పరమహంస

Reading Time: 3 minutes

సద్గురు ఫూలాజీ బాబా నాందేడ్ లో తన భౌతిక దేహాన్ని వీడారని నా మిత్రుడు పాల్దె ప్రసాద్ అదిలాబాద్ నుంచి నిన్న మధ్యాహ్నం నాకు వార్త పంపించాడు. సాధారణంగా మన ఆత్మీయులూ, మనకు తెలిసినవారూ భౌతికంగా ఇక లేరు అంటే మన మనసుల్లో కలిగే దిగులుకి బదులు, ఒక పరిపూర్ణ ప్రశాంత భావం నా మనసుని ఆవరించింది. ఆ వార్త విన్నప్పణ్ణుంచీ ఆయన గురించిన తలపులే నా మనసులో శరత్కాల మేఘాల్లాగా తేలియాడుతూ ఉన్నాయి.

పరమహంస సద్గురు ఫూలాజీ బాబా (1925-2018) నేను నా జీవితంలో చాలా దగ్గరగా చూడటానికి నోచుకున్న సద్గురువుల్లోనూ, సత్పురుషుల్లోనూ ఒకరు. ఆయన ఆంధ్ తెగకి చెందిన గిరిజనుడు. తల్లిదండ్రులు మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వారు. 1934 లో అంటే బాబాకి పదేళ్ళ వయసులో ఆ కుటుంబం ఇప్పటి అదిలాబాదు జిల్లా ఉట్నూరు దగ్గరలో ఉన్న పట్నాపూర్ గ్రామానికి బతుకుతెరువు కోసం వచ్చి వ్యవసాయంలో స్థిరపడ్డారు. బాబా కూడా రైతుగానే జీవితం కొనసాగించారు.

పాతికేళ్ళ కిందట, నేను అదిలాబాదు జిల్లా గిరిజన సంక్షేమాధికారిగా పనిచేస్తున్నప్పుడు ఒకరోజు నార్నూరు చుట్టుపక్కల పర్యటిస్తూండగా దగ్గరలోనే ఒక సాధువు ఉన్నారని ఎవరో చెప్పగా విని పట్నాపూర్ వెళ్ళాను. బాబాని కలుసుకున్నాను. ఆ సన్నివేశం నాకిప్పటికీ నిన్ననో, మొన్ననో జరిగినట్టే అనిపిస్తుంది. సాయంసంధ్యవేళ. వారింటికి వెళ్తే ఇంకా ఆయన పొలంలోనే ఉన్నారంటే, ఆ పొలందగ్గరికి వెళ్ళాం. బాబా అప్పుడు తన జొన్న చేనుకి కంచె కట్టుకుంటూ ఉన్నారు. ప్రతి రైతూ ఒక సాధుసత్పురుషుడే అయినప్పటికీ, ఆ సాధువు అట్లా తన పొలంలో కాయకష్టం చేసుకుంటో కనిపించినప్పుడు నాకేదో చెప్పలేని సంతోషం కలిగింది. సాయం సంధ్యా కాంతి ఆ జొన్నచేను మీద కురుస్తూ ఉంది. ఆయన చేతుల్లో కంచె కట్టుకుంటున్న తాళ్ళు. నాకు ఆ క్షణాన, తన ఇంటి అరుగుమీద గుడ్డలు కుట్టుకుంటున్న నామదేవుణ్ణో, లేదా కాశీలో మగ్గం మీద వస్త్రం నేసుకుంటున్న కబీరునో, లేదా ఇంటిముందు కుమ్మరి సారె తిప్పుతున్న గోరా కుంభారునో లేదా చెప్పులు కుట్టుకుంటున్న సంత్ రైదాసునో చూసినట్టనిపించింది.

ఆయన మమ్మల్ని తమ ఇంటికి తీసుకువెళ్ళారు. కొంతసేపు మాతో మాట్లాడేరు. టీ ఇచ్చినట్టు కూడా గుర్తు. అప్పుడు ఐ.టి.డి.ఏ లో పనిచేస్తున్నాను కాబట్టి, ఆ అలవాటు కొద్దీ మీ గ్రామంలో సమస్యలేమైనా ఉన్నాయా, ప్రభుత్వం చేయవలసిన పనులేమైనా ఉన్నాయా అనడిగాను. అలా అడిగానని గుర్తొస్తే నాకిప్పటికీ నవ్వొస్తుంది. కానీ, ఆ మహనీయుడు తన కోసం, తన కుటుంబం కోసం ఏమీ కోరలేదుగానీ, తమ గ్రామానికి ఒక ఆశ్రమ పాఠశాల మంజూరు చేయమని కోరాడు. సాధారణంగా ఒక కొత్త పాఠశాల మంజూరు చేసే అధికారం ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. కానీ ఆ స్వార్థత్యాగి సంకల్పం వల్ల మా స్థాయిలోనే మేమొక ఆశ్రమ పాఠశాల ప్రారంభించగలిగాం. ఇప్పుడది ఉన్నత పాఠశాలగా వికసించడంలో ఆశ్చర్యం లేదు.

ఆ తర్వాత రోజుల్లో ఆయన నన్ను కోరిన మరొక కోరిక, తుకారాం అనే ఒక ఉపాధ్యాయుణ్ణి తనకు దగ్గరలో ఉండేట్టుగా బదిలీ చెయ్యమని అడిగారు. అది చాలా చిన్న పని. తుకారాం ఆయన్ని ఇప్పటికీ అట్లానే కనిపెట్టుకుని ఉన్నాడు. కాని, ఈ పాతికేళ్ళుగా నేనాయన్ని ఎప్పుడు కలిసినా ఈ రెండు పనులూ ఆయన మదిలో మెదుల్తూ ఆ చూపులు నా మీద అపారమైన దయని వర్షిస్తూనే ఉండేవి.

రమణ మహర్షిలాగా ఫూలాజీ బాబా కూడా చదువుసంధ్యల్తో పనిలేకుండా సాక్షాత్కారం పొందిన వ్యక్తి. కాని, ఒకసారి సిద్ధపురుషుడిగా నలుగురికీ తెలిసిన తర్వాత, తనను చూడవచ్చే వారి సందేహాలు తీర్చడం కోసం, రమణ మహర్షిలానే ఆయన కూడా రానురాను, కొంత శాస్త్రజ్ఞానం పెంపొందించుకున్నట్టు కనిపిస్తుంది. కాని, రమణ మహర్షి గురించి మనం విన్నట్లే, బాబా దగ్గర కూడా, మాటలకి అవసరం లేని, ఒక అనిర్వచనీయ ప్రశాంతి ప్రతి ఒక్కరికీ అనుభవంలోకి వస్తూనే ఉండింది.

ఈ పాతికముప్పై ఏళ్ళుగా ఆయన తన కుటుంబంతో ఒక రైతు జీవితం జీవిస్తూనే అదిలాబాదు, నిజామాబాదు, మరాట్వాడా, ఉత్తర కర్ణాటక ప్రాంతాల్లోని గిరిజనులమీదా, గ్రామీణులమీదా అపారమైన ఆధ్యాత్మిక ప్రభావాన్ని నెరపుతూ వచ్చారు. ఈ రోజు లక్షలాది మంది ఆయన భక్తులుగా, అభిమానులుగా, ఆరాధకులుగా మారేరు. ఆయన ప్రభావం వల్ల వారు మరింత సరళ మనస్కులుగా, సాత్త్విక జీవనులుగా మారిపోయేరు. ఆయన ఎవరినీ నిర్బంధించకపోయినా, ఎటువంటి ప్రమాణాలూ తీసుకోకపోయినా, ఆయన ప్రభావానికి లోనయినవాళ్ళు మద్యపానం, మాంసాహారం వదిలిపెట్టేసారు. ఆయన సందేశాన్ని నిరంతరం స్మరించుకునే ఆధ్యాత్మిక కేంద్రాలు ఇప్పుడు అదిలాబాదులో ఊరూరా నెలకొన్నాయి.

సాధారణంగా బాబాలూ, ఆశ్రమాలూ అనగానే విలాసవంతమైన జీవితం, పటాటోపం, వారి చుట్టూ చేరిన సంపన్న వర్గాలు చేసే హడావిడి మదిలో మెదుల్తాయి. కానీ, పట్నాపూర్ గ్రామంలో ఫూలాజీ బాబా సంస్థానం పేరిట ఉన్న ఆ ఆశ్రమం, ఇప్పటికి, ఒక కమ్యూనిటీ హాలుగానే కనిపిస్తుంది. ఆ ఆశ్రమంలో ఆయన సన్నిధిలో, ఆయన చుట్టూ, మామూలు గిరిజన స్త్రీపురుషులే కనిపిస్తారు. నేను అక్కడ ఎప్పుడు కూచున్నా మా ఊళ్లో రామకోవెల్లో కూచున్నట్టే అనిపిస్తుంది.

రెండు రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల్లోనూ, గత యాభై ఏళ్ళుగా, ఎన్నో రాజకీయ పోరాటాలు, హక్కుల ఉద్యమాలు, విద్యా కార్యక్రమాలు అమలు జరుగుతూ ఉన్నాయి. వాటి గురించి తక్కిన ప్రపంచానికి ఎంతోకొంత తెలుసు. కాని, వాటన్నిటితో పాటు, సమాంతరంగా, గొప్ప ఆధ్యాత్మిక, సంస్కరణోద్యమాలు కూడా ప్రభవించాయి, వర్ధిల్లాయి. వాటి గురించి బయటి ప్రపంచానికి అంతగా తెలీదు. అదిలాబాదు గోండు సమాజంలో సంత్ సురోజీ మహరాజ్ చేపట్టిన సంస్కరణ, శ్రీకాకుళం సవర ప్రాంతాల్లో ఎస్.పి మంగైజీ చేపట్టిన అక్షరబ్రహ్మ ఉద్యమం వంటివి ఆ ప్రాంతాల్లో తీసుకువచ్చిన సామాజిక పరివర్తన మన కొలతలకి అందనిది. ఇప్పుడు ఆ కోవలో సద్గురు ఫూలాజీ బాబా ని కూడా చెప్పుకోవలసి ఉంటుంది.

గడచిన అయిదారేళ్ళ కాలంలో నేను ఫూలాజీ బాబాని రెండు మూడు సార్లు దర్శించుకున్నాను. ఆ అనుభవాలు ఇక్కడ నా మిత్రులతో పంచుకున్నాను కూడా. ఆయన గురించి విని ఒకసారి మిత్రుడు గంగారెడ్డి కూడా నాతో కలిసి ఆయన్ను దర్శించుకున్నాడు. ప్రతి సందర్శనంలోనూ ఆయన లోని అపారమైన దయ, ప్రేమ, ఆత్మీయతలతో బాటు, సాధారణ లౌకిక జీవితపు సరిహద్దుల్ని దాటిన ఒక అలౌకిక స్ఫూర్తి నాకు మరింతగా అనుభవంలోకి వస్తూనే ఉంది.

సద్గురు ఫూలాజీ బాబా సిద్ధపురుషుడు. పరమహంస. నా చిన్నప్పుడు శ్రీ మహాభక్త విజయంలో నేను చదివిన భక్తుల జీవితాల్లాంటి జీవితమే ఆయనదని తెలుసుకునే కొద్దీ, ఆయన్ని కళ్ళారా చూసినందుకూ, ఆయనతో సంభాషించే అదృష్టానికి నోచుకున్నందుకూ నేను నిజంగా భాగ్యవంతుణ్ణని నాకు తెలుస్తూనే ఉంది.

26-12-2018

ఈ అంశం మీద ఫేస్ బుక్ లో స్పందన కోసం ఇక్కడ చూడండి

Leave a Reply

%d bloggers like this: