కథాశిల్పం-3

Edvard Munch: The Fairytale Forest, 1901–02

రసానుభూతి

ఇతివృత్తానికి రెండు పార్శ్వాలున్నాయనీ, దాని ఒక వైపు కొస కథకుడికి కలిగిన ప్రథమస్పందనలోనూ, మరొక కొస పాఠకుడిలో రేకెత్తించే రసానుభూతిలోనూ ఉంటుందని చెప్పుకున్నాం.

కథలు ఎందుకు చెప్పుకుంటాం? మన గురించి, మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించీ తెలుసుకోవడానికి అనడం సాహిత్యప్రయోజనాన్ని మరీ స్థూలంగా నిర్వచించడం. సాహిత్యం అందించే పరిజ్ఞానం శాస్త్రాలద్వారా లభించే పరిజ్ఞానం కన్నా భిన్నమైంది. సాహిత్యం వల్ల తెలిసేది కూడా సత్యమే కాని, ఈ సత్యం ద్వారా కేవలం సమాచారం మాత్రమే అందదు. ఆ సమాచారం మనకి అందుతున్నప్పుడు మనలో మరేదో సంభవిస్తుంది. నిజానికి, ఒక యథార్థం కానీ, ఒక సత్యంగానీ మనకి తెలిసినప్పుడు మనలో ఒక రసాయనిక ప్రక్రియ సంభవిస్తుంది. సత్యానికొక బయాలజీ ఉంది. అది మన మెదడునీ, మనసునీ కూడా ఏకకాలంలో ప్రభావితం చేస్తుంది. అయితే ఒక న్యాయపరమైన, లేదా వైజ్ఞానిక పరమైన సత్యాన్ని తెలుసుకున్నప్పటికన్నా, సాహిత్యపరమైన సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మనం మరీ సున్నితంగా స్పందిస్తాం. ఆ సమయంలో మనలో సంభవించే ఆ ప్రక్రియను ఇప్పుడు న్యురాలజిస్టులు మరింత నిశితంగా అధ్యయనం చేస్తున్నారు. మన మెదడులో mirror neurons అనేవి ఉన్నాయనీ, అవి ఎదుటి మనిషికి లేదా ప్రాణికి సంభవించిన అనుభవాలను, అనుభూతులను మనవిగా భావించి ప్రతిస్పందిస్తాయనీ, మానవసహానుభూతికి అవే కారణమనీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సుప్రసిద్ధ న్యూరో సైంటిస్టు వి.ఎస్.రామచంద్రన్ ఆ మిర్రర్ న్యూరన్లను మానవనాగరికతకు మూలకందంగా చెప్పుకొచ్చాడు.

ఎన్నో వేల ఏళ్ళ కిందట, భారతదేశంలో భరతముని నాట్యశాస్త్రం రచిస్తున్నప్పుడు, ఆయనకి ఈ న్యూరో సైన్సు తెలియదుగానీ, ఒక నటుడు ఒక పాత్రను పోషిస్తూ, ఆ పాత్ర సుఖదుఃఖాలను తనమీద ఆరోపించుకుని అభినయిస్తున్నప్పుడు, అది చూసే ప్రేక్షకుడు  కూడా అటువంటి సుఖదుఃఖానుభూతికే లోనవుతాడని గమనించాడు. అయితే ఆ అనుభూతికీ, ఆ ప్రేక్షకుడు తన జీవితంలో లోనయ్యే అనుభవాల వల్ల కలిగే అనుభూతికీ మధ్య తేడా ఉంటుందని కూడా గమనించాడు. మామూలుగా మన జీవితాల్లో కష్టం కలిగినప్పుడు మనకి దుఃఖం కలుగుతుంది. ఎదటివాళ్ళ కష్టాన్ని చూసినా కూడా దుఃఖం కలుగుతుంది. కానీ, నాటకంలో నటుడి దుఃఖం చూసినప్పుడు మనం కూడా దుఃఖానికి లోనవుతూనే ఆనందాన్ని అనుభవిస్తాం. ఈ వైచిత్రికి కారణమేమిటో న్యూరాలజిస్టులు ఇంకా కనుగొనవలసి ఉంది. కానీ ప్రాచీన భారతీయ ఆలంకారికులు ఈ విషయం మీద గంభీరమైన చర్చ చేసారు. కొన్ని శతాబ్దాల పాటు జరిగిన ఆ చర్చలో వివిధ దర్శనాలకు చెందిన పండితులెందరో పాల్గొన్నారు. ఆ చర్చనంతా ఇక్కడ వివరించలేముగానీ, ఆ సారాంశాన్ని రెండు మాటల్లో చెప్పవచ్చు. అదేమంటే, మామూలుగా మన దైనందిన జీవితాల్లో మనం అనుభవించే సుఖదుఃఖాదులన్నిటినీ వారు స్థాయీభావం అన్నారు. ఒక నాటకప్రదర్శన జరుగుతున్నప్పుడు నటుడు ప్రదర్శించే సుఖదుఃఖానుభవాల  అభినయం మనలో ఉన్న స్థాయీభావాన్ని రసంగా మారుస్తుంది అని చెప్పారు. ‘ఎండిపోయిన కర్రలో అగ్ని రగిలి వ్యాపించినట్టు సామాజికుడిలో రసం పుట్టి అతడి శరీరమంతా రసం వ్యాపిస్తుంది ‘అని అభినవగుప్తుడు అన్నాడు.

కేవలం సమాచారం అందినందువల్ల రసం పుట్టదు. ఆ సమాచారానికి మరొకటేదో తోడవ్వాలి. ఉదాహరణకి పరీక్షా ఫలితాలకోసం ఎదురుచూస్తున్న విద్యార్థికి ఫలితాలు అందగానే ఒళ్ళంతా సంతోషంతో పులకించిపోతుంది. దానికి కారణం, అప్పటికే అతడిలో ఉన్న ఉత్కంఠని ఆ సమాచారం ఎండుకట్టెని నిప్పులాగా రగిలించిందన్నమాట.

అంటే ఒక సమాచారం లేదా సత్యం మనలో రసానుభూతి కలిగించాలంటే మనకీ, ఆ సత్యానికీ మధ్య ఒక సంవాదం జరుగుతూ ఉండాలి. వైజ్ఞానిక సత్యం వల్ల కూడా మనిషిలో ఇటువంటి రసానుభూతి సాధ్యం కావచ్చు. కానీ, అటువంటి రసానుభూతి మామూలు మనుషులకి సాధ్యమయ్యేది కాదు. నీళ్ళతొట్టెలో స్నానానికి కూర్చున్న ఆర్కిమెడిస్ కి అకస్మాత్తుగా తన బరువు తగ్గిపోయిన అనుభూతి కలిగినప్పుడు, అతడు సంతోషంతో పరుగులుపెట్టడానికీ, మనం ఆ పని చెయ్యకపోవడానికీ కారణం మనకీ, ఆ సత్యానికీ మధ్య హృదయసంవాదం లేకపోవడమే. మామూలు మనుషులకి అటువంటి రసానుభూతి వాళ్ళ దైనందిన జీవితాల్లో ఉత్కంఠ కలిగించే చిన్న పెద్దా అనుభవాల్లో మాత్రమే సాధ్యమవుతుంది. లేదా అటువంటి ఒక ఉత్కంఠని రేకెత్తించే విధంగా ఒక కథ చెప్పినప్పుడో లేదా ఒక రూపకాన్ని ప్రదర్శించినప్పుడో కూడా సాధ్యపడుతుంది.

కథ వింటున్నప్పుడో, చూస్తున్నప్పుడో, చదువుతున్నప్పుడో మనలో ఉత్కంఠ రేకెత్తి, మనకీ, ఆ కథలో సమాచారానికీ మధ్య ఒక హృదయ సంవాదం మొదలై, మనం రసానుభూతిలోనయ్యే క్షణం  ఒక సాక్షాత్కారం లాంటిది. ఆ క్షణం మన హృదయం లయ తప్పుతుంది. దాన్ని జేమ్స్ జాయిస్ epiphany అన్నాడు. Epiphaneia అనే గ్రీకు పదం దానికి మూలం. ‘చూపించడం’ అని దానికి అర్థం. Epiphany ఒక క్రైస్తవభావన.  క్రీస్తుపుట్టిన పన్నెండో రోజు సాయంకాలం ముగ్గురు తూర్పుదేశపు జ్ఞానులు ఆయన్ని చూడటానికి వచ్చినప్పుడు ఆయన లోకానికి వెలుగుకాబోతున్నాడనే దివ్యానుభూతికి లోనయ్యారు. క్రీస్తు జీవితానికి సంబంధించి అటువంటి క్షణాలు మరి రెండున్నాయి. ఒకటి ఆయన చిన్నప్పుడు, ‘కానా’లో ఒక పెండ్లి విందులో నీళ్ళను ద్రాక్షసారాయిగా మార్చిన క్షణం, మరొకటి ఆయనకు యోహాను బాప్తిస్మమిచ్చినప్పుడు. ఈ మూడు క్షణాల్లోనూ క్రీస్తు ద్వారా ఒక వెలుగు చూపరులకు ప్రత్యక్షమయింది. దాదాపు ఇటువంటి అలౌకికానుభూతి కథలు చదువుతున్నపుడు పాఠకుడికి కలుగుతుందని జాయిస్ అన్నాడు. ఆయన కన్నా ముందు డీక్విన్సీ కూడా epiphanies of the Greek intellect అనే పదప్రయోగం వాడినప్పుడు, epiphany ని  ఇటువంటి లౌకికార్థంలోనే ప్రయోగించాడు. అయితే జాయిస్ చేతుల్లో ఆ మాట మరింత లౌకికార్థాన్ని సంతరించుకుంది.

Epiphany, రసానుభూతి ఒకటి కావు. వాటిమధ్య సున్నితమైన విభజన రేఖ ఉంది. మనం ఒక కథ వింటున్నప్పుడు లేదా ప్రదర్శన చూస్తున్నప్పుడు మనకొక రసస్ఫూర్తి మొదలై అదొక క్షణాన రసానుభూతిని మేల్కొల్పుతుంది. ఆ అనుభూతి కలిగిన మరుక్షణం మనకొక సాక్షాత్కారం సంభవిస్తుందని చెప్పవచ్చు. లేదా రసస్ఫూర్తి ఏదో ఒక క్షణాన మనకొక సాక్షాత్కారాన్ని కలిగిస్తుందనీ, ఆ క్షణమే మనమొక రసానుభూతికి లోనవుతామనీ కూడా చెప్పవచ్చు. ఎండుకట్టెలో నిప్పు రగిలే క్షణమది. ఏది ముందు ఏది వెనక అని చెప్పలేము. కాని అది ఎడ్గార్ అలన్ పో అభివర్ణించినట్టుగా a certain unique or single effect అని మాత్రం చెప్పగలం.

నిజానికి జాయిస్ ఉద్దేశ్యంలో epiphany కథలో పాత్రకి సంభవించేది. సాధారణ దైనందిన జీవితంలోనే, ఏదో ఒక వస్తువో, సంఘటననో, దృశ్యమో లేదా ఏదో ఒక మానసిక సంచలనమో అకస్మాత్తుగా ఆ పాత్ర లో కలిగించే మెలకువని అతడు epiphany అన్నాడు.

దాని వెనక పందొమ్మిదో శతాబ్దపు చివరిసంవత్సరాల్లోనూ, ఇరవయ్యవశతాబ్ది ప్రారంభంలోనూ మనస్తత్వ శాస్త్రంలో తలెత్తిన నూతన ఆవిష్కరణల ప్రభావం ఉంది. ఇప్పుడు ఆధునికతావాదం(మాడర్నిజం) గా మనం గుర్తిస్తున్న ఆ సాహిత్యధోరణిని నిజానికి ‘సాహిత్య ఇంప్రెషనిజం’ అని గానీ లేదా psychological realism అనిగానీ అనాలి. ఆ ధోరణి పద్ధెనిమిది,పందొమ్మిదో శతాబ్దాల్లోని సర్వజ్ఞకథనాల మీద తిరుగుబాటు. కథలో సంభవించే పరిణామాలు బాహ్యప్రపంచంలో జరుగుతున్నవిగా కథకుడు వివరించడం మీద చూపించిన అసహనం అది. కథలు చెప్పే ఒక narrator స్థానంలో వారు కథలో భాగంగా తననితాను పర్యావలోకించుకునే ఒక reflector ను ప్రవేశపెట్టారు. ఆ పర్యావలోకనలో భాగంగా, కథలో పాత్ర లేదా ఆ ప్రొటాగనిస్ట్, లోనయ్యే మెలకువను జాయిస్ ఎపిఫని అన్నాడు.

అయితే, కథలో ప్రధాన పాత్ర ఒక మెలకువకు లోనయ్యే క్షణమే పాఠకుడు రసానుభూతికి లోనయ్యే క్షణం కూడా. రావిశాస్త్రి ‘వర్షం’ కథలో ఒక సిటీబాబు వర్షం వల్ల ప్రయాణం ఆపేసి ఒక టీ పాకలో వర్షం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురుచూస్తూ కూచుంటాడు. ఇంతలో అతడికి టీ కాచి ఇవ్వడంకోసం బొగ్గులు తెమ్మని ఆ టీకొట్టు యజమాని తనదగ్గర ఉండే పనిపిల్లవాడికి పురమాయిస్తాడు. ఆ పిల్లవాడు ఆ వర్షాన్ని లెక్కచేయకుండా పోయి బొగ్గులమూటతో తిరిగొస్తాడు. అలా ఆ వర్షాన్ని లెక్కచేయకుండా వస్తున్న ఆ పిల్లవాణ్ణి చూసినప్పుడు ఆ సిటీబాబుకి ఒక మెలకువ కలుగుతుంది. అతడు కూడా తక్షణమే తన ప్రయాణం కొనసాగించడానికి ఆ వర్షంలో అడుగుపెడతాడు. ఇక్కడ ఆ పాత్ర మెలకువకి లోనయ్యే క్షణమూ, మనకు రసానుభూతి కలిగే క్షణమూ ఒకటే.

కాని అన్నిసార్లూ epiphany , రసానుభూతీ ఒక్కటికావాలని లేదు. ముఖ్యంగా మాడర్నిజానికి ముందూ, తర్వాతా వచ్చిన సాహిత్యంలో సూక్ష్మసాక్షాత్కార క్షణాల్ని పట్టుకోవడం కష్టం. ఇప్పుడు పాశ్చాత్య సాహిత్యవిమర్శకులు దీన్ని వివరించడానికి ప్రతి ఏడాదీ కొత్త పదజాలాన్ని రూపొందిస్తూ ఉన్నారు. ఆ పదాలన్నిటికన్నా రసానుభూతి అన్నదాన్నే నేను ఎక్కువ స్పూర్తిదాయకమైన పదంగా భావిస్తున్నాను.

ఒక కథకి మనం ఇతివృత్తాన్ని సంభావించేటప్పుడు ఈ అద్వితీయ క్షణానికి చేరడమెలా, పాఠకుణ్ణి చేర్చడమెలా అన్నదాని గురించి ఆలోచించాలి. ఇతివృత్తం  అంటే సారాంశమూ, రసానుభూతీ రెండూను. రసానుభూతిలేని సారాంశం కేవలం శాస్త్రసత్యంగా మాత్రమే మిగిలిపోతుంది. రసానుభూతిని మేల్కొల్పే ఇతివృత్తం మాత్రమే కథగా మారుతుంది. కథాశిల్పం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక ఇతివృత్తాన్ని రసానుభూతిగా మార్చగలిగే కౌశల్యం.

ఇవాన్ కేంకర్ ‘పిల్లలూ, పెద్దలూ ‘

ఒక కథ చదువుతున్నప్పుడు మనలో కలిగే రసానుభూతికి ఉదాహరణగా ఇవాన్ కేంకర్ (1876-1918)రాసిన  ‘పిల్లలూ- పెద్దలూ’ కథ చూద్దాం.

ఇవాన్ కేంకర్ స్లొవేన్ భాషలో ఆధునిక సాహిత్యాన్ని సృష్టించాడు. ఆస్ట్రో-హంగేరియన్ సామ్రాజ్యాన్ని ధిక్కరించి స్లోవేనియన్ జాతీయతావాదానికి స్ఫూర్తినిచ్చాడు. సామ్యవాద భావజాలమూ, కేథలిక్ విశ్వాసాలూ మేళవించి ఒక ఆధ్యాత్మిక సామ్యవాదిగా కవిత్వం,  నాటకాలు, వ్యాసాలు రచించాడు. ప్రసంగాలు చేసాడు.’పిల్లలూ- పెద్దలూ’ (Children and Oldfolk) 1917 లో మొదటి ప్రపంచ యుద్ధం నేపథ్యంగా రాసిన కథ.

యూరోప్ కి యుద్ధాలు కొత్త కాదు. మధ్యయుగాల క్రూసేడ్లలోంచే యూరప్ ఆధునిక యుగంలోకి అడుగుపెట్టింది. కాని, మొదటి ప్రపంచ యుద్ధం ఎన్నో విధాలుగా యూరోప్ కి ఒక కొత్త అనుభవం. పందొమ్మిదో శతాబ్దపు సామ్రాజ్యాలకీ, ఇరవయ్యవశతాబ్దపు ఆధునిక జాతీయతావాదాలకీ మధ్య జరిగిన పోరాటం అది. సామాజిక, రాజకీయ కేంద్రం నుంచి వ్యక్తి ని పక్కకునెట్టి మహానిర్మాణాలూ, మహాశక్తులూ ముందుకొచ్చిన సందర్భం. తమ దైనందిన జీవితానికీ, తమ కుటుంబానికీ, తమ అకాంక్షలకూ సంబంధం లేని ఒక యుద్ధంలో తామెందుకు పాల్గొనాలో తెలియని కాలం.

ఆ యుద్ధం నేపథ్యంగా కేంకర్ ఈ కథ రాసాడు. ఆ యుద్ధంలో ఒక సైనికుడు మరణించాడు. అతడి మరణవార్త ఎక్కడో సుదూరంలో ఉన్న అతడి గ్రామానికి, అతడి కుటుంబానికి చేరినప్పుడు, ఆ దృశ్యం ఎలా ఉంటుంది? అటువంటి ఒక ఊహ లేదా కేంకర్ స్వయంగా చూసి ఉన్న ఒక అనుభవం ఈ కథకి ఇతివృత్తం. ఆ ఇతివృత్తాన్ని కథగా మలుస్తున్నప్పుడు అతడు మనలో రేకెత్తించే రసానుభూతి ఈ కథని అత్యున్నతస్థాయి సాహిత్యంగా మార్చేసింది.

కథ మొదలుపెడుతూనే ప్రశాంతనిర్మల వాతావరణంలోకి మనల్ని నేరుగా తీసుకుపోతున్నాడు కథకుడు.

‘ప్రతి రాత్రీ పడుకోబోయేముందు పిల్లలు తమలోతాము కబుర్లు చెప్పుకునేవాళ్లు. వంటింటి అరుగుమీద కూర్చుని వాళ్ల మనసుకి ఏది తోస్తే అది చెప్పుకునేవాళ్లు. కిటికీ అద్దాల్లోంచి సాయంకాల సంధ్యారశ్మి కలలతో బరువెక్కిన నేత్రాలతో మసగ్గా లోపలికి తొంగి చూశాయి. గదిలో ప్రతిమూలా నిశ్శబ్దపు నీడలు అద్భుతగాథల్నేవో మోసుకొస్తూ పైకి సాగేవి. ‘

అప్పుడు, మరొక రెండు పేరాల తర్వాత, ఆ వార్త మనకి వినిపిస్తుంది.

‘ఆ సాయంకాలం ఆ దివ్యలోక కాంతిలోకి ఏదో అజ్ఞాతప్రదేశం నుంచి అజ్ఞాతమైందేదో ఊదారంగు చేతులతో దేన్నో తీసుకువచ్చింది. ఆ వచ్చిందేదో అన్ని సెలవులమీదా, కథలమీదా, గాథలమీదా విరుచుకుపడింది. వాళ్ల నాన్న ఇటాలియన్ నేలమీద ‘కూలిపోయాడనే’ వార్త అది. ఆ పిల్లలకి ఎంతమాత్రం అర్థంకానిదేదో కొత్తదీ, విచిత్రమైందీ, అంతదాకా వాళ్లు ఎరుగనిదీ వాళ్లముందొచ్చి నిలుచుంది. లావుగా, పొడుగ్గా వాళ్లముందే నిలబడింది. కానీ దానికి ముఖంలేదు. కళ్లు లేవు. పళ్లు లేవు. నోరులేదు. అసలు దానికంటూ ఏ చోటూ లేదు. చర్చిముందూ, వీథిలోనూ ఉరుకులాడే జీవితం కాదు దానిది. వంటింటి వసారా ముందు పడుతుండే సాయంకాల సంధ్యాకాంతికి చెందింది కాదది. అసలు ఆ కలలప్రపంచానికే సంబంధించింది కాదు.’

నిజానికి, ఆ సమాచారంతో అక్కడితో కథ పూర్తయిపోయినట్టే. మరణం తర్వాత, మరణవార్త విన్నాక ఇంక చెప్పటానికి మరే కథమిగుల్తుంది? కాని, ఆ మరణవార్త ఆ ఇంట్లో, ఆ కుటుంబంలో ఎటువంటి శూన్యాన్ని నింపిందో నెమ్మదిగా మనముందు ఆవిష్కరిస్తూపోతాడు కథకుడు. ఆ పిల్లల అమాయికమైన మాటలు, తామెటువంటి మృత్యువు ఎదట నిల్చున్నారో కూడా తెలియని ఆ పసితనం మనల్ని నెమ్మదిగా ఒక విభ్రాంతికి లోను చేస్తూ, చేస్తూ, దాదాపుగా కథనం పూర్తికావొస్తూండగా, అప్పుడు మనకి ఆ పెద్దవాళ్ళనీ, ఆ సైనికుడి భార్యనీ చూపిస్తాడు కథకుడు:

అదే సమయంలో ఆ ఇంటిముందు బెంచిమీద తాత నాన్నమ్మ కూర్చున్నారు. తోటలోని నల్లని చెట్లకొమ్మల మధ్య అస్తమిస్తున్న సూర్యుడి చివరి రక్తకాంతి మెరుస్తూ ఉంది. ఎవరిదో గొంతులో కుక్కుకోలేక, ఆపుకోలేక రోదిస్తున్న రోదనధ్వని తప్ప ఆ సాయంకాలం చాలా నిశ్శబ్దంగా ఉంది. మరింత మరింత హృదయవిదారకంగా వినిపిస్తున్న ఆ రోదన పక్కనున్న పశువులకొట్టంలోంచి వినిపిస్తోంది. బహుశా ఆ పిల్లల తల్లి అక్కడ ఆవులకి కుడితి వేస్తున్నట్టుంది.’

అక్కడ, ఆ పశువుల కొట్టంలోంచి రోదన వినిపిస్తున్న ఆ క్షణం మనలో రసానుభూతి మేల్కొనే క్షణం. అప్పటిదాకా ఆ పిల్లల మాటలు వింటున్న మనలో ఏదో ఒక కలవరం మొదలై, మన మనసులో అస్పష్టంగా ఏదో ఒక వేదన సుళ్ళు తిరుగుతూ, ఇక, అప్పటికి, ఆ కొట్టంలోంచి రోదన వినబడగానే మన హృదయంలో కూడా శోకం కట్ట తెంచుకుంటుంది. కాని, అదే క్షణాన, ఆశ్చర్యంగా, ఆ కుటుంబ శోకంతో మన హృదయం తాదాత్మ్యం చెందిన శోకం ఒక్కసారిగా కరుణగా మారిపోతుంది. మనకి ఆ కుటుంబం పట్ల చెప్పలేనంత సహానుభూతి కలుగుతుంది. వాళ్ళని మన చేతులు చాపి దగ్గరగా తీసుకోవాలనీ, మరేమీ మాట్లాడకుండా మన హృదయమంతటితోటీ ఓదార్చాలనీ అనిపిస్తుంది. ఎక్కడో, వందేళ్ళ కిందట, యూరోప్ లో, ఆస్ట్రో-హంగేరియన్ మహాసామ్రాజ్యం కోసం పోరాడి మరణించిన ఒక సైనికుడి కుటుంబం, ఆ పిల్లలూ, పెద్దవాళ్ళూ, వాళ్ళ పేర్లేవో తెలియకపోయినా కూడా, మనకెంతో ఆత్మీయులుగా మారిపోతారు.

మామూలుగా, రసావిష్కరణ జరిగేటప్పుడు ఆ అనుభూతిని వాచ్యం చేయకూడదంటారు. ఇక్కడ ఆ సైనికుడి భార్య రోదన ఆ శోకాన్ని వాచ్యంగా చెప్పినట్టే. కాని, ఆ మాట వినగానే మనలో రసావిష్కరణ జరుగుతున్నది. ఎందువల్ల? ఎందుకంటే, అప్పటిదాకా, ఆ పిల్లల మాటల్లో, ఎక్కడా కూడా, వాళ్ళకి సంభవించిన విపత్తు ఎటువంటిదో ఒక్క మాట కూడా వాచ్యంగా లేకపోగా, అసలదేమీ విషయమేకాదన్నట్టుగా ఆ పిల్లలు మాట్లాడుకుంటున్నది మనం వినడంవల్ల, ఎవరేనా ఆ పిల్లలకి వాళ్ళకి సంభవించిన విపత్తు ఏమిటో వాళ్ళకి తెలిస్తే బాగుణ్ణు, ఆ జ్ఞానం వాళ్ళకెంత భరించరానిదైనప్పటికీ, అది వాళ్ళకి తెలిస్తేనే బాగుణ్ణనే ఉత్కంఠకి లోనవుతుంటాం. అటువంటి ఒక క్షణం కోసం మనం ఎదురుచూస్తుంటాం కాబట్టి ఆ పశువుల కొట్టంలో ఆ సైనికుడి భార్య రోదిస్తున్నదని వినగానే మనమొక అనిర్వచనీయ అనుభూతికి లోనవుతాం. ఆ పిల్లల మాటలు అప్పటిదాకా మనలో కలిగించిన కలవరం వల్ల ఆ క్షణాన ఆమెతో పాటు మనమూ మౌనంగా రోదిస్తాం.

ఇక కథ ముగింపుకి వచ్చేటప్పటికి, ఈ వాక్యాలు చదివేటప్పటికి మనల్ని కూడా ఒక మహామౌనం ఆవహిస్తుంది.

‘ఆ ముసలివాళ్లిద్దరూ ఒకరినొకరు ఆనుకుని అట్లానే తలవంచుకుని కూర్చున్నారు. చాలా సేపటిదాకా వాళ్లు ఒకరిచేతినొకరు పట్టుకుని అట్లానే కూర్చుని ఉన్నారు. అప్పుడు సూర్యాస్తమయానంతర సంధ్యాకాంతివైపు అశ్రురహిత నేత్రాలతో మౌనంగా చూస్తూండిపోయారు.’

నాలుగు పేజీలు కూడా లేని ఈ కథ మూడుతరాల ఇతిహాసం. ఇందులో పసితరం ఇంకా పసిది.

‘వాళ్ల దృష్టి ఎంతసేపూ సుందర స్వర్గలోకపు కాంతిమీదనే ఉండేది. అక్కడ ప్రతిఒక్క మాటా సత్యంగానూ, స్పష్టంగానూ ప్రతిఒక్క కథా నిర్మలంగానూ, నిజంగానూ వినిపిస్తూ ప్రతిఒక్క గాథకీ ఉజ్జ్వలమైన ముగింపు కనిపించేది.’

రెండవ తరానికి మిగిలింది మరణమూ, మరణశోకమూనూ. కాని ఆ సైనికుడి భార్యకి ఇంకా మనసారా శోకించే అవకాశం, అమాయికత్వం కూడా ఉన్నాయి.పెద్దతరానికి అది కూడా లేదు. వాళ్ళకి మనసారా ఏడ్వడంలో కూడా నమ్మకం లేదు. వాళ్ళకి మిగిలింది అశ్రురహిత నేత్రాలు మాత్రమే.

ఇది శోకం శ్లోకంగా మారిన కథ. శోకం కరుణరసానుభూతిగా మారిన కథ. ఇటువంటి రసానుభూతి మనలో జాగృతం చేసే సాహిత్య సత్యం ఒకటే. అది యుద్ధం ఎంత అసందర్భమో తెలిసిరావడమే. ఈ కథ చదివినవాడెవ్వడూ, ఏ విలువపేరిట గాని, ఏ ఆశయాల పేరిట గాని, ఎటువంటి యుద్ధాన్నీ మనసా స్వాగతించలేడు.

పిల్లలూ, పెద్దలూ

ప్రతి రాత్రీ పడుకోబోయేముందు పిల్లలు తమలోతాము కబుర్లు చెప్పుకునేవాళ్లు. వంటింటి అరుగుమీద కూర్చుని వాళ్ల మనసుకి ఏది తోస్తే అది చెప్పుకునేవాళ్లు. కిటికీ అద్దాల్లోంచి సాయంకాల సంధ్యారశ్మి కలలతో బరువెక్కిన నేత్రాలతో మసగ్గా లోపలికి తొంగి చూశాయి. గదిలో ప్రతిమూలా నిశ్శబ్దపు నీడలు అద్భుతగాథల్నేవో మోసుకొస్తూ పైకి సాగేవి.

పిల్లలు తమ మనసుకి ఏది స్ఫురిస్తే అది మాట్లాడుకునేవాళ్లు. కాని వాళ్లకెప్పుడూ ప్రేమతోటీ, ఆశతోటీ కలగలసిన సంతోషకరమైన కథలు సూర్యకాంతినీ, వెచ్చదనాన్నీ పొదువుకొనిమరీ స్ఫురించేవి. వాళ్ల దృష్టిలో భవిష్యత్తంతా ఒక సుదీర్ఘమైన ప్రకాశభరితమైన సెలవురోజు మాత్రమే. క్రిస్మస్‌కీ, ఈస్టర్‌కీ మధ్య ఉపవాసదినాలు లేని కాలం. అక్కడ ఆ పూలపరదా వెనుక ఎక్కడో జీవితం మొత్తం పైకి ఉబుకుతూ, తళుకులీనుతూ నిశ్శబ్దంగా కాంతినుంచి కాంతికి ధారాపాతంగా ప్రవహిస్తూ ఉంటుంది. వాళ్లు చెప్పుకునే మాటలు కూడా గుసగుసలు మాత్రమే. అవి కూడా సగమే అర్థమయ్యేవి. ఏ కథకీ ఓ ప్రారంభమంటూ ఉండేదికాదు. ఆ కథ నిర్దిష్టంగా ఇలానే సాగాలనీ లేదు, ఏ కథకీ ఓ ముగింపు కూడా ఉండేదికాదు. ఒక్కొకప్పుడు పిల్లలు నలుగురూ ఒక్కసారే మాట్లాడేవారు. అయినా ఒకళ్లనొకళ్లు గాబరా పెట్టుకునేవారు కాదు. వాళ్ల దృష్టి ఎంతసేపూ సుందర స్వర్గలోకపు కాంతిమీదనే ఉండేది. అక్కడ ప్రతిఒక్క మాటా సత్యంగానూ, స్పష్టంగానూ ప్రతిఒక్క కథా నిర్మలంగానూ, నిజంగానూ వినిపిస్తూ ప్రతిఒక్క గాథకీ ఉజ్జ్వలమైన ముగింపు కనిపించేది.

ఆ పిల్లలందరి పోలికలూ ఒక్కలానే అచ్చుగుద్దినట్టుండేది. మసకసంధ్యకాంతిలో అందరికన్నా చిన్నపిల్లవాడు నాలుగేళ్ల టోమ్‌చెక్‌కీ, అందరికన్నా పెద్దవాడు పదేళ్ల పిల్లవాడు  లోయ్‌కాకీ మధ్య తేడా కనబడేది కాదు. అందరి ముఖాలూ పల్చగా, సన్నగా ఉండేవి. అందరి నేత్రాలూ విశాలంగా విప్పారుకుని ప్రతిఒక్కదాన్ని పరికిస్తున్నట్టే ఉండేవి.

ఆ సాయంకాలం ఆ దివ్యలోక కాంతిలోకి ఏదో అజ్ఞాతప్రదేశం నుంచి అజ్ఞాతమైందేదో ఊదారంగు చేతులతో దేన్నో తీసుకువచ్చింది. ఆ వచ్చిందేదో అన్ని సెలవులమీదా, కథలమీదా, గాథలమీదా విరుచుకుపడింది. వాళ్ల నాన్న ఇటాలియన్‌ నేలమీద ‘కూలిపోయాడనే’ వార్త అది. ఆ పిల్లలకి ఎంతమాత్రం అర్థంకానిదేదో కొత్తదీ, విచిత్రమైందీ, అంతదాకా వాళ్లు ఎరుగనిదీ వాళ్లముందొచ్చి నిలుచుంది. లావుగా, పొడుగ్గా వాళ్లముందే నిలబడింది. కానీ దానికి ముఖంలేదు. కళ్లు లేవు. పళ్లు లేవు. నోరులేదు. అసలు దానికంటూ ఏ చోటూ లేదు. చర్చిముందూ, వీథిలోనూ ఉరుకులాడే జీవితం కాదు దానిది. వంటింటి వసారా ముందు పడుతుండే సాయంకాల సంధ్యాకాంతికి చెందింది కాదది. అసలు ఆ కలలప్రపంచానికే సంబంధించింది కాదు.

ఆ వచ్చిన వార్త ఎంతమాత్రం సంతోషభరితమైంది కాదు. అలాగని దానిలో ప్రత్యేకంగా దుఃఖం కలిగించేది ఏదీలేదు. ఎందుకంటే అది మరణం తాలూకు సంగతి. అది కూడా మరణించిన దానితో సమానమే. అదెక్కడినుంచి వచ్చిందో, ఎందుకొచ్చిందో తెలుసుకోవటానికి దానికి కళ్లు లేవు. వివరించడానికి నోరు లేదు. నల్లటి పెద్ద గోడముందు నిశ్చలంగా నిలబడిపోయినట్టు ఆ మహాభూతకాయం ముందు ఆలోచన పిరిగ్గా, బెరుగ్గా నిలబడిపోయింది. ఆ గోడముందు అది మూగగా ఆలోచనలో పడిపోయింది.

‘సరే, ఇంతకీ నాన్న మళ్లా ఎప్పుడు వెనక్కి వస్తాడు?’ అని అడిగాడు టోమ్‌చెక్‌ ఏదో ఆలోచిస్తున్నట్టు.

లోయికా అతణ్ణి కోపంగా చూస్తూ, ‘అతడు కూలిపోయాడంటే వెనక్కి ఎట్లా వస్తాడు?’ అన్నాడు. అంతా మళ్లా నిశ్శబ్దంలో కూరుకుపోయారు. వాళ్లంతా ఆ నల్లటి గోడముందు నిలబడిపోయారు. దాన్ని దాటి వాళ్లేమీ చూడలేకపోయారు.

‘నేను కూడా యుద్ధానికి వెళతాను’ అని అరిచాడు ఏడేళ్ల మేటిషె ఉన్నట్టుండి. ఏదో సరైన ఆలోచన అతడికేదో అకస్మాత్తుగా స్ఫురించినట్టు. బహుశా అప్పటికి అతడు చెప్పగలిగిందేదో అదే అన్నట్టు.

‘నువ్వు మరీ చిన్న పిల్లాడివి’ అని కొట్టిపారేశాడు నాలుగేళ్ల టోమ్‌చెక్‌ దీర్ఘాలోచనతో. వాడింకా చిన్నపిల్లల దుస్తులు వేసుకుంటూనే ఉన్నాడు! అందరిలోకీ మరీ బక్కదీ, ఆరోగ్యం అంతగా లేనిదీ మిల్కా కూడా నోరు తెరిచింది. అది వాళ్ల అమ్మతాలూకు పెద్ద శాలువా ఒంటికి చుట్టబెట్టుకుంది. చూస్తూంటే బాటసారుల గుడ్డలమూట లాగా ఉంది. అది ఎక్కడో నీడల్లోంచి పీలగొంతుతో, మెత్తగా ‘యుద్ధమంటే ఏమిటి? చెప్పు మేటిషే. మాకా కథ చెప్పు?’ అని అడిగింది.

‘యుద్ధమంటే’ మాటిషె వివరించాడు. ‘యుద్ధమంటే మనుషులు ఒకళ్లనొకళ్లు చాకులతో పొడుచుకుంటారు. కత్తులతో నరుక్కుంటారు. తుపాకులతో కాల్చుకుంటారు. నువ్వు ఎంత పొడిస్తే, ఎంత నరికితే అంత మంచిదన్న మాట. నువ్వెంత కాల్చినా నిన్నెవరూ ఏమీ అనరు. ఎందుకంటే అదట్లానే ఉంటుంది. దాన్నే యుద్ధమంటారు’ అన్నాడు.

‘బానే ఉందికానీ, వాళ్లెందుకు పొడుచుకోవాలి? ఒకళ్లనొకళ్లు ఎందుకు నరుక్కోవాలి?’ అని అడిగింది మిల్కా.

‘ఎందుకా? రాజుకోసం’ అన్నాడు మాటిషె. అంతా మౌనంగా ఉండిపోయారు. మబ్బులు కమ్మిన వాళ్ల నేత్రాలముందు ఎక్కడో అస్పష్టదిగంతంలో ఏదో మహాకృతి భరించలేనంత వెలుగుచిమ్ముతూ కనిపించింది. వాళ్లట్లానే కదలకుండా కూర్చుండి పోయారు. చర్చిలో ఆశీర్వాదం చేసేటప్పటిలాగా వాళ్ల ఊపిరి వాళ్ల నోటిని తాకకుండా తప్పించుకోలేకపోతోంది.

ఇంతలోనే మళ్లా మాటిషె తన ఆలోచనల్ని కూడగట్టుకున్నాడు. బహుశా వాళ్ల మీద బరువుగా పరుచుకున్న నిశ్శబ్దాన్ని చెదరగొట్టడానికా అన్నట్టు ‘నేను కూడా యుద్ధానికి పోతున్నాను. శత్రువు మీద పోరాడతాను’ అన్నాడు.

‘శత్రువు ఎట్లా ఉంటాడు? వాడికి కొమ్ములుంటాయా?’ అని అడిగింది మిల్కా పీలగొంతుతో.

‘ఆఁ ఎందుకుండవు. లేకపోతే వాడిని శత్రువని ఎందుకంటాడు?’ అన్నాడు గంభీరంగా టోమ్‌చెక్‌. గట్టిగా నొక్కి పలికిన అతడి మాటల్లో కోపం ప్రతిధ్వనించింది. కానీ ఆ ప్రశ్నకి సరైన సమాధానమేదో మాటిషెకి కూడా తెలిసినట్టు లేదు.

‘వాడికి కొమ్ములుంటాయనుకోను’ అన్నాడు ఆచితూచి మాట్లాడుతున్నట్టు.

‘వాడికి కొమ్ములెలా ఉంటాయి? వాడుకూడా మనలాంటి మనిషే కదా!’ అంది లోయికా అయిష్టంగానే. అప్పుడు మళ్లా ఏదో పునరాలోచిస్తున్నట్టు మరొక మాట కూడా అంది, ‘వాడికి లేనిదల్లా గుండె మటుకే’.

మళ్లా సుదీర్ఘ విరామం. అప్పుడు టోమ్‌చెక్‌ ‘ఒక మనిషి యుద్ధంలో ఎట్లా కూలిపోతాడు. బహుశా ఇలానే వెనక్కి పడిపోతాడేమో’ అనుకుంటూ వెనక్కి పడి చూపించాడు.

‘అతణ్ణి చంపేస్తారు’ అని వివరించాడు మాటిషె.

‘నాన్న నాకో తుపాకీ తెచ్చిస్తానన్నాడు’.

‘నాన్న యుద్ధంలో కూలిపోతే నీకు తుపాకీ ఎలా తెచ్చిస్తాడు?’ అంది లోయికా.

‘అంటే వాళ్లు అతణ్ణి చంపేశారా?’

‘ఆఁ చంపేశారు.’

విశాలంగా విప్పారిన ఆ నేత్రాల్లోంచి నిశ్శబ్దం, విషాదం ఎదుటఉన్న చీకట్లోకి పరుచుకున్నాయి. మనసుకీ, హృదయానికీ కూడా అర్థంకాని ఈ అజ్ఞాత సీమలోకో ఆ చూపులు ప్రయాణించాయి.

అదే సమయంలో ఆ ఇంటిముందు బెంచిమీద తాత నాన్నమ్మ కూర్చున్నారు. తోటలోని నల్లని చెట్లకొమ్మల మధ్య అస్తమిస్తున్న సూర్యుడి చివరి రక్తకాంతి మెరుస్తూ ఉంది. ఎవరిదో గొంతులో కుక్కుకోలేక, ఆపుకోలేక రోదిస్తున్న రోదనధ్వని తప్ప ఆ సాయంకాలం చాలా నిశ్శబ్దంగా ఉంది. మరింత మరింత హృదయవిదారకంగా వినిపిస్తున్న ఆ రోదన పక్కనున్న పశువులకొట్టంలోంచి వినిపిస్తోంది. బహుశా ఆ పిల్లల తల్లి అక్కడ ఆవులకి కుడితి వేస్తున్నట్టుంది.

ఆ ముసలివాళ్లిద్దరూ ఒకరినొకరు ఆనుకుని అట్లానే తలవంచుకుని కూర్చున్నారు. చాలా సేపటిదాకా వాళ్లు ఒకరిచేతినొకరు పట్టుకుని అట్లానే కూర్చుని ఉన్నారు. అప్పుడు సూర్యాస్తమయానంతర సంధ్యాకాంతివైపు అశ్రురహిత నేత్రాలతో మౌనంగా చూస్తూండిపోయారు.

అభ్యాసం

  • ఈ కథలో మీలో రసానుభూతి ఏ క్షణాన మొదలయ్యిందో గుర్తుపట్టగలరా?
  • యుద్ధం ఆ కుటుంబానికి కలిగించిన దుఃఖాన్ని వివరించడంలో కథకుడు పిల్లలచుట్టూతానే కథనం ఎక్కువగా ఎందుకు నడిపించాడు?
  • మీరు చదివిన కథల్లో మీకు గొప్ప రసానుభూతిని ఇచ్చిన కథ ఏది? ఎందువల్ల?

Leave a Reply

%d bloggers like this: