కథా శిల్పం-2

Reading Time: 11 minutes

Jackson Pollock ‘Stenographic Figure’ (c. 1942)

ఇతివృత్తం

కథా నిర్మాణానికి అవసరమైన building blocks లో మొదటగా ఇతివృత్తం అనే అంశాన్ని పరిశీలిద్దాం. ఇంగ్లీషులో theme అనే పదానికి ‘ఇతివృత్తం’ అనేది సమానార్థకమే అయినప్పటికీ, కథారచనకి సంబంధించినంతవరకూ, ‘సారాంశం’ అనేది సరైన పదం అవుతుంది. ఏ కథకైనా ఒక సారాంశం ఉంటుంది. కథలు ప్రత్యేకంగా ఏ సందేశాల్నీ చెప్పవు అని ఒక కథ రాసారనుకుందాం. దాని సారాంశం అదే అవుతుంది. సారాంశం లేకుండా కథకి ఉనికిలేదు.

అందుకని ఒక విమర్శకుడు కథా నిర్మాణం గురించి మాట్లాడేటప్పుడు, సారాంశం అన్నిటికన్నా చివరలో వివరించవలసిన అంశం కావాలి తప్ప, దాంతో మొదలుపెట్ట కూడదు అన్నాడు.

కాని నేను కథానిర్మాణం గురించిన నా వ్యాసాల్ని సారాంశంతోనే మొదలుపెడుతున్నాను. ఎందుకంటే, ఒక కథకుడు కథ చెప్పడానికి పూనుకున్నప్పుడు, అతడి మనసులో ఏదో ఒక భావం ఉంటుంది. ఒక భావం కథగా మారడంలో రెండు తోవలు తొక్కుతుంది. మొదటి దారిలో, కథకుడికి తాను చెప్పదల్చుకున్నదేదో స్పష్టంగా తెలిసి ఉంటుంది. తాను చెప్పాలనుకున్నది మనం వినేలా చెప్పడం కోసమే అతడు తన కథా కథన కౌశల్యన్నంతా వినియోగిస్తాడు. తాను చెప్పాలనుకున్నది తనకి ముందే స్పష్టంగా తెలిసి ఉండటం పూర్వకాలపు కథల పద్ధతి. మౌఖిక సాహిత్యంలో వర్థిల్లిన కథారూపాలన్నింటిలోనూ, కథ చివర చెప్పే నీతి వాక్యం ఆ కథా సారాంశమే. అంటే, కథకుడికి ఒక విస్పష్టమైన నైతిక వ్యవస్థ ఉండి, ఆ వ్యవస్థను మనకు పరిచయం చెయ్యాలనుకునేటప్పుడు, అతడికి తన కథాసారాంశమేమిటో స్పష్టంగా తెలిసి ఉండాలి. ఆధునిక తెలుగు కథకుల్లో కొడవటిగంటి కుటుంబరావు ఈ తరహా కథకుడు. తానొక కథ రాయడానికి పూనుకున్నప్పుడు, ఆ కథలో పాత్రలు తామేమి చెయ్యబోతున్నాయో తనకి ముందే విస్పష్టంగా తెలిసి ఉండాలనీ లేకపోతే తానా కథ చెప్పడానికి పూనుకోననీ ఆయనొక చోట రాసుకున్నాడు.

కాని, ఈ పద్ధతిని వ్యతిరేకించే మరో దృక్పథముంది. వారేమంటారంటే, ఒక భావం కథగా మారడమనేది, ఆ కథారచన ద్వారా జరగవలసిందే తప్ప, ముందే జరగవలసింది కాదు అని. ముందే మనసులో కథ ఏర్పడి ఉంటే, కథకుడు ఆ కథకి కథకుడుగాకాక లేఖకుడిగా మారిపోతాడనీ, అలా కాక, తన మనసులో ఉదయించిన భావాన్ని పట్టుకుని, కొన్ని పాత్రల ద్వారా, వారి చర్యల ద్వారా, కథకుడు తన కథని అన్వేషిస్తాడనీ, చివరకు అతడొక సాక్షాత్కారానికి లోనవుతాడనీ, అప్పుడు మాత్రమే నిజమైన కథ ప్రభవిస్తుందనీ వారంటారు. ఆధునిక కథ ప్రధానంగా ఈ ధోరణి కథ. ఇక్కడ కథకుడి ప్రధాన ఉద్దేశ్యం ఒక నైతిక వ్యవస్థను స్థిరపరచడం కాదు, ప్రపంచం ఎలా నడుస్తున్నదో ఒక పార్శ్వంలో పరిశీలించడం, తన పరిశీలనను తక్కినవారితో పంచుకోవడం. ఈ పద్ధతి ప్రకారం కథా సారాంశం కథతో పాటే వెల్లడి కావాలి తప్ప ముందే తెలిసిపోయేది కాదు. పాత్రలు, సన్నివేశం, వాతావరణం, మనఃస్థితి అనే నాలుగు అంశాలు కలిసి సారాంశాన్ని రూపొందిస్తాయనేది వారి వాదన.

మొదటి తరహా కథల్లో సారాంశాన్ని గుర్తించడం సులభం. పూర్వకాలపు కథల్లాగా చివర నీతి వాక్యం రాయకపోయినప్పటికీ, ఆ కథలు ఏ సందేశాన్నిస్తున్నాయో చెప్పడం సులభమే. కాని రెండవ తరహా కథల సారాంశాన్ని చెప్పడం అంత సులభసాధ్యం కాదు. ఉదాహరణకి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రాసిన ‘గులాబీ అత్తరు ‘ కథలో సారాంశం సుస్పష్టమే. కాని త్రిపుర రాసిన ‘వలసపక్షుల గానం’ కథా సారాంశమేమిటో చెప్పడం అంత సులభం కాదు.

కథకుడు కథ రాయడం కాదు, కథ కథకుణ్ణి రాస్తుంది

కథకుడు కథ చెప్పడానికి పూనుకున్నప్పుడు తన ఉద్దేశ్యమేమిటో అతడికి స్పష్టంగా తెలిసి ఉండటం ఒక వైఖరికాగా, తన ఉద్దేశ్యమేమిటో ముందే స్పష్టంగా తెలియకుండా, కథానిర్మాణం ద్వారా, తన ఉద్దేశ్యాన్ని అన్వేషించేది రెండవ వైఖరి అని చెప్పుకున్నాం. ఈ రెండింటికన్నా భిన్నమైన మూడవ వైఖరి కూడా ఉంది. అదేమంటే, కథకుడు స్పష్టంగా ఒక ఉద్దేశ్యాన్ని మనసులో పెట్టుకుని దాన్ని కథగా మలచడానికి పూనుకుంటాడు. ఆ క్రమంలో పాత్రల్ని ప్రవేశపెట్టాక, తర్వాతి కథ ఆ పాత్రలే నడుపుకుంటూ పోతాయి. తన స్పష్టమైన ఉద్దేశ్యాలకీ, పాత్రల ప్రవర్తనకీ మధ్య లంకె తెగిపోతుంది. కథకుడు నివ్వెరబోయి చూస్తూ ఉండగా, అతడు రాసిన కథ అతణ్ణే అతడికి సరికొత్తగా పరిచయం చేస్తుంది.

దీన్నే ఇప్పటి విమర్శకులు, కథకుడు కథ రాయడం కాదు, కథనే కథకుణ్ణి రూపొందిస్తుంది అంటున్నారు. అక్కడితో ఆగకుండా మరొక అడుగు ముందుకు వేసి ‘కథలు చెప్పుకోకపోతే మనల్ని మనం పోగొట్టుకున్నట్టే’ అని కూడా అంటున్నారు. న్యురాలజిస్టులు తమ పరిశోధనలో భాగంగా చివరికి ‘ మనుషులు కథలు చెప్పుకోలేని స్థితికి చేరుకున్నారంటే, వాళ్ళు తమని తాము పోగొట్టుకున్నట్టే’ అనే ప్రతిపాదనకు చేరుకున్నారని చెప్తూ, జెరోం బ్రూనర్ తన సుప్రసిద్ధ రచన Making Stories (2002) లో ‘కథన సామర్థ్యం కొరవడిందంటే మనుషులకు తమ స్వీయ వ్యక్తిత్వ నిర్మాణం సాధ్యం కాదన్నట్టే’ ( The construction of self hood, it seems, can not proceed without a capacity to narrate)  అని తేల్చేస్తాడు.

ఇందుకు కారణం మనం చెప్పే కథ కేవలం మన వ్యక్త ఉద్దేశ్యాల్నీ, విలువల్నీ, జీవితదృక్పథాల్నీ ప్రతిబింబించడంతో ఆగకుండా, మన అవ్యక్త ఆకాంక్షల్నీ, భయాల్నీ, మనకి తెలియకుండానే మన అంతరాంతరాల్లో మనం ప్రగాఢంగా నమ్ముతున్న విశ్వాసాల్నీ కూడా ముందుకు తీసుకొస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, కథ చెప్పడానికి పూనుకోవడమంటే, మనం మన అంతరాంతరాల్లోకి ప్రయాణం మొదలుపెట్టడం.  ఆ ప్రయాణంలో మన వ్యక్తమానసం, అవ్యక్తమానసం ఒకదానితో ఒకటి తీవ్రంగా సంఘర్షిస్తూ చివరికి సమాధానపడతాయి. అప్పటికి మనం చెప్పాలనుకున్న కథ పూర్తయిందని మనం గ్రహిస్తాం.

ఒక కథకి ఇతివృత్తాన్ని ఎంచుకోవడం చూడటానికి పైకి సులభంగానే కనిపించినా, మనకి ఆ వస్తువు స్పష్టంగా తెలిసినట్టే ఉన్నా, ఆ కథ రాయడం వాయిదా వేస్తూనే ఉంటాం. ఎందుకంటే, ఆ ఇతివృత్తం మనలోని అవ్యక్త చైతన్యాన్ని కుదపడం మొదలుపెడుతోందన్నమాట. మనల్ని ఏదో ఒక భావమో, అనుభవమో ఏళ్ళ తరబడి వేధిస్తూ ఎంత ప్రయత్నించినా కథగా రూపుదిద్దుకోకపోవడం మనలో చాలామందికి అనుభవంలోకి వచ్చిన విషయమే. అది ప్రధానంగా ఇతివృత్తానికి సంబంధించిన సమస్య అని మనం గుర్తుపెట్టుకోవాలి. దానికి పరిష్కారం, మనల్ని వేధిస్తున్న ఆ భావాన్ని సాహసంగా పట్టుకుని కథగా మార్చడానికి పూనుకోవడమే.

స్పందన నుంచి రసానుభూతిదాకా

కథకుడికి తాను రాస్తున్న కథాసారాంశమేమిటో ముందే తెలిసినా, తెలియకపోయినా కూడా, కథ పుట్టేదొక స్పందనశీల క్షణంలోనే. కథకుడికి సంభవించిన ఏదో ఒక అనుభవం, ఒక ఆలోచన, లేదా అతడికెదురైన ఒక దృశ్యం, ఒక వార్త, ఒక సంభాషణ లేదా ఏదో ఒక సామెత, ఒక కొటేషన్- ఏదో ఒకటి ముందతడిలో ఒక స్పందన కలిగిస్తుంది. దీన్ని గుస్టావ్ ఫ్రేటాగ్ idea అన్నాడు (An Exposition of Dramatic Composition and Art, 1894). దాదాపుగా ఇటువంటి భావాన్నే పదవ శతాబ్దానికి చెందిన ధనంజయుడు ‘దశరూపకం‘లో ‘బీజం’ (1:25) అన్నాడు. ఈ స్పందన ఒక భావంగా బీజరూపంలో అంకురించి, ఇతివృత్తంగా వికసించి, పాఠకుడిలో ఒక రసానుభూతిని కలిగించండంలో పర్యవసిస్తుంది.

అయితే ప్రతి స్పందనా ఇతివృత్తంగా మారదు. కథకుడు తనకు కలిగిన స్పందనను పాఠకుడితో పంచుకున్నప్పుడు, పాఠకుడిలో ఒక రసానుభూతి కలిగినప్పుడు మాత్రమే అది కథగా నిలబడుతుంది. రసానుభూతిని కలిగించని సందేశం కేవలం సమాచారంగా మాత్రమే మిగిలిపోతుంది. ఈ విషయంలో కథానిక కూడా ఖండకావ్యం లాంటిదే.

చిన్న కథ చదివినప్పుడు పాఠకుడు లోనయ్యే ఈ రసానుభూతి దాదాపుగా ఆధ్యాత్మికానుభూతికి సమానమైనదని భావిస్తూ, జేమ్స్ జాయిస్ దాన్ని epiphany అన్నాడు. దీన్ని ధనంజయుడు పేర్కొన్న ‘ఫలాగమం ‘ లేదా ‘ఫలయోగం ‘ (1:28) తో పోల్చవచ్చు. కాబట్టి ఇతివృత్తం తాలూకు ఒక కొస కథకుడి స్పందనలోనూ, మరొక కొస పాఠకుడి ఫలప్రాప్తిలోనూ ఉందనాలి.

అందుకనే, మనమొక కథ చదివాక ఆ కథలోని వివరాలన్నీ మర్చిపోయేక కూడా మనల్ని అంటిపెట్టుకున్న భావం ఏది ఉంటుందో దాన్నే ఆ కథ తాలూకు నిజమైన ఇతివృత్తంగా భావించాలని కొందరన్నారు. ఇది ఒకరకంగా ఎడ్గార్ అలన్ పో చెప్పిన single most effect ని వేరే పదాల్లో వివరించడమే. ఈ భావాన్నే ఫ్లానెరీ ఓ కోనార్, టాల్ స్టాయి తమదైన మాటల్లో మరింత వివరంగా చెప్పారు.

ఫ్లానరీ ఓ కోనార్ చెప్పినదాని ప్రకారం ఒక కథ తాలూకు ఇతివృత్తాన్ని ఆ కథాసందేశంగా కుదించి చెప్పలేం. ప్రతి కథా మనకి అందించే సందేశం, మనం ఆ కథ చదవడం ద్వారా మాత్రమే మనం అనుభవంలోకి తెచ్చుకోగలుగుతాం. ఆమె ఇలా అంటున్నది:

‘ఒక కథచెప్పడమంటే, దాన్ని మరోలా చెప్పలేకపోవడమే. ఒక కథ ఏం చెప్తొందో అర్థం చేసుకోవాలంటే, దాంట్లో ప్రతి ఒక్క పదాన్నీ తరచి చూడవలసిందే. అందుకనే ఎవరేనా ఆ కథలో ఏముంది అనడిగితే మనం వాళ్ళని ఆ కథ చదవమనడం తప్ప మరేమీ చెప్పలేం.’

 టాల్ స్టాయి ఇలా రాస్తున్నాడు:

‘ఏ కళాకృతిలోనైనా అత్యంత కీలకమైన అంశం దానికొక కేంద్రం ఉండితీరాలి. అంటే ఆ కేంద్రం దగ్గర కిరణాలన్నీ ఏకీకృతం కావాలి, లేదా అక్కణ్ణుంచి నలుదిక్కులా ప్రసరించాలి. నిజమైన కళ ముఖ్య లక్షణాల్లో ఒకటి, అది చెప్పే సందేశమేదో, అది మాత్రమే సంపూర్తిగా చెప్పగలగడం.’

పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయి తమ తమ జీవితాలు వెతుక్కుంటూ వెళ్ళిపోయాక ఆ తల్లిదండ్రులు అనుభవించే ఒంటరితనమూ, శూన్యమూ ‘వలసపక్షుల గానం’లో ఇతివృత్తం అని చెప్పినందువల్ల పాఠకుడికి ఏమి తెలుస్తుంది? ఆ కథలో ఏముందో తెలుసుకోవాలంటే, అతడా కథ స్వయంగా చదువుకుని ఆ సారాంశాన్ని తనకై తాను అనుభవంలోకి తెచ్చుకోడమొక్కటే మార్గం.

ఓ హెన్రీ : ‘ఒక మనిషి న్యూయార్క్ వాసి గా మారిన వేళ

ఇదిగో, ఇక్కడ ఓ హెన్రీ కథ ఉంది. ఒక మనిషి న్యూయార్క్ వాసిగా మారే క్రమాన్ని వివరించడం ఈ కథ ఇతివృత్తం అని శీర్షికలోనే మనకి తెలుస్తోంది. కాని, కథ పూర్తిగా చదివాక, శీర్షిక కథలోని ఇతివృత్తాన్ని సూచిస్తోందే తప్ప పూర్తిగా మన అనుభవంలోకి తేవడం లేదని అర్థమవుతుంది.

ఈ కథలో ఇతివృత్తమేమిటో కథ మొత్తం చదివిన తరువాత మన అనుభవంలోకి వచ్చే ఒక అనుభూతి ద్వారానే తెలుస్తున్నది. కాని అక్కడితో ఆగకుండా ఓ హెన్రీకీ, న్యూయార్క్ కీ మధ్య ఉన్న అనుబంధం గురించి మరింత తెలుసుకోవాలనే కుతూహలానికి లోనవకుండా ఉండలేం.

ఓ హెన్రీ ని తెలుగు పాఠకులు ప్రధానంగా అతడి కథల్లోని కొసమెరుపు టెక్నిక్ గురించే గుర్తుపెట్టుకున్నారు. కాని అది చాలా పాక్షికమైన ప్రశంస మాత్రమే. ఓ హెన్రీలో ఒక ప్రగాఢమైన సామజిక అసమ్మతికారుడు ప్రచ్ఛన్నంగా ఉన్నాడు. సమాజంలో ప్రత్యక్షంగా కనబడుతున్న అసమానతలపట్లా, అన్యాయాల పట్లా అతడి రక్తం ఉడుకులెత్తుతూనే ఉందని అతడి కథలెన్నో సాక్ష్యమిస్తున్నాయి. ముఖ్యంగా, అమెరికన్ మహానగరాల్లో నిరాశ్రయులూ, చిన్న ఉద్యోగులూ, చాలీచాలని వేతనం మీద పనిచేసే కార్మికులూ, వెయిటర్లూ, పోర్టర్లూ, టైపిస్టులూ అతడి కథల్లో అడుగడుగునా కనిపిస్తారు. అతి తక్కువ వేతనమిస్తూ చిన్న ఉద్యోగుల తోటి అంతులేని చాకిరీ చేయించుకునే వాణిజ్యప్రపంచాన్ని అతడు ఏ మాత్రం క్షమించలేక పోయాడు. ఆ జీవితాన్ని కథలుగా చిత్రించడం మినహా మరేమీ చేయలేక పోతున్నందుకు అతడు మరింత ఆక్రోశిస్తూనే ఉన్నాడు. నిజానికి ఆ జీవితాల్ని కథలుగా మార్చినా, ఆ కథలకి ముగింపు ఉండదని కూడా అతడికి తెలుసు.

An Unfinished Story (1906) అనే కథని చూడండి. ఆ కథని ఏ విధంగానూ ముగించలేక, అతడీ చివరి వాక్యాలు రాసాడని మనకి అర్థమవుతూనే ఉంటుంది:

‘ఆ రాత్రి నేనో కలగన్నాను. గొప్ప లక్ష్మీకళతో తళతళలాడుతున్న ఒక దేవదూతల గుంపుకి దగ్గరగా నిలబడ్డట్టూ, అప్పుడు నన్నో పోలీసు నా రెక్క పట్టుకు పక్కకులాగి నేను కూడా వాళ్ళల్లో ఒకడినా అని అడిగినట్టూ కలగన్నాను.
‘వాళ్ళెవరు?’ అనడిగాను.
‘నీకెందుకు? అన్నాడతడు. ‘వాళ్ళంతా వారానికి అయిదారు డాలర్లు కూలీ మీద ఆడమనుషుల్ని పనిలో పెట్టుకున్నవాళ్ళు. నువ్వు కూడా వాళ్ళబాపతేనా’ అనడిగాడు.
‘అబ్బే లేదు ‘అన్నాన్నేను. ‘నేను మరీ అంత ఘనుణ్ణి కాను. నేను చేసిందంతా,  ఒక అనాథపిల్లల శరణాలయానికి నిప్పు పెట్టడమూ, నాలుగు చిల్లరపైసల కోసం గుడ్డి బిచ్చగాణ్ణి హత్యచెయ్యడమూ. అంతే’ అన్నాన్నేను.

కానీ, ఈ నిష్ఠురమైన వాస్తవాన్ని చిత్రించే ఓ హెన్రీలో ఒక స్వాప్నికుడూ, ఒక రొమాంటిసిస్టూ కూడా ఉన్నారు. ‘అతడిలో ఒక సింబలిస్టు కవి ఉన్నాడు’ అని హెరాల్డ్ బ్లూమ్ అన్న మాటల్లో చాలా సత్యముంది. అతడు న్యూయార్క్ ని ఒక కవిలాగా సమీపించాడు, హృదయానికి హత్తుకున్నాడు, ప్రాణాధికంగా ప్రేమించాడు. డాస్టొవిస్కీకి సెంట్ పీటర్స్ బర్గ్ లాగా, జాయిస్ కి డబ్లిన్ లాగా, సాదత్ హసన్ మంటోకి ముంబై లాగా, ఓ హెన్రీకి న్యూయార్క్ కథనభూమి.

మూడేళ్ళ జైలు శిక్ష తరువాత, 1902 లో న్యూయార్క్ లో అడుగుపెట్టిన ఓ హెన్రీ మరణించేదాకా, దాదాపు తొమ్మిదేళ్ళ పాటు న్యూయార్క్ నే అంటిపెట్టుకుని ఉండిపోయాడు. అతడి 383 కథల్లో దాదాపు 140 కథల్లో న్యూయార్క్ ప్రస్తావన ఎక్కడో ఒక చోట ఉంటుంది. కనీసం నలభై కథలకి న్యూయార్క్ నే నేపథ్యం. ఒక విమర్శకుడిట్లా రాసాడు:

‘ఓ హెన్రీ జీవితంలోని చివరి సంవత్సరాల్లోనే న్యూయార్క్ అతడికి పరిచయమైనప్పటికీ, అతడి పరిణత సాహిత్యంలో మూడింట రెండు వంతుల పాటు ఆ ‘బిగ్ సిటీ’ నే కథానాయిక. అతడికళ్ళకి ఆ నగరమెప్పుడూ ఒక ఆశ్చర్యకరమైన రహస్యంగానే కనిపిస్తూ వచ్చింది.  ఆ నగరం అతడికి సబ్ వే మీద ప్రత్యక్షమయ్యే బాగ్దాదు. అక్కడ సదా అతడికి అల్లాఉద్దీన్లు మాయాదీపాలు చేతపట్టుకుని రుద్దుతూనే కనిపిస్తున్నారు. అసంఖ్యాకమైన నలభై దొంగల ముఠాలు ఎప్పటికప్పుడు ఆ నగర గృహద్వారాల మీద సుద్దముక్కల్తో గీతలు గీస్తూనే ఉన్నారు .. అతడా నగరం ఆ మూలనించి ఈ మూల దాకా ఒక ఆధునిక హారూన్-అల్-రషీద్ లాగా సంచరిస్తూనే ఉన్నాడు..’

1905 లో హెన్రీజేమ్స్ న్యూయార్క్ ని ‘దారుణమైన నగరం’ అని అభివర్ణించాడట. కానీ, ఇరవయ్యవశతాబ్ది రచయితలకీ, పాఠకులకీ న్యూయార్క్ అంటే ఓ హెన్రీ పరిచయం చేసిన న్యూయార్క్ నే. ఆ దారుణనగరంలో ఒక స్వప్నసదృశమైన మహనీయ మానవతాంశని కూడా ఓ హెన్రీ చూసాడు. ఆ నగరం తన యంత్రమయ, వ్యాపారమయ పార్శ్వాల్ని పక్కన పెట్టి కనీసం ఒక్కక్షణమేనా అతణ్ణి ప్రేమతో దగ్గరకు తీసుకుంది. ఆ క్షణంలోనే అతడు న్యూయార్క్ వాసిగా మారిపోయేడు. అంతదాకా మన్ హాట్టన్ గా మాత్రమే తెలిసిన నగరం ఆ క్షణాన అతడికి న్యూ యార్క్ గా మారిపోయింది.

‘ఒక మనిషి న్యూయార్క్ వాసి గా మారిన వేళ’ కథలో ఇతివృత్తమంటే ఇదంతా అన్నమాట. ఆ శీర్షిక మొదటిసారి చదవగానే, మనకి ఒక మనిషి న్యూయార్క్ వాసిగా మారడమేమిటో అర్థం కాదు. అయినా ఏదో ఊహించే ప్రయత్నం చేస్తాం. కాని, ఆ క్షణం, అమెరికన్ నగరాలెన్నింటినో ఒక కవిలాగా పరీక్షకు పెడుతూ వచ్చిన కథకుడు తనకు తెలీకుండానే న్యూయార్క్ వాసి గా మారిపోయిన ఆ క్షణం మనకి విభ్రమ కలిగిస్తుంది. అటువంటి ముగింపుని మనం కొసమెరుపు అనుకోవచ్చు, కాని, కథలో ఆకర్షణ ఆ కొసమెరుపులో లేదు.

ఈ కథని ఒకరకంగా నీతికథ అని కూడా అనుకోవచ్చు. ఒక మహానగరం తన పౌరుడి పట్ల మానవత్వం చూపిన క్షణంలో మాత్రమే అతణ్ణి తన పౌరుడిగా మార్చుకుంటుందనేది ఇందులో నీతి. కాని, ఈ ఇతివృత్తం పూర్తి నైతిక ఇతివృత్తం అనడానికి లేదు. నిజంగా న్యూయార్క్ తన పౌరుల పట్ల అలా ప్రవర్తించిందా? అసలే ఆధునిక మహానగరమైనా తన పౌరుల పట్ల అటువంటి నిష్కారణ మానవత్వాన్ని చూపిస్తుందా?బహుశా చూపిస్తుందేమో. అలా చూపిస్తుందనే స్వప్న సదృశమైన ఒక ఆశ కలిగించినందువల్ల, ఈ కథ వెయ్యిన్నొక్క అరేబియా రాత్రుల తరహా కథగా కూడా మారిపోయింది.

ఇప్పుడు కథ చదవండి.

ఒక మనిషి న్యూయార్క్ వాసి గా మారిన వేళ

తక్కిన విషయాలన్నీ అలా ఉంచి రేగల్స్‌ని ఓ కవి అని చెప్పవలసి ఉంటుంది. అతణ్ణి దిమ్మరి అన్నారు. కానీ అలా అనటం నిజానికి అతణ్ణి ఒక తత్త్వవేత్త, ఒక కళాకారుడు, ఒక లోకసంచారి, ఒక ప్రాకృతికవాది, ఒక అన్వేషి అని సూటిగా అనలేకపోవటమే. అన్నిటికన్నా ముఖ్యంగా అతడొక కవి. తన జీవితమంతా కూడా అతడొక్క కవితావాక్యం కూడా రాయలేదు. కానీ అతడు అతడి కవిత్వాన్ని జీవించాడు. బహుశా అతడు తన మహాకావ్యం, తన ఒడెస్సీని రాసి ఉంటే అది బహుశా ఒక లిమరిక్‌ మాత్రమే అయి ఉండేది. ఏమైనా కానీ ముందుచెప్పినమాటే మళ్లా చెప్పాలంటే అతడు ప్రధానంగా కవి అనే చెప్పాలి.

అతడికి మనం కలమూ, కాయితమూ ఇచ్చి ఉంటే బహుశా అతడు నగరాల మీద సానెట్లు రాయటంలో ఆరితేరి ఉండేవాడు. ఆడవాళ్లు అద్దాల్లో తమ ప్రతిబింబాల్ని పరిశీలించుకునేటంత సాంద్రంగా అతడు నగరాల్ని అధ్యయనం చేశాడు. పక్కనపారేసుకున్న బొమ్మమీద పేరుకున్న దుమ్ముని పిల్లలు పరిశీలించినంత శ్రద్ధగా అతడు నగరాల్ని పరిశీలించాడు. వన్యప్రాణులు గురించి రాసేవాళ్లు జంతుప్రదర్శనశాలల్లో పంజరాల్ని పరిశీలించేటంత జాగ్రత్తగా అతడు నగరాల్ని అధ్యయనం చేశాడు. రేగల్స్‌ దృష్టిలో నగరమంటే కేవలం మట్టి, ఇటుకలు పేర్చి ఏదోకొంతమంది మనుషులకు ఆశ్రయమిచ్చే స్థలం మాత్రమే కాదు. అతడి దృష్టిలో ప్రతి నగరానికీ, తనదంటూ విస్పష్టమైన ఒక ఆత్మ ఉంటుంది. ఒక నిర్దిష్టమైన జీవన సముదాయముంటుంది. దానికొక విలక్షణ సారాంశముంటుంది. సౌరభముంటుంది. సౌందర్యముంటుంది. కవితాత్మక భావావేశంతో రెండువేళ్ల మైళ్ల పాటు నగరాల్ని తన హృదయానికి హత్తుకుంటూ రేగెల్స్‌ తూర్పుపడమరలకీ, ఉత్తరదక్షిణాలకీ మధ్య పరిభ్రమిస్తూ గడిపాడు. దుమ్ము కొట్టుకుపోయిన రోడ్లమీద కాలినడకనా, వేగంగా సంచరించే రవాణా సాధనాలమీదా, ఎలా పడితే అలా కాలాన్ని లెక్క చేయకుండా తిరిగాడు. ఇక ఒక్కసారంటూ ఆ నగరహృదయం పసిగట్టాక, దాని రహస్యసంభాషణ చెవిన పడ్డాక, ఇకతడు దాన్ని వదలిపెట్టి మరో నగరానికి వెళ్లిపోయేవాడు. నిజమే, రేగల్స్‌ చంచలంగానే గడిపాడు. బహుశా అతడి విమర్శనాశక్తిని ఉపయోగించుకోగల పురపాలకసంస్థ ఏదీ అతడికి తారసపడలేదనుకోవాలి.

ప్రాచీనకవులు నగరాల్ని స్త్రీలతో పోల్చినట్టు మనం విన్నాం. మన కవి రేగల్స్‌కి కూడా అవి స్త్రీలుగానే కనబడ్డాయి. అతడు మోహించిన ప్రతిఒక్క నగరం కూడా అతడికొక విస్పష్టమైన ఆకృతిలోనే గోచరిస్తూ వచ్చింది.

ఉదాహరణకి చికాగో నగరం అతడిని మిస్సెస్‌ పారింగ్టన్‌ లాగా కోమల మలయపవనస్పర్శతో నిద్రలేపింది. భవిష్యత్తును వాగ్దానం చేసే ఒక సుందరగీతంలాగా అతడి మనస్సును చలింపచేసింది. కానీ ఆ నగర ఉదాత్తాశయాలు బంగాళాదుంపల కూరా, చేపల వాసనల్లో ఇగిరిపోయిన భయానకవాస్తవంలోకి మేల్కోవడానికి అతడికెంతోసేపు పట్టలేదు.

చికాగో అతడి మీద చూపించిన ప్రభావం అలా ఉంది. బహుశా నేనిచ్చిన ఈ వర్ణనలో కొంత అస్పష్టతా, కొంత పొరపాటూ ఉండి ఉండవచ్చు. కానీ ఆ పొరపాటు రేగల్స్‌దే. అతడు ఆ నగరం తనకు కలిగించిన సంవేదనల్ని ఎప్పటికప్పుడు కవితలుగా రాసి ఉండవలసింది.

పిట్స్‌బర్గ్‌ కూడా అతణ్ణి సమ్మోహితుణ్ణి చేసింది. ఆ సమ్మోహం డాక్స్‌స్టేడర్‌ గాయకులు ఏదో రైల్వేస్టేషన్‌లో రష్యన్‌భాషలో అభినయించిన ఒథెల్లో నాటకం కలిగించే సమ్మోహం లాంటిది. పిట్స్‌బర్గ్‌ అతడికి ఉదారవంతురాలైన రాజకుటుంబీకురాల్లాగా కనిపించింది. పరిపుష్టదేహంతో ఇంటిపట్టున ఉండే మనస్విని  అయిన ఒక స్త్రీలాగ. కాళ్లకు తెల్లటి చెప్పులు తొడుక్కుని ఒంటిమీద పట్టువస్త్రాలు ధరించి మరీ  గిన్నెలు కడుక్కుంటున్న స్త్రీ. ఆమె ఇంట్లో వెచ్చటి నెగడి దగ్గర రేగల్స్‌ను కూర్చోబెట్టుకుని వేయించిన బంగాళాదుంపలు, పందిమాంసం వడ్డించి షాంపేన్‌ పోస్తున్నట్టుగా కనిపించిందతడికి.

ఇక న్యూ ఆర్లియన్స్‌ నగరం తన బాల్కనీ నుంచి అతణ్ణి ఊరికే చూసి ఊరుకున్నట్టు అనిపించింది. ఆమె తళుకులీనే నేత్రాలనూ, ఒక ఉదాసీన భావాన్నీ, అందులో ఎక్కడో రెపరెపలాడే ఒక అభిమానాన్నీ అతను చూడకపోలేదు. కానీ అంతే. అతడు ఆమెకు ముఖాముఖి ఎదురైంది ఒక్కసారే. అదొక సుప్రభాతవేళ. అది ఆమె తన ఇల్లు ఊడ్చుకుంటూ కనబడింది. ఏదో ఒక కూనిరాగం పాడుకుంటూ కనబడింది. ఆమె ఇల్లు కడుక్కుంటున్న చల్లని నీళ్లు రేగల్స్‌ బూట్లను తడిపేశాయి. ఓరిదేవుడా!

రేగల్స్‌ కవితాత్మను బోస్టన్‌ నగరం తనదైన పద్ధతిలో విలక్షణంగా అర్థం చేసుకుంది. ఆ నగరాన్ని చూసినప్పుడు అతడికి చల్లటి టీ తాగినట్టూ, ఆ నగరం తన తలచుట్టూ చుట్టిన చల్లటి తెల్లటివస్త్రంలానూ, అదంతా ఏదో అర్థంకాని ఒక గంభీరమైన మానసికప్రయత్నాన్ని మేల్కొల్పడానికి చేస్తున్న పనిలానూ గోచరించింది. ఇంతకీ అతడక్కడికి వెళ్లింది అక్కడి మంచు గడ్డలు తవ్వి, ఏదో ఒక జీవనోపాధి వెతుక్కోవడానికి. కానీ అతడి చుట్టూ బిగిసిన గుడ్డ మరింత తడిసి, ముడి బిగిసిపోయి ఊడదీయడానికి వీలులేకుండా పోయింది.

ఇవన్నీ అస్పష్టంగానూ, అర్థంకాకుండా ఉన్న ఆలోచనలని మీరనవచ్చు. కానీ ఈ కవి ఊహల్ని మీరు కొంత సహృదయంతో అర్థం చేసుకోవాలి. చూడండి, ఒకవేళ ఇవే కావ్యాలుగా మీ ఎదుటకు వచ్చి ఉంటే! ఒకనాడు రేగల్స్‌ ఉన్నట్టుండి మన్ హాట్టన్ మహానగర హృదయాన్ని చేజిక్కించుకున్నాడు. ఆమె నగరాల్నిటిలోనూ సముజ్జ్వలమైంది. అతడామె సంగీతాన్ని ఆరోహణ, అవరోహణ క్రమంలో అర్థం చేసుకోవాలనుకున్నాడు. తనలో ఆమె రేకెత్తిస్తున్న అభిరుచిని బోధపరచుకోవాలనీ, ఆ స్వభావాన్ని వర్గీకరించాలనీ, ఆ సంవేదనల్ని ఒక కొలిక్కి తెచ్చుకోవాలనీ, దానికి ఓ పేరుపెట్టాలనీ, తక్కిన నగరాలు తనపై చూపిన ముద్రలతో పోలిస్తే ఆమె ఎక్కడ ఉందో గుర్తుపట్టాలనీ అనుకున్నాడు. ఇక ఇక్కడికి వచ్చేటప్పటికి మనం రేగెల్స్‌ భావాలను అనువదించడం పక్కనపెట్టి ఇక అతడి జీవిత విశేషాల్ని నమోదు చేయడం మొదలుపెట్టక తప్పదు.

ఒకనాడు పొద్దున్నే అతడో ఫెర్రీబోటు దిగి ఉల్లాసంగా నగరమధ్యంలో అడుగుపెట్టాడు. అతడు ఆ నగరంలో ఒక అజ్ఞాతవ్యక్తిలాగా తన పాత్ర పోషించాలనుకున్నాడు. ఏ దేశం, జాతి, వర్గం, సంఘం, పార్టి, గోత్రం, లేదా ఏ మానవసమూహం కూడా అతణ్ణి తనదిగా చెప్పుకోలేదు. రకరకాల వ్యక్తులు వాళ్లవాళ్ల కొలతల్ని బట్టి తొడుక్కునే దుస్తుల్ని, అతడికి అప్పుడప్పుడు దానం చేసిన వాటిని, అతడు తన దుస్తులుగా తొడుక్కున్నాడు. ఆ దుస్తుల కొలతలు అతడి శరీరానికి ఇంకా సరిపోకుండా అట్లానే వేలాడుతున్నాయి.

రోడ్డుపక్కన ఏ దేశాలనుంచో వచ్చి మిషన్లు పెట్టి కుట్టుకునే దర్జీవాళ్లు మనకోసం తయారుచేసే దుస్తుల్లాగా, వస్తువుల్లాగా ఉచితంగా ఇచ్చే కానుకల్లాగా ఆ దుస్తులు అతడికి అతికీఅతక్కుండానే వేలాడుతున్నాయి. అచ్చం ఒక కవిలానే అతడు చేత చిల్లిగవ్వ లేకుండా, ఆ నగరంలో అడుగుపెట్టాడు. కానీ పాలపుంతలో ఒక కొత్తనక్షత్రాన్ని కనిపెట్టేటప్పుడు  ఖగోళశాస్త్రజ్ఞుడు లోనయ్యే భావావేశంలాంటిది, లేదా తన ఊటకలం నుంచి అకస్మాతుగా సిరా ప్రవహిస్తున్నప్పుడు మనిషిలో కలిగే అనుభూతి లాంటిది రేగల్స్‌లో అప్పుడు పరవళ్లు తొక్కింది.

మధ్యాహ్నం గడిచిన తరువాత అహరాహ్ణవేళకి అతడు ఆ నగర రణగొణ ధ్వనినుండి బయటపడగలిగాడు. అతడి ముఖంలో ఒక మూగభయాందోళన కనిపించింది. అతడు ఓడిపోయినట్టుగా భీతావహుడయినట్టుగా, నిశ్చేష్టుడయినట్టుగా నిలబడిపోయాడు.

తక్కిన నగరాలు అతడికి సుదీర్ఘమైన పాఠ్యపుస్తకాలు లాగా కనిపించాయి. తొందరగా వెంటపడదగ్గ గ్రామీణయువతుల్లాగా ఊహించాయి. సమాధానాలు పూరిస్తే పూర్తిచందా ఉచితంగా దొరికే ప్రహేళిక ల్లాగా కనిపించాయి. ఆస్వాదించదగ్గ పానీయాల్లాగా గోచరించాయి. కానీ ఈ నగరం కిటికీలో పెట్టిన మేలిమి వజ్రం లాగా శీతలంగా, నిశ్శబ్దంగా, మిరుమిట్లు గొలుపుతూ అసాధ్యంగా గోచరించింది. అతడు ఆ కిటికీ బయట తన జేబులో చల్లగా తగులుతున్న కొద్దిపాటి జీతాన్ని ఊరికే తడుముకుంటున్న నిస్సహాయప్రేమికుడులాగా నిలబడిపోయాడు.

తక్కిన నగరాలు అందించే శుభాకాంక్షలు అతనికి బాగా తెలిసినవే. వాటి సహజసిద్ధమైన దయార్ద్రతా, మానవీయఔదార్యమూ, స్నేహపూరక శాపనార్థాలూ, అతి కుతూహలం, తొందరగా నమ్మడం లేదా నమ్మకపోవటం. కానీ మన్‌హాట్టన్‌ నగరం గురించి మాత్రం అతడొకపట్టాన ఏమీ తేల్చుకోలేకపోయాడు. అది అతడికి అడ్డంగా గోడ కట్టేసింది. ఉరకలెత్తే నదిలాగా అది అతడిమీంచి వీథుల్లోకి పొర్లి ప్రవహించింది. అతడు వీథుల్లో నడుస్తున్నప్పుడు ఒక్కనేత్రం కూడా అతణ్ణి తొంగి చూడలేదు. ఒక్క కంఠం కూడా పలకరించలేదు.

తన భుజాన్ని తట్టడానికి పిట్స్‌బర్గ్‌ నగరపు మసిబారిన హస్తంలాంటి దానికోసం ఇక్కడతడు ఎదురుచూశాడు. చికాగో నగరంలాగా తన చెవిలో  బిగ్గరగా అరిచే పలకరింతకోసం ఎదురుచూశాడు. బోస్టన్‌ నగరంలాగా ఈ నగరం కూడా తన కళ్లద్దాల్లోంచి పేలగా, ఉదారంగా తనవైపు చూస్తుందని ఆశించాడు. చివరికి లూయీస్‌ విలీలాగా, లేదా సెయింట్‌లూయీస్‌లాగా అనుకోకుండా ఈ నగరం తనకాళ్లను తొక్కుకుంటూ పోయినా బాగుణ్ణననుకున్నాడు.

ఎన్నో నగరాలకు తగినజోడుగా జీవించిన రేగల్స్‌ ఈ రోజు ఒక గ్రామీణప్రేమికుడు లాగా బ్రాడ్‌వే మీద ఉద్రిక్తుడుగా నిలబడ్డాడు. తనని ఎవరైనా నిర్లక్ష్యం చేసినప్పుడు మనుషుల్లో చివ్వున స్ఫురించే అవమానభారాన్ని ఈరోజతడు మొదటిసారి అనుభవించాడు. తన కళ్లముందు తొందరతొందరగా మారుతూ మిరుమిట్లు కొలుపుతూ కరడుగట్టినట్టు కనిపిస్తున్న ఈ నగరాన్ని ఏదో ఒక సూత్రానికి కుదించడానికి ప్రయత్నించినప్పుడు అతడు పూర్తిగా విఫలమయ్యాడు. అతడు స్వయంగా కవి అయినప్పటికీ, ఆ నగరమతడికి ఎటువంటి రంగూ, ఎటువంటి ఉపమానాలూ, ఎటువంటి పోలికలూ అందించలేక పోయింది. దాని పరిశుభ్రపార్శ్వాల్లో అతడికే దోషమూ చిక్కలేదు. ఇతర నగరాల విషయంలో అతడెంతో అలవాటుగా, అవహేళనగా చేస్తూ వచ్చినట్టుగా, ఇక్కడ ఈ నగరాన్ని పట్టుకుని దాని రూపాన్నీ, నిర్మాణాన్నీ పరికించడానికి వీలుగా అతడికి ఏ కొక్కెమూ చిక్కలేదు.

నగరంలోని గృహాలన్నీ అతడినుంచి తమనుతాము రక్షించుకోవడానికి గోడ కట్టుకున్నట్టుగా అనిపించింది. మనుషులంతా ప్రకాశవంతంగా, కానీ స్వార్థపూరితంగానూ, దుర్మార్గంగానూ మోహరించిన రక్తహీనప్రేతాలుగానూ కనబడ్డారు. అన్నిటికన్నా ముఖ్యంగా రేగల్స్‌ ఆత్మమీద భారంగాపడి, అతడి కవితాహృదయాన్ని చుట్టచుట్టుకుపోయిన విషయం ఆ నగరంలో కనవచ్చిన స్వార్థపరత్వం. రంగుల్లో ముంచితేల్చిన బొమ్మల్లాగా అక్కడ మనుషులు స్వార్థపరత్వంలో మునిగితేలుతున్నారు.

అతడికి తారసపడ్డ ప్రతి మనిషీ భరించలేనంత అహంకారంతో రాక్షసాకృతి ధరించి మరీ కనబడ్డాడు. వాళ్లనుంచి మానవత్వం పూర్తిగా మృగ్యమైపోయింది. తమనుతామే ఆరాధించుకుంటూ, అపారమైన దురాశతో కొట్టుమిట్టాడుతున్న శిలాప్రతిమల్లాగా సంచరిస్తూ కనబడ్డారు. తమ సహచరులు కూడా తమలానే కనిపిస్తున్నారన్న విషయాన్ని వాళ్లు పట్టించుకోవడం లేదు. క్రూరంగా గడ్డకట్టుకుపోయిన ఆ మనుషులు తమ నిష్కారణదౌర్జన్యంతో దుర్భేద్యంగా అంతా ఒకే మూసపోసినట్టుగా కనబడ్డారు. ఏదో మంత్రమహిమ వల్ల కదులుతున్న విగ్రహాల్లానూ, ఆ నిర్లక్ష్యపు పాలరాతిదేహాల్లో ఆత్మగానీ, అనుభూతిగానీ సాక్షాత్కరించే అవకాశం లేదనన్నట్టుగానూ వాళ్లు గోచరించారు.

క్రమేపీ వాళ్లల్లో రేగల్స్‌కు కొన్ని నమూనాలు కనబడుతూ వచ్చాయి. ఒక నమూనా వయోవృద్ధుడైన పెద్దమనిషి తరహా. అతడికి తెల్లటి పిల్లిగడ్డం ఉంటుంది. ముడతలు పడని గులాబిరంగు వదనం. తీక్ష్ణంగా గోచరించే శిలాసదృశాలైన నీలికళ్లు. వేషధారణ యువకుడిలాగా ఉంటుంది. నగరఐశ్వర్యం, పరిపక్వత, తోటిమనిషి పట్ల కరడుగట్టిన నిర్లక్ష్యం మూర్తీభవించినట్టుంటాడతడు.

మరొక నమూనా ఒక స్త్రీరూపం. ఆమె పొడుగ్గా అందంగా ఉంటుంది. ఉక్కు పోతపోసినట్టుగా స్పష్టంగా ఉంటుంది. దేవతలాగా ఉంటుంది. నిశ్శబ్దంగా, పూర్వకాలపు రాకుమారిలాగా దుస్తులు ధరించి కనబడుతుంది. వేడినీటి ఊటమీద ప్రతిఫలిస్తున్న సూర్యకాంతిలాగా ఆ కళ్లు చల్లగా, నీలంగా కనిపిస్తాయి. ఇక మరొక నమూనా ఈ నగరపు కీలుబొమ్మలకు పుట్టిన బిడ్డ. ఆ మనిషి స్పురద్రూపి; గంభీరంగా, ధీమాగా, భయం కొలిపేటంత ప్రశాంతతతో కనబడతాడు. అతడి చెంపలు పంటకోతలు కోసిన గోదుమఛాయలంత విశాలంగా కనబడుతాయి. బాప్తిస్మం పొందిన శిశువుల దేహఛాయ. విజయం సాధించి తీరాలనుకునేవాళ్ల పోకడ. పెద్దపెద్ద సిగారు ప్రకటనలకు ఆనుకుని ప్రపంచాన్ని అవహేళనాత్మకంగా చూస్తూండే నమూనా ఇది.

కవి సాధారణంగా సున్నితస్వభావుడు కాబట్టి, రేగల్స్‌ తొందరలోనే తాను అర్థం చేసుకోలేకపోతున్న ఈ అయోమయం గుప్పిట్లో ఇరుక్కుపోయాడు. ఈ నగరంతాలూకు అర్థంకాని, అసహజ, కఠోర, వ్యంగ్యాత్మక, శీతల, ప్రహేళికాత్మక అభివ్యక్తి అతణ్ణి తొందరలోనే నిర్ఘాంతపరచి నీరుకార్చేసింది. దానికి హృదయమే లేదా?

మనుషుల్ని గడ్డకట్టించే ఈ హృదయరాహిత్యంతో పోలిస్తే, తక్కిన నగరాల మొరటుదనం, పటాటోపం, లేకితనం అతడికెంతో మెరుగనిపించాయి. ఆ నగరాల్లోని కట్టెలడితీలూ, పెరట్లో పాలిపోయిన ముఖాలతో గృహిణులు అరచుకునే అరుపులూ, గ్రామీణభోజనశాలల్లో వంటవాళ్ల వడ్డించేవాళ్ల సరసమైన చీకాకు, పల్లెటూళ్ల కానిస్టేబుళ్ల దాష్టీకం, తన్నులు, అరెస్టులు, తప్పించుకుపోవడాలూ ఈ నగరంకన్నా ఎంతోమెరుగనిపించాయి.

రేగల్స్‌ ఎట్లాగయితేనేం, ధైర్యాన్ని కూడగట్టుకుని జనబాహుళ్యం నుంచి జీవనభిక్ష యాచించడానికి పూనుకున్నాడు. కానీ వాళ్లు అతణ్ణి పట్టించుకోకుండా, అతడి అభ్యర్థన పెడచెవినపెట్టినట్టే, కనీసం క్రీగంట కూడా చూడకుండా అతని అస్తిత్వాన్ని పట్టించుకోలేదు. ఇక అప్పుడు ఈ మనహాట్టన్‌ నగరానికి ఆత్మలేదనీ, ఇది సుందరమే అయినప్పటికీ జాలి లేని నగరమనీ అతడు తనకుతాను చెప్పుకున్నాడు. ఆ నగరపౌరులు తాళ్లతోనూ, కీళ్లతోనూ ఆడించే మరబొమ్మలు మాత్రమేననీ తానొక మహారణ్యంలో ఒంటరిగా చిక్కుకుపోయాననీ నిర్ధారించుకున్నాడు.

మొత్తానికతడు రోడ్డు దాటడానికి ఉపక్రమించాడు. ఇంతలో పెద్ద చప్పుడు. అతన్నేదో గుద్దేసింది. ఏదో పగిలిపోయినట్టూ, బుస కొట్టినట్టూ, జారిపోయినట్టూ చప్పుడు వినవచ్చింది. అతడున్న చోటనుంచి అతన్నేదో ఆరుగజాల దూరానికి ఎత్తి విసిరేసింది. ఆకాశంలో ఒక రాకెట్‌ శకలంలాగా అతడు కింద పడుతున్నప్పుడు భూమీ, భూమి మీదున్న నగరాలన్నీ కూడా అతడికొక భగ్నస్వప్నంలాగా గోచరించాయి.

రేగల్స్‌ కళ్లు తెరచి చూశాడు. ముందు అతడినొక సుగంధం పలకరించింది. అది  స్వర్గంలో తొలివసంతపుష్పాల పరిమళం. అప్పుడు నేలరాలుతున్న మృదువైన పూరేకులాంటి హస్తమొకటి అతడి నుదుటిని స్పృశించింది. పూర్వకాలపు రాకుమారిలాగా దుస్తులు ధరించిన నీలినేత్రాల స్త్రీమూర్తి అతడి వైపు వంగి కనిపించింది. ఆమె మృదువుగా, మానవీయ సహానుభూతితో చెమ్మగిల్లి కనబడింది.

ఆ పేవ్‌మెంట్‌ మీద, అతని తలకింద పట్టువస్త్రాలూ, ఉన్నిదుస్తులూ పడిఉన్నాయి. అతడి ముందు నగరైశ్వర్యం, పరిపక్వత మూర్తీభవించినట్టు కనిపించే ఒక వయోవృద్ధుడు కనబడ్డాడు. అతడి చేతిలో రేగల్స్‌ టోపీ ఉంది. నిర్లక్ష్యంగా డ్రైవ్‌ చేసూకుంటూ పోతుండేవాళ్లమీద కోపోద్రిక్తంగా కురిపించిన ఆగ్రహావేశాల వల్ల అతడి వదనం మామూలుకన్నా మరింత గులాబీరంగు పెరిగింది. ఇంతలో పక్కనుండే రెస్టారెంటులోంచి నగరపు మరో నమూనా పరుగెత్తుకొచ్చింది. గోధుమక్షేత్రాల్లంటి చెంపలతోనూ, పసిపిల్లల దేహఛాయతోనూ కనబడే ఆ నమూనా చేతిలో ఒక గ్లాసూ, దాన్నిండా సంతోషభరితమైన ఆశలు రేకెత్తించే పానీయమూను.

‘మిత్రమా! ఇదిగో తాగు’ అంటూ ఆ నమూనా ఆ గ్లాసును రేగల్స్‌ పెదాలకు తాకించింది.

ఒక్కక్షణంలోనే వందలాది మనుషులు అతడి చుట్టూ గుమిగూడారు. వాళ్ల వదనాల్లో ప్రగాఢమైన ఆత్రుత కనవస్తోంది. ఉత్సాహంగానూ, ఉల్లాసంగానూ ఉండే ఇద్దరు పోలీసువాళ్లు ఆ మనుష్య వలయంలోకి చొచ్చుకొచ్చి, అక్కడ గుమిగూడిన ఉదార సామర్టన్‌లను వెనక్కి నెట్టే ప్రయత్నం చేశారు. నల్లటి శాలువా కప్పుకున్న ఒక ముసలామె గట్టిగా కర్పూరం గురించి మాట్లాడటం మొదలుపెట్టింది. మట్టికొట్టుకుపోయిన పేవ్‌మెంట్‌ మీద రేగల్స్‌ చెయ్యి ఆనుకుని ఉన్న చోట వార్తాపత్రికలు అమ్ముకునే కుర్రవాడు ఒకడు తన వార్తాపత్రిక ఆసరాగా చేర్చిపెట్టాడు. చురుగ్గా కనబడే యువకుడొకడు నోట్‌బుక్‌ తెరచి పేర్లు రాసుకోవడం మొదలుపెట్టాడు.

గణగణమంటూ గంట మోగిస్తూ సందులోంచి అంబులెన్స్‌ ఒకటి దారి చేసుకుంటూ జనసమూహం దగ్గరకు చేరుకుంది. అందులోంచి ప్రశాంతంగా ఒక సర్జన్‌ నేరుగా ఆ సంరంభంలో అడుగుపెట్టాడు.

‘ముసలాయనా! నీకెలాఉందిప్పుడు’ అంటూ ఆ సర్జన్‌ నేరుగా తన పని మొదలు పెట్టేశాడు. పట్టువస్త్రాల, ముఖమల్‌ దుస్తుల రాకుమారి పరిమళభరితమైన సాలెగూడులాటి వస్త్రంతో రేగల్స్‌ నుదుటిమీద చిమ్మిన ఒకటి రెండు రక్తపుబొట్లను మృదువుగా తుడిచేసింది.

‘నేనా!’ అన్నాడు రేగల్స్‌ ఒక అతిలోకమందహాసం చేస్తూ. ‘నేను బాగానే ఉన్నాను’ అన్నాడు.

తన కొత్తనగరం తాలూకు హృదయం కనబడింది ఇప్పుడతడికి.

మూడు రోజుల్లో వాళ్లతణ్ణి హాస్పిటల్‌లో వార్డులో పెట్టుకుని శ్రద్ధగా చూశారు. అతనక్కడికి చేర్పించిన గంటలోనే అతడు పెద్దగొడవ పడుతుండడం అతడికూడా వచ్చినవాళ్లు చూశారు. ఆరాతీస్తే, అర్థమయిందేమిటంటే, రేగల్స్‌ తనలాగే ఆసుపత్రిలో తనలాగే చికిత్స పొందుతున్న మరో మనిషి మీద దాడిచేసి గాయపరిచాడు. అతడు కూడా రేగల్స్‌లాగనే కొద్దికాలమే హాస్పిటల్‌లో ఉండిపోవటానికి వచ్చినవాడు. అతడు ఒక వాహనప్రమాదంలో గాయపడ్డాడు. అతడి ముఖంలో ఉద్రిక్తత ఇంకా తగ్గలేదు.

‘ఏమిటీ గొడవంతా?’ అని అడిగింది హెడ్‌నర్స్‌.

‘అతడు నా నగరాన్ని కించపరుస్తున్నా డు’  అన్నాడు రేగల్స్‌.

‘ఏ నగరం?’ అని అడిగింది నర్సు.

‘న్యూయార్క్‌’ అన్నాడు రేగల్స్‌.

అభ్యాసం

  • మీరు చదివిన కథల్లో ఇతివృత్తాన్ని వెంటనే గుర్తుపట్టగలిగిన కథ ఏదైనా మీకు గుర్తొచ్చిందా?
  • ఇతివృత్తం ఇదీ అని నిర్వచించలేని కథ ఏదైనా మీకిప్పటిదాకా ఎదురయ్యిందా?
  • మీరు రాసిన కథల్లో మీకు బాగా నచ్చిన కథ తీసుకుని దాని ఇతివృత్తం రెండు వాక్యాల్లో రాయండి. ఆ కథని మీ మిత్రులకి ఇచ్చి వాళ్ళని కూడా ఇతివృత్తం రాయమనండి. రెండు అభిప్రాయాలూ పోల్చి చూడండి.

One Reply to “కథా శిల్పం-2”

Leave a Reply

%d bloggers like this: