దశార్ణ దేశపుహంసలు

ఫేస్ బుక్ లో వివిధ అంశాల మీద రాస్తూ వచ్చిన వ్యాసాల్ని పుస్తక రూపంలో తీసుకురమ్మని మిత్రులు అడుగుతూ ఉన్నారు. ఇప్పటిదాకా రాసినవే దాదాపు రెండువేల పేజీలు దాటి ఉంటాయి. వాటన్నిటినీ దాదాపుగా ఎప్పటికప్పుడు http://www.chinaveerabhadrudu.in బ్లాగులో పొందుపరుస్తూ ఉన్నాను. కాని వాటిని పుస్తకరూపంలో చదువుకోవడంలో ఒక సౌలభ్యం ఉన్న మాట కాదనలేం.

అందుకని,  మొదటగా, తెలుగు సాహిత్యం మీద ఇప్పటిదాకా రాసిన వ్యాసాల్ని పుస్తకరూపంలో అందివ్వాలని అనుకున్నాను. వాటితో పాటు, ఈ మధ్యకాలంలో రాసిన కొన్ని సమీక్షలూ, ముందుమాటలూ కూడా కలిపి 125 వ్యాసాలతో ‘దశార్ణ దేశపు హంసలు’ పేరిట ఇలా పుస్తకరూపంలో అందిస్తున్నాను.

ఫేస్ బుక్ ద్వారా నాకు పరిచయమైన మహనీయ మిత్రులెందరో ఉన్నారు.  వారిలో వయసులోనూ,  విద్వత్తులోనూ కూడా శ్రీ సూరపరాజు రాధాకృష్ణమూర్తిగారిని ముందు తలుచుకోవాలి.  వారి సహృదయతకి నా సుమాంజలిగా ఈ పుస్తకాన్ని వారి చేతుల్లో పెడుతున్నాను.

ఇందులో రాసిన వ్యాసాలకూ, సమీక్షలకూ, ఆవిష్కరణ ప్రసంగాలకూ నామీద ఎంతో ప్రేమతో, నమ్మకంతో అవకాశమిచ్చిన మిత్రులు శ్రీయుతులు రావెల సోమయ్య, సి.వి.కృష్ణారావు, ఎమెస్కో విజయకుమార్, వకుళాభరణం రామకృష్ణ, జోళదరాశి చంద్రశేఖరరెడ్డి, శివరాజు సుబ్బలక్ష్మి, సాయి పాపినేని, డా. ఉపాధ్యాయుల వెంకటరమణమ్మ, అల్లు భాస్కరరెడ్డి, డా.కొత్త రఘునాథ్,  ఆచార్య మృణాళిని, ఆర్. వసుంధరాదేవి, న్యాయపతి శ్రీనివాస రావు, జె.చెన్నయ్య, విజయచంద్ర, దేవినేని మధుసూధనరావు, డా. నన్నపనేని మంగాదేవి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి, మోదుగుల రవికృష్ణ, డా.పేరిశెట్టి శ్రీనివాసరావు, డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, జి.వి.పూర్ణచంద్, చాగంటి తులసి, కాళీపట్నం రామారావు, గంటేడ గౌరునాయుడు, చెన్నూరి సీతారాంబాబు, డా.రాధేయ ఉమ్మడిశెట్టి, కాశీభట్ల వేణుగోపాల్, దాసరి అమరేంద్ర, వాసిరెడ్డి నవీన్, ఎన్.కె.బాబు, డా, మాడభూషి సంపత్కుమార, హెచ్చార్కె, యాకూబ్, అక్కిరాజు భట్టిప్రోలు, సురేష్ కొలిచాల గార్లకు హృదయపూర్వక నమస్సులు.

తమ పుస్తకాలకు ముందుమాటలు రాసే అవకాశమిచ్చినందుకు, సమీక్షాప్రసంగాలకు పిలిచినందుకూ శ్రీయుతులు డా.వి.ఎన్.వి.కె.శాస్త్రి, జూకంటి జగన్నాథం, సిద్ధార్థ, వాహెద్, భావన భట్టిప్రోలు, న్యాయపతి వల్లరి, అఫ్సర్, ఖదీర్ బాబు, రవూఫ్, మల్లెగోడా గంగాప్రసాద్, జయతి లోహితాక్షణ్, డా.పలవలి విజయలక్ష్మి పండిట్, కంపెల్ల రవిచంద్రన్, రేణుక అయోల,వసంతలక్ష్మి, దగ్గుమాటి పద్మాకర్, సింహప్రసాద్, వడ్లమాని మణి,డా.కె.ఎన్.మల్లీశ్వరి, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, దేవి, నారగారజు రామస్వామి, వేలూరి వెంకటేశ్వరరావు, బెందాళం కృష్ణారావు, నౌదూరి మూర్తి, జింకా రామారావు, కోడూరి పుల్లారెడ్డి, హరిహరప్రియ,సత్యశ్రీనివాస్, వేంపల్లి గంగాధర్, కందుకూరి రమేష్ బాబు, హరిహరప్రియ గార్లకు స్నేహపూర్వక కరచాలనాలు.

బైరాగి ఎర్రక్రీస్తు కవితపైన రాసిన వ్యాసానికి కట్టాశ్రీనివాస్, కొండ్రెడ్డి భాస్కర్ గార్ల ప్రతిస్పందన వల్ల ఆ వ్యాసానికి మరోభాగం అదనంగా రాయగలిగాను. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. చలంగారి మార్తా నవల పైన వ్యాసాన్ని సాక్షి పత్రికలో పునర్ముద్రించినందుకు మహమ్మద ఖదీర్ బాబుకి మరో మారు కృతజ్ఞతలు.

ఆదిత్య, గంగారెడ్డి ఈ ప్రయాణమంతా నాతో కలిసి నడుస్తూ ఉన్నారు. వారికి మరీ మరీ ధన్యవాదాలు.

పుస్తకమంతా రూపొందేక చూసుకుంటే, ఈ వ్యాసాలన్నీ చాలా బోసిపోతూ కనిపించాయి. అందుకు కారణం వీటిమీద ఎప్పటికప్పుడు మిత్రులు రాస్తూ వచ్చిన ప్రతిస్పందనల్ని ఈ సంపుటంలో చేర్చలేకపోవడమే కారణమని అర్థమయింది. ఫేస్ బుక్  మిత్రులు ఎప్పటికప్పుడు నాతో పంచుకుంటూ వచ్చిన స్పందనల వల్ల నేనెంతో నేర్చుకున్నాను, మనిషిగా ఎంతో బలపడ్డాను. జీవితం పట్ల నాలో కొత్త తృష్ణ, జిజ్ఞాస అంకురించాయి. అందుకు నా ఫేస్ బుక్ మిత్రులకి పేరుపేరునా నమస్సుమాంజలి సమర్పించుకుంటున్నాను.

12-4-2019

4 Replies to “దశార్ణ దేశపుహంసలు”

  1. హృదయపూర్వక అభినందనములు.
    జయము జయము చినవీరభద్రులకు.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading