నేను తిరిగిన దారులు

చాలా ఏళ్ళ కిందట. నేను విశాఖపట్టణం జిల్లా గిరిజన సంక్షేమాధికారిగా పనిచేస్తున్న రోజులు. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పాడేరులో భాగంగా మా కార్యాలయం ఉండేది. ఆ రోజుల్లో ఒకసారి ప్రసిద్ధ కథారచయిత శ్రీపతిగారు నన్ను చూడటానికి పాడేరు వచ్చారు. ఆయన బస్సుమీద వచ్చారు. ఆ దారీ, ఆ ప్రకృతి, ఆ కొండలూ, ఆ పచ్చదనం ఆయన్ను కట్టిపడేసాయి. ఆయన తిరిగి వెళ్ళిన తరువాత ఇండియా టుడే పత్రిక సంపాదకులతో ఏం చెప్పారో గాని, వారినుంచి నాకో ఉత్తరం వచ్చింది. ‘మేం వెలువరించబోతున్న ప్రత్యేక సంచిక కోసం మీరొక యాత్రాకథనం రాయగలరా? అది కూడా అరకులోయ మీద’ అంటో.

ఇండియా టుడే లో ప్రతి నెలా ఒక తెలుగు కథ వస్తుండేది. ఆ కథతో పాటు ఆ కథకుల ఫొటో కూడా వేస్తూండేవారు. అట్లా నా ఫొటో, నా కథా కూడా ఆ పత్రికలో ప్రచురించే రోజు వస్తుందా అనుకునేవాణ్ణి. అలాంటిది ఒక యాత్రా కథనమే రాయమంటే రాయకుండా ఎలా ఉంటాను?

కానీ చిన్న ఇబ్బంది కూడా ఉంది. ఆ గిరిజన ప్రాంతం, అరకులోయా నా కార్యస్థానాలు కూడా. నువ్వు రోజూ పనిచేసే ఒక ప్రాంతం గురించి నువ్వే ఒక యాత్రీకుడవై ఎట్లా రాస్తావు? ఎవరి కళ్ళతో రాస్తావు? ఏది కొత్తగా చూస్తావు? ఏమి కొత్తగా తెలుసుకుంటావు?

ప్రసిద్ధ యాత్రాకథకుడు, పాత్రికేయుడు బి.వి.రమణ అక్కడ విలేకరిగా పనిచేస్తుండేవాడు. ఆయనకి నా సమస్య చెప్పాను. ఆయనన్నాడు కదా: ‘నా కళ్ళతో చూడండి. మీరు చూడని అరకులోయని, మీకు తెలియని గిరిజన సమాజాన్ని పరిచయం చేస్తాను’ అని. అనడమే కాదు, రెండు రోజుల పాటు ఆ ప్రాంతమంతా తిప్పి చూపించాడు. నేను నా వాహనం వదిలిపెట్టి, అక్కడ అధికారిగా పనిచేస్తున్నాననే భావం వదిలిపెట్టి అతడి వెంట ఒక సహయాత్రీకుడిగా ఆ ప్రాంతం చూసాను. ఆ తరువాత ఇండియా టుడే ఫొటోగ్రాఫరుకి ఆ లొకేషన్లు చూపించడం కోసం మరో సారి తిరిగాను. ఆ ఫొటోగ్రాఫరు, ఆయన పేరు వినయన్, ఆయనకి అరకుకన్నా పాడేరు బాగా నచ్చింది. ‘కులూ మనాలీ లోయని మరిపించేదిగా ఉంది’ అన్నాడు.

అప్పట్లో మా చెల్లెలు రాధిక ఆంధ్రా యూనివెర్సిటీలో ఎమ్మే చదువుతుండేది. ఒకసారి ఆమె తన మిత్రుల్ని వెంటబెట్టుకుని వచ్చి ఆ ప్రాంతాలు చూపించమని అడిగింది. అందుకని ఆమెని ప్రధాన పాత్ర చేసి, ఆమె ద్వారా, రమణ కళ్ళతో నేను చూసిన అరకులోయ మీద ఒక యాత్రాకథనం రాసాను.

ఆ అనుభవానికొక ఆసక్తికరమైన కొసమెరుపుంది.

సాధారణంగా నేను నా ఉద్యోగ జీవితాన్నీ, సాహిత్య జీవితాన్నీ ఒకదానితో ఒకటి కలవనివ్వకుండా విడివిడిగానే చూసుకుంటూ ఉంటాను. నా ఉద్యోగ సంబంధాల వల్ల సాహిత్య సంబంధాలూ, సాహిత్య సంబంధాల వల్ల ఉద్యోగ సంబంధాలూ మెరుగుపడటం నాకు ఇష్టం ఉండదు, అలాగే ఆ రెండూ ఒకదానివల్ల మరొకటి ఇబ్బందికి గురికావడమూ ఇష్టముండదు.

కాని, ఆ యాత్రాకథనం ప్రచురించిన ఇండియా టుడే పత్రిక ఎట్లానో నా పై అధికారి దృష్టికి వచ్చింది. ఆయనకి తెలుగు రాదు. కాని ఆ ఫొటోలు చూసాడు. నన్ను వెంటనే రమ్మని కబురు చేసాడు.

ఎందుకు రమ్మన్నాడో తెలీక నేను అర్జెంటుగా ఆయన కాంప్ ఆఫీసుకి వెళ్ళాను. వెళ్ళి ఆయన ఎదట నిలబడ్డాను. నన్ను చూసాడు, కూచోమనలేదు. ఎవరెవరితోనో మాటాడుతూ ఉన్నాడు.

పదినిమిషాలు గడిచాయి. నేను నిలబడే ఉన్నాను.

‘ఏమిటి’ అన్నట్టు కళ్ళెగరేసాడు.

‘పిలిచారట.’

‘ఏమీ లేదు, యు కెన్ గో’ అన్నాడు.

ఆయన బల్ల మీద ఇండియా టుడే ప్రత్యేక సంచిక పుటలు రెపరెపలాడుతున్నాయి.

*
అరకులోయ మీద యాత్రాకథనంతో పాటు ఇండియా టుడే పత్రిక కోసం శ్రీశైలం, భద్రాచలం ప్రాంతాల మీద కూడా యాత్రాకథనాలు రాసాను. ఒక శిక్షణ నిమిత్తం మాంచెష్టరులో మూడు వారాలు ఉండవలసిన సందర్భంగా, ఇంగ్లాండు మీద కూడా ఒక ట్రావెలోగ్ రాసాను. వాటినీ, మరికొన్ని యాత్రా కథనాల్నీ కలిపి ‘నేను తిరిగిన దారులు’ పేరిట 2011 లో ఒక సంపుటంగా వెలువరించాను. తెలుగు పాఠకులు ఆ పుస్తకాన్ని చాలా ఇష్టంగా చదివారు. త్వరలోనే ఆ కాపీలన్నీ చెల్లిపోయాయి.

అందుకని ఇప్పుడు అనల్ప బుక్ కంపెనీ బలరాం గారు ఆ పుస్తకాన్ని అనల్ప ప్రచురణ కింద మళ్ళీ కొత్తగా వెలువరించారు.

ఆ పుస్తకం కావాలనుకున్నవాళ్ళు హైదరాబాదు బుక్ ఫెస్టివల్ లో స్టాల్ నంబరు 155 సందర్శించవచ్చు.

16-12-2018

ఈ అంశం మీద ఫేస్ బుక్ లో సవివరమైన చర్చ కోసం ఇక్కడ చూడొచ్చు

Leave a Reply

%d bloggers like this: