జీవనం సత్యం జీవనం సుందరం

Reading Time: < 1 minute

ఫేస్ బుక్ ని నేను ఇష్టపడటానికి ముఖ్యకారణం, ఇది పాఠకుల మాధ్యమం, రచయితలది కాదు. ఇక్కడ నాకు కనిపించినంతమంది పాఠకుల్ని నేను గత ముప్పై నలభై ఏళ్ళుగా ప్రింటు మీడియంలో చూడలేకపోయాను. కేవలం ప్రింటు మాధ్యమమే అయి ఉంటే, ఈ పాఠకుల్ని నేనెప్పటికీ కలుసుకోలేకపోయేవాణ్ణి. నేను ప్రధానంగా పాఠకుణ్ణి కాబట్టి, ఇక్కడ ఈ మిత్రుల ప్రపంచం నన్ను నివ్వెరపరుస్తూ ఉంటుంది. ఈ మిత్రులు చదివినన్ని పుస్తకాలు, చూసినన్ని సినిమాలు, గుర్తుచేసుకుంటున్న పాటలు నేనెప్పటికన్నా చదవగలనా, చూడగలనా, వినగలనా అనుకుంటాను. ఈ మాధ్యమాన్ని నేనిట్లా పట్టుకు ఉండటానికి కారణం, నా పరిజ్ఞానం పంచుకోడానికి కాదు, పెంచుకోడానికేనని వేరే చెప్పాలా!

అయినా ఈ రోజు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, అమృత సంతానం నవల సంగతే చూడండి, గత ముప్పై ఏళ్ళకు పైగా నేనా నవల గురించి మాట్లాడుతూ ఉన్నాను. కాని పట్టుమని పదిమంది రచయితలతో ఆ పుస్తకం చదివించించలేకపోయాను. కాని, కొన్నిరోజుల కిందట, ఆ పుస్తకం ఇంగ్లీషు అనువాదం గురించి ఇక్కడ రాసానో లేదో, పదిమంది మిత్రులు, ఆ పుస్తకం చదవడమే కాదు, అద్భుతమైన పరిచయ వ్యాసాలు రాసారు కూడా. అసలు, ఒక నవల గురించి ఇంత స్వల్పకాలంలో ఇన్ని పరిచయవ్యాసాలు తెలుగులో ఇప్పటిదాకా ఏ నవల గురించీ రాలేదంటే అతిశయోక్తి కాదేమో. కేవలం ప్రింటు మీడియంలో ఇదెన్నటికీ ఊహించలేని విషయం.

ఆ వ్యాసాలన్నీ గుదిగుచ్చి ఇట్లా పుస్తకరూపంలో వెలువరించడం నాకెంతో సంతోషంగా ఉంది. ఇందుకు నాకు స్ఫూర్తినిచ్చింది మిత్రుడు వాసు. అతడికి నా ప్రేమ పూర్వక అభినందనలు.

తమ హృదయంతో, ఆర్తితో, తాము చదివిన పుస్తకం పట్ల అపారమైన గౌరవంతో, ఇష్టంతో ఈ వ్యాసాలు రాసిన వాళ్ళల్లో మూడు తరాల సాహిత్యాభిమానులున్నారు. శ్రీ సూరపరాజు రాధాకృష్ణమూర్తిగారు, నౌదూరి మూర్తిగారు, సుశీలానాగరాజగారు, సూరపరాజు పద్మగారు, శిరంశెట్టి కాంతారావుగారు, నరుకుర్తి శ్రీధర్ గారు, జయతి లోహితాక్షన్ గారు, శ్రుతకీర్తిగారు, మానసచామర్తిగారు-వారికి నా అభివందనాలు. వారిలోని పాఠకుడికి నా ఆత్మీయ కరచాలనాలు. 

ఈ పుస్తకం ముఖచిత్రంకోసం ఒక కోదుతల్లీ, బిడ్డా ఫ్లికర్ లో ఎదురుచూస్తున్నారు. ఒడిశాలోని ఒక కోదుగ్రామంలో వారి ఫొటో తీసిన ఆ ఫొటోగ్రాఫర్ ఎవ్వరోగాని, నేను ఆ ఫొటో ముఖచిత్రంగా వాడుకుంటానంటే, సంతోషంగా అనుమతించాడు. అతడికి నా ధన్యవాదాలు.

18-5-2018

One Reply to “జీవనం సత్యం జీవనం సుందరం”

  1. ఫేస్ బుక్ మాధ్యమం చాలా గొప్ప వ్యక్తులు పంచే అమూల్య విషయాలు తెలుసుకొనే భాగ్యం కలిగించింది.కేవలం పుస్తకాలు చదువుకొని పెంచుకొనే జ్ఞానం కాక వ్యక్తుల అనుభవాలు అనుభూతులు ప్రత్యక్షంగా పంచుకొనే ఒక అవకాశం

Leave a Reply

%d bloggers like this: