నీలి రంగు హ్యాండ్ బ్యాగ్

Reading Time: 3 minutes

నాలుగైదు వారాలకిందట సి.వి.కృష్ణారావు గారి అమ్మాయి పార్వతి గారు ‘నెల నెలా వెన్నెల’ సమావేశం ఏర్పాటు చేసారు. ఒకప్పుడు కృష్ణారావుగారు ఆ వెన్నెలను నెలనెలా కిందకు దింపేవారు. ఈ మధ్య కొన్నేళ్ళుగా ఆ సమావేశాలు జరగడం లేదు. కాని, ‘నాన్న మా ఇంటిదగ్గరే ఉంటున్నాడు, ఒకసారి నెలనెలా వెన్నెల మీటింగ్ పెట్టమంటున్నాడు, మీరు కూడా రండి’ అని పార్వతి గారు పిలిస్తే వెళ్ళాను. చాలా ఏళ్ళ తర్వాత మళ్ళా కృష్ణారావుగారి సన్నిధిలో కొందరు కవులు, కవయిత్రులు తమ రచనలు వినిపించారు.

ఆ సాయంకాలం రేణుక అయోల కూడా ఒక కవిత వినిపించారు. నెలనెలా వెన్నెల సమావేశాల్లోనే, దాదాపు ఇరవయ్యేళ్ళ కిందట, ఆమె నాకు పరిచయమయ్యారు. ‘లోపలి స్వరం’ అనే తన కవితాసంపుటికి నాతో ముందు మాట రాయించారు. ఒక ట్రాన్స్ జెండర్ ఇతివృత్తంగా రాసిన ‘మూడవమనిషి’ పుస్తకం ఆవిష్కరణ సభలో నాతో మాటాడించారు కూడా. కాని, ఆ సాయంకాలం ఆమె వినిపించిన కవిత నేనింతదాకా చదివిన ఆమె కవితలన్నిటిలోనూ గొప్ప పరిణతి చెందిన కవితగా వినిపించింది. అంతేకాదు, ఇంతదాకా నేను తెలుగులో చదివిన వచనకవితల్లో అగ్రగణ్యమైన కవితల్లో ఆ కవిత కూడా ఒకటనిపించింది.

ఆ కవిత, ఇంతదాకా ప్రచురితమయ్యిందో లేదో తెలీదుగాని, ఇక్కడ మీతో పంచుకోలేకుండా ఉండలేకపోతున్నాను.

*

నీలి రంగు హ్యాండ్ బ్యాగ్ ….. 

అల్మారా సద్దుతుంటే జారిపడ్డ 
పాత నీలిరంగు హ్యాండ్ బ్యాగు 
అటు ఇటూ తిరుగుతున్న సమయాలని 
సందర్భాలని వో దగ్గర పడేసి వెళ్లిపోయాక 
హ్యాండ్ బ్యాగ్ తో పాటు ప్రత్యక్షమైన 
కాలం నాచేతిలో పునర్జీవించింది.

బరువైన స్కూల్ బ్యాగ్ నుంచి 
బుజాలమీద వాలిన హేండ్ బ్యాగ్ లో 
ఇష్టాయిష్టాలు మనసుకి దగ్గరగా ఒక రహస్యం
దాచుకోవడానికి ఒక చోటు దొరికింది. 
పుస్తకాలు, టిఫిన్ డబ్బా , లిపిస్టిక్ , దువ్వెన 
కొత్తగా కొనుకున్న కాంపెక్ట్ పౌడర్, స్టేఫ్రీ తో 
భయంగా సిగ్గుగా సిగ్గుగా 
ఎన్నో ఊహలని దాచిపెట్టే 
కాలేజీ అమ్మాయిలా ఉండేది .

పెళ్లి శుభలేఖలతో సిగ్గుపడుతూ బుజంమీద ఒదిగింది 
మొదటి బహుమతి డియోడరెంట్ ,
చేతి రుమాలు , ఇంటి తాళాలు, బిల్లులతో 
ఇష్టాలని మరచి పోయిన బాధ్యతలతో
కోడలిలా ఉండేది.

తల్లి కాబోతున్న ఆనందంతో బరువుగా ఊగింది 
పాల బుడ్డీలు, డైఫర్లు, సిరప్ బాటిల్స్,
ఎగస్ట్రా చెడ్డీలతో పాలవాసనలతో చాలీ చాలకుండా 
సెంటిమెంట్లతో కొత్త బ్యాగ్ లోకి మారకుండా 
ఆచ్చం అమ్మలా ఉండేది ..

పిల్లలు చదువులంటూ 
విదేశాలకి రెక్కలు కట్టుకుని ఎగిరినప్పుడు 
ఖాళీగా బుజం మీద వేళ్ళాడింది,
మనసు బరువుని తొలుస్తూ వచ్చే కన్నీళ్ళని ఆపుకుని 
తడి రుమాలుతో ఓ పిచ్చి తల్లిలా ఉండేది.

శుభలేఖలతో, కుంకుమ భరిణితో చుట్టాల లిస్టుతో 
హడావిడిగా సంతోషంగా అల్లుడికోసం, మరోసారి కోడలి కోసం 
బరువుగా బాధ్యతగా భుజాలమీద సంతోషంగా 
అచ్చం అత్తగారిలా ఉండేది.

కొన్నేళ్లుగా బుజాలమీదనుంచి చేతుల మీదకి వచ్చేసింది.

నిశ్శబ్దాన్ని మౌనాన్ని ఛేదిస్తూ 
రమణ లేఖలతో, కళ్లజోడు, సెల్ ఫోనుతో 
మతిమరుపుతో చిన్నదై, సంతోషాన్ని వెతుకుంటూ 
అరచేతిలో ఇమిడిపోయింది.

నీలంరంగు హ్యాండ్ బ్యాగు అల్మారాలో పాతబడి 
రాలిపడి గతాల కావడిలా ఉంది.

*

ఈ కవిత ఆధునిక మహిళ జీవితకథ అనవచ్చు. ఇందులో ఆమె పాటించిన శిల్పం నన్ను ముగ్ధుణ్ణి చేసింది. చేరా గారు ఉండి ఉంటే, ఈ కవితలో ఆమె పాటించిన వ్యూహాలమీద, ఒక విశ్లేషణ చేసిఉండేవారనిపించింది.

సాంప్రదాయిక లాక్షణిక శాస్త్రాల ప్రకారం చూసినా ఈ కవితలో రసనిర్వహణ సమర్థవంతంగా ఉంది. ఇందులో ఒక ఆధునిక మహిళ తాలూకు ఆరు దశల్ని ఆమె వర్ణించింది. ప్రతి దశలోనూ ఒక రసరేఖ స్ఫురణకోసం ఎటువంటి పదాల్నీ, ప్రతీకల్నీ వాడాలో అటువంటి విభావానుభావ సామగ్రినే ఆమె ఎంతో పొదుపుతో, ఎంతో సునిశితంగా ప్రయోగించింది. అంతిమంగా కవిత మనలో ఉద్దీపింపచేసే రసం కరుణ అని మనకు తెలుస్తూండటమే కాదు, కరుణకి స్థాయీభావమైన శోకాన్ని ఆమె దిగమింగుకుంటూండటం కూడా మనకు కనిపిస్తూనే ఉంది. ముందు చదివినప్పుడు, శోకాన్ని దిగమింగుకునే ప్రయత్నం వల్ల, కవయిత్రి శమం స్థాయీభావంగా శాంతరస ప్రధానమైన పద్యం చెప్తున్నదా అనే భావన మనకి కలగకపోదు. కాని, ‘గతాల కావడి’ అనే మాట వల్ల ఈ కవిత చివరికి కవయిత్రి మనసింకా స్తిమిత పడనేలేదనీ, ఇంకా శోకాకులంగానే ఉంటున్నదనీ మనం చెప్పవచ్చు.

అలా కాక ఆధునిక కావ్యానుశీలన ప్రకారం చూసినా ఈ కవిత మనలో రేకెత్తించే స్పందనలు అపూర్వం. ముఖ్యంగా, ఈ కవితా శిల్పం లో మాంటేజి నిర్వహించిన పాత్ర అసామాన్యంగా ఉంది. కవయిత్రి జీవితంలో మొదటిదశను వర్ణించిన పంక్తులు చూడండి:

‘బరువైన స్కూల్ బ్యాగ్ నుంచి 
బుజాలమీద వాలిన హేండ్ బ్యాగ్ లో 
ఇష్టాయిష్టాలు మనసుకి దగ్గరగా ఒక రహస్యం
దాచుకోవడానికి ఒక చోటు దొరికింది. 
పుస్తకాలు, టిఫిన్ డబ్బా , లిపిస్టిక్ , దువ్వెన 
కొత్తగా కొనుకున్న కాంపెక్ట్ పౌడర్, స్టేఫ్రీ తో 
భయంగా సిగ్గుగా సిగ్గుగా 
ఎన్నో ఊహలని దాచిపెట్టే 
కాలేజీ అమ్మాయిలా ఉండేది’

ఇక్కడ బాల్యం, కౌమారం, నవయవ్వనం మూడూ కలగలిసిపోయాయి. కవయిత్రి తానెవరన్న ఐడెంటినీ గుర్తుపడ్డటానికి హాండ్ బాగుని ఆసరాగా తీసుకున్నప్పుడు స్కూలు బాగు హాండ్ బాగుగా మారిందెప్పుడో ఆమెకే తెలీదు. కాని హాండ్ బాగ్ గా మారినప్పుడు ఆమె ప్రపంచం ఎంతగా public ఆవరణలోకి అడుగుపెట్టిందో, అంతగానూ private కూడా అయింది. ఒక బాలిక స్త్రీగా మారడంలో, తనకు తెలియకుండానే వ్యక్తిగత, సామాజిక వలయాలెట్లా వేరుపడతాయో, ఆ రెండింటినీ తనకై తాను, తనలో తాను పొదువుకునే క్రమంలో ఆమె ఒక personal space కోసం ఎట్లా వెతుక్కుంటుందో-

‘పుస్తకాలు, టిఫిన్ డబ్బా , లిపిస్టిక్ , దువ్వెన 
కొత్తగా కొనుకున్న కాంపెక్ట్ పౌడర్, స్టేఫ్రీ తో ‘

అనే ఆరు పదాలతో ఆమె వివరించింది. ఒక కవిత నిర్మించడంలో అనుభూతి తీవ్రత ఒక్కటే చాలదు, ఆ అనుభూతిని తిరిగి మనకి అందిస్తున్నప్పుడు ఎంత సంయమనం ఉండాలో కూడా ఈ రెండు వాక్యాలూ సాక్ష్యమిస్తున్నాయి.

పేరుపొందిన మన వచనకవులు పైకి చెప్పరుగాని, వాళ్ళు విట్మన్ నీ, నెరూదాని అనుకరించడమే సాధన చేసినవాళ్ళు. కాని వాళ్ళు విట్మన్ నుంచి నేర్చుకున్నదంతా జాబితాలు రాయడమూ (listing), నెరూదా నుంచి నేర్చుకున్నదంతా వక్తృత్వమూ మటుకే. వట్టి జాబితా ఎప్పటికీ కవిత్వం కానేరదు, ఆ జాబితాలో ఏ కీలక సామగ్రిని ఎంపికచేస్తే రసోత్పత్తి అవుతుందో అది మటుకే కవిత్వం అవుతుంది, ఈ వాక్యాల్లాగా:

‘పాల బుడ్డీలు, డైఫర్లు, సిరప్ బాటిల్స్,
ఎగస్ట్రా చెడ్డీలతో పాలవాసనలతో చాలీ చాలకుండా 
సెంటిమెంట్లతో కొత్త బ్యాగ్ లోకి మారకుండా 
ఆచ్చం అమ్మలా ఉండేది .. ‘

కాలేజీ అమ్మాయి, కోడలు, అమ్మ, పిచ్చి తల్లి, అత్తగారు-వీళ్ళంతా లోకంలో స్త్రీలు నిర్వహిస్తున్న వివిధ పాత్రలు. ఆ పాత్రల్ని మామూలుగా రచయితలూ కవులూ స్టీరియో టైపులుగా మాత్రమే చూపించడానికి అలవాటు పడ్డారు. కాని కవయిత్రి ఇక్కడ ఆ అన్నిపాత్రలనీ తనలోనే చూకుంటున్నది. అలా చూసుకోవడంలో ఒక తాదాత్మ్యం కూడా అనుభవిస్తున్నది. హేండ్ బాగుని వర్ణిస్తున్న నెపం మీద తన గురించి తానే చెప్పుకుంటున్నప్పుడు, ఆమె చెత్పున్నది ఒక స్త్రీ కథ మాత్రమే కాదు, ఆర్థిక స్వాలంబన పొందిన ఒక మహిళ కథ కూడా. చదువు, ఆర్థిక స్వావలంబన వల్ల ఆమె పరిథి విస్తరించింది. నెరవేర్చవలసిన కుటుంబ బాధ్యతలన్నీ నెరవేర్చింది. ఆ ప్రయాణంలో చివరికి చేరుకున్నది మళ్ళా ఒంటరితనాన్నే. తనకు తాను ఒంటరిగా మిగిలిపోయిన దృశ్యాన్ని ఆమె ఎంత ఆర్తిగా చిత్రించిందో ఈ పంక్తులు మరోసారి చూడండి:

‘నిశ్శబ్దాన్ని మౌనాన్ని ఛేదిస్తూ 
రమణ లేఖలతో, కళ్లజోడు, సెల్ ఫోనుతో 
మతిమరుపుతో చిన్నదై, సంతోషాన్ని వెతుకుంటూ 
అరచేతిలో ఇమిడిపోయింది. ‘

అలాగని ఈ శోకం దేన్నో పోగొట్టుకున్న శోకం కాదు, గడిచిన జీవితపు అనుభవాల తలపోతవల్ల కలిగే దిగులు.

ఈ కవిత విన్నాక సమకాలిక తెలుగు కవిత మీద గౌరవం పెరిగింది. ఈ కవితని ఏడెనిమిది నిమిషాల లఘుచిత్రంగా తీయొచ్చనిపించింది. అందుకు కావలసిన స్క్రీన్ ప్లే కవితలోనే ఉంది. మరి వెంకట్ సిద్ధారెడ్డి, కరుణ కుమార్, మహేష్ కత్తి ఏమంటారో!

2-1-2019

ఈ అంశం మీద ఫేస్ బుక్ లో స్పందన కోసం ఇక్కడ చూడండి

Leave a Reply

%d bloggers like this: