కథాశిల్పం-1

Reading Time: 3 minutes

థ అంటే ఏమిటి? ఏదో ఒకటి జరిగినదాన్నో, ఊహించినదాన్నో, రెండింటినీ కలిపో కొన్ని సంగతులు పూసగుచ్చి చెప్పడం. అలా చెప్పడం మొదలుపెట్టి ఎక్కడో ఒకచోట ఆపడం. అలా చెప్పడం మొదలుపెట్టి ఆపేలోపల ఆ చెప్పేదానిలోనో లేదా వినేవాడిలోనో ఏదో ఒకటి సంభవించడం. అంటే ఆ సంగతులు వినడానికి ముందు శ్రోత మనఃస్థితీ, విన్న తరువాత మనఃస్థితీ ఒక్కలాగా ఉండకపోవడమన్నమాట.

అలా కొన్ని సంగతులు చెప్పడంలో చెప్పే పద్ధతి ఒకటి ఉంటుంది. దాన్నే మనం శిల్పం అంటాం. శిల్పం అంటే అమరిక. ఏదన్నా చెప్పడంలో ఉండే వివిధ అంశాలు ఒక అనుపాతంలో ఒకదానితో ఒకటి కుదురుకుని ఉండటం. ఆ అమరిక బిగువుగానూ, సమతూకంగానూ ఉంటే, ఆ చెప్పే అంశం వినేవాడి హృదయాన్ని బలంగా ఆకట్టుకుంటుంది. అతడి మనసుమీద చెరగని ముద్ర వేస్తుంది.

కథా శిల్పం గురించి మాట్లాడటమంటే అటువంటి అమరిక గురించి మాట్లాడుకోడం. ఏమి చేస్తే ఆ అమరికలో బిగువు సాధించగలమా అని ఆలోచించడం. అందుకేమైనా కొన్ని సూత్రాలూ, మెలకువలూ ఉన్నాయా అని ఆలోచించడం.

కథానిర్మాణ సూత్రాలంటూ ఉన్నాయా?

కొందరేమంటారంటే, కథలు చెప్పడం ఒక సృజనాత్మక కార్యకలాపమనీ, అది ఎవరికి వారికి స్వతఃసిద్ధంగా పట్టుబడవలసిందే తప్ప నేర్పిస్తే వచ్చేది కాదనీ.

మరొక మాట కూడా చెప్తారు. కళాసృష్టికి సంబంధించి ఏవైనా సూత్రాలంటూ ఉంటే, అవేమిటో ఒకసారి బయటపడిపోతే, ఇంక అక్కడ కళాసృష్టి సాధ్యం కాదు అని. మరోలా చెప్పాలంటే, కథా రచనకి ఇవీ సూత్రాలు అని మనం ఒక పుస్తకం రాసామనుకోండి, దానర్థం, కథారచన ఆ సూత్రాల ప్రకారం ఇంకెంతమాత్రం కొనసాగే అవకాశం లేదు అని.

మామూలుగా కథా రచన గురించి మనకు చెప్పే సూత్రాలు పందొమ్మిదో శతాబ్ది కథకులు ఏర్పరచుకున్న కొన్ని నమ్మకాలనీ, వాటిని ఉల్లంఘించడం ద్వారా మాత్రమే ఇరవయ్యవ శతాబ్ది కథకులు ముందుకుపోగలిగారని కూడా ఒక వాదం ఉంది. ఉదాహరణకి, కథ మొదట్లో గోడ మీద తుపాకి ఉందని వర్ణిస్తే, ఆ కథ పూర్తయ్యేలోపు, ఆ తుపాకి పేలి తీరాలని చెహోవ్ అన్నట్టుగా ఒక సూత్రం చెప్తారు. కాని తదనంతర కథకులు చాలామంది ఆ సూత్రాన్ని ఒప్పుకోలేదు. కథ మొదట్లో గోడమీద తుపాకి ఉందనిచెప్పడం కేవలం ఒక వాస్తవాన్ని మరింత విశ్వసనీయంగా చిత్రించడం కోసమే కావొచ్చుననీ, ఒక సాదృశ్య చిత్రణ (వెర్సిమిలిట్యూడ్) ని పూర్తిచేయడంతో ఆ వర్ణన ప్రయోజనం పూర్తయిపోయిందనీ వారు భావించారు.

ఇలా కథా రచనకు సంబంధించిన ప్రతి ఒక్క ప్రధాన సూత్రాన్నీ ఇరవయ్యవశతాబ్ది కళా ఉద్యమాలూ, కథకులూ ధిక్కరిస్తూనే ఉండటం మనం గమనించవచ్చు. జీవితవాస్తవాన్ని ప్రతిబింబించడమే (మిమెసిస్) కథా రచన ముఖ్య ఉద్దేశ్యమని తొలికథకులు భావించారు. కాని, కథకుడు బాహ్య వాస్తవాన్ని చిత్రించే క్రమంలో తన ఆంతరంగిక అనుభూతినే చిత్రించగలడు తప్ప, బాహ్య వాస్తవాన్ని ఎన్నటికీ ఉన్నదున్నట్టుగా ప్రతిబింబించలేడని కాఫ్కా లాంటి ఎక్స్ ప్రెషనిస్టు కథకులు భావించారు. కథ దృగ్విషయ ప్రపంచాన్ని విశ్వసనీయంగా చిత్రించాలని వాస్తవికతావాదులు చెప్తే, తన స్వప్నాల్నీ, ఫాంటసీల్నీ, ఊహాగానాల్నీ చిత్రించడం ద్వారానే కథకుడు సత్యానికి మరింత చేరువకాగలడని బోర్హెస్ తరహా మాజికల్ రియలిస్టులు భావించారు. కథ సంఘటనాత్మకంగా ఉండాలనీ, దానికొక ప్లాటు తప్పనిసరి అనీ ఎడ్గార్ అలెన్ పో సూత్రీకరిస్తే, అసలు కథకి సంఘటనలతో పనిలేనేలేదనీ, చివరికి ప్లాటుతో కూడా పనిలేదనీ డొనాల్డ్ బార్తెల్మి వంటి పోస్ట్ మాడర్న్ రచయితలు వాదించారు. కథకుడు జీవితానికీ, అస్తిత్వానికీ ఒక అర్థం వెతకాలనే లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ అర్థరాహిత్యాన్నీ, అస్తిత్వ అసందర్భాన్నీ చిత్రిస్తూ దానీల్ ఖార్మ్స్ లాంటి అబ్సర్డ్ రచయితలు తమ జీవితాన్ని పణం పెట్టి మరీ కథలు చెప్పుకొచ్చారు.

ఇటువంటి నేపథ్యంలో కథానిర్మాణ సూత్రాలంటూ కొన్ని ఉన్నాయని వాటిని వివరించబోవడం అర్థం లేని పని అనీ, ఇంకా చెప్పాలంటే హాస్యాస్పదమనీ భావించేవారికి కొదవలేదు.

అందుకనే, Creating  Short Fiction: The Classic Guide to Writing Short Fiction (1986) అనే తన రచన మొదలుపెడుతూనే, డామన్ నైట్ అనే రచయిత, తాను ఆ పుస్తకం రాయకుండా ఉండటానికీ కనీసం మూడు కారణాలు చెప్పొచ్చన్నాడు. అవి:

  • రాయడం ఎవరికి వారు నేర్చుకోవలసిందే తప్ప, ఒకరు నేర్పితే వచ్చేది కాదు.
  • ఒకవేళ నేర్చుకోగలిగినా, అది పుస్తకాలు చదివి నేర్చుకోగలిగే విద్య కాదు.
  • ఒకవేళ పుస్తకాలు చదివే నేర్చుకున్నారనుకున్నా, అలా చదవడం వల్ల, కథానిర్మాణ సూత్రాల గురించిన పరిజ్ఞానం మరీ ఎక్కువై, చివరికి సహజంగా కథలు చెప్పగలిగే శక్తి అడుగంటిపోతుంది.

కానీ, ఇంత చక్కగా మూడుకారణాలు చెప్పాక, ఆ రచయిత, ఆ తర్వాత పేజీలంతటా కథలు ఎలా రాయాలో చెప్పకుండా ఉండలేకపోయాడు.

ఎందుకని?

కథలు ఎలా రాయాలో పుస్తకాలు ఎందుకు రాయకూడదో మూడు కారణాలు చెప్తే, ఎందుకు రాయొచ్చో నాలుగు కారణాలు చెప్పవచ్చు.

మొదటిది, కథలు ఇలానే రాయాలి అని మనం గిరిగీసి కొన్ని సూత్రాలు చెప్పలేకపోయినా, ప్రపంచవ్యాప్తంగా పాఠకుల మనసుమీద ముద్ర వేసిన గొప్ప కథల్ని చదివినప్పుడు, వాటన్నిటిలోనూ కొన్ని ఉమ్మడిలక్షణాలు కనిపిస్తాయి. వాటిని పరిశీలించడం ద్వారా, అధ్యయనం చెయ్యడం ద్వారా మన కథన కౌశల్యాన్ని మనం మెరుగుపర్చుకోవచ్చు.

రెండవది, గొప్ప కళా ఉద్యమాలూ, గొప్ప కథకులూ కథానిర్మాణ సూత్రాల్ని ఉల్లంఘిస్తూనే ఉన్నారు అంటున్నప్పుడు, ఆ సూత్రాలేమిటో, ఆ సూత్రాల్ని వారు ఎందుకు ఉల్లంఘించారో, ఎలా ఉల్లంఘించారో తెలుసుకోవడం కూడా తప్పనిసరి అవుతుంది. సూత్రాల్ని ఉల్లంఘించిన ప్రతి కథా గొప్ప కథ కాలేదు. ఒక విమర్శకుడు చెప్పినట్లుగా, ఏ కథకులైతే సూత్రాల్ని ‘ప్రతిభావంతంగా ఉల్లంఘించారో’ వారి కథలు మాత్రమే ప్రభావశీలత చూపించగలిగాయి. కాబట్టి, ఆ ఉల్లంఘనా కౌశల్యాన్ని అర్థం చేసుకోడానికేనా, మనం మౌలిక నిర్మాణ సూత్రాలంటూ కొన్ని ఉన్నాయో లేదో పరిశీలించాలి.

మూడవది, కథ, కవిత్వంలానే అత్యున్నత భావ ప్రసార సాధనం. తక్కిన ప్రసార సాధనాలు సమాచారాన్ని మాత్రమే అందిస్తే, కథలు, కవితలూ, మన భావావేశాల్ని మనం పొందిన సత్య సాక్షాత్కారంతో సహా అందిస్తాయి. కాబట్టి మన భావప్రసారాన్ని మరింత సమర్థవంతంగా అందించడంకోసం మనం మన కథారచనని మరింత మెరుగుపెట్టుకోవాలి.

ఇక నాలుగవది, అన్నిటికన్నా ముఖ్యమైంది, సృజనాత్మకత పుట్టుకతో వచ్చే గుణం కాదనీ, దాన్ని శిక్షణ ద్వారా, సాధన ద్వారా, అభ్యాసం ద్వారా అలవర్చుకోగలమనేది. సృజనాత్మకత వట్టి స్ఫూర్తి కాదు. నిజానికి అది పూర్తి స్థాయి క్రమ శిక్షణ. మన భావావేశాలకూ, వాటిని వ్యక్తీకరించే పద్ధతులకూ మధ్య సాధించవలసిన సమతూకానికి సంబంధించిన క్రమశిక్షణ. మన జీవితానుభవాలు మనకి అందిస్తున్న సంకేతాలను గుర్తుపట్టి మనం మరింత వివేకవంతులుగా మారడానికి సంబంధించిన క్రమశిక్షణ. మన అనుభవాలను మన తోటిమనుషులతో పంచుకుంటూ,ఆ క్రమంలో ఒక shared vision రూపొందించుకోడానికి సంబంధించిన క్రమశిక్షణ.

కాబట్టి నేను కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కొందరు కథకులు రాసిన గొప్ప కథల్ని తీసుకుని వాటిని పరిశీలించాను. వాటిని ఉదాహరణలుగా నా ముందు పెట్టుకుని, కథా రచనకు సంబంధించిన వివిధ అంశాలను అధ్యయనం చేసాను. ఆ అధ్యయన పరిశీలనల్ని మీతో పంచుకోవడమే ఈ వ్యాసపరంపర ముఖ్య ఉద్దేశ్యం.

21-4-2019

11 Replies to “కథాశిల్పం-1”

  1. గొప్ప ఆలోచన, మరింత అద్భుతమైన ఆరంభం.
    రోజూ ఎదురు చూడాలి.

  2. కథ వ్రాయడం రాదు అన్నవాళ్ళకి సమాధానం చెప్పడానికి కథాశిల్పం గురించి అనేక పాఠాలవంటివి చదివి నిజంగానే ఏమీ వ్రాయలేకున్నాను. మీరిచ్చే కథల వివరణ గురించి ఆసక్తిగా యెదురుచూస్తాను సర్.

  3. సృజనాత్మకత సాధన తో రాదు.కాకపోతే వారి లోపలిది ఏదో మెరుగు పడుతుంది.ప్రశ్న లో ఏమి ఇచ్చారు,ఏమి ఆడిగారో అర్ధం చేసుకోండి మీరు సి.సి.యి మోడల్ లో వ్రాయగలరు అని విద్యార్థులకు మేము చెపుతూ ఉంటాము.కానీ అది ఎలా తెలుసుకోవాలో అనేది వాళ్ళు ప్రయత్నం మీద కొంత తెలుసుకున్నా లోపల ఏదో స్పార్క్ లేకుంటే ప్రయోజనం లేదు.మీ నుండి మరిన్ని వ్యాసాలకు ఎదురు చూస్తూ ఉన్నాము సార్

  4. ఇలాంటి ఆర్టికల్స్ కోసమే నేను ఎదురు చూస్తున్నా గురువు గారు. ఇన్నాళ్ల కు నాకు కావలసిన విషయాలు లభించాయి. మీ నుండి మరిన్ని ఆర్టికల్స్ కోసం వెయిట్ చేస్తున్నాను.

  5. ఇలాంటి ఆర్టికల్స్ కోసమే నేను ఎదురు చూస్తున్నా గురువు గారు. ఇన్నాళ్ల కు నాకు కావలసిన విషయాలు లభించాయి. మీ నుండి మరిన్ని ఆర్టికల్స్ కోసం వెయిట్ చేస్తున్నాను.

Leave a Reply

%d bloggers like this: