సమాచారం ఎవరో అందించం వల్లనే ఆ దాడి జరిగిందని జపాన్‌వాళ్లు అనుకున్నారు. అయితే అందుకు నన్నెందుకు అనుమానించారో నాకిప్పటికీ తెలియదు. బహుశా మావాడే ఎవడోఒకడు తట్టుకోలేని హింస వల్లనో, లేదా భయానికో నోటికొచ్చిన పేరేదో చెప్పే తొందరలో నాపేరు చెప్పి ఉండచ్చనుకుంటాను.’

మేసన్‌ ఒక్కక్షణమాగి చిరునవ్వాడు. ఆ చిరునవ్వు అమాయకంగా కొంత ఆహ్లాదకరంగా కూడా ఉంది. అతడు అనుభవించిన హింస తాలూకు చేదు జాడ ఏదీ అందులో కనబడలేదు.

‘నన్ను ప్రశ్నించడం కోసం నన్నో ప్రత్యేకమైన గదిలో నిర్బంధించారు. ప్రతిరోజూ పొద్దున్నే సరిగ్గా ఓ సమయానికి నన్ను ప్రశ్నించే మనిషి వచ్చేవాడు. మేమిద్దరం మర్యాదపూర్వకంగా ఒకరికొకరం నమస్కరించుకున్నాం. పాశ్చాత్యదేశాలలోలాగా ఒకరినొకరు పలకరించుకునేటప్పుడు తలాడించడం కాదది, మొత్తం శరీరమంతటితోటీ వినయపూర్వకంగా నమస్కరించడమది. మేము పూర్తిగా నడుం ముందుకు వంచి శరీరం పైనా, కిందా కూడా క్షణంపాటు దృఢంగా స్థిరంగా నిలిపి, అప్పుడు మేమిద్దరం ఏదో టెలిపతి సంకేతం పరస్పరం మార్చుకున్నట్టుగా అనుభూతి చెంది ఇద్దరం ఒక్కసారే మళ్లా తలపైకెత్తేవాళ్లం. ఆ కుశలప్రశ్న అయిపోగానే మసహిరొ లేదా హిరొ అనడమే ఎక్కువ ఇష్టంగా ఉండేదతడికి, ఆ హిరొ తన పనికి తను ఉపక్రమించేవాడు.’

ఆ మాటలు చెప్తున్నప్పుడు ఎటువంటి భావప్రకటనా లేని మేసన్‌ ముఖం, అతడి ప్రశాంత స్వరం నాలో తీవ్రమైన ఆందోళన రేకెత్తించింది. బ్రిటిషువాళ్ల మితభాషిత్వం, నిశ్చల ముఖకవళికలు లోకప్రసిద్ధమే అయినప్పటికీ మరీ ఇంత ప్రశాంతసంభాషణ నాకు తట్టుకోలేనిదిగా అనిపించింది. అతడు చెప్తున్నదేమో నరకంలాంటి తన అనుభవం గురించి, చెప్పేదేమో అసలు అది తనకు సంబంధించిందే కాదన్నట్టు. నేనుండబట్టలేక అతడికి అడ్డు తగిలాను.

‘కొద్దిగా వివరాలు చెప్తారా?’

‘ఆ వివరాలేమీ అంత ముఖ్యం కాదు. ఆ మాటకొస్తే అవి నాకే అంత గుర్తులేదు. హింసాత్మక అనుభవాల గురించి వివరించడం కూడా అశ్లీలచిత్రాలు చూడ్డం లాంటిదే. వాటికై వాటికి ఓ పరిమితి ఉంటుంది. ఎందుకంటే ఆ మొత్తం వ్యవహారమంతటికీ అంతిమఫలితమేమిటో మనకి ముందే తెలిసి ఉంటుంది. హిరొ కొంత ఇంగ్లీషు చదువుకున్నవాడు. మేము అమెరికన్లకి సమాచారం ఏ పద్ధతిలో అందించామో, అందులో ఎవరెవరు భాగస్వాములుగా ఉన్నారో ఆ సంగతంతా తెలుసుకోవటం తన బాధ్యత అని అతడు నాకు ముందే చెప్పేశాడు. ఆ బాంబులు గురించి నాకేమీ తెలియదనీ, కాబట్టి అతడు ఆశిస్తున్న సమాచారం నేనేమీ ఇవ్వలేనని నేను ముందే చెప్పినా, అతడు నా మాటల్ని చిరునవ్వుతో పక్కకు నెట్టేశాడు. నేను నిజమే చెప్తున్నప్పటికీ అతడు నన్ను నమ్మకపోవటం కూడా ఒకరకంగా అర్థం చేసుకోగలిగిందే. ఎందుకంటే ఆ సమయంలో నేను తప్పుచేశాను అని చెప్పటమంటే తక్షణమే మరణశిక్షకు గురికావటం కాబట్టి.

‘మిమ్మల్నట్లా చిత్రహింస పెడుతున్నప్పుడు మీకేమనిపించేది?’ కాని నేనా ప్రశ్న పూర్తి చేసేలోపే అది అర్థంలేని ప్రశ్న అనిపించి, ‘ఆ చిత్రహింసలు గురించి మీరేమనుకునేవారు?’ అనడిగాను.

‘మొదట్లో నేను ఇంగ్లాండు గురించి ఆలోచించడానికి ప్రయత్నించేవాణ్ణి. దక్షిణఇంగ్లాండు ప్రాంతపు ఆకుపచ్చని గ్రామసీమలూ, నా కుటుంబం, నా విద్యార్థి జీవితం వాటిని గుర్తు చేసుకుంటే ఆ సుందర గతస్మృతులు నా దుర్భరమైన వర్తమానాన్ని ఏదో ఒక మేరకు మర్చిపోగలిగేలా చేస్తాయనుకునేవాణ్ణి.’

‘కానీ ఆ ప్రయత్నం ఫలించలేదా?’

‘లేదు. గతాన్ని వర్తమానంతో పోల్చుకున్నందువల్ల వర్తమానం మరింత దుర్భరంగా ఉండేది. ఇక అందుకుబదులు నేనా బాధని అంగీరించడానికీ, అది నా నిత్యజీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా స్వీకరించడానికి సిద్ధపడిపోయాను. అయితే ఈ పద్ధతివల్ల నా మొత్తం వేదనని నేను మంత్రించినట్లుగా మాయం చేశానని చెప్పలేను గానీ అది ఎంతోకొంత మెరుగైన పద్ధతే అనిపించింది.’

‘మిమ్మల్నిట్లా విచారించటం ఎంతకాలం సాగింది?’

‘అదా, మూడు వారాలు. లేదా బహుశా నాలుగు వారాలయి ఉంటుంది. చివరిచివరికి వచ్చేటప్పటికి కాలం ఏమంత స్పష్టంగా కనిపించడం మానేసింది. హిరొ ఇంగ్లీషు ఏమంత చక్కగా లేకపోయినప్పటికీ మేమిద్దరం ఒక రకమైన సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాం. దాన్ని అర్థం చేసుకోవడం, అదొక పట్టాన మీకు బోధ పడేది కాదు. మేమిద్దరం ఒకరికొకరం బాగా అర్థమయ్యాం. అయితే అందులో ఏమంత ఆశ్చర్యం లేదు. ఒకరకంగా చెప్పాలంటే, మేమిద్దరం మామూలు మనుషులు లోనయ్యే అనుభవం కన్నా మరింత సాంద్రమైన, గాఢమైన అనుభవాన్ని దేన్నో కలిసి పంచుకున్నాం. బహుశా తీవ్ర ప్రేమోద్రిక్తులయినప్పుడు ఇద్దరు ప్రేమికులు అట్లాంటి అనుభవానికి లోనవుతారనుకుంటాను.’

‘అలా అనుకోవటం అనారోగ్యం కాదూ?’

‘అనారోగ్యమా?’

నేను సరైన పదం కోసం వెతుక్కోవడానికి ప్రయిత్నించాను. ‘అలా అనుకోవడం మానసికవైపరీత్యం కాదా?’

‘క్షమించాలి. నేనో పాతకాలం మనిషిని. ఇప్పటి భాషకి నేనంతగా అలవాటు పడలేదు.’ మేసన్‌ కొద్దిగా విషాదభరితంగా కనబడ్డాడు. ‘లేదు. దాన్ని నేను అనారోగ్యం అనలేను. హిరొగానీ, నేనుగానీ ఈ అనుభవాన్ని మాకై మేము కావాలని విధించుకోలేదు. ఆ మొత్తం వ్యవహారమంతా కూడా మా ఇద్దరికీ ఎంతమాత్రం రుచించింది కాదు. అతడు తన కర్తవ్యం తను నిర్వహిస్తున్నాడు. అది అతనికెంత అయిష్టం కలిగించినా సరే. అలాగే నేను కూడా నా కర్తవ్యం నేను నెరవేర్చానని అతడికి తెలుసు. మా ఇద్దరికీ ఈ విషయంలో అవగాహన స్పష్టంగానే ఉందనుకుంటున్నాను. మా సాన్నిహిత్యం మా ఇద్దరి మధ్యా భౌతికమైన విషయాల మీద ఆధారపడింది కాకపోయినప్పటికీ మేమిద్దరం పరస్పరం గౌరవించుకోవడం నేర్చుకున్నాం.

‘అతడు తనకి కావలసిన సమాచారాన్ని మీనుంచి రాబట్టలేకపోయినప్పుడు, క్షమించాలి, మీనుంచి పొందలేకపోయినప్పుడు చివరికి ఏం జరిగింది?’

‘భౌతికంగా హింసించే పద్ధతులు విఫలమయ్యాక అతడు మానసికంగా హింసించే పద్ధతులు మొదలుపెట్టాడు. తన విధి నిర్వహణలో హిరొ నిజంగా సమర్థుడు. అందులో అతడు ఎంతదూరం పోవడానికైనా సిద్ధపడ్డాడు. నేను నమ్మాలనుకున్న ప్రతిఒక్క దానితోనూ అతడు నన్ను ప్రలోభపరిచాడు.

జపాన్‌ దాదాపుగా ఓడిపోవడానికి సిద్ధంగా ఉందనీ, నేనిచ్చే ఏ సమాచారం కూడా యుద్ధపరిణామాల్ని ఏ విధంగానూ ప్రభావితం చేయలేదనీ చెప్పాడు. నేను అతడు అబద్ధం చెప్తున్నాడనీ, అది కూడా చాలా తెలివిగా చెప్తున్నాడనీ నాకు నేను చెప్పుకున్నాను. జైల్లో ఉన్న మా అందరికీ మిత్రపక్షాల విజయాల గురించి ఎంతోకొంత సమాచారం దొరుకుతున్నప్పటికీ మేమెవ్వరంకూడా యుద్ధం తొందరలోనే ముగిసిపోతుందని నమ్మడానికి సిద్ధంగా లేమని అతనికి కూడా తెలిసే ఉంటుంది. అయితే తదనంతర పరిణామాలు అతడు చెప్తున్నది నిజమేనని ఋజువుచేశాయి. అది వేరే సంగతి.’

మేసన్‌ మళ్లా తన వేళ్లకేసి ఒకసారి చూసుకున్నాడు.

‘నన్ను ఖైదు చేసినప్పుడు నా దగ్గరనుంచి జప్తు చేసుకున్న వాచీని అతనొకరోజు నాకు తిరిగి ఇచ్చేశాడు. అతడు తాను చేయాలనుకున్న ప్రయత్నంలో విఫలమయ్యానని ఒప్పుకున్నాడు. తన జీవితంలో తాను మొదటిసారి విఫలమైంది కూడా ఇప్పుడేనని చెప్పాడు. నాకు మరణశిక్ష విధించడం మినహా జపాన్‌ వాళ్లకి మరో ప్రత్యామ్నాయమేమీ లేదు. మరునాడు నాకు మరణశిక్ష విధిస్తారనగా ఆ పొద్దున్నే ఎనిమిదింటికి అతడు నా దగ్గరకు వచ్చి, నన్నక్కడికి తీసుకుపోవడానికి ఏర్పాట్లు జరిగాయి.

నా చివరి గంటల్ని లెక్కపెట్టుకోవడానికీ, నాకు ముఖ్యమైన విషయాలు గురించి ఆలోచించుకోవడానికీ నేను మృత్యువుని సక్రమంగా ఎదుర్కోవడానికీ ఆ వాచి నాకు ఉపకరిస్తుందని అతడన్నాడు. నాకు ఇష్టమైతే స్నానం చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తానన్నాడు. ఇక అప్పుడు అంతకుముందు ఎన్నడూ చేసి ఉండని పని ఒకటి చేశాడు. అతడు నా చేయి పట్టుకుని మృదువుగా నొక్కాడు. ఎంత మృదువుగా అంటే దెబ్బతిన్న నా వేళ్లకు నొప్పి కలగకుండా ఉండేటంత మృదువుగా అన్నమాట. ఇక అప్పుడు నాలాంటి సాహసవంతుణ్ణి చూడటం తనకెంతో గౌరవప్రదమైన విషయమని చెప్పాడు.

నేను సాహసవంతుణ్ణి కాదనీ, అమాయకుణ్ణనీ చెప్పినా అతడు నా మాటల్ని చిరునవ్వుతో పక్కకు నెట్టేశాడు. బహుశా నేను సాహసవంతుణ్ణే కాక, చాలా వినయవంతుణ్ణని కూడా సూచిస్తున్నట్టుందా నవ్వు.  ఇక అప్పుడు మేమంతా మర్యాదాపూర్వకంగా నమస్కరించుకున్నాం. అతడు వెళ్లిపోయాడు.’

‘అయితే ఇంతకీ మీకు మరణశిక్ష విధించనే లేదా?’ నా ఆత్రుతలో నేను ఒక వాక్యంగా చెప్పవలసినదాన్ని ప్రశ్నార్థకం చేశానని అర్థమైంది.

‘అసలు నాకు మరణశిక్ష విధించారనే నేననుకోను’ అన్నాడు మేసన్‌. అతడి కళ్లల్లో మొదటిసారి ఒక చిలిపితనం కనిపించింది. ‘ఎందుకో ఇప్పటికీ నాకు తెలియలేదు. కాని ఆ మరునాడంతా నేను ఆత్రుతగా ఎదురుచూస్తూనే ఉన్నాను. పదేపదే నా వాచీని చూసుకుంటూ కీ తిప్పుకుంటూ గడిపేశాను. కానీ ఏమీ జరగలేదు.’

‘అలా ఏమీ జరగనప్పుడు మీకేమనిపించింది?’

‘చెప్పలేనంత నిరుత్సాహం కలిగింది.’

బహుశా నా కళ్లల్లో ఏ భావం కనిపించిందో మేసన్‌ మళ్లా వివరంగా చెప్పడం మొదలుపెట్టాడు.

‘మృత్యువు అనివార్యమనీ, తప్పించుకోలేమనీ తెలిసినప్పుడు మనిషి దాన్ని అన్నిటికన్నా ముఖ్యంగా ఎంతో కుతూహలంగా సమీపిస్తాడు. బహుశా మీరు దీన్ని మళ్లా మానసికవైపరీత్యం అంటారేమో! కాని నన్ను మృత్యువు మోసగించినప్పుడు నాకు కలిగిన నిరుత్సాహంలాంటిది నాకు మాత్రమే కలిగిన అనుభూతి కాదు. పెద్దపెద్ద పర్వతాల్ని అధిరోహిస్తున్నప్పుడు పర్వతారోహకులు సమున్నత శిఖరాలమీంచి కిందకి జారిపడుతున్నప్పుడు దాదాపుగా తాము చచ్చిపోయామనుకున్నప్పుడు చావకుండా బతికి ఉన్నారని తెలిసినప్పుడు అట్లాంటి నిరుత్సాహానికే లోనవుతారు.’

‘బ్రిగేడియర్‌ మేసన్‌, అసలు యుద్ధం సృష్టించిన మొత్తం క్రూరత్వం గురించి మీరేమనుకుంటారు?’

‘యుద్ధం నా దృష్టిలో చాలా దుఃఖదాయక వ్యవహారం. నేను దాన్ని క్రూరత్వం అనను. ఎందుకంటే క్రూరత్వం అనేమాట వాడుతున్నప్పుడు అందులో వేదనకి ఒక ప్రయోజనం ఉందనే అర్థం వస్తోంది. చాలామంది జపాన్‌వాళ్ల లానే హిరొ కూడా తన విద్యుక్త ధర్మంగా భావించినదాన్ని తన శక్తికొలది నెరవేర్చడానికే ప్రయత్నించాడు. నిజంగా ఆ విషయమే ఆలోచించవలసి వస్తే, వాళ్లకన్నా మనమే మరింత దుర్మార్గులమని చెప్పవలసి ఉంటుంది. అప్పటికే ఓడిపోయిన ఒక దేశం మీద ఒకటి కాదు, రెండు ఆటంబాంబులు జారవిడిచి అమాయకులైన పౌరుల్ని పొట్టన పెట్టుకున్నామంటే అర్థమేమిటి?’

సమయం అయిపోయింది. నేను నా ఇంటర్వ్యూ ముగించి మేసన్‌ను ఎయిర్‌పోర్టు దాకా దిగబెట్టాను. ఆయన్ని అడగాలనుకున్న ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయికానీ, అతడు చెప్పిన మాటలు నన్నెంతో అయోమయానికి లోనుచేశాయి. దాంతో నా ప్రశ్నలు నోటిచివరే ఆగిపోయాయి. మేం కారులో వెళ్తున్నంతసేపూ మేసన్‌ చాలా నిబ్బరంగా ఉన్నాడు. విమానాశ్రయంలో విమానం ఎక్కడానికి పిలుపుకోసం ఎదురుచూస్తూండగా అతడు నన్ను అదోలా చూసి, ‘మీకింకో విషయం చెప్పాలి’ అన్నాడు.

ఇంటర్వ్యూ నేను అనుకున్నట్లుగా సాగలేదనీ, అతడు చెప్పినదానికి నేను పూర్తిగా అయోమయంలో పడిపోయాననీ నాకప్పటికే కొంత నిరుత్సాహంగా ఉంది. దాంతో అతను నేను తట్టుకోలేని మరే విషయాలు చెప్తాడోనన్న ఆత్రుతలో ‘మీరేమన్నా చెప్పండిగానీ ఈ వారాంతం జపాన్‌ వెళ్లి మిమ్మల్ని హింసించిన ఆ అధికారితో గోల్ఫ్‌ ఆడబోతున్నానని మాత్రం చెప్పకండి’ అన్నాను.

‘అయ్యో. అది మాత్రం సాధ్యంకాదు. ఎందుకంటే జపాన్‌ ఓడిపోయిన కొద్దిరోజులకే యుద్ధనేరాలమీద హిరొని విచారించి ఉరి తీసేసారు. అయితే అతడు మరణశిక్షకు గురికావడానికి కొద్దిరోజుల ముందే నాకో ఉత్తరం రాశాడు.

‘నిజమా?’ నా గొంతు నాకే బిగ్గరగా వినిపించింది.

‘నిజమే. తనకి మరణశిక్ష విధించే సమయంలో నేనతడి సమక్షంలో ఉండగలనా అని అడిగాడు. అతడు తన జీవితంలో చూసిన వాళ్లల్లో నేనే అత్యంత సాహసవంతుణ్ణినీ, అటువంటి సాహసవంతుడి సమక్షంలో తను కూడా ధైర్యంగా మృత్యువును ఎదుర్కోవటం తనకెంతో గౌరవప్రదంగా ఉంటుందనీ రాశాడు. అది నాకు నిజంగానే దుర్భరమైన విషయమయినప్పటికీ నాకు మరో అవకాశం లేదని నాకర్థమైంది. అతడు నాలో చూశాననుకుంటున్న ధైర్యం నిజానికి ధైర్యంకాదని నేను చెప్పినా ఉపయోగముండదు. కాబట్టి నేను ఆ సమయంలో అక్కడ ఉంటాననీ, అలా ఉండడం నాకెంతో గౌరవప్రదంగా భావిస్తున్నానని రాశాను.’

‘అయితే మీరు వెళ్లారా?’

‘అవును.’

‘మరీ సంగతి మీరు ఇంటర్వ్యు చేస్తున్నప్పుడు ఎందుకు చెప్పలేదు?’ అతడి కథలోని అత్యంత నాటకీయమైన సన్నివేశాన్ని రికార్డు చేయలేకపోయినందుకు నన్ను నేనెంతో నిందించుకున్నాను.

‘మీరా ప్రశ్న అడగలేదనడం అన్యాయమే అవుతుంది. అంతేకాక అలా అనడం నిజాయితీ కూడా కాదు. ఇంతకీ అది నేను పూర్తిగా వ్యక్తిగతమైన విషయమనుకున్నాను. అందుకే చెప్పలేదు.’

‘మరి ఇప్పుడెందుకు చెప్తున్నారు?’

‘ఎందుకంటే ఈ కథ ఎలా ముగిసిందో మీకు తెలియాలని నాకనిపించింది కాబట్టి. నా అభిప్రాయాలు మీ అభిప్రాయాల కన్నా చాలా భిన్నమని నాకర్థమైంది. మీరు చాలా ఇబ్బంది పడ్డట్టే కనిపిస్తున్నారు. చాలా వత్తిడికి లోనయినట్లు కూడా కనబడుతున్నారు. కాబట్టి నేను పూర్తి వివరాలు చెప్పకుండా మిమ్మల్ని వదలిపెట్టడం సమంజసం అనిపించలేదు.’

విమానం ఎక్కవలసిందిగా పిలుపు వినవస్తోంది. మేసన్‌ తన బ్రీఫ్‌కేస్‌ అందుకుని నాతో కరచాలనం చేశాడు.

‘సెలవు’ అన్నాడతడు. ‘శుభం’ అని కూడా అన్నాడు.

బాగా పొడుగ్గా ఉన్న మనిషేమో అతడు మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా ముందుకు వంగి మాట్లాడుతూ ఉన్నాడు. బహుశా అతడట్లా నానుంచి సెలవు తీసుకుంటున్నప్పుడు అందులో జపనీయుల మర్యాదాపూర్వకమైన వీడ్కోలు ఎంతోకొంత లేకపోలేదేమో అనిపించింది నాకు.

అభ్యాసం

  • ఈ కథలో రచయిత కథ చెప్పడానికి ఇంటర్వ్యూ పద్ధతిని ఎందుకు ఎన్నుకున్నాడు?
  • కథలో బ్రిగేడియర్ మేసన్ మాటిమాటికీ తన చేతివేళ్ళు ఎందుకు చూసుకుంటున్నాడు? దానివల్ల కథ పాఠకుడిమీద మరింత బలమైన ముద్ర వేయగలిగిందంటారా?
  • ఈ కథలో మలుపు ఎక్కడ సంభవించిందో గుర్తుపట్టగలరా?

Leave a Reply

%d bloggers like this: