పచ్చ బంగారులోకం

వారం రోజుల కిందట ఒక సాయంకాలం ఇంటికి వచ్చేటప్పటికి, ‘పచ్చ బంగారులోకం’ వచ్చి ఉంది. మొదటిపేజీమీదనే ‘నా చిన్నతండ్రికి అత్యంత ప్రేమతో – అమ్మ’ అని మంగాదేవిగారి ఆకుపచ్చ సంతకం ఉంది. ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న పుస్తకం. అసలు మొత్తం ఈ పుస్తకమే మంగాదేవిగారి ఆకుపచ్చ సంతకం అనిపించింది.

గుంటూరుదగ్గర చౌడవరంలో డా.నన్నపనేని మంగాదేవి గారు నిర్వహిస్తున్న చేతన ప్రాంగణం చిన్నారి బాలల పాఠశాల మాత్రమే కాదు, నందనవనం కూడా. ఆమె అక్కడ ఎన్నో పూలమొక్కల్నీ, చెట్లనీ, దేశవిదేశాలకు చెందినవాటినెన్నిటినో అపురూపంగా పెంచుతున్నారు. అక్టోబరు, నవంబరు నెలల్లోగాని, మార్చి ఏప్రిల్ నెలల్లోగాని, చేతన ప్రాంగణంలో ఒక ప్రత్యూషవేళనో, సాయంసాంధ్యవేళనో, ఒక గంటపాటు సంచరించినా కూడా, ఆ ప్రాంగణాన్ని ఇక జీవితకాలంలో మరవడం అసాధ్యం. పూలపరిమళాలు ధారాపాతంగా కురుస్తుండే ఆ పచ్చటివీథిలో పిల్లల మధ్య ఏ కొద్దిసేపు గడిపినా కూడా, ఖుస్రో చెప్పినట్టు ‘ఈ భూమ్మీద స్వర్గమంటూ ఉంటే, అదిక్కడే, ఇక్కడే, ఇక్కడే’ అని అనిపిస్తుంది.

ఆ ప్రాంగణంలో తాను పెంచిన చెట్ల మీద, మొక్కల మీద ఒక పుస్తకం తేవాలనుకుంటున్నానని డా.మంగాదేవి నాతో చెప్పి అయిదేళ్ళ పైనే కావొస్తూంది. ఇప్పుడామెకి ఎనభయ్యేళ్ళు దాటాయి. ఆ పుస్తకం తేగలరా అనుకున్నాను. కాని ఆమె పుస్తకం రాయడమే కాదు, దాన్నొక అందమైన పూలగుత్తిలాగా సంతరించిమరీ, చేతన ప్రేమికుల చేతుల్లో పెట్టారు! చేతనలో కొన్నిక్షణాలేనా తిరుగాడటం ఎంత సుందరానుభవమో, ఈ పుస్తకం చేతుల్లోకి తీసుకోవడం కూడా అంతే రమణీయానుభవం.

‘ఏ మంచి పూవులన్ ప్రేమించినావొ నిను మోచె నీ తల్లి కనకగర్భమున’ అన్నాడు కవి. కాని, మంగాదేవి గారు పూర్వజన్మలోనూ పూలప్రేమికురాలే, ఈ జన్మలోనూ పూలప్రేమికురాలే. ఈ లోకంలో పూలు పూస్తున్నంతకాలం మంగాదేవి గారు మళ్లీ మళ్ళీ పుడుతూనే ఉంటారు. ప్రతి జన్మలోనూ పూలని ప్రేమించినందుకు, మళ్ళా జన్మలో పూలు మరింత చేరువవుతుంటాయి ఆవిడకి.

పుస్తకాల్ని ప్రేమించేవాళ్ళందరికీ అనుభవమయ్యే ఉంటుంది. మనమొక పుస్తకాన్నిష్టపడితే, మనకి గుర్తుండిపోయేది, ఆ పుస్తకం, అందులో వర్ణనలూ, పాత్రలూ, వివరాలే కాదు, మనం ఆ పుస్తకం పేరు మొదటిసారి ఎక్కడ విన్నాం, ఎక్కడ కొన్నాం, అది కొనుక్కోడానికి చిన్నవో పెద్దవో ఎటువంటి త్యాగాలు చేసేం లాంటివన్నీ కూడా. తాను గున్నార్ మిర్డల్ రాసిన ‘ద ఏసియన్ డ్రామా’ పుస్తకాన్ని మొదటసారి ఎక్కడ చూసిందీ, ఎక్కడ కొన్నదీ ఎన్ని సార్లు చెప్పినా Ramarao Kanneganti కి విసుగనిపించదు. నాకు ‘అసమర్థుని జీవయాత్ర’ అనే పుస్తకంతో తలపుకురాగానే, 1979 లో వేసవి సెలవుల తర్వాత, ఒక మండుటెండలో గుంటూరు బస్ స్టాండ్ లో ఆ పుస్తకం కొనుక్కుని సాగర్ వెళ్ళే బస్సు కోసం ఎదురుచూస్తూన్న క్షణాలు కూడా ఎప్పటికీ గుర్తుంటాయి.

ఈ పుస్తకంలో అన్నిటికన్నా ముందు మనల్ని ఆకట్టుకునేది ఏ మొక్క గురించి రాసినా మంగాదేవిగారు ఆ మొక్కని మొదటిసారి ఎప్పుడు చూసిందీ, ఆ జ్ఞాపకాల ముద్రల్తో మొదలుపెట్టడం.

స్పాథోడియా పూలచెట్టు గురించి రాస్తూ, ఇలా మొదలుపెడతారు:

‘పచ్చని ఆకుల పొత్తిళ్ళల్లో సిందూరం పూదొంతరలు పొదువుకుని నీలిమేఘాల్ని తాకడమే మా లక్ష్యం అంటూ నిటారుగా ఎదిగే ఈ అందమైన స్పాథోడియా చెట్లను మొదటిసారిగా తిరుపతి కొండమీద చూసాను. ఆ అద్భుత దృశ్యాన్ని మెడనొప్పేట్టేవరకు తల పైకెత్తి అలా చూస్తూనే ఉండిపోయాను.’

ఎడారి గులాబి గురించి చెప్తూ-

‘దోసకాయ చెంబులాగా ఉబ్బి ఉన్న మొదలు-దాన్నుండి పైకి సాగిన కొమ్మలు-కొమ్మకొమ్మకు గుత్తులు గుత్తులుగా గులాబీ రంగు పూలు! ఆ అందాన్ని తనివి తీరా చూడ్డానికి ఆ గుట్ట చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణ చేసానో చెప్పలేను-చిన్న పిల్లలు చాక్ లెట్ కోసం వెంటపడ్డట్లు!’

నీలి వేపచెట్టుని పరిచయం చేస్తూ-

‘స్నేహితులతో కలిసి కాలనీలో షికారు చేస్తున్న ఓ చల్లని సాయంత్రం సున్నితమైన సువాసనలు మోసుకొచ్చిన ఓ చిరుగాలి నన్ను చుట్టేసింది. మృదువుగా మనసును తాకుతున్న ఆ పరిమళం కొత్తగా ఉంది. వీరీ వీరి గుమ్మడిపండు వీరిపేరేమి అని దాని మూలాల కోసం వెతికినప్పుడు, పది పన్నెండు అడుగులు కూడా లేని వేపచెట్టును పోలిన ఓ చిన్నచెట్టు నాలుగయిదు అడుగుల కైవారంతో పచ్చగా పరుచుకున్న శిఖరం-దాని మీద నీలి నక్షత్రాల్ల్లాంటి నాజూకైన పూలగుత్తులు అటు తెలుపు ఇటు ఊదా కాని సన్నని పూలరేకలు-వెరసి కాస్తభిన్నంగా ఉన్న చిన్నసైజు వేపచెట్టులాగా ఉంది. కాని ఆకారంలో, కాండంలో, ఆకులో, పూవులో-వేపలో లేని నాజూకుతనం, సోయగం ఇందులో కనిపించాయి.’

అంటారు. ఇక, బావ్ బాబ్ చెట్టు గురించి రాస్తూ-

‘బావ్ బాబ్ చెట్టును మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లో బోన్సాయి పితామహుడు డా.డి.ఎల్.ఎన్.ప్రసాద్ గారి దగ్గర బోన్సాయి కుండీలో చూశాను. సుమారు రెండు అడుగుల ఎత్తులో కాండానికి రెండు పక్కలా సమాంతరంగా పెరిగిన కొమ్మలతో పదిహేను అంగుళాల వెడల్పు, పది అంగుళాల లోతుకూడా లేని బొన్సాయి కుండీలో చూసినప్పుడు ‘ప్రపంచంలో ఇంతకంటే అద్భుతం మరోటి ఉండదు’ అనిపించింది.’

రేలచెట్టు పేరేమిటో తెలీయకుండానే ఆ చెట్టుతో ప్రేమలో పడ్డ మొదటి క్షణాల్నిట్లా నెమరేసుకుంటారు:

‘విశాలమైన ప్రాంగణంలో ఓ ముచ్చటైన ఇల్లు, ఇంటిచుట్టూ పచ్చని చెట్లు. వాటన్నింట్లో ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది పొడవైన లోలాకుల్ని తగిలించుకుని ఆకులన్నీ రాల్చేసుకుని మీగడ తరగలాంటి నున్నని కాండంతో మండు వేసవి కూడా పండువెన్నెల్లా చూపరులను నిలబెట్టేసే అద్భుతమైన చెట్టు. అప్పటికింకా నాకా చెట్టు పేరు తెలియదు. ముగ్ధమనోహరంగా ఉన్న ఆ చెట్టును ఎంతసేపు చూసినా తనివితీరేది కాదు. కృష్ణనగర్ వైపు వెళ్ళినప్పుడల్లా ఆ ఇంటి దరిదాపులకు రాగానే ‘మస్తాన్, బండి నెమ్మదిగా పోనివ్వు ‘ అంటూ వుండేదాన్ని…’

తీరాంధ్రప్రాంతం నుంచి వచ్చినవాళ్ళందరికీ చిరపరిచితమైన నిద్రగన్నేరు గురించిన ఆమె జ్ఞాపకాల ముద్రలిలా ఉంటాయి:

‘అమ్మతోనూ, అమ్మలాంటి పుట్టిపెరిగిన ఊరితోనూ పెనవేసుకున్న అనుబంధాలు, జ్ఞాపకాలు అందరికీ ఎంతో పదిలమైనవి! అలాంటి అపురూపమైన జ్ఞాపకాల దొంతరలో మా ఊరు తెనాలి లోని మూడు కాలువల గట్టున నేను చిన్నప్పుడు చూసిన నిద్రగన్నేరు చెట్ల ముద్ర చెరపలేనిది. ఈ పెద్ద కాలవగట్టున దూరప్రాంతాలనుండి తెచ్చిన కలపదుంగలు, ప్రయాణపు బడలిక తీర్చుకోవడానికి ఆగిన పడవ సరంగుల కుటుంబాలు, ప్రకృతి మలిచిన ఇల్లుగా వారికి ఆశ్రయమిచ్చిన పెద్ద పెద్ద నిద్రగన్నేరు చెట్లు, ఆ చెట్లనీడనే తాత్కాలికంగా పొయ్యి వెలిగించుకుని ఒక ముద్ద వండుకు తిని వారు సేదదీరుతున్న దృశ్యాలు-ఇప్పటికీ నా మనోఫలకం మీద నిత్యనూతనంగానే కనిపిస్తుంటాయి.’

ప్రతి మొక్కతోనూ ఆమెకొక ప్రేమ కథ ఉంది. ఆ కథలు కొన్నిసార్లు తల్లికీ, బిడ్డకీ మధ్య ఉండే వాత్స్యల్య కథలు. కొన్నిసార్లు అవి పదహారేళ్ళ వయసులో ఉండే భావోద్విగ్నతని తలపించే కథలు.

చూడండి, లిగ్నం విటే మొక్క గురించి రాస్తూ చెప్పుకున్న ఈ ముచ్చట:

‘నాకు మొక్కలంటే ఉన్న ఆపేక్ష తెలిసిన వ్యక్తి కనుక ‘మీరు జాగ్రత్తగా పెంచే కండిషన్ మీద మీకో మొక్కనిస్తాను’ అన్నారు జయశ్రీ నా వైపు కొంటెగా చూస్తూ.

‘నాకొకటి ఇస్తే బాగుండు- ఇస్తే బావుండు-ఇస్తే బావుండు’ అని పదే పదే లోలోపల జపం చేస్తున్న నేను ఆమె నోటి నుండి ఆ మాట వచ్చిందే తడవుగా చేతికిచ్చేవరకూ ఆగకుండా చటుక్కున వంగి అన్నింటిలోకి దృఢంగా, ఆరోగ్యంగా ఉన్న మొక్క ఒకటి తీసేసుకున్నాను.’

కొన్ని మొక్కలతో ఆమెది అపురూపమైన స్నేహం. ఎంత స్నేహమంటే, ఆ అనుబంధంలో ప్రతి రోజూ ఆమెకి గుర్తే. ఆమె డైరీల్లో ప్రతి పేజిలోనూ ఆ మొక్కలతో సంభాషణలే ఉంటాయేమో ననిపించేటంతగా. నీలితురాయిగా పిలుచుకునే జకరండ గురించి ఆమె రాసుకున్న మాటలు చూడండి:

*

‘(మొదటిసారి ఊటీలో చూసినప్పుడు)మార్కెట్లో నీలిరంగు మేఘాలన్నీ ఒక్కచోట చేరి ముచ్చట్లాడుకుంటున్నట్లు గుమికూడిన నీలితురాయి చెట్లు.

పసిపిల్లలా పరవశించిపోతున్న నన్ను చూచి నాగేశ్వర్రావుగారు -ఈ నీలితురాయిలు మన ఆశ్రమంలో కూడా ఉన్నాయి. వీటిని కొన్ని చోట్ల సౌదామని అని కూడా అంటారమ్మా అన్నారు.

‘సౌదామిని’ ! ఎవరు పెట్టారోగాని ఎంత చక్కని పేరో!

ఆ సౌదామిని సౌందర్యం నన్ను నిలువనీయలేదు.

(ఆ తర్వాత ఆ మొక్క తెచ్చి పెంచుకున్నా ఎంతకీ పూలు పూయక పోవడంతో ) దివ్యారామాల్లో ఈ చిరుగంటలు గుంటూరు, విజయవాడ వాతావారణంలో పుష్పించకుండా మొరాయిస్తాయేమో గాని బహుశా గోదావరి గలగలలకు స్పందిస్తాయేమో అనుకుంటుండేదాన్ని.

21-6-2017 : అలవాటు ప్రకారం మొక్కలను పలకరించుకుంటూ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ‘కృతి’ వెనక వైపుగా వెళ్ళి వేపచెట్టు నీడలో నిల్చున్నాను. తల తిప్పి పైకి చూసిన నా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. చాలా ఆశ్చర్యంగా ఎక్కువ సమయం నీడలో ఉండే ‘కృతి’ వెనుక ఉన్న సౌదామని విరిసి-కాదు, విరగబూసి మురిపించింది- ఆకసంలో నెమలి పింఛం విప్పారినట్లుగా!

సౌదామినీ, క్షమించు! నువ్వింక మా ప్రాంగణంలో పూయవేమో అన్న నా మాట వెనక్కు తీసుకుంటున్నా!’

*

మొక్కలు పెంచేవాళ్ళుంటారుగాని, ఇట్లా మొక్కలతో చెలిమిని డైరీలో రాసుకునేవాళ్ళుంటారనుకోను.

ఇక అన్నిటికన్నా నన్ను ముగ్ధుణ్ణి చేసింది ఆమె వర్ణనలు. నీటిరంగుల్లో పూల బొమ్మలు గియ్యడం నాకెంతో ఇష్టమైన పని. కాని, కుంచెలూ, రంగులూ అవసరం లేకుండానే మంగాదేవి గారు చిత్రించిన ఈ బొమ్మలు చూడండి:

‘ఇంత అందమైన పచ్చ తురాయి పూలను ప్రత్యేకంగా వర్ణించవలసిందే మరి! మృదువైన క్రేప్ పేపర్ తో చేసినట్లుండే దీని పూలు ఐదు పసుపుపచ్చ రేకలతో నడుమ ఎనిమిది కేసరాలతో పెద్ద సైజు చెవి దుద్దులాగా ఉంటాయి.’

‘నీలి ఆకాశం నేపథ్యంలో జిలుగు జిలుగ్గా ఉండే ఆ సన్నని ఆకులు-ఆకులంత నాజూగ్గాను ఉండే రెమ్మలు-కుంకుడు గింజంత పసుపు పచ్చని ఊలు బంతుల్లాంటి బుజ్జి బుజ్జి పూలు-ఏ కారణం చేతనో అసాధారణంగా వంపులు తిరిగిన కొమ్మలు-చెయి తిరిగిన చిత్రకారుడు గీసిన అద్భుతమైన వర్ణచిత్రంలాగా కనిపిస్తుంది. నేలమీద వెల్లకిలా పడుకుని చూస్తే ఆకాశపు యవనిక పై పురి విప్పిన శిఖరం! ఆ అపురూపమైన అందాలన్నీ ఒడిసి పట్టేలా కెమేరాలో బంధించగలిగితే బావుండు అనుకుంటాను.’

‘దాదాపు ఇరవై సంవత్సరాల క్రితమనుకుంటాను-హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ నర్సరీలో వారిగేటెడ్ లీఫ్ తో ఉన్న బాడిసను చూసాను. చిలకాకుపచ్చ ఆకుమీద చిత్రకారుడు కుంచెతో స్ట్రోక్ ఇచ్చినట్టుగా అందమైన పూలు!’

‘వీటన్నింటికీ తలమానికంగా పది పదిహేను అడుగులు ఎత్తులో కొమ్మలన్నీ అడ్డదిడ్డంగా తీరూ తెన్నూ లేకుండా పెరిగిన రెండు సముద్రగన్నేరు చెట్లుండేవి. వీటి పూలు పాలసముద్రంలో ముంచి తీసినంత తెల్లగా మెరుస్తూ ఉండేవి. అన్నివేపులకూ విచ్చుకుని వంపు తిరిగిన ఐదు పూరేకలు-పసుపు రంగరించి పెట్టినట్లు కంఠంలో పసుపుచుక్క!’

‘ప్రతి కొమ్మకు, రెమ్మకు కొసన ఆకుపచ్చకిరణాల్లా అన్నిదిక్కులకూ విస్తరించిన ఆకుల నడుమ పాలనురగను ఘనీభవించిపెట్టినట్టు బుజ్జి బుజ్జి మొగ్గలు తొడుగుతాయి. పొదివిపట్టుకున్న నాలుగు రక్షకపత్రాలను తెరుచుకుంటూ తెలుపు, గులాబీ రంగుల్లో ఉండే ఎనిమిది ఆకర్షక పత్రాల నడుమ వందల సంఖ్యలో ఉండే కేసరాలతో వికసిస్తుంది. సుతిమెత్తగా మనసును తాకే ఈ పూలపరిమళం, సౌకుమార్యంతో కూడిన ఈ సౌందర్యం ఈ పూవుకు మెజస్టిక్ హెవెన్ లోటస్ అనే పేరు సంపాదించిపెట్టాయి.’

‘..రెండు వారాలు గడిచే సరికి కిందనుండి పూమొగ్గలు ఒక్కొక్కటిగా విచ్చుకోడం మొదలుపెట్టాయి. విరిసిన పూలలో నుండి చివ్వున దూసుకొచ్చిన కేసరాలు-జలతారు ముసుగులా లేత ఊదారంగులో దోబూచులాడుతున్న కేసరదండాలు-కొసన పసిమిఛాయ పరాగకోశాలు! ఆపైన లేతాకుపచ్చ, తెలుపుల మిశ్రవర్ణంతో మెరిసిపోతూ ముక్కులు విచ్చటానికి సిద్ధంగా ఉన్న మొగ్గలు! ఏ వర్ణనకు, ఫొటోగ్రఫీకి అందని అద్భుతదృశ్యమది!’

ఈ వర్ణనలు కంటితో చూసి చేసే వర్ణనలు కావు. మనసుతో చిత్రించిన చిత్రణలు. కానుగచెట్టు గురించిన ఈ పేరా చూడండి:

‘ఈ వేసవిలో ఎండ తీవ్రతను తెలియచేయడానికి ఒక కొత్త పదం పుట్టుకొచ్చింది. ఎండ వేడిమి 48 డిగ్రీలకు సెల్షియస్ అయితే ఫీల్ 52 డిగ్రీలు అని. ఎండ తాపాన్ని భరించలేక ఎ.సి లో ఉన్నవాళ్ళు సయితం ఆపసోపాలు పడుతుంటే, పశుపక్ష్యాదులు అల్లల్లాడుతుంటే, ఇళ్ళల్లోనూ, నర్సరీల్లోనూ మొక్కలను వేడిమినుంచి రక్షించడంకోసం ఆకుపచ్చ వలలు వేసి జాగ్రత్తలు పడుతుంటే, నడిరోడ్డున ఎర్రటి ఎండలో పెరుగుతున్న కానుగ చెట్లు ఆకులు మాత్రం కసిగంద కుండా- చుక్కనీరు పోయకపోయినా-ఆకు ఆకుకూ నూనె రాసినట్లు మెరుపులీనుతూ, లేత కొమ్మలు గాలికి ఊగాడుతుంటే ‘ఇంత ఉష్ణాన్ని భరించే శక్తి ఈ మొక్కకెక్కడిది’ అనిపిస్తుంటుంది. అలా నిప్పులు చెరిగే ఎండలో ఈ పచ్చటి చెట్టును చూస్తుంటే, కళ్ళకు చలువటద్దాలు పెట్టుకున్నట్టే హాయిగా ఉంటుంది.’

నేనెన్నోసార్లు చేతన ప్రాంగణానికి వెళ్ళాను. అక్కడ ప్రశాంతి కుటీరం దగ్గర మంగాదేవి గారి ఆతిథ్యం స్వీకరించాను. కాని, ఆ చల్లని నీడని ఇంత అందంగా నేనెప్పటికీ మాటల్లో పెట్టలేనని చెప్పగలను. చూడండి, ఆమె ఎట్లా రాస్తున్నారో:

‘చేతనలోని విజిటర్స్ షాంగ్రిలా ‘ప్రశాంతి’. అది ఒక రెస్టింగ్ ప్లేస్. సజీవంగా ఉన్న తాటిచెట్టును నిట్టాడిగా వేసిన ఒక గుండ్రటి కుటీరం ప్రశాంతి. ఆ అకారానికి తగినట్టుగా కుటీరంలో అతిథులు కూర్చోడానికి అర్థచంద్రాకారంలో అరుగు. మధ్యనున్న తాటిచెట్టు కాండాన్ని ఆనుకుని లోపలకి వచ్చేవారిని స్వాగతిస్తూ కోలముఖం, కోటేరంటి ముక్కు, అర్థనిమీలిత నేత్రాలు, విడీవిడని పెదాలనుండి జాలువారే చిరునవ్వు, నడినెత్తిన రింగురింగుల జుట్టుతో ఒక దారుశిల్పం. దీని చుట్టూ అందమైన పింగాణీ కుండీలతో కొలువై నీడలో మాత్రమే హాయిగా పెరిగే అగ్లోనిమాలు, కుటీరం చుట్టూ సువాసనలు వెదజల్లే పూలతో మరికొన్ని మొక్కలు. కుటీరం బైట ఒక పక్కగా గురుబోధలో లీనమైన మునికుమారుడు-బోధిస్తున్న గురుదేవులకు భక్తితో ఛత్రం పట్టినట్లు పచ్చగా విప్పారిన బహీనియా చెట్టు-దాని నిండా పవిత్రతకు ప్రతి రూపాల్లాంటి తెల్లటి పూలు!’

చాలా మొక్కలకి ఆమె సొంత పేర్లు పెట్టారు. ప్రతి మొక్కకీ శాస్త్రీయనామం, పెంచే పద్ధతులు, ఉపయోగాల్లాంటి వివరాలు కూడా ఉన్నాయిగాని, అవి కూడా కథలు కథలుగా, మనసును దోచేవిగా ఉన్నాయి. రాధామనోహారాల గురించిన ఈ ముచ్చట చూడండి:

‘దీని శాస్త్రీయనామమైన Quis qualis అనే మాట పలుకుతుంటే నిశ్శబ్దం మనతో గుసగుస లాడుతున్నట్లు-మనకు మాత్రమే వినిపించేలా రహస్యమేదో చెప్తున్నట్లు అనిపిస్తుంది కదా! నిజానికి ఇది Quis-Qualis అనే రెండు పదాల కలయిక. Quis అంటే who, qualis అంటే what అని అర్థం. ఈ లతామనోహరం గురించి ఎవరు ఏమిటి అనే సందిగ్ధం ఎందుకు కలిగిందన్న ప్రశ్నకు సమాధానంగా ఓ కథనం ప్రాచుర్యంలో ఉంది. మొదటిసారిగా ఈ మొక్కను చూసిన బృందానికి అది ఒక పొదలా కనిపించిందట. మరొకరు కాదు కాదు, కణుపు కణుపున కొక్కేల్లా పట్టుకుని ఎగబాకడానికి సన్నిని ముళ్ళుండే లత ఇది అన్నారు. ఇంకొకరు ఇది సువాసనలనువెదజల్లే తెల్లని గుత్తులు, గుత్తుల పూలతో రాత్రివేళ వెన్నెల విరిసినట్లుండి, తెలతెలవారుతూనే లేత గులాబీ వర్ణంలోకి, ఆ తరువాత మరికొంత గాఢమైన అరుణ వర్ణంలోకి మారినట్లు గుర్తించారు. ఇన్ని రకాల విశ్లేషణలను విన్న పెద్దలు సంభ్రమాశ్చర్యాలతో బుర్ర గోక్కుంటూ, ఇది సముద్రదేవత ‘ప్రోటియస్’ లాగా ఎవరో ఏమిటో తెలియకుండా తన లక్షణాలను, రూపాలను మార్చుకుంటోందే అని ఈ లతను ప్రోటియస్ ముద్దుపేరైన Quis-Qualis అనడం బాగుంటుందని నిర్ణయించారట!’

పుస్తకంలోని అరవై అయిదు మొక్కల గురించీ చదివేసాక, అప్పుడు హటాత్తుగా, మంగాదేవి గారి తోటలో దర్శనమిచ్చారు జయతి, లోహితాక్షణ్ లు. చేతన ప్రాంగణంలో రెండు రోజులుండి, అక్కడ పూలమీద వాలే 32 రకాల పక్షుల్ని గుర్తుపట్టి,ఆ పిల్లలకే కాదు, మనకీ పరిచయం చేస్తూ జయతి రాసిన వ్యాసం ఈ పుస్తకానికి గొప్ప ఆకర్షణ. పూలమొక్క మీద అందమైన పిట్ట వచ్చివాలినట్టుంది ఆ పరిచయం చదివితే.

అక్కడితో ఆగకుండా కనీసం రెండుమొక్కలేనా మనం కూడా పెంచుకోగలిగితే మంగాదేవి గారి హరితసామ్రాజ్యంలో మనమూ భాగమవుతాం.

21-11-2018

ఈ అంశం మీద ఫేస్ బుక్ లో సవివరమైన చర్చ కోసం ఇక్కడ చూడొచ్చు

Leave a Reply

%d bloggers like this: