థిచ్ నాట్ హన్ -2

థిచ్ నాట్ హన్ జీవితం పంచాగ్ని మధ్యంలో ప్రశాంతంగా విరబూసిన పద్మం లాంటిది. ఆ అగ్నివల్ల ఆ పద్మం వన్నె తగ్గలేదు సరికదా, మరింత శోభించింది, తన చుట్టూ ఉన్న అశాంతినీ, ఆందోళననీ తగ్గించడం కోసమే ఆయన మరింత ధ్యానమగ్నుడిగా, మరింత ప్రశాంతచిత్తుడిగా జీవిస్తూ వచ్చాడు.

పదహారేళ్ళ వయసులో మఠంలో సన్న్యాసిగా చేరినతరువాత, ఆయనకి బౌద్ధ మఠాలు ప్రజాజీవితానికీ, ప్రజల సమస్యలకీ దూరంగా జీవిస్తున్నాయని అర్థమయింది. బయట వియత్నాం మీద బాంబుల వర్షం కురుస్తోంది. ప్రపంచంలో ఇంతదాకా అత్యధికంగా బాంబులు కురిసిన ఏకైక దేశంగా వియత్నాం చరిత్రకెక్కుతోంది. బయట ప్రజలు నిరాశ్రయులై తల్లడిల్లుతోంటే, మఠాల్లో సన్న్యాసులు మహాయాన సూత్రాలు వల్లెవేసుకుంటో గడుపుతూండటం థిచ్ నాట్ హన్ ను అస్తిమితానికి గురిచేసింది. రక్తసిక్తమైన వియత్నాంకి సపర్యచేయడానికీ, కూలిపోయిన వియత్నాం ని పునర్నించడానికీ ఆయన యువతని కూడగట్టి ‘సొసైటీ ఆఫ్ యూత్ ఫర్ సోషల్ సర్వీస్’ అనే సంస్థ స్థాపించాడు. వేలాది యువతీయువకులు ఆయన పిలుపు విని ముందుకు వచ్చారు. యుద్ధంలో దెబ్బతిన్న గ్రామాల్ని పునర్మించడానికీ, పిల్లలకి పాఠాలు చెప్పడానికీ, క్షతగాత్రులకి సేవలు అందించడానికీ వాళ్ళు తమ ప్రాణాలు పణంగా పెట్టారు. వాళ్ళ కృషి ఎట్లాంటిదంటే, ఒక గ్రామాన్ని వాళ్ళు పునర్మించిన ప్రతి సారీ ఆ గ్రామం మీద బాంబులు పడుతూనే ఉన్నాయి, అయినా వాళ్ళు పునర్మిస్తూనే ఉన్నారు. అట్లా ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, ఆరుసార్లు వాళ్ళా గ్రామాన్ని తిరిగి కూడగట్టారు.

ఆ రోజుల్లో అంటే, 1964-66 లో థిచ్ నాట్ హన్ కవిత్వం రాసాడు, ప్రసంగాలు చేసాడు, ఐక్యరాజ్యసమితికి వెళ్ళి విన్నపాలు చేసాడు. ఆయన్ని ఉత్తర వియత్నాం యుద్ధ వ్యతిరేకి అని ముద్ర వేసింది. దక్షిణ వియత్నాం కమ్యూనిస్టుగా ముద్రవేసింది. ఒకసారి అమెరికా పర్యటనకి వెళ్ళిన థిచ్ నాట్ హన్ తిరిగి వియత్నాం గడ్డమీద కాలు మోపకుండా రెండు దేశాలూ నిషేధించాయి. అటు అమెరికా కూడా ఆయన్ని బయటకి పొమ్మని ఒత్తిడి మొదలుపెట్టింది. కొందరు మిత్రులు ఆయన్ని రహస్యజీవితం జీవించమని సలహా ఇచ్చారు. కాని ఆయనకి రహస్య జీవితంలో నమ్మకం లేదు. చివరికి ఫ్రాన్సు ఆయనకి ఆశ్రయమిచ్చింది. అక్కడ చాలా ఏళ్ళు ఏదో ఒక పనిచేస్తో గడిపిన తరువాత, కొన్నాళ్ళకి, దక్షిణ ఫ్రాన్సులో ‘ప్లమ్ విలేజి’ అనే ఒక ఆశ్రమాన్ని నిర్మించాడు. అనేకమంది వియత్నాం కాందిశీకులకి అది ఆశ్రయం. కాలక్రమంలో అది సమస్త ప్రపంచానికీ శాంతిసందేశాన్ని అందించే దీపస్తంభాల్లో ఒకటిగా మారిపోయింది.

థిచ్ నాట్ హన్ జీవితం 20-21 వ శతాబ్దాల్లో కూడా ఒక మనిషి బుద్ధుడిగా మారగలడని నిరూపించే అపూర్వగాథ. ఆయన తన జీవితయానాన్ని ఒక పూర్తి ఆత్మకథగా రాయలేదుగాని, తన జీవితంలోని మలుపుల్నీ, మననీయ సంఘటనల్నీ చిన్న చిన్న కథలుగా చెప్తూ At Home in the World (2016) అనే పుస్తకంగా వెలువరించాడు. వియత్నాంలో తన తొలినాళ్ళ జీవితం, యుద్ధం, ప్రవాసం, ప్లమ్ విలేజి స్థాపన, తాను ప్రపంచ పౌరుడు కావడం, తన గమ్యాన్ని చేరుకోవడం అనే అయిదు భాగాల్లో తన జీవితంలోని ముఖ్యఘట్టాల్ని సరళంగా, కాని ఎంతో శక్తిమంతంగా చెప్పుకొచ్చాడు.

అందులోంచి ఈ రెండు ఖండికలు మీ కోసం.

బుద్ధుడి బొమ్మ

నేను ఏడెనిమిదేళ్ళ చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఒక బౌద్ధ పత్రిక మీద బుద్ధుడి బొమ్మ ఒకటి ముఖచిత్రం చూసాను.అందులో బుద్ధుడు పచ్చికమీద చాలా ప్రశాంతంగా కూచుని కనిపిస్తూ నన్నెంతో ఆకట్టుకున్నాడు. ఆ చిత్రకారుడెవరోగాని అటువంటి చిత్రాన్ని గీయగలిగాడంటే అతడు తన మనసులోపల అపారమైన మనశ్శాంతిని అనుభవిస్తూ ఉండిఉండాలనుకున్నాను. ఆ చిత్రం చూస్తుంటేనే నేనెంతో సంతోషానికి లోనయ్యాను. ఎందుకంటే ఆ రోజుల్లో నా చుట్టూ ఉన్న చాలామంది మనుషులకి తమ జీవితాల్లో ఎటువంటి సంతోషం, ప్రశాంతీ కనిపించేవి కావు.

ఆ ప్రశాంత చిత్రలేఖనం చూస్తూనే నేను కూడా బుద్ధుడిలాంటి మనిషిని కావాలనుకున్నాను. అంత నిశ్చలంగానూ, అంత ప్రశాంతంగానూ కూచోగలిగేలాంటి మనిషిని కావాలనుకున్నాను. బహుశా, నేనొక సన్యాసిని కావాలని కోరుకున్న మొదటి క్షణం అదేననుకుంటాను, సన్యాసి కావడమంటే ఏమిటో ఆ క్షణాన నాకు నిజంగా తెలియకపోయినప్పటికీ.

బుద్ధుడు దేవుడు కాడు. ఆయన మనలాగే పదహారణాల మనిషి. మనలానే ఆయన కూడా తన కౌమారంలో చాలా సంఘర్షణకి లోనయ్యాడు. తన రాజ్యంలో మనుషుల బాధలు చూసాడు. ఆయన తండ్రి శుద్ధోధనుడు తన చుట్టూ ఉన్న వేదనని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఆ ప్రయత్నాలేమంత నెరవేరక పోవడం కూడా ఆ యువకుడు చూసాడు. యువసిద్ధార్థుడికి రాజకీయాలు నిరర్థకంగా తోచాయి. ఆ చిన్నవయసులోనే ఆయన మనుషుల వేదనని తగ్గించే మార్గమేదన్నా ఉందా అని వెతకడం మొదలుపెట్టాడు. పుట్టడం రాజకుమారుడిగా పుట్టినప్పటికీ, ఆ వస్తువిలాసాలు ఆయనకి సంతోషాన్నివ్వలేకపోయాయి. ఇంట్లో ఆయన శాంతిగా ఉండలేకపోయాడు. తాను పుట్టిపెరిగిన చోటుని వదిలిపెట్టి తనకి శాంతి లభించే తనదంటూ ఒక చోటుని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు.

ఈ రోజు చాలామంది యువతీయువకులు ఆ యువసిద్ధార్థుడిలానే వేదనపడుతున్నారు. మనం ప్రతి ఒక్కరం మనం అనుసరించదగ్గ ఒక సత్యం కోసం, హితం కోసం, సౌందర్యం కోసం వెతుక్కుంటున్నాం. కాని మనం వెతుక్కుంటున్నదేదో మన చుట్టూఉన్న ప్రపంచంలో కనబడక మనం నిరాశా నిస్పృహలకి లోనవుతున్నాం. చాలా చిన్న వయసులోనే నేనిటువంటి నిరాశని అనుభవించాను. కాబట్టే ఆ రోజు ఆ బుద్ధుడి బొమ్మ చూడగానే నాకెంతో సంతోషమనిపించింది. నాక్కూడా అలాంటి మనిషిని కావాలనిపించింది.

సరైన సాధన చేస్తే, నేను కూడా బుద్ధుణ్ణి కాగలనని నాకు అర్థమయింది. ప్రశాంత చిత్తంతోనూ, ప్రేమైక హృదయంతోనూ, తోటిమనుషుల పట్ల అవగాహనతోనూ ఎవరు మెలిగినా వారిని కూడా బుద్ధుడనవచ్చునని కూడా తెలుసుకున్నాను. అటువంటి బుద్ధులు గతంలో ఎందరో ఉన్నారు. వర్తమాన ప్రపంచంలోనూ ఎందరో ఉన్నారు. భవిష్యత్తులో కూడా మరెందరో రానున్నారు. బుద్ధుడంటే ఒక ప్రత్యేక వ్యక్తి కాదు. అంతరంగంలో ఎంతో కొంత ప్రశాంతిని అనుభవిస్తూ, అపారమైన అవగాహనతో తోటిమనుషుల పట్ల దయనీ కనపరచగల ప్రతి ఒక్కరికీ వర్తించే సర్వనామం బుద్ధుడు. అట్లా బుద్ధుడనిపిలిపించుకోగల సామర్థ్యం మనలో ప్రతి ఒక్కరికీ ఉందని నేను తెలుసుకోగలిగాను.

తలుపు దగ్గరికి వెయ్యడం

కొనిసార్లు పిల్లలు నన్నడుగుతుంటారు: మీరెందుకు ధ్యానం చేస్తూంటారని. నేనెందుకు ధ్యానం చేస్తుంటానంటే, నాకు ధ్యానమంటే ఇష్టం కాబట్టి. నాకు నడుస్తున్నప్పుడు, చివరికి నించున్నప్పుడు కూడా, ధ్యానం చేస్తూండాలనిపిస్తుంది. నువ్వేదన్నా క్యూలో నించోవలసి వచ్చిందనుకో, ఏదన్నా కొనుక్కోడానికో, లేదా అన్నం వడ్డించేటప్పుడో నిలబడవలసి వచ్చిందనుకో. అప్పుడు కూడా నువ్వా క్షణాల్లో మనసు పెట్టి ధ్యానం చేసుకుంటూ ఉండవచ్చు. నీ ఉచ్ఛ్వాసాన్నీ, నిశ్వాసాన్నీ గమనించుకుంటో, నీ ఉనికినీ, నీ చుట్టూ ఉన్న మనుషుల ఉనికినీ కూడా అనుభవంలోకి తెచ్చుకుంటో ఉండవచ్చు.

ధ్యానానికి ఇదే పద్ధతంటూ ఏమీ లేదు. నువ్వు డ్రైవ్ చేస్తూన్నప్పుడు, మనసుపెట్టి నీ ఉచ్ఛ్వాసనిశ్వాసాల్ని గమనించుకుంటో డ్రైవ్ చేస్తున్నావనుకో, నువ్వు ధ్యానం సాధన చేస్తున్నట్టే లెక్క. ఊపిరి పీల్చడం, వదిలిపెట్టడం గమనించుకుంటో, చిరుమందహాసంతో గిన్నెలు కడుక్కుంటున్నావు అనుకో, అప్పుడు ఆ గిన్నెలు కడుక్కోడం కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది. గిన్నెలు కడుక్కోవడమంటే వట్టి గిన్నెలు కడుక్కోడం మాత్రమే కాదు, అట్లా కడుక్కునే సమయాన్ని ఆనందించడం కూడా. మనసుపెట్టి చేసేటప్పుడు పుట్టే శక్తి వల్ల మన రోజువారీ జీవితంలోని ప్రతి చిన్నపని కూడా మనకెంతో సంతోషకారకంగా మారిపోతుంది.

నేనీ పాఠాన్ని ప్రతిరోజూ సాధన చేస్తూంటాను. నేను బౌద్ధ సన్యాసుల మఠంలో చేరిన తొలి రోజుల్లో మా గురువుగారు నాకేదో పని పురమాయించారు. నాకు మా గురువుగారంటే చాలా ఇష్టంగా ఉండేది, అందుకని ఆయన ఏ పని చెప్పినా అపరిమితమైన ఉత్సాహంతో చేసేవాణ్ణి.ఆ రోజు కూడా అట్లానే ఆయన చెప్పిన పని చెయ్యడానికి ఉరుకులు పెట్టాను. నా మనసు ఆ పనిమీదే ఉండటంతో ఆ గదిలోంచి బయటకు వెళ్తూ ఆ తలుపు దడాలున మూసేసాను. అప్పుడు మా గురువుగారు నన్ను మళ్ళా వెనక్కి పిలిచి ‘నాన్నా, ఆ తలుపు దగ్గరకేసి మళ్ళా బయటికి వెళ్ళు, ఈ సారి తలుపు దగ్గరికి వేసేటప్పుడు ఇంతకుముందుకన్నా బాగా వెయ్యగలవేమో చూడు’ అన్నారు. ఆ మాటలు వింటూనే నా పొరపాటు నాకు అర్థమయింది. నేనాయనకు మరోమారు ప్రణమిల్లి, నా సమస్త స్పృహనీ కూడగట్టుకుని, బయటకు అడుగుపెట్టి, పూర్తి ఎరుకతో, జాగరూకతతో, ఆ తలుపు దగ్గరికీ వేసాను. తలుపు ఎట్లా దగ్గరికి వెయ్యాలో ఆ తరువాత నాకు మరోసారి మా గురువుగారు చెప్పవలసిన పనిలేకపోయింది. ఇప్పుడు నేను ఎక్కడైనా సరే తలుపు తీసి వేసే ప్రతిసారీ, మా గురువుగారినే తలుచుకుంటూ, మనసుపెట్టి మరీ తెరుస్తాను, దగ్గరికి వేస్తాను.

చాలా ఏళ్ళ తరువాత, అమెరికాలో కెంటకీలో క్రైస్తవ సన్యాసి థామస్ మెర్టన్ ని కల్సుకున్నప్పుడు మాటల మధ్యలో, నేనాయనకు ఈ సంగతి కూడా చెప్పాను. కానీ ‘నువ్వీ సంగతి చెప్పనక్కర్లేకుండానే, నువ్వు తలుపు తీసేటప్పుడు, వేసేటప్పుడు ఎంత శ్రద్ధ చూపిస్తావో నేనిప్పటికే గమనించాను’ అన్నాడాయన. కెంటకీలోని మఠం నుంచి నేను వచ్చేసిన నెలరోజుల తర్వాత ఒక రోజు ఆయన తన శిష్యులతో చేసిన ప్రసంగంలో నేను తలుపు వేసే కథ గురించి కూడా చెప్పాడని తెలిసింది.

మరికొన్ని ఏళ్ళ తరువాత, ఫ్రాన్సులో మా ప్లమ్ విలేజి కేంద్రంలో నేను నిర్వహిస్తున్న ఒక ధ్యానశిబిరంలో పాల్గోడానికి ఒక జర్మన్ మహిళ వచ్చింది. శిబిరం ముగింపు రోజు ఆమె మాట్లాడుతూ, తాను థామస్ మెర్టన్ తన శిష్యులతో చేసిన ప్రసంగం టేపు విని, నేను తలుపు ఎట్లా తెరుస్తానో, ఎట్లా దగ్గరికి వేస్తానో చూడాలనే కుతూహలం కొద్దీ తానా ధ్యానశిబిరంలో చేరానని చెప్పుకొచ్చింది.

9-12-2018

ఈ అంశం మీద ఫేస్ బుక్ లో సవివరమైన చర్చ కోసం ఇక్కడ చూడొచ్చు

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading