కరుణరసాత్మక కావ్యం

ఆ పుస్తకం ఒక కరుణరసాత్మక కావ్యం అన్నాడు కవితాప్రసాద్ నా ‘కొన్ని కలలు కొన్ని మెలకువలు చదివి. అది విద్యా సంబంధమైన గ్రంథమనో, గిరిజన సంక్షేమానికి సంబంధించినదనో అనకుండా దాన్నొక కావ్యమనీ అది కూడా కరుణరసాత్మకమనీ అనడం నా హృదయాన్ని చాలా లోతుగా తాకింది.

ఏళ్ళ కిందటి మాట. 2004 లో అనుకుంటాను, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నా మిత్రుడు, సాహిత్యాభిమాని సింగం లక్ష్మీనారాయణ గుంటూరు రమ్మని పిలిచాడు. ఆ రోజు అక్కడ ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ సత్కార సమావేశంలో ఆ హాలంతా ఉపాధ్యాయులతో కిక్కిరిసిపోయింది. వాళ్ళతో నేను విద్యారంగంలో నా అనుభవాలు కొన్ని ముచ్చటించేను. నా ప్రసంగానికి గొప్ప స్పందన లభించింది.

ఆ రోజు ఆ సమావేశానికి నా మిత్రుడు ఎమెస్కో విజయకుమార్ కూడా వచ్చాడు. ఆ రాత్రి మేం కారులో హైదరబాదు తిరిగివస్తుంతసేపూ ఆయన ఆ ప్రసంగం గురించీ, నా అనుభవాల గురించే మాట్లాడుతూ ఉన్నాడు.

మీ ప్రసంగం విన్నాక, మీలో విద్య గురించి గొప్ప అంతర్మథనం సాగుతోందనిపించింది. మీలోపల్లోపల కదలాడుతున్న భావాల్ని కాగితం మీద పెట్ట కూడదా అన్నాడాయన.

ఆ తర్వాత రెండు మూడు రోజుల్లోనే నేనాయనకి మూడు వ్యాసాలు రాసి చూపించాను. ‘మీరు ఇంటినుంచి ఏమి నేర్చుకోవాలి?’, ‘మీరు బడినుంచి ఏమి నేర్చుకోవాలి?’, మీరు సమాజం నుంచి ఏమి నేర్చుకోవాలి?’ అనే రచనలు.

అవి పిల్లల్ని ఉద్దేశించి చెప్తున్నట్టుగా రాసినవి. వాటిని వెంటనే ప్రచురించాలనుకున్నాడు ఆయన. వాటికి చక్కటి ఇలస్ట్రేషన్లు కూడా వేయిస్తే బాగుంటుదనుకున్నాం. కాని ఎవరితో వేయించాలి?

అప్పుడు నాకు, ప్రసిద్ధ చిత్రకారుడు, గొప్ప ఉపాధ్యాయుడూ బి.ఎ.రెడ్డిగారు అత్తాపూర్ లో, యంగ్ ఎన్వాయిస్ ఇంటర్నేషనల్ పేరిట, ఒక ఆర్ట్ స్కూల్ నడుపుతున్న విషయం గుర్తొచ్చింది. 1982 లో స్థాపించిన ఆ పాఠశాల ద్వారా ఆయన ఎందరో పిల్లల్లోని చిత్రకళ ప్రతిభని ప్రోత్సహిస్తూ ఉన్నారు. వాళ్ళల్లో కొందరు మామూలుగా బడికి వెళ్ళి చదువుకునే పిల్లలు, కొందరు రకరకాల పనులుచేసుకుంటూ జీవికనడుపునేవాళ్ళూ. వాళ్ళందరినీ ఆయన రంగుల ప్రపంచంలోకి ప్రవేశపెట్టి గొప్ప చిత్రకారులుగా తీర్చి దిద్దుతూ ఉన్నారు. వాళ్ళు వేసిన బొమ్మల్ని ప్రపంచవ్యాప్తంగా జరిగే చిత్రలేఖనం పోటీలకు పంపుతుంటారు. సాధారణంగా అట్లా పోటీలకు పంపిన ఏ ఒక్క చిత్రలేఖనం కూడా బహుమతి గెల్చుకోకుండా ఉండటం అరుదు. మేం మా పుస్తకాలకి ఆ పిల్లలతోటే ఇలస్ట్రేషన్లు వేయిస్తే బాగుంటుందనుకున్నాం. యంగ్ ఎన్వాయిస్ ఇంటర్నేషనల్ వారి సంస్కృతి గ్రామీణ బాలల కళాకేంద్రం లో చిత్రకళ నేర్చుకుంటున్న ఇద్దరు పిల్లలు, వి.భాస్కర్, ఎ.కిరణ్ కుమార్ లు ఆ పుస్తకాలకి చక్కటి బొమ్మలు గీసారు. నా మిత్రుడు వాటిని వెంటనే ప్రచురించేసాడు.

కాని, అతడి దాహం తీరలేదు. ఆ పుస్తకాలు చిన్నపిల్లలకోసం రాసినవనీ, విద్య గురించి పెద్దవాళ్ళకి, ముఖ్యంగా, ఉపాధాయులకి ఉపయోగపడేలా ఒక పుస్తకం రాయమని అడిగాడు విజయకుమార్. నేను విద్య గురించిన నా భావాలు, ఎన్నేళ్ళుగానో అభివ్యక్తికోసం అర్రులు చాస్తున్న ఆలోచనల్నీ,అభిప్రాయాల్నీ రాసి కొన్ని పేజీలు పంపించాను. వాటిని చదివి ఆయన ఆ రోజు గుంటూరులో భావోద్వేగానికి గురయినట్టే గొప్పగా చలిస్తాడనుకున్నాను. కాని ఆయన ఆ కాగితాలు నాకు వెనక్కి పంపేసాడు. వాటిని ఆయనా, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో సభ్యులుగా ఉన్న ప్రసిద్ధ విద్యావేత్త శ్రీ విటపు బాలసుబ్రహ్మణ్యం గారూ, మరికొందరు జనవిజ్ఞానవేదిక మిత్రులూ కలిసి చదివారు. వాళ్ళందరూ భావించిందేమంటే, నేను విద్య గురించిన తాత్త్వికభావాలు రాయడం కన్నా, నా జీవితంలో నేను చేసిన ప్రయోగాలూ, లోనైన అనుభవాలూ రాయడం అవసరమని. అవి కూడా సరళమైన శైలిలో, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుల్ని దృష్టిలో పెట్టుకు రాస్తే బావుంటుందనీ.

ఆ మిత్రుల సూచనలమేరకు నా అనుభవాలు మళ్ళా మొదటినుంచీ తిరగరాసేను. వాటిని నేను రాసేననడం కన్నా, ఆ మిత్రులతో కలిసిరాసేననడం సముచితంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు నేను రాస్తూ వచ్చిన కథనాన్ని వాళ్ళు ఓపిగ్గా చదివి చర్చించి తమ అభిప్రాయాలూ, సూచనలూ చెప్తూ వచ్చారు. నేను నేను వారు కోరినట్టే ఎప్పటికప్పుడు సవరించుకుంటూ తిరిగిరాస్తూ వచ్చాను.

అందులో మొదటి భాగంలో నేను నా దృష్టిలో ఆదర్శపాఠశాల అంటే ఎలా ఉండాలో ఒక రేఖా చిత్రం గియ్యడానికి ప్రయత్నించేను. మేం చదువుకున్నప్పటి తాడికొండ గురుకుల పాఠశాలలో అట్లాంటి ఆదర్శాలు ఎంతవరకూ సాకారమయ్యేయో వివరించడానికి ప్రయత్నించేను. ఆ తర్వాత అధ్యాయాల్లో, నేను జిల్లాగిరిజనసంక్షేమాధికారిగా పార్వతీపురం, ఉత్నూరు, పాడేరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థల్లో, కర్నూల్లో పనిచేసినప్పటి అనుభవాలూ, ఆ తర్వాత రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో విద్యాప్రణాళికలు రూపొందించడం దాకా రాసేను. ఆ పదేళ్ళ కాలంలో (1987-97) గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధికోసం చేపట్టిన ప్రయత్నాలూ, చేసిన ప్రయోగాలూ, ఎదురైన వైఫల్యాల కథనం అది.

ఆ రచనని తాడికొండ గురుకులపాఠశాలకి అంకితం చేసాను. పూజ్యులు రావెల సోమయ్యగారు ఆ పుస్తకాన్ని తాడికొండ తీసుకువెళ్ళి ఆ గురుకుల పాఠశాలకి అందించడం మరొక స్మరణీయసంఘటన.

ఆ పుస్తకం ఆవిష్కరణ సమావేశం ఒక సెమినార్ లాగా జరిగింది. తన జీవితమంతా దళితుల, గిరిజనుల సంక్షేమానికే అంకితం చేసిన సి.వి.కృష్ణారావుగారు ఆ పుస్తకాన్ని ఆవిష్కరించేరు. ప్రాథమిక విద్యలోనూ, గిరిజన విద్యారంగంలోనూ జీవితకాల కృషి చేసిన విద్యావేత్తలూ, పరిపాలనా దక్షులూ ఆ సమావేశంలో పాల్గొన్నారు.

ఆ తర్వాత రాష్ట్రమంతా ఆ పుస్తకం మీద చర్చాగోష్టులు నిర్వహించాలని నిర్వహించాలని విజయకుమార్ సంకల్పించేడు. ఒక సమావేశం విజయవాడలో వికాసవిద్యావనం ప్రాంగణంలో జరిగింది. కాని రకరకాల కారణాల వల్ల ఆ గోష్టులు ముందుకు సాగలేదు. కాని సర్వ శిక్షా అభియాన్ పథకం కింద పెద్ద ఎత్తున పాఠశాలల్లో గ్రంథాలయాలు తెరిచినప్పుడు ఈ పుస్తకం కూడా పాఠశాలకు చేరగలింది. 2005 లో వెలువడినప్పటినుంచీ, ఇప్పటిదాకా ఎందరో ఉపాధ్యాయులు ఆ పుస్తకం చదివారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, ఇప్పుడు రెండు రాష్ట్రాలనుంచీ ఇప్పటికీ ఎవరో ఒక ఉపాధ్యాయుడు తానా పుస్తకం చదివి ఎంతో కొంత స్ఫూర్తి పొందినట్టుగా చెప్తూనే ఉంటాడు.

గిరిజన విద్యానుభవాల గురించిన ఇటువంటి ప్రత్యక్ష కథనం ఇంతదాకా ప్రపంచంలోనే ఎక్కడా వెలువడలేదని డా.కె.సుజాత నాతో అన్నారు. ఆ మాటే నిజమైతే ఆ ఘనత నా తల్లిదండ్రులదీ, నా గురువులదీ, నాతో కలిసి పనిచేసిన గిరిజన సంక్షేమపాఠశాలల సిబ్బందిదీ, విద్యార్థులదీ, వారి తల్లిదండ్రులదీను.

ముఖ్యంగా డా.ఎ.పి.జె.అబ్దుల్ కలాం ఆత్మకథని నేను ‘ఒక విజేత ఆత్మకథ’ పేరిట అనువదించి ఉండకపోతే నా అనుభవాలనిట్లా గ్రంథస్థం చెయ్యాలన్న తలపు వచ్చి ఉండేదే కాదు. అందుకు కలాం స్ఫూర్తికీ, కలాం పుస్తకాల్నీ, ఈ పుస్తకాన్నీ కూడా ప్రచురించిన ఎమెస్కో విజయకుమార్ కీ నేనెప్పటికీ ఋణపడి ఉంటాను.

ఇప్పుడు ఆ పుస్తకం ప్రింటులో లభ్యంగా లేదు. అందుకని మీ కోసం ఇ బుక్ రూపంలో ఇట్లా అందిస్తున్నాను.

4 Replies to “కరుణరసాత్మక కావ్యం”

  1. Respected sir namaste this historic book always remember you sir ,it is mirror of tribal lives

  2. దాదాపు 400 పేజీల పుస్తకం. చదవగలననుకోలేదు.చదివాను, కాదు చదివించింది.

    ఇందులో సార్వత్రిక విద్య ఒక్కటే విషయం కాదు. సామాజికం రాజకీయం వేదాంతం చరిత్ర భూగోళం కళ సాహిత్యం అన్నీ ఉన్నాయి.ఇన్ని విషయాల పరిజ్ఞానం సామాన్య విషయం కాదు. ఇది సమగ్రవిద్య. కాని యీ పుస్తకం చదవవలసింది వాటికోసం కాదు. చదివించేవి యివేవీ కావు, వ్యక్తిలో యీ సమగ్రవిద్య అభివ్యక్తి. ఈ పుస్తకాన్ని చదివించేది ఆ వ్యక్తి, ఆ అభివ్యక్తి, ఆ సమగ్ర వ్యక్తిత్వం.

    సునిశితమైన విశ్లేషణ, సున్నితమైన మనసు సాధారణంగా కలిసి కనిపించవు. ఈ రచనంతా ఆ రెంటి కలగలుపే.విభేదమెరుగని విశ్లేషణ.

    ఆర్ట్ మాస్టారులో కల, సోషల్ మాస్టారులో నేత. తాడికొండలో చదివే చిన్న వయసులో యిలా వివేచించగలిగిన విద్యార్థి , “కలనేత”. అదే పుస్తకమంతా ఆ నేత.

    పుస్తకం పేరులోనే విశేషం ఉంది. మెలకువకు రెండర్థాలు,రెండు ప్రయోజనాలు. కలను అంతంచేసే మెలకువ, కలను బతికించుకునే మెలకువ.

    సమాజాన్ని నడిపించేవి కలలు అంటారు.నిజం కాదు. సమాజాన్ని నడిపించేది కల కాదు, కాలం. ఆ కాలాన్ని కొందరు కలగంటారు. అలా కలలు కనగలిగినవారే సార్థకజన్ములు.

    సమాజం కాలంతో మారుతుంది. విద్యావిధానాలు వ్యవస్థలు కూడా మారుతాయి. ఏ విద్యావిధానమూ స్వభావాన్ని మార్చలేదు, వ్యక్తిస్వభావాన్నిగాని వ్యవస్థస్వభావంగాని. స్కూల్ పనిమీద డి.యి.ఓ. ఆఫీసుకు హెడ్మాస్టరు వస్తే, అక్కడి గుమస్తా టేబుల్ మీద ఎత్తిపెట్టిన కాళ్ళు దించడు, కూర్చోమనడు, ఏకవచనంలో కూడా. ఏ విద్యాపథకమైనా దీన్ని మార్చలేదు, కలలో కూడా.

    కాని కలలు కంటూనే ఉండాలి. సమాజం కొరకు కాదు. తన కొరకు. జీవితం సార్థకమయేది మేలుకున్న కాలంలో కాదు, కలలు కనే కాలంలో. కలల సాకారంలో కాదు. కలలుకనగలిగిన ఆత్మబలంలో. కల అలసిపోతుంది. అలసిన కలకు కప్పు కాఫీ అందుతునే ఉంటుంది, ప్రేయరుకు హాజరుకాని భార్యకు ఆబ్సెంట్ మార్కు చేసిన హెడ్మాస్టరురూపంలో.

    తాడికొండ బడి మాఘమాసపు మామిడి తోటలో చెట్టు కింద కన్న కల.

    ఆ కల గ్రీష్మంలో శిశిరంలో ఎదగడమే యీ పుస్తకవిషయం.

    వ్యక్తిత్వాభివృద్ధిసాహిత్యంలో యీ పుస్తకం స్థిరమై చిరమై నిలుస్తుంది. నిలవాలి.

  3. గురువుగారికి,

    నమస్కారం. ఈ కామెంటు చదివాక – దీన్ని దయచేసి తొలగించండి.

    నేను నా చిన్నప్పుడు ప్రభుత్వము వారిచ్చిన ఉపకారవేతనాలతో చదువుకున్నాను. ఆ ఋణము తీర్చుకోవాలని కోరిక ఉన్నది. పెద్ద మొత్తం కాదు కానీ ఎంతో కొంత పక్కనబెడుతూ వస్తాను – ప్రతి నెలా (వి.పి.ఎఫ్. కోసం పెట్టినట్లు).

    మొహమ్మీద చెప్పేస్తున్నానని అనుకోవద్దు – మీరు నాకు ఆదర్శము. చదువులో, సంస్కారం, సహృదయతా – అన్నింటా.

    ఇలా పోగు చేసిన డబ్బు మీకిస్తాను. మీరు దానిని పాత్రత ఉన్నవారికి, అవసరం ఉన్న సంస్థలకు అందివ్వగలరా? ప్రభుత్వము వారు, స్వచ్ఛందసంస్థలు సమకూర్చగలిగిన దాంట్లో ఇది ఏ మూలకూ కాదని నాకు తెలుసు. అయినా ఒక మంచి పనికి ఉపయోగపడాలని కోరిక. ధనం చాలదని, శక్తియుక్తులను, సమయాన్ని ఇవ్వాలని తెలుసు. నేను ఉండే బెంగళూరునుంచి అది ఎలా చేయాలో తెలియదు. ఏమైనా సూచిస్తే ప్రయత్నిస్తాను.

    ఈ వ్యాఖ్యకు దిగువనే నా email address ఉంటుంది కదా. సమాధానం దానికే ఇవ్వండి.

    మీ
    శ్రీనివాస్

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading