ఆ పిల్లవాణ్ణి ఎందుకు చిత్రించినట్టు?

సంస్కృత నాటక కర్తలకి రాముడిలాగా, పాశ్చాత్య చిత్రకారులకి క్రీస్తు ప్రధాన ఇతివృత్తం. యూరపియన్ చిత్రకళ తొలిరోజుల్లో చర్చి ప్రధాన పోషకురాలుగా ఉండటమూ, చిత్రకళా పోషకులైన సంపన్నుల మతధార్మిక విశ్వాసాలూ మటుకే కారణం కాదు, తమ హృదయోద్వేగాన్ని ప్రకటించుకోడానికి బైబిలు కథలు, ముఖ్యంగా సువార్తలు చిత్రకారులకి ఆలంబనగా ఉండటం కూడా కారణమే. జీవితకాలం పాటు అట్లా బైబిలుని హృదయానికి హత్తుకుని మరీ చిత్రలేఖనాలు రచిస్తో వచ్చిన మహాచిత్రకారుల్లో రెంబ్రాంట్ ముందు వరసలో ఉంటాడు.

రెంబ్రాంట్ వాన్ రిజిన్ (1606-1669) డచ్ చిత్రకారుల్లో వెలాక్వెజ్ తర్వాత లెక్కకు వచ్చే మహోన్నత చిత్రకారుడు. యూరపియన్ చిత్రకళని అత్యున్నత శిఖరాలకు చేర్చిన మొదటి పదిమంది మహాచిత్రకారుల్లో ఒకడు. ముఖ్యంగా, అతడి స్వీయ ముఖచిత్రాలు ఆధునిక యూరప్ లో వ్యక్తి ఆవిర్భావానికి దర్పణాలు. పదిహేడో శతాబ్దిలో దేకార్త్ తత్త్వశాస్త్రంలో తీసుకువచ్చిన మలుపులాంటిదే రెంబ్రాంట్ చిత్రకళలో తీసుకువచ్చాడు. అంతదాకా, చర్చి నిర్దేశాలకు అనుగుణంగా జీవించడం మాత్రమే తెలిసిన యూరపియన్ సమాజంలో మొదటిసారి individual consciousness తలెత్తడం ఆ మలుపు.

కాని, యూరపియన్ చిత్రకళాచరిత్ర చదువుకునే విద్యార్థులు మర్చిపోయేదేమంటే, రెంబ్రాంట్ ఒక లౌకిక మానవుడి ఆవిర్భావాన్ని ఎంత తదేకంగా చిత్రిస్తూ వచ్చాడో, క్రీస్తుని కూడా అంతే తపోనిష్టతో చిత్రిస్తూ వచ్చాడనేది. నిజానికి, రెంబ్రాంట్ కాలం నాటికి హాలండ్ ఆధికారికంగా ప్రొటెస్టాంట్ రిఫర్మేటరీ మతాన్ని స్వీకరించింది. అప్పటికి డచ్చి నౌకలు ప్రపంచ సముద్రాల్లో వాణిజ్యాన్ని మొదలుపెట్టాయి. తూర్పుదేశాల నుంచి సుగంధాలు, చీనిచీనాంబరాలు నింపుకునివచ్చేవి. తక్కిన యూరప్ అంతా ఆకలితో అల్లాడుతుంటే, డచ్చి సమాజానికి ఉత్తరసముద్రజలాల్లోని మత్స్య సంపద విస్తారంగా అందుబాటులో ఉండేది. వాణిజ్యం తెచ్చిపెట్టిన ఆ కొత్త కలిమి చిత్రకారుల్నించి ఆశించింది సంపన్నుల ముఖచిత్రాలు, పూలూ, పళ్ళూ, ప్రకృతిదృశ్యాలూ, చారిత్రిక సన్నివేశాలూ మటుకే. బైబిల్ చిత్రాలు కూడా ఒకటో అరో చిత్రించినా, ఆ నాటి సంపన్న వర్గాలకి అవి ప్రధానం కాదు. అప్పటి సంపన్న సామాజిక అవసరాల ప్రకారం రెంబ్రాంట్ స్టూడియోలో బైబిలుకీ, క్రీస్తుకీ చోటు ఉండవలసిన పనిలేదు. అయినా కూడా తన స్వీయముఖచిత్రాలతో పాటు , తన కాలం నాటి డచ్చి ప్రముఖుల ముఖచిత్రాలతో పాటు, రెంబ్రాంట్ క్రీస్తుని కూడా చిత్రిస్తూనే ఉన్నాడు. ఇంకాచెప్పాలంటే, తననీ, సమాజాన్నీ చిత్రించడం కన్నా కూడా క్రీస్తుని చిత్రించడంలోనే అతడొక అద్వితీయ సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నాడు.

ఎందుకని? మెట్రొపోలిటన్ మూజియం ఆఫ్ ఆర్ట్ కోసం Rembrandt and the Bible (1979) అనే రచన వెలువరించిన ఒక చిత్రకళా విమర్శకుడు ఇందుకు ముఖ్యకారణం రెంబ్రాంట్ మీద అతడి తల్లి చూపించిన ప్రభావం అంటాడు. రెంబ్రాంట్ తండ్రితో సహా అతడి కాలం నాటి డచ్చి సమాజం ప్రొటెస్టాంట్లు అయినప్పటికీ, తల్లిమాత్రం సనాతన కేథలిక్కు కావడం వల్ల, ఆమె తన సరళ క్రైస్తవ ప్రపంచపు ముద్ర రెంబ్రాంట్ పసిమనసులో ముద్రించినందువల్ల అతడు బైబిలుని జీవితమంతా వదల్లేదు అంటాడు ఆ విమర్శకుడు. చివరికి, రెంబ్రాంట్ సమాధి గృహంలో కూడా అతడికి తోడుగా ఉన్నది బైబిలు మటుకేనంటాడు ఆ విమర్శకుడు.

రెంబ్రాంట్ చిత్రించిన బైబిలు సన్నివేశాల్లో, ముఖ్యంగా క్రీస్తు జీవితఘట్టాల్లో మహిమోపేత దృశ్యాలకన్నా మానవీయ దృశ్యాలే ఎక్కువ. అతడి క్రీస్తు అత్యంత మానవీయుడైన క్రీస్తు. పదిహేడో శతాబ్దపు డచ్చి సమాజంలో నిజంగా తారసపడితే బాగుండనిపించే ఒక వివేకి, ఒక ఉదారుడు, ఒక సరళమనస్కుడు, ప్రేమాస్పదుడు. తాను చిత్రిస్తూ వచ్చిన ఏ ముఖంలోనూ కనిపించని ఒక మానవీయ ముఖాన్ని వెతుక్కుంటో అతడు క్రీస్తుని చిత్రించాడని చెప్పవచ్చు.

తన ప్రసిద్ధ తైలవర్ణాల చిత్రాలకన్నా కూడా, తన ఎచ్చింగుల్లో అతడు క్రీస్తుని మరింత శక్తిమంతంగా చిత్రిస్తో వచ్చేడు.ఆ ఎచ్చింగుల్లో రెండింటిని ఇక్కడ పరిచయం చేద్దామనుకుంటున్నాను.

ఇందులో మొదటిది, పన్నెండేళ్ళ వయసులో క్రీస్తుని ఆయన తల్లిదండ్రులు యెరుషలేం దేవాలయానికి తీసుకువెళ్ళినప్పుడు, ఆ బాలక్రీస్తు అక్కడి పండితుల్తో చర్చ చేస్తూండే దృశ్యం.

ఆ దృశ్యం చిత్రించే కాలంలో రెంబ్రాంట్ కొడుకు కూడా పన్నెండేళ్ళ వయసు వాడు. ఆ పిల్లవాడికి ముందు ముగ్గురు పిల్లలు శైశవంలోనే మరణించారు. అందువల్ల ఆ పిల్లవాణ్ణి రెంబ్రాంట్ చాలా అపురూపంగా చూసుకునేవాడు. కాబట్టి తాను చిత్రించిన బాలయేసులో కూడా రెంబ్రాంట్ తన పిల్లవాణ్ణే చూసుకున్నాడు. చిత్రకళా ప్రమాణాల ప్రకారం కూడా ఆ ఎచ్చింగ్ అసాధారణమైందనే చెప్పాలి. ఎందుకంటే తక్కిన ఆకృతులన్నీ వయోవృద్ధులవి కాగా, వారి మధ్య ఒక బాలుడి చిత్రాన్ని చిత్రించడమేమంత సులభం కాదు. ఆ ఆకృతుల అమరికలో కూడా ఒక నాటకీయతను తీసుకురావడం కోసం అతడు చిత్రాన్ని రెండు భాగాలుగా విభజించుకుని కుడివైపు, ఎడమవైపూ కూడా పండితులు కూచున్న, నిల్చున్న భంగిమల్లో చిత్రించాడు. వారందరి దృక్కులూ, ముఖాలూ కూడా యేసుమీదనే లగ్నమైనట్టుగానూ, వారి కవళికలు ఆ బాలుడు చెప్తున్న మాటల పట్లనే తదేకంగానూ ఉండేటట్టుగా చిత్రించాడు. రెంబ్రాంట్ కి ముందుగాని, తర్వాత గాని, ఈ సన్నివేశాన్ని ఇంత భక్తిశ్రద్ధలతో ఎవరూ చిత్రించలేదు. నిజానికి మరే చిత్రకారుడూ కూడా ఈ సన్నివేశాన్ని చిత్రించదగ్గదిగా భావించనే లేదు. కాని, రెంబ్రాంట్ ఈ సన్నివేశాన్ని ఒకసారి కాదు, రెండుసార్లు చిత్రించాడు. ఎందుకని? ఆ బాల యేసులో తన పిల్లవాణ్ణి చూసుకున్నందువల్లనా లేక తన పిల్లవాడికి ఆ బాలయేసు వదనమొక ఆదర్శం కావాలనా? లేక, తన పసితనంలో తన తల్లి చెప్పిన ఆ కథని మళ్ళా తనకోసం తానొకమారు చిత్రించి చూసుకోవాలనా?

కాని ఆ రోజుల్లోనే, అతడు మరొక చిత్రలేఖనం గీసాడు. Christ Preaching (1652) పేరిట ప్రసిద్ధి చెందిన ఈ ఎచ్చింగ్ ప్రపంచచిత్రలేఖనాల్లో మొదటివరసలో నిలబడుతుంది.

ఈ చిత్రలేఖనాన్ని మొదటి చిత్రలేఖనంతో పోల్చి చూడండి. బాలయేసు మాట్లాడుతున్నప్పుడు చుట్టూ ఉన్న శ్రోతలంతా ఆయనమీదనే దృష్టి లగ్నం చేసారు. అక్కడ యేసు మాట్లాడినదాని మీదకన్నా, ఆ పిల్లవాడి పరిజ్ఞానమే వాళ్ళని ఎక్కువ ఆకట్టుకుంది. అందువల్ల వాళ్ళ దృష్టి ఆ మాటల మీద లేదు, ఆ బాలుడి మీద ఉంది. కాని ఈ రెండవ చిత్రలేఖనంలో, యేసు బాలయేసు కాదు, క్రీస్తు. లోకరక్షకుడు. దివ్యసందేశాన్ని మామూలు మనుషుల మధ్యకు తీసుకువచ్చిన ప్రవక్త. ఇక్కడ శ్రోతల దృష్టి క్రీస్తుమీద లేనే లేదు. వాళ్ళల్లో ఒక్కరి చూపు కూడా క్రీస్తు వైపు లేదు. అసలెవరి చూపూ ఎవరి వైపూ లేదు. ప్రతి ఒక్కరూ తమలోకి తాము చూసుకుంటూ ఉన్నారు. అక్కడ ప్రాధాన్యత ప్రవక్తకి కాదు, ప్రవచనానికి మాత్రమే. ఒక విమర్శకుడు పేర్కొన్నట్టుగా, ఈ చిత్రలేఖనంలో రెంబ్రాంట్ accomplished a seeming impossibility: he drew the portrait of a voice.

ప్రపంచ చిత్రలేఖన చరిత్రలో ముఖచిత్రకారుడిగా, స్వీయ ముఖచిత్రకారుడిగా రెంబ్రాంట్ అగ్రేసరుడు. కాని, అతడు చిత్రించిన ప్రకాశమాన తైలవర్ణ ముఖచిత్రాలన్నీ కూడా ఈ నలుపు తెలుపుల ఎంగ్రేవింగ్ ముందు తలవాల్చేస్తాయని మనం ఒప్పుకోవచ్చు.

ఇక ఈ చిత్రలేఖనంలో మధురాతిమధురమైన విశేషం మరొకటుంది. అది ఒక పిల్లవాడి ఆకృతి. ప్రవచనం సాగిస్తున్న క్రీస్తు ముందు నేలమీద, ఆయన వైపు కాక, మనవైపు తిరిగి బోర్లా పడుకున్న పిల్లవాడు. ఆ పిల్లవాడు ఎడమచేతి చూపుడువేలితో నేలమీద ఏదో గీస్తున్నాడు. ఆ పిల్లవాడి కుడిపక్కన ఒక ఊలుదారపు బంతి పడి ఉంది. క్రీస్తు చుట్టూ ఉన్న శ్రోతలు ఒక అండాకార కక్ష్యలో కనిపిస్తుంటే, వాళ్ళ చుట్టూ నీడ అర్థచంద్రాకారంగా ఆవరించి ఉంది. ఆ నీడ ఆ సమావేశానికి చుట్టూ తెర అమర్చినట్టుంది. ఆ నీడ మధ్య వెలుగులో ఆ పిల్లవాడు ఆ దృశ్యంలోంచి చూపరుల చూపుని బయటకు తీసుకువస్తున్నాడు. ప్రేక్షకుడు చిత్రం మొదటిసారి చూడగానే అతడి చూపు చుట్టూ ప్రదక్షిణంగా తిరిగి, క్రీస్తు పైన నిలిచి, కిందకు చూస్తున్న క్రీస్తు చూపులమీంచి కిందకి జరిగి, ఆ పిల్లవాడిమీదుగా చిత్రలేఖనంలోంచి బయటకు సాగుతుంది. అంటే ఆ దృశ్యంలోంచి మన చూపులు బయటకి రావడానికి ఆ పిల్లవాడి బొమ్మ ద్వారం అన్నమాట.

అటువంటి ఆ దివ్యప్రసంగ ఘట్టంలో రెంబ్రాంట్ ఆ పిల్లవాణ్ణి ఎందుకు చిత్రించినట్టు? క్రీస్తు ఏ కపెర్నహోములోనో ప్రసంగిస్తున్నప్పుడు, అక్కడి దైనందిన జీవితాన్ని మనకి స్ఫురింపచేయడం కోసమా లేకపోతే ఆ పిల్లవాడి తల్లిదండ్రులెవరో వాళ్ళు అతడి ధ్యాస కూడా మర్చిపోయి క్రీస్తు బోధనల్ని తాదాత్మ్యంతో వింటున్నారని చెప్పడం కోసమా?

రెంబ్రాంట్ కాలం నాటికి బైబిలుని చిత్రించేటప్పుడు అసాధారణ దృశ్యాలు, మహిమలు ఉండకూడదనీ, కేవలం మానవీయ దృశ్యాలు మాత్రమే చిత్రించాలనీ ప్రొటెస్టంట్ నిబంధనలు ఉండేవి. అలాగే క్రీస్తుని చిత్రించేటప్పుడు కూడా, ఆ చిత్రలేఖనాల పోషకుల, దాతల ముఖాలు ఆ చిత్రాల్లో కనిపించకూడదనీ కేవలం బైబిలు కాలం నాటి మనుషులు మాత్రమే ఉండాలనీ కూడా కఠినమైన నిబంధనలుండేవి. కాని, రెంబ్రాంట్ దాదాపుగా తన బైబిలు చిత్రలేఖనాలన్నిటిలోనూ కూడా ఏదో ఒక ఆకృతిలో తనను కూడా చిత్రించుకునేవాడు. నలుగురిలో ఒకడిగానో, దారినపోయే బాటసారిగానో, నిలబడి చూసే చూపరిగానో ఏదో ఒక ఆకృతిలో తాను కూడా ఆ సన్నివేశంలో ఉన్నట్టుగా ఊహించుకుని తనని కూడా తాను చిత్రించుకునేవాడు.

నేనేమనుకుంటానంటే, ఈ దృశ్యంలో రెంబ్రాంట్ తనని తాను ఆ బాలుడి రూపంలో చిత్రించుకున్నాడని. తన చిత్రకళా సాధన మొత్తం క్రీస్తు పాదాల దగ్గర ఒక పసివాడు నేలమీద గీస్తున్న గీతలాంటిదేనని రెంబ్రాంట్ భావించుకున్నాడని. ఆ పిల్లవాడు క్రీస్తు మాటలు వినడం లేదని మనం ఎందుకనుకోవాలి? తక్కిన శ్రోతలంతా క్రీస్తుని వింటున్నారు, కాని ఆ పిల్లవాడు ఆ దివ్యసందేశాన్ని విన్నదాన్ని విన్నట్టుగా గీతలుగా మారుస్తున్నాడని ఎందుకనుకోకూడదు? అన్నిటికన్నా ముఖ్యం, నువ్వొక పసిపిల్లవాడిగా మారితే తప్ప దేవుడి రాజ్యంలోకి ప్రవేశం లేదని క్రీస్తు చెప్పిన మాటల్ని రెంబ్రాంట్ మనోవాక్కాయకర్మలతో పరిపూర్ణంగా విశ్వసించాడని ఈ చిత్రం సాక్ష్యమివ్వడం లేదూ!

*

Verily I say unto you, Except ye be converted, and become as little children, ye shall not enter into the kingdom of heaven.

Whosoever, therefore, shall humble himself as this little child, the same is greatest in the kingdom of heaven.

(Matthew: 18:2)

25-12-2018

ఈ అంశం మీద ఫేస్ బుక్ లో చర్చ కోసం ఇక్కడ చూడండి

One Reply to “ఆ పిల్లవాణ్ణి ఎందుకు చిత్రించినట్టు?”

  1. మీరు ప్రేమగా అల్లుకున్న కుటీరంలో కొద్దీ తడవు ప్రవేశం కల్పించినందుకు ధన్యవాదములు

Leave a Reply

%d bloggers like this: