నా రక్తంలో విషం లేదు

Reading Time: 2 minutes

మొన్నెప్పుడో చూసాను, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రాస్తున్నారు, ఎంతసేపూ పుస్తక ప్రదర్శనలో కొన్న పుస్తకాల ఫొటోలే పెడతారేమిటి, ఆ పుస్తకాలు చదివి ఏముందో కూడా రాయొచ్చు కదా అని.

ఆ మాట చదవగానే నా పుస్తకాలు నన్ను నిలదీసాయి. పోయిన ఏడాది కొన్న పుస్తకాలకి బుద్ధిగా అట్టలైతే వేసానుగాని, చదవకుండా ఉండిపోయినవి చాలానే ఉన్నాయి. అందుకనే ఈ సారి ఎక్కువ పుస్తకాలు కొనలేదు. కానీ, కొన్న పుస్తకాలు ఒకటీ రెండయినా, వెంటనే చదవకతప్పదనుకున్నాను.

అందులో, మొదటగా చదివింది, ఇదిగో, అజ్ఞేయ రాసిన ఇంగ్లీషు కవిత్వం Prison Days and Other Poems (పెంగ్విన్, 2018).

సచ్చిదానందన్ వాత్య్సాయన్ అజ్ఞేయ (1911-87) ఆధునిక హిందీ కవిత్వాన్ని మలుపు తిప్పిన కవి, నవలాకారుడు, ప్రయోగశీలి. అన్నింటికన్నా ముందు భగత్ సింగ్ సహచరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. ఇరవై ఏళ్ళ వయసులోనే జైల్లో అడుగుపెట్టినవాడు. ఆ జైలు జ్ఞాపకాలతో 1933 నుంచి 1938 మధ్యకాలంలో రాసిన కవితలివి. వీటితో పాటు, తర్వాత రోజుల్లో రాసిన మరికొన్ని కవితలు కలిపి ఈ సంపుటంగా వెలురించారు. హిందీ మాతృభాష అయిన ఒక యువకుడు ఇంగ్లీషులో రాసిన ఈ కవిత్వంలో గొప్ప సారళ్యం, సూటిదనం కనిపించడం నన్ను కొంత ఆశ్చర్యపరిచింది. ఇంగ్లీషు మాతృభాష కాదనే బెరుకు లేకుండా సాహసంగా చేపట్టిన వాక్యనిర్మాణం, పదప్రయోగం ఈ కవిత్వాన్ని ఇన్నాళ్ళ పాటు సజీవంగా ఉంచాయని చెప్పవచ్చు.

జైల్లో అజ్ఞేయకు సహచరుడిగా ఉండిన మరొక స్వాతంత్ర్య సమరయోధుడు జవహర్ లాల్ నెహ్రూ ఈ కవితలకు రాసిన ముందుమాట ఈ సంపుటికి మరొక ఆకర్షణ. 1938 లో రాసిన ఆ ముందుమాటలో ఆయనిట్లా రాస్తున్నాడు:

‘మా కారాగారపు ఏకాంతమందిరాల్లో మేం అయిదు గజాలు ముందుకీ, అయిదు గజాలు వెనక్కీ నడవడానికి, అది కూడా దుఃఖంతో మటుకే నడవడానికి నోచుకున్నరోజులవి. అప్పుడు మాకు లభించిన శరణు, స్నేహం, సాంగత్యమేవన్నా ఉంటే అవన్నీ ఆలోచనల్లోనే. ఊహాగానపు పారశీక తివాసీమీద మేము మా పరిసరాలనుంచి దూరంగా ఎగిరిపోయేవాళ్ళం. ఆ రోజుల్లో మేము రెండు జీవితాలు జీవించాం-ఒకటి తలుపులవెనక, ఊచలవెనక, నిర్బంధం మధ్య గడిపిన జైలు జీవితం, మరొకటి, మా కలలు, మా ఊహలు, ఆశలు, ఆకాంక్షల్తో మా ఆత్మలో మేము జీవించిన పరిపూర్ణ స్వతంత్రజీవనం.’

ఈ సంపుటిలో ఉన్న అజ్ఞేయ కవిత్వానికి ఇంతకు మించిన పరిచయ వాక్యాలతో పనిలేదు.

కొన్ని కవితలు, తెలుగులో.

*
1

పద్మాలు వికసించే రోజులు

మా ఇంటిదగ్గర పాడుపడ్డ తోటలో
పద్మాలు వికసించే రోజులుండేవి.
ఎక్కడో చాలా దూరంలో
పాడుపడ్డ తోటలో
అవును, చాల దూరంలో.

ఇప్పుడు నా వెనక ఒక మహాసామ్రాజ్యం
కాని నేను పాడుపడిలేను

పద్మాలు
విస్తార నిర్మలత్వానికి చిహ్నాలు
విముక్త స్థలాలు

అటువైపు అయిదు గజాలు
ఇటువైపు అయిదు గజాలు
జైలు.

2

మంచు కురిసింది

నాకు గుర్తు, నా చిన్నప్పుడు
అకాశం మరీ నేలకు వాలి
మేఘాలు కమ్ముకుని మృదువుగా గర్జించినప్పుడు
చల్లని పిల్లతెమ్మెర ఒకటి
దేన్నో పోగొట్టుకుంటుందేమోనన్నట్టు
అలవోకగా తాకిపోయేవేళ
మా నాన్న గుండెనిండా గాలిపీలుస్తూ
ఒక మాట అంటూండేవాడు
‘పైనెక్కడో కొండల్లో మంచు కురిసినట్టుంది.’

నాకు గుర్తే:
అరిగిపోయిన నా సంకెళ్ళ వన్నెహటాత్తుగా ఈ రోజు మసకబారినప్పుడు
తల పైకెత్తి చూస్తే 
పాలు విరిగినట్టు మేఘాలు కమ్ముకుంటున్నప్పుడు
కైదుగదిమీంచి కందకందాకా
పిల్లతెమ్మెర కాదు, ఉక్కపోతల గాడ్పు వీచినప్పుడు
నేను కూడా తలెత్తి గాఢంగా ఆఘ్రాణించి
నాకు నేను చెప్పుకుంటాను
‘పైనెక్కడో కొండల్లో మంచు కురిసినట్టుంది.’

3

రెండు విషయాలు

రెండు విషయాలు నన్ను బలంగా తాకాయి
ఆ రెండూ ఒకటే.
అడవిచెట్లమధ్య చంచలంగా పారే సెలయేరు,
తొలివలపులో మునిగిన కన్యదరహాసం.
రెండు విషయాలు నన్ను బలంగా తాకాయి, 
చెప్పాలంటే, ఆ రెండూ ఒకటే.

రెండు విషయాలు నన్ను బాధపెట్టాయి,
ఆ రెండూ ఒకటే-
భ్రష్టాధరాల పైన ప్రేమనామోచ్చరణ,
సామ్రాజ్యవాదరాజ్యాల చేతుల్లో స్వాతంత్ర్య విగ్రహావిష్కరణ.
రెండు విషయాలు నన్ను బాధపెట్టాయి,
చెప్పాలంటే, ఆ రెండూ ఒకటే.

4

గర్భగుడి

వాళ్ళతడి పూజామందిరం నేలమట్టం చేసి
‘ఏడీ నీ దేవుడు, ఇప్పుడెక్కడు’న్నాడన్నారు.
‘మందిరం కూలిపోయి ఉండవచ్చుగాక
కాని అడుగో, ఆ స్వర్ణమూర్తి,
అతడే నా దేవుడు!’

వాళ్ళా విగ్రహం విరగ్గొట్టేసారు
‘దాన్నట్లా పడి ఉండనీ’ అన్నారు వికటంగా నవ్వుతో.
‘ఆ విగ్రహం వట్టి నీడ, అసలైన దేవుడు
ఇదిగో ఇక్కడున్నాడు, మీరు కనలేనిచోట,
నా హృదయంలో.’

వాళ్ళొక బుల్లెట్టుతో అతడి హృదయం ఛిద్రం చేసేసారు,
‘ఇంకెక్కడి దేవుడు? ఎగిరిపోయుంటాడ’న్నారు.
అతడు నిట్టనిలువుగా కూలిపోతూ
ఒక దీర్ఘగంభీరనిశ్వాసంతో ఎలుగెత్తి అరిచాడు
‘నేనేరా దేవుణ్ణి!’

5

బంధం

నేన్నీతో పోరాడతాను
కలయబడతాను
వట్టిచేతుల్తోనే నిన్ను చంపెయ్యగలను
నువ్వంటే నాకెక్కడలేని ద్వేషం.
అయినా, నాకు తెలుసు, నా అంతరాంతరాల్లో
నువ్వు నా అన్నదమ్ముడివి.
నా కలం విషంలో ముంచి రాస్తాను
కాని నా రక్తంలో విషం లేదు.

28-12-2018

ఈ అంశం మీద ఫేస్ బుక్ లో స్పందన కోసం ఇక్కడ చూడండి

Leave a Reply

%d bloggers like this: